అలనాటి అపురూపాలు- 180

0
4

[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.

మరోసారి రఫీని స్మరించుకుందాం:

31 జూలై మధుర గాయకుడు రఫీ వర్ధంతి. ఈ సందర్భంగా ఆయనని స్మరించుకుంటూ, ఆయన పాడిన పాటల్లోని కొన్ని మధుర గీతాలను ప్రస్తావించుకుందాం.

***

రఫీ ఎందరో నటులకు తన గళాన్నిచ్చారు. ఎందరో సంగీత దర్శకులతో పని చేశారు. పలు రకాల పాటలు పాడారు. ఫిలింఫేర్ అవార్డులకి 21 సార్లు నామినేట్ అయి, 6 సార్లు అవార్డు గెల్చుకున్నారు. ఉత్తమ గాయకుడిగా జాతీయ అవార్డు పొందారు. 1967 భారత ప్రభుత్వం ఆయనను ‘పద్మశ్రీ’ పురస్కారంతో గౌరవించింది. రఫీ తన స్వరంలో అతి సులభంగా – సంతోషాన్ని, బాధని, వేదననీ, ఉత్సాహాన్ని, ప్రేమని పలికించేవారు. భారతీయ సినీ సంగీతానికి ఆయన ఒక ఐకాన్.

మహమ్మద్ రఫీ 24 డిసెంబర్ 1924 నాడు – హజీ మహమ్మద్ అలీ, అల్లారఖీ దంపతులకు పంజాబ్ లోని కోట్లా సుల్తాన్ సింగ్ అనే గ్రామంలో జన్మించారు. ఎనిమిది సంతానంలో ఆయన ఏడవవారు. వారిది ఆచారాలను అత్యంత గౌరవించి పాటించే సాంప్రదాయ కుటుంబం. అందువల్ల, సంగీతమన్నా, గానమన్నా పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు. అయితే గానం పట్ల ఆసక్తి పెంచుకోడానికి ఇవి రఫీకి ఆటంకాలు కాలేదు. లాహోర్‍లో సంచారం చేసే ఓ ఫకీర్ గీతాలను తరచూ అనుకరిస్తూ పాడేవారు రఫీ. అయితే 1937లో ఆయన ప్రతిభ భారీ స్థాయిలో అందరికీ తెలిసింది. అప్పుడు ఆయన వయసు 13 ఏళ్లు. ఒక పాన్-ఇండియా ఎగ్జిబిషన్‍లో హఠాత్తుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రఫీతో పాట పాడించారు. ఆ పాటని విన్న సుప్రసిద్ధ కె. ఎల్. సైగల్ – ఏనాటికైనా రఫీ గొప్ప గాయకుడవుతారని ఊహించారట.

8 ఫిబ్రవరి 1941న లాహోర్‍లో ‘గుల్ బలోచ్’ (1944) అనే పంజాబీ సినిమా కోసం రఫీ 17 ఏళ్ళ వయసులో తన మొదటి యుగళ గీతాన్ని జీనత్ బేగమ్‍తో కలిసి పాడారు. ‘పహలే ఆప్’ అనే హిందీ సినిమా కోసం కోరస్ గాయకులలో ఒకరిగా పాడేందుకు రఫీని అనుమతించారు సంగీతదర్శకులు నౌషాద్. రఫీ ‘జుగ్ను’ (1946) అనే హిందీ సినిమా కోసం ‘యహాఁ బద్లా వపా కా బేవఫాయై కె సివా క్యా హై’ అనే యుగళ గీతం పాడారు. ఈ సినిమా విడుదల కాకముందే ఈ పాట సూపర్ హిట్ అయింది. 1942 నుండి 1980 వరకు హిందీ సినిమాలో దాదాపుగా ప్రతీ హీరోకి, సహాయ నటుడికి, కారెక్టర్ ఆర్టిస్టులకీ రఫీయే స్వరాన్నిచ్చారు. దిగ్గజ సంగీత దర్శకులు శ్యామ్ సుందర్, నౌషాద్‌ల నుంచి రవీంద్ర జైన్, అనూ మల్లిక్, బప్పి లహరి, రాజేష్ రోషన్ వంటి స్వరకర్తల వరకు పనిచేశారు రఫీ. సినీ నిర్మాత స్వర్గీయ మన్‍మోహన్ దేశాయ్ అభిప్రాయంలో రఫీ స్వరం – దేవుని స్వరం లాంటిది. ‘చౌదవీ కా చాంద్’ (1960) లోని ‘చౌదవీ కా చాంద్ హో’ పాట, ‘దోస్తీ’ (1964) సినిమా లోని ‘చాహుంగా మై తుఝే’ పాట, ‘ఖిలోనా’ (1970) లోని ‘ఖిలోనా జాన్ కర్’ పాట, ‘అబ్దుల్లా’ (1980) లోని ‘మై నే పూఛా చాంద్ సే’ పాట, ‘కర్జ్’ (1980) లోని ‘దర్ద్-ఎ-దిల్’ పాట వంటివి రఫీ పాడిన ఆణిముత్యాలని చెప్పుకోవచ్చు. పలు భారతీయ, విదేశీ భాషలలో దాదాపు 7000 పాటలు పాడిన కళాకారుడాయన. బెంగాలీ, అస్సామీస్, మైథిలి, భోజ్‍పురి, తమిళం, తెలుగు, పంజాబీ భాషలలో రఫీ పాడిన పాటలు శ్రోతలను విశేషంగా అలరించాయి.

రఫీ గానం ఎందరో దిగ్గజాలను ఆకర్షించింది. మహత్మా గాంధీపై పాడిన ‘సునో సునో ఏ దునియావాలో బాపూజీ కీ అమర్ కహానీ’ పాట విన్న భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 15 ఆగస్టు 1948న రఫీని సత్కరించారు.

లతా మంగేష్కర్, రఫీ హిందీ సినిమాలోని కొన్ని అత్యద్భుమైన యుగళ గీతాలను పాడారు. కొన్ని అభిప్రాయ భేదాల వల్ల ఇద్దరు కలిసి పాడడం కొన్నేళ్ళ పాటు మానుకున్నారు. లతా మంగేష్కర్ అత్యధిక పాటలని అంటే 25,000 పాటలని రికార్డు చేశారని – గిన్నిస్ బుక్ అఫ్ వరల్డ్ రికార్డ్స్ వారు ప్రకటించడాన్ని – రఫీ అంగీకరించలేదు. అయితే మళ్ళీ వీరిద్దరినీ కలిపినది సంగీత దర్శకుడు మదన్ మోహన్ అని అంటారు. హిందీ సినిమాలలో కిషోర్ కుమార్‍కీ, రఫీకి తీవ్రమైన పోటీ ఉండేది. అయినా ఇద్దరు ఒకరినొకరు ఎంతో గౌరవించుకునేవారు. ‘చుప్‌కే చుప్‍కే’ (1975) లోని ‘స రె గ మ’ అనే పాట ఇందుకు నిదర్శనం.

రఫీ ప్రతిభ సినిమా స్టూడియోలకే పరిమితం కాలేదు. అమెరికా, యుకె, దక్షిణ అమెరికా, కెనడా, ఆఫ్రికా, వెస్ట్ ఇండీస్, సింగపూర్, హాంగ్‍కాంగ్, దుబాయ్, మలేసియా, ఫిజి దీవులు, న్యూజీలాండ్, నెదర్లాండ్స్ వంటి.. ఎన్నో ప్రాంతాలలో పర్యటించి లైవ్ కన్సర్ట్స్ చేశారు. ఆయనకు దక్కిన ఆదరణ అటువంటిది.

రఫీ 1944లో బిల్కిస్ బానో ని బొంబాయిలో వివాహం చేసుకున్నారు. వీరికి నలుగురు కొడుకులు, ముగ్గురు కుమార్తెలు. రికార్డింగులు, పర్యటనలు లేని సమయంలో రఫీ కుటుంబంతో సమయం గడిపేందుకు ఇష్టపడేవారు. పిల్లలతో కలిసి క్యారమ్స్, బాడ్మింటన్ ఆడేవారు, గాలిపటాలు ఎగురవేసేవారు. ఇంట్లో చేసిన స్పాంజ్ కేక్ అంటే రఫీకి ఇష్టం.

రఫీ పెద్దగా చదువుకోలేదు. అందుకని తన పిల్లలందరూ బాగా చదువుకునేలా చూశారు. వాళ్ళని బాలీవుడ్‍లో కెరీర్ ఎంచుకునేందుకు ప్రోత్సహించలేదు. ఎందుకో తెలియదు కానీ, రఫీ తరచూ తానుండే బంగళాలను మార్చేవారు. గాయకుడిగా రాణిస్తూన్నప్పటికీ రఫీలో ఎన్నో వైరుధ్యాలుండేవి. తన విజయానికి కారణం భగవంతుడేనని అనేవారు. తొలిసారి హజ్ యాత్ర చేసి వచ్చాకా, సినీ పరిశ్రమని వదిలిపెట్టి భగవంతుని సేవలో గడపాలని అనుకున్నాననీ; కానీ స్వరకర్త నౌషాద్ వల్లనే సినీరంగంలో కొనసాగాననీ ఒక ఇంటర్య్వూలో చెప్పారాయన. రఫీ స్వరం ప్రజల ఆస్తి అని, దాన్ని కొలగొట్టే హక్కు గాయకుడికి లేదని నౌషాద్ అన్నారు. ‘ఆస్‍పాస్’ (1981) చిత్రం కోసం రఫీ ఆఖరిసారిగా పాడారు. దురదృష్టవశాత్తు ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పరాజయం పాలయ్యింది.

తీవ్రమైన గుండెపోటు రావడంతో, 31 జూలై 1980 నాడు రాత్రి 10.25కి రఫీ మృతి చెందారు. ఆయన మరణంతో అభిమానులు చాలా కాలం దుఃఖించారు. రఫీ హఠాన్మరణంతో ఆయన భార్య బిల్కిస్ బానో క్రుంగిపోయారు. ఆ రోజు ఆకాశమే రోదిస్తోందా అన్నట్లుగా విపరీతమైన వర్షం కురిసిందట. ఆయన అంత్యక్రియలకి పదివేల మందికి పైగా హాజరయ్యారు. ఆయన గౌరవార్థం భారత ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది.

రఫీ భారతీయ స్వరంగా నిలిచినప్పటికీ, ఆయన పాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధమై ఆయనకి పేరు తెచ్చిపెట్టాయి. కోవిడ్-19 లాక్‍డౌన్ సమయంలో రఫీ చిన్న మనవడు ఫుజైల్ రఫీ ఒక ఆన్‍లైన్ మ్యూజిక్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రారంభించారు. ప్రపంచంలోని ఏ ప్రాంతం వారైనా వచ్చి రఫీ పాటలు వినచ్చు, రఫీ గురించి రాసిన పుస్తకాలు చదువుకోవచ్చు. రఫీ వారసత్వాన్ని నిలిపి ఉంచేందుకు ఇదొక మంచి ప్రయత్నం.

రఫీ పాడిన కొన్ని మధుర గీతాలు:

1. ‘చౌదవీ కా చాంద్’ (1960) లోని ‘చౌదవీ కా చాంద్ హో’:

భారతీయ చలనచిత్రాలోని అద్భుతమైన రొమాంటిక్ పాటలలో ఒకటిగా ఈ పాట నేటికి నిలిచి ఉంది. గురుదత్ గారికి తరచూ స్వరాలందించే ఎస్.డి. బర్మన్ కాకుండా, మరో సంగీత దర్శకుడు రవి ఈ పాటకి సంగీతం అందించడం విశేషం. షకీల్ బదాయుని రాసిన ఈ గీతం – ప్రేమికురాలిని నిండు చందమామతో పోలుస్తుంది. అయితే రఫీ స్వరం ఆ పాటలోని పదాలకు ప్రాణం పోసింది. సినిమా అంతా బ్లాక్ అండ్ వైట్‍లో ఉన్నా, ఈ పాటని మాత్రం గురుదత్ కలర్‍లో చిత్రీకరించడం విశేషం.

https://www.youtube.com/watch?v=wRbBORKhGYg

2. ‘ససురాల్’ (1961) లోని ‘తేరీ ప్యారీ ప్యారీ సూరత్ కో’:

ఈ మెలోడ్రమాటిక్ సోషల్ సాంగ్‌కి స్వరాలందించినది శంకర్-జైకిషన్. హస్రత్ జైపురి ఈ గీతాన్ని రచించారు. ఉల్లాసంగా సాగే ఈ పాటలో హీరో కథానాయికని టీజ్ చేస్తూ ఉంటాడు. ఆ పాటలోని పదాలకు తగ్గట్టుగా ఎంతో హుషారుగా ఆలపించారు రఫీ.

https://www.youtube.com/watch?v=xXpDcXu8Nwk

3. ‘దోస్తీ’ (1964) సినిమా లోని ‘చాహుంగా మై తుఝే’:

మజ్రూహ్ సుల్తాన్‍పురి రాసిన ఈ గీతం స్నేహం గొప్పదనాన్ని చాటుతుంది. తన మధురమైన గాత్రంతో రఫీ ఆ పాటని అజరామరం చేశారు. స్వరకర్తలుగా లక్ష్మీకాంత్-ప్యారేలాల్ జోడీకి తొలి ఫిలింఫేర్ అవార్డుని అందించిన సినిమా ‘దోస్తీ’. ఈ సినిమాతో వారికి పేరుప్రతిష్ఠలతో పాటు మరిన్ని అవకాశాలు దక్కాయి.

https://www.youtube.com/watch?v=C1CLFK9T028..

4. ‘సూరజ్’ (1966) సినిమా లోని ‘బహారోం ఫూల్ బర్సావో’:

హస్రత్ జైపురి రచించగా, శంకర్-జైకిషన్ స్వరాలందించిన ఈ పాట హిందీ పాటలలోని అద్భుతమైన మెలొడీ సాంగ్స్‌లో ఒకటి. ఈ చక్కని రొమాంటిక్ సినిమాకి సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటలో నాయకుడు – తన ప్రేయసి పై పూల వర్షం కురిపించమని ప్రకృతిని, చేతులకు గోరింట అవమని సిందూర పువ్వుని కోరుకుంటాడు. దట్టమైన మేఘాలను క్రిందకి రమ్మని తన ప్రేయసికి కాటుక పూయమని కోరుతాడు. కవి భావాన్ని గ్రహించి అంతే సొగసుగా పాడారు రఫీ.

https://www.youtube.com/watch?v=McP9D114BfU

5. ‘బ్రహ్మచారి’ (1968) సినిమా లోని ‘దిల్ కే ఝరోకే మే తుఝ్‍కో బిఠాకర్’:

శంకర్-జైకిషన్‍ల బాణీలందించగా, హస్రత్ జైపురి రచించిన ఈ పాట వేదనతో నిండి ఉంటుంది. రఫీ ఈ పాటని హై-పిచ్‍లో పాడారు. రఫీ గాత్రానికి చక్కని పియానో వాదనం తోడై, ఈ పాట శ్రోతలను వెంటాడుతుంది.

https://www.youtube.com/watch?v=F6kH7fBljwY

6. ‘హమ్ కిసీ సే కమ్ నహీ’ (1977) సినిమా లోని ‘క్యా హువా తేరే వాదా’:

ఈ సినిమాకి పాడే సమయానికి రఫీ ప్రాభవం క్షీణించింది. నేపథ్య గాన విభాగానికి కిషోర్ కుమార్ మకుటం లేని మహారాజు అయ్యారు. అయినా ‘క్యా హువా తేరే వాదా’ పాటతో రఫీ తానింకా సింహాన్నే అని నిరూపించుకున్నారు. ఆర్.డి. బర్మన్ బాణీ అందించగా, మజ్రూహ్ సుల్తాన్‍పురి రాసిన ఈ గీతం భగ్నప్రేమికుడి హృదయానికి అద్దం పడుతుంది. ఎప్పటిలానే, గీతంలోని కవి భావానికి తగ్గట్టుగా తన స్వరంలో బెంగ, ఆతృతని అద్భుతంగా పలికించారు రఫీ.

https://www.youtube.com/watch?v=LgdQDvgv7KA

ఇవే కాదు, ఇంకా మరపురాని పాటలెన్నో ఉన్నాయి. రఫీని శ్రోతల జ్ఞాపకాలలో సజీవంగా ఉంచుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here