నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-35

1
3

[కె.ఎం. మున్షీ రచించిన ‘ది ఎండ్ ఆఫ్ ఏన్ ఎరా’ పుస్తకాన్ని ‘నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు’ పేరిట అనువదించి పాఠకులకు అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

~

[dropcap]సి[/dropcap]కిందరాబాద్ కంటోన్మెంట్‌లో మిగిలి ఉన్న భారతీయ సైన్య సాయుధ వాహనాలను, ట్యాంకులను ఎక్కువ కాలం ఉంచటం వీలు పడలేదు. ఈ వాహనాలను   ఝాన్సీకి పంపించాల్సి ఉంటుంది.

లార్డ్ వెల్లెస్లీ కాలం నుంచి సికిందరాబాద్ సైన్య శిబిరాలలో ఉండి, దాదాపుగా 250 ఏళ్ళ పాటు భారత్‍లో శాంతిని, ఐక్యతను పరిరక్షిస్తూ వస్తూన్న సైనిక వాహనాలకు వీడ్కోలు పలికే పెరేడ్‍లో నేను పాల్గొన్నాను. ఈ సైనిక పటళాలు  సికిందరాబాద్ వదిలి వెళ్ళిపోవడం పట్ల నాకు సంతోషంగా లేదు. సికిందరాబాద్ కంటోన్మెంట్‍లో మళ్ళీ భారతీయ సైనిక దళాలు నివసించే రోజు దగ్గరలోనే ఉండాలని నేను భగవంతుడిని ప్రార్థించాను, వాటికి వీడ్కోలు పలుకుతూ.

లాయక్ అలీ, ఆయన మంత్రులు, మరి కొందరు పెద్దలను ఈ సందర్భంగా ఆహ్వానించాము. కారు తరువాత కారు, ట్యాంకు తరువాత ట్యాంకు, తమ తుపాకులను అవనతం చేసి వెళ్తుంటే నేను వాటి వందనాన్ని స్వీకరించాను. ఆ రోజు అక్కడున్న వారిలో ఇత్తెహాద్‍తో సంబంధం ఉన్నవారంతా ఎంతో సంతోషించారని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనుకుంటాను.

సైన్యం సికిందరాబాద్ కంటోన్మెంట్‌ను వదిలి వెళ్ళిన తరువాత కొందరు నాయకులు వారికి వీడ్కోలు పలికిన కార్యక్రమం – నిజామ్‍ను అవమానించటానికేనంటూ వివాదం చేశారు. “భారతీయ సైనిక శక్తిని ప్రజలకు ప్రదర్శించేందుకే మున్షీ ఈ కార్యక్రమాన్ని నిర్వహించాడు” అని వ్యాఖ్యానించారు. అయితే నిరంతరం, క్షణం క్షణం కత్తులు, తుపాకుల నీడలో జీవిస్తున్న ప్రజలు , తమ రక్షణకోసం  సిద్ధంగా ఉన్న వారి శక్తిని స్వయంగా దర్శించే వీలు కలిగిందని వారు గ్రహించలేకపోయారు.

నిజామ్ రాజ్యంలో నా ప్రపంచానికి పరిమితులు దక్షిణ సదన్ భవనం సరిహద్దు గోడలు. సాయంత్రం నన్ను కలవటానికి స్నేహితులు వచ్చేవారు. అప్పుడు భవనం ఆవరణలోని తోటలో పచార్లు చేసేవారం. రామాచారి, రామకృష్ణారావు, గనేరీలాల్ వంటి వారు సాధారణంగా సాయంత్రాలు నాతో నడిచేవారు..

హైదరబాదులో ఉన్నంత కాలం నేను ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నో నిరాశ నిస్పృహలు అనుభవించాల్సి వచ్చింది. ఎన్నెన్నో అవమానాలను సహించాల్సి వచ్చింది. ఇవన్నీ నన్ను తీవ్రంగా బాధించాయి. అయినా నేను నా కర్తవ్యాన్ని నిర్వహించగలిగానంటే ధ్యానం వల్ల. నేను రోజుకు రెండు మూడు మార్లు భగవద్గీత లోని 12వ అధ్యాయం వల్లెవేస్తుండేవాడిని. శ్రీకృష్ణ భగవానుడి వల్ల నాకు ఎంత శక్తి అందగలదో అంత శక్తీ అవసరమైంది నాకు. నేను రోజుల్లో  ఎన్ని మార్లు ఈ శ్లోకాన్ని పఠించేవాడినో లెక్కలేదు.

అనపేక్షః శుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథః।
సర్వారంభపరిత్యాగీ యో మద్భక్తః స మే ప్రియః॥
(భగవద్గీత, అధ్యాయం 12, శ్లోకం 16)

ఏమీ ఆశించని వాడు, నిర్మల హృదయుడు, సర్వ పరిత్యాగీ, ఎదురుగా ఉన్న కర్తవ్యం పైనే దృష్టి నిలిపినవాడు, స్వార్థ రహితుడు, నిరాశను అధిగమించే వాడయిన భక్తుడు నాకు అత్యంత ప్రియం.

ఒకోసారి నాకు ఇక్కడి నుండి తప్పించుకు పారిపోవాలనిపించేది. నన్నీ బాధ్యత నుంచి తప్పించమని సర్దార్‍ను అభ్యర్థించి విముక్తుడనవ్వాలనిపించేది. నాకు ఆర్థికంగా లాభం లేదు. కర్తవ్యం అతి కఠినతరమైనది. నా భవిష్యత్తు ప్రమాదంలో ఉంది. నన్ను ఏజంట్-జనరల్‍గా నియమించక ముందు నుంచి ఢిల్లీలో కొందరు పెద్దలకి నేనంటే నచ్చదు. ఇప్పుడు వారి దృష్టిలో నేను మరింత చెడ్డవాడినయి ఉంటాను. దీనికి తోడుగా, నన్ను చంపి స్వర్గంలో తమ స్థానాన్ని స్థిరం చేసుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్న రజాకార్లు నా చుట్టూ ఉన్నారు.

ఇన్ని రకాల ప్రతికూల పరిస్థితులలో కూడా నా కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించగల శక్తిని భగవంతుడు నాకు ఇచ్చాడు.

భారతదేశాన్ని ధర్మభూమిగా మలచి, సాంస్కృతిక ఐక్యతను సాధించారు బ్రాహ్మణులు, సంస్కృతాన్ని ఆయుధంగా వాడుతూ. వారు భారత భూమి రాజకీయంగా కూడా ఏకమవ్వాలని కలగన్నారు. ఆ కలను  పలువురు చక్రవర్తులు సాకారం చేయాలని ప్రయత్నిస్తూ  దేశాన్ని ఏకత్రితం చేయాలని ప్రయత్నించారు. అయితే చంద్రగుప్త మౌర్యుడు కానీ, అశోకుడు కానీ, సముద్రగుప్తుడు కానీ, అక్బర్ కానీ ఇందులో విజయవంతం కాలేకపోయారు.

నేను కూడా భారతదేశ ఐక్యత గురించి కలలు కన్నాను. నా వంతు ప్రయత్నం ఉడతా భక్తిగా నేనూ చేశాను. ప్రస్తుతం దేశాన్ని ఏకత్రితం చేయగలిగిన మహానుభావుడు ఉద్భవించాడు. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశాన్ని ఏకం చేస్తున్నాడు. అలాంటి వ్యక్తితో సన్నిహిత సంబంధం కలిగి ఉండే భాగ్యాన్ని, అతడికి నాపై విశ్వాసం కలిగే అద్భుతాన్ని, అతనికి సేవ చేసే గౌరవాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు.

నేను హైదరాబాద్ రావటం ఒక రకంగా దైవాభీష్టం. నేను దైవాభీష్టానికి తల వంచినట్టే. నేను నా కర్తవ్య నిర్వహణలో విజయం సాధిస్తే, భారతదేశానికి తలనొప్పిగా పరిణమించే సమస్యను పరిష్కరించినట్టే. భారతదేశ ఐక్యతకు భంగం కలిగించే శక్తిపై విజయం సాధించినట్టే. ఈ కర్తవ్య నిర్వహణలో నేను ప్రాణాలు కోల్పోతే ఓ సంప్రదాయాన్ని ఏర్పాటు చేసిన వాడినవుతాను.

***

నిషేధితుడు

లాయక్ అలీ, మోయిన్ నవాజ్ కూ  నాకూ నడుమ జరుగుతున్న చర్చల వల్ల లాభం లేకపోయినప్పటికీ, ఆ చర్చల వల్ల లాయక్ అలీ రెండు అంశాల విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడని స్పష్టం అయింది. ఆ రెండు అంశాలు ప్రమాదకరమైనవి.

సైన్యానికి సంబంధించిన పథకాలు నిజామ్ పాటించాల్సిన అవసరం లేదన్న విషయంలో లాయక్ అలీ నిర్మొహమాటంగా ప్రవర్తించాడు. కాబట్టి రక్షణ వ్యవహారాలలో భారత ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. సైన్యం విషయంలో హైదరాబాదు‍కు సంపూర్ణ స్వాతంత్రం ఉంది. భారత ప్రభుత్వానికి హైదరాబాద్ సైన్యంపై ఎలాంటి నియంత్రణ ఉండదు.

ఇది యథాతథ ఒప్పందానికి విరుద్ధం. ఆ ఒప్పందం ప్రకారం రక్షణ వ్యవహారాలన్నీ భారత ప్రభుత్వం నియంత్రణలో ఉంటాయి. ఈ ఒప్పందాలను, ఇండియన్ స్టేట్ ఫోర్సెస్ స్కీమ్ క్రింద అమలుపరిచిన నియమాలను లోతుగా పరిశీలిస్తే, ఇప్పటికే ఎన్నో నియమాలను నిజామ్ ప్రభుత్వం ఉల్లంఘించినట్లు స్పష్టమయింది. లాయక్ అలీ తన వాదనకు కట్టుబడి ఉంటే, హైదరాబాద్ , భారత్‍ను వ్యతిరేకించే శత్రుదేశంగా ఎదుగుతుంటే భారత ప్రభుత్వం చూస్తూ ఉండడం తప్ప ఏమీ చేయలేదు.

లాయక్ అలీ గట్టి పట్టు పట్టిన మరో అంశం ఏమిటంటే, రజాకార్లను నిషేధించటం. కానీ రజాకార్లను నిషేధించాలంటే హైదరాబాద్ సైన్యానికి పోలీసులకు అవసరమైన ఆయుధాలను సరఫారా చేసి, అదుపు  శక్తినివ్వాలి భారత ప్రభుత్వం. దీన్ని బట్టి చూస్తే భారత ప్రభుత్వానికి రజాకార్ల ఉనికిని, వారి చర్యలను ఆమోదించటం ఉన్న రెండు మార్గాలలో ఒకటిగా తోస్తుంది. ఇది కమ్యూనిస్టుల ప్రాబల్యాన్ని పెంచుతుంది. మరో మార్గం ఏమిటంటే, ఇత్తెహాద్‍లను హైదరాబాద్ సైన్యంలో బాగంగా ఆమోదించటం. హైదరాబాద్ సైన్యంలో 90 శాతం ముస్లింలే ఉంటారు. ఇత్తెహాద్ ల ప్రేరణతో  ఈ సైన్యం రాష్ట్రంలోని హిందువులకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు. సరిహాద్దు జిల్లాల్లోంచి భారత ప్రభుత్వ భూభాగాలపై దాడులు చేయవచ్చు. ఇది హైదరాబాద్ పై సైనిక చర్య తీసుకునేందుకు భారత్‍ను రెచ్చగొట్టవచ్చు.

ఈ పరిస్థితిని బట్టి చూస్తే, హైదరాబాద్ భారత్‍లో విలీనమవాలంటే, సైనికపరంగా హైదరాబాద్‍కు ఎలాంటి నియంత్రణ, విధేయతలు లేకుండా శక్తిమంతం చేయాలి. లేదా, దక్షిణాదిన శాంతిభద్రతలను సంపూర్ణంగా దెబ్బ తిననియ్యాలి. ఈ విషయాలు నేను సర్దార్‍తో, వి.పి. మీనన్‍తో చర్చించాను. ఫిబ్రవరి 28న ఈ విషయాలను పొందుపరుస్తూ లాయక్ అలీకి ఉత్తరం రాశాను.

ఈ సందర్భంగా నేను స్పష్టంగా చెప్పదలచుకున్నదేమిటంటే, హైదరాబాద్ అంతర్గత శాంతినీ, సరిహద్దు ప్రాంతాలలో శాంతి భద్రతలకు ఇత్తెహాద్‌ ప్రమాదకరంగా పరిణమిస్తున్నది. ఇత్తెహాద్‍ను సమర్థిస్తున్నది ప్రభుత్వమే. ఇత్తెహాద్ లక్ష్యం హైదరాబాద్ సార్వభౌమత్వ పరిరక్షణ. ఇత్తెహాద్ సిద్ధాంతాల ప్రకారం ఈ బాధ్యత నిజామ్ ప్రాంతాలలో ముస్లింలది. రాష్ట్రంలో ఇత్తెహాద్ సభ్యుల సంఖ్య 1,50,000. ఇటీవలే ఇత్తెహాద్ నాయకుడు కాశిం రజ్వీ ఇంకా 3,50,000 మంది స్వచ్ఛంద సేవకులు కావాలని పిలుపునిచ్చాడు. ఈ సంస్థలోనే వారే అధిక సంఖ్యలో సైన్యంలోనూ పోలీసులలోను చేరుతున్నారు. రజాకార్లు రాష్ట్రమంతా సైన్యం, పోలీసుల సహాయ సహకారాలతో ముస్లిమేతర ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నారు. అందరికీ తెలియన విషయం ఏమిటంటే – వారు ఎంతటి వినాశనానికి ఒడిగట్టినా, వ్యక్తులను గాయపరిచినా, వారి ఆస్తులను నష్టపరిచినా చట్టపరమైన చర్యలు వారిపై తీసుకోరన్నది. ఇది బహిరంగంగా తెలిసిన విషయం. పోలీసుల, మిలిటరీల సహాయంతో వారు సరిహద్దు దాటి భారత భూభాగంలోని ప్రాంతాలపై కూడా దాడి చేస్తున్నారు.

ఈ విషయాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తరువాత, తప్పుడు వార్తలు, కల్పిత వార్తలను ఏరివేసిన తరువాత – రజాకార్లు ఒక ప్రైవేటు సైన్యంగా వ్యవహరిస్తున్నారు, వారికి ప్రస్తుత ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని నిర్ధారణగా తేలింది. నిష్పక్షపాతమైన ఏ న్యాయ స్థానమైనా, ఉన్న ఆధారాల వల్ల ఇదే తీర్మానానికి వస్తుంది. కాబట్టి భారత ప్రభుత్వానికి ఇత్తెహాద్ ప్రమాదకరమని స్పష్టమవుతోంది. ఇది భారత ప్రభుత్వానికే కాదు, నిజామ్ ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగించాల్సిన అంశం.

ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్ అధ్యక్షుడు రజ్వీ, ఇత్తెహాద్ లక్ష్యాల గురించి స్పష్టంగా చేస్తున్న ప్రకటనలు, నేను చెప్తున్న విషయాలు సత్యాలని నిరూపిస్తాయి.

ఇత్తెహాద్-ఉల్-ముసల్మీన్ అధ్యక్షుడు అయిదు లక్షల మంది స్వచ్ఛంద సేవకులు కావాలని ప్రకటించాడు. హైదరాబాద్ సరిహద్దులలో పోరాడేందుకు మహిళలను కూడా సిద్ధం చేస్తున్నామని ఆయన ప్రకటించాడు. అతని ప్రకటన భారత ప్రభుత్వంతో యుద్ధానికి సిద్ధం అన్న అర్థాన్నిస్తోంది. ఆయన పలు సందర్భాలలో హైదరాబాద్ ఇస్లామిక్ రాజ్యం అని ప్రకటించాడు. హైదరాబాద్ సార్వభౌమత్వం పరిరక్షణ హైదరాబాద్ ముస్లింలపై ఆధారపడి ఉందని పలు సందర్భాలలో ప్రకటించాడు. పలు సందర్భాలలో, భారత ప్రభుత్వ నియంత్రణ నుండి భారతీయ ముస్లింలను విముక్తం చేయాలని రజాకార్లకు పిలుపునిచ్చాడు. హైదరాబాదులో హింసాత్మక కార్యకలాపాలను నెరపేవారికి భారత ప్రభుత్వం ఆయుధాలను సరఫరా చేస్తోందని భారత ప్రభుత్వంపై ఆరోపణలు చేశాడు. ప్రస్తుత ప్రభుత్వంలోని పలువురు మంత్రుల మద్దతు ఉన్న ఇత్తెహాద్ అధ్యక్షుడు పలుమార్లు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుండటం, రాష్ట్రంలోనే కాదు, రాష్ట్రేతర ముస్లింలను భారతదేశం లోని ఇతర ప్రాంతాలలోని ముస్లిమేతరులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టటమే అవుతుంది.

1948 ఫిబ్రవరి 11న రాసిన ఉత్తరం నెంబర్ D6/L.A/7 లో నేను – “భారత ప్రభుత్వ వ్యతిరేక ఆరోపణలు, దాడులు ఆగాలని సూచించినా మీ నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదు. రజాకార్ల చర్యలు, దక్షిణ భారత శాంతిభద్రతలకు ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. ఇది భారత ప్రభుత్వ సైన్యం దృష్టిని ఆకర్షించే వీలుంది. కాబట్టి, భారత ప్రభుత్వ సైన్యానికి ఇబ్బంది కలిగించి, ప్రమాదం సంభవించే కార్యకలాపాలను త్యజించే ప్రయత్నాలు చేయాలన్న విషయంలో నాతో మీరూ ఏకీభవిస్తారని భావిస్తున్నాను.

కాబట్టి, భారత ప్రభుత్వ రక్షణ దృష్ట్యా, మీ ప్రభుత్వం భారత ప్రభుత్వానికి సహాయ సహకారాలందిస్తుందనీ, రజాకార్లకు సహాయం అందించటం ఆపేయటం ద్వారా ఆ సంస్థను నిర్వీర్యం చేస్తుందనీ, తద్వారా శాంతి భద్రతలకు భంగం కలగకుండా కాపాడుతుందని ఆశిస్తున్నాను. పలు ప్రాంతాలలో, రాష్ట్రాలలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పై నిషేధం విధించినట్టు, రజాకార్లపై కూడా మీ ప్రభుత్వం, భారత ప్రభుత్వం ఆశించిన విధంగా నిషేధం విధిస్తుందని ఆశిస్తున్నాను.

నేను నిజామ్ రాష్ట్రంలోనూ, సరిహద్దు ప్రాంతాలలోనూ, శాంతిభద్రతలను నెలకొల్పటం కోసం ఆయనతో కలిసి పర్యటించేందుకు సిద్ధంగా ఉన్నాను” అని రాశాను.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here