కథా, నవలా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి ప్రత్యేక ఇంటర్వ్యూ

2
4

[ఇటీవల ‘నాన్నలేని కొడుకు’ అన్న నవలని ప్రచురించిన సందర్భంగా కథా, నవలా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారితో ప్రత్యేక ఇంటర్వ్యూని అందిస్తున్నాము.]

సంచిక  టీమ్: నమస్కారం విజయలక్ష్మి గారూ.

విజయలక్ష్మి: నమస్కారమండీ.

~

ప్రశ్న:. ‘నాన్నలేని కొడుకు’ అన్న పేరే గమ్మత్తుగా ఉంది. ఈ పేరు పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది?

జ. ‘నాన్నలేని కొడుకు’ అనే పేరు అనుకోకుండా తట్టింది. ముందు ‘నాలుగోవాడు’ అని పెట్టాను. తరవాత ఇంకా మంచిపేరు పెట్టాలని అనుకుని ఆలోచిస్తూ ఉంటే యీ పేరు క్యాచీగా అనిపించింది. పైగా కథాంశం కూడా అందుకు తగినదే కదా! అత్యాచారాలు, ఆడపిల్లల మీద దాడి ఇప్పుడు మరీ ఎక్కువ అయినాయా, లేక ఎప్పుడూ ఉన్న ఈ సమస్య ఇప్పుడు సోషల్ మీడియా అందుబాటులో ఉండడం వల్ల ఎక్కువగా వెలుగులోకి వస్తోందా! అనేది పెద్ద సందేహం. పిల్లలు, వృద్ధులు అని కూడా లేకుండా, అశ్లీలమైన చిత్రాలు, బూతు కథలు అంతర్జాలంలో స్వైర విహారం చేస్తూ ఉన్న ఈ స్థితిలో కామపిశాచులు పెరిగిపోతున్నారు. పసిపిల్లలతో సహా ఈ కామాగ్నిలో భస్మం అయిపోతున్నారు. ఎలా? వీరికి రక్షణ ఎక్కడ? ప్రస్తుతం ఇది సమాజాన్ని అగ్నిలా దహిస్తున్న సమస్య.

చేయని నేరానికి ఇటు సమాజం, అటు ప్రకృతి కూడా స్త్రీలకి వేసే అత్యంత క్రూరమైన శిక్ష.. అదే గర్భం దాల్చడం. మగవాళ్ళకి ఎలాంటి ప్రభావం ఉండదు. కానీ స్త్రీలకి మాతృత్వం అనేది ఒక విధంగా వరం అయితే, మరో విధంగా ఘోరమైన శిక్ష. అత్యాచారం చేయబడిన అమ్మాయి గర్భం దాలిస్తే పుట్టిన పిల్లలకి తండ్రి ఎవరని చెప్పుకుంటుంది! ఇంటిపేరు ఏది ఇస్తుంది. Birth certificate నుంచి death certificate వరకు తండ్రి పేరు, ఇంటిపేరు అడుగుతారు. ఇలాంటి స్థితిలో ఆమె ఏం చేయాలి? ఇది నా అంతరంగంలో వచ్చిన పెద్ద సందేహం. ఆ సందేహానికి సమాధానం ఈ నవల.

ప్రశ్న: ఈ నవల రచనలో మీరు ఏయే అంశాలను పరిశోధించారు? ఈ నవలలో ఏ భాగం రాసేందుకు ఎక్కువ కష్టపడ్డారు?

జ: ‘నాన్నలేని కొడుకు’లో కేసు ఇన్వెస్టిగేషన్ గురించి ఇంకా కొంచెం రాయచ్చు. కానీ, తెలియని విషయం కదా ఎక్కడ తప్పుచేస్తానో అని కొంచెం ఇబ్బంది పడ్డాను. నాకు తెలియని డిపార్ట్మెంట్ police dept.. అక్కడ ఏ స్థాయి officer ఏ కేసు ఎంతవరకు take up చేయచ్చు, వగైరా తెలుసుకుని రాయడం జరిగింది. అలాగే ఇటీవల Supreme court దరఖాస్తుల్లో, స్కూల్స్, కాలేజ్ మొదలైన చోట్ల తండ్రి పేరు రాయడం mandatory కాదు అని, అమ్మాయి మనస్ఫూర్తిగా ఇష్టపడితే తప్ప, భర్త పేరు చెప్పుకోనవసరం లేదని తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా నేను ఇందులో ప్రస్తావించడం జరిగింది. చూద్దాం రెండో ముద్రణ సమయంలో ఏదన్నా చేయగలనేమో!

ప్రశ్న: ఈ రచనను నవల అనేకన్నా నవలిక అనవచ్చు. నిజానికి రచన నిడివి పెంచే వీలుంది కూడా. అయినా ఎందుకని నవలను తక్కువ నిడివిలో ముగించారు?

జ: ఇది 2019లో నవ్య పత్రిక వారు నిర్వహించిన ఏడు వారాల సీరియల్ పోటీకి రాసాను. సాధారణ ప్రచురణకి సెలెక్ట్ అయింది. అప్పుడు నేను US లో ఉన్నాను. ఆరునెలలు. ఈ ఆరునెలలు బహుమతి పొందినవి, సాధారణ ప్రచురణవి కూడా ప్రచురించారు.  అప్పుడు ఈ నవల పేరు ‘నాలుగోవాడు’ నేను US నుంచి తిరిగి వచ్చిన రెండు నెలలకి అంటే సరిగ్గా లాక్‌డౌన్ ప్రకటించే ముందు వారం నవ్యలో నా పరిచయంతో పాటు ఈ నవల ప్రచురిస్తున్నట్టు ప్రకటించారు. కానీ, సరిగ్గా ప్రచురించే సమయానికి లాక్‌డౌన్ రావడం, నవ్య close అవడం జరిగింది. ఆ తరవాత సంచికకి పంపిస్తూ మరి కొంత నిడివి పెంచాను. కానీ, ఇంకా నిడివి పెంచవచ్చు అని book వచ్చాక అర్థం అయింది. రెండో ముద్రణకి పెంచుతాను.

ప్రశ్న: నవలలో సెన్సేషన్ చేసేందుకు, రెచ్చకొట్టేట్లు రాసేందుకు ఎంతో అవకాశం ఉంది. కానీ, మీరు చాలా నియంత్రణతో ఎలాంటి అసభ్యతకి, తావివ్వకుండా రాసారు. ఎందుకని? మీరీ నవల రాసే సమయంలో మీ మరో నవల ‘తెల్ల గులాబీ’ పై వచ్చిన విమర్శలు మీ రచనపై ప్రభావం చూపించాయా!

జ: ‘తెల్ల గులాబీ’ నవల ప్రస్తావన తెచ్చారు.  ఆ నవలకి వచ్చిన విమర్శల కారణంగా నేను ఈ నవలలో జాగ్రత్తగా ఉండడం జరగలేదు. ఈ నవలలో నిజానికి మీరు అన్నట్టు sensation create చేయచ్చు. అంటే మితిమీరిన శృంగారం రాయచ్చు, సస్పెన్స్, హింస, ఇంకా ఎక్కువ రాయగల అవకాశం ఉంది. కానీ, శృంగారానికి, sex కి చాలా తేడా ఉంది. ఈ కథలో కథానాయిక పట్ల జరిగింది ఒక భయానక సంఘటన.. సీరియల్ రేప్. వాళ్ళిద్దరి మధ్యా జరిగిన రేప్‌ని సున్నితమైన శృంగారంగా రాసే అవకాశం లేదు. అలా రాస్తే జగుప్సాకరంగా ఉంటుంది. శృంగారం అనేది, వయసు, సమయం, పరిస్థితులు, మనోభావాలు అనే అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. భార్యాభర్తల మధ్య, లేదా పరస్పరం మనసిచ్చి పుచ్చుకున్న ప్రేయసి, ప్రియుల మధ్య అనుభూతి పరమైన శృంగారం ఎప్పటికి మధురంగా గుర్తుండి పోయేది. కానీ ఒక అత్యాచారం జరిగినప్పుడు ఆ సన్నివేశం వర్ణించడం అసంభవం. ఎందుకంటే రచయిత తను సృష్టించే పాత్రలతో తనూ ప్రయాణం చేస్తూ ఉంటాడు. ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేస్తారు. అలా చేయగలిగినప్పుడే, ఆ పాత్రకి జీవం పోయగలుగుతారు. పాత్రకి  సజీవత్వం ఇవ్వాలంటే, ఆ పాత్ర జీవితంలో జరిగిన సన్నివేశాల్లో, ఆ సన్నివేశాల్లో పాత్రల మనోభావాలు, అనుభూతులు స్వయంగా అనుభవించినట్టు రాయాలి. నేను నా ‘అర్చన’లో పరకాయ ప్రవేశం చేసాను. ఆదిత్య, ప్రఖ్య, శిరీష, భానుమతి, పాత్రల్లోనే కాదు, ‘నాన్నలేని కొడుకు’లో హరితలో, శంకర్‍, హరిత తండ్రిలో కూడా పరకాయ ప్రవేశం చేసాను. హరిత ఒక నీచుడితో జరిగిన రాక్షస క్రీడని అనుభూతించలేదు.. అసహ్యించుకుంటుంది. అది ఒక హింసాత్మక క్రియ. ఇక్కడ శృంగారం అనే ఒక మధురమైన రసానికి ఆస్కారం లేదు కదా! నిజానికి ‘తెల్ల గులాబీ’లో కూడా నేను మితిమీరిన శృంగారం రాయలేదు. Teen age లో ఉన్న అమ్మాయి, అబ్బాయి మధ్య ఏర్పడేది ఆకర్షణ. ప్రేమ కాదు. ప్రేమకి అర్థం, నిర్వచనం తెలియని వయసులో వాళ్ళ మధ్య ఏర్పడేది పరస్పర స్పర్శ ద్వారా పొందే శారీరకానందం పట్ల వ్యామోహం, తెలియని అనుభవాలు పొందాలన్న ఆరాటం,  అది ప్రేమ అనుకున్నారు. అలా అని వాళ్ళు నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వే నా గుండెలో ఉన్నావు లాంటి డైలాగులు చెప్పుకోలేదు. అలా చెప్పించి ఉంటే చాలా అసహజంగా ఉండేది. విమర్శలతో పాటు అత్యున్నత స్థాయి రచయితల ప్రశంసలు కూడా పొందాను కాబట్టి, నేను విమర్శలు పట్టించుకోలేదు.    దాని ప్రభావం ‘నాన్నలేని కొడుకు’ మీద ఎంత మాత్రం లేదు. ఇక్కడ ఒక విషయం చెప్పడం అసందర్భం కాదు అనుకుంటున్నాను. నిజానికి నేను ‘తెల్ల గులాబీ’లో ఎక్కడా శృంగారం వర్ణించలేదు. అలాగే అంగాంగ వర్ణనా చేయలేదు. కేవలం, అమ్మాయి, అబ్బాయిల సంభాషణ మాత్రమే చాలా ప్రాక్టికల్‌గా రాసాను. అయినా నేను బూతు రాసినట్టు కొందరు గుండెలు బాదేసుకున్నారు. వీళ్ళే ‘రాధికాసాంత్వనము’ వంటి వాటిని గొప్ప కావ్యాలుగా పేజీలకు పేజీలు రాస్తారు. ఖచ్చితంగా అది గొప్ప కావ్యమే. కానీ, అందులో శృంగారం ఎంత ఉంది! సంస్కృతంలో రాస్తే శృంగారం, తెలుగులో అందులోనూ వ్యవహారిక భాషలో రాస్తే బూతు అవుతుందా! కావ్యం అయినా, కథ అయినా, నవల అయినా నవరసభరితం కాదా! జీవితం కూడా అంతే కదా! స్త్రీలు శృంగారం రాయడం పాపం అవుతుందా! రాసిన స్త్రీలు చెడిపోయినట్టా! అసలు చెడిపోవడం అంటే ఏమిటి? ఇవన్నీ ఎన్నో ప్రశ్నలు. వాటికి జవాబులు వెతికే వేదిక కాదు కదా ఇది.

ప్రశ్న: మీరీ నవలలో సృష్టించిన నాయిక మామూలు పవిత్రంగా ఉండే టిపికల్ నాయికలకు భిన్నం. ఇలాంటి నాయికను రూపొందించడంలో మీ ఆలోచనలేమిటి?

జ: క్షమించాలి. ఈ ప్రశ్న నాకు అర్థం కాలేదు. పవిత్రంగా ఉండే టిపికల్ పాత్ర అంటే ఏంటి? అప్పట్లో నవలల్లో తన మీద అత్యాచారం జరిగిన వెంటనే “నా శరీరం అపవిత్రం అయింది.. నేను చెడిపోయాను” అని, ఆత్మహత్య చేసుకోడమా! నేను ఎప్పుడూ కూడా నా స్త్రీ పాత్రలలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆత్మహత్య చేసుకోడం అనే బలహీనత సృష్టించలేదు. ధైర్యంగా పరిస్థితులను ఎదుర్కొని, జీవితంలో ఉన్నత స్థానానికీ ఎదిగిన స్త్రీలే ఉంటారు. ఆధునిక స్త్రీలు పరిస్థితులకు కృంగిపోరు.. చెడిపోడానికి స్త్రీ ఒక వస్తువు కాదు, ఒక పదార్థం అంతకన్నా కాదు. మనిషి. ఈ చెడిపోడం అనే concept మగవాళ్ళ విషయంలో లేదు కదా! ఆడవాళ్ళకి ఎందుకుండాలి? అలా అని జరిగిన పీడకల లాంటి దుర్ఘటనలు మర్చిపోయి, పెళ్ళే జీవిత పరమావధి అని మరో పెళ్లి కూడా చేసుకోలేదు. ఆగిపోయిన జీవితాన్ని తిరిగి ప్రారంభించింది. ఈ సమాజంలో అలాంటి ఆడపిల్లలకి స్ఫూర్తిని ఇవ్వడం నా ఉద్దేశం. అంతే.

ప్రశ్న: సాంఘిక రచనలే ఎందుకు చేస్తారు మీరు?

జ. సాంఘిక రచనలే చేయడానికి  కారణం నా చుట్టూ ఉన్న సమాజాన్ని నిత్యం పరిశీలిస్తూ, మానవ జీవితాలను పరిశోధిస్తూ ఉండడం నా చిన్నప్పటి నుంచి అలవాటు. చాలా తక్కువ మాట్లాడతాను.. ఎక్కువ observe చేస్తాను. అదే నేను రచయిత్రి అవడానికి దోహదం చేసింది. వాస్తవానికి దగ్గరగా ఉండే పాత్రలే, ఆ ఇతివృత్తాలే తీసుకుంటాను. అందుకే ఎక్కువగా సాంఘిక ఇతివృత్తాలతో రచనలు చేసాను. కాకపొతే, చరిత్ర నాకు చాలా ఇష్టం. త్వరలో ఒక historical నాటకం రాయాలని అనుకుంటున్నాను.

ప్రశ్న: ఈ రచనలో నాయిక ధనవంతురాలు. తల్లి తండ్రి అండవుంది. కానీ, ఇదే పరిస్థితి ఒక సామాన్య యువతికి ఎదురయితే తల్లితండ్రులు, సమాజం ఇలాగే స్పందిస్తారా!

జవాబు: స్పందించాలి. ఏ ఆడపిల్లా ఇలాంటి దౌర్భాగ్యం జీవితంలో జరగాలని కోరుకోదు. చక్కగా చదువుకుని, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని, పిల్లా, పాపలతో ఆనందంగా జీవించాలని కోరుకుంటుంది. అలాంటప్పుడు ఎవరో చేసిన తప్పుకి ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? ఇది అమానుషం కాదా! ముఖ్యంగా ఆడపిల్లలని తల్లి తండ్రులు అర్థం చేసుకుని, వారు తప్పులు చేసినా, వారి పట్ల దారుణాలు జరిగినా వాళ్లకి support ఇవ్వాలి. ఇదే కాదు, ప్రేమించి మోసపోయిన అమ్మాయిలకు కూడా ఇదే సపోర్ట్ ఇవ్వాలి. తప్పులు అందరూ చేస్తారు ఒక వయసులో. అంత మాత్రాన వాళ్ళని సమాజం నుంచి వెలివేయాల్సిన అవసరం లేదు.. అలా చేస్తే నూటికి నూరు శాతం ఆడ, మగ అందరూ సమాజం నుంచి దూరం అవాల్సిందే..

ప్రశ్న: ఒక మహిళగా, సృజనాత్మక రచయితగా ఎందుకని మహిళల పట్ల సమాజంలో చులకన అభిప్రాయం వుందిఅని అనుకుంటున్నారు? ఎందుకని వారిపై అత్యాచారాలు పెరుగుతున్నాయి తప్ప స్త్రీ పురుషుల నడుమ అవగాహన గౌరవాలు పెరగటంలేదు? స్త్రీ, పురుష సంబంధాలపట్ల ఆరోగ్యకరమైన దృక్పథం ఏర్పడాలంటే సృజనాత్మక రచయితలు ఏం చేయాలి మీ ఉద్దేశం ప్రకారం?

జ: నిజం చెప్పాలంటే మహిళల పట్ల చులకన లేదు, ఒక భయం, అసూయ, ఆకర్షణ, కోరిక ఇలాంటివే ఎక్కువ ఉన్నాయి. మగవాళ్ళ అదుపాజ్ఞల నుంచి స్త్రీలు నెమ్మదిగా జారిపోయి, ఒక వ్యక్తిత్వం ఏర్పరచుకుంటున్నారు. ప్రతి దానికి పురుషుల మీద ఆధారపడకుండా, స్వతంత్రంగా జీవిస్తున్నారు. అక్షరాస్యతలో కానీ, వృత్తి పరంగా కానీ, ఎంతో ఎత్తుకు ఎదుగుతున్నారు. ఆర్థికంగా, సామాజికంగా   ఒక స్థానం పొందుతున్నారు. ఇవన్నీ అసూయకి కారణం అయితే, తమ చేతులలో నుంచి జారిపోతున్నారన్న భయం ఒకటి కూడా ఉంది పురుషులకి. అలాగే, స్త్రీ అంటే ఒక ఆకర్షణ.. స్త్రీని ఒక sex objectగా  చూడడం అనేది అప్పటి నుంచీ ఉంది. అయితే, ఇటీవల పైన మనం అనుకున్నట్టు స్త్రీలు దాచుకోవాల్సిన అందాలు, కొందరు బహిర్గతపరుస్తూ, పురుషుల్లో మానసిక వికారాలను ప్రేరేపిస్తున్నారు. స్త్రీలు ఎదురుతిరుగుతూ, తమకున్న చట్టాల పట్ల అవగాహనతో చట్టపరమైన చర్యలు కూడా తీసుకోడంతో ఒక విధమైన కసి కూడా పెరుగుతోంది అని అనిపిస్తుంది. ఆ కారణం గానే, తమ వాంచలను తీర్చుకోడానికి యువతులు అందుబాటులోకి రాకపోతే, వృద్ధులను, పిల్లలను కూడా హింసిస్తున్నారు. ఇవాళ సమాజం ఇలా అవడానికి కారణం ఫలానా వాళ్ళు అని ఏ ఒక్కరినీ టార్గెట్ చేయలేము. అందరూ కారణమే. కర్ణుడి చావుకి అనేక కారణాలు. ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడడానికి అందరూ బాధ్యత వహించాలి. ప్రతి వారికీ కొన్ని పరిధులు ఉన్నాయి. వాటిని అతిక్రమించడం స్వేచ్ఛ అనుకుంటే, దాని వల్ల జరిగే పరిణామాలకు సిద్ధపడాలి. స్త్రీ, పురుషులు ఇద్దరికీ బాధ్యత, కర్తవ్యం ఉంది. రేపటి సమాజ నిర్మాణంలో ఇద్దరూ భాగస్వాములే కదా! ఈ దిశగానే రచయితలు, రచయిత్రులు కూడా ఆలోచించాలి. నీతులు చెప్పడం కాదు.. భారతంలో మనకి వ్యాసుడు నీతి కథలు చెప్పలేదు. ప్రతి పాత్రద్వారా, ప్రతి సన్నివేశం ద్వారా జీవితానికి నిర్వచనం, ధర్మ సంస్థాపనలో ప్రతివారి పాత్ర ఎలా ఉండాలి అనే విషయాలు గాఢంగా చెప్పాడు. అలాగే మనం కూడా మంచి సమాజం ఎలా ఉంటుంది చెప్తే చాలేమో.. అందుకు ఏం చేయాలో వాళ్ళే నిర్ణయించుకుంటారు.

ప్రశ్న: భవిష్యత్తులో మీ రచన ప్రణాళికలేమిటి?

జ: నేను ఏ పని చేసినా, ఒక బాధ్యతతో, ఏకాగ్రతతో చేస్తాను. నన్ను కొందరు ధ్యానం చేస్తావా అని అడుగుతారు. నేను చేస్తున్న పని ఏది అయినా, ఏకాగ్రతతో, శ్రద్ధతో చేయడమే ధ్యానం అంటాను. రచనలు కూడా అంతే, నేను పెద్ద రచయిత్రిని, సమాజాన్ని ఉద్ధరించాలి అని పెద్ద ఆదర్శం లేదు. అసలు రచయిత్రిగా ఎవరో కీర్తించాలి అని కూడా అనుకోను. నాకు ప్రచారాలు ఇష్టం లేదు, కీర్తి అనేది పూల పరిమళం లాంటిది.. పూవు విచ్చుకుంటూ ఉంటే, పరిమళం పరిసరాల్లో వ్యాపిస్తుంది. పని గట్టుకుని, ఆ పరిమళం మూటకట్టి మనిషి, మనిషి ముక్కు దగ్గరకు తీసుకుని వెళ్లి వాసన చూపించడం హాస్యాస్పదం అనిపిస్తుంది. అలాగే, నా రచన ఏది అయినా, దానికో ప్రయోజనం ఉండాలి అనుకుంటాను. జరిగిపోయిన కథలు చాలా మంది రాసారు. ఇంకా మనం కూడా రాస్తూ ఉంటే చర్విత చర్వణం అవడం తప్ప ప్రయోజనం ఏముంది? ఈ ఆధునిక జీవిత విధానాన్ని, భవిష్యత్ తరాల వారికి తెలియచేయాలి. ఇందులో మంచి, చెడ్డల ఫలితాలు తెలపాలి. ఏది మంచి? ఏది చెడు? ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదు అనే విషయం రేపటి తరం వాళ్ళు ఆలోచించి, మరో కొత్త సమాజం నిర్మించాలి. ఇప్పటి వరకు, నా కథలు, నవలలు, నాటకాలు కూడా వైవిధ్య భరితంగానే ఉన్నాయి. తెలుగు సాహితీ ప్రపంచంలో నా ‘సంతకం’ ఒకటి వదిలి వెళ్ళాలి అనేది నా కోరిక. ఇప్పటి వరకు నా రచనలు ఎవరికీ చెడు చేయలేదు. ఇక ముందు కూడా చేయవు. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. ‘తెల్ల గులాబీ’ ప్రముఖ రచయితలకే కాదు, ఎంతో సంప్రదాయ బద్ధంగా ఉంటూ, కుటుంబ పరమైన రచనలు చేస్తూ, సాత్వికంగా ఉండే మహిళలకు కూడా ఎంతో నచ్చింది. ఇటీవల నా స్నేహితురాలి తల్లి, సుమారు 80 ఏళ్ల వయసు ఉన్నావిడ ఖమ్మం నుంచి ఫోన్ చేసి మరీ నన్ను అభినందించడం గొప్ప విషయంగా భావిస్తున్నాను. విమర్శలు, ప్రశంసలు రెంటినీ సమానంగా స్వీకరించే శక్తి నాకు ఉంది.

సంచిక పాఠకులతో ఇలా నా మనసు విప్పి చెప్పుకునే అవకాశం కలిగించినందుకు అనేక కృతజ్ఞతలు.. సంచిక ఎందరో ప్రముఖ, వర్ధమాన రచయితలకు నెలవు అయింది. ముందు, ముందు ఇంకా అభివృద్ధి చెందాలని మనసారా కోరుకుంటున్నాను. మీ టీం అందరికీ కూడా నా అభినందనలు.

~

సంచిక టీమ్: మీ విలువైన సమయాన్ని కేటాయించి సంచికకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు విజయలక్ష్మి గారూ.

విజయలక్ష్మి: మీకు కూడా ధన్యవాదాలు.

***

నాన్న లేని కొడుకు (నవల)
రచన: అత్తలూరి విజయలక్ష్మి
ప్రచురణ: జె.వి. పబ్లికేషన్స్,
పేజీలు: 88
వెల: ₹ 100
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు
అచ్చంగా తెలుగు
8558899478 (WhatsApp only)
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు:
https://books.acchamgatelugu.com/product/nanna-leni-koduku/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here