ఆదికావ్యంలోని ఆణిముత్యాలు-46

0
3

[వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీ వేదాంతం శ్రీపతిశర్మ రచించిన ‘ఆదికావ్యంలోని ఆణిముత్యాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

శ్లో:

సుతాభిలాషో మత్తస్తే మత్తమాతంగ గామినీ।

దారుణాయాం తు వేళాయాం యస్మాత్ త్వం మాముపస్థితా॥

శ్రణు తస్మాత్ సుతాన్ భద్రే యాదృశాన్ జనయిష్యసి।

దారుణాన్ దారుణాకారాన్ దారుణాభిజనప్రియాన్॥

ప్రసవిష్యసి సుశ్రోణి రాక్షాసాన్ క్రూరకర్మణః।

(ఉత్తరకాండ, 9. 21, 22)

విశ్రవసువు తపోనిష్ఠలో ఉన్నప్పుడు కైకసి సాయంసంధ్యలో అగ్నికార్య సమయమందు ఆయనను సమీపించి సంగమింపకోరింది.

విశ్రవసువు: నీవు నా వలన పుత్రుని పొందవలెనను అభిలాషతో ఉన్నావు. కానీ ఈ దారుణమైన సమయమున నన్ను చేరావు. ఈ వేళలో జన్మించెడి తనయులను గురించి చెబుతాను. క్రూరకార్యములకు పాల్పడు రాక్షసులు కలుగుతారు. దుష్టులైన బంధుమిత్రుల యెడ ప్రీతి కలిగి ఉంటారు.

తత్వాత కైకసి వేడుకోగా విభీషణుడు మటుకు ధర్మాత్ముడు కాగలడు అని చెప్పాడు.

..ఇది ప్రధానమైన విషయం. దితి కశ్యపుని వద్దకు వెళ్ళినప్పుడు ఇదే పరిస్థితి. అసుర సంధ్య కాబట్టి దైత్యులు జన్మించారు. “నీకు రాక్షసులు జన్మిస్తారు” అని స్పష్టంగా చెప్పాడు విశ్రవసుడు! అందుచేత కశ్యపునికి దితి ద్వారా జన్మించిన వారు బ్రాహ్మణులని ఎలాగైతే అనబడలేదో, విశ్రవసునికి కైకసి ద్వారా జన్మించిన వారు రాక్షసులే అవుతారు కానీ రావణుని బ్రాహ్మణుడు అని పేర్కొనటం, అతన్ని వధించిన శ్రీరామునికి బ్రహ్మహత్యా దోషాన్ని ఆపాదించటం సరైన పని కాదు.

రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు పదివేల సంవత్సరములు తీవ్రమైన తపస్సు ఆచరించారు.

బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైనాడు.

శ్లో:

సుపర్ణ నాగ యక్షాణాం దైత్యదానవ రక్షసామ్।

అవధ్యోహం ప్రజాధ్యక్ష దేవతానం చ శాశ్వత॥

నహి చింతా మహన్యేషు ప్రాణిష్వమర పూజిత।

తృణభూతా హి తే మన్యే ప్రాణినో మానుషాదయః॥

(ఉత్తరకాండ, 10. 19, 20)

రావణుడు: గరుడ జాతి వాళ్లు, నాగులు, యక్షులు, దైత్యులు, దానవులు, రాక్షసులు మున్నగు వారి వలనను, కడకు దేవతల వలను నాకు మరణం లేకుండునట్లు వరమును అనుగ్రహింపుము.

ఇతర ప్రాణుల వలన నాకు ఎట్టి ప్రాణభయమూ లేదు. మనుష్యులు మొదలగు ఇతర ప్రాణులన్నియు నాకు గడ్డిపోచలతో సమానం.

ఈ వరం పొందాడు రావణుడు.

శ్లో:

పరమాపద్గతస్యాపి ధర్మే మమ మతిర్భవేత్।

అశిక్షితం చ బ్రహ్మాస్తం భగవాన్ ప్రతిభాతు మే॥

యా యా మే జాయతే బుద్ధిరేష్యు యేష్వాశ్రమేషు చ।

సా సా భవతు ధర్మిష్ఠా తం తం ధర్మం చ పాలయే॥

ఏష మే పరమోదార వరః పరమకో మతః।

న హి ధర్మాభిరక్తానం లోకే కించన దుర్లభమ్॥

(ఉత్తరకాండ, 10. 31, 32, 33)

విభీషణుడు: నేను ఎంతటి ఇక్కట్లు పాలైనను నా బుద్ధి ధర్మపథమును వీడక దానియందే దృఢముగా ప్రవర్తిల్లు గాక. నేను బ్రహ్మాస్తమున శిక్షితుడను గాను. ఐనను ఆ మహాస్త్ర మంత్రము నాకు స్ఫురించినట్లు అనుగ్రహింపుము. బ్రహ్మచర్యాది అన్ని ఆశ్రమములయందు నా బుద్ధి పూర్తిగా ధర్మబద్ధమై యుండునట్లు, నేను విధ్యుక్త ధర్మములనే పాటించుచుండునట్లుగా వరమును ప్రసాదింపుము. ఇది ఉత్తమోత్తమమైన వరమని నేను అనుకుంటాను. ఎందుచేతనంటే నిరంతరం ధర్మనిరతులై ఉండేవారికి ఏదీ దుర్లభం కాదు!

ఈ వరం పొందాడు విభీషణుడు. అంతేకాదు, బ్రహ్మదేవుడు అమరత్వం కూడా ప్రసాదించాడు.

..యుద్ధకాండలో వానరవీరులకు ధైర్యం చెబుతూ విభీషణుడు ‘సత్యధర్మాబిరక్తానం నాస్తి మృత్యుకృతం భయమ్’ అన్న మాట జ్ఞప్తికి వస్తున్నది!

కుంభకర్ణుడు వరం పొందే ముందే భూమి మీద ఉన్న అన్ని రకాల జీవులను తినేయటం ప్రారంభించాడు. దేవతలు ఆర్తనాదాలు చేశారు, వరం పొందితే ఏమగునోనని!

బ్రహ్మదేవుడు సరస్వతి సహాయం పొంది అతని నాలుక దీర్ఘనిద్ర పొందునట్లు అడిగించాడు! అది ఇచ్చి వెళ్ళిపోయాడు!

పుష్పక విమానంలో రావణుడు విహరిస్తున్నప్పుడు ఒక పర్వతం మీదకి చేరగానే అది ఆగిపోయింది.

శ్లో:

నివర్తస్వ దశగ్రీవ శైలే క్రీడతి శంకరః।

సుపర్ణ నాగ యక్షాణాం దేవగంధర్వ రక్షసామ్॥

సర్వేషామేవ భూతానామగమ్యః పర్వతః కృతః।

తన్నివర్తస్వ దుర్బుద్ధే మా వినాశం అవాప్స్యసి॥

కోయం శంకర ఇత్యుక్త్వా శైలమూలమ్ ఉపాగత।

(ఉత్తరకాండ, 16. 10, 11, 12)

నందీశ్వరుడు: ఈ పర్వతముపై దశగ్రీవుడు క్రీడిస్తున్నాడు. ఏ ప్రాణులూ ఈ పర్వతం మీదకి వెళ్లరాదు! వెనక్కి వెళ్ళు. లేనిచో నాశము తప్పదు.

రావణుడు “ఎవరీ శంకరుడు?” అని పలికి పర్వతం యొక్క మూల భాగానికి చేరాడు.

శ్లో:

గచ్ఛ పౌలస్త్య విస్రబ్ధం పథా యేన త్వమిచ్ఛసి।

మయా చైవాభ్యనుజ్ఞాతో రాక్షసాధిప గమ్యతామ్॥

(ఉత్తరకాండ, 16. 40)

పర్వతం క్రింద రావణుని అణగదొక్కి చివరకు అతను స్తోత్రం చేయగా వదిలిపెట్టి శివుడు ఇలా పలికాడు:

పులస్త్యుని వంశమున జన్మించిన రాక్షసరాజా! నీవు కోరుకొనిన మార్గమున వెళ్ళు. అనుజ్ఞ ఇస్తున్నాను.

శ్లో:

యస్మాత్తు ధర్షితా చాహం త్వయా పాపాత్మనా వనే।

తస్మాత్తవ వదార్థం హి సముత్పత్స్యే ప్యహం పునః॥

యది త్వస్తి మయా కించిత్ కృతం దత్తం హుతం తథా।

తస్మాత్త్వయోనిజా సాధ్వీ భవేయం ధర్మిణః సుతా॥

(ఉత్తరకాండ, 17. 31, 33)

వేదవతి: నీచుడా! (రావణా!) పాపాత్ముడవైన నీవు ఈ వనమునందు నన్ను అవమానించిన కారణంగా నిన్ను హతమార్చుట ద్వారా నా పగ దీర్చుకొనుటకై నేను మరల జన్మిస్తాను. నేను ఏ మాత్రముగనైనను పుణ్యకృత్యములు, దానధర్మములను, అగ్నికార్యములను చేసియున్నచో, ఆ ప్రభావముతో అయోనిజనై, సాధ్వీ లక్షణములను కలిగి ఒక ధర్మాత్మునకు తనయను అవుతాను.

శ్లో:

ఏతచ్ఛ్రుత్వార్ణవే రామ తాం ప్రచిక్షేప రావణః।

సా చైవ క్షితిమాసాద్య యజ్ఞాయ తన మధ్యగా॥

(ఉత్తరకాండ, 17. 38)

మరల ఒక కమలంలో బాలికగా ఉద్భవించిన ఆమెను రావణుడు తన సచివుని సలహా మేరకు సముద్రంలో వదిలేశాడు. భూమికి చేరి ఆమె యజ్ఞావరణమునకు అర్హమైన పవిత్ర ప్రదేశంలో ఉండిపోయింది.

శ్లో:

పూర్వం క్రోధహతః శత్రు ర్యయాసౌ నిహత స్తయా।

ఉపాశ్రయిత్వా శైలాభః తవ వీర్యమ్ అనుత్తమమ్॥

(ఉత్తరకాండ, 17. 40)

పర్వతప్రమాణంలోనున్న ఈ రావణుని ఆ దేవి నీ దివ్య పరాక్రమ రూపమున హతమార్చెను (ఇది అగస్త్యుడు శ్రీరామునికి చెబుతున్నది).

శ్లో:

ఏషా వేదవతీ నామ పూర్వమాసీత్కృతే యుగే।

త్రేతాయుగమ్ అనుప్రాప్య వధార్థం తస్య రక్షసః॥

(ఉత్తరకాండ, 17. 42)

ఆ రాక్షసుని వధించుటకై త్రేతాయుగమున మహాత్ముడైన జనకుని యొక్క ఉదాత్త వంశమున ఈమె ఉద్భవించెను. పూర్వంలో కృతయుగమునందు ఈమె వేదవతిగా ప్రసిద్ధి గాంచినది.

..‘సీతాయాశ్చరితం మహత్’ అను మాటకు నేపథ్యం ఇది. శ్రీరాముని పరాక్రమం, తపశ్శక్తి యావత్తు సీత (వేదవతి) స్వరూపం అని ప్రకటితమవుతున్నది.

రావణుడు కృతయుగం నుండి ఉన్నవాడు. వేదవతి తపస్సు యుగాంతం దాటి త్రేతాయుగంలోకి సీతగా ప్రవేశించింది. సీత వయస్సు అందుచేత జనకునికి ఆమె దొరికినప్పటి నుంచి త్రేతాయుగంలో లెక్క వేయవలసి ఉంటుంది. శ్రీరాముని వయస్సు, సీత వయస్సు స్వయంగా సీతయే అనసూయకు స్పష్టం చేసింది (25,16).

ఈ ఉదంతాన్ని తీసుకుని సీత శ్రీరాముని కంటే పెద్దది అనటం యుగాంతరాన్ని అర్థం చేసుకోకపోవటం వలన కొందరికి కలిగినది! నిమి విషయం కూడా ఇటువంటిదే. ఇక్ష్వాకు వంశంలోని ఒక మహారాజు (అనరణ్యుడు) రావణునికి శాపం ఇచ్చినది (తన వంశంలోనే ఉద్భవించేవాడు అతన్ని సంహరిస్తాడన్నది) కృతయుగంలోని మాట.

శ్రీరాముడు మానవ రూపంలో కేవలం త్రేతాయుగానికి చెందినవాడు. విభీషణుడు, జాంబవంతుడు, ఆంజనేయుడు యుగాంతరాలకు చెందినవారు! ఇది గమనించాలి.

శ్లో:

ఇక్ష్వాకుపరిభావిత్వాద్వచో వక్ష్యామి రాక్షస।

యది దత్తం యది హుతం యది మే సుకృతం తపః।

యది గుప్తాః ప్రజాః సమ్యక్తదా సత్యం వచోస్తు మే॥

ఉత్పత్స్యసే కులే హ్యస్మిన్నిక్ష్వాకుణాం మహాత్మనామ్।

రామో దాశరథిర్నామ యస్తే ప్రాణాన్ హరిష్యతి॥

(ఉత్తరకాండ, 19. 29, 30)

అనరణ్యుడు: “రావణా! నేను పాత్రులకే దానధర్మములను చేసియున్నచో, పరార్థ బుద్ధితో యజ్ఞయాగములను ఆచరించి యున్నచో, దృఢదీక్షతో తపమొనరించియున్నచో, కన్నబిడ్డల వలె ప్రజలను రక్షించుచు జనరంజకముగా పరిపాలన సాగించియున్నచో పలుకబోవుచున్న నా మాటలు సత్యమగు గాక!

సుప్రసిద్ధమైన మా ఇక్ష్వాకు వంశమున ఎందరో మహావీరులు ఉద్భవించారు. అట్టి వంశమున దశరథునకు కుమారుడిగా మహాత్ముడగు శ్రీరాముడు అవతరించును. అతను నీ ప్రాణములను తీయగలడు”.

..ఈ సంగతి యుద్ధకాండలో స్వయంగా రావణుడే గుర్తు చేసుకున్నాడు. ఆ సంగతి ఏమిటో మరి వాల్మీకి చెప్పవలసి ఉంది కాబట్టి ఉత్తరకాండలో తెలిపాడు. బ్రహ్మ, మరీచి, కాశ్యపుడు, సూర్యుడు, వైవశ్వత మనువు – ఈ ఐదుగురి తర్వాత ఇక్ష్వాకు మొదటి అయోధ్యాపతి. ఇక్ష్వాకు తరువాత ఐదవ వాడు అనరణ్యుడు. అనరణ్యుని తరువాత వచ్చినవాడు పృథువు.

శ్లో:

శూర్పణఖ్యాశ్చ భర్తారమసినా ప్రాచ్ఛినత్తదా।

శ్యాలం చ బలవంతం చ విద్యుజ్జిహ్వం బలోత్కటమ్॥

జిహ్వయా సంలిహంతం చ రాక్షసం సమరే తథా।

తం విజిత్య ముహూర్తేన జఘ్నే దైత్యాంశ్చతుః శతమ్॥

(ఉత్తరకాండ, 23. 18, 19)

దశననుడు శూర్పణఖకు భర్తయు, తనకు బావమరిది యగు బలశాలియైన విద్యుజ్జిహ్వుని తన ఖడ్గంతో ఖండించాడు. తన జాతి వారైన రాక్షసులనే భక్షించుచూ వచ్చాడు! ఆ తరువాత నాలుగు వందల మంది దైత్యులను క్షణకాలంలో సంహరించాడు!

..ఈతడు రావణబ్రహ్మయా?!

శ్లో:

యస్మాదేష పరక్యాసు రమతే రాక్షసాధమః।

తస్మాద్వై స్త్రీకృతేనైవ ప్రాప్స్యతి దుర్మతిర్వధమ్॥

(ఉత్తరకాండ, 24. 20)

తపశ్చర్యల వలన గొప్ప శక్తులను సంపాదించినను ఆ పరాక్రమముతో దుష్కార్కాలకి తలపడుతూ, పరస్త్రీల దుర్బలురైన భర్తలను వధిస్తూ, ఆ స్త్రీలతో బలవంతంగా రమిస్తూ వచ్చాడు రావణుడు. ఆ స్త్రీలు రావణుని ఇలా శపించారు.

ఈ రాక్షసాధముడు పరస్త్రీలపై కోరిక కలిగియున్న కారణమున ఈ దుర్మతికి స్త్రీ మూలముననే మరణము ప్రాప్తించును.

శ్లో:

ధర్మతో యో భవేద్విప్రః క్షత్రియో వీర్యతో భవేత్।

క్రోధాద్యశ్చ భవేదగ్నిః క్షాంత్యా చ వసుధాసమః॥

(ఉత్తరకాండ, 26. 34)

రావణుడు రంభను సంగమానికి బలవంతం చేసాడు.

రంభ: (నీవు తండ్రి లాంటి వాడవు. నా భర్త నలకూబరుడు) నా భర్త బ్రాహ్మణుని వలె ధర్మానుష్ఠానపరుడు, క్షత్రియుని వలె పరాక్రమశాలి, క్రుద్ధుడైనచో అతడు అగ్ని వలె దహించివేయగలడు, సహనంలో భూదేవితో సమానుడు.

అయినా వినలేదు రావణుడు. రంభతో బలవంతంగా సంగమించాడు.

నలకూబరుడు శపించాడు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here