[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ఆదిపర్వము-మూడవ ఆశ్వాసము ప్రారంభము
పాండవులు, కౌరవుల మధ్య వైరము
[dropcap]జ[/dropcap]నమేజయుడు చేస్తున్న సర్పయాగాన్ని పూర్తిగా చెయ్యనివ్వక మధ్యలోనే ఆపించేశాడు ఆస్తీకమహర్షి. మధ్యలోనే ఆపేసినా జనమేజయ మహారాజు ఎవరికీ ఎటువంటి లోటూ రానివ్వలేదు. యాగం నిర్వహిస్తున్న ఋత్త్విక్కులకి, యాగం సరిగా జరుగుతోందో లేదో పరీక్షించే వ్యాసుడు మొదలైన మహర్షులకి శాస్త్ర ప్రకారం సంభావనలిచ్చి గౌరవించాడు. పేదలందరికీ ధనాన్ని పంచాడు. యజ్ఞవిధులు పూర్తిచేశాక జనమేజయుడికి ప్రాచీనమైన గొప్పదైన భారత కథ వినాలని అనిపించింది.
గొప్ప తపస్సంపన్నుడు, పరాశరుడి కుమారుడు, బ్రహ్మర్షుల్లో ముఖ్యుడు; దయామయుడు; కురుకుల పితామహుడు; లోక కళ్యాణకారకుడు; కృష్ణాజినం కట్టుకున్నవాడు; నల్లటి మేఘం వంటి రంగుతో ఉన్న శరీరము, తగినంత ఎత్తు, రాగిరంగుతో ఉన్న జడలతో ఉన్నవాడు; అభిమానము, ద్వేషము రెండూ లేనివాడు; అసూయ తెలియనివాడు; గొప్ప గొప్ప మహర్షుల్ని శిష్యులుగా కలిగినవాడు; చుట్టూ అనేకమంది మహర్షులతో కూడి ఉండే వ్యాసభగవానుడు బంగారంతోను, మణులతోను చెయ్యబడిన ఎత్తైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
మొదట పూజ్యుడైన వ్యాసమహర్షికి నమస్కరించాడు జనమేజయుడు. తరువాత ఆయనతో “పూజ్యులైన మహర్షీ! మీతో పాటు భీష్ముడు మొదలైన కురువంశ పెద్దలందరూ దగ్గర ఉండి పాండవులకి, కౌరవులకి తోడుగా ఉంటూ రాజ్యసంపదని పంచి ఇచ్చారు. వాళ్లు ఎవరి రాజ్యాన్ని వాళ్లు పాలించుకుంటూ ఉన్నారు. అంతలోనే ప్రజలందరూ నాశనమయ్యేటట్లు భారతయుద్ధాన్ని ఎందుకు మొదలుపెట్టారు? పెద్దల మాట వినాలి కదా? మరి మీరు చెప్పినట్టు వాళ్లు ఎందుకు వినలేదు? యుద్ధం జరుగుతుందని తెలిసి కూడా మీరందరూ వాళ్లని ముందే ఎందుకు ఆపలేకపోయారు? అసలు ఈ కలహం ఎందుకు వచ్చింది? జరిగిన విషయాలన్నీ దయచేసి నాకు వివరంగా చెప్పండి!” అని అడిగాడు.
గొప్ప పరాక్రమవంతులు; ధైర్యము, వివేకము కలిగినవాళ్లు; ఎప్పుడూ నిజాన్నే పలికేవాళ్లు; కీర్తివంతులు; కృతజ్ఞత తెలిసినవాళ్లు; ఉత్తములు, ధర్మప్రవర్తన కలవాళ్లు; శరణు వేడినవాళ్లని రక్షించేవాళ్లతో ప్రసిద్ధమైన భారత వీరుల సద్గుణాలతో కీర్తించబడిన, ప్రాచీనమైన బారతకథని జనమేజయుడికి వినిపించమని వేదవ్యాసుడు వైశంపాయనుడితో చెప్పాడు.
వైశంపాయనుడు తన గురువు వేదవ్యాసుడికి నమస్కారం చేసి భారత కథని చెప్పడం మొదలుపెట్టాడు. జనమేజయ మహారాజు గొప్ప భక్తి శ్రద్ధలతో వింటున్నాడు. యాగం చూడ్డానికి వచ్చినవాళ్లు అందరూ కూడా వైశంపాయనుడు చెప్తున్న భారత కథని వినడానికి సిద్ధంగా కూర్చున్నారు.
పాండురాజు మరణించాక ఆయన కుమారులు పాండవులు హస్తినాపురం వచ్చి అక్కడే ఉండిపోయారు. కౌరవులతోపాటు వేదాలు, ధనుర్విద్య నేర్చుకుని జ్ఞానాన్ని సంపాదించారు. వాళ్ల గుణగణాల్ని అందరూ పొగుడుతుంటే కౌరవులు భరించలేక పోయారు. శకుని, కర్ణుడు, దుశ్శాసనుడు మొదలైనవాళ్లు చెప్పిన మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులకి హాని చేస్తుండేవాడు. పాండవుల ధర్మప్రవర్తనే వాళ్లని కాపాడుతూ ఉండేది.
ఒకరోజు భీముడు నీళ్లల్లో ఆడుకుని అలిసిపోయి ‘ప్రమాణకోటి’ అనే ప్రదేశంలో నిద్రపోతున్నాడు. దుర్యోధనుడు భీముణ్ని చెట్ల తీగలతో కట్టేసి గంగానదిలోకి పడేశాడు. అతి బలవంతుడైన భీముడు మెలుకువ రాగానే గట్టిగా ఒళ్లు విరుచుకున్నాడు. చెట్ల తీగలన్నీ ఒక్కసారిగా తెగిపోయాయి. వెంటనే నదిలోంచి బయటకి వచ్చేశాడు. మరొకసారి నిద్రపోతున్న భీముణ్ని నల్ల తాచుతో కరిపించారు. వజ్ర శరీరం ఉన్న భీముడి శరీరంలోకి పాము దంతాలు దిగబడలేదు. ఇంకొకసారి భీముడు తింటున్న అన్నంలో విషం కలిపారు. భీముడు దివ్యపురుషుడు కనుక అతడు తిన్న అన్నంతో పాటే విషం కూడా జీర్ణమై పోయింది.
చివరికి పాండవులందర్నీ కలిపి చంపాలనుకున్నారు. దుర్యోధనుడు పాండవుల కోసం ‘వారణావతము’ అనే ఊళ్లో లక్కతో ఒక ఇల్లు కట్టించి ఇచ్చాడు. పాండవులు ఆ ఇంట్లోకి వెళ్లగానే దానికి నిప్పంటించమని చెప్పాడు. కాని, విదురుడి సలహా ప్రకారం పాండవులు ఒక సొరంగ మార్గం నుంచి బయటకు వచ్చి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ధర్మ ప్రవర్తన కలిగినవాళ్లని, మంచి నడవడిక కలిగినవాళ్లని, సత్యాన్నే పలికేవాళ్లని, ఇతరుల మంచిని కోరేవాళ్లని, గుణసంపన్నుల్ని, శత్రుత్వం లేకుండా అందరితో స్నేహంగా మెలిగేవాళ్లని భగవంతుడు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు.
లక్క ఇంట్లోంచి క్షేమంగా బయటపడి, పాండవులు తల్లి కుంతితో కలిసి అడవిలోకి వెళ్లారు. అక్కడ హిడింబుడు అనే రాక్షసుడు పాండవుల్ని చంపబోయాడు. భీముడు ఆ రాక్షసుణ్ని చంపి తన సోదరుల్ని తల్లిని కాపాడుకున్నాడు. తరువాత అతడి చెల్లెలు హిడింబని పెళ్లి చేసుకున్నాడు.
అక్కడినుంచి పాండవులు ఏకచక్రపురం చేరుకున్నారు. పాండవులందరు బ్రాహ్మణ వేషాలు వేసుకుని ద్రుపదుడి పట్టణానికి వెళ్లారు. అక్కడ జరుగుతున్న ద్రౌపదీ స్వయంవరంలో చేప రూపంలో ఉన్న మత్స్య యంత్రాన్ని అర్జునుడు కొట్టాడు. అక్కడకి వచ్చిన రాజులందర్నీ ఓడించి పాండవులు ద్రౌపదిని తీసుకుని ఇంటికి వచ్చారు. వ్యాసమహర్షి, తల్లి కుంతీదేవి ఇద్దరి ఆజ్ఞ ప్రకారం పాండవులు అయిదుగురు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు. ఒక సంవత్సరం ద్రుపదుడి పట్టణంలోనే ఉండిపోయారు.
ఆ విషయం తెలుసుకున్న కౌరవుల తండ్రి ధృతరాష్ట్రుడు పాండవుల్ని రప్పించి సగం రాజ్యం ఇచ్చాడు. వాళ్లని ఇంద్రప్రస్థ పురంలో ఉండమన్నాడు. పెదతండ్రి మాట ప్రకారం పాండవులు ఇంద్రప్రస్థ పురంలో ఉండి రాజ్యం చేస్తున్నారు.
అర్జునుడు ద్వారకా నగరానికి వెళ్లి శ్రీకృష్ణుడి చెల్లెలు సుభద్రని పెళ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకి అభిమన్యుడు అనే పేరుగల కొడుకు కలిగాడు. తరువాత అర్జునుడు అగ్నిదేవుడినుంచి రథాన్ని, గుర్రాల్ని, గాండీవమనే ధనుస్సుని, దేవదత్తమనే శంఖాన్ని, ఎన్ని బాణాలు తీసి ఉపయోగించినా అవన్నీ మళ్లీ వచ్చి చేరే అమ్ముల పొదిని పొందాడు. ఇంద్రుణ్ని ఓడించి ఖాండవనాన్ని దహిస్తున్న అగ్నికి సహాయపడ్డాడు.
ధర్మరాజు ‘మయుడు’ అనే పేరుగల రాక్షస శిల్పిని పిలిపించి సభా భవనాన్ని కట్టించుకున్నాడు. భీముడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయంతో దిగ్విజయ యాత్రకు వెళ్లి జరాసంధుణ్ని చంపేశారు. ధర్మరాజు గొప్ప రాజసూయ యాగం చేసి చక్రవర్తిగా ప్రకాశించాడు.
సుఖంగా జీవిస్తున్న పాండవుల్ని చూసి ఓర్వలేక దుర్యోధనుడు అతడి తమ్ముళ్లు, మేనమామ శకునితో కలిసి ధర్మరాజుని జూదం ఆడడానికి పిలిచారు. ముందుగా ఓడిపోయినవాళ్లు పన్నెండు సంవత్సరాలు అడవిలోను, ఒక సంవత్సరం ఎవరూ తమని గుర్తుపట్టకుండా ప్రజల మధ్యే పట్టణంలోను జీవిస్తూ ఉండాలని నియమం పెట్టుకున్నారు. కౌరవులు జూదంలో ధర్మరాజుని ఓడించి పాండవుల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టారు.
అర్జునుడు అరణ్యవాసం చేస్తూనే ఒక ఉత్తముడైన గురువు ద్వారా అడవిలో ఉపదేశం పొందాడు. తరువాత గొప్ప తపస్సు చేసి శివుణ్ని, బాహుపరాక్రమంతో ఇంద్రుణ్ని ప్రసన్నం చేసుకున్నాడు. పాశుపతంతో పాటు అనేకమైన దివ్య బాణాలు కూడా పొందాడు. పన్నెండేళ్లు అరణ్యంలోను, అజ్ఞాతంగా ఒక సంవత్సరం ప్రజల మధ్య జీవించి అతి కష్టంతో పాండవులు పదమూడేళ్లు గడిపారు. మంచి ప్రవర్తన కలిగిన పుణ్యాత్ములైన పాండవులు తిరిగి వచ్చిన తరువాత తమ రాజ్యాన్ని తమకి ఇమ్మని అడిగారు.
కౌరవులు పాండవులకి రాజ్యం ఇవ్వలేదు. పాండవులు కనీసం అయిదు ఊళ్లయినా ఇమ్మని అడిగారు. అందుకు కూడా కౌరవులు అంగీకరించలేదు. ఇదే కౌరవ పాండవుల మధ్య వైరానికి కారణమైంది, భారత యుద్ధానికి దారితీసింది.
ఉపరిచర వసుమహారాజు చరిత్ర
వైశంపాయనుడు జనమేజయ మహారాజుకి వేదవ్యాసుడి జన్మవృత్తాంతం చెప్తున్నాడు.
“చేది దేశానికి రాజు వసువు. అతడు దేవేంద్రుడితో సమానమైన పరాక్రమము, సంపదలు కలిగినవాడు. ప్రజలకి ఏ కష్టమూ రాకుండా ఆదుకునేవాడు. అతడు ఒకరోజు వేటకోసం అడవికి వెళ్లాడు. అక్కడ ఒక మహర్షి ఆశ్రమాన్ని చూసి తను కూడా వైరాగ్యభావాన్ని పెంచుకున్నాడు. అప్పటికప్పుడే అతడిలో తపస్సు చేసుకోవాలన్న కోరిక పెరిగింది. ధనుస్సు బాణాలు వదిలిపెట్టి అక్కడే ఉండి తపస్సు చేసుకోడం ప్రారంభించాడు.
ఒకరోజు ఇంద్రుడు అతడి దగ్గరికి వచ్చాడు. “రాజా! నువ్వు వర్ణాశ్రమ ధర్మాల్ని అనుసరించి రాజ్యాన్ని పాలిస్తున్నావు. ప్రజల్ని, రాజ్యాన్ని వదిలేసి ఇలా తపస్సులో ఉండిపోతే నీ ప్రజల్ని ఎవరు ఆదుకుంటారు? నువ్వు చేస్తున్న తపస్సుకి నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు రాజ్యపాలన మానేస్తే ప్రజలు ఇబ్బందులు పడతారు. రాజ్యపాలన చేస్తూనే నాతో స్నేహంగా ఉంటూ నా దగ్గరికి వస్తూ పోతూ ఉండు!” అని చెప్పాడు.
తరువాత అతడికి దివ్యత్వాన్ని; బంగారంతోను మణులతోను తయారైన విమానాన్ని; ఇతర ఆయుధాల వల్ల హాని కలగకుండా ఉండడం కోసం ఎప్పుడూ వాడిపోకుండా ఉండే పద్మాలతో ఉన్న ఇంద్రమాలని; చెడ్డవాళ్లని శిక్షించడానికి, మంచి వాళ్లని రక్షించడానికి ఉపయోగించే వేణుయష్టినీ ఇచ్చాడు. వసురాజు ఇంద్రుడు ఇచ్చిన విమానాన్ని ఎక్కి పై లోకాల్లో కూడా తిరుగుతూ ఉండేవాడు. అందువల్ల అతడు ‘ఉపరిచరుడు’ అని పిలవబడ్డాడు.
ప్రతి సంవత్సరం ఇంద్రమాలకి, వేణుయష్టికి ఉత్సవాన్ని జరిపిస్తూ ఈశ్వరుడికీ, ఇంద్రుడికీ సంతోషం కలిగించేవాడు. అప్పటి నుంచి రాజులందరు ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవం జరిపించడం మొదలుపెట్టారు. ఇంద్రోత్సవం జరిపించడం వల్ల రాజులకి ఆయువు, వంశవృద్ధి కలుగుతుంది, రాజ్యంలో జీవించే ప్రజలకి సుఖసంతోషాలు కలుగుతాయి.
ఉపరిచరుడు జరిపించిన ఇంద్రోత్సవాలకి దేవేంద్రుడు ఎంతో సంతోషించాడు. ఇంద్రుడి వరం వల్ల ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే అయిదుగురు కుమారులు కలిగారు. వాళ్లు అయిదుగురు అనేక దేశాలకి అధిపతులై వంశాన్ని వృద్ధిచేశారు. ఉపరిచరుడు రాజర్షిగా రాజ్యపాలన చేస్తున్నాడు.
అతడి నగరానికి దగ్గరలో ఉన్న ‘శుక్తిమతీ’ నది ‘కోలహలం’ అనే పర్వతం మీద ఇష్టాన్ని పెంచుకుంది. అందువల్ల ఆ పర్వతం నదిని ప్రవహించకుండా అడ్డుకుంది. ఉపరిచరుడు ఆ పర్వతాన్ని తన కాలితో తన్నాడు. పర్వతుడి వల్ల శుక్తిమతీ నదికి ‘వసుపదుడు’ అనే కుమారుడు, ‘గిరిక’ అనే కుమార్తె కలిగారు. శుక్తిమతీనది ఉపరిచరుడికి తన కుమారుణ్ని, కుమార్తెని కానుకగా ఇచ్చింది. ఉపరిచరుడు వసుపదుణ్ని తన సేనాపతిగాను, గిరికని ధర్మపత్నిగాను స్వీకరించాడు.