[శ్రీ వెంపరాల దుర్గాప్రసాద్ రచించిన ‘వినాయకుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]భా[/dropcap]స్కర్‍కి ఎప్పటి నుంచో ఆ ఏరియాలో ఇల్లు కొనాలని కోరిక. పైగా అతని భార్య రమ్య ఎప్పటి నుంచో అడుగుతోంది. 20 రోజులకి పూర్వం ఒక ఇల్లు చూసేడు. భాస్కర్ ఒక ప్రైవేట్ కంపెనీలో సివిల్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. దానవాయి పేటలో తన ఆఫీస్‌కి దగ్గరగా ఉంటుంది అని, పైగా తమ అభిరుచికి తగ్గదిగా ఉండడంతో ఆ ఇల్లు దంపతులిద్దరికీ బాగా నచ్చింది. అందుకే వెంటనే ఎగ్రిమెంట్ చేసేసుకున్నారు. 60 లక్షలకి బేరం కుదిరింది. 40 లక్షలకి లోన్ తీసుకున్నాడు. లోన్ కూడా శాంక్షన్ అయిపొయింది. మరో 10 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టుకుందామని అనుకున్నారు. ఇంతలో ఓనర్ సప్తగిరి గారి నుండి కబురు వచ్చింది. వీలయితే, 2 రోజుల్లో రిజిస్ట్రేషన్ పెట్టేసుకోమన్నారు. ఓనర్ ఎందుకు అంత తొందర పెడుతున్నారో అర్థం కాలేదు. అయినా, లోన్ శాంక్షన్ అయిపోవడంతో సరే అన్నాడు.
అనుకున్నట్లే రెండు రోజుల్లో రిజిస్ట్రేషన్ అయిపొయింది. ఇంటివాళ్ళు తాళాలు ఇచ్చేరు. ఇల్లు తాళం తీసి, ఇల్లంతా కలియ తిరిగాడు భాస్కర్. ఈ మధ్యే ఇల్లంతా రంగులు వేయించేరేమో, పెద్దగా రిపైర్స్ చేయించక్కర్లేదు. ఇల్లు మొత్తం ఒక సారి ఆసిడ్ వాష్ చేయించుకుని, చిన్న చిన్న డెకొరేషన్స్ చేసుకుని ఇంట్లో దిగేయచ్చు.
ఓనర్స్ ఇల్లు మొత్తం ఖాళీ చేసేసేరు కానీ, ఒక పెద్ద వినాయకుడి ఫోటో మాత్రం తీసుకెళ్ల లేదు. 4, 5 రోజుల తర్వాత వచ్చి తీసుకెళతారని చెప్పేరు.
అది యెంత పెద్ద పటం అంటే, 5 అడుగుల వెడల్పు, 8 అడుగుల పొడుగు, 6 అంగుళాల మందం వుంది. గోడకి నిలువెత్తుగా ఒక స్టాండ్ మీద నిలబెట్టబడి వుంది. చాలా ఆకర్షణీయంగా, అందంగా వుంది. రిజిస్ట్రేషన్ అయిన వారం రోజుల్లో కొత్త ఇంట్లో పాలు పొంగించుకుని దిగిపోయేరు భాస్కర్ దంపతులు. తెలిసిన కొద్ది మంది ఫ్రెండ్స్‌ని, చుట్టాలని మాత్రమే పిలిచి విందు ఇచ్చేడు.
స్నేహితుడు సుధీర్‌ని కూడా పిలిచేడు. సుధీర్ ఏసీబీలో DSP గా చేస్తున్నాడు. స్నేహితుడి కోసం ఆరోజు క్యాంపు మానుకుని మరీ వచ్చేడు సుధీర్. సుధీర్‌కి సప్తగిరి గారిని ఆ రోజు విందులో పరిచయం చేసేడు. సుధీర్‌ని ఉద్యోగ రీత్యా ఎప్పుడూ ఏసీబీలో పని చేస్తున్నట్లు చెప్పకూడదు కనుక ఏదో ప్రైవేటు కంపెనీ పేరు చెప్పేసేడు.
పలకరింపుగా నవ్విన సుధీర్.. “బావుందండీ ఇల్లు, మంచి అభిరుచితో కట్టించారు” అన్నాడు.
బదులుగా నవ్వేసాడు సప్తగిరి.
ఇల్లంతా చూసిన అతిథులు చాలా బావుంది అన్నారు. అందరూ ముందు హాల్‌లో వినాయకుడి పటం చూసి మెచ్చుకున్నారు.
సుధీర్ కూడా అక్కడే ఆగిపోయేడు
నిలువెత్తు వినాయకుడి పటం చూసి సుధీర్ భాస్కర్‌ని అడిగేడు..
“బావుంది రా, ఇది ఎక్కడ చేయించేవ్..” అని.
“ఇది ఇంటి వాళ్ళదే రా.. 4 ,5 రోజుల్లో తీసుకుని వెళ్తామన్నారు”.
గృహప్రవేశం అయినాక కూడా ఆ పటం సప్తగిరి గారు తీసుకెళ్ల లేదు. భాస్కర్ కూడా ఒత్తిడి చెయ్యలేదు. అతనికి ఆ పటం చాలా నచ్చింది. పైగా హాల్‌లో నిలువెత్తు వినాయకుడి పటం ఉండడంతో ఇంటికి శోభ అని అనిపించింది. వీలయితే డబ్బిచ్చి కొనెయ్యాలని అతనికి, రమ్యకి అనిపించింది. ఆ రోజు కూడా సప్తగిరి గారితో ఆ మాటే అన్నారు.
“లేదండీ, మాకు కొంత సమయం కావాలి, ఆ పటం తీసుకెళ్లి పోతాం” అన్నాడు.
మూడు రోజులు గడిచేయి. ఆ రోజు మంగళవారం. గుడికి బయలుదేరుతున్న భాస్కర్ టీవీలో వార్త చూసేడు. చెంగల్రావు అనే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మీద ముందు రోజు ఏసీబీ రైడ్ అయిందిట. 2 కోట్ల ఆస్తులకి సంబంధించిన డాక్యుమెంట్స్, 80 లక్షల నగదు ఇంట్లో దొరికేయిట. అతని ఇంటితో సహా, బంధువుల ఇళ్ల మీద కూడా రైడ్ చేసేరుట. అక్కడ కూడా మరో 2 కోట్ల ఆస్తులకి సంబంధించిన పత్రాలు దొరికేయి అని ఆ వార్త సారాంశం. ఆ వార్తలో ముఖ్య విషయం ఏమిటంటే, ఆ దాడుల వివరాలు సుధీర్ ప్రెస్‌కి వివరిస్తున్నాడు.
మధ్యాహ్నం సుధీర్‌కి ఫోన్ చేసి అభినందించేడు.
“నేను నీతో ఒకసారి మాట్లాడాలి.. సాయంత్రం ఫ్రీగా వుంటావా” అన్నాడు సుధీర్.
“ఏమిటి విషయం?” అన్నాడు భాస్కర్.
“ఫోన్‌లో చెప్పేది కాదు. ఒక్కసారి కలువు” అన్నాడు.
“సరే” అన్నాడు భాస్కర్.
అర్థం కాలేదు భాస్కర్‌కి.. అంత సస్పెన్స్ ఏమిటో అని మనసులో అనుకున్నాడు.
సుధీర్‌ని పర్సనల్‌గా కలుసుకోవడానికి అతని ఇంటికి రాత్రి వెళ్ళేడు.
సాదరంగా లోపలి ఆహ్వానించేడు సుధీర్.
“నువ్వు ఎవరి ఇల్లు కొన్నావా తెలుసా?” అన్నాడు సుధీర్.
“సప్తగిరి గారిది. నీకు పరిచయం కూడా చేసేను కదా” అన్నాడు భాస్కర్.
“విషయం చెపుతాను విను”, అని వివరించేడు సుధీర్:
“అది నిజానికి సప్తగిరి ఇల్లు కాదు. సప్తగిరి అనే వాడు చెంగల్రావుకి బినామీ. చెంగల్రావ్ హోసింగ్ కార్పొరేషన్‌లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. పెద్ద అవినీతిపరుడు. నిన్న పట్టుకుంది వాడినే. మా డైరెక్టర్ గారి ఆదేశాలతో నిన్న వాడిని పట్టుకోగలిగేం. ఆ ఇంట్లో కొన్ని ఫోటోలు దొరికేయి. అక్కడ అనుమానం వచ్చింది సప్తగిరి వాడి బినామీ అని. అయితే, నువ్వు సప్తగిరి దగ్గర ఇల్లు కొన్నావు కదా, నీకు ఇబ్బందులు రాకూడదని, వాడి విషయం బయటికి రాకుండా చూసుకుని, ఇప్పటికి, పని ముగించేను. నేను మా రేంజ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి వెళ్లడంతో నీకు కొంత అనుకోకుండా, హెల్ప్ చేయగలిగేను. సప్తగిరిని సీన్ లోకి ఇప్పటిదాకా లాగకుండా చూసేను కానీ, ఎప్పటికయినా ఇబ్బంది రావచ్చు. చెంగల్రావుకి వూళ్ళో చాలా ఆస్తులు వున్నాయి. రాజకీయ నాయకుల అండదండలతో దొరకకుండా కొన్ని ఏళ్ళుగా తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు.
ఎందుకయినా మంచిది, ఒక సారి మీ ఇంట్లో ఏమయినా రహస్య వివరాలు దొరుకుతాయేమో అని నేను పర్సనల్ గా వచ్చి..” అన్నాడు సుధీర్.
భాస్కర్ విస్తుపోయేడు. ఒకింత భయం కూడా వేసింది. “ఈ ఇల్లు కొన్నాను.. ఫర్వాలేదా” అన్నాడు.
“లీగల్‍౬గా అన్నీ బాగానే ఉంటే, నీకు ఏ ఇబ్బంది ఉండదు లే” అన్నాడు సుధీర్.
“నేను లీగల్‌గా అన్నీ వెరిఫై చేసుకునే కొనుక్కున్నాను. పైగా బ్యాంకు లోన్ ఇచ్చింది అంటే, లీగల్ వెరిఫికేషన్ చేసుకుంటారు కదా” అన్నాడు భాస్కర్..
“నేను కావాలనే, సప్తగిరి ఇంటిమీద దాడి చేయలేదు. నీకు అమ్మిన ఇల్లు వివరాలు బయటపడి, లేని పోని ఇబ్బందులు నీ దాకా రాకూడదని నా ఉద్దేశం. పైగా, నేను చెంగల్రావుతో చెప్పించిన విషయాల్లో సప్తగిరి గురించి తప్ప మిగిలిన విషయాలు చెప్పేడు. దాంతో నాకు కూడా సులువు అయింది. నా అనుమానం మనసులోనే వుంచుకున్నాను..”
“అయితే.. సప్తగిరి కూడా నిన్ను తొందరపెట్టి తన పేరు మీద వున్న ఆస్తి నీ పేరు మీదకి మార్పించేసేడు. ఇక్కడే ఏదో అనుమానం కొడుతోంది..”
“మాకు దొరికిన ఆస్తులు మేము ఊహించిన దాని కంటే తక్కువగా ఉన్నట్లు అనుమానం వచ్చింది. ఒక లాకర్ తాళం దొరికింది. అందులో కూడా 50 లక్షలు నగదు, 2 కోట్లకి సంబంధించిన ఆస్తి పత్రాలు వున్నాయి. ఇంకా చాలా ఆస్తులు ఉండచ్చు చెంగల్రావ్ దగ్గర” అని, దీర్ఘంగా శ్వాస తీసుకుంటూ, మళ్ళీ ఇలా అన్నాడు:
“మా కస్టడీలో ఉండగానే, చెంగల్రావుకి హార్ట్ ఎటాక్ రావడం జరిగింది. ఇప్పుడు అపెక్స్ హాస్పిటల్‌లో జాయిన్ చేసేం. అయితే మీడియాకి ఇంకా ఆ వార్త రాకుండా చూసుకున్నాం. అతని పరిస్థితి సీరియస్‌గా వుంది. రాత్రి గడవాలి అన్నారు డాక్టర్స్”.
వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటుంన్నప్పుడు సడన్‌గా ఏదో స్ఫురించినట్లు సుధీర్ అడిగేడు:
“ఆ వినాయకుడి పటం తీసుకెళ్ళేడా సప్తగిరి?”.
“లేదు”. అన్నాడు భాస్కర్.
ఇంతలో భాస్కర్ ఫోన్ మోగింది.
భార్య రమ్య చేసింది. “ఇంటి పాత ఓనర్ గారు ఎవరినో పంపించేరు.. వాళ్ళు పటం తీసుకెళ్లడానికి వచ్చేరు.. మీరు వచ్చే వరకు ఆగమన్నాను” అంది.
ఆమెని లైన్‌లో ఉండమని, ఆ విషయం సుధీర్‍కి చెప్పేడు భాస్కర్.
“తీసుకెళ్ళిపోమని చెప్పు..”
“నేను వచ్చే వరకు ఆగక్కర్లేదు, తీసుకెళ్ళిపోమను” అని చెప్పేసేడు భాస్కర్ తన భార్యతో.
భాస్కర్ ఫోన్ కట్ చేసేక, సుధీర్ ఇలా చెప్పేడు:
“ఆ వినాయకుడి పటంలో ఏదో రహస్యం వుంది. నీ ఇంటి వద్ద సీన్ వద్దు. వాడి ఇంటి దగ్గర మనుషుల్ని పెడతాను. నేను, వాడిని ఫాలో అవుతాను” అన్నాడు సుధీర్. భాస్కర్‌ని బండి మీద ఇంటికి వెళ్లి పొమ్మన్నాడు.
అని.. వెంటనే, తన బృందానికి ఫోన్ లోనే సూచనలు చేసేడు. వృత్తి రీత్యా ఇన్‌స్పెక్టర్ స్థాయి అధికారి చాలు రైడ్ చేయడానికి. కానీ, ఇక్కడ సప్తగిరితో లావాదేవీలో వున్నది తన ఫ్రెండ్ భాస్కర్ అవడంతో జాగ్రత్తగా హేండిల్ చేస్తున్నాడు సుధీర్.
భాస్కర్ తన స్కూటర్ మీద ఇంటికి వెళ్లిపోయాడు.
భాస్కర్‌తో బాటే సుధీర్ కూడా బయలుదేరిపోయాడు.
తన జీప్ తీసి, ఇద్దరు కానిస్టేబుల్స్‌ని తీసుకుని భాస్కర్ ఇంటికి బయలుదేరేడు.
భాస్కర్ వాళ్ళ వీధి చివర జీప్ పక్కకి తీసి చీకట్లో ఆపుకున్నాడు. అక్కడినుండి భాస్కర్ ఇంటి ముందు దృశ్యం కనిపిస్తోంది. భాస్కర్ ఇంటి ముందు వాన్ ఆగి వుంది. అందులో వినాయకుడి పటం ఎక్కించి తాళ్లతో కట్టేసేరు. బయలుదేరుతున్నారు. వాన్ వీధి దాటగానే, నెమ్మదిగా ఫాలో అయ్యేడు.
సప్తగిరి ఇంటి వద్ద వాన్ ఆగింది. వాన్‌లో పటం ఇంట్లోకి చేరేవరకు ఆగేడు.
వెంటనే, తన బృందంతో రైడ్ చేసేడు.
అప్పటికే అక్కడ పొంచి వున్న ఒక ఎస్.ఐ. ముగ్గురు కానిస్టేబుల్స్ కూడా లోపలికి చేరేరు.
సప్తగిరి ఆ దాడి ఊహించలేదు.
అప్పటికి ఆ వినాయకుడి పటాన్ని ఓ గోడకి చేరవేసేరు వాళ్ళు.
అందర్నీ అన్ని వైపులా చుట్టుముట్టి, వినాయకుడి పటాన్ని పూర్తిగా పరిశీలించేరు. పటం వెనుక వైపు సీల్ కొద్దిగా చించేక, కింది వైపు చిన్న ఓపెనింగ్ కనపడింది. అందులోంచి ఒక చిన్న బాక్స్, పక్కనే నోట్ల కట్టలు కనిపిస్తున్నాయి. పటాన్ని దింపి, వెనుక వైపు పడుకో బెట్టి మొత్తం సిల్వర్ ఫాయిల్ సీల్ తీసేసేరు. సుధీర్ అనుమానం నిజమయ్యింది. ఆ చిన్న బాక్స్‌లో ఒక లాకర్ కీ కనపడింది. పక్కన పేర్చిన 500 రూపాయల నోట్ల కట్టలు లెక్కిస్తే, ఒక కోటి రూపాయలు వుంది.
సప్తగిరిని అరెస్ట్ చేసి, మర్నాడు కెనరా బ్యాంకులో లాకర్ తెరిచి చూస్తే, అసలు బండారం బైటపడింది. చెంగల్రావు మీద బలమైన కేసు పెట్టడం జరిగింది.
మర్నాడు పేపర్‌లో వివరాలు చదివేక భాస్కర్ అతని భార్య ఒక్కసారి ఉలిక్కి పడ్డారు. ఆ వినాయకుడి విగ్రహంలో దొరికిన లాకర్ కీ చెంగల్రావు గుట్టు మొత్తం విప్పింది. లాకర్‍లో పెద్ద మొత్తంలో బంగారం, వెండి, మరొక ఎనిమిది కోట్ల విలువైన ఆస్తులకి సంబందించిన డాకుమెంట్స్ దొరికేయి ఏసీబీ డిపార్ట్‌మెంట్ వాళ్ళకి.
‘వినాయకుడిని’ వుంచుకుందామని ఎన్ని సార్లు అడిగినా, సప్తగిరి ఎందుకు వప్పు కోలేదో ఇప్పుడు అర్ధం అయింది భాస్కర్, రమ్య లకి .
మర్నాడు ఆపుకోలేక, సుధీర్ కి ఫోన్ చేసి “ఇల్లు అమ్మిన వెంటనే, సప్తగిరి ఆ పటం ఇక్కడ నుండి ఎందుకు పట్టుకెళ్ళలేదు.. నాకు అర్థం కాలేదు..”. అన్నాడు.
సుధీర్ ఇలా సమాధానం చెప్పేడు:
“చెంగల్రావు దేవాంతకుడు. ఎప్పుడయినా దాడి చెయ్యచ్చన్న సంకేతం ఏదో వుంది.. అందుకే వెంటనే ఆ పటం వెనుకకు తెప్పించలేదు. వాడిమీద రైడ్ అయ్యేనాటికి సప్తగిరి నుండి ఇల్లు నీ పేరు మీదకి మారిపోయింది. నెమ్మదిగా తరలిద్దాం అనుకున్నాడు.
పైగా మీ ఇంట్లో ఉంటే అది మరింత సేఫ్, మీరు ఆ పటాన్ని మరింత జాగ్రత్తగా చూసుకుంటూ పూజలు చేస్తారు, అని వాడు భావించేడు.
మా రైడ్‌లో సప్తగిరి ప్రస్తావన లేకపోవడంతో, ఇంక సప్తగిరి సేఫ్ అనుకుని, వాడి సొంత నిర్ణయం తీసుకుని, మీ ఇంటి నుండి తెప్పించుకున్నాడు.. అదీ సంగతి.. పైగా అప్పటికి చెంగల్రావు హాస్పిటల్‌లో చావు బతుకుల్లో వున్నాడు. ఆ లాకర్ సప్తగిరి పేరు మీద వుంది కదా, చెంగల్రావుకి ఏదయినా అయిపోతే, ఈ లోపల లాకర్ చక్కపెట్టేద్దామని సప్తగిరి ప్లాన్..” అన్నాడు సుధీర్.
అవినీతి మకిలికి ‘వినాయకుడిని’ కూడా ఇలా వాడేసుకున్నారని బాధ పడ్డాడు భాస్కర్.
సమాప్తం