సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-17

0
3

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[తన దర్పాన్నంతా మేనమామ భుజంగరావుకి చూపించాలని అట్టహాసంగా పల్లెటూరికి వస్తాడు ధర్మారావు. తను తీసిన సినిమాలో హీరోని వెంటపెట్టుకుని మరీ వస్తాడు. సినిమా హీరోని చూడడానికి గ్రామస్థులంతా ఎగబడతారు. నిర్మాతకీ, హీరోకి ఆ గ్రామంలో ఉండడానికి బసతో పాటు అన్ని ఏర్పాట్లు చేస్తారు  మధు, అతని స్నేహితులు. ధర్మారావు మేనమామ ఇంటికి వెళతాడు. ఆ సమయంలో భుజంగరావు ఇంట్లో ఉండడు. ఆయన కూతురు తాయారు ఒక్కర్తే ఉంటుంది. వెళ్ళి ఆమెను బావున్నావా అని పలకరిస్తాడు ధర్మారావు. మొదట తాయారు అతన్ని గుర్తుపట్టదు. నేను నీ బావ ధర్మారావుని అని చెప్తాడు. ఆమె అందంగా ఉందని పొగుడుతాడు. తాయారు తిరిగి తనని పొగడనందుకు బాధపడ్తాడు. సినీఫీల్డు మీద తనకి మంచి అభిప్రాయం లేదని చెప్తుంది తాయరు. కాసేపు తయారుతో వాదిస్తాడు. రాజకీయ రంగంలోనూ అవినీతి ఉందనీ, మీ నాన్న కూడా అవినీతిపరుడేనని అంటాడు. తాయారుని పెళ్ళి చేసుకోవాలన్న కోరికని వెల్లడిస్తాడు. ఆమె కాదంటుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చిన భుజంగరావు వాళ్ళ సంభాషణంతా వింటాడు. భుజంగరావు సినీ రంగంలోనివి, ధర్మారావు రాజకీయ రంగం లోనివి లోపాలను ఎత్తి చూపుకుంటారు. తనకి, తాయారుకి పెళ్ళి చేయమని అడుగుతాడు ధర్మారావు. కుదరదంటాడు. కోపంతో బయటకు వెళ్ళిపోతాడు ధర్మారావు. జిల్లా పరిషత్ ఛైర్మన్ అయిన భుజంగరావు అనుచరుడు సిద్ధూ మేనమామ శంకరం. అందరు రాజకీయ నాయకుల వలె కాకుండా భుజంగరావులో కొద్దో గొప్పో మానవత్వం ఉంది. అదే లక్షణం తాయారుకి అబ్బింది. తాయారు, సుందరి స్నేహితురాళ్ళు. సుందరిని చదువు మీద దృష్టి పెట్టమని తాయారు చెప్పినా పట్టించుకోదు. తన బావ అయిన ధర్మారావు బాల్యం నుంచే చెడు మార్గం పట్టడాన్ని జ్ఞాపకం చేసుకుంటుంది. అతని గురించి ఆలోచిస్తుంటే తండ్రి వచ్చి, ఏంటి ఆలోచిస్తున్నావని అడుగుతాడు. బావ గురించేనని, అతను సుందరికి మాయమాటలు చెప్పి వలవేస్తున్నాడని అంటుంది. ఆ సంగతేంతే చూడాలని బయటకు వెళ్తాడు భుజంగరావు. ఇక చదవండి.]

అధ్యాయం-33

[dropcap]ఈ[/dropcap] లోకంలో మానవుల స్వభావాలు సంబంధాలు చాలా విచిత్రమైనవి. తమది అన్న వస్తువయినా, తన వాళ్ళు అనుకున్న వాళ్ళకి హాని జరుగుతూ ఉంటే మనుష్యులు స్పందిస్తారు. వాళ్ళ ఆ స్పందన వాళ్ళ భావోద్వేగాన్ని తెలియజేస్తుంది. అదే పై వాళ్ళకి, పై వాళ్ళ వస్తువుకి హాని జరిగినా అంత స్పందించరు. అక్కడే భావోద్వేగంలోని తేడా మనకి తెలుస్తుంది. మనిషి ఇలా స్పందించిన వస్తువుతోనూ, మనిషితోనూ అతనికి అవినాభావ సంబంధం ఉన్న విషయం తేటతెల్లమగుతుంది.

మధు కూడా అటువంటి స్పందనకే గురయ్యాడు. తను ఇంత వరకూ ధర్మారావును రాసుకు పూసుకుని తిరిగాడు. అవసరం మించి అతడ్ని ఓ సినీ నిర్మాతగా అందలం ఎక్కించాడు. ఆదరించాడు. సన్మానాలు చేసి ఎక్కువ డబ్బు కూడా ఖర్చుపెట్టాడు. తన శ్రమను కూడా ధారబోసాడు.

అయితే ఈ మధ్యనే మధులో ధర్మారావు యడల చిన్న అనుమానం ఆవగింజంత అనుమానం అలా పెరుగుతూనే ఉంది. అతని మనస్సు అడుగు పొరల్లో అతని కేరక్టరు మీద చిన్న సందేహం – అపోహ. దానికి తోడు అతనితో సుందరి అతి చనువుగా తిరగడం అతనికి నచ్చలేదు.

ఈ విషయం గురించే సుందరి మధుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. వాళ్ళిద్దరూ వాదించుకునేవారు. ఓ రోజు ధర్మారావు కారులో సుందరి దగ్గర్నే ఉన్న పట్నానికి వెళ్తుంది. ఆమెకి ఏదో జరగరానిది ఏదో జరగబోతోంది అన్నట్టు మధు మెదడులో ఆలోచన. మనస్సులో బాధ. ఏదో ఆపద సుందరికి రాబోతోంది అన్న భావం అతనిలో టెన్షన్‌ను మరింత పెంచుతోంది.

ధర్మారావు వాహనం వెనకనే తన బండితో ఫాలో అవుతూ మధు కూడా పట్నానికి బయలుదేరాడు. అక్కడ ఓ పేరున్న ఎ.సి. హోటల్ దగ్గర ధర్మారావు కారు ఆపాడు. ఆ హోటల్లోనే ఓ రూమ్‌లో అతని తీసే సినిమాలో నటించే యువ హీరో కూడా ఉంటున్నాడు.

సుందరితో కూడా ఆ హీరో గదిలోకి అడుగుపెట్టాడు ధర్మారావు. మొదటే ప్లాను వేసుకున్నట్టు ఆ గదిలో టిపాయి మీద మందు బాటిల్సు, గ్లాసులు, జీడిపప్పు పకోడీ అన్నీ ఉన్నాయి. ఆ యువ హీరో వీరిద్దర్నీ ఆహ్వానించాడు.

అక్కడ వాతావరణం సుందరికి అనుమానాన్ని భయాన్ని పెంచింది. ఆమెలో అంతర్మథనం ఆరంభమయింది. ఇక్కడ వాతావరణం ఏంటి ఇలా ఉంది? తను ఏఁ తొందరపాటు నిర్ణయం తీసుకోలేదు కదా? ఇలా ఆలోచిస్తోంది.

“ఏంటి ఆలోచిస్తున్నారు సుందరి గారూ!” ధర్మారావు మాటల్తో ఆలోచనా ప్రపంచం నుండి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

“అబ్బే! ఏం లేదు,” సుందరి మాటల్లో తడబాటును అతను గుర్తించి చిన్నగా నవ్వుకున్నాడు.

“సినీ ఫీల్డులో ఉన్నవాళ్ళకి ఇవన్నీ మామూలు విషయాలే! ఇలాంటి వాటికి అలవాటు పడాలి. ఇలాంటివన్నీ ఈ ఫీల్డులో ఉన్నవాళ్ళకి కొత్త కాదు. వాటి అన్నిటికీ అలవాటు పడిన వాళ్ళే ఈ ఫీల్డులో రాణిస్తారు,” యువ హీరో సుందరితో నవ్వుతూ అన్నాడు.

సుందరి మాత్రం ఆ సమయంలో తన మనస్సుకి అలా సర్దిచెప్పుకో లేకపోయింది. ఆమెకి అక్కడ వాతావరణం కంపరంగా ఉంది. తను ఈ పద్మవ్యూహం నుండి ఎంత తొందరగా బయటపడితే అంత మంచిది అని ఆలోచిస్తోంది. అక్కడ ఆమె పరిస్థితి అలా ఉంటే ఇవతల మధు పరిస్థితి మరో విధంగా ఉంది. అతని మనస్సంతా గజిబిజిగా ఉంది. ఈ సమస్యని ఎలా పరిష్కరించి సుందరిని ధర్మారావు నుండి రక్షించాలా అనేదే అతని ఆలోచన.

“ఏరా మధూ! ఏంటి నీవిక్కడ?”

ఆ మాటలు వచ్చిన వేపు చూశాడు మధు. ఎదురుగా సూర్యం. అతడ్ని చూడగానే మధుకి ఎక్కడి లేని ధైర్యం వచ్చింది.

“బాబాయ్! సుందరి..!” అని మరి మాట్లాడలేక మాటలు ఆపు చేశాడు.

“ఆఁ సుందరి..! సుందరికి ఏంటయింది?” సూర్యం మధుని రెట్టించి అడిగాడు.

మధు సంభాళించుకుని ధర్మారావు గురించి, అతను సుందరిని ఈ హోటల్‌కి తీసుకురావడం అన్ని విషయాలూ పూస గుచ్చినట్టు చెప్పాడు. సూర్యానికి పరిస్థితి అంతా అర్థమయింది. మధుని తీసుకుని హోటల్ మేనేజరు దగ్గరికి వెళ్ళి పరిస్థితి అంతా అంతా అతనికి వివరించాడు సూర్యం.

“ఇలా అంటున్నానని మీరు మరోలా భావించకండి. ఆ ధర్మారావు కూడా ఇలాంటి అలాంటి అల్లాటప్పా మనిషి మాత్రం కాదు. అతని ఓ సినీ నిర్మాత. సమాజంలో పలుకుబడి గౌరవంగా చెలామణి అవుతున్న మనిషి, అతనికీ ఓ హోదా ఉన్న వ్యక్తి. అతడ్ని మేము ఏమీ అనలేము సారీ! అయినా ఒక్క విషయం ఆడపిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి” అన్నాడు మేనేజరు వాళ్ళున్న గది నెంబరు చెప్తూ.

మేనేజరు అన్నదాంట్లో తప్పులేదనిపించింది సూర్యానికి. తన అన్న పెంపకం సరిగా లేనప్పుడు అందరితోనూ మాటలు పడవల్సివస్తోంది. వెంటనే అతనికి శకుంతల గుర్తుకు వచ్చింది. శకూ ఎంత అణుకువ వున్న అమ్మాయి. సుందరితో తన అన్నకి తలవంపులు కలుగుతుంటే శకూ వలన తమకి ఆనందం, గౌరవం లభిస్తున్నాయి. ఇలా సాగిపోతున్నాయి సూర్యం ఆలోచన్లు.

సూర్యం, మధు రూమ్ దగ్గరికి వెళ్ళారు. లోపల నుండి గ్లాసుల గలగల శబ్దం వినిపిస్తోంది. ఏదో ఐటమ్ సాంగ్ వల్గరుగా పెద్ద శబ్దంతో వినిపిస్తోంది. సూర్యం తలుపు బాదాడు. విసుక్కుంటూ తలుపు తెరచాడు. యువ హీరో. సుందరి నోట్లో బలవంతాన్న మందు పోయబోతున్నాడు. ధర్మారావు. సుందరి పెనుగులాడుతోంది. సూర్యాన్ని, మధుని బిక్కుబిక్కుమంటూ బిత్తరి చూపులు చూసింది. ఆమె కళ్ళల్లో భయం కొట్టొచ్చినట్టు అగుపడుతోంది. అక్కడి పరిస్థితి అంతా అర్ధమయింది సూర్యానికి.

తన వాళ్ళని చూసేప్పటికి సుందరికి ఆనందం, ధైర్యమే కాకుండా ఒక్కసారి దుఃఖం కూడా పొంగిపొర్లు కొచ్చింది. భావోద్వేగంతో ఊగిపోతోంది. ఒక్కసారి బయటకు పరిగెత్తుకొచ్చింది.

“నేను పోలీసు కంప్లైట్ ఇస్తాను. పెద్ద మనుష్యులుగా చెలామణీ అవుతూ ఆ ముసుగులో మీరు చేస్తున్న నిర్వాకం ఇదా?” అన్నాడు సూర్యం తీవ్రంగా.

“కంప్లైంటు ఇస్తే పరువుపోయేది మీ అమ్మాయిదే. నేనేం మీ అమ్మాయిని రమ్మనమని పిలవలేదు. మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి” మొండిగా అన్నాడు ధర్మారావు.

ఇటువంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలన్నా లాభం లేదు. తప్పు తమ వేపే ఉందని విషయం విన్న వాళ్ళందరూ అంటారు అని అనిపించింది మధుకి. అందుకే “బాబాయ్! మరి మాట్లాడకు. అనవసరంగా వాదనకి దిగొద్దు తప్పు మనదే అని అంటారు. వాళ్ళ పలుకుబడి అటువంటిది. అయినా సుందూ సేఫ్‌గా ఉంది కదా! అదే మనకి కావాలి. పోదాం పద,” అన్నాడు మధు సూర్యంతో. సూర్యానికి కూడా లేనిపోని తలనొప్పులు తెచ్చిపెట్టుకోవడం ఎందుకనిపించింది అందుకే మౌనంగా బయటకు నడిచాడు.

సూర్యం కోపం అన్నయ్య శంకరం మీదకి మళ్ళింది. “అన్నయ్యా! ఎంత సేపూ నీ లోకం నీదేనా? ఎప్పుడూ ఆ దిక్కుమాలిన రాజకీయాల్లో మునిగి తేలడమేనా? నీ పిల్లల్ని గురించి పట్టించుకోవా? నీ పిల్లలు ఏమైపోయినా అంతేనా? ఈ రోజు జరిగిన సంఘటన తలుచుకోడానికే ఒళ్ళు జలదరిస్తోంది. నేను మధుకి కనిపించకుండా ఉంటే, ఏ మాత్రం నేను అక్కడికి వెళ్ళడం ఆలస్యమయినా ఎంత అనర్థం జరిగి ఉండేదో తెలుసా? మన సుందరి బ్రతుకు బండలయ్యేది.”

శంకరం సూర్యం మాటలకి ఏఁ జవాబియ్య లేదు. సుందరి ప్రవర్తన తీరు తెలిసిన అతను కించిత్ ఆశ్చర్యపోలేదు. అయితే ఇవాళ ఏదో జరగరానిదేదో జరగవల్సింది అని సూర్యం ఆవేశంతో కూడిన మాటల వల్ల తెలుసుకున్నాడు.

తమ్ముడికి ఏం జవాబియ్యకుండా ఆలోచిస్తున్నాడు. తన అసమర్థత వల్లనే తన పిల్లలిద్దరూ ఇలా తయారయ్యారు. అక్కడికీ భుజంగరావు కూడా ఇదే మాట అన్నాడు. “ఏంటి శంకరం నీ కూతురు మా బడుద్దాయి అదే మా ధర్మారావుతో రాసుకు పూసుకుని తిరుగుతోందని మా అమ్మాయి తాయారు చెప్పింది. వాడితో జాగ్రత్త సుమీ! వాడేం అందరూ అనుకున్నంత మంచివాడేం కాదు” అని హెచ్చరించాడు.

అయితే తన కూతురూ, కొడుకూ తన చేయి జారిపోయారు. వాళ్ళ అమ్మ దగ్గర కొంచమయినా జంకూ భయం ఉన్నాయి కాని తన దగ్గర మాత్రం బొత్తిగా భయం లేదు. ఇద్దరికి ఇద్దరూ ఒక్కలాగే తయారయ్యారు.

“ఏం అన్నయ్యా! నీకు నా మాటలు వినిపిస్తున్నాయా?” సూర్యం రెట్టించి అడిగాడు శంకరాన్ని.

“ఆఁ.. ఆఁ.. నా వల్ల పెద్ద పొరపాటే జరిగిందిరా సూర్యం. నీవు శకూని మంచిగా అణుకువుగా ఉండేటట్లు పెంచావు. కాని నేను నా పిల్లల్ని అలా పెంచలేకపోయాను. అది నా బలహీనత – దౌర్భాగ్యం,” బాధగా అన్నాడు. భర్త మాటలు విన్న తరువాత కాత్యాయినికి ఎక్కడ లేని ధైర్యం వచ్చింది.

“నేను మొదట్నించి మీ అన్నయ్యతో చెప్తూనే ఉంటాను. అతనేం పిల్లల గురించి పట్టించుకోరు. ఇప్పుడు బాధపడి లాభమేంటి?” కాత్యాయిని అంది.

అధ్యాయం-34

మనం మనదైన రీతిలో ఉండగలిగితే జీవితం మనది అవుతుంది. మరొకరిలా ఉండాలనుకుంటే అది అత్యాశే. ప్రాపంచిక జీవితంలో పూర్తిగా మనకిష్టమైన రీతిలో మన కోరికలను కూలంగా సాగిపోలేం. జీవితంలో కొంత సర్దుబాటు తప్పదు. అలా చేస్తేనే సంతృప్తిగా జీవించగలం.

ఇంజనీరింగ్ కాలేజీలో కేంపస్ ఇంటర్వ్యూలు అయ్యాయి. సిద్ధార్థ సెలక్టు అయ్యాడు. ఆ ట్రేడు తీసుక్నువాళ్ళు నలుగురైదుగురు సెలక్టు అయ్యారు. రవి తీసుకున్న ట్రేడు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు లభించలేదు.

రవి అప్సెట్ అయ్యాడు. తను సెలక్టు కానందుకు కొద్దిగా బాధపడ్డాడు. సిద్ధార్థ సెలక్టు అయ్యాడు. అతనికి జాబ్ గ్యారంటీ. చాలా అదృష్టవంతుడు. దేనికైనా లక్ ఉండాలి. తనకా లక్ లేదు. అందుకే తను సెలక్ట్ కాలేకపోయాడు. సిద్ధార్థ సెలక్టు అయ్యాడు అని అనుకున్నాడు రవి. మరుక్షణంలోనే అతని ఆలోచనా విధానం మారింది. తనేంటి ఇలా ఆలోచిస్తున్నాడు? తన జీవితం తనదైన రీతిలో ఉంటేనే ఆ జీవితం మనది అని అనిపించుకుంటుంది. మరోలా మన జీవితం ఉన్నతంగా ఉండాలనుకోవడం అత్యాసే అవుతుంది. జీవితంలో కొంత సర్దుబాటు ఉండాలి. మన కోరికలికి కళ్ళాలు వేయాలి. అలా ఉన్నప్పుడే జీవితంలో సంతృప్తిని పొందగలం.

అయినా తను ఇలా సెల్ఫిష్ ఎలా ఆలోచిస్తున్నాడు? సిద్ధార్థ సెలక్టు అయ్యాడని తనకి జెలసీగా ఉందా? జీవన గమనానికి కావల్సింది. అసూయ కాదు. కాంపిటేషను వేరు, జెలసీ వేరు. అహింసా ప్రవృత్తి కాంపిటేషను అయితే జెలసీ హింసా ప్రవృత్తి. కాంపిటేషనులో సిద్ధార్థ విజయం సాధించాడు. అందుకు తను స్నేహితుడుగా సంతసించాలి. అంతేకాని భావ మనోవికారాల్లో ఒకటయిన ఈర్ష్యకి తన మనస్సులో స్థానం ఇయ్యకూడదు.

మన జీవితం ఒక వ్యవసాయ క్షేత్రం. దున్నేవాడిదే భూమి అన్నట్టుగా మనం దున్నగలిగితే ఈ జీవిత పంట మన చేతికొస్తుంది. సిద్ధార్థ కష్టపడ్డాడు. చదివాడు. అదృష్టం కూడా అతనికి కలిసి వచ్చింది. కష్టపడి వ్యవసాయం చేసిన రైతుకు పంట చేతికొచ్చినట్టు సిద్ధార్థకి కూడా జాబ్ చేతికి వచ్చింది అని అనుకున్నాడు రవి.

“రవీ! నీవు కేంపస్‌ ఇంటర్వ్యూలో సెలక్టు కానందుకు నాకు చాలా బాధగా ఉంది,” అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన సిద్ధార్థ. అతని మాటలకి ఒక్కసారి ఉలిక్కిపడి ఆలోచనా ప్రపంచం నుండి బయట పడ్డాడు రవి.

“సిద్ధూ! కంగ్రాట్స్” అన్నాడు రవి నవ్వుతూ. తను కేంపస్ ఇంటర్వ్యూలో సెలక్టు అవలేకపోయానే అన్న బాధ రవి ముఖంలో అగుపించడం సిద్ధార్థ గమనించాడు.

“నీవు సెలక్టు అయితే నేను సెలక్టు అవడం కాదా! అయినా నీవు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో నా కన్నా నీకే జాబ్ రావడం ముఖ్యం. ఈ సమయంలో నీ వాళ్ళకి నీ అండ ఎంతో ముఖ్యం,” అన్నాడు రవి సిద్ధార్థతో.

రవి మనసులోని అతని మాటల్లోని ఆ సమయంలో మాలిన్యం లేదు. అతని మాటల్లో నిజాయితీ ఉంది. ప్రస్తుతం తనున్న పరిస్థితుల్లో తనకి నిజంగా జాబు రావడం ఎంతో అవసరం. అదృష్టం కూడా అని అనుకున్నాడు సిద్ధార్థ.

“నా గురించి నీవు ఆలోచిస్తున్నావు కాని నీ గురించి నేను ఆలోచించవద్దా రవీ! నీ పరిస్థితి నా పరిస్థితి లాంటిదే కదా! మనిద్దరం ఒకే చెట్టు కొమ్మలం. బిందు ఇచ్చిన ఆర్థిక సహాయంతో నా చదువు సాగుతుంటే మీ అక్కయ్య చేయూతతో నీ చదువు సాగుతోంది. అందుకే నేను అనుకుంటున్నాను నీవు కూడా సెలక్టు అయితే ఎంత బాగుండేదని.”

“అక్క నన్ను ఎం.బి.ఏ కాని, ఎమ్.టెక్ కాని చదివిస్తుందిట” రవి సిద్ధార్థతో అన్నాడు.

తను సిద్ధార్థతో చిన్న అబద్ధం ఆడాడు. అసలుకి అక్కకి తనని పై చదువులు చదివించే ఆలోచన ఉందో లేదో? తాత్కాలికంగా వాతావరణాన్ని తేలిక పరచడానికి తను చిన్న అబద్ధం ఆడాడు, అనుకున్నాడు రవి.

అక్కయ్యని తలుచుకోగానే అతని హృదయాంతరాలలో సన్నటి బాధ తొంగిచూసింది. తన కుటుంబ బాగు కోసం అక్క ఇందిర తన జీవితాన్నే అదే తను కూడా పెళ్ళి చేసుకుని పిల్లా పాపల్తో సుఖంగా ఉండాలన్న జీవితాన్నే త్యాగం చేసింది. తను క్రొవ్వొత్తిలా కరిగిపోతూ క్రొవ్వొతి తన చుట్టూరా ఉన్న పరిసరాలకి వెలుగులు విరజిమ్మినట్టు అక్క కూడా తన జీవితం ఏమయినా తన వాళ్ళను ఆదుకుంది. వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపింది. తను మాత్రం మోడులా మిగిలిపోయింది.

“మీ అక్కయ్య గురించి ఆలోచిస్తున్నావా?” సిద్ధార్థ అడిగాడు రవిని.

“అవును.”

“అటువంటి అక్కయ్య ఉన్నందుకు నీవు చాలా అదృష్టవంతుడివి రవీ!” సిద్ధార్థ మాటలకి రవి కళ్ళల్లో సన్నటి – నీటి పొర తళుక్కున మెరిసింది. ప్రక్కకి తల తిప్పుకున్నాడు.

“అయితే ఒక్క విషయం. జీవన యానంలో ప్రతిరోజూ మన జీవితం గత దినంలాగే సుఖంగా గడిచిపోవాలను కోవడం అత్యాసే. మనం వర్తమానాన్ని కూడా నవ నవోన్మేషంగా భావించాలి. చూడగలగాలి. ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు మన జీవనయానం. బ్రతుకు భారం అనుకోకుండా బ్రతకవల్సింది మనం.”

సిద్ధార్థ మాటల్లోని మర్మాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తున్నాడు. రవి. ఇంతలో బిందూ, శకుంతల సిద్ధార్థకి అభినందనలు తెలియజేయడానికి అక్కడికి వచ్చారు. వాళ్ళని చూడగానే సిద్ధార్థ, మధు గంభీరమైన వాతావరణం నుండి బయటపడ్డారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here