[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘ఎదున గొడ్లు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]అ[/dropcap]ది పెద్ద కాలేరు. అక్కడ, ఆడపుట్టి పెరిగినోళ్ళు, పట్నాలకెళ్ళి వచ్చినోళ్ళు, పల్లెల్లకెళ్ళి వచ్చినోళ్ళు, అన్నితీర్ల మనుషులున్నరు. సీన్మబంగుళాలున్నా గూడ గొల్లోల్ల కథలు, బుడుగు జంగాల కథలు, పంబాలోల్ల కొలుపులు, బాగోతాలు అసుంటియి అన్నీ వుండేటివి గప్పట్ల. ఎవుసం పనులు లేని కాలంల గొల్లోల్లు కథలు జెప్పెటోళ్ళు. వూరూర్లు తిరుక్కుంట, వారాలకు వారాలు, ఒక్కోవాడల, చిరుతల రామాండ్యం జెప్పే పంతులు దూరపు వూర్లనుంచి గిక్కడికి అచ్చిండు. గిక్కడ చిరుతల రామాండ్యం జెప్పుడు మొదలుపెడుతనని రోజులకు రోజులు గీ వాడల్లల అందర్ని కల్సి మాట్లాడిండు. చిరుతల రామాండ్యముల ఏశాలు ఏసెటోల్లంత గూడ వైసు పోరగండ్లే. మంచి మంచి పోరగండ్లను ఏరి ఆళ్ళ అయ్యవ్వల తోటి మాట్లాడిండు. ఆళ్ళు పంతులుకు మద్దతు జెప్పిండ్రు. గిది మన వాడకు మంచిపనే అన్నరు. ఒక్కో ఏశానికి ఒక్కొక్క వైసు పోరడు. రామాండ్యంల అందరి కన్న ఎక్కో ‘రాములవారు’ గనుక ఆ ఏశం ఏసే పోరని తండ్రి యిగ నేనే దశరతున్ని అన్నట్టుగ పొంగులు పొంగెటోడు. నువద్దిగూడ రాముని ఏశం ఏసే ‘బాపు’ తండ్రి ఆ వాడకట్టుల అందరికన్న గూడ కొంచెం వున్నోడే – ఏవుసం, బట్ల, మేకలు, గొర్లు.
బాపు-రాముని వారం సాయ నలుపు వుంటడు గని గంతగానం ఎత్తు, బరువు వుండడు. అజానుబావుడు గాదు. సేతులు మోకాళ్ళ కిందకి దిగెటంత పొడుగేం వుండయి. అందరి వారమే వుంటయి మామూలగా మోకాళ్ళ మీదికే. గని, వున్నోల్ల కొంచెమంత వున్నోడు అనో ఏమో పంతులు రాముని ఏశానికి బాపునే పెట్టిండు – ఆళ్ళ అయ్య అవుసురంల ఆసర అయితడని.
‘సీతమ్మ వారి’ ఏశానికి పంతులు ‘లచ్చయ్య’ను పెట్టిండు తెల్లగ, బొద్దుగ వుంటడని. రావణాసూరుని ఏశానికి ‘శెంకరి’ ని పెట్టిండు. శెంకరి కొయ్యవారం ఎత్తుకెత్తు వుంటడు గని ఎత్తుకు తగ్గ బరువుండడు. రావణాసూరుని వారం కర్రెగ గూడ వుండడు. తెల్లగనే వుంటడు. ఉన్నోళ్ళళ్ళ యిగ గంత సెయ్యెత్తు మనిషి యింకెవ్వలు లేరు. గందుకని పంతులు, ఎత్తుకెత్తుంటె మనిషి గాంభీర్యంగ వుంటడని రావణాసూరుని ఏశానికి శెంకరినే కరారు జేసిండు. రావణాసూరుడు ఎప్పటికి గాంభీర్యంగ వుండాలె గనుక శెంకరికి నడుమ నడుమ సేతగాకపోతె గప్పుడుగా ఏశం కొంచెంసేపు నేనే ఏసి సూపిత్తుంట అన్నడు పంతులు. పంతులు తెల్లగ, కొంచెం బరువుగనే వుంటడుగని గంతగానం ఎత్తుగాదు. లేనత్తకన్న గుడ్డత్తే నయంగద మరి. గదీంతోటి శెంకరికి కొంచెమంత దైర్నం ఎక్కో అయింది. తనకు సేతగానప్పుడు పంతులు వుండనే వున్నడు గద అని. సంతోషం పురాగ బలం. ‘అనుమాండ్లవారి’ ఏశానికి ‘అనుమంతు’ని పెట్టిండు. అనుమంతు అనుమాండ్ల వారి వారం తెల్లగ వుండడు. నల్లగ, కొంచెం మంచిగనే ఎత్తు, బరువు. వాలి – సుగ్రీవులకు ‘పోశెట్టి’ని, ‘మొండి’ని తీసుకున్నడు. పోశెట్టి, మొండి నువద్దిగ గూడ అన్నదమ్ములు రోజు యింట్ల గూడ ఎప్పటికి కీసులాడుకుంటరు. జగుడాలు, దంపులాటలు, కొట్లాటలు గనుక, గీళ్ళకైతేనే గా ఏశాలు అలుకగైతయి అని పంతులు వాలి, సుగ్రీవుల ఏశాలకు పోశెట్టి, మొండినే కరారు జేసిండు. ముందుగాలనే అంత ఎరుకున్నోళ్ళుగా వట్టి పోశెట్టి, మొండి మూలంగనే రామాండ్య బగ్గ పండి పోతది అనుకున్నడు పంతులు. లంఖిణి, మారీచ, సుభావులు, తార, అంగదుడు.. అన్ని ఏశాలకు అందర్ని పెట్టిండు. ఆడోళ్ళ ఏశాలు అన్నిగూడ మొగపోరగండ్లే ఏసుడు. వాడ కట్టోళ్ళు అందరు గూడ తలాయింత పైసలు ఏసుకోవాలె పంతులు గురించి. ఏశగాండ్లకు ఏం పైసలు అవుసురం లేదు. ఆళ్ళు అంత గూడ కంపిన్లల్ల పనిజేసేటోళ్ళే. ఆళ్లకు గిది బతుకుదెరువేం గాదు అట్టిగనే, ఉప్పసకు, మురిపానికే. పగటిపూట కంపిన్లపని, రాత్రిపూట రామాండ్యం ఆటలు.
వాడకు గిన్ని రోజులు లెక్కన ఆడాలె. వాడవాడకు ఏడపడితె ఆడ ఖాళి జాగ వుండేటిది – ఆట జూసుటానికి అచ్చినోళ్ళు ఏడపడితె ఆడ కూసోని జూసుటానికి. రాత్రి యివ్వలు దిన్నంక, ఏనిమి గొట్టంగ రామాండ్యం మొదలైతది. తెల్లారేదనుక ముసులోల్లు, సేతగానోళ్ళు కింద ఒరిగి సూసుటానికి, పిల్లతల్లులు పిల్లగండ్లని పండవెట్టుటానికి గోనెసంచులను ఎంటకొంట పొయ్యెటోళ్ళు. రామాండ్యం ఆడినన్ని రోజులు యిగ గావాడకు పండుగు. పోరగండ్లకైతె నెరికి – సూసుడేమోగని, ఎగురుటానికి. రామాండ్యం ఆట ఆడగోన్ని రోజులు, ఆడగోన్ని రోజులు, కాపోల్లయిండ్లల్ల, గొల్లెల్ల యిండ్లల్ల..
‘పుల్లయ్యపంతులు’ గక్కడ గొల్లోల్ల యిండ్లల్ల వుంటున్నడు. పుల్లయ్య పంతులుగా సుట్టూరు పల్లెల్నుంచి గీ కాలేరుకు వచ్చిండు బతుకుటానికి, గానడుమనే. పుల్లయ్య పంతులు తండ్రి పిల్లగండ్లు సిన్నగున్నప్పుడే ‘పొయ్యిండు’. గిప్పుడు పుల్లయ్య మీద తల్లి, ఒక చెళ్ళె. పుల్లయ్య యింక పెండ్లి జేసుకోలేడు – పెండ్లీడు దాటిన గూడ. పెండ్లి అంటె అట్టిగనేనా? పెండ్లాన్ని గూడ సాదేటంతటి సంపాదన వుండాలెగద. గందుకని పుల్లయ్య పెండ్లి జేసుకోవుటానికి ఆల్సెం అయితంది. పుల్లయ్య చెల్లె పెండ్లైందే గని మొగడు తీసుకపోతలేడు. గా మొగడు దేశాలు పెట్టి తిరుగుతున్నడట పెండ్లాన్ని, యిల్లు, వాకిలి యిడ్సపెట్టి. గందుకని చెల్లె యిగ అన్న దగ్గర్నే వుంటాంది. మొగుడు పెండ్లాన్ని సాద సేతగాకనో, యింకెందుకోగని పెండ్లాన్ని తీసుకపోతలేడు. యిడ్సి పెట్టినట్లే. ఎక్కో కులమోళ్ళు గాపట్టి యిగ మొగడు యిడ్సి పెట్టిన ఆడిది మళ్ళ యింకొగన్ని జేసుకోవద్దాయె. ఇంక ఏ మొగోడు సేసుకోడాయె. ఏమో, పెండ్లాం సచ్చిపోయినోడు గిట్ట జేసుకుంటదేమో మొగడు యిడ్సిపెట్టిన దాన్ని, గని, పుల్లయ్య చెల్లెకు గసుంటిది ఏది జరుగలేదు. మొగడు యిడ్సిపెట్టినంక అన్న మీదనే వుంటాది.
పుల్లయ్య చెల్లె పేరు ‘సరోజిని’. సరోజిని సూసుటానికి మంచిగ వుంటది. గప్పట్ల పెండ్లిళ్ళ సిన్నవైసులనే అయ్యేటాయి. సరోజినికి గూడగట్లనే సిన్నవైసులనే, బుద్దిదెలువనప్పుడే పెండ్లైంది గని, బుద్దిదెల్సేనాటికి మొగడు కనిపించకుండపొయ్యిండు దేశాల మీద. సరోజిని గిప్పుడు వైసు ఆడిది. వైసు మీదున్న ఆడిది. సరోజిని సూసుటానికి గిప్పుడు రంబవారముంటది. కట్టు, బొట్టు గప్పటి పాతకాలంకు తగ్గట్టుదే అయినాగూడ గా కట్టుబొట్టులనే మంచిగుంటది. ఆమె కట్టుబొట్టు కొత్తతరం గోల్సాడి జుట్టే కాలంది కాదు. గోసిపెట్టి చీరెగట్టేనాటిదే. గా కట్టుబొట్టుల గూడ ఆమె కొంచెం కొత్తకాలపుదే. అందరు చేతినేత చీరలు గడితె ఆమె సేటి పూల సన్నం చీరెలు గడ్తది. అందరు చేతి కుట్టురైకలు దొడుగుతె ఆమె మిషిని కుట్టు జాకిట్లు తొడుగుతది లోపల ‘బాడి’ మీద. ఎగదన్నుకోని కనిపిచ్చే పాలబుడ్ల అసుంటిసండ్లు. కుచోన్నతే కుంకుమరాగశోణే. నాసాగ్రే నవమౌక్తికం – అరజారిన పయ్యెదలో. నున్నగ దూసిన తలెంట్రుకలు – ముడిసిన సికె. ఘుమఘుమ పూవులు సిగలోన, సొగసుల మోమును ముడుసుకుని, మిసమిసలాడే నొసటి కుంకుమ, కరకంకణ నిక్వణాలు, పదనోకుర నిస్వణాలు – అడుగడుగున ఆడే లే నడుము సొంపులు, సడిసేయక వూరించే వయ్యారపు వంపులు. హిమగిరి సొగసులు – మనసుపడే మనోజ్ఞసీమ.
సరోజిని అసుంటి, గంతమంచి సూపులకున్న ఆడిది గాసుట్టు ముట్టు యింకేడ గన్పిచ్చది. గంతమంచి పెండ్లాన్ని యిడ్సిపెట్టి మొగడు దేశాలు వట్టి తిరుగుతున్నడంటె మరి సేదసేతగాకనా లేకుంటే గా మొగనికి మొగతనం గిట్టలేకనా లేక యింకెందుకన్ననా? పడతి కొరకై పెక్కుపాటులు పడిరయా అన్నడు తత్త్వం జెప్పినోడు. గని గీ మొగడేమొ పెండ్లాన్ని యిడ్సి తిరుగుతున్నడు. సంతపాక తొత్తు సన్నాసి నెరుగునా అన్నట్టు తారతమ్య మెరుగనేరని పశువు. బయటనింటి సిగ్గు బండ సంసారంబు. పుట్టుగాసెగట్టె భువి నాంజనేయుడు అన్నట్టుగగా మొగడు ఆలేరు బయ్యన్న వారం వుంటున్నడు. ఇంటియాలు విడిచిఎట్లుండ వచ్చురా, ఆలిలేని బాధ అంతింతగాదయా అన్నరు. గని, గీమొగనికి గవన్ని ఏం పట్టస్తలెవ్వు. గా బాధలు అనికుండకపోతే సేసుకున్న పెండ్లానికుండయా? వైసు మీద వున్నది నిగనిగ. కాపులేని దాని కాపురం బాగునా, చేపునిడకయున్న చెడపురుగు పట్టురా అన్నరు. మంచినీరు పొయ్య మల్లెపూయునుగాని అన్నరు. వెలది చక్కదనము వెరపైన ఈడును విభుని కరుణలేక విగతినుపె వలపు పొందు చవిచూడకముందే కలచివేసితివి బ్రతుకు కథ అన్నట్టుగ వున్నది. మరుమల్లె కెంధూళి గలిసేందుకా?..
చిరుతల రామాండ్యం ఆడుతుంటె, పెట్రోమాక్సు ఎలుగుల, యింటి ముందటనే గూకున్నాగూడ కన్పిస్తంది సరోజినికి రామాండ్యం ఆట. గా పెట్రోమాక్సు ఎలుగుల సందులల్ల ఆమె వైసులవున్న పెయ్యి గిట్ల నిగనిగ మెరుస్తాంది. వైసు పోరగండ్లు జూని తమాయించుకోక మీద పడెటంతటి ఆడిది సరోజిని. పడుచుదనం అందానికి తాంబూలమెత్తింది. పరుగులు తీసే జవరాలి వయసు పిలువక పిలిచి విరహాల రేపు. వైసు పోరగండ్లను ఉసిగొల్పుతుంటది. ఈతలు నేర్చిన యోగము చేదిటగక యున్న నేమి జేయును?.. యింటి మగని జూసి యిల్లాలు దుఃఖించి..
రామాండ్యం రోజులకు రోజులు సరోజిని వుంటున్న యింటి ముందట్నే ఇంటి’గలుమ’లనే కూకోని సూత్తుంటది సరోజిని. ‘అనుమండ్లవారి’ ఏశమేసే ‘అనుమంతు’ నడుమ నడుమ తన ఏశానికింతంత గెరువు దొరుకంగనె సరోజిని దగ్గెరికి పొయ్యి గిన్నన్ని తాగేనీళ్ళు యియ్యమంటడు.. తేనెతెరలజాడ తేనెటీగ ఎరుంగు, సుమరసంబుజూడ భ్రమరమెరుగు అన్నట్టు – అనుమంతు వైసుల వున్న పోరడు, ఇంక పెండ్లికానోడు. సరోజిని వైసు మీదున్న పెండ్లైనా మొగడులేనిది. అనుమంతు కన్నా ఎక్కో కులంది అయినా గూడ మొగడు యిడ్సిపెట్టిన, వైసుల వున్న ఆడది. రంభసుంటి అందంగవున్న ఆడిది. ఆళ్ళకు కులాల ఎక్కో తక్కోలు అడ్డమా? సుట్టుసూసెటోల్ల సూపుల తాళ్ళు ఆళ్ళు వైసు వురుకులకు మొగుదాళ్ళైతయా? మొగుదాళ్ళనెయ్యాల్నని జూపినా తెంపుకోని వురుకయా? అడ్డమచ్చినోళ్ళని కుమ్ముకుంట వురుకుల పెట్టయా, ఎదకచ్చిన కొల్యాగలు – ఎదున గొడ్లు..
వయసు వేదనలకు ఔషదం కావాలె.. ఎన్నాళ్ళో వేచిన హృదయం ఈనాడే ఎదురౌతుంటె.. ఒకరి చూపులొకరి పైన విరితావులు వీచగా, విరితావుల వరవడిలో విరహ మతిశయింపగా, మొదట మూగినవి మొలక నవ్వులు, పిదప సాగినవి బెదురు చూపులు.. వయసు సెగకు చెంతనున్న చెడునటే తాపంబు? తుంటివింటికాని తూపుల ఘాతకు మంటమంట నడుమ మిడుక తంమె? ఇంతిగన్నచన్ను వింతవింతలజూని మోహమందుబుద్ధి. నా తిగన్నయపుడు నీతి – తగదు అని అనుమంతు, కులముకన్న మిగుల కలిమి ప్రధానంబు.. వైసు’కుతులు’ నిండారదీర్సే కలిమి అని సరోజిని.. లేని కాలమునకు లేని మనమునొందు.. ప్రస్తుతంపువేళ, తప్పియున్నగని ఒప్పియుండు చెప్పవచ్చు పనులు చేయుటే కష్టంబు.. వాదుజేయువారు వర్ణింప లేరయా… బతుకంటె -పుట్టలోన తేనెపుట్టిన రీతిని, గట్టుమీదమణియు బుట్టినట్టుగ వుండాలె… అబ్బయున్న వానికన్ని యున్నట్టులే. వైసుమీదున్న ఆడిదానికి మొగోడు గావాలే.. దొంగరీతి గాక దొరుకునా మోక్షంబు?.. కాని పనులు జేయ ఘదులాసపడుదురా?.. భ్రమలు విడువకున్న బ్రహ్మంబు తోచదు.. కాంత జూడదల్చు కౌగిలింప.. అంతమంతనమున ఆనందకేళికా.. సండ్ల సలుపుల్లు, పెయ్యితీపులు.. ఆకలికి అన్నము.. కలిగిన తలపులు వలపులురేప – తిరుగాడును తేనెటీగ తియ్యదనముగోరి ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు.. అలసివుంటావో మనసు చెదిరి వుంటావొ.. పైటచెంగు రెపరెపలు పదపద లెమ్మన్నాయి.. తోటవాకిలికాడ దొంగలున్నరు – దాచుకో నీ వయసు – దాచుకోమంటేను దోచిపెడతావా.. ఇన్నినాళ్ళ ఈ పరువం వికసించుట యిందుకా… విరజాజి తీగసుంత, జరిగింది మావిచెంత వెదికే పెదవులతో, తొణికే మధువులతో.. మిసమిసలాడే నొసటి కుంకుమ చిరుచెమటలతో తడిసింది… తొణకని చెదరని ఆ బిగువులలో – కలిగిన తాపమంత కౌగిలిలో తీరింది..
మొదుగాల మొదుగాల ఆటంజూసుక, ఆనెక ఆనెక అందరని జూడంగ గూడ – సరోజిని, అనుమంతుల వైసుపెయ్యిల తీపులు తీర్సుకున్నలు… గాళ్ళ సమందం గంతదనుకనే..
అనుమంతు, కులం పోరిని పెండ్లి జేసుకున్నడు. గా తర్వాత పిల్ల గండ్లు పుట్టిండ్రు.. వైసులనే ఎప్పటికి పాణం మంచిగుండని అనుమంతు.. సంపాదన ‘గాపాటే’నాయె – బ్రతుకుదెరువుకే లోటు..
పుల్లయ్య పెండ్లి గూడ అయ్యింది.. పుల్లయ్య పెండ్లాం అన్నది “గిసుంటి ఆడిదానివి మాయింట్ల వద్దు” అని సరోజిని తోటి, “గిసుంటి ఆడిది మనింట్ల వద్దే వద్దు. గీయింట్ల నీ చెల్లెవుంటె నేనుండ నేను గావాల్ననుకుంటె నీ చెల్లెను ఎల్లగొట్టు. గసుంటి ఆడిది ఏన్నన్న పోనియ్యి, ఏమన్నగానియ్యి.. గంతే” అన్నది. భార్యవశతగాని బ్రతుకులు లేవయా.. పుల్లయ్య చెల్లెను యింట్ల కెళ్ళి ఎళ్ళగొట్టిండు. పుల్లయ్య సంపాదన, సంసారం గాపాటిదె. సద్దిమిగులనింటి సంసారం. ఇగ చెల్లెకేం పెడుతడు? సరోజిని వైసుల వైసు ఔషదానికి మొగోళ్ళను మరిగింది.. ఎన్నెన్నో ఏండ్లు గడ్సిపొయ్యినై.. గిప్పుడు ఆకలికి అన్నం కోసమే మొగోళ్ళు అవుసురం తప్పకుంట వున్నది.. ఎక్కో కులంల పుట్టుడే సరోజిని బతుక్కు శాపమైంది. గప్పుడు మొగడిడ్సి పెట్టిందని ఎవ్వరు జేసుకోకపాయె, గిప్పుడు సెడిపొయ్యిన ఆడిదాయె. గప్పటి వైసుల ఎదున గొడ్డు, గిప్పుడు అట్టిపొయ్యిన గొడ్డు. అట్టి పొయ్యినగొడ్డు కటికోని యింటి ముందట.. సరోజిని బతుకు అంగట్ల..