ధీరకవి వాగ్రూపం స్వర్ణహంస

0
4

[ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య గారు రచించిన ‘మానస సరోవరంలో స్వర్ణ హంస’ అనే పుస్తకాన్ని విశ్లేషిస్తున్నారు డా॥ తుమ్మలపల్లి వాణీకుమారి.]

[dropcap]ఆ[/dropcap]చార్య ముదిగొండ వీరభద్రయ్య గారి ‘మానస సరోవరంలో స్వర్ణ హంస’ కవిత్వ ఆవిర్భావాన్ని, దాని ప్రయోజనాన్ని విప్పి చెప్పిన గొప్ప కావ్యం. జ్ఞానం అనంతమైనది; స్వచ్ఛమైనది. అందుకే కవి జ్ఞానరాశిని శ్వేతహంసతో పోల్చారు. అందులో కవిత్వం ఒక భాగం కాబట్టి ఆచార్య వీరభద్రయ్య గారు జ్ఞానరాశికి ప్రతినిధి అయిన శ్వేతహంస దీధుతులలో స్వర్ణహంస ఒకటి అని చెప్పారు. అది కవిత్వ శిశువుకు ప్రతినిధి అని చెపుతూనే ఆ రమణీయ బాల లోకక్షేమం కోసం భువికి దిగి వచ్చిందని కవిత్వ ప్రయోజనాన్ని కూడా నిర్ధారించారు. ‘రమణీయ బాల’ అనే పదంలోని విశేషణ, విశేష్యాలు రెండూ సార్థకమైనవి. ‘రమణీయార్థ ప్రతిపాదక శ్శబ్దః కావ్యమ్’ అనే జగన్నాధ పండితరాయల కావ్య నిర్వచన సూచకం విశేషణం. విశేష్యమైన ‘బాల’ అనే పదం నైర్మల్యానికి చిహ్నం. వ్యక్తి వేదనను సంవేదనగా ప్రకటించేవాడు ‘లోచూపరి’ అనటం కవి తాత్త్వికదృష్టిని తెలియజేస్తుంది. సంవేదన నైజం మాటల్లో ఎలా పునర్జన్మ పొందిందో ఆ లోచూపరి ప్రకటిస్తాడట.

“అలాంటి ప్రకటనలే కావ్యశాస్త్రం
దీని అధ్యేతయే కావ్య తత్త్వజ్ఞుడు”

– ఈ నిర్వచనంతో అనుభూతి, అభివ్యక్తి కావ్యానికి మూలమని, దానిని శాస్త్రీయంగా అధ్యయనం చేస్తేనే కావ్యతత్త్వం బోధపడుతుందని స్పష్టమవుతున్నది.

‘రసము యన్నిష్ఠము’ అనేది సంవత్సరాల నుండి సాగుతున్న చర్చ. దీనికి

“చూసేవాడి గుండెల్లో సహస్ర తంత్రులు ఉంటాయి.
అవతలి ఘటన శృతికి సరిపోయే తంత్రి
అతడే ప్రయత్నమూ చేయకపోయినా కదులుతుంది”

అని ఈ విమర్శక చక్రవర్తి ఒక్క మాటలో సమాధానం చెప్పేసారు. అయితే ఆ తంత్రులు తుప్పెక్కి, శృతి లేకుండా ఉండకూడదు అని తేల్చారు. అనుభవాన్ని అనుభూతిగా మార్చుకోవడానికి ఏం చేయాలో క్రింది మాటలలో వివరించారు.

“కాస్తంత ఓపిక పట్టి అంతరంగంలో
కొంతకాలం ఊరబెడ్తే
అదే అనుభవం అనుభూతి అయి
కొత్త కొత్త రూపాలతో ప్రాణాలతో
కళాఖండమయి అందరినీ తట్టి లేపుతుంది”

మెరుపు క్షణికమే అయినా దాని వెలుతురు ఎంత మార్పు తెస్తుందో ఉదాహరణగా చూపి ‘సచేతన జీవితం’ అంటే ఏమిటో నిర్వచించారు. శబ్దాలకు ప్రాణం పోసి, సజీవంగా చేసి, జీవవంతమైన ఆ శబ్దాలను కావ్య ఫలంగా రూపొందించి, లోకానికి అందించే “కవికి మించిన దాత జగత్తులో దొరకడు” అని నిష్కర్షగా చెప్పారు. కవి అందించిన ఆ కావ్య ఫలాన్ని ఆస్వాదించినవాడు తప్పక మారుతాడని ఈ కవి గారి ప్రగాఢ విశ్వాసం. రసానందంతో పాటు ఉత్తమ చిత్త సంస్కారాన్ని కలిగించేదే గొప్ప కావ్యం కదా! “విశ్వశ్శ్రేయః కావ్యమ్” అని ఆలంకారికులు చెప్పిన కావ్య ప్రయోజనాన్ని తేలిక మాటలతో చెప్పకనే చెప్పారు.

“శల్యం నుంచి శబ్దబ్రహ్మం ఆవిష్కృతం అయి
ద్రవించి రస ప్రవాహమయి
లోకానికి చేరుకొని పఠిత
హృదయంలో నిష్పన్నమయి
రసజ్యోతిగా వెలుగుతుంది
లోకపు చీకట్లను ఈ వెలుగుటేరు
బ్రహ్మ సరసినుంచి తెచ్చుకున్న చైతన్యంతో
వెలిగించి కర్తవ్యం నెరవేర్చుకుంటుంది”

అంటూ కవి హృదయంలో ప్రాణం పోసుకున్న కావ్యం లోకానికి ఎలా చేరుతుందో వివరించారు. బ్రహ్మ సృష్టించిన ఈ జగత్తు, ప్రకృతి ఒక మహా కావ్యమని, అదే కవిత్వాభివ్యక్తికి ఆదర్శమని అద్భుతంగా చెప్పారు కవి.

కావ్యశిశువు లోకార్పణం అవటాన్ని “ఈశావాస్యమిదం సర్వం” అనే మహత్తరమైన ఉపనిషద్వాక్యంతో జోడించి మరీ చెప్పారు.

“దృశ్యమానం కాని పరాస్థితి లోని కవితను మానసాతీత మహద్భూమిలో” పెంచే కవిని గర్భస్థ శిశువును మమకారంతో సాకే తల్లితో పోల్చడం ఒక అద్భుతమైన భావన.

“ఎక్కడికో తప్పించుకుపోతే శాంతి లభించదు ఉన్నచోటనే భూమి మీదనే లోకంలోనే పారిపోకుండా బ్రతుకుతూ సాధించుకోవాలి”

అంటూ ‘నేల విడిచి సాము చేయకూడదు’ అనే సూక్తిని గుర్తుకు తెచ్చారు. కవిత్వంలో అనుభూతి ప్రాధాన్యాన్ని గుర్తు చేస్తూ

“అనేకానేక అనుభవాలను
అనుభూతి సస్యాలుగా పండించే
విచిత్ర విశేష సృష్టి అది
అంతేకాని అది అనుభవాల డైరీ కాదు
చరిత్ర పుటల పుస్తకం అంతకన్నా కాదు” అన్నారు కవి.

“కవి అంతర్నేత్రం వస్తు నిజరూప దర్శనం చేయిస్తుంది.
దాని నైజాన్నీ స్పష్టపరుస్తుంది”

ఈ విషయాన్ని

“కొత్తిమీర చేలపై కప్పిన మంచు దుప్పటిని
రవి తన కిరణోష్ణంతో కరిగించి
సువాసనలను వెదజల్లినట్లు”

అనటం నాకు తెలిసినంతలో సరికొత్త ఉపమానం.

“చర జగత్తులో అన్నింటికీ నోరుండదు
కానీ అన్నింటిలోనూ కదలాడే
గుండెను చూస్తాడు కవి”

నిజం. అందుకే కవి దృష్టి విలక్షణమైనది. గుఱ్ఱం తల్లీ, పిల్లల సంభాషణలో నాగరికత, అనాగరికతల గురించి ఎంతో చక్కగా చెప్పారు.

ఆలంకారిక ప్రస్థానాలన్నిటికీ మూలవిషయ దర్శనానికి చెందిన ఈ కావ్యాన్ని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే

“మనస్సుకు ఎంతో పైన ఉన్న మహత్ భూమిని అధిరోహించగలిగిన ధీరకవి వాక్కు” ధరించిన రూపమే ఈ స్వర్ణ హంస.

***

మానస సరోవరంలో స్వర్ణ హంస
రచన: ఆచార్య ముదిగొండ వీరభద్రయ్య
పేజీలు: 48
వెల: ₹ 100.00
ప్రతులకు:
నవోదయ బుక్ హౌస్, కాచీగుడా, హైదరాబాద్. 500027
ఫోన్: 9000413413.
ఆన్‍లైన్‍లో ఆర్డర్ చేసేందుకు
https://www.telugubooks.in/products/maanasa-sarovaram-lo-swarna-hamsa

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here