మలిసంజ కెంజాయ! -18

5
5

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[ప్రమాదం ఎలా జరిగిందో చెప్తుంది కోడలు. అమ్మ పక్కనుంటే బావుంటుందని పిలిచానని చెప్తాడు కొడుకు నారాయణ. పార్వతమ్మ కొడుకు మంచం పక్కనే తన మంచం వేయించుకుని కొడుకుతో కబుర్లు చెప్పడం, అతని అవసరాలకి కోడలినీ, పనివాళ్లనీ పిలిచి పని చేయించడం మొదలుపెడుతుంది. తల్లి పక్కనే ఉండడం నారాయణకి చాలా ఆనందం కలిగిస్తుంది. ఆఫీసుకు సెలవు పెట్టి ఇంటిపట్టునే ఉండడం, తల్లి తన దగ్గరే ఉండడంతో నారాయణకి హాయిగా అనిపిస్తుంది. తల్లితో బోలెడు కబుర్లు చెప్తాడు. కెరీర్‍లో ఎలా పైకొచ్చింది చెప్తాడు. ఒక నెలన్నర తరువాత కొడుక్కి పూర్తిగా నయమయి, ఆఫీసుకు వెళ్ళడం మొదలుపెడతాడు. తానిక బయల్దుతానని ఒక రోజు కొడుకుతో అంటుంది. తల్లిని ఈసారికి ఊరెళ్ళి వచ్చి, తరువాత తన దగ్గరే ఉండిపొమ్మని అడుగుతాడు నారాయణ. కోడలు కూడా అదే మాట అంటుంది. రెండు రోజుల తర్వాత కారు సిద్ధం చేయిస్తాడు నారాయణ. బయల్దేరేముందు మళ్ళీ చెప్తారు, ఇక్కడికి వచ్చేసి ఉండమని. ఇన్నాళ్ళకైనా తన పెద్ద కొడుక్కి బాధ్యత తెలిసిందన్న సంగతి ఆవిడను సంతృప్తిపరుస్తుంది. ఇంటికి వెళ్ళాకా, వసంతతో ఈ విషయం చెబుతుంది. మంచిమాట చెప్పారని అంటుంది వసంత. లోపలి నుంచి ఓ రవికల గుడ్డా, వెయ్యి రూపాయిలు తెచ్చి వసంతకి ఇచ్చి వచ్చే పండగకి చీర కొనుక్కోమని చెప్తుంది పార్వతమ్మ. ఒకరోజు నిర్మల వసంతకి ఫోన్ చేసి తాము మిత్రులతో కలిసి ఊటీ, కొడైకెనాల్ వెళ్తున్నామనీ, పిల్లలిద్దరినీ ఉంచి వెళ్తాననీ, వాళ్లని చూసుకోమని చెప్తుంది. మనవలిద్దరూ వచ్చి వారం రోజులు అమ్మమ్మా, తాతయ్యలతో ఉన్నారు. వసంతకి, వెంకట్రావుకి ఉత్సాహంగా గడిస్తుందా వారం. ఊర్నుంచి తిరిగొచ్చిన నిర్మల ఆ వారం రోజులు పిల్లలు ఏం తిన్నారో అడిగి తెలుసుకుని తల్లి మీద విసుక్కుంటుంది. వసంత నొచ్చుకుంటుంది. మర్నాడు పిల్లల్ని తీసుకుని తమ ఇంటికి వెళ్ళిపోతుంది నిర్మత. కూతురు ప్రవర్తన గురించి వెంకట్రావుతో ప్రస్తావిస్తే, చిన్నపిల్ల, తనే తెలుసుకుంటుందని అంటాడు. వీలైనప్పుడు ఫోన్ చేయమని కొడుకికి మెసేజ్ పెడుతుంది. కాసేపయ్యాకా, శైలేష్ ఫోన్ చేస్తే – నిర్మల తీరు గురించి చెప్పి బాధపడతుంది. తానొచ్చినప్పుడు అక్కతో మాట్లాడతానని అంటాడు. జనవరి రెండో తారీఖున వస్తున్నామని, వారం రోజులు ఉంటామని అంటాడు శైలేష్. అన్నట్టుగా భార్యాపిల్లలతో వస్తాడు. కోడలు మనవరాళ్ళ సందడితో రెండు రోజులు గడిచిపోతాయి. మూడో రోజున శైలేష్ తన కుటుంబంతో నిర్మల ఇంటికి వెళ్ళి, రెండు రోజులుండి వస్తాడు. కొడుకు కుటుంబం బయల్దేరు రోజు వస్తుంది. కొడుకు ఒక్కడే ఉన్నపుడు – అక్కతో మాటాడ్లావా, అమ్మతో ప్రేమగా ఉండమని చెప్పావా అని అడుగుతుంది వసంత. ఇక చదవండి.]

[dropcap]ఆ[/dropcap]శగా అడుగుతున్న అమ్మ మొహం వైపు తిన్నగా చూడలేక “లేదమ్మా! మర్చిపోయాను. అదీగాక దానింటికి వెళ్ళినప్పుడు అడిగితే బాగుండదు కదా! ఇక్కడ నువ్వుండగా కూడా బాగోదు. అదీ నేనూ, ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితేనే బావుంటుంది కానీ” అని నసిగాడు.

వసంతకి మొదటిసారి కొడుకులో మరో కోణం కనబడి మనసు చివుక్కుమంది. అయినా తమాయించుకుని అక్కడినుంచి వెళ్ళిపోయింది పనున్నట్టు.

‘వాళ్లిద్దరూ అక్కాతమ్ముళ్లు. వాళ్ళ మధ్య బంధం, స్నేహం వాళ్ళకి అవసరం. ఒకరినొకరు తప్పుపట్టుకోరేమో! మూడోవాళ్ళ కోసం’ అనిపించింది వసంతకి. తల్లి మనసు అర్థమయిన శైలేష్ ఆమె వెనకే వంటింట్లోకి వెళ్లి ఎదురుగా నిలబడ్డాడు ఆమె మాటలు విందామన్నట్టు.

“అవున్లేరా! అదీ నువ్వూ ఒకటి! నేనేగా పైదాన్ని” అంటుంటే వసంతకి కన్నీళ్లు రాబోయి, ఆగిపోయాయి.

“అయ్యో! అమ్మా! అలా అనుకోకమ్మా! నాకు బాధగా ఉంటుంది” అంటూ తల్లిని దగ్గరగా తీసుకుని ఆమె తలపై ముద్దు పెట్టాడు, తన కూతుళ్ళని ముద్దు చేసినట్టుగానే.

“గుర్తొచ్చింది లేరా! నువ్వు ఎం.బీ.ఏ. చదివావు కదా! ఫ్యామిలీ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తుందిలే నీకు!” అంటూ చిన్నగా నవ్వేసింది దాని వెనక తన బాధని దాచుకుంటూ.

కోడలు స్వప్నని  “రేపు రాత్రి ట్రైన్ లోకి ఏం తీసుకెళతారమ్మా! పులిహోరా, పెరుగన్నం పెట్టనా” అనడిగింది వసంత.

“చెయ్యండత్తయ్యా! మీ చేతి పులిహోరా, పెరుగన్నమూ ఎంత రుచిగా ఉంటాయో!” అంది స్వప్న సంబరంగా.

“నేర్చుకుందామని లేదమ్మా స్వప్నకి. ఎప్పుడూ చెయ్యదు” అంటూ భార్యపై పితూరీ చెప్పాడు శైలేష్.

“నాకు వచ్చు. చేస్తానత్తయ్యా! చేయగానే మా అమ్మ చేసినట్టుగా లేదు అనేస్తారు!”

“తప్పురా! అలా అనకూడదు. రేపు నీ కూతుళ్లు మా అమ్మ చేసినట్టుగా ఎవరూ చెయ్యలేరు అంటారు” అంది వసంత.

“అవున్నిజమే! నీ కోడలు చేసినట్టు, ఎవ్వరూ చెయ్యలేరు” అంటూ భార్యను వెక్కిరించాడు శైలేష్.

ప్రయాణం రోజు ఇట్టే గడిచిపోయింది. సాయంత్రమే, రాత్రి ట్రైన్ కోసం అమలాపురం నుంచి టాక్సీమాట్లాడుకుని కాకినాడ బయలు దేరాడు శైలేష్.

***

మాధవకి ఆ రోజు సుమిత్రా, విశాలతో కలిసి కబుర్లు చెబుతూ నవ్వుకుంటూ గడిపిన రెండు మూడు గంటలు ఎంతో సంతోషాన్ని కలిగించాయి. ‘బరువుగా, స్తబ్ధుగా, నదిలా నడుస్తున్న తన జీవితం, సెలయేరులా గలగలా పారినట్లయ్యి ఎంతో ఉల్లాసంగా అనిపించింది’ అనుకున్నాడతను. చిన్నప్పుడు కాలేజీలో చదువుతున్నప్పుడు మనసు ఎలా ఉత్సాహంతో, పరవళ్లు తొక్కుతూ ఉండేదో, అలాంటి రోజులు మళ్ళీ తిరిగొచ్చినట్లనిపించిందతనికి.

ఆ తర్వాతి వారం విశాలకి ఫోన్ చేసినప్పుడు “సుమిత్రగారూ, నువ్వూ కలిసి ఉంటున్నారా? ఎంతో బావుంది కదా అలా ఉండడం!” అన్నాడు మాధవ.

“అవును. చాలా చాలా బావుంది. తిరిగి టెన్త్ క్లాస్ వయసులోకి వెళ్ళిపోయి అక్కడ స్థిరపడ్డాం ఇద్దరమూ!” అందామె నవ్వుతూ. సుమిత్ర గురించి చెబుతూ “తను భర్తనుండి విడాకులు తీసుకుంది ఏనాడో. ప్రభుత్వ ఉద్యోగం పంచాయితీరాజ్‌లో పనిచేసి రిటైర్ అయ్యింది. పిల్లలిద్దరూ సింగపూర్‌లో ఉద్యోగం చేస్తారు. పెళ్లిళ్లయ్యాయి. స్నేహపురిలో ఇల్లు కట్టుకుంది. ఇక్కడికి దగ్గరేగా! నెలలో ఒక వారం నా దగ్గర ఉండి, వెళుతూ ఉంటుంది. ఎప్పుడు పిలిచినా వస్తూ ఉంటుంది. నేను కూడా తన ఇంటికి వెళ్లి ఉంటూ ఉంటాను. మా ఇద్దరికీ అదో ఆటవిడుపు. టైంపాస్ కార్యక్రమం అన్నమాట. తనతో నాకసలు ఇబ్బంది ఉండదు .పైపెచ్చు మరీ సౌఖ్యంగా ఉంటుంది నాకు. పిచ్చి పిల్ల నన్ను కంటికి రెప్పలా చూసుకుంటుంది. నేను కూడా అలాగే ఉంటాననుకో. ఏదైనా మ్యూచువల్ అంతే కదా, మాధవా!” అంది విశాల.

“అంతే! అంతే! మీరిద్దరూ అదృష్టవంతులు. ఎందుకంటే మీరిద్దరూ సహృదయులు, ఇంకా ప్రేమమూర్తులు. కాబట్టి ఇదంతా కుదురుతోంది లేకపొతే మిత్రులైనా కలిసి ఉండలేరు” అన్నాడు. తర్వాత మరికొంతసేపు మాట్లాడి పెట్టేసాడు మాధవ.

మరో రెండు మూడు రోజుల తర్వాత అతని మనసులో ఒక కొత్త ఆశ అంకురించింది. విశాల వాడిన సహజీవనం అన్న పదం ఆ ఆశకు విత్తనంగా ఉపయోగపడింది. ‘భవిష్యత్తులో మనం జీవించబోయే కొన్ని సంవత్సరాలయినా మనం కలిసి జీవిస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారి ఆలోచించు’ అని విశాలని అడిగితే? అన్న ఆలోచనే అతన్ని ఉద్వేగపరిచింది. నిలవనివ్వలేదు. అంత అదృష్టం ఈ జన్మకి ఉందా? అన్న సంశయం మనసులో ఒక మూల తొలుస్తూనే ఉంది.

అయినా మళ్ళీ వారం ఫోన్ చేసినప్పుడు ధైర్యం చేసి విశాలను అడగడానికి నిర్ణయించుకున్నాడు మాధవ.

ఎప్పటిలాగానే విశాల ఫోన్ ఎత్తి “చెప్పు మాధవా” అంది.

“నాదొక అభ్యర్థన ఉంది, చెప్తాను. నీకిష్టమైతేనే దాని గురించి ఆలోచించు! లేదంటే మర్చిపో. మనసు పైకి మాత్రం తీసుకోకు! అలా అయితే నేనసలు, అడగనే అడగను” అన్నాడు.

“దీనికింతలా అడగాలా, మాధవా? మనం కలిసి చదువుకున్న సహాధ్యాయులం. ఇంకా ఒకే ప్రాంతంలో పుట్టి, స్వచ్ఛమైన గోదారి నీళ్ళూ, తియ్యని కొబ్బరినీళ్ళూ తాగుతూ పెరిగినవాళ్ళం. ఒకరినొకరు నొప్పించుకోలేని, సున్నిత మనస్కులం కూడా! అడుగు” అంది విశాల.

గుండెను సంబాళించుకుంటూ అడిగేశాడు మాధవ. “విశాలా! మనిద్దరం కలిసి జీవించలేమా? కనీసం ఈ చరమాంకంలో?” అతని గొంతులోని నిర్మలత్వం, ఆశా ఆమె మనసును సరిగానే చేరాయి.

కొన్ని సెకన్లు ఆమె మౌనంగా ఉండిపోయింది.

“నా కోరిక నీకు నచ్చకపోతే నాకిష్టం లేదని చెప్పెయ్యి. అసలు అడగడమే తప్పనుకుంటే క్షమించెయ్యి. కానీ ఒక స్నేహితుడిగా అప్పుడప్పుడూ నిన్ను పలకరించే భాగ్యం లేకుండా మాత్రం చెయ్యొద్దు ప్లీజ్” అంటుంటే మాధవ గొంతు జీరపోయింది. విశాల ఏదో మాట్లాడబోతుంటే “మళ్ళీ వారం చేస్తా విశాలా!” అంటూ ఫోన్ పెట్టేసాడు.

వారం తర్వాత చేసినపుడు ఫోన్ ఎత్తిన విశాల గొంతులో ఏ మార్పూ లేదు. ఎప్పటిలాగానే “చెప్పు మాధవా?” అంది స్నేహపూర్వకంగా.

“ఏం చేస్తున్నారు జంట కవులు?” అన్నాడతను నవ్వుతూ.

“ఇవాళ నేను హాల్‌లో కూర్చుని రెస్ట్ తీసుకుంటూ పాడుతున్నాను. సుమిత్ర వంటింట్లో వంట చేస్తూ డాన్స్ చేస్తోంది” అంది నవ్వేస్తూ.

ఆ మాట తర్వాత అతను మాట్లాడకుండా ఆమె సమాధానం కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. ఒక్క క్షణం ఆమె మాటలు వెతుక్కునేంతలోనే మాధవ తట్టుకోలేకపోయాడు. అయినా తనను తాను సంబాళించుకున్నాడు.

“మాధవా! ఆ రోజే నేను సమాధానం చెప్పేదాన్ని. కానీ నువ్వు ఫోన్ పెట్టేసావు. అందుకే చెప్పలేకపోయాను. ఇక్కడ నేను నా మనస్థితి గురించి నీకు చెప్పాలి. నేను ఇంచుమించు ముప్ఫయి ఐదేళ్లు సంసార జీవితంలో ఉన్నాను. భర్తను చూసుకున్నాను. పిల్లాడిని పెంచి పెద్ద చేసాను. నా చిన్న జీవితంలో నేను కూడా చాలానే అలిసిపోయాను. ఇప్పుడిప్పుడే నా ఒంటరితనాన్ని కూడా, అలవాటు చేసుకుని జీవించడం మొదలు పెట్టాను.

ఏ బరువూ లేకుండా స్వేచ్ఛగా బతకడంలో ఉన్న తేలికతనాన్ని తెలుసుకుంటున్నాను. నా ఇష్టానికి తగినట్టుగా అంటే నచ్చిన పుస్తకం చదువుకుంటూ, ఇష్టం ఉంటేనే వండుకుంటూ, లేదంటే ఏ గుడిలోనో ప్రశాంతంగా కూర్చుంటూ ఉన్నాను. సుమిత్ర రావడం, ఉండడం అనేది ఒక రిలీఫ్ తప్ప నా జీవితం నాదే కదా మాధవా!

అందులో నా పోరాటం, ఆరాటం నాదే! ఈ ఆరుపదుల జీవితం అనేది బంధనాలు వదిలించుకునే వయసు కదా! అనిపిస్తుంది నాకు. అందుకే కొత్తగా తగిలించుకోలేను. అది నా మనస్తత్వం. కొందరికి ఈ వయసులో మరో తోడు ఉండడం మంచిది అనిపించొచ్చు. అది వారి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది.

ఇప్పుడొక కొత్త బంధం వేసుకుంటే దానికి నేను న్యాయం చెయ్యలేను. ఇన్నాళ్లూ చెయ్యని మంచి పనొకటి ఇతరుల కోసం చేస్తూ, ఏదైనా ఒక కీర్తన నేర్చుకుంటూ, అప్పుడప్పుడూ నచ్చిన ప్రదేశానికి వెళ్లి ఒంటరి జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతూ ఉన్నాను.

ఇది, ఈ బతుకు పట్ల మమకారాన్నీ, మోహాన్నీ నెమ్మది, నెమ్మదిగా విడిచి పెట్టెయ్యాల్సిన తరుణం అని నా భావన. ఒకరికి తోడుగా ఉండడం అనేది చాలా పెద్ద బాధ్యత. నేనేపని చేసినా నూటికి నూరు శాతం న్యాయం చేసే పనైతేనే నేను మొదలుపెడతాను. లేదంటే అసలు మొదలే పెట్టను.

మనిషికి ధైర్యమే తోడు! దానితోనే జీవితప్పడవ నడిపెయ్యగలమని నా విశ్వాసం. ఈ జీవితాన్ని ఇలాగే గడిపెయ్యాలని నిశ్చయించుకున్నాను. అంచేత నీ కోరిక మన్నించలేను మాధవా! నన్ను క్షమించు” స్థిరంగా అన్న విశాల గొంతు, అతనికి విశాల అంతరంగాన్ని విడమరిచి చెప్పింది.

ఒక విధమైన నిరాశతో అప్రయత్నంగా మాధవ నోటినుంచి ఒక మాట వచ్చేసింది. “నామీద ఆ నాటి కోపం పెట్టుకోలేదు కదా? విశాలా!” అన్నాడు లోగొంతుకతో.

“ఛ.. ఛ.. ఎంత మాట! అలా ఎప్పుడూ అనుకోకు మాధవా! మన జీవిత గమనంలో అదొక మెట్టు మాత్రమే. దాన్ని దాటి వచ్చి కొన్ని దశాబ్దాలయ్యింది. అది దైవ నిర్ణయం! అందుకే అలా జరిగింది. దాని గురించి ఎప్పుడో మరిచిపోయాను. ఇప్పుడు నువ్వు కోరిన కోరిక చాలా న్యాయమైనది. ఇదే వేరొకరి విషయంలో అయితే నేను సంతోషంగా మంచి పని అని ఉండేదాన్ని. నన్ను అపార్థం చేసుకోవు కదా మాధవా?” మెత్తగా అడిగిన విశాల గొంతు మాధవ గొంతులో ఉండకట్టిన బాధలో కలిసిపోయింది.

“నీ మనసు అర్థం చేసుకున్నాను. నీ భావాల్ని నేను గౌరవిస్తున్నాను. నేనిలా అడిగానని మాత్రం నువ్వు మనసులో బాధ పెట్టుకోకపోతే నాకంతే చాలు”

“లేదులే మాధవా! అయితే ఒక్క హామీ ఇవ్వగలను. నీ కెప్పుడు రావాలనిపిస్తే అప్పుడు హాయిగా నా దగ్గరికి రా! మేమిద్దరం ఉన్నాం. నీకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తాం. నీకెప్పుడైనా ఒంట్లో బాలేకపోయినా మాకు చెప్పు. మా సర్వీసెస్ నీ కోసం ఎప్పుడూ ఉంటాయి. ఎటువంటి సాయం అయినా నిర్మొహమాటంగా అడుగు మాధవా!” మనస్ఫూర్తిగా అంది విశాల.

“అలాగే విశాలా! నా అభ్యర్థన పై నువ్వు చెప్పింది చాలా వివరమైన మాట. అది నాక్కూడా వర్తిస్తుంది. ఇద్దరికీ నిశ్చింత నిచ్చే ఈ స్నేహం ఉంటే చాలు. చక్కగా న్యాయంగా ఆలోచించావు. నా తరఫున కూడా ఆలోచించావు. కొత్త బంధాలకి న్యాయం చెయ్యలేకపోతే అది మరో కొత్త దుఃఖానికి కారణం కావచ్చు. నీకు మరీ, మరీ ధన్యవాదాలు” అంటూ ఫోన్ పెట్టేసాడు మాధవ.

‘మాధవకి నా మనసులోని మాట అతన్ని నొప్పించకుండా చెప్పానో లేదో!’ అని మధనపడింది విశాల.

‘నేనిలా అడిగి విశాల మనసు నొచ్చుకునేలా చేశానేమో!’ అని బాధపడ్డాడు మాధవ.

మరో గంట తర్వాత విశాల పంపిన ‘గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ఎవర్’ అన్న మెసేజ్‌కి జవాబుగా స్నేహంగా చేతులు కలుపుతున్న గుర్తుపెట్టాడు మాధవ. ఆ రాత్రి ఇద్దరూ హాయిగా నిద్రపోయారు.

***

ఒకరోజు రాత్రి తొమ్మిదిగంటలకి వియ్యపురాలికి ఫోన్ చేసింది వసంత.

“వదినా! ఏం చేస్తున్నారు? భోజనాలు అయ్యాయా? లవకుశులెలా ఉన్నారు?” అనడిగింది

“ఇప్పటిదాకా చదువుకుని ఇప్పుడే పడుకున్నట్టున్నారు. క్లాస్‌లో ఫస్ట్ వస్తారిద్దరూ! ఎంతయినా టీచర్ గారి మనవలు కదా!” అందామె.

“భలేవారే! మీరు కదా, వాళ్ళని నిత్యం వెనక వుండి చదివించేది. సెలవులకి వచ్చినప్పుడే నా దగ్గరుండేది వాళ్ళు. ఊరికే చేసాను. పగలెప్పుడైనా చేస్తాను వదినా!” అంటూ ఫోన్ పెట్టేసింది వసంత.

“ఎవరితో మాట్లాడుతున్నావు?” అడిగాడు వెంకట్రావు.

“నిర్మలత్తగారు” అంది వసంత.

 “నిర్మలేం చేస్తోందో?”

“పిల్లల్ని చదివిస్తూ ఉన్నట్టుంది”

“నువ్వు మాట్లాడలేదా?”

“మీ అమ్మాయెప్పుడైనా ఫోన్‌లో మాట్లాడుతుందా? నేను చేసినా ఫోన్ ఎత్తదు. అందుకే ఎపుడైనా వాళ్ళత్తగారిని పలకరిస్తుంటాను” అంది వసంత అలమారులోంచి దుప్పట్లు తీస్తూ

“దాని తత్వమే అంత! చక్కని ప్రవర్తన తెలీదు. అయినా మనం మాత్రం దానితో ప్రేమగానే ఉండాలి!”

“అది విదిలించి కొడుతూ ఉన్నా దాని వెనకే తిరగనా? మీ కొడుకలా చేసుంటే మీకర్థం అయ్యేది! నేను ముప్ఫయ్ ఐదేళ్లు టీచర్‌గా ఉద్యోగం చేశాను. నాకంతా గౌరవం ఇచ్చారు, ఇది తప్ప!”

“అవన్నీ మనసులో పెట్టుకోకూడదు”

“అంటే ముసలితనంలో అది నన్ను చూడాలన్న ఆశతో దాంతో మంచిగా ఉండమంటారా?”

“అది కాదు వసూ! కోపం వద్దు. శాంతంగా ఉండాలి. దానికి పరిణతి వచ్చేవరకూ మనం వేచి చూడాలి తప్ప బాధపడకూడదు. ఎంతయినా పిల్లలకి మనమూ, మనకి వాళ్ళూ తప్ప ఇంకెవరుంటారు చివరిదాకా?”

“అదేమయినా చిన్న పిల్లా? ముప్ఫయి నాలుగేళ్లున్నాయి. తల్లితండ్రులపై దయలేని పుత్రుల్ని చూసాను కానీ పుత్రికల్ని చూడలేదు”

“వాళ్ళెలా ఉన్నా మన ప్రేమలో లోపం ఉండకూడదు”

“ఇప్పుడు నేనేమైనా దానితో దెబ్బలాడుతున్నానా? నా వంతు ప్రేమనందిస్తూనే ఉన్నాను కదా!”

“మనసులో మథనపడుతున్నావు. అది కూడా తప్పే! దాని మూర్ఖత్వానికి సమాధానంగా మనం దాన్నింకా ఎక్కువగా ప్రేమించడమే సరైన మార్గం!”

“అంటే దానింటికి వెళ్లి గిన్నెలు తోమి రమ్మంటారా?” అంటుంటే పెదాలు అదిరి ఆమెకి కళ్ళనీళ్ళొచ్చాయి.

“ఓర్పు వహించు! అంతే తప్ప మనసును కష్టపెట్టుకోకు! అది నీ హుందాతనానికి తగదు. ఇంక ఈ విషయం వదిలేసి, వచ్చి హాయిగా కళ్ళు మూసుకుని పడుకో!” అంటూ ఆమెకి దుప్పటి కప్పి, “ఈ మూవ్ ఆయింట్మెంట్ రాస్తానుండు” అంటూ నుదిటి మీదా, కణతల మీదా రాస్తున్న భర్త ఆదరణకు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా నిద్రపోయింది వసంత.

మర్నాడు ఆదివారం. మధ్యాహ్నం భోజనాలయ్యాక “సాయంత్రం నిర్మల ఇంటికెళ్ళొద్దామా?” అన్న భర్త మాటకి “తనెప్పుడూ రమ్మని అననే అనదు. నాకు వెళ్లాలనే ఉంటుంది. వెళదాం లెండి. ఆటో అబ్బాయికి ఫోన్ చేస్తాను. వెళ్ళేటప్పుడు పిల్లలకి తినడానికి ఏమైనా తీసుకుందాం దారిలో, ఆవిడకి కొన్ని పళ్ళు కూడా” అంటూ తయారయ్యే పనిలో పడింది వసంత.

ఇద్దరూ మూడున్నర కల్లా బయలుదేరి అన్నీ కొనుక్కుని వెళ్లేసరికి నాలుగయింది. వియ్యపురాలు ఎదురొచ్చి సంతోషపడింది “రండి రండి అన్నయ్యా, వదినా!” అంటూ.

ఇద్దరికీ మంచినీళ్ళిచ్చింది. అవి తాగి, తాను తెచ్చిన పళ్ళు ఆమె చేతిలో పెట్టి, పిల్లల స్నాక్స్ టేబుల్ మీద పెట్టింది వసంత.

“మీ చాదస్తం!” అంటూ పళ్ళ కవర్ అందుకుని “నిర్మలా ఎవరొచ్చేరో చూడు” అంది గట్టిగా.

నిర్మలా, పిల్లలూ బైటికొచ్చారు తమ గదిలోనుంచి. “మా అబ్బాయీ, ఈయనా పని మీద రాజమండ్రి వెళ్లారు” అందామె. నిర్మల వచ్చి తల్లి తండ్రుల పక్కన కూర్చుని పలకరించింది. కొంతసేపయ్యాక, “పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్లడానికి రెడీ అయ్యాను. వెళ్ళనా? అత్తయ్య ఉంటారు కదా!” అంటూ లేచింది.

“రేపెళ్లొచ్చు లెద్దూ మానెయ్యి!” అంది నిర్మలత్తగారు.

“ఫర్వాలేదులే! వెళ్ళండి” అన్నారు వసంతా, వెంకట్రావూ.

“బై అమ్మా! బై నాన్నా!” అంటూ బయలుదేరింది నిర్మల. పిల్లలు కూడా ‘బై’ చెప్పారు.

మరో అరగంట కూర్చుని వచ్చేసారు వసంతా, వెంకట్రావూ.

ఆటోలో తిరిగి వస్తుంటే “అలా వెళ్లిపోయిందేమిటీ నిర్మలా? పోనీ ఆ పార్క్‌కి మనల్ని కూడా తీసుకెళితే అక్కడ పిల్లలాడుకుంటుంటే చూసేవాళ్ళం కదా! వెళ్లేప్పుడు మనింటి దగ్గర దింపేస్తే సరిపోయేది” అన్నాడు.

వసంత జవాబు చెప్పకుండా విననట్టు ఊరుకుంది. ‘ఎవరికి వాళ్ళకి అనుభవం అయినప్పుడే తత్వం అర్థం అవుతుంది. మరొకళ్ళు చెప్పినప్పుడు బోలెడన్ని సూక్తులు చెబుతారు’ అనుకుంది మనసులో.

***

ఒకరోజు భర్త షాప్ కెళ్ళాక సోఫాలు దులుపుకుంటూ ఉంటే ఒక తెలీని నంబర్ నుంచి ఫోన్ వచ్చింది వసంతకి. ‘ఎవరబ్బా?’ అనుకుంటూ ఎత్తింది. “నేను పిన్నీ భాస్కర్‌ని, మీ భానక్క కొడుకుని” అన్నాడు.

“చెప్పు నాన్నా! ఆమ్మ ఎలా ఉందీ?”

“మీరే అడగండి. రేపు మీ ఇంటికొస్తానంటోంది. తీసుకు రమ్మంటారా? మీరు ఖాళీగా ఉన్నారా?”

“ఖాళీయే నాన్నా! తీసుకొచ్చెయ్యి. నాలుగు రోజులుండేలా రమ్మని చెప్పు” అంది.

“అలాగే పిన్నీ. రెండు రోజులయ్యాక నేనే వచ్చి తీసుకు వెళతాను”

“అలాగే నాన్నా!” అంటూ ఫోన్ పెట్టేసిన వసంతకి ఎక్కడలేని హుషారూ వచ్చేసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here