[dropcap]సి[/dropcap]నిమా, సంగీతం, కళలు, క్రీడలు – ఇలా ఏ రంగమైనా, అందులో విశేష ప్రతిభ కనబరిచిన అలనాటి కొందరు వ్యక్తుల గురించి, వారి జీవితంలోని కొన్ని విశిష్ట ఘటనల గురించి, ఉదాత్త ఆశయాలతో జరిగిన కొన్ని కార్యక్రమాల గురించి అరుదైన విషయాలను అపురూపమైన చిత్రాలతో ‘అలనాటి అపురూపాలు’ పేరిట సంచిక పాఠకులకు అందిస్తున్నారు లక్ష్మీ ప్రియ పాకనాటి.
విషాదాల వ్యక్తిగత జీవితం – డింపుల్ కపాడియా:
ఆమె వదనం ఆమె కాన్వాస్ లాంటిది. ఎన్నో రేఖలను, ఛాయలను ప్రదర్శిస్తుంది. ఆమె కళ్ళు గత జీవితంలోని ఋతువుల అల్లరికి అద్దం పడతాయి. డింపుల్ కపాడియా గురించి చెబుతూ, ప్రముఖ దర్శకుడు మృణాల్ సేన్ ‘ఆమె వదనం ఒంటరితనపు రమ్యదృశ్యం’ అని పేర్కొన్నారు. అయితే ఆమె ముఖం ప్రతిబింబించని వేదనలెన్నో ఆమె జీవితంలో ఉన్నాయి. చిన్న వయసులోనే సినీ ప్రపంచంలో కీర్తి ప్రతిష్ఠలు సంపాదించి, అతి తక్కువ సమయంలో స్టార్‍డమ్ సాధించిన డింపుల్ కపాడియా, 1973లో రాజేష్ ఖన్నాని వివాహం చేసుకోవడం కోసం – వాటన్నింటిని తృణప్రాయంగా వదిలేశారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘బాబీ’ సినిమాతో వచ్చిన ప్రత్యేక గుర్తింపుని సూపర్‌స్టార్ అయిన భర్త కోసం – అప్పటికింకా టీనేజ్ లోనే ఉన్న డింపుల్ – వదులుకున్నారు. ఆ తరువాత ఇద్దరు పిల్లల్ని కన్నారు. సినీరంగంలో భర్త ప్రాభవం క్షీణించడానికి సాక్షిగా నిలిచారు.
ఓ దశాబ్దం తరువాత, బంధం విచ్ఛిన్నమైంది. చెదిరిన జీవితాన్ని కుదురుపరుచుకుంటూ మళ్ళీ సినిమాల్లోకి ప్రవేశించారు. ఎన్నో అద్భుతమైన పాత్రలకి ప్రాణం పోశారు. ఐత్‌బార్, కాష్, రుదాలి, లేకిన్, అంగార్, దిల్ చాహ్తా హై, బీయింగ్ సైరస్, లక్ బై ఛాన్స్ వంటి సినిమాల్లో ఆమె నటన విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
డింపుల్ సినీ కెరీర్‍కి సమాంతరంగా సాగిన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో విషాదాలున్నాయి. 1991లో చిన్న చెల్లెల్లు, నటి రీమ్ కపాడియా హఠాన్మరణం; మరో చెల్లెలు – నటి/కాస్ట్యూమ్ డిజైనర్ సింపుల్ కపాడియా 2009లో కేన్సర్‍కు బలికావడం; ఈ ఘటన జరిగిన 45 రోజులకి, క్రిస్‍మస్ ముందు రోజున 24 డిసెంబర్ 2009 నాడు తమ్ముడు సుహైల్ కపాడియా (మున్నా) రోడ్డు ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్ళిపోవడం జరిగాయి. తల్లిలా తమ్ముడికి సేవలు చేసిన డింపుల్ – అతని మరణాన్ని తట్టుకోలేకపోయారు. ఇది జరిగిన కొన్ని నెలలకే 2012లో మాజీ భర్త రాజేష్ ఖన్నా మృతి చెందారు. రాజేష్ ఖన్నా చివరి రోజుల్లో ఆయన ప్రక్కనే ఉన్నారు డింపుల్. అతి తక్కువ సంఖ్యలో సినిమాలు, ఆస్వాదించగలిగే కొన్ని బంధాలతో నేడు ప్రశాంత జీవనం గడుపుతున్నారు డింపుల్. ఇటీవల 65వ పుట్టిన రోజు జరుపుకున్న డింపుల్ జీవితం, వ్యక్తిత్వం గురించి ఆమె పెంపుడు కొడుకు, నటుడు కరణ్ కపాడియా ఎన్నో విషయాలు చెప్పారు.
ప్రేమమయి పెద్దమ్మ:
మా చిన్నప్పుడు మేము జుహూలోని ఓ పెద్ద భవంతిలో ఉండేవాళ్ళం. మాది ఉమ్మడి కుటుంబం. ఇంట్లో అమ్మమ్మ (స్వర్గీయ బెట్టీ కపాడియా), అమ్మ (సింపుల్ కపాడియా), ‘ఆంటూ’ (డింపుల్ కపాడియాని కరణ్ ముద్దుగా పిలిచే పేరు), ఇంకా అక్కలు ట్వింకిల్ (ఖన్నా), రింకీ (ఖన్నా) ఉండేవాళ్ళం. ఆ రోజుల్లో ఆంటూ – రోజంతా షూటింగులతో తీరిక లేకుండా ఉండేది. నాకు నాలుగేళ్ళ వయసులో 1997లో ఆంటూ ఇంకో ఇంటికి మారింది.
ఆంటూకి కళలన్నా, కళాకృతులన్నా బాగా ఇష్టం. నా చిన్నతనంలో ఒకసారి పెద్దమ్మ ఇంట్లో ఫుట్‍బాల్ ఆడుతున్నాను. బంతి వెళ్ళి గోడకి అలకరించిన ఒక శిలువకి తగిలింది (అది పెద్దమ్మకి కానుకగా వచ్చినది). అది క్రింద పడి ముక్కలైపోయింది. నేను చాలా భయపడిపోయాను, తర్వాత రెండు నెలల పాటు పెద్దమ్మ ఇంటికి వెళ్ళలేదు. తర్వాత ఓ రోజు పెద్దమ్మ ఇంటికి వెళ్ళినప్పుడు ఎవరితోనో మాట్లాడుతోంది. తనకి కానుకగా వచ్చిన అందమైన శిలువ ముక్కలైపోయిందని, ఎవరు పగలగొట్టారో తెలియలేదని అంది. నేను అమాయకంగా, ‘ఎవరు పగలగొట్టారు ఆంటూ’ అని అడిగాను. ఆమె కోపం నటిస్తూ, “రాస్కెల్ నువ్వే. నువ్వే దాన్ని పగలగొట్టావు!” అంది.
అమ్మకి జబ్బు చేసినప్పుడు (సింపుల్ కపాడియాకి కేన్సర్ సోకినట్లు 2006లో తెలిసింది) నేను పెద్దమ్మకి దగ్గరయ్యాను. అప్పుడు నాకు 11 ఏళ్ళు ఉంటాయేమో. ఏం చేయాలో తెలియని వయసు. అమ్మమ్మ బాగా పెద్దదయిపోయింది. అందువల్ల అమ్మని పెద్దమ్మ చూసుకుంది. అమ్మని నన్ను వాళ్ళింటికి మకాం మార్చేలా చేసింది. అమ్మని వీలైనంత సౌకర్యంగా ఉంచేలా చూసింది పెద్దమ్మ. ఎప్పుడూ అమ్మ తోటే ఉండేది, సరిగా నిద్రపోయేది కాదు, తన అవసరాలు పట్టించుకునేది కాదు. డాక్టర్లతో మాట్లాడుతూ అమ్మ చికిత్సని పర్యవేక్షించేది. అన్ని స్థాయిలలోనూ పూర్తిగా బాధ్యత తీసుకుంది. ఈ విషయాన్ని నేనెన్నటికీ మర్చిపోలేను. జీవితాంతం పెద్దమ్మకి ఋణపడి ఉంటాను.
నాది ఆడవాళ్ళ ప్రపంచం:
ఆడవాళ్ళే ఎక్కువగా ఉన్న ఇంట్లో పెరిగాను. ఇంట్లో అమ్మమ్మ, పెద్దమ్మ, అమ్మ – అందరూ నాకు అమ్మలే. అక్కలు ట్వింకిల్, రింకీలు కూడా నాపై మాతృవాత్సల్యం చూపేవారు. ఆడవాళ్ళే మా ఇంటి ‘మగాళ్లు’. ట్వింకిల్ 18వ ఏట నుంచే పని చేయసాగంది, సొంత కారు కొనుక్కుంది. రింకో బోస్టన్‍కి వెళ్ళింది, థియేటర్ కోర్స్ చేసింది, కొన్ని సినిమాల్లో నటించింది. పెద్దమ్మే ఇంటికి యజమాని, పునాది కూడా. మా అందరి సంరక్షణ చూసేది. ఎప్పుడూ మాతోనే ఉండేది కాబట్టి – మా మీద నుంచి ఎంత భారం తొలగిపోయిందో!
అమ్మ చనిపోయిన (10 నవంబర్ 2009) కొద్ది రోజులకే మున్నా మావయ్య (సొహైల్ కపాడియా) యాక్సిడెంట్‍కి గురయ్యారు. వరుసగా విషాదాలు సంభవిస్తున్న కాలంలో పెద్దమ్మ చెప్పిన “కష్టకాలం గురించి నాకో నిజం తెలుసు! అది ఎక్కువ కాలం ఉండదు. ఏదో ఒక సమయంలో అది మారుతుంది. మంచి కాలం విషయంలో కూడా ఇది నిజం. కష్టమనా, సుఖమైనా ఏదీ శాశ్వతంగా ఉండదు” అనే మాటలు నాపై గట్టి ముద్ర వేశాయి. ఈ దృక్పథం నాకెంతో మేలు చేసింది. ఇలా ఆలోచించలేకపోతే మనం క్రుంగిపోతాం, అధోగతికి దిగజారుతాం. ‘బాధితురాలు’ అనిపించుకోవడం ఆంటూకి ఇష్టం ఉండదు. జీవితం తన పట్ల అన్యాయంగా ఉందని ఆమె అనడం నేనెప్పుడూ వినలేదు.
నేను ఎదుగుతున్న సమయంలో నానుండి ఎన్నో నిజాలను దాచారు, ఎందుకంటే ఓ పిల్లాడిగా నేను వాటిని తట్టుకోలేకపోయి ఉండేవాడిని. అమ్మ పరిస్థితిని నాకు తెలియనిచ్చేవారు కాదు. ఇప్పుడు నేను ఎదిగాను, నాకిప్పుడు 28 ఏళ్ళు. ఆంటూతో గత 13 ఏళ్లుగా కలిసి ఉంటున్నాను. కాలం గడిచేకొద్దీ ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. అప్పట్లో తనని బాధించినవాటి గురించి చెప్పేది ఆంటూ.
సౌందర్యం, నటన:
ఆంటూ గొప్ప అందగత్తె అనేది కాదనలేని వాస్తవం. అయితే ఆమె పూర్తిగా వృత్తికే అంకితమైపోలేదు. ఆమె 16 ఏళ్ళకే పని చేయడం ప్రారంభించారు. ఇప్పటికి అర్ధ శతాబ్దం గడిచింది. తన వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఎవరైనా ఎంత కాలం అలా ఉండగలరు? సాధారణంగా వయసుతో పాటు అణుకువ పెరుగుతుంది. కానీ ఆంటూ మొదటి నుంచి అణుకువగానే ఉంది. తన పని మీద, తన ప్రదర్శన మీద దృష్టి నిలుపుతుంది. ఇక్కడికి దాకా రాగలిగిందంటే బాహ్య సౌందర్యంతో పాటు అంతర్గత సౌందర్యం వల్లనే. పైగా తన ప్రతిభకి పట్టుదల తోడవడంతో ఈ స్థితిలో ఉంది.
ఆంటూకి అద్దంతో పెద్దగా పని లేదు. వయసు పెరగటం పట్ల ఆమెకి భయాలు లేవు. గత కొద్ది కాలంగా సినిమాల్లో ఎక్కువగా నటిస్తుండడం వల్ల [క్రిస్టోఫర్ నోలాన్ – ‘టెనెట్’ (2020); థ్రిల్లర్ సీరిస్ ‘తాండవ్’ (2021); అయాన్ ముఖర్జీ ‘బ్రహ్మాస్త్ర’ (2022)] పాత్రల కోసం – జుట్టుకు రంగు వేసుకుంటోంది. వయసు పెరగడాన్ని హుందాగా స్వీకరించినందుకు నాకు ఆంటూపై గౌరవం పెరిగింది. ఆమె అందమైన కేశాలంటే నాకు చాలా ఇష్టం. అయితే ఆమె ప్రత్యేకించి కేశ సంరక్షణ చేయడం నేను చూడలేదు. సహజంగా ఉండేది. నా జుట్టు చుట్టలు చుట్టలుగా ఉంటుంది. నాకేవైనా టిప్స్ చెప్పమంటే, అలాంటి టెక్నిక్స్ ఏవీ లేవని, సహజంగా రావాలని అంది ఆంటూ. తనూ ఫూడీ అయినా సినిమాలకి పని చేస్తున్నప్పుడు డైట్ విషయంలో ఖచ్చితంగా ఉంటుంది. తన వృత్తి నిబద్ధత గొప్పది. వీలైనంత చక్కగా కనిపిస్తూ, పాత్రకు తగ్గట్టుగా ఉండాలని అనుకుంటుంది. షూటింగులు లేనప్పుడు తనకి నచ్చినవి తింటుంది.
సహృదయత – కళ:
అనుభవాలు ఆంటూని రాటుదేల్చాయి. ఆమె జీవితం ఓ సినిమా లాంటిది, ఉత్థానపతనాలు, విజయాలు పరాజయాలు, విషాదాలు. ఆంటూ ఎన్నో చూసింది. ఎంతో వేదనని అనుభవించింది. ఆమె స్థానంలో మనల్ని ఊహించుకోడం చాలా కష్టం. అయితే వాటన్నంటిని ఆమె తట్టుకుంది. అందుకు ఆమె వ్యక్తిత్వం, మనుషులతో ఆమె ఏర్పర్చుకున్న సంబంధాలే కారణం. ఆమె మాకోసం చేసినవి మేము ఆమె కోసం చేయలేం. కానీ ఆమెకి మేమెప్పుడూ అండగా ఉంటాం. అయితే ఆమె దిగులుగా ఉన్న విషయం మనకి తెలియనివ్వదు. ఎప్పుడూ సానుకూలంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది.
కుటుంబం కోసమే కాదు, స్నేహితుల కోసం కూడా ఆంటూ ముందుంటుంది. డబ్బు కోసం ఒకరిని మోసం చేయాల్సొచ్చిందని ఆంటూకి చెప్పినా, ఆమె సాయం చేస్తుంది. ఒక్కోసారి నేనూ ఆంటూకి చెప్తుంటాను – డబ్బే కాదు, ప్రేమనీ, శక్తినీ కూడా అంతలా పంచడం సరికాదని. కానీ అదే ఆమె ప్రత్యేకత. ఆమె చేసిన మంచి అంతా మళ్ళీ ఆమెకే తిరిగి వచ్చింది.
పెయింటింగ్ ఆమెకి ఒక హాబీ మాత్రమే కాదు. ఒక రకం ధ్యానం వంటింది. తన కోసం తాను చేసేకునే పని. అందుకే తన చిత్రాలను ఎన్నడూ ప్రదర్శనకి పెట్టలేదు. తన చిత్రాలలో ఏంజల్స్, అబ్‍స్ట్రాక్ట్స్ ఉంటాయి. సాధారణంగా తను రంగులతో ఆడుకుంటుంది. పెయింటింగ్ టెక్నిక్స్ తెలిపే వీడియోలను చూస్తుంది. ఫింగర్ పెయింటింగ్ గురించి చూసి, దాన్ని సాధన చేసింది. చక్కని శక్తి, సానుకుల వాతావరణం, మంచి పనులలో నమ్మకం కలిగి ఉంటుంది. ఆంటూకి పర్వతాలంటే ఇష్టం. అక్కడ సమయం గడపటమన్నా, పెయింటింగ్ వేయడమన్నా మరీ ఇష్టం. అవన్నీ ఆస్వాదించాలంటే మనలో ఎంతో కొంత ఆధ్యాత్మికత ఉండాలి.
నేను గతంలో చెప్పాను, ఇప్పుడు చెబుతున్నాను, నేను నాన్నతో పెరగలేదు. బదులుగా ఇద్దరు అమ్మలతో పెరిగాను. అందులో ఒకరు మా ఆంటూ. ఇది నా అదృష్టంగా భావిస్తాను.
***
ఇవీ తన పెద్దమ్మ డింపుల్ కపాడియా గురించి నటుడు కరణ్ కపాడియా చెప్పిన విశేషాలు.
నాటక, సినీ రంగాల దిగ్గజం – పృథ్వీరాజ్ కపూర్:
నేటి బాలీవుడ్‍కి ఆధారమైన అనేక ప్రతిభామూర్తులలో ఒకరు పృథ్వీరాజ్ కపూర్. భారతీయ సినీ పరిశ్రమలో ప్రఖ్యాత ‘కపూర్’ వంశానికి గట్టి పునాది వేశారాయన.
ఒక రంగస్థల నటుడిగా ప్రస్థానం మొదలుపెట్టి దేశవ్యాప్తంగా నాటక రంగాన్ని ప్రోత్సహించడానికి పలు సృజనాత్మక చర్యలు చేపట్టారాన. పృథ్వీ థియేటర్ వ్యవస్థాపకులాయన. దో ధారీ తల్వార్, సినిమా గర్ల్, ప్రిన్స్ విజయ్ కుమార్ వంటి ఎన్నో మూకీ సినిమాల్లో కనబడ్డారాయన. తరువాత, దేశపు తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’లో నటించారు. మొఘల్-ఎ-ఆజామ్ (1960) చిత్రంలో ఆయన పోషించిన అక్బర్ చక్రవర్తి పాత్రని మరువగలమా? 1971లో విడుదలైన ‘కల్ ఆజ్ ఔర్ కల్’ సినిమాలో తన కుమారుడు రాజ్ కపూర్ తోనూ, మనుమడు రణధీర్ కపూర్‍తోనూ కలిసి నటించారు.
భారతీయ చలనచిత్ర రంగానికి ఆయన చేసిన సేవలను ఒకసారి గుర్తు చేసుకుందాం.
***
పృథ్వీరాజ్ కపూర్ 1906లో ఒక పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి పోలీసు శాఖలో పని చేసేవారు. 22 ఏళ్ళ వయసు నుండి పృథ్వీరాజ్ కపూర్ నాటకాలలో నటించసాగారు. తరువాతి కాలంలో ఆయన బొంబాయికి మకాం మార్చారు. నటన అంటే ఉన్న ఆసక్తి కారణంగా, సినిమాల్లో ప్రవేశించాలని భావించారు. తక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించినప్పటికీ, ఆయన సినీ పరిశ్రమలో తమ కుటుంబానికి గట్టి పునాది వేశారు.
తనకి 17 ఏళ్ళ వయసులో పృథ్వీరాజ్ కపూర్ – రామ్‌శరణి మెహ్రాను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు రాజ్ కపూర్, షమ్మీ కపూర్, శశి కపూర్ అనే కుమారులు కలిగారు. వీరు ముగ్గురూ కూడా చిన్నతనంలో సినీ పరిశ్రమలో ప్రవేశించి తమ తండ్రి వారసత్వాన్ని కొనసాగించారు.
ఎన్నో మూకీ సినిమాల్లో నటించిన పృథ్వీరాజ్ కపూర్, మన దేశపు తొలి టాకీ సినిమా ‘ఆలం ఆరా’లో ఓ సహాయక పాత్రలో నటించారు. నాటకరంగంలో ప్రజ్ఞాశాలి అనిపించుకున్న ఆయన వెండితెర మీద కూడా తన ప్రతిభను చాటుకున్నారు.
పృథ్వీ థియేటర్:
రంగస్థలం అంటే మక్కువ కలిగిన పృథ్వీరాజ్ కపూర్ ఎన్నో నాటకలలో నటించారు. సొంతంగా ‘పృథ్వీ థియేటర్’ అనే సంస్థను స్థాపించి, విజయవంతంగా నడిపించారు. ఇది ఒక ట్రావెలింగ్ థియేటర్. దేశవ్యాప్తంగా తమ బృందంతో సంచరిస్తూ – భిన్న సంస్కృతులకు, వివిధ జాతులు చెందిన ప్రజల ముందు, కొన్ని సార్లు ఆంగ్లేయుల ముందు కూడా నాటకాలను ప్రదర్శించారు.
ఈ సంస్థ దాదాపుగా 16 ఏళ్ళ పాటు కొనసాగి 2,662 ప్రదర్శనలిచ్చింది. ఈ అన్ని ప్రదర్శనలలోనూ కథానాయకుడు ఆయనే. ఈలోపు, ఆయన పెద్ద కుమారుడు రాజ్ కపూర్ సినీ రంగంలో ప్రవేశించి నిర్మాతగా సినిమాలు తీయసాగారు.
బ్రిటీష్ వారి పాలన అంతమయ్యాకా, ట్రావెలింగ్ థియేటర్ సుదీర్ఘ కాలం పాటు కొనసాగడం కష్టమని గ్రహించారు పృథ్వీరాజ్ కపూర్. నాటకాల టికెట్లు అమ్మగా వచ్చే ఆదాయం – ప్రయాణ వ్యయాలు, సామాగ్రి, కాస్ట్యూమ్స్ వ్యయాలకు ఏ మాత్రం సరిపోయేది కాదు.
ఆ తరువాత ఆయన – తన కుమారులతో సహా ఇతర నిర్మాత దర్శకులు తీసే చిత్రాలలో సహాయక పాత్రలు పోషించారు.
వంశవృక్షం:
పృథ్వీరాజ్ కపూర్ 1906లో ఆనాటి బ్రిటీష్ ఇండియాలోని (నేటి పాకిస్తాన్ లోని) పంజాబ్ ప్రాంతంలోని సముందరీ అనే ఊరిలో జన్మించారు. 1923లో ఆయనకి రామ్‌శరణి మెహ్రాతో వివాహమయింది. అప్పుడామె వయసు 14 ఏళ్ళు. ఆ మరుసటి సంవత్సరం వారికి బాలీవుడ్ నటుడు, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్ జన్మించారు. 1927లో పృథ్వీరాజ్ కపూర్ బొంబాయి వచ్చేశారు. ఇక్కడ ఈ దంపతులకు , షమ్మీ కపూర్, శశి కపూర్, ఇంకా ఊర్మిలా సియాల్ అనే కుమార్తె జన్మించారు.
రాజ్ కపూర్ కృష్ణ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కొడుకులు, ఇద్దరు కుమార్తెలు. రాజ్ కపూర్ పెద్ద కొడుకైన రణ్‍ధీర్ కపూర్ బబితను పెళ్ళి చేసుకున్నారు. పెద్ద కుమార్తె రీతూ నందా – రాజన్ నందాని; రెండో కొడుకు రిషీ కపూర్ నీతూ సింగ్‍ని వివాహం చేసుకున్నారు. రీమా కపూర్ జైన్ – మనోజ్ జైన్‌ను పెళ్ళి చేసుకున్నారు. రాజ్ కపూర్ చిన్న కొడుకు రాజీవ్ కపూర్.
షమ్మీ కపూర్‍కి రెండు సార్లు వివాహమయింది. ఆయన మొదటి భార్య గీతా బాలీ 1965లో చనిపోయారు. వీరికి ఆదిత్య రాజ్ కపూర్ అనే కుమారుడు కలిగాడు. తరువాత ఆయన 1969లో నీలా దేవి గోహిల్‍ను వివాహం చేసుకున్నారు.
పృథ్వీరాజ్ కపూర్ కుమారుల్లో చిన్నవాడయిన శశి కపూర్ ఆంగ్ల నటి జెన్నీఫర్ కెండాల్‍ను 1958లో వివాహం చేసుకున్నారు. వీరికి కునాల్ కపూర్, కరణ్ కపూర్, సంజనా కపూర్ అనే ముగ్గురు పిల్లలున్నారు. జెన్నీఫర్ 1984లో మరణించారు.
ఈ వంశంలో నాలుగవ తరంలో రణ్‍ధీర్ కపూర్ కుమార్తెలు కరిష్మా కపూర్, కరీనా కపూర్‍లు. కరిష్మాకి ఇద్దరు పిల్లలు. కరీనా నటుడు సైఫ్ అలీ ఖాన్‍ని పెళ్ళి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.
రిషీ కపూర్ కుమారుడు రణ్‍బీర్ కపూర్ నేడు బాలీవుడ్‍లో డిమాండ్ ఉన్న నటుడు. రిషీ కపూర్ కుమార్తె రిద్ధిమా కపూర్ సహాని సినీ రంగానికి దూరంగా ఉన్నారు. ఆమెకి పెళ్ళయి, ఒక కుమార్తె ఉంది.
రాజ్ కపూర్ రెండో కుమార్తె రీమా జైన్‍కి అర్మాన్ జైన్, ఆదార్ జైన్ అనే కుమారులున్నారు. అర్మాన్ ‘లేకర్ హమ్ దీవానా దిల్’ అనే చిత్రంలో నటించాడు. ఆదార్ జైన్ ఇంకా సినీ రంగ ప్రవేశం చేయలేదు.
***
ఇవీ పృథ్వీరాజ్ కపూర్ సినీ, కుటుంబ వివరాలు.