చిరుజల్లు-83

0
3

[ప్రసిద్ధ రచయిత శ్రీధర గారు అందిస్తున్న ఫీచర్ ‘చిరుజల్లు’.]

గులాబీలు

[dropcap]ద[/dropcap]సరాకి ఇంటికి బయల్దేరింది స్రవంతి.

ఏడాది కిందట ఢిల్లీకి వచ్చింది. ఎప్పటికప్పుడు ఇంటికి వెళ్లాలని ప్రయత్నించినా కొత్తగా చేరిన ఉద్యోగం గనుక సెలవు ఇవ్వలేదు. ఇప్పుడు అయినా అతి కష్టం మీద నాలుగు రోజులు సెలవు సంపాదించింది. లక్కీగా మరో మూడు రోజులు సెలవులు కల్సివచ్చాయి.

న్యూఢిల్లీలో రైలు ఎక్కింది. ఆంధ్రప్రదేశ్ ఎక్స్‌ప్రెస్ కాబట్టి అందరూ తెలుగులోనే మాట్లాడుకుంటున్నారు.

ఇద్దరు కుర్రాళ్లు పై బెర్త్‌ల మీద సామాను సర్దుకున్నారు. వాళ్లను సాగనంపటానికి మరో ఇద్దరు కుర్రాళ్లు వచ్చారు. అంతా కంప్యూటర్ ఇంజనీర్లు. రేపో మాపో వెళ్లబోయే అమెరికా గురించి, వీసా గురించి మాట్లాడుకుంటున్నారు.

“అరే, రెండు నెలలకోసారి అమ్మను చూడందే ఉండలేనంటావు. రేపు స్టేట్స్ వెళ్తే ఎలారా?” అన్నాడు ఒకడు.

“అమ్మ మీద దిగులు, ఒక అమ్మడు తగిలేంత వరకేరా. ఆ తరువాత అమ్మ అసలు గుర్తుండదు” అన్నాడు ఇంకొకడు.

రైలు బయల్దేరబోయే టైం అయింది. సాగనంపటానికి వచ్చిన వాళ్లు బై చెబుతున్నారు.

స్రవంతి కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. కాశ్యప కంగారుగా వస్తున్నాడు. తన కంపార్ట్‌మెంట్ వెతుక్కుంటూ ముందుకు వెళ్లాడు. అంటే అతనూ ఇదే రైలులో వస్తున్నాడన్న మాట. కాశ్యప తను పని చేసే కంపెనీలోనే మిడిల్ మేనేజ్‌మెంట్ లెవల్లో ఉన్నాడు. చాలా ఎఫిషియెంట్. అందరికీ అతనంటే ఎంతో గౌరవం.

రైలు బయలుదేరింది. పక్కన కూర్చున్న కుర్రళ్లు వాళ్ల ఆఫీసు గొడవలు మాట్లాడుకుంటున్నారు. ఎదుటి బెర్త్ మీద దంపతులు, ఒక చిన్న బాబు కూర్చున్నాడు. వాళ్లంతా ఏవో కబుర్లుల్లో పడ్డారు.

స్రవంతి కిటికీలో నుంచి బయటకు చూస్తోంది. ఆమెకు హైదరాబాదులోని తమ ఇల్లు, తమ కాలనీ, విశాలమైన రోడ్లూ అన్నీ గుర్తొచ్చాయి. ఇల్లు వదిలి ఏడాదే అయినా ఎంతో కాలం అయినట్లు ఉంది.

ముఖ్యంగా మామ్మగారు. ఆమెను తల్చుకోని రోజు లేదు. ఎప్పుడెప్పుడు ఆమె దగ్గరకు వెళ్లి కబుర్లు చెబుదామని ఉంది. ఆత్రంగా ఉంది.

మామ్మగారితో పరిచయం చాలా విచిత్రంగా జరిగింది. స్రవంతికి చదువు పూర్తి అయింది. ఉద్యోగం లేదు. రోజూ పేపర్లు తిరగేయ్యటం, అప్లికేషన్లు పంపిచంటంలో కాలం గడిచిపోతోంది.

పెళ్లి చేసి పంపించాలని తండ్రి తొందరపడుతున్నాడు. ఏదీ కల్సిరావటం లేదు.

తిని, ఇంట్లో కూర్చునందువల్ల, లావు అవుతానేమోనన్న భయం పట్టుకుంది. అందుచేత ఉదయం పూట వాకింగ్‌కు వెళ్లేది.

స్రవంతి రోజూ దాదాపుగా రెండు మైళ్లు కాలనీలో తిరిగేది. తమ వీధి చివరనున్న ఇంటి వైపు చూస్తూ వెళ్లేది. ఇంటి ముందున్న ఖాళీ స్థలంలో రకరకాల పూల మొక్కలు, విరిసీ విరియని పూలతో తలలూపుతుండేవి. ఇంట్లో ఎవరూ మనుష్యులు ఉన్న అలికిడి ఉండేది కాదు. కాంపౌండ్ గోడ మీద నుంచి ఒక గులాబీ కోసుకుందామా అనిపించేది. కానీ ఆడగకుండా కోసుకోవటం తప్పు కదా – అని ముందుకు నడిచేది.

ఒక రోజు అలా ఇంటి ముందు నిలబడి చూస్తుంటే, ఇంటి తలుపు తెరుచుకొని ఒక ముసలామె గేటు దాకా వచ్చింది.

“రోజూ కిటికీలో నుంచి నిన్ను చూస్తూనే ఉన్నాను. వాకింగ్‌కి వెళ్తున్నావా?” అని పలకరించింది.

“అవునండీ” అన్నది స్రవంతి.

“చాలా మంచి అలవాటు. వయసులో ఉండగా నేను ఎంత దూరం అయినా నడిచే వెళ్లేదాన్ని. ఇప్పుడూ నీతో పాటు నడవాలని ఉంది గానీ, ఎంతో దూరం నడవలేను” అని నవ్వింది.

మర్నాడు స్రవంతి వెళ్లే సమయానికి ఆమె గేటు దగ్గర నిలబడింది. “ఇంకా రాలేదేమా అని చూస్తున్నాను” అన్నది.

“అయ్యో, నా కోసం చూస్తూ నిలబడ్డారా? మంచు కురుస్తోంది. మీకు జలుబు చేస్తుందేమో?” అన్నది స్రవంతి.

“నా గురించి ఆలోచించే దాకా వచ్చావా అప్పుడే.. లోపలికి రారాదూ.. ఒక నిమిషం కూర్చోని మళ్లీ మొదలు పెడుదువుగాని. నీ సాహసయాత్ర..” అన్నదామె లోపలికి దారి తీస్తూ.

“ఆలస్యమైపోతోంది మామ్మగారూ” అంటూనే ఆమెను అనుసరించింది.

“నీకు ఆలస్యం చెయ్యాలని కాదు. నీ దృష్టి అంతా గులాబీల మీదనే ఉంటోంది. ఒక పువ్వు కోసి ఇస్తాను..” అంటూ పసుపు పచ్చని గులాబీని కోసి ఇచ్చింది.

 “చాలా థాంక్స్ మామ్మగారూ” అన్నది స్రవంతి సంతోషంగా పువ్వును తీసుకుంటూ.

మర్నాటి నుంచీ, రోజూ స్రవంతి రావటం, ఆమె ఒక గులాబీ పువ్వు కోసి ఇవ్వటం మామూలైపోయింది.

“రోజూ పసుపుపచ్చని గులాబీయే ఇస్తున్నారేం?” అని అడిగింది స్రవంతి.

“పసుపు పచ్చని గులాబీ స్నేహానికి చిహ్నం. ఎర్ర గులాబీ ప్రేమకు చిహ్నం..” అన్నది మామ్మగారు.

స్రవంతి నవ్వి ఊరుకుంది. ఆమె మళ్లీ అన్నది.

“నీకన్నా రెట్టింపు వయసు ఉంది నాకు. మనిద్దరి మధ్యా స్నేహం ఏమిటని అనుకుంటున్నావా? నిజమైన స్నేహం ఎప్పుడూ బామ్మకూ, మనవరాలికీ మధ్యనే ఉంటుంది.”

“మన స్నేహం ఇలానే దినదిన ప్రవర్ధమానం కావాలని కోరుకుంటున్నాను” అన్నది స్రవంతి.

ఆ రోజు నుంచీ రోజూ స్రవంతి ఆమె దగ్గర కూర్చుని ఓ అరగంట సేపు కబుర్లు చెప్పటం అలవాటు చేసుకుంది.

“మీకు ఎవరూ లేరా, మామ్మగారూ?” అని అడిగింది స్రవంతి.

“ఆ నిన్నటి దాకా ఎవరూ లేరు. ఇప్పుడే మనవరాలు దొరికింది కదా” అన్నదామె,

“అంటే మన స్నేహం చుట్టరికంలోకి దిగిందన్నమాట..” అని నవ్వింది స్రవంతి.

“చుట్టరికంలోకి దిగిందన్నమాటే గానీ, నువ్వు ఇప్పటి దాకా గుమ్మం ముందే నిలబడి పోతున్నావు గానీ, ఇంట్లోకి రావటం లేదు..” అన్నది మామ్మగారు.

స్రవంతికి ఇంటర్వ్యూకి పిలుపొచ్చింది. ఆ హడావుడిలో పడిపోయి రెండు రోజులు వాకింగ్‌కి వెళ్లలేదు.

మూడో రోజు మామ్మాగారు అడిగింది “ఏం మనవరాలా? ఈ మామ్మ మీద కోపం వచ్చిందా?”

“లేదండీ. ఇంటర్వ్యూ హడావుడిలో ఉండిపోయి రాలేదు. నా ప్రస్తుత సమస్య ఉద్యోగం. దాని కోసం తిరుగుతున్నాను.” అన్నది స్రవంతి.

రోజూ పేపర్లు తిరగేస్తోంది. ఢిల్లీ లోని ఒక పెద్ద కంపెనీలో ఖాళీలున్నాయని పేపర్లో ప్రకటన వచ్చింది.

ఆ విషయం మామ్మగారికి చెప్పింది. “కాని నేను అప్లికేషన్ పంపటం లేదు. వాళ్లకు అనుభవం ఉన్నవాళ్లు కావాలిట..”

“పోనీ ఓ కాగితం పడేసి చూడరాదు” అని సలహా ఇచ్చింది మామ్మగారు.

రెండు రోజుల తరువాత మళ్లీ గుర్తు చేసింది. “అప్లికేషన్ పంపావా?”

“లేదు.”

“అప్లయ్ చెయ్యి, నీకీ ఉద్యోగం వస్తుంది..” అన్నదామె.

“నాకు రాదు. ఇంటర్వ్యూకి కొన్ని వందల మందిని పిలుస్తారు. ఎంతో ఆశ పడుతూ వెళ్తాం. తీరా వెళ్లాక షరా మామూలే..”

“అలా అని చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటే ఉద్యోగాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయా? నీ ప్రయత్నం నువ్వు చేయాలి గదా.. నా మాట విని. నేను అన్నాను అంటే అయితీరుతుంది. నీకీ ఉద్యోగం తప్పకుండా వస్తుంది” అన్నది మామ్మగారు.

ఇద్దరి మధ్యా ఇదంతా ఏదో ఒక సరదా అయిన సంభాషణలాగానే సాగింది. కానీ మామ్మగారు, స్రవంతి ఆ ఉద్యోగానికి అఫ్లికేషన్ పంపేదాకా ఊరుకోలేదు.

“ఇంత ప్రేమగా మనవరాలా అని పిలుస్తారు. కానీ మీ పేరు కూడా నాకు చెప్పలేదు. మీ కుటుంబ సభ్యుల గురించి అసలే తెలియదు నాకు” అన్నది స్రవంతి.

“సరే అడిగావు గనుక చెబుతున్నాను. నా పేరు కనకదుర్గ.”

అంతకు మించి మరేమి చెప్పలేదు.

స్రవంతికి ఇంటర్వ్యూకి రమ్మని పిలుపు వచ్చింది.

“నువ్వు వెళ్లు. నీకీ ఉద్యోగం వచ్చి తీరుతుంది” అన్నదామె.

“అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నారు?”

“నేను అనను. అంటే అది అయితీరుతుంది” అన్నది మామ్మగారు గులాబీ పువ్వు అందిస్తూ.

స్రవంతి ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆమె కన్నా ఎక్కువ క్వాలిఫికేషన్, ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారూ ఇంటర్వ్యూకి వచ్చారు.

కానీ చిత్రంగా స్రవంతికి ఆ ఉద్యోగం వచ్చింది.

స్రవంతి ఢిల్లీలోనే ఉండి, ఉద్యోగంలో చేరిపోయింది. అన్ని విషయాలూ తెలియజేస్తూ మామ్మగారికి వివరంగా ఉత్తరం రాసింది. కానీ జవాబు రాలేదు.

ఏడాది తరువాత ఇప్పుడు మళ్లీ అక్కడికి వెళ్తోంది. స్రవంతి తండ్రి స్టేషన్‌కి వచ్చాడు. ఆయన్ను చూడగానే ప్రాణం లేచివచ్చింది.

ఇంటికి వెళ్లింది. పాత రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ రోజు మామ్మగారు బలవంతం చేసి పంపించకపోతే, తనకీ ఉద్యోగం వచ్చేది కాదు.

మామ్మగారి కోసం కొన్న చీర తీసుకొని ఆమె ఇంటికి వెళ్లి తలుపు తట్టింది.

తలుపు తీసిన కాశ్యపను చూసి స్రవంతి ఆశ్చర్యపోయింది.

“మీరు? ఇక్కడ?”

“అవును, నేనే..”

“మామ్మగారు?”

“చనిపోయి ఏడాది అయింది. సంవత్సరీకాలు జరిపించటానికి వచ్చాను.”

“మామ్మగారు పోయారా?”

“అవును.”

“మీకు మామ్మగారికి ఉన్న బంధుత్వం గురించి తెలియదు. మీరూ చెప్పలేదు..”

“నీవు అప్లికేషన్ పంపించాక, నీకు ఉద్యోగం వచ్చే వరకూ రోజూ నాకు తాకీదులు పంపుతూనే ఉంది. కానీ నీ సామార్థ్యం వల్లనే నీకీ ఉద్యోగం వచ్చిందన్న సంతోషం మిగలటం కోసం తెరవెనుక నేను చేసిన ప్రయత్నాలు నీ దాకా రానివ్వలేదు..”

“ఆమె వివరాలు చాలా సార్లు అడిగాను. కానీ ఎన్నాడూ నోరు విప్పి చెప్పలేదు..”

కాశ్యప అన్నాడు. “గతం చేసిన గాయాల గురించి గుర్తు చేసుకోవటం ఆమెకు ఇష్టం ఉండదు. ఆమెకు ఒక కొడుకు ఉన్నాడు. వాడూ నేనూ చిన్నప్పటి నుంచీ స్నేహితులం. వాడితో సమానంగానే నన్నూ పెంచింది. వాడికి చదువు అబ్బలేదు. చెడు అలవాట్లకు బానిస అయ్యాడు. వాడి జీవితం తెగిన గాలిపటం అయింది. ఎవరో అమ్మాయితో ఎక్కడికో వెళ్లిపోయాడు. తల్లి అన్న గౌరవం ఇవ్వక పోవటం ఆమెను మరింత బాధించింది.. నేను ఏమీ కాను.. కానీ నాకు తల్లి కన్నా ఎక్కువే. చనిపోయినప్పుడు వచ్చాను. కర్మకాండ అంతా పూర్తి చేశాను. ఇప్పుడు సంవత్సరీకాలకు వచ్చాను..” అన్నాడు కాశ్యప.

కాసేపు ఊరడింపులు అయ్యాక స్రవంతి బయలుదేరింది.

ఇంటి ముందు గార్డెన్ లోకి వచ్చాక కాశ్యప ఆమెకు ఎర్ర గులాబీ కోసి ఇచ్చాడు.

మామ్మగారి మాటలు గుర్తొచ్చాయి. “పసుపు పచ్చని గులాబీలు స్నేహానికి చిహ్నం. ఎర్ర గులాబీలు ప్రేమకు చిహ్నం..”

స్రవంతి సిగ్గు పడుతూ గులాబీ పువ్వు అందుకున్నది “థాంక్స్” అంటూ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here