నా సరికొత్త బాల్యం

0
4

[శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ రచించిన ‘మేరా నయా బచ్‍పన్’ అనే కవితల అనువదించి అందిస్తున్నారు ప్రముఖ రచయిత్రి గీతాంజలి.]

[dropcap]నా[/dropcap] జీవితానందాన్ని దోచుకుని వెళ్లిపోయిన నా బాల్యమా..
నీ మధురమైన జ్ఞాపకాలు మాటిమాటికి గుర్తుకు వస్తూనే ఉంటాయి.
ఏ చింతా లేకుండా ఆడుకోవడం, తినడం, నిర్భయంగా స్వేచ్ఛగా తిరగడం..
ఎలా మరిచిపోతాం ఈ అవ్యక్తమైన బాల్యానందాల్ని?
ఉచ్చమూ.. నీచమూ.. అంటరానితనం అంటే ఏమిటో ఎవరికీ తెలీదు
గుడిసెల్లో బురద నిండిన వాకిళ్ళలోనే మహారాణులు తయారయ్యారు కదా
మరిగించిన పాల బంతుల్లో వేలు ముంచి అమృతంగా తాగాను
శూన్యమైన ఇల్లు నా కిలకిలారావాలతో హర్షాతిరేకంలో నిండిపోయేది.
ఊరకనే ఏడ్వడం.. దేనికో తపించక పోవడంలో కూడా ఎంత ఆనందం పొందేవారమని!
ముత్యాల్లాంటి కన్నీటి బొట్లతో దండలు తయారయ్యేవి కావూ?
నేను ఏడిస్తే.. అమ్మ పనులన్నీ వదిలిపెట్టి పరిగెత్తుకు వచ్చేది
నన్నెత్తుకునేది బుగ్గలపై ముద్దులతో నా కన్నీటి తడిని తోడివేసేది
తాత నేమో చందమామను చూపించి నా కళ్ళల్లోంచి కారే కన్నీటిని రానీకుండా ఆపేస్తే..
నా పెదవుల్లో విచ్చిన చిరునవ్వు చూసి అందరి మొఖాలు వికసించేవి.
ఆ సుఖమయ సామ్రాజ్యాన్ని వదిలి నేను పెద్దదాన్నిఅయిపోయాను.
అలసి సొలసి.. పరిగెత్తి గుమ్మంలో నిలబడ్డాను
కళ్ళు సిగ్గుతో వాలిపోయి ఉండేవి
మనసు యవ్వనపు రంగులలో నిండి పోయి ఉండేది
చుట్టూ సుందర యువకులు ఉండేవారు
మనసులో ఏదో గుచ్చుకున్నట్లే ఉండేది కానీ
ఈ లోకం ఎంతో అందంగా కూడా ఉండేది
హృదయంలో ఎప్పుడూ ఒక పొడుపు కథ ఉండేది
ఎందుకో అందరి మధ్య నేను ఒంటరిని అనిపించేది.
ఎవరినైతే వెతుకుతూ ఉన్నానో వాళ్ళు దొరికారు కానీ..
నా బాల్యమా నన్ను అలవ కొట్టేసావు.. మోసం చేసావు
యవ్వనమనే మాయాజాలంలో నన్నుఇరికించేసావు నువ్వు!
అతనుండే అన్ని వీధులు చూసాను
అతగాడి ఆనందాలు అన్నీ భిన్నమైనవి
ప్రియుడి ఆకాంక్షలు, ప్రేమల స్మృతులు కూడా ఎంతో ప్రియమైనవి!
ఆకాంక్షలు కోరికలు – పురుషార్థం అన్నింటి జ్ఞానోదయంతో
యవ్వన కాలమంతా అద్భుతంగా గడిచిపోయింది .. ఓప్పుకుంటాను
ఇక ఝంఝాటాలతో సంసారం ఒక యుద్ధ క్షేత్రంలా మారిపోయింది.
అనేక చింతలతో జీవితమంతా భారమైపోయింది.
రా.. నా బాల్యమా!
ఒక్కసారి నీ నిర్మలమైన శాంతిని నా కిచ్చెయ్యవూ?
వ్యాకులాన్ని, వ్యథల్ని పోగొట్టే నీ సహజమైన ఒళ్లో విశ్రాంతిని పొందనివ్వు
అమాయకమైన.. అత్యంత సరళమైన.. విశ్వాసమైన ప్రియమైన
ఆ బాల్య జీవితాన్ని నాకిచ్చి.. నాలోని దుఃఖాన్ని పోగొట్టగలవా చెప్పు?
కానీ ఈ అద్భుతం చూడు.. నా బాల్యమా!
నేను నా బాల్యాన్ని మరిచిపోతున్నానని నా పాపాయి చెబుతోంది చూడు!
నా చిన్న కుటీరంలో నందనవనంలో విరిసినట్లు పూలు వికసించాయి నా పాపాయి రాకతో.
తాను మట్టి తిని రెండు చేతుల్లో నాకు నింపుకొచ్చింది నాకు తినిపించడానికి
నా బాల్యంలో నేను రుచికరమైన మట్టి తిన్నరోజుల్ని గుర్తు తెచ్చింది
నా దేహం ఆనందంతో పులకించి పోయింది.
నా మోము ఆహ్లాదంతో అరుణారుణమై.. విజయ గర్వం తొణికిసలాడింది
నా పాపాయిని కూడా నాతో పాటు
సువాసనలు నిండిన మధురమైన మట్టిని తినమన్నాను.
నా పాప రూపంలో నా బాల్యం నాకు మళ్ళీ దొరికింది.
నా పాప మంజులమైన రూపంతో నాలో నవజీవనోత్సాహం నిండిపోయింది.
నేను కూడా పాపతో ఆడుతాను, పాడుతాను
తింటాను.. కిల కిలా నవ్వుతాను.. అచ్చం నా బాల్యంలా
పాపాయితో కలిసిపోయి.. నేనూ చిన్న పిల్లనైపోతాను.
యుగాలుగా దేన్నైతే అన్వేషిస్తూ వస్తున్నానో ఆ బాల్యం నాకు దొరికింది
నానుంచి పారిపోయిన నా బాల్యం తిరిగి నన్ను చేరుకుంది.

~

హిందీ మూలం: సుభద్రా కుమారి చౌహాన్

అనువాదం: గీతాంజలి


శ్రీమతి సుభద్రా కుమారి చౌహాన్ ప్రముఖ హిందీ కవయిత్రి. ‘ఝాన్సీ కీ రాణీ’ వీరి ప్రసిద్ధ కవిత. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొని రెండు సార్లు జైలుకి వెళ్ళారు. ఖిలోనావాలా, త్రిధారా, యహ్ కదంబ్ కా పేడ్, ముకుల్ అనే కవితా సంపుటాలు వెలువరించారు. భికరే మోతీ, ఉన్మాదినీ, సీధే సాధే చిత్ర్ అనేవి వీరి కథా సంపుటాలు. హీంగ్‍వాలా అనే వీరి కథ ప్రఖ్యాతి చెందింది. సాహిత్యానికి వీరి సేవలకు గుర్తుగా భారత తీరరక్షక నౌకకి ఈమె పేరు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here