జ్ఞాపకాల పందిరి-175

18
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

కలిసొచ్చిన మరో అదృష్టం..!!

[dropcap]మ[/dropcap]న నిత్య జీవన గమనంలో, అనుకున్నవి కొన్ని జరగకపోవచ్చు. అలా కావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనకు కలసిరాని అంశాలు. అలా ఎందుకు జరిగిందని విశ్లేషించుకుంటూ సమయం వృథా చేసుకోవడం వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం ఉండే అవకాశం లేదు. ఇక్కడ.. మన స్థాయిని మించిన కోర్కెలు ఎలానూ ఫలప్రదం కావు. కానీ చిన్న చిన్న కొర్కెలు కూడా అనుకున్నవి జరగకపోతే తప్పకుండా నిరుత్సాహం ఒళ్ళంతా చుట్టుకుంటుంది. ఇది సహజం! దీనికి మనం చేసేది ఏమీ ఉండదు, తలచుకుని బాధపడడం తప్ప. ప్రయోజనం శూన్యం.

ఒక్కోసారి మనం అనుకోనివి, మనం వూహించనివి మనకు ఎదురు వస్తుంటాయి. అవి చెప్పలేని అనందాన్ని, తృప్తిని అందిస్తాయి. అలాంటిదే ఒక సందర్భం నాకు ఎదురొచ్చి కలిసొచ్చింది. మా వియ్యంకుడు విజయకుమార్ గారు, అనుకోకుండా ఒక రోజు తన విశాఖపట్నం ప్రయాణం గురించి చెప్పారు. అగష్టు ఏడో తారీఖున విశాఖలో ఒక శుభకార్యానికి హాజరుకావాల్సి ఉంది. ఇదే అదనుగా “నేనూ వస్తాను” అనేశాను ఆయనతో.

ఒంటరిగా ఉంటున్న అన్నయ్యతో కొద్ది రోజులు గడపాలన్నది నా ఆశ. అలా నాలగవ తేది విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో టికెట్లు బుక్ చేసుకుని బయలుదేరాం. అర్ధరాత్రి రైలులో నాకు కంటి సమస్య మొదలైంది. కళ్ళుపుసులూ కట్టడం, కళ్లు మంట దురద. కనురెప్పలు మూసుకుపోవడం విశాఖపట్నం చేరుకునేసరికి సమస్య జటిలం అయింది. చిన వాల్తేరులో అన్నయ్య ఇంటికి వచ్చాక, వరంగల్ నేత్ర వైద్య మిత్రుడు డా. గిరిధర్ రెడ్డికి ఫోను చేసి విషయం వివరించాను.

ఆయన రెండు రకాల కంటి చుక్కల మందు సూచించడంతో ఆ వైద్యం మొదలుపెట్టాను. దీని వల్ల బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఒక పక్క అన్నయ్య మధుకి ఈ ‘కళ్ళకలక’ అంటుకుంటుందేమోనని భయం.. రెండు రోజులకి చాలామట్టుకు నా కంటి సమస్య తగ్గుముఖం పట్టింది. ఈలోగా నా ఫేస్‌బుక్ మిత్రుడు నన్ను కలవడానికి వస్తానని ఫోన్ చేశాడు. ఈయన ‘ప్రియమైన రచయితలు’ గ్రూపు సభ్యుడు. చాలా సంవత్సరాలుగా పరిచయం. పేరు శ్రీ కోరాడ నరసింహరావు (విశాఖపట్నం.) ఈయన పెద్దగా చదువుకొనకపోయినా, మంచి కవి, కథకుడు, గీతరచయిత, గాయకుడు. ఆయన సాహితీ తృష్ణ అనంతం. ఆయనతో ఒక గంటసేపు అనందంగా గడిపే అవకాశం ఈ విజిట్‍లో నాకు దొరికింది.

ఫేస్‌బుక్ మిత్రుడు కవి, రచయిత,గాయకుడు శ్రీ కోరాడ నరసింహ రావు (విశాఖపట్టణం)

మరో రోజు నాకు అత్యంత ప్రీతిపాత్రుడు, సువార్తికుడు, సోదర పాత్రుడు, నాకు హైస్కూలులో సీనియర్, శ్రీ బందిల అరుణకుమార్ వచ్చాడు. ఈయన నా స్వగ్రామానికి (దిండి..తూ.గో.జి) చెందినవాడు. ఉద్యోగరీత్యా విశాఖపట్నంలో స్టిరపడ్డాడు. ఆయనతో కొన్ని గంటలు గడపటం, బాల్య విశేషాలు సరదాగా సింహావలోకనం చేసుకోవడం, కలిసి భోజనం చెయ్యడం మరచిపొలేని మధుర అనుభూతి. ఆయనకు నా అయిదవ కథా సంపుటి ‘లేడీస్ సీట్’ బహుకరించాను.

ఆత్మీయ బంధువు శ్రీ బందిల అరుణకుమార్ (విశాఖపట్టణం/దిండి)

పదకొండవ తేదీన మిత్రుడు, దంత వైద్యంలో నాకు సీనియర్, డా. ఆనంద్ రాక నాకు మరింత ఆనందం కలిగించింది. ఈయన ప్రవృత్తి కూడా సాహిత్యమే! ఇద్దరం కాలేజి పత్రికకు రాస్తూండేవాళ్ళం. ఆ రోజుల్లో ఇతను ‘ఆంధ్రభూమి’ వారపత్రిక క్రమం తప్పకుండా చదివేవాడు, మా చేత చదివించేవాడు. పాత జ్ఞాపకాలు, గౌలీగూడలో, మేము విద్యార్థులుగా గొప్పరోజులు గుర్తుచేసుకున్నాం. అలా ఈసారి నా విశాఖ రాక ఎంతో తృప్తిని కలిగించింది.

మిత్రుడు, రచయితకు సీనియర్ డా. ఆనంద్ (విశాఖపట్నం)

నిజానికి, నేను ఏడవ తేదీన హైద్రాబాద్‌కు తిరిగి రావాలి. ఈలోగా మరో సంతోషకరమైన వార్త తెలియడంతో, పదకొండు తేదీ వరకూ విశాఖపట్నంలో ఉండిపోవలసి వచ్చింది. ఆ వార్త ఏమిటంటే, నా మిత్రమణీ, రచయిత్రి, శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టికి, శ్రీ మక్కెన ఫౌండేషన్ వారి అవార్డు ప్రదాన కార్యక్రమం.

ఈ కార్యక్రమం విశాఖ పౌరగ్రంధాలయంలో, విశాఖ సంస్కృతి మాసపత్రిక సౌజన్యంతో కన్నుల పండుగగా ఘనంగా జరిగింది. అన్నయ్య, నేను హాజరయ్యాము. ఝాన్సీ గారి ‘చీకటి వెన్నెల’ కథా సంపుటికి ఈ అవార్డు దక్కింది. ఈ కార్యక్రమంలో నేను ఇప్పటివరకూ చూడని అనేక గొప్ప రచయితలని చూసే అవకాశం కలిగింది.

మక్కెన ఫౌండేషన్ (విజయవాడ) అవార్డు గ్రహీత (చీకటి వెన్నెల) శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి (హైదరాబాదు)

అంతమాత్రమే కాదు నాకు తెలిసిన స్థానిక రచయిత్రి శ్రీమతి పెబ్బిలి హైమవతి గారు, ఎన్. హన్మంతరావు గారు, డా. బండి సత్యన్నారాయణ గారూ, కోరాడ నరసింహా రావు గారు, నా మిత్రులు డా. ఆనంద్, శ్యామకుమార్ – శ్రీమతి లీల, డా.రామచందర్ రావు తదితరులు హాజరుకావడం ఆనందం అనిపించింది.

శ్రీమతి కొప్పిశెట్టి సన్మాన చిత్ర మాలిక

ఈమధ్య కాలంలో రెండవసారి నా విశాఖ ప్రయాణం నాకు ఎంతో తృప్తిని ఆనందాన్ని కలిగించింది. అన్నింటికి మించి, ఇన్ని రోజులు అన్నయ్యతో గడపటం నిజంగా ఒక మధుర అనుభూతి, అదృష్టమును!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here