జోనరాజ ద్వితీయ రాజతరంగిణి-58

2
3

[జోనరాజ విరచిత జైన (జైనులాబిదీన్) రాజతరంగిణిగా పేరుపొందిన ద్వితీయ రాజతరంగిణి వ్యాఖ్యాన సహిత అనువాదాన్ని ధారావాహికగా అందిస్తున్నారు కస్తూరి మురళీకృష్ణ.]

విశ్వాంధక్కారనాంధకారనికరగ్రస్తస్య సూర్యోదయం
హేమంతే హిమమారూతైర్హధ్రుతే పుష్పాకారాభ్యాగమమ్।
దుష్టక్ష్మాపతితర్జితస్య జగతో నిర్దోషలేశం ప్రభుం
లోకేశో జనయన్ వ్యనత్తి నితరాం కారుణ్యమత్యుజ్జ్వలమ్॥
(జోనరాజ రాజతరంగిణి 750)

అల్లీషాహ, సికందర్‍ల నడుమ ఎంతగా ప్రేమాభిమానాలున్నాయని జోనరాజు నిరూపించాలని ప్రయత్నించినా, కశ్మీరు తురుష్క పాలకులకు ఎంతగా భారతీయ సంస్కార గంధం అద్ది వారిని భవిష్యత్తు తరాలకు ఆమోద యోగ్యంగా అందించాలని జోనరాజు తపన పడ్డా, జరిగిన సంఘటనలు జోనరాజు కల్పించిన కట్టుకథ అసలు గుట్టు విప్పి చెప్తాయి.

సికంధరుడు రాజ్యాధికారం సోదరుడు ‘అల్లీషాహ’కి అప్పగించి కశ్మీరు వదిలి వెళ్ళిపోయాడు. కానీ సోదరుడు తన కోసం చేసిన త్యాగాన్ని సుల్తాను అల్లీషా గుర్తించలేదు. ఆ ఋణం తీర్చుకోవాలని ప్రయత్నించలేదు అంటాడు జోనరాజు. అల్లీషాహ తన సామ్రాజ్యాన్ని విస్తరించి, తన శక్తిని పెంచుకోవాలని ప్రయత్నించాడు.

శ్రీ సికంధర్ దత్తస్య రాజ్యస్య ఋణమాత్మనః।
నివారయితు కామేన స్వలక్ష్మీఫల కాంక్షిణా॥
(జోనరాజ రాజతరంగిణి 729)

నిజానికి అల్లీషాకు అతని మామ మాద్ర రాజ సైన్యం తోడుగా రావటం చూసి సికంధరుడు తన అనుచరులు, సమర్థకులతో కలిసి కశ్మీరు వదిలి వెళ్ళిపోయాడు. సామ్రాజ్యం తిరిగి తన సోదరుడికి అప్పగించాడు. దీన్ని జోనరాజు సోదరుడి కోసం సికంధరుడు రాజ్యాన్ని త్యాగం చేసినట్టు చిత్రించాడు. అంతేకాదు, రాజ్యం త్యాగం చేసిన సోదరుడిపై కక్ష కట్టాడన్నట్టు చూపుతున్నాడు. ఇది తరువాత రాజై జైనులాబిదీన్ నామధేయాన్ని స్వీకరించిన సికంధరుడికి ఆనందం కలిగిస్తుంది. అతని వ్యక్తిత్వాన్ని జోనరాజు ఇనుమడింప చేస్తున్నాడు. జోనరాజు చెప్తున్నది అబద్ధమని తెలుస్తున్నా, రాజుకు గొప్పతనం ఆపాదిస్తుంటే అభ్యంతరం పెట్టటం అంత మంచిది కాదని అందరికీ తెలుసు కాబట్టి సుల్తాను వ్యక్తిత్వానికి వన్నె తెచ్చే విధంగా అబద్ధం రాసినా సరే, జోనరాజు రాజతరంగిణి అందరి ఆమోదం పొందింది.

ఖుఃఖర రాజయిన జస్రధుడిపై మాత్సర్యం వహించాడు అల్లీషా. అతని వద్ద ఉన్న సోదరుడికి తన రాజ్యానికి తిరిగి వచ్చేయమని వర్తమానాలు, విజ్ఞప్తులు పంపించాడు. ఇక్కడ జోనరాజు రాసిన శ్లోకం అసలు నిజాన్ని ఎంత దాచాలని ప్రయత్నించినా దాగనివ్వదు.

నక్రో న చేజ్జ్వలనిధేర్బహిరంభ్యు పేయాత్
కాకస్త్యజేన్న వనపాదపమున్నతం చేత్।
అఖుర్న చేద్రహాన గర్తగుహాం విముచ్చే
ద్యుత్తవ్యతాం కథమాప్నుయురేవ తత్తె॥
(జోనరాజ రాజతరంగిణి 731)

నీటి నుంచి బయటకు రాని మొసలిని, చెట్టు పై కొమ్మని వదలని కాకిని, తన బొరియని వదలని ఎలుకను చంపటం ఎలా? అంటే చంపటం కుదరదని అర్థం. సుల్తాను సోదరుడు సికంధరుడిని కశ్మీరు తిరిగి రమ్మని విజ్ఞప్తి చేశాడని చెప్తూ పై శ్లోకం రాయటంలో అర్థం ఏమిటంటే, కశ్మీరానికి ఆవల తనను రక్షించే స్నేహితుల నడుమ సికంధరుడు సురక్షితంగా ఉన్నంత కాలం అతడిని చంపలేడు అల్లీషా అన్నది. అందుకని తన స్నేహితుల రక్షణ నుండి అతడిని బయటికి రప్పించేందుకు అతడిని కశ్మీరుకు ఆహ్వానిస్తున్నాడన్న మాట సుల్తాన్.

సికంధరుడికి ఆశ్రయం యిచ్చిన ఖుఃఖరులకు మాద్ర రాజుకూ పడదు. ఖుఃఖరుల సుల్తాన్ మాలిక్ జస్రధ్. అతడు కశ్మీరం వదిలి వెళ్ళిన సికంధరుడికి ఆశ్రయం ఇచ్చాడు. జస్రధుడి ఆశ్రయంలో ఉన్నంత వరకూ తన రాజ్యంపై హక్కున్న మరో వారసుడిని మట్టుపెట్టలేడని సుల్తానుకు తెలుసు. అందుకని కశ్మీరుకు వచ్చేయమని సోదరుడికి వర్తమానం పంపాడు. ఆ వర్తమానాన్ని అర్థం చేసుకున్న సికంధరుడు సోదరుడితో యుద్ధం తప్పదని గ్రహించాడు. తన మద్దతుదారులు అనేకులను సుల్తాన్ సైన్యంలో చేర్చాడు.

సికంధరుడు రావటం లేదు. అతడికి ఆశ్రయం ఇచ్చిన మాలిక్  జస్రధ్ బెదరడం లేదు. ఆగ్రహించిన సుల్తాన్ తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సికంధరుడికి ఆశ్రయం ఇస్తున్నాడన్న నెపతో జస్రధ్‍పై దాడికి వెళ్లాడు.

మ్లేచ్ఛచ్ఛాదిత మాహాత్మ్యై ఉద్విగ్నైః సచివైర్నిజైః।
అనిషిద్ధోధమమతిర్ధూర్తైరుభయవేతనైః॥
(జోనరాజ రాజతరంగిణి 733)

సుల్తాన్ అనవసరమైన ఆగ్రవేశాలు ప్రదర్శిస్తున్నాడని, జస్రధ్‍తో యుద్ధానికి ముందూ వెనుకా చూడకుండా వెళ్ళటం కూడదని అతని మంత్రులు వారించాలని ప్రయత్నించారు. కానీ వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఎందుకంటే రాజు చుట్టూ ఉన్న మ్లేచ్ఛులు రాజుపై ఎక్కువ ప్రభావం చూపించారు. వీరిలో అధికులు ‘ఉభయ వేతనైః’. అంటే ఇద్దరు సుల్తానుల దగ్గరా ధనం పుచ్చుకుంటున్నారన్న మాట. ఒక సుల్తాన్ ప్రస్తుతం సుల్తాన్. అతని కొలువులో వేతనం ఎలాగో దక్కుతుంది. మరో సుల్తాన్, కాబోయే సుల్తాన్. ప్రస్తుతం అధికారంలో ఉన్న సుల్తాన్‍ను తప్పుదారి పట్టించి, సుల్తాన్ అవటం కోసం ఎదురుచూస్తున్న తనకు లాభం కలిగించే వారికి ఆయన రెండో వేతనం ఇస్తున్నాడు. ఒకవేళ సికంధరుడు నిజంగా సోదరుడి కోసం రాజ్యం త్యాగం చేసి ఉంటే, సోదరుడి సింహాసనం కోసం కుట్రలు పన్నడు. ఒకవేళ త్యాగం నిజమే అయితే, సుల్తాన్ సైతం త్యాగం చేసిన వాడిని గౌరవిస్తాడు, అభిమానం చూపిస్తాడు. కానీ వెంటాడి చంపాలని అనుకోడు. అలా అనుకుంటున్నాడంటే వారి నడుమ సంబంధం అంత ఆదర్శవంతం, ఆరోగ్యకరం కాదన్న మాట.

మంత్రులు వద్దని వారిస్తున్నా వినకుండా తన చుట్టూ చేరిన మ్లేచ్ఛుల మాటలు విని నమ్మి యుద్ధం లోకి ఉరికాడు సుల్తాన్.

ప్రసాదలోభాధ్యవనైరతిమాత్రకృతస్తుతిః।
నవరాజజయోద్రేన్ శ్రవణభ్రష్ట సాహసైః॥
(జోనరాజ రాజతరంగిణి 735)

సుల్తానుకు సంతోషం కలిగించి ఆయన నుంచి బహుమతులు పొందాలనుకునేవారు సుల్తాన్ శౌర్యాన్ని, ధైర్యాన్ని పొగిడి ఆయనను యుద్ధోన్ముఖుడిని చేశారు. ఇలా సుల్తాన్ ను పొగడి యుద్ధానికి ప్రోత్సహించినవారనేకులు సికంధర్ దగ్గర ధనం పుచ్చుకుంటున్నవారే. అంటే, అన్నను తప్పుదారి పట్టించి బలహీనస్థితిలో అతడిని యుధ్ధానికి పురికొల్పాడన్నమాట సికంధరుడు.  కానీ యుద్ధం చేయాల్సిన సైనికులు మాత్రం రాజ్యానికి వారసుడయిన సికంధరుడిని సైన్యం సాధిస్తున్న విజయాల గురించి వింటూ ఆత్మవిశ్వాసం కోల్పోతున్నారు. ఇది గ్రహించని సుల్తాన్ ఎవరెంతగా చెప్పినా వినకుండా తన ధైర్యసాహసాలపై విశ్వాసంతో యుద్ధానికి ముందుకు దూసుకుపోతున్నాడు.

రాజు ముందుకు వెళ్తున్న కొద్దీ సూర్యుడు అతనికి ఎదురుగా ఉన్నాడు. కానీ అతని సహాయానికి సామంత రాజులు ఎవరూ అతని వెంట లేరు. సుల్తాన్ సేన అడుగుపెట్టిన చోటల్లా వారి పద ధూళి ఆకాశానికి ఎగసి, వారంతా చీకట్లో ఉన్నట్లు అనిపించింది. యుద్ధోన్మాదంలో సుల్తాను తన రక్షణలో ఉన్న ప్రాంతాలను కూడా శత్రు ప్రాంతాలను కొల్లగొడుతున్నట్లుగా కొల్లగొట్టాడు. అలా సర్వనాశనం చేస్తూ ‘ముద్గర వ్యాళ’ ప్రాంతానికి సుల్తాన్ సేనలు చేరాయి. అప్పుడు సుల్తానుకు మాద్ర రాజు ఒక సందేశం పంపాడు.

“మీరు విజయం సాధిస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. కానీ మేము వచ్చి మిమ్మల్ని కలిసేంత వరకూ మీరు ఖుఃఖరలతో యుద్ధానికి దిగవద్దు. వారు చిత్రవిచిత్రమైన పద్ధతులతో యుద్ధం చేస్తారు. ఎలాగయితే ఒక సర్పం యుద్ధ పద్ధతి మరో సర్పం మాత్రమే గ్రహించగలుగుతుందో, అలగే ఖుఃఖరుల యుద్ధ పద్ధతిని మేము గ్రహించగలము. కాబట్టి మేము ససైన్యంగా మిమ్మల్ని వచ్చి చేరేవరకూ యుద్ధరంగంలోకి దిగవద్దు.”

ఆ సందేశం సుల్తానుకు ఆగ్రహం కలిగించింది. అతని చుట్టూ ఉన్న రెండు వేతనాలను తీసుకుంటున్న యవనులు; యుద్ధంలో గెలిచిన ఖ్యాతి తాను కొట్టేయాలని మాద్ర రాజు ప్రయత్నిస్తున్నాడని సుల్తాను అహంకారాన్ని రెచ్చగొట్టారు. దాంతో సురక్షితంగా శిఖరం పైనున్న సుల్తాన్ కొండ దిగి యుద్ధానికి వచ్చాడు. కొండ దిగుతున్న సైన్యం పట్టుకున్న జెండాలు గాలికి రెపరెపలాడుతుంటే ఖుఃఖురాల శక్తికి భయపడి వణుకుతున్నట్లు అనిపించింది. ఖుఃఖురాల అశ్వాల దూకుడికి అదిరే భూమితో పాటు వాసుకి కూడా కంపించినట్టు అనిపించింది. యుద్ధం భీకరంగా జరిగింది. గుర్రాలు కాళ్ళతో మట్టి నేలను తవ్వినప్పుడు రక్తంతో తడిసిన మట్టిని తవ్వుతున్నట్లుగా తోచింది. వీరులు యుద్ధంలో తమ ప్రాణాలను త్యాగం చేశారు. సముద్రంలో ఎగసిపడే అలలను గాలి విరుగగొట్టినట్టు సుల్తాను అదృష్టాన్ని యుద్ధంలో దురదృష్టం దెబ్బతీసింది. అంటే, సోదరుల నడుమ సింహాసనం కోసం జరిగిన యుద్ధంలో సుల్తానుగా ఉన్న సోదరుడు అల్లీషా మరణించాడన్న మాట. సింహాసనం అధిష్టించే అర్హతలన్నీ ఉన్న మరో సోదరుడు సికంధరుడు యుద్ధంలో విజయం సాధించి సింహాసనాన్ని దక్కించుకున్నాడు. సికంధరుడు సుల్తాన్ జైనులాబిదీన్ అయ్యాడు. ఈ సందర్భంగా జోనరాజు ప్రత్యేకంగా ఓ శ్లోకం రాశాడు.

ప్రపంచం అంధకారంలో మునిగి ఉన్నప్పుడు ప్రజలపై జాలి ప్రదర్శిస్తూ, బ్రహ్మ సూర్యుడిని ఉదయించమని ఆదేశిస్తాడు. చలికాలం మంచులో మునిగి సర్వనాశనం సంభవించే సమయంలో వెచ్చటి సూర్యకిరణాల ఋతువును పంపిస్తాడు. అలాగే దుష్టరాజు వల్ల రాజ్యం సంక్షుభితం అవుతున్నప్పుడు గొప్ప రాజును రాజ్యపాలనకు పంపుతాడు. అలాంటి రాజు జైనులాబిదీనుడు. విజయం సాధించిన జైనులాబిదీనుదు, విధాత అనుకూలతతో కశ్మీరులో అడుగుపెట్టాడు.

ప్రజలు నూతన సుల్తాను జైనులాబిదీనుడికి స్వాగతం పలికారు. పలు రకాల వాయిద్యాలు ఆహ్వానం పలుకుతుండగా కశ్మీరంలో ప్రవేశించాడు నూతన సుల్తాను. అయితే కశ్మీరులో అడుగుపెట్టేకన్నా ముందే ఆయన ప్రజల హృదయాలలో ఎప్పుడో అడుగుపెట్టాడు.

రాజ్యాభిషేకం కోసం సుల్తాన్ మంగళస్నానం చేస్తూ పరిశుద్ధుడవుతున్న సమయంలో ప్రజల హృదయాలన్నీ శుభ్రమై కళంక రహితమయ్యాయి. రాజు తన రాజఛత్రాన్ని ప్రదర్శించినప్పుడు శత్రువుల శక్తి నశించిపోయింది. అతని పాలన చెరకు లోని తీపిలా సత్పరిపాలన కోసం తపిస్తున్న ప్రజల దాహం తీర్చింది.

శీతాకాలంలో నశించిన వృక్షాలు వసంతకాలంలో చిగురించినట్టు  పాత రాజులు విస్మరించిన పాలనా సూత్రాలను కొత్త రాజు,  తిరిగి రాజ్యంలో అమలుపరిచాడు.   కఠినతరమైన శక్తివంతులైన శత్రువులను అణచివేయటానికి సుల్తాన్ శక్తి, తెలివైన పాలనా విధానాలు పోటీపడ్డాయి. ఒకసారి అతని శక్తి, మరోసారి అతని పాలనా విధానం శత్రువులను అణచివేశాయి.

కాంతవ్యాగం వదనం వాచి శ్రియోరః క్షమయా మనః।
శ్రితం పశ్యత్యాగాద్ దూరం కీర్తి రీప్యార్వి శాదివ॥
(జోనరాజ రాజతరంగిణి 757)

సౌందర్యం ఆయనలో నివాసం ఏర్పాటు చేసుకుంది. అతని పెదాలపై విద్యాదేవత స్థిర నివాసం ఏర్పరుచుకుంది. అదృష్టం అతని హృదయంలో నివసిస్తోంది. అతని మనస్సులో క్షమ గూడు కట్టుకుంది. ఇదంతా చూసిన కీర్తి, అతని కీర్తిని దశదిశలా వ్యాపింపజేసింది.

కలియుగంలో అతని ధర్మబద్ధమైన పరిపాలన మధ్యయుగాన్ని తలపుకు తెచ్చింది. అతని సోదరుడు శ్రీ మహమ్మద్ ఖాన్ రాజ్య పాలనలో అతనికి సహాయ సహకారాలందించాడు. శాస్త్ర నిర్ణయాలలో సలహాదారయ్యాడు. సౌఖ్యం అనుభవించటంలో భాగస్వామి అయ్యాడు. అలా ఆయన మకుటం లేని మహారాజు అయ్యాడు. సుల్తానులా ఛత్ర చామరాలు లేవు కానీ మహమ్మద్ ఖానుడు దాదాపుగా రాజులా వ్యవహరించాడు. వసంత ఋతువు మన్మథుడికి ఎలాంటిదో, రాజుకు సన్నిహితుడు సేవకులకు ఎలాంటివాడో, అలా ఖుఃఖురాల రాజు, అందరిలోకీ జైనులాబిదీనుడికి సన్నిహితుడు అయ్యాడు.

దుర్య్వవస్థాం నివార్యాహం దేశేస్మిన్ మ్లేచ్ఛవాశిత।
ఇతి రాజ్య పరిప్రాప్తి ఫలం యావద చిత్తయత॥
(జోనరాజ రాజతరంగిణి 762)

మ్లేచ్ఛుల దుష్ట పద్ధతుల వలన రాజ్యంలో నెలకొన్న దుష్ట పద్ధతులను, దుష్ట వ్యవస్థను సరిదిద్దాలని నిశ్చయించాడు కొత్త సుల్తాను. ఇది తనకు రాజ్యం దక్కినందుకు ప్రతిఫలంగా భావించాడు.

ఈ విషయం గురించి కాస్త చర్చించాల్సి ఉంటుంది. జైనులాబిదీనుడి కన్నా ముందు దాదాపుగా రెండు వందల ఏళ్ళ నుండీ పాలిస్తున్నది భారతీయేతరులే కాబట్టి దేశంలో దుష్ట వ్యవస్థ నెలకొనటానికి కారణంగా భారతీయ రాజుల పాలనను భావించలేము. కాబట్టి దేశాన్ని అనిశ్చింతతలోకి నెట్టి, దుష్ట పరిస్థితులు నెలకొనటానికి కారణమైన మ్లేచ్ఛులు ఇస్లామీయులే. ఇక్కడే జోనరాజు ప్రతిభను గుర్తించాల్సి ఉంటుంది.

జోనరాజు దృష్టిలో ఎంతగా సుల్తాన్ అయినా జైనులాబిదీన్ కూడా మ్లేచ్ఛుడే. కానీ మంచి మ్లేచ్ఛుడు. ఎందుకంటే, అంతకు ముందు మ్లేచ్ఛులు సృష్టించిన అల్లకల్లోలాన్ని అడ్డుకున్నాడు. దుష్ట వ్యవస్థను నివారించాడు. ఎందుకని కశ్మీరు గతంలో సుల్తానుల వ్యవహారానికి భిన్నంగా జైనులాబిదీనుడు వ్యవహరించాడంటే, అతడికి రాజ్యం లభించినందుకు ప్రతిఫలంగా రాజ్య వ్యవహారాలను చక్కబరచి ఋణం తీర్చుకున్నాడన్నాడంటాడు జోనరాజు.

‘తన్నీతిః పూర్వరాజేషం’ అంటాడు జోనరాజు జైనులాబిదీనుడిని వర్ణిస్తూ. ‘పూర్వ రాజుల నీతిని’ అనటం, ‘పూర్వ రాజ వ్యవస్థాః స వినస్టా’ అనటం పోల్చి చూస్తే జోనరాజు అంటున్నది పూర్వ సుల్తానుల నీతి కాని, వారు ఏర్పరచిన వ్యవస్థ గురించి కానీ అర్థమవుతుంది. జైనులాబిదీనుడు పునః స్థాపించిన పూర్వ రాజుల వ్యవస్థ సుల్తానులు భ్రష్టుపరిచి నాశనం చేసిన వ్యవస్థయే. అందుకే వారందిరినీ మ్లేచ్ఛులంటున్నాడు జోనరాజు. అంటే, ఒకరిని పొగిడేందుకు ఇంకొకరిని దూషించినట్టు జైనులాబిదీన్ గొప్పతనం చెప్తూ అతని పూర్వ సుల్తాను లందరినీ మ్లేచ్ఛులన్నాడు జోనరాజు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here