[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]
[భార్యాపిల్లలతో అక్క నిర్మల వాళ్ళింటికి వెళ్ళి రెండు రోజులుండి వస్తాడు శైలేష్. కొడుకు ఒంటరిగా ఉన్న సమయం చూసి, అక్కతో మాటాడ్లావా, అమ్మతో ప్రేమగా ఉండమని చెప్పావా అని అడుగుతుంది వసంత. కుదరలేదంటాడు శైలేష్. ఎంతైనా అక్కాతమ్ముళ్లిద్దరూ ఒకటే అనుకుని బాధపడుతుంది. కొడుకు ఆమెని ఓదారుస్తాడు. మర్నాడు రాత్రి బయల్దేరి బెంగుళూరుకి వెళ్ళిపోతారు శైలేష్ వాళ్ళు. విశాల, సుమిత్రలతో గడిపిన సమయం మాధవకి ఎంతో సంతోషాన్నిస్తుంది. కాలేజీ రోజులు తిరిగొచ్చినట్టనిపిస్తుంది. ఓ రోజు ఫోన్ చేసినప్పుడు సుమిత్రగారితో విశాల కలిసుండడం బావుందని అంటాడు. అప్పుడు విశాల సుమిత్ర గురించి చెబుతుంది. తామిద్దరూ కలిసి ఎలా కాలక్షేపం చేస్తారో చెబుతుంది. మూడు రోజుల తరువాత అతని మనసులో ఓ కోరిక కలుగుతుంది. విశాలని అడగడానికి సంశయిస్తాడు. అయినా ధైర్యం చేసి, మరుసటి వారం ఫోన్ చేసినప్పుడు అడిగేస్తాడు జీవితపు చరమాంకంలో మనిద్దరం కలిసి జీవించలేమా అని. అయితే ఆమె సమాధానం చెప్పేలోపు ఫోన్ పెట్టేస్తాడు. వారం తరువాత ఫోన్ చేస్తే విశాల మామూలుగానే మాట్లాడుతుంది. చాలా స్పష్టంగా తన ఆలోచనలని వెల్లడిస్తుంది. ఇద్దరూ తమ స్నేహబంధాన్ని నిలుపుకుందామని అంటారు. ఒకరోజు రాత్రి తన వియ్యపురాలికి ఫోన్ చేసి కుశలం అడుగుతుంది వసంత. కాసేపు మనవల గురించి మాట్లాడి, ఇంకోసారి చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. నిర్మలతో మాట్లాడలేదా అని అడుగుతాడు వెంకట్రావు. కూతురు పలకరించదని వసంత అంటే, తన తత్వమే అంత, మనమే ప్రేమ చూపించాలని అంటాడు. వసంత నొచ్చుకుంటుంది. ఓర్పు వహించమని, మనసును కష్టపెట్టుకోవద్దని చెప్తాడు. ఒక ఆదివారం సాయంత్రం నిర్మల వాళ్ళింటికి వెళ్తారు. నిర్మల అత్తగారు లోపలికి ఆహ్వానించి, మంచినీళ్ళిచ్చి ఆదరంగా మాట్లాడుతుంది. నిర్మలని పిలుస్తుంది. నిర్మల పిల్లలతో బయటకి వస్తుంది. కాసేపు అమ్మానాన్నల దగ్గర కూర్చుని, పిల్లల్ని పార్కుకి తీసుకువెళ్తుంది. కాసేపయ్యాక, ఇంటికొచ్చేస్తారు వసంత, వెంకట్రావు. కూతురు తమని వదిలి వెళ్ళిపోయినందుకు, పార్క్‌కి వస్తారా అని అడగనందుకు ఆశ్చర్యపోతాడు వెంకట్రావు. ఓ రోజు భానక్క కొడుకు భాస్కర్ ఫోన్ చేస్తాడు. అమ్మ మీ ఇంటికి వద్దామనుకుంటోంది, మీరు ఖాళీగా ఉంటే తీసుకువస్తాను అని చెప్తాడు. నాలుగు రోజులుండేలా రమ్మని చెబుతుంది వసంత. ఇక చదవండి.]
[dropcap]ఆ[/dropcap] మధ్య, తన ఊరికి గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కలిసిన భానక్కను గురించే ఎక్కువగా ఆలోచనలు వస్తున్నాయామెకి. భానక్కకి ఈ సలహా చెప్పవలసింది, ఆ సలహా చెప్పవలసింది అని మనసులో ఒకటే ఆలోచనలు వస్తున్నాయి. ఫోన్లో చెబితే బావుండదని ఊరుకుంటోంది. ఇప్పుడు తానే వస్తోంది అనగానే తన ఐడియాలన్నీ చెప్పేసి ఆమె మనసులోని బాధ తీసేయాలని సంబరపడిపోయింది వసంత.
అన్నట్టుగానే మర్నాడు ఉదయం పదికల్లా కారులో తల్లిని తీసుకుని, వసంత ఇంటికొచ్చాడు భాస్కర్. అప్పటికి వెంకట్రావు షాప్‌కి వెళ్ళిపోయాడు. కారు ఆగగానే “రా అక్కా రా!” అంటూ ఆమె చేతిలోంచి బాగ్ అందుకుంది వసంత. “లోపలికి రా భాస్కర్!” అంటుంటే “నాక్కొంచెం పనుంది పిన్నీ! ఎల్లుండి వస్తాను కదా!” అన్నాడు కారు వెనక్కి తిప్పుకుంటూ. అతను వెళ్లేవరకూ నిలబడి లోపలికొచ్చారిద్దరూ.
భానక్క ఇల్లంతా తిరిగి చూసేలోగా మంచి కాఫీ తెచ్చింది వసంత ఇద్దరికీ. అది తాగుతూ మొక్కల్లో తిరిగారు. తర్వాత పార్వతమ్మగారిని పరిచయం చేసింది భానక్కకి. “చాలా సంతోషంగా ఉన్నారు నీ స్నేహితురాలనుకున్నాను” అందామె. “అక్క వరసే కానీ, మేము మంచి స్నేహితులం పిన్నీ! మీరు బాగానే గుర్తుపట్టారు” అంది వసంత. ముగ్గురూ నవ్వుకున్నారు.
ఆ తర్వాత వేడిగా మరో కూర చేసి, మళ్ళీ అన్నం వండి, వడియాలు వేయించి ఇద్దరికీ భోజనం వడ్డించింది వసంత. తిన్నాక ఇద్దరూ ధారాళంగా ఇక కబుర్లే కబుర్లు. ఆ సాయంత్రం భర్త రాగానే ఓ గంట మేమిద్దరమూ పార్క్‌కి వెళతాం అంటూ బయలుదేరారు. అక్కడ నడుస్తూ ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ రాత్రి ఇద్దరూ రెండో బెడ్ రూమ్‌లో పడుకున్నారు.
ఆ తర్వాతి రోజు వెంకట్రావు బైటికెళ్లిపోయాక భానక్క ఏవో కొనుక్కుంటానంటే షాపింగ్‌కి బయలుదేరారు. చాలా షాపులు తిరిగారు. తనకి కావాల్సినవి భానక్క కొనుక్కుంది “మాకక్కడ దొరకవే!” అని ఆనందపడుతూ. “కావాల్సినవన్నీ దొరికాయి కదక్కా!” అనడిగింది వసంత. “అన్నీ దొరికాయి. పద ఇంటికి పోదాం” అని ఆమె అన్నాక ఇంటికి బయలుదేరారిద్దరూ. “మీ ఇల్లు అమలాపురంలో ఉన్నాగానీ, చివరికి ఉండడం వల్ల చక్కగా పల్లెటూరిలా కూడా ఉంది. చుట్టూ తోటలున్నాయి, అందుకే బావుంది” అంది భానక్క తిరిగి వచ్చేటప్పుడు. నవ్వింది వసంత.
అప్పుడు తీరికగా అక్కకి నచ్చిన వంటలు, రవ్వకేసరితో సహా చేసి భోజనాలు పెట్టింది వసంత. తిని ఇద్దరూ విశ్రాంతిగా కూర్చున్నాక “ఇప్పుడు వివరంగా చెప్పక్కా, నీ ఆస్తుల పంపకం బాధలూ, బెంగలూ!” అడిగింది వసంత.
“నా పేరున ఇంకా ఓ పదెకరాల పొలం, అందరికీ పెట్టగా ఉన్న నా బంగారం, అమలాపురంలో రెండు మంచి ఇళ్ల స్థలాలూ, కొంత రొక్కము ఉన్నాయి. అవి ఎలా పంచాలీ? అన్నదాని మీద మావాడికి అనుమానం, నాకు భయమూ ఉన్నాయి వసంతా!” అంది భానక్క.
“ఒక పని చెయ్యి. భాస్కర్ వస్తాడు కదా! అప్పుడు ఈ విషయం గురించి నీ మనసులో అనుకుంటున్నది చెప్పెయ్యి. ఇలా ఒంటరిగా నీకు మళ్ళీ దొరకడు”
“అది నిజమే కానీ, నాకు భయమే! వాడేమైనా గబుక్కున ఒక మాటంటాడేమో అని!”
“మరి ఎటూ తేల్చకుండా వదిలేస్తేనే మంచిదంటావా?”
“లేదు. లేదు. అది మరీ ప్రమాదం!”
“కదా! కాబట్టి నీకు ఎలా తోచిందో అది భాస్కర్ ముందు పెట్టు. ఏమంటావూ? అనడుగు. తాను కూడా ఏదో ఒకటి చెబుతాడు కదా! అప్పుడు నువ్వు కూడా నీకేమనిపిస్తుందో చెప్పు. భయం ఎందుకు నీ కొడుకే కదక్కా! తల్లి మనసు గ్రహించి చర్చిస్తాడు. ఇద్దరి మధ్యా పరిష్కారం వచ్చేసిందనుకో! వాడికి నీపై అనుమానమూ, నీకు భయమూ రెండూ పోతాయి. మనసుకు నిమ్మళంగా ఉంటుంది”
“నిజమే అనుకో! వాడేమంటాడో అని నాకు జంకు”
“జంకు వల్ల సమస్యలు మరింత చిక్కుపడిపోతాయి కనక ఇప్పుడు తీరిగ్గా కూర్చుని రేపు భాస్కర్‌తో ఏం మాట్లాడాలో ఆలోచించుకో. నాకేమీ చెప్పక్కర్లేదు. మీ పెద్దబ్బాయి రాడంటావా?”
“వాడు రాడు. ఒక వేళ వచ్చినా, ఈ ఆస్తి విషయాల్లోకి అసలే రాడు. వాడి పౌరుషం నాకు తెలుసు. ఇంక అమ్మాయిలు నలుగురూ వీడూ. వీళ్ళకే అంతా ఇవ్వాలి”
“నీ ఉద్దేశం ఏంటో స్పష్టంగా చెప్పు. అటూ ఇటూ కాకుండా మొహమాటపడి తల్లితండ్రులు కొన్ని సమస్యలు వదిలేసి వెళ్ళిపోతారు. అప్పుడు పిల్లలు ఆస్తి విషయమై ఒకళ్ళతో ఒకళ్ళు తగాదాపడి అపార్థాలు పెంచుకుని రాకపోకలు లేకుండా చేసుకుంటారు. ఊరివాళ్లలో, బంధువుల్లో లోకువ అవుతారు”
“ఆ మాట నిజం. ఆ తప్పు నేను చెయ్యను”
“మీ అమ్మాయిలేమంటారు? వాళ్లతో ఎప్పుడన్నా ఈ విషయం మాట్లాడావా?”
“వాళ్లు బంగారు తల్లులే వసంతా! అస్సలు ఆశించరు. మాకు నాన్నపొలం, బంగారం ఇచ్చి పెళ్లి చేశారు. మిగిలినవి అన్నీ బాగానే జరిపారు. ఏదీ తక్కువ చెయ్యలేదు. ఇప్పుడు మాకే లోటూ లేదు. నువ్వేదో మాకింకా పెట్టెయ్యాలని, అతిగా అలోచించి వాడికి తక్కువ చెయ్యకు. మాకు ఆస్తిపాస్తుల కంటే, తమ్ముడి ఆదరణ కావాలి. మా పిల్లలకి ఒక్కగానొక్క మేనమామ ఆప్యాయత కావాలి. శుభకార్యాలప్పుడు వాడొచ్చి నిలబడినప్పుడే మాకు గౌరవం, ఆనందం! నువ్వు వాడికిష్టం లేకుండా ఏమైనా రాసిచ్చినా, వాడు కోపం పెట్టుకుంటే మా తమ్ముడు మాకు దూరం అవుతాడు. అది మాకిష్టం లేదు. అంతా వాడికిచ్చేసినా మేము ఏమీ అనుకోము. వాడు మాకన్నా చిన్నవాడు, వాడు ఆనందంగా ఉండాలి. అదే చాలు మాకు అంటారు”
“ఎంత మంచి పిల్లలక్కా?” ఆశ్చర్యపోయింది వసంత.
“అదే కదా! నేను చెప్పేది. వాళ్లంత మంచిగా ఉన్నారు కదా! అని అంతా వాడికిచ్చేసి, వాళ్ళకి అన్యాయం చెయ్యకూడదు కదా! అప్పుడది నా తప్పవ్వదా?”
“నిజమక్కా! అందరికీ న్యాయం చెయ్యాలి నువ్వు. బాగా ఆలోచించి భాస్కర్ రాగానే మాట్లాడు. మీ ఇద్దరూ ఒకేమాట మీద ఉంటే అది అందంగానూ ఉంటుంది. అందరికీ ఆనందంగానూ ఉంటుంది”
“ఈ విషయం ఇక్కడ నీ ఇంట్లో మాట్లాడితే ఏమన్నా అనడు కదా!”
“ఏమీ ఫర్వాలేదు. నువ్వే మొదలు పెట్టు” అన్న వసంత మాటకి తలూపి, నిజంగానే భానక్క సీరియస్‌గా ఆలోచనలో పడింది. కొంత సేపు తర్జనభర్జన పడింది. తర్వాత తర్కించుకుని, ‘సరే మాట్లాడతాను’ అని నిర్ణయం తీసుకుంది.
“మీ ఇద్దరికీ అంగీకారమయ్యాక ఆ మాట ఆడపిల్లల్ని కూడా పిల్చి వివరంగా చెప్పెయ్యి. అంతా తెరిపిన పడతారు”
“అవున్నిజమే వసంతా! అలా చేస్తాను” అంది భానక్క.
మర్నాడుదయమే ఫోన్ చేసాడు భాస్కర్ “మధ్యాహ్నం వస్తాను పిన్నీ!” అంటూ. “మరో రెండు రోజులుంచకూడదా?” అంటే, “లేదు పిన్నీ నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళాలి. ఆటోలో అమ్మ కూచోలేదు” అన్నాడు.
“సరే అయితే భోజనానికి రా నాన్నా!” అంది వసంత.
పన్నెండుకల్లా వచ్చాడు భాస్కర్. ముగ్గురూ భోజనానికి కూర్చున్నారు.
“పిన్నీ! అల్లుడికి చేసినట్టు ఇన్ని చేశారేంటి పిన్నీ!” అని నవ్వాడు భాస్కర్ నొచ్చుకుంటూ.
ముగ్గురూ వాళ్ళ ఊరి కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు ముగించారు. తర్వాత రెండో బెడ్ రూమ్‌లో కూర్చున్నారు. కొంతసేపయ్యాక “భాస్కర్! అమ్మ నీతో ఏదో మాట్లాడాలనుకుంటోందంట. తీరిగ్గా మాట్లాడుకోండి. నాకు వంటింట్లో పనులున్నాయి” అంటూ తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది వసంత.
ఆలస్యం చెయ్యకుండా భానక్క మొదలు పెట్టింది. ఎప్పటినుండో తానూ అడగడానికి మొహమాటపడుతున్న భాస్కర్, తల్లే ఆ సంగతి మొదలు పెట్టేసరికి సంతోషపడ్డాడు. తన అభిప్రాయం చెప్పే అవకాశం వచ్చింది అనుకున్నాడు.
ఓ అరగంట తర్వాత తల్లీ, కొడుకూ బైటికొచ్చేసరికి పొయ్యి మీద మూకుడు పెట్టి వడలు వేస్తోంది వసంత. అది చూసి కెవ్వుమన్నాడు భాస్కర్.
“పిన్నీ! మీకు అభిమానం, ఎనర్జీ మరీ ఎక్కువయ్యాయి. ఇప్పుడే అన్నం తిన్నాం కదా!”
“ఇవి నీ కోసమే!” అన్న వసంత మాటకి “పిన్నీ నేను కూడా ఇప్పుడు యూత్ కాదు తినలేను. నువ్వైనా చెప్పమ్మా నాకెన్నేళ్లో!” అంటూ ఇద్దరినీ నవ్వించాడు.
“రెండేసే వేశాను” అంటూ ప్లేట్లలో ఒకో స్వీటూ, నాలుగేసి వడలూ పెట్టి హాల్ లోకి తీసుకొచ్చింది. వాళ్ళవి తింటూ మళ్ళీ కబుర్లలో పడ్డారు.
“అన్నీ మాట్లాడుకున్నామే వసంతా!” అంది భానక్క.
“అవును పిన్నీ, ఆవిడ చెప్పినదానికి నేను కొన్ని మార్పులు చెప్పాను. అమ్మ సరే అంది!”
“అంతా నా తర్వాతే అనుకో! వాడు చెప్పింది నాకు నచ్చింది. అయితే నన్నెవరు మరీ లేవలేనప్పుడు చూస్తారో, వాళ్లకి ప్రత్యేకంగా ఇవ్వడానికి కొంత పెట్టుకుంటున్నా అని చెప్పాను” అంది భానక్క.
“అది సరే గానీ, అమ్మ బాధ్యత నాదే కదా పిన్నీ!”
“నీకప్పుడు వీలు కాకపోవచ్చు కదా! అన్న ఉద్దేశంతో అన్నాను తప్ప నాకందరూ సమానమే కదా వసంతా!”
వసంత ఇద్దరి మాటలకీ తలూపి “టీ చేసుకొస్తా” అంటూ వంటింట్లోకి వెళ్లి టీ తీసుకొచ్చింది. అవి తాగాక “ఇంక బయలుదేరతాం పిన్నీ!” అన్నాడు భాస్కర్.
“ఒకసారి ఇలా రా అక్కా!” అంటూ భానక్కని గది లోపలికి తీసుకెళ్లి బీరువాలోంచి రెండు చీరలు తీసి, “ఒకటి ఏరుకో అక్కా!” అంది ఆమె పెట్టుకునే విభూతి పెడుతూ.
“మతిపోయిందా ఏంటి నీకు? ఈ మర్యాదలేంటి?” అని కోప్పడి కళ్లనీళ్లు పెట్టుకుంది భానక్క. చాలాసేపు బతిమాలాక, “నాకే బోలెడున్నాయి అంటే వినవు, ఏదో ఒకటి నువ్వే ఇవ్వు” అంది. వసంత ఆమె బాగ్‌లో ఒక చీర పెట్టింది.
“చాలా థాంక్స్ పిన్నీ! అమ్మకి మీరు సొంత చెల్లెలే అన్నట్టుగా ఉన్నారు. మీకు శ్రమ ఇచ్చాము!” అన్నాడు భాస్కర్ వసంత వైపు అభిమానంగా చూస్తూ.
“నాక్కూడా సంతోషమే కదా మీరు రావడం! ఈ సారి వీలయినప్పుడు అమ్మాయినీ, పిల్లల్నీ తీసుకురా నాన్నా!” అంది వసంత.
“తప్పకుండా!” అంటూ తల్లి బాగ్ తీసుకుని బైటికి నడిచాడు. భానక్క వసంతను గట్టిగా కౌగలించుకుంది. “సంక్రాంతికి మనూర్లో బావుంటుంది. మా పిల్లలు కూడా వస్తారు. ఇద్దరూ రండి, పండగ నాలుగు రోజులూ ఉండేలా!” అంది భానక్క
“అలాగే, వస్తాను” అని కారు కదిలే వరకూ నిలబడి చెయ్యి ఊపి ఇంట్లోకి నడిచింది వసంత.
ఆ మరుసటి రోజు మధ్యాహ్నం ఫోన్ చేసి చెప్పింది భానక్క. “తల మీద నుంచి పెద్ద బండరాయిని తీసేసావే బంగారం. చాలా సమస్యలు ఒకసారి కూర్చుని మాట్లాడుకోకపోవడం వల్లే వస్తాయి. ఇప్పుడు నాకు నిశ్చింతగా ఉంది.”
“మంచిదక్కా! అప్పుడప్పుడూ ఫోన్ చెయ్యి” అంది వసంత సంతృప్తిగా.
“అలాగే! ఉంటాను. మనూరు వచ్చే సంగతి మర్చిపోకు” అంది భానక్క ఫోన్ పెట్టేస్తూ.
***
చాలా రోజుల తర్వాత ప్రమీల నుంచి ఒకరోజు ఫోన్ వచ్చింది వసంతకి.
“ఏమైపోయావక్కా? నాకు భయం వేసింది. నీకింకేమైనా సమస్య వచ్చిందేమో అని!” అంది వసంత.
“నా సమస్యని నువ్వు పరిష్కరించేసావుగా” అంటూ ఆనందంగా చెబుతోంది ప్రమీల. “ఏమైనా టీచర్ వనిపించావే! భార్గవి ఇప్పుడు చాలా మారింది. రెండుసార్లు ఇక్కడికి వచ్చినా మూడోసారి మమ్మల్ని బలవంతంగా తనింటికి తీసుకువెళుతోంది. ఒకటి రెండు రాత్రులు ఉండి వస్తున్నాం. నాక్కూడా దాని ఇల్లు అలవాటయ్యింది. నేను దానికి సాయం చేస్తున్నాను. అదిక్కడికి వచ్చినప్పుడు, ఇదివరకటిలా కాకుండా తానే వంట చేసేస్తోంది. నువ్వొచ్చింది మంచిదయ్యింది నాకు. అప్పటికాలంలో అత్తకీ, ఆడపడుచులకీ భయపడ్డాం. ఇప్పుడు కూతుళ్ళకీ, కోడళ్ళకీ భయపడకూడదే! చెప్పేలా చెప్పుకోవాలి అని అర్థం అయ్యిందే బంగారు తల్లీ!”
“మంచి మాట చెప్పావక్కా! కూతురూ, కోడలూ మనింటి పిల్లలే! మన మీద ప్రేమ లేకుండా ఉంటుందా? ఏదో తెలిసీ తెలియని తనం అంతే” అంది వసంత.
“ఉంటానే” అంది ప్రమీల.
“మంచిదక్కా!” అంది వసంత.
***
ఒక రోజు మధ్యాహ్నం నిర్మల అత్తగారికి ఫోన్ చేసి “వదినా! ఏం చేస్తున్నారు?” అనడిగింది వసంత.
“రెండు రోజులనుంచీ బాలేదు వదినా! కొద్దిగా జ్వరం వస్తోంది. మీ అన్నయ్య ఏవో టాబ్లెట్ లిచ్చారు. వేసుకున్నాను గానీ తగ్గట్లేదు. వొళ్ళు నొప్పులు ఎక్కువగా ఉన్నాయి జ్వరం తగ్గినట్టే తగ్గి మళ్ళీ వస్తోంది”
“అయ్యో! మరి అలాంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్లడం మంచిది కదా!”
“ఇవాళ సాయంత్రం వెళుతున్నాం” అంది. మర్నాడు ఫోన్ చేసినప్పుడు “ఒక కోర్స్ ఇచ్చాడు రాత్రే మొదలు పెట్టాం. చూడాలి” అందావిడ.
ఒక రోజాగి ఆ మర్నాడు ఉదయం చేసినప్పుడు “తగ్గట్లేదు వదినా జ్వరం! ఇప్పుడు మళ్ళీ వెళుతున్నాం” అంది.
ఆ రోజు సాయంత్రం భర్త షాప్ నుంచే వచ్చేసరికి రెడీగా ఉంది వసంత. వెంకట్రావూ, వసంతా నిర్మల అత్తగారింటికి వెళ్లారు. “డాక్టర్ పరీక్షలు చేసి టైఫాయిడ్ అని తేల్చాడు నాన్నా! మళ్ళీ మందులు ఇచ్చాడు. ఒక వారం పదిరోజులు పడుతుందట తగ్గడానికి” చెప్పింది నిర్మల. ఆవిడ నిజంగానే చాలా బలహీనంగా వుంది. మొహం జ్వరం వల్ల కమిలిపోయి వుంది.
“తగ్గిపోతుంది వదినా! ఫలానా జ్వరం అని తెలిస్తే, సరైన మందులు రాసేస్తారు!” అంటూ ఆమెకి ధైర్యం చెప్పి ఒక అరగంట కూర్చుని వచ్చేసారు వెంకట్రావూ, వసంతా.
తల్లికి టైఫాయిడ్ జ్వరం అని తెలిసి అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్న నిర్మల ఆడపడుచు రేణుక ఇద్దరు పిల్లల్నీ భర్త దగ్గర వదిలేసి ఇండియా బయలుదేరింది. నిర్మల పెళ్లి అయినప్పుడు మాత్రమే ఓ పదిరోజులుంది రేణుక. ఆ తర్వాత రెండేళ్ల కొకసారి భర్తా పిల్లల్తో వచ్చి తన అత్తామామల ఇంటికీ, ఆడపడుచుల ఇంటికీ, బావగారి ఇంటికీ తిరుగుతూ తల్లి దగ్గర ఒక వారం మాత్రమే ఉండేది. అందువల్ల నిర్మలకి ఆమెతో అంతగా స్నేహం లేదు.
రేణుక వచ్చిన వెంటనే తల్లి రిపోర్ట్ లన్నీ తీసుకుని డాక్టర్ దగ్గరికి స్వయంగా వెళ్లి తల్లి జ్వరానికి గల కారణం గురించి పూర్తిగా తెలుసుకుంది. “భయం లేదు. నెమ్మదిగా తగ్గుతుంది. ఎవరో ఒకరు ఆమెను కనిపెట్టుకుని ఉండాలి!” అని డాక్టర్ చెప్పింది.
రేణుక తల్లి గదిలోనే తన మంచం వేయించుకుంది. ఒక టేబుల్, కుర్చీ వేయించుకుని లాప్‌టాప్ పెట్టుకుని అక్కడే పని చేసుకుంటూ కూర్చుంటోంది. తల్లికి సంబంధించిన అన్ని పనులూ అంటే బాత్రూంకి తీసుకు వెళ్లడం, స్పాంజ్ బాత్, భోజనం, పళ్లరసాలు తీసివ్వడం వరకూ మొత్తం బాధ్యత తీసుకుంది. ఆ మేరకు నిర్మలకి పని కొంత తగ్గింది. నిర్మల మావగారూ, భర్తా కూడా వీలయినంతవరకూ ఇంట్లో ఉన్నప్పుడు ఆమె దగ్గరే ఉండి కబుర్లు చెబుతున్నారు.
రేణుక తల్లిని కంటికి రెప్పలా చూసుకుంటోంది. నాకు తప్ప అమ్మను చూసుకోవడం ఎవరికీ రాదన్నట్టుగా ఉందామె ప్రవర్తన. ‘నిన్నటి దాకా నేను కూడా జాగ్రత్తగానే చూసుకున్నాను కదా!’ అని నిర్మల కొంచెం చిన్నబుచ్చుకుంది ఆడపడుచు ప్రవర్తనకి. అయితే భర్తతో అనేంత ధైర్యం లేక ఊరుకుంది. అత్తగారు కూడా కూతురు రాగానే తనని మరిచిపోయినట్టూ, ఎవరో పరాయి మనిషిని చూస్తున్నట్టు చూస్తోందేమిటీ? అనిపించి బాధ కలిగిందామెకు.
రేణుక తల్లి ఆరోగ్యం కోసం పైనుంచి దిగి వచ్చిన దేవతలా తన పని నుంచి దృష్టి మరల్చడం లేదు. నిర్మల భర్తా, మావగారు రేణుకని పొగుడుతున్నారు. వసంతా, వెంకట్రావూ వచ్చినప్పుడు వాళ్ళూ రేణుకని పొగడడమే! కూతురు రాగానే అత్త తనని మర్చిపోయిందనిపించింది నిర్మలకి. ఆమె భర్తనీ, మావగారిని, పిల్లల్ని చూసుకుంటుంటే రేణుక తల్లిని వదలకుండా ఉంటోంది. నిర్మలకి తన అత్తా, ఆడపడుచుల తీరు అబ్బురంగా తోస్తోంది. వాళ్లిద్దరూ ఒకరినొకరు చూసుకుంటున్నప్పుడు వాళ్ళ కళ్ళలో మెరుపు, పొంగిపొరలే అనురాగం నిర్మలకి ఆశ్చర్యంగా అనిపిస్తోంది.
నిజంగా ఆడపిల్లకి తల్లిని చూస్తే అంత ఆనందంగా ఉంటుందా? తల్లికి కూడా అలాంటి సంతోషమే ఉంటుందా? మరి తనకి అలాంటి అనుభవం లేదేంటి? తనలో తను తర్కించుకుంటుంటే కొన్ని విషయాలు గుర్తొస్తున్నాయి. తనకి పెళ్లయి అత్తగారింటికి వచ్చేసిన తర్వాత తను తల్లిని కలిసినప్పుడు అమ్మ కళ్ళలో తనని చూడగానే ఇలాంటి సంతోషపు మెరుపు కనబడడం తాను గమనించినా, నిర్లక్ష్యంగా ప్రవర్తించడంతో, క్రమంగా అమ్మ కళ్ళలో మెరుపు రాకపోవడం తానూ గుర్తించినా లక్ష్యపెట్టలేదు.
అమ్మ మెల్ల మెల్లగా తనపై ప్రేమను చూపెట్టడం తగ్గించుకుంది. తానైతే అమ్మ పట్ల ఇలాంటి అనురాగం ఎప్పుడూ చూపెట్టలేదు. పిల్లలు పుట్టినప్పుడు అమ్మ దగ్గరికి వెళ్లి అన్నీ చేయించుకున్నా చెయ్యకేం చేస్తుంది? అని తాను అనుకునేది తప్ప అమ్మకి నా వల్ల ఎంత శ్రమ అవుతోందో? అని ఎప్పుడూ అనుకోలేదు. ఇద్దరూ ఒకే ఊరిలో ఉండడం వల్ల తరచుగా కలవడం ఒక మొక్కుబడి కార్యక్రమంగా మారిపోయింది. తన అత్తా ఆడపడుచుల్లా తల్లితో తాను ప్రేమపూర్వకంగా ఎందుకు లేదు? కారణం ఎవరు? నేనేనేమో? ఆమె తలలో తర్జనభర్జన జరుగుతోంది. నేను తనతో ప్రేమగా ఉండకపోవడం వల్ల, అమ్మ కూడా తనపై మమకారం కొంత తగ్గించుకుని ఉంటుంది అని అర్థం అయిందామెకి.
(సశేషం)