[శ్రీ చావలి సాయి ప్రకాష్ రచించిన ‘ఆనందమే ఆరంభం’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]మా[/dropcap]ర్నింగ్ వాక్‌కి ఇంటి నుండి బయలుదేరిన అనిరుధ్ వీధి మలుపు తిరిగి ఎదురుగా కనిపించే లేడీస్ హాస్టల్ వైపు చూపు సారించి చూసేసరికి ‘గోకుల్ లేడీస్ హాస్టల్’ బయట దేవకి అసహనంతో నిల్చుని ఉంది.
అనిరుధ్ ఆమెని సమీపించగానే, “ఏంటి డాడీ ఇవాళ ఇంత ఆలస్యంగా వస్తున్నావు? నేను నీకోసం పదినిమిషాలుగా ఎదురుచూస్తున్నాను” అంటూ కోప్పడిన దేవకిని మురిపెంగా చూస్తూ ఆమెని వెంటబెట్టుకొని పార్కు వైపు నడక సాగించాడు.
ఇంతలో రోడ్డు వారగా కనిపించిన నీళ్ళ సీసా అనిరుధ్ దృష్టిని ఆకర్షించింది. “దగ్గర్లో డస్ట్‌బిన్ లేదులే డాడీ” అని దేవకి అంటున్నా వినిపించుకోకుండా దానిని చేతిలోకి తీసుకున్న అనిరుధ్‌ని చూసి దేవకి నవ్వుకుంది.
పార్కుకి చేరి ఇద్దరూ ఎప్పటిలాగే కబుర్లు చెప్పుకుంటూ దారిలో కనబడ్డ ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ బాటిళ్లు ఓపికగా తీసి డస్ట్‌బిన్‌లో వేస్తూ నడక కొనసాగిస్తున్నారు.
“ఈరోజు మీ వాకింగ్ ఫ్రెండ్ ధనంజయ రాలేదా?” అని దేవకి అడుగుతుండగానే వేళాడేసుకున్న మొహంతో పార్కులోకి అడుగుపెడుతున్న ధనంజయని చూసాడు అనిరుధ్.
ధనంజయ అనిరుధ్‌కి పార్కులో పరిచయం. మొదట హాయ్, హలోలతో మొదలై వృత్తిపరమైన సలహాలు, సంప్రదింపుల వరకూ వచ్చింది ఈ స్నేహం. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే ధనంజయ ఇలా దిగాలుగా ఉండటం చూసి అనిరుధ్ కంగారు పడ్డాడు. పైగా గత నాల్రోజులుగా వాకింగుకి రావట్లేదు, మెసేజిలు పెట్టినా ముక్తసరిగా జవాబిస్తున్నాడు.
దేవకిని నడక కొనసాగించమని చెప్పి ధనంజయ దగ్గరకి వచ్చి, “ఏంటి ధనా(ధనంజయ) సంగతులు? నాల్రోజులుగా పార్కుకి రావట్లేదు? అంతా బాగానే ఉందా?” అని అడుగుతూ పక్కనే ఉన్న బెంచీ మీద కూర్చున్నాడు.
ధనంజయలో అప్పటిదాకా ఆనకట్ట కట్టినట్టున్న బాధంతా కట్టలు తెంచుకుంది. ఒక్కసారిగా అనిరుధ్‌ని పట్టుకొని భోరున విలపించాడు. స్నేహితుడి గుండెల్లోని బాధనంతా తీరేదాకా మరో మాట మాట్లాడలేదు అనిరుధ్. అవసరమైనప్పుడు నేనున్నాని వెన్ను తట్టే చిన్న భరోసా, తలవాల్చి ఏడవడానికి ఓ భుజం ఆసరా ఎంత అవసరమో స్వానుభవం కాబట్టి తన స్నేహితుడిని పొదివి పట్టుకుని ఓపికగా కూర్చున్నాడు.
“అనిరుధ్! ఎప్పటికైనా సరే గవర్నమెంట్ జాబు తెచ్చుకుంటానని ఇంటి దగ్గర మాటిచ్చి సిటీకి వచ్చి కోచింగ్ తీసుకుంటూ చేసిన ప్రయత్నాలన్నీ వృథా అయిపోయాయి. మూడ్రోజుల క్రితం వెలువడిన ఫలితాల్లో నాకు ఉద్యోగం రాలేదు. మళ్ళీ ప్రయత్నించే ఓపిక, సమయం రెండూ లేవు. వచ్చిన ప్రైవేటు ఉద్యోగాలని కాలదన్నుకున్నాను కాబట్టి నేను ఊర్లో మావాళ్ళ ముందు తలెత్తుకుని తిరగలేను. ఇప్పుడేం చెయ్యాలో దిక్కు తోచట్లేదు. ఇక ఈ జీవితం నా వల్ల కాదు. చనిపోవాలనంత బాధగా ఉంది, నాలుగు రోజులుగా ఎడతెగని ఆలోచనలు. నిన్నైతే నిద్ర మాత్రలు కొనుక్కొని ఎక్కువ మోతాదులో మింగేద్దామా అనే ఆలోచనలు కూడా వచ్చాయి, నేనొక ఫెయిల్యూర్‌ని” అని తన వ్యథనంతా చెప్పుకొని తలదించుకుని కూర్చున్నాడు.
ధనంజయ ఈ మాట అనగానే అనిరుధ్ తన గతం గుర్తుచేసుకున్నాడు.
“కోరుకున్న జీవితం దక్కలేదని చనిపోదాం అనుకున్నావా పిచ్చోడా? సరే! ధనా! నీకో యథార్థగాథ చెప్తాను. గత సంవత్సరంగా నువ్వు ఏదైనా పరీక్షలో పాసవ్వలేదని దిగులుగా ఉన్నప్పుడలా నీకు ఇది చెప్పాలనుకున్నాను కానీ వాయిదా వేస్తూ వచ్చాను. ఇక ఇప్పుడు తప్పక చెప్పాల్సిన సమయం వచ్చింది. ఈ కథనుండి ఏమైనా నేర్చుకోగలవేమో చూడు. లేదంటే నీ కోరిక ప్రకారమే చేద్దువుగాని”.
***
ఒంటరి మహిళగా పరిస్థితులకి ఎదురీదుతూనే వకుళ తన కొడుకు అనిరుధ్‌ని కష్టపడి సాకింది. తమని కాదని పెళ్ళి చేసుకుందని వకుళ పుట్టింటివారెవరూ ఆమె పరిస్థితి తెలిసీ చేరదీయలేదు. అనిరుధ్ కూడా తల్లి కష్టాన్ని అర్థం చేసుకుని డిగ్రీ అయిపోగానే చిన్న ఉద్యోగంలో చేరాడు. తానుద్యోగం చేస్తున్నాడు కాబట్టి వకుళని ఉద్యోగం మానేయమన్నా కానీ ఆమె వినేది కాదు.
“నీ కోసం కాదురా! నా మనవల కోసం ఈ సంపాదనంతాను. నానమ్మా! మాకు ఫలానాది కావాలి అని వాళ్ళడిగితే నీ దగ్గర డబ్బులడగనా?” అని నవ్వుతూ తీసిపారేసేది.
ఉద్యోగంలో చేరిన మూణ్ణెలల్లో అనిరుధ్ బైక్ కొనుక్కున్నాడు. స్నేహితులు, షికార్లు అంటూ డబ్బు మంచినీళ్ళల్లా ఖర్చుపెట్టేవాడు. తల్లి ఎప్పుడైనా పొదుపు గురించి చెప్పబోతే ప్రస్తుతం సరదాగా గడిపి ఓ ఐదేళ్ళ తరువాత పొదుపు గురించి ఆలోచిస్తాననేవాడు. అవసరాలు చెప్పి రావని తల్లి చెప్పినా తేల్లిగ్గా నవ్వేసేవాడంతే.
ఓ ఆదివారం ఉదయం వకుళ హఠాత్తుగా ఒకమ్మాయి ఫొటో తెచ్చి కొడుక్కి చూపించి ఈ అమ్మాయి ఎలా ఉందని అడగగానే అనిరుధ్ విస్తుపోయాడు.
తల్లి బలవంతం మీద ఫోటో చూస్తే ఆ అమ్మాయిలో వంకపెట్టడానికేమీ కనిపించలేదు. వెనక ఆస్తులు లేని తనకి సంబంధం రావడమే గొప్ప కాబట్టి అనిరుధ్‌కి పెద్ద ఆశలు కూడా లేవు కానీ ఇంకో మూడేళ్ళ వరకూ పెళ్ళి చేసుకునే ఆలోచన లేదు. కాస్త డబ్బు కూడబెట్టి అప్పుడు చేసుకోవాలని అతడి ఉద్దేశం. ఇదే మాటని తల్లికి చెప్తే ఆమె అనిరుధ్ మాటలని కొట్టి పారేసింది.
“అనీ! సెటిల్ అవ్వాలి అంటూ కూర్చుంటే నా లైఫ్ టైం సెటిల్మెంట్ దేవుడు ఇచ్చేస్తాడురా! జరగరానిది జరిగి నేను నీకు దూరమైతే ఎలా? నీ పెళ్లి చేసేస్తే సంతృప్తిగా ఉంటుందిరా” అని వకుళ చెప్పగానే అనిరుధ్‌కి తల్లి మీద కోపం వచ్చింది.
“ఎందుకమ్మా లేనిపోని ఆలోచనలు? నా పిల్లల పెళ్ళిళ్ళయ్యేవరకూ నువ్వు ఎక్కడికీ వెళ్ళకూడదు. నీతో సెంచరీ కొట్టించే పూచి నాది. చూస్తూ ఉండు!” అంటూ తల్లి చేయి పట్టుకున్నాడు.
కొడుకు కళ్ళల్లో నీళ్ళు చిప్పిల్లడం చూసి వకుళ తన మాటలు కొడుకుని బాధించాయని గ్రహించి మాట మార్చడానికి, “రేపే నీ పెళ్ళవ్వదు కానీ ముందర మన రాములారి గుళ్ళో అయ్యవారికి నీ జాతకం చూపిద్దాము. స్నానం చేసి బీరువాలో అడుగున ఉన్న మీ నాన్న పట్టు పంచె కట్టుకో! నేను మార్కెట్టుకి వెళ్ళివచ్చాకా గుడికెళ్దాం” అని చెప్పి కొడుకు సమాధానం కోసం చూడకుండా వెళ్ళిపోయింది.
అమ్మ వాలకం చూస్తుంటే అతి త్వరలో తనని ఓ ఇంటివాడిని చేసేలానే ఉందనిపించింది అనిరుధ్‌కి. అయినా ప్రస్తుతం వెళ్ళేది పెళ్ళిచూపులకి కాదు కద అనుకుని బీరువా తీసి అడుగు అరలో కవర్లో ఉన్న నాన్న పంచె బయటకి తీసాడు.
‘ఇది నీ పెళ్ళికి కట్టుకోవాలిరా!’ అని తల్లి తరచూ చెప్పే మాట గుర్తొచ్చి అనిరుధ్ నవ్వుకున్నాడు.
ముక్క వాసన వస్తున్న ఆ పంచె, కండువాని కాసేపు ఎండలో వేద్దామని మడతలు దులుపుతుండగా ఒక కొత్త పాస్ బుక్ అతడి కంటబడింది. తనకి తెలీకుండా తల్లికి ఉన్న బ్యాంక్ అకౌంట్ ఏమిటా అని ఆశ్చర్యపోయాడు. తన దగ్గర ఏదీ దాచని తల్లి దీనిని అంత రహస్యంగా ఎందుకుంచిందో అర్థం కాలేదు. తల్లి వచ్చేవరకూ ఆగకుండా దానిలో ఏముందో చూడటం భావ్యం కాదనిపించినా ఉగ్గబట్టుకోలేక తెరిచి చూసాడు. అందులో దాదాపు మూడు లక్షలున్నాయి. తనకి కనీసం అనుమానం రాకుండా అమ్మ ఒక బ్యాంకులో అకౌంట్ తెరిచి అందులో నెలనెలా డబ్బులు వేస్తూ ఉందంటే అనిరుధ్ నమ్మలేకపోయాడు.
మార్కెట్టు నుండి రాగానే ఆమెని ఇదే విషయం అడిగాడు.
ఆ అకౌంటులో పెద్దగా డబ్బుల్లేవని చెప్పి ఆ సంగతి తరువాత చెప్తానని తల్లి సమాధానం దాటెయ్యబోయినా అనిరుధ్ ఊరుకోలేదు.
“అమ్మా! నేను ఆ అకౌంటులో ఎంత డబ్బుందో చూసాను. మనకి అవసరమైనప్పుడు కూడా ఈ డబ్బులున్నాయని నాకెప్పుడూ చెప్పలేదు. అత్యవసరానికి కాకపోతే ఈ డబ్బులు దేనికి?” అని సమాధానం కావాల్సిందే అన్నట్టు లేచి వంటగది వైపు వెళ్ళాడు.
“అనీ! నెల నెలా ఇల్లు గడవడానికి తప్ప మనకంటూ భవిష్య నిధి లేదు. ఒకవేళ నేను ఉన్నపళంగా పోయినా కూడా నా దహనసంస్కారాలకి తదితర ఖర్చులకి నువ్వు ఇబ్బంది పడకూడదు. మీ నాన్న అకస్మాత్తుగా మనల్ని వదిలి వెళ్ళినప్పుడు ఆ కార్యక్రమాలకోసం మనం పడ్డ ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. మనం అవసరంలో ఉన్నామని తెలిసీ అప్పులు తీసుకున్న వాళ్ళు తిరిగి ఇవ్వలేదు. ఆ కార్యక్రమాలు జరపడానికి పడ్డ ఇబ్బందులు మళ్ళీ పునరావృతం కాకూడదనే నేను ఒక ఖాతా తెరిచి అందులో డబ్బులు జమచేస్తూ వచ్చాను. ఒకవేళ నాకు జరగకూడనిదేదైనా జరిగితే ఈ డబ్బు విషయం నీకు చెప్పమని మన గుళ్ళో అయ్యగారికి మాత్రం చెప్పి వుంచాను. నువ్వు డబ్బులు పొదుపు చెయ్యడం నేర్చుకునేలోపు అలాంటి అవసరం ఏమైనా వస్తే తప్ప ఈ డబ్బు వాడకూడదు” అని తల్లి చెప్పగానే అనిరుధ్ నోటివెంట మాట రాలేదు.
వంటగది నుండి హాల్లోకి వచ్చి మౌనంగా కూర్చుండిపోయాడు.
‘అసలు నేను కొడుకుగా ఏమి చేస్తున్నాను? ఇన్నేళ్లు వచ్చిన కూడా ఒక అత్యవసర నిధి అవసరం ఉంటుందని నాకెందుకు అనిపించలేదు. మా అమ్మ ఈ వయసులో తను పోయాక నేను ఎలాంటి ఇబ్బంది పడకూడదు అని డబ్బులు కూడబెడుతుందా? లోకంలో తల్లులందరూ ఇలానే ఉంటారా? అంత కష్టపడి పెంచినందుకు కొడుకుగా కనీసం ఆ బాధ్యత కూడా నేను నేరవేర్చలేనా?’ అనే ఆలోచనలతో అతడి బుర్ర వేడెక్కిపోయింది.
‘దేవుడా! మా అమ్మకి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకునే స్థాయిలో నేనుండాలి, ఆ శక్తి నాకివ్వు. మా అమ్మ సమకూర్చుకున్న నిధిలోంచి రూపాయి కూడా ముట్టకుండా నా కష్టార్జితంతో మాత్రమే ఆమె కార్యం చేయగలిగే స్థితిలో నేనుండాలి!’ అని కూర్చున్నచోటు నుండే మనసులో దైవాన్ని ప్రార్థించాడు.
అప్పటినుండీ అనిరుధ్‌లో మార్పు వచ్చింది. జీతం రాగానే ఏటీయం కార్డ్ తల్లి దగ్గరపెట్టి ఆమె దగ్గరనుండే తన ఖర్చులకి డబ్బులు తీసుకునేవాడు. అనవసర ఖర్చులని తగ్గించేసాడు. రెండు నెలల్లో తన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి తల్లి కళ్ళల్లో మెదిలిన సంతోషం వర్ణించడానికి మాటలు లేవు.
“లోను తీసుకుని ఇంకో సంవత్సరంలో ఓ చిన్న ఇల్లు కట్టుకుందాము. అప్పుడు నువ్వు ఉద్యోగం మానెయ్యాలి, ఆ తరువాతే నా పెళ్ళి!” అంటున్న కొడుకుని ప్రేమగా దగ్గరకి తీసుకుంది వకుళ.
ఓ రెండువారాల తరువాత ఆఫీసులో ఉన్నప్పుడు అనిరుధ్‌కి అమ్మ నుండి ఫోను వచ్చింది.
“అమ్మా! మళ్ళీ చెయ్యానా?” అని అడిగేంతలో,
“హలో! అనిరుధ్ గారేనా మాట్లాడేది?..” అంటూ అవతలి వ్యక్తి చెప్పిన మాటలు విని హుటాహుటిన ఆసుపత్రికి పరిగెత్తాడు అనిరుధ్.
ఆసుపత్రి లోపలికి అడుగుపెడుతోంటే ఒక్క నిమిషం అనిరుధ్ గుండె కొట్టుకోవడం ఆగిపోయినంత పనైంది. ఒళ్ళంతా చమటలు పట్టేసాయి. కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యాయి. అమ్మకేమీ కాకూడదని దండం పెట్టుకుంటూ రిసెప్షనిస్ట్ దగ్గరకి వెళ్ళి తల్లి పేరు చెప్పి వివరాలు అడిగాడు.
ఇంతలో ఒక స్ట్రెచర్ మీద తెల్లటి ముసుగు కప్పిన ఒక శరీరాన్ని తోసుకుంటూ రావడం అనిరుధ్ చూసాడు. తన తల్లి కాదనుకుంటూనే ముందుకెళ్ళబోయాడు కానీ తెల్లటి దుప్పటీలోంచి కనిపించిన చీర చూడగానే హతాశయుడయ్యాడు.
అలాంటి స్థితిలో కన్నతల్లిని చూస్తుంటే గుండె తరుక్కుపోయింది. జీవితంలో మొట్టమొదటిసారి అంధుడిలా పుట్టుంటే ఎంతబాగుండేదో ఇంతటి దారుణ దృశ్యాన్ని చూడగలిగేవాడిని కాదు అంటూ గొంతు పోయేలా బిగ్గరగా ఏడ్చాడు. ఇంతలో అతడి కొలీగ్స్ అక్కడకి చేరి అతడిని ప్రక్కకి తీసుకెళ్ళారు.
***
“ధనా! నా చిన్ని ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైంది. నా అనుకున్నవారు ఎవరూ లేని ఏకాకిగా మిగిలిపోయాను. నా పెళ్లి చూడాలని ఆశపడ్డ అమ్మ అది చూడకుండానే వెళ్ళిపోయింది. ఏ డబ్బైతే నేను వాడకూడదు అనుకున్నానో అదే డబ్బుతో అమ్మ కార్యక్రమాలు చేయించాల్సి వచ్చింది. ఓదార్చే నాథుడు కూడా లేకపోయినా గుక్క పెట్టి నెల రోజులు ఏడ్చాను. అమ్మని బాగా చూసుకోవాలనే సంకల్పం ముందరే ఎందుకు రాలేదని నన్ను నేను తిట్టుకున్న రోజులెన్నో! పుట్టినప్పటినుండీ నా బాధ్యత తీసుకున్నావు. ఆఖరికి నీ డబ్బులతోనే నిన్ను సాగనంపాల్సి వచ్చింది కదమ్మా! నేనెంత పనికిమాలినవాడిని అంటూ అమ్మ ఫొటో ముందు ఎన్ని నెలలు ఏడిచానో. బ్రతుకు మీదే ఆసక్తి పోయింది. ఏపూటకి ఆ పూట ఇక చనిపోదామా అన్నంత కుంగిపోయేవాడిని” అంటూ అనిరుధ్ కళ్ళవెంబడి వస్తున్న కన్నీళ్లు తుడుచుకొని రెండు నిముషాలు నిశబ్దంగా ఉండిపోయాడు.
ధనంజయ అందించిన మంచీళ్ళు త్రాగి కాస్త కుదుటపడ్డాడు అనిరుధ్.
“అసలు ఎంత బాధ భరించావు అనిరుధ్? నా అన్నవాళ్ళు లేకపోతే ఆ జీవితం ఎలా ఉంటుందో అని తలుచుకుంటూనే నరకంలా అనిపిస్తుంది. ఆ తరువాత ఏం జరిగింది? ఎలా బయటపడ్డావ్? ఇంతకీ ఎవరు లేరు అన్నావు కదా! మరి రోజూ నీతో వాకింగుకి వచ్చే చెల్లి దేవకి ఎవరు?” అంటూ తన సందేహాలని బయటపెట్టాడు ధనంజయ.
అనిరుధ్ తన కథని చెప్పడం కొనసాగించాడు.
***
అనిరుధ్ పరిస్థితి తెలుసుకొని అతడి స్నేహితులు పరామర్శకి వస్తుండేవారు. అలా ఒకరోజు వింధ్య వచ్చింది.
“ఏంటి అనిరుధ్ ఇలా అయిపోయావు? అలా ఒక్కడివే నీలో నువ్వే ఎన్నాళ్ళు బాధపడతావు? బయట ప్రపంచం చూడు, ప్రతీవారికీ ఏదో ఒక సమస్య ఉంటుంది” అంటూ వింధ్య మాట్లాడటం మొదలుపెట్టగానే అనిరుధ్‌కి చిరాకొచ్చింది.
అప్పటికే ఎన్నోసార్లు ఎంతోమంది నోటి నుండి విన్న ఆ మాటలు అనిరుధ్‌కి విసుగనిపించినా పైకి కనపడనీయక “ఎలా ఉన్నావు వింధ్యా? మీ వారు ఎలా ఉన్నారు అంత కుశలమేనా?” అని అడిగాడు.
“అందరం బాగున్నాము, నీ గురించి తెలిసాక నేను, మా వారు ఇద్దరం ఒకసారి వద్దాము అనుకున్నాము కానీ ఇంతలో ఆయనికి ఊరెళ్ళే పని పడి నేను ఒక్కదాన్నే వచ్చాను. నీ స్థితిని చూస్తుంటే నన్ను నేను చూసుకుంటున్నట్టు ఉంది, చనిపోవాలనిపిస్తుంది అంటూ ఏవో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావని బలరాం చెప్పాడు. అది విన్నాక నీతో కాసేపు మాట్లాడదాం అనిపించి వచ్చాను” అంటూ కోపంగా అనిరుధ్ వైపు చూసింది.
“ఎందుకో అలా అనిపిస్తోంది వింధ్యా! అందరు జాలి చూపిస్తున్నా కూడా నాకు నచ్చట్లేదు. ఇలా ఉంటే కష్టం, బయటకి రావాలి అంటూ అందరూ చెప్తున్నారు కానీ చెప్పడం చాలా తేలిక. అనుభవించే వాడికే కదా తెలిసేది నొప్పి ఎలా ఉంటుందో!” అని అనిరుధ్ నిస్తేజంగా మాట్లాడాడు.
వింధ్య ఒక నవ్వు నవ్వి “అసలు నేను నిన్ను కలవడానికి కారణం కూడా ఇదే. నేను నీలాంటి స్థితి నుండే తట్టుకొని అందులో నుండి బయటకి వచ్చాను. నేను కూడా ఒకప్పుడు ఇలానే డిప్రెషన్‌లో ఉన్నాను” అని వింధ్య అనగానే అనిరుధ్ ఆశ్చర్యపోయాడు.
“నాకు పెళ్ళై మూడేళ్ళైనా పిల్లలు కలగలేదు. ఎన్నో మందులు వాడి, ఎన్ని హాస్పిటల్స్ చుట్టూ తిరిగిన ఫలితం లేకుండా పోయింది. ఆ సమయంలో నా అంత దురదృష్టవంతురాలు ఎవరూ ఉండరేమో అనేలా బాధపడేదానిని. మెల్లగా అత్తారింట్లో వేధింపులు కూడా మొదలైనాయి, గొడ్రాలు అనే మాట పదే పదే నా చెవులకి వినపడేది, మానసికంగా ఎంతో క్షోభించాను. నా పుట్టింటి వాళ్ళు కూడా మన రాత ఇంతే అన్నట్లు నిస్సహాయతతో ఉండేవారు. నాకే ఎందుకు ఈ సమస్య అని దేవుడు ముందు ఏడవని రోజంటూ లేదు. అంత వేదనలో కూడా నాకేదైనా భరోసా ఉందంటే అది మా ఆయనే! ప్రత్యామ్నాయ మార్గాలు చూద్దాం అని ఆయన చెప్పినా అత్తింటి వాళ్ళు ఒప్పుకోలేదు. వాళ్ళ మాటలు విని ఈయన నన్ను ఎక్కడ వదిలేస్తారో అని నాలో నేను ఎంత నరకం అనుభవించానో..” అంటూ తన చేదు గతాన్ని తలుచుకొని చెబుతూ కనీళ్లు తుడుచుకుని కొనసాగించింది.
“ఆయన ఎంత బాగా చూసుకున్నా పిల్లలు లేని వెలితి నన్ను బాధిస్తూనే ఉండేది. ఎన్ని ఆసుపత్రుల చుట్టూ తిరిగామో! ఎన్నెన్ని గుళ్ళు, గోపురాలు తిరిగి పూజలు చేసామో! అయినా ఫలితం లేకపోవడంతో ఇక నా మీద నాకే అసహనం వచ్చేసింది. చనిపోదాం అనే ఆలోచనలు తరచూ కలిగేవి. సరైన సమయం చూసుకొని ఎవరు లేని సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను..” అని చెప్పగానే వెంటనే అనిరుధ్ ఆ మాటకి అడ్డుపడి
“నీ చేతిలో లేని దానికోసం చనిపోవాలి అనుకోవడమేమిటి వింధ్య? ఇది నిజంగా పిచ్చి పని” అనిరుధ్ అనగానే,
“మన చేతిలో లేని దాని గురించి మనం చనిపోకూడదు కద? మన సమస్య మనకి తట్టుకోలేని విధంగా ఉంటుంది, బయట నుండి చూసేవాళ్లకి ఇందులో ఏముందన్నట్టే ఉంటుంది. ప్రస్తుతం నీ మానసిక స్థితి కూడా ఇదే కద! మనం ఎప్పడైతే మనమే సమస్య అనుకుంటామో అప్పుడే ఇలా చనిపోవాలన్న ఆలోచనలు వస్తాయి, అదే ఆ సమస్యని మనలో నుండి వేరు చేసి కాస్త దూరం పెట్టి చూస్తే అప్పుడు అది పెద్ద బాధించదు, బతకచ్చులే అని ధీమా వస్తుంది.” అని చెప్తుంటే నిజమే కదా అన్నట్లు అనిరుధ్ ఆలోచనలో పడ్డాడు.
“ఇంతకీ తర్వాత ఏమైంది? ఏం చేసావ్? ఎలా బయటపడ్డావ్?” అని వినడానికి సిద్ధంగా చెవులు పెద్దవి చేసుకొని ఆసక్తిగా అడిగాడు.
“నాకిప్పుడు పిల్లలు లేరు అని బాధపడుతూ ప్రతి రోజు నరకం అనుభవించేకంటే నేను ఈ సమస్యని మరో కోణంలో ఎందుకు ఆలోచించకూడదనిపించింది. నాకు పిల్లలు భవిష్యత్తులో పుడతారో లేదా ఎవర్నైనా దత్తత తీసుకుంటామా లేదా నాకు విడాకులు అయిపోతాయా అనే ప్రశ్నలకి సమాధానం ప్రస్తుతం లేదు. అప్పటిదాకా నేను ఇలా నాలో నేను కుమిలిపోతే అనారోగ్యం పాలవడం మినహా మరి ఏ ఇతర ఉపయోగం లేదని అర్థమయ్యింది. ఖాళీగా కూర్చుంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయనుకుని నన్ను నేను బిజీగా ఉంచుకోవాలని నిర్ణయించుకుని పిల్లలతో గడిపే ఉద్యోగం వైపే మొగ్గు చూపాను. నేను కన్నతల్లిని కాకపోయినా, నాలో పిల్లల్ని చూసుకునే అమ్మతనం ఎప్పుడు సజీవంగా ఉంచుకుని నేను సంతోషంగా జీవితం సాగించాలననిపించింది. ఇదే ఆలోచన మా వారికి చెప్పి ఇంటికి దగ్గర్లోని ప్లే స్కూల్లో టీచర్‌గా చేరాను. ఆ ఒక్క నిర్ణయం నా జీవితాన్ని మార్చేసిందంటే అతిశయోక్తి కాదు.
నా రోజంతా పిల్లలతోనే గడిపిచిపోతుంది, వాళ్ళని ఆడిస్తూ వాళ్ళకి అన్నం తినిపిస్తూ వాళ్ళని నిద్రపుచ్చుతూ వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వింటూ వాళ్ళని ఎత్తుకొని జో కొడుతూ అసలు ఇంతకంటే నాకు జీవితంలో ఏమి కావాలి అన్నంత హాయిగా గడిచిపోతుంది. ఈ రోజు నేను నా క్లాసులో ముప్పైమంది పిల్లలకి అమ్మని. ఇక నా ప్రాణం ఉన్నంతవరకు, నాకు ఓపిక ఉన్నంతవరకు ఎంతమందిని ప్రేమగా చూసుకోగలనో అన్నేళ్లు అన్ని వందలమంది పిల్లలకి అమ్మనే, ఆ తృప్తి చాలు నాకు” అని చెప్తూ ఆనందబాష్పాలతో ముఖమంతా ఎర్రగా మారిన వింధ్యని చూస్తుంటే అనిరుధ్‌కి కూడా అప్రయత్నంగా కన్నీరు వచ్చేసింది.
“నిన్ను అభినందించకుండా ఉండలేకపోతున్నాను వింధ్య! నీ సమస్యని చూసి జీవితాంతం అలానే బాధపడుతూ ఉండిపోకుండా, సరైన దారిలో చక్కటి పరిష్కారం కనుక్కొని సంతోషంగా ఉన్నావు. ప్రౌడ్ ఆఫ్ యు మై ఫ్రెండ్” అంటూ వింధ్య భుజం తట్టాడు.
“ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలాంటి ఆలోచనలు చేసింది నేనేనా అని నవ్వొస్తుంది నాకు, మన చేతుల్లో లేనివాటికోసం ఎంతకాలమని బాధపడుతూ కూర్చొని ఇక దారిలేదని చావొక్కటే దిక్కు అనుకుంటాం. ఇలా ఒకసారి మన సమస్యని దూరం నుండి చూస్తే అప్పుడు కొత్త దారులు మనమే వేసుకోవచ్చు. మన జీవితం మన చేతుల్లోనే ఉంది, ఎన్ని చేదు పరిస్థితులు ఎదురైనా, కొందరి మాటలు మన మీద ప్రతికూలం ప్రభావం చూపినా కూడా ఆ మాటలు మనసుకి తీసుకోని బాధపడుతూ కూర్చోవాలా లేక మనుకున్నది ఒక్కటే జీవితం అని మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవాలా అనేది మన ఎంపిక. ఒక్కటి గుర్తుపెట్టుకో! హ్యాపీనెస్ ఈజ్ ఏ ఛాయిస్. కాబట్టి అమ్మ లేదని, అమ్మని సరిగా చూసుకోలేకపోయానే అని, ఇక నాకు జీవితంలో తోడు ఎవరులేరా అనుకుంటూ డిప్రెషన్‌లో ఉండిపోయి నిన్ను నువ్వు హింసించుకోకు. నేను చెప్పినది ఏ మాత్రం నీ బుర్రకెక్కినా కూడా ఆ దిశగా ఆలోచించే ప్రయత్నం చెయ్యి నీలో మార్పు నువ్వే చూసి సంతోషిస్తావ్” అని తన కథని చెప్పి, అతడిలో సానుకూల ధృక్పథాన్ని నింపి వింధ్య తన ఇంటికి బయలుదేరింది.
***
“వాహ్! వింధ్యగారు సూపర్ అనిరుధ్!!! ఆవిడ తీసుకున్న నిర్ణయం ఎంతో స్ఫూర్తిదాయకం, వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది” అని ధనంజయ తన సంతోషాన్ని పంచుకున్నాడు.
“నిజమే ధన! మనకి ప్రస్తుత దశ సరిగా లేదన్న కారణంతో క్షణికావేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకోవాలని మనసు చెప్తుంది. జీవితం ఒకటి పోగొడితే ఇంకోటి ఇస్తుంది, అది తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి అంతే. శ్రీకృష్ణుడు చెప్పిందే ఎల్లప్పుడూ తలుచుకోవాలి ‘ఈ సమయం గడిచిపోతుంది’ అంతే” అని చెప్తుంటే ధన కూడా తన తప్పుడు నిర్ణయాల గురించి పునరాలోచన చేసాడు.
వెంటనే “వింధ్యగారి కథ వింటుంటే నా మీదే అసహ్యం వేస్తుంది, ఎందుకు చనిపోయే ప్రయత్నాలు చేద్దామనుకున్నానా అని, ఈ కథ విన్నాక నీలో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఆ తరువాత ఏం జరిగింది, ఈ దేవకీ ఎలా పరిచయమైంది” అని ధన తన సందేహాన్ని బయటపెట్టాడు.
***
వింధ్య వెళ్ళాకా ఆమె మాటలు మాత్రం అనిరుధ్ మదిలో మారుమోగుతూనే ఉన్నాయి. తను కూడా తన ప్రస్తుత పరిస్థితిని మరో కోణంలో ఆలోచించి చూద్దామనిపించింది. అవే ఆలోచనలతో ఆ సాయంకాలం బీచ్‌లో కూర్చున్నాడు. సూర్యాస్తమయ సమయంలో ప్రశాంతమైన వాతావరణంలో సముద్రపు అలలు తన పాదాలని తాకుతుంటే తను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చాక సోఫాలో పడుకుని టివి చూస్తున్నప్పుడు తల్లి తన కాళ్ళు పట్టుకొని మర్దన చేస్తున్న అనుభూతి కలిగింది. అంత పెద్ద సముద్రం తనకి అమ్మ లాగా కనిపించింది. ఆ ఎనిమిది నెలల్లో ఎప్పుడు లేని విధంగా ఆరోజు రాత్రి చంటి పిల్లాడిలాగా నిద్రపోయాడు.
ఒకరోజు ఆఫీసు తరపున బీచ్ క్లీనింగ్ కార్యక్రమానికి వెళ్ళి అక్కడి చెత్తా చెదారం శుభ్రం చేసాకా ఎనలేని సంతృప్తి కలిగింది. ఈ ప్రకృతిలోనే మా అమ్మని ఎందుకు చూసుకోకూడదు అనే ఆలోచన రాగానే అప్పటినుండి అనిరుధ్ ప్రకృతిని చూసే చూపు మారిపోయింది. ఆఫీసయ్యాకా ఎక్కువ సమయం బీచ్ లోనే గడిపేవాడు. వీలైనప్పుడల్లా అడవుల్లో, జలపాతాలు మధ్య ఒక కొత్త ప్రపంచం చూస్తూ తనని తాను మైమరచిపోయేవాడు. చల్లని గాలి ఆస్వాదిస్తూ అమ్మ ప్రేమని పొందుతున్న ఆనందం పొందేవాడు.
మెల్లిగా అనిరుధ్ జీవితం గాడిలో పడింది. ప్రకృతిని చూసి పులకరించిపోతూ ప్రకృతి అనే అమ్మ ప్రేమలో తరించడమే కాదు అమ్మని మంచిగా చూసుకోవాలని కంకణం కట్టుకున్నాడు. ఇష్టానుసారంగా చెత్త ఎక్కడపడితే అక్కడ వేస్తున్న వాళ్ళకి అలా వెయ్యకూడదని, దాని వల్ల నష్టాలని విడమరిచి చెప్పేవాడు. తన వంతు బాధ్యతగా ఎక్కడ చెత్త కనపడిన సరే తీసి చెత్తకుండిలో వేయటం అలవాటు చేసుకున్నాడు. ప్రకృతిని శుభ్రం చేస్తోంటే సొంత తల్లిని బాగా చూసుకుంటున్నాననే తృప్తి కలిగేది, మది ఆనందంతో పులకించేది.
తనని సొంత తల్లిలా భావిస్తిన్న అనిరుధ్‌కి ఆ ప్రకృతి మాత తిరిగి కొడుక్కి ఏమైనా ఇవ్వాలి అనుకుందో ఏమో!
ఒక రోజు బీచ్‌లో పేరుకుపోయిన చెత్తని శుభ్రం చేయటానికి వాలంటీర్ల బృందంలో సభ్యురాలిగా దేవకి వచ్చింది. అర్భకురాలిగా కనిపిస్తున్న దేవికిని చూడగానే ఈ అమ్మాయి ఎండలో ఈ శ్రమ తట్టుకోలేదేమో అనిపించి ఆమె దగ్గరకి వెళ్ళి వచ్చే వారం పార్కులో జరిగే కార్యక్రమానికి రమ్మని చెప్పగానే ఆమె ఆశ్చర్యపోయింది. ఆమె ఆశ్చర్యాన్ని గమనించిన అనిరుధ్,
“ఈ శ్రమ తట్టుకోలేవనిపిస్తోంది తల్లీ! ఒక అన్నయ్యలా నీ మంచి కోరి చెప్తున్నాను. పార్కులో అయితే శ్రమ ఉండదు” అని చెప్పినా దేవకి తన పట్టు విడవలేదు.
ఆమె పట్టుదల చూసి అనిరుధ్ మారుమాట్లాడలేదు. చెప్పినట్టుగానే దేవకి వాలంటీర్లతో కలిసి చకచకా బీచ్ అంతా శుభ్రం చేసింది. వచ్చేవారం కార్యక్రమ వివరాలు చర్చించుకుని అందరూ ఇళ్ళకి బయల్దేరారు.
“అన్నయ్యా! ఏమి అనుకోకపోతే బస్ ఎక్కడానికి సరిపడా క్యాష్ లేదు, మీకు యుపిఐ పేమెంట్ చేస్తాను కాస్త క్యాష్ ఇస్తారా?”
ఈ మాటలు వినగానే అస్తమిస్తున్న సూర్యుడిని చూస్తూ బీచ్‌లో నిల్చున్న అనిరుధ్ తలెత్తి చూసేసరికి దేవకి కనిపించింది.
“ఈ పది రూపాయిల టికెట్ కోసం, మళ్ళి ఆన్‌లైన్ పేమెంట్ ఎందుకు? నేను టికెట్ తీసుకుంటాను పర్లేదులేమ్మా” అని చెప్పి దేవకి వివరాలడిగాడు.
తల్లి తన చిన్నప్పుడే కాలం చేసిందనీ, తండ్రి కూడా కొన్నేళ్ళక్రితం తల్లిని చేరుకోవడంతో తండ్రి స్నేహితులు తనని ఆశ్రమంలో చేర్చారని, ఆశ్రమ నిర్వాహకుల సహాయంతో ఇంటరు వరకూ చదువుకున్నానని చెప్పగానే అనిరుధ్ ఆశ్చర్యపోయాడు.
సాయంత్రాలు చిన్న పిల్లలకి ట్యూషన్లు చెప్తున్నాననీ, దాతలెవరైనా సహకరిస్తే డిగ్రీ చదువుకుని కొంచెం మంచి ఉద్యోగంలో చేరాలనుకుంటున్నానని చెప్పింది.
ఇంతలో బస్సు రావడంతో అనిరుధ్ దగ్గర డబ్బులు తీసుకుని బస్సెక్కింది దేవకి.
ఆమె వెళ్ళగానే అనిరుధ్ మళ్ళీ బీచ్‌కి వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పటిలానే అమ్మ స్పర్శని అనుభూతి చెందుతూ కాళ్ళని తాకే అలలని ఆస్వాదిస్తున్నాడు. దేవకి అమాయక మొహం, తుళ్ళిపడే ఉత్సాహం, ఆ కళ్ళల్లో తొణికిసలాడే ఆత్మవిశ్వాసం అతడిని కట్టిపడేసాయి. నిండా ఇరవయ్యేళ్ళు లేని ఒంటరి ఆడపిల్లకి ఎన్ని కష్టాలున్నా ఎంత ధైర్యంగా ఉందో అనిపించింది.
ఇంత పరిపక్వత ఈ వయసులో ఉండటం మెచ్చుకోదగ్గ విషయం అనుకున్నాడు. సమాజాన్నో లేదా ఇంకెవరినో నిందించకుండా తన చదువు కోసం తానే కష్టపడతానని, దాతలని వెతుక్కుంటానని ఆమె చెప్పగానే ఆ ఆత్మవిశ్వాసం అతడిని కట్టిపడేసింది.
‘దేవకిలో మా అమ్మని చూసుకుంటూ ఈ అమ్మాయిని చదివిస్తే?’ ఈ ఆలోచన రాగానే ఒక పిల్ల తెమ్మెర అతడి ముఖాన్ని తాకింది.
ఎన్నడూ లేనిది ఈ ప్రకృతి అమ్మ ఒడిలో ఇవాళ దేవకీ నాకు కనిపించిందంటే అమ్మ వకుళ తిరిగి ఈ రూపంలో నా జీవితంలోకి వచ్చిందని అనుకుంటుండగానే ఒక్కసారిగా అల ఉవ్వెతున్న పైకి లేచి అనిరుధ్ ముఖాన్ని తడిపింది. ఆ క్షణం ప్రకృతి తనని ఆశీర్వదించింది అని అతడు బలంగా నమ్మాడు. ప్రకృతినే అమ్మగా భావించిన అనిరుధ్‌కి దేవకి రూపంలో తల్లిని ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సముద్రం అంచుల నుండి ఆకాశాన్ని చూస్తూ సమస్త ప్రకృతికి నమస్కారం చేసాడు.
ఆ తరువాతి వారమే దేవకిని కలిసి ఆమెని లేడీస్ హాస్టల్లో పెట్టి డిగ్రీ కాలేజీలో జాయిన్ చేసాడు.
తానెవరో తెలియకపోయినా చదివించడానికి ముందుకొచ్చిన అనిరుధ్ ఆమె కళ్ళకి తన తండ్రిలా కనిపించాడు.
“మా నాన్న నీ రూపంలో నా దగ్గరికి మళ్ళీ వచ్చాడు అనిపిస్తోంది. డాడీ! థాంక్ యు సో మచ్” అంటూ రెండు నిముషాలు అలానే అనిరుధ్ చేతులని పట్టుకొని ఉండిపోయింది.
***
“అప్పటినుండి తనని ఇంటిదగ్గర హాస్టల్లో ఉంచి తన గార్డియన్‌గా ఉంటున్నాను. మా అమ్మ ఈ రూపంలో మళ్ళీ నా జీవితంలోకి వచ్చింది అని సంతోషిస్తున్నాను, దేవకీ నాలో తన నాన్నని చూసుకుంటుంది, నన్ను నాన్న అని పిలుస్తుంది. ఈ సంవత్సర కాలంలో మేమిద్దరం నిజంగా ఒక తల్లి కడుపున పుట్టిన బిడ్డల్లాగా కలిసిపోయాం ఎంతో ఆనందంగా జీవిస్తున్నాం” అని అనిరుధ్ చెప్పడం ముగించగానే ధనంజయకి ఏమి మాట్లాడాలో తెలీలేదు.
“నీ డిప్రెషన్ నుండి బయటికి రావడమే కాకుండా నీలాగా అనాథగా మారిన ఇంకొకరిని అమ్మ లాగా చూసుకుంటున్నావు, నువ్వు పార్కులో చెత్త తీయడం చూసి డిసిప్లిన్ ఉన్న మనిషి అనుకున్నానే గాని ప్రకృతిని అమ్మలా భావించి అమ్మని మంచిగా చూసుకోవాలన్న ఉద్దేశం ఎంత బాగుందో!” అని ధన మనస్ఫూర్తిగా అనిరుధ్‌ని అభినందించాడు.
“జీవితం అంటే ఇంతే ధన! ఇవాళ బాగోలేదని ఇక ఎల్లపుడూ ఇలానే ఉండిపోతామేమో అనుకోకూడదు. వింధ్యకి పిల్లలు పుడతారో లేదో దేవుడికే తెలియాలి కానీ ప్రస్తుతాన్ని దుఃఖంతో గడపట్లేదు, నా జీవితంలో పెళ్లి అవుతుందో లేదో దేవుడికే తెలియాలి. మా ఆమ్మ లేని లోటుని దేవకి తీరుస్తోంది. నేను సంతోషంగా ఉన్నాను. ఒక్కటి గుర్తుపెట్టుకో ధనా! హ్యాపీనెస్ ఈజ్ ఏ ఛాయిస్. ఏదైనా సమస్యకి పరిష్కారం నిజంగా మన చేతుల్లో లేనప్పుడు మన ఆలోచన సరళిని మార్చుకొని ఎంత సంతోషంగా గడుపుతామో అదే జీవితం, ఆనందమే ఆరంభం. అప్పుడే సరికొత్త జీవితం మొదలవుతుంది. నేను చెప్పినంత సులువు కాదు, కానీ ప్రయత్నించి చూడు. నీలో మార్పు నువ్వే గమనిస్తావు, తొందరపడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకు” అని ధనంజయకి చెప్పి దేవికిని తీసుకుని కదిలాడు అనిరుధ్.
అనిరుధ్ చెప్పిన మాటలు విన్నాక ధనంజయ తన పిచ్చి ఆలోచనకి సిగ్గుపడ్డాడు.
‘తల్లి అయ్యే భాగ్యం లేని వింధ్య లాంటి వాళ్ళు బతికి చూపిస్తున్నారు, ఉన్న ఒక్క పెద్ద దిక్కు లేకపోయినా కూడా అనిరుధ్, దేవకిలాంటివాళ్ళు బతికి చూపిస్తున్నారు. నేను నా తల్లితండ్రులు ఇద్దరూ ఉండి కూడా చనిపోతే వాళ్ళు బతికున్నంతకాలం ఎంత నరకం చూస్తారు? ఆ ఆలోచనకే భయమేస్తోంది. దేవుడు అనిరుధ్ రూపంలో ఇలా వచ్చి నాకు జీవితం మీద ఆశ కలిగించి ఉండకపోతే నేను ఇవాళ చనిపోయి ఉండేవాడిని కదా! ఎంత తప్పుగా ఆలోచించాను, నిజమే నాకు కూడా ఓ కొత్త జీవితం ఎదురుచూస్తోందేమో! నేనెందుకు ఇలా కుంగిపోవాలి, ప్రభుత్వోద్యోగం రాలేదు కాబట్టి ఇంట్లో వాళ్ళ పరువు అంటూ అలోచిస్తున్నాను కానీ ప్రాణం తీసుకుంటే ఆ పరువు తిరిగొస్తుందా? అసలు నేనేమైనా తప్పు పని చేసానా పరువు పోగొట్టుకోవడానికి? ప్రైవేటు ఉద్యోగంలో కూడా మంచి స్థానం సంపాదిస్తాను.
నాలాగా ఇక బతకలేను అనుకునే వారంతా ఒక్క నిమిషం ఇలా జీవితం మీద ఆశ చిగురించే మంచి మాటలు వింటే ఎంతో కొంత ఊరట చెందుతారు. చావును వాయిదా వేద్దాం! బతికి చూద్దాం అనుకుంటారు. అనిరుధ్‌లాగ నేను కూడా వాలంటీరుగా చేరి నిరాశతో ఉన్నవాళ్ళ జీవితంలో ఆశని చిగురింపజేయచ్చు కద? నా సంతోషాన్ని నేనే వెతుక్కుంటాను. ఇకనుండి చచ్చిపోవాలి అనే ఆలోచనే రాకుండా బతుకుతాను’ అని మనసులో నిశ్చయించుకొని ముఖంలో చిరునవ్వుతో, జీవితం పట్ల చిగురించిన ఆశతో తన ఇంటికి బయలుదేరాడు.