నాదొక ఆకాశం-13

0
2

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[‘త్రిపుల్ ఎస్’ సినిమా ప్రీ-రీలీజ్ ఫంక్షన్ హాలంతా కోలహలంగా ఉంటుంది. ఆ రోజే, తన జీవితాన్ని సంతోష సంబరాల్లో ముంచేసే ఒక సంఘటన, తనని జీవితాంతం దుఃఖ సాగరంలో ముంచేసే మరొక సంఘటన అక్కడే, అదే హాల్లో జరగబోతున్నాయని సమీర్‍కి తెలియదు. సాధారణంగా ప్రీ రిలీజ్ ఫంక్షన్‌లు అయినా, ఆడియో రిలీజ్ ఫంక్షన్‌లు అయినా, కవి సమ్మేళనాలైనా, సాహిత్య సభలైనా ముఖ్య అతిథులు, అధ్యక్షులు, ఆహ్వాన పత్రికలో వేసిన టైముకు రారని, అలా రావడం తమ గౌరవానికి భంగమని భావిస్తారని అనుకుంటాడు సమీర్. సినిమాలకి సంబంధించిన ఈవెంట్లు ఎలా జరుగుతాయో తలచుకుంటాడు. సంజయ్ కూడా అలానే చేసేవాడని, అనుకున్నంత మంది జనం గుమిగూడకపోతే, పిలిచిన పాపులర్ స్టార్లు రాకపోతే ఎలా అని అనేక అనుమానాలతో సతమతమయ్యేవాడనీ; చివరకు, తన పీఆర్ మేనేజర్ బయల్దేరమనగానే బయల్దేరేవాడని గుర్తు చేసుకుంటాడు సమీర్. తనకిదంతా ఫార్స్ అనిపిస్తుంది. ఆ రోజు ‘హీరో’ సంజయ్ లేడు, రాడు కాబట్టి ఏడింటికల్లా ఫంక్షన్ ప్రారంభమవుతుంది. ప్రేక్షకుల్లో ఉన్న సంజయ్ అభిమానులు మాత్రం ఆందోళనగా ‘సంజయ్’; ‘సంజయన్న రావాలి’ అని అరుస్తుంటారు. వారిని ఆర్గనైజర్‌లు సమాధాన పరచడానికి ప్రయత్నిస్తారు. శ్రీవిక్రమ్ గారు మైకు తీసుకుని, వాళ్ళని నియంత్రించి ఆ సినిమాలోని కొన్ని పాటల గురించి చెప్పి, సంజయ్ అందుబాటులో లేకపోవడం వల్ల వేరే హీరోని పెట్టి షూటింగ్ చేశామని, అతను ఏ పాటల్లో వుంటాడో కనుక్కుని, ముందుగా తమ వెబ్‌సైట్‌కు మెసేజ్ చేసిన వెయ్యి మందికి ఆ కొత్త హీరోతో షీల్డులు ఇప్పిస్తామని అభిమానులకు చెప్తాడు. కొత్త హీరోయిన్‍, కొత్త హీరోలుగా వసుధనీ, సమీర్‍ని సభకి పరిచయం చేస్తాడు. ఆ వాతవరణంలో మాస్ ఫోబియా ఎలా ఉంటుందో చెప్తాడు సమీర్. వసుధ, సమీర్ వేదికపైకి వెళ్ళగానే ఇద్దరినీ చూసి ప్రేక్షకులు ఈలలు, చప్పట్లు కేరింతలతో స్వాగతం పలికారు. వారిద్దరినీ అందరికీ పరిచయం చేస్తారు శ్రీవిక్రమ్. తనకి సినిమా అవకాశం కల్పిస్తానని చెప్పిన మిత్రుడు సంజయ్ ఇక్కడ లేకపోవడం బాధకలిగిస్తోందంటూ, పదిరోజుల్లో ప్రారంభమయ్యే తన కొత్త సినిమా ‘నాదొక ఆకాశం’కి సంజయ్ క్లాప్ కొట్టాలని కోరుకుంటూ, సంజయ్ ఎక్కడున్నా తిరిగిరావలని ప్రార్థిస్తాడు సమీర్. అప్పుడు – పది రోజుల తర్వాతే రావాలా? ఇప్పుడైనా రావొచ్చా? అని ప్రేక్షకుల నుండి ఒక గొంతు వినిపిస్తుంది. అది సంజయ్‍దేనని గుర్తించిన సమీర్ జనాల్లోకి వెళ్ళి సంజయ్ కోసం వెతుకుతాడు. చివరి బెంచీ మీద శాలువా కప్పుకుని కూర్చుని ఉన్న సంజయ్‍ని గుర్తిస్తాడు సమీర్. ఎప్పుడూ సంజయ్ వెంట ఉండే బౌన్సర్లు చటుక్కున వచ్చి సంజయ్ చుట్టూ రక్షణ కవచంగా నిలబడతారు. అప్పుడు నిర్మాత, శ్రీవిక్రమ్ పరుగుపరుగున వచ్చి సంజయ్‌కి నమస్కరించి, స్టేజ్ మీదకు తీసుకు వస్తుంటే – సంజయ్ మధ్యలోనే ఆగి అభిమానులందరినీ మైకులో పలకరిస్తాడు. తల్లిదండ్రులను  పిల్చి వాళ్ళని ముందువరుసలో కూర్చోబెట్టి తాను వేదిక మీదకి వెళ్తాడు. సంజయ్ తిరిగొచ్చిన ఆనందంలో స్టేజ్ మీద ఉత్సాహంగా గెంతులు వేస్తాడు సమీర్. కాసేపయ్యాకా, సంజయ్ కాళ్ళ దగ్గర కూర్చుని రోదిస్తాడు. సంజయ్ అతన్ని లేపి హత్తుకుని, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటాడు. – ఇక చదవండి.]

[dropcap]సం[/dropcap]జయ్ రాకతో, తరువాత ప్రీ రిలీజ్ ఫంక్షన్ అద్భుతంగా సాగింది. ఎందుకంటే, సంజయ్ కేవలం నటుడే కాదు, గొప్ప ఎంటర్‌టైనర్. సభను ఎలా జోష్‌తో నడపాలో, ప్రేక్షకులను ఎలా ఉత్సాహపరచాలో, ఏ మాటలు చెప్తే తన ఫ్యాన్స్ ఖుష్ అవుతారో, ఆ టెక్నిక్ తెలిసిన వ్యక్తి.

అందుకే, ఆ రోజు కార్యక్రమం – అసలే సంజయ్ సుమారు రెండున్నర నెలల తర్వాత, లైవ్‌లో ప్రత్యక్షం కావడంతో, టీవీల్లో ఆ ప్రోగ్రాం చూస్తున్న వాళ్ళు కూడా ఉద్విగ్నభరితులయ్యారు. కానీ, ప్రత్యక్షంగా చూస్తున్న వాళ్ళకు మాత్రం, ‘త్రిపుల్ ఎస్’ సినిమా రిలీజు కన్న ముందే ఇంకో సినిమా చూసినంత థ్రిల్ కలిగి – సూపర్ సక్సెస్ అయింది.

సంజయ్, చివరగా తన ప్రసంగంలో అందరికీ ధన్యవాదాలు చెప్పి,

“నేనొక చిన్న సమస్యలో ఇరుక్కుని ఇన్ని రోజులు మీ ముందుకు రాలేకపోయాను. ఈ తరుణంలో ఆ విషయం గురించి ఇప్పుడు ఎక్కువగా వివరించలేను. కానీ, నేనిలా క్షేమంగా మీ ముందు నిలబడ్డానంటే దానికి కారణం ఎవరో మీకు  తెలుసా ఫ్రెండ్స్?” అని ప్రశ్నించాడు.

దాంతో అభిమానుల్లో గందరగోళం చెలరేగింది. తలా ఒక సమాధానం చెప్పసాగారు. ‘దేవుడు’; ‘సమీర్’; ‘పోలీసులు’; ‘శ్రీశైలం మల్లన్న’; ‘మీ తల్లిదండ్రులు’ అంటూ రకరకాల సమాధానాలు వస్తుంటే, సంజయ్ తల అడ్డంగా ఊపుతూ,

“కాదు, కాదు” అనసాగాడు. ఐదు నిముషాల తర్వాత, సంజయ్ ఇంక ఆపమని చేత్తో సైగ చేస్తూ, మైకును నోటి దగ్గరకు తీసుకుని, ఏదో చెప్పబోతుంటే, ఫ్యాన్స్ అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయి, చూస్తుండగా, సంజయ్,

“మీరే!” అన్నాడు. దాంతో అప్పటి వరకు నిశ్శబ్ద సముద్రంపై ఉన్న అభిమానులు ఉరకలేసే సముద్రపు అలల్లా కేరింతలు కొట్టారు. కొందరు ఏడ్చారు. కొందరు నవ్వారు. కొందరు తీన్మార్ డాన్సులు చేసారు. ఎక్కడి నుంచి వచ్చాయో కానీ, అప్పటి వరకు లోపల దాచి ఉంచిన, డీజె బ్యాండ్ బాజాలు బయటకొచ్చాయి. వాటి మీద దరువు వేయసాగారు. ఒక జాతరలో, ఒక పెళ్ళి సందడిలో, ఒక విజయోత్సవ ర్యాలీలో ఉన్నంత కోలాహలంగా, మా ఫంక్షన్ మారిపోయింది. స్టేజ్ మీద సంజయ్ తను డ్యాన్సు వేస్తూ నన్నూ లాగాడు. మేమిద్దరమూ కలిసి నవ్వుతూ డ్యాన్స్ చేస్తుంటే, సుధాకర్ నాయుడు గారూ, సంధ్యారాణి గారూ లేచి నిలబడి, “థమ్స్ అప్” చూపిస్తూ చప్పట్లు కొట్టసాగారు. మమ్మల్ని అలా చూసిన వసుధ ముఖం మాత్రం మాడిపోయి ఉంది. తరువాత, సంజయ్ మళ్ళీ అందరిని ఆగమని చెప్పి,

“ప్రేక్షక దేవుళ్ళైన మీ దీవెనల వల్లనే నేను ఈ రోజు మీ ముందు క్షేమంగా నిలబడ్డాను. ఎప్పటికీ మీ ఆశీర్వాదాలు కోరుకుంటున్నాను. ఇంతకు ముందు సమీర్ గురించి చేసిన ప్రకటన, ఛాలెంజ్ యథాతథంగా ఉంటుంది. బై ఫ్రెండ్స్! శుక్రవారం నాడు థియేటర్ల దగ్గర కలుసుకుందాం! బై!” అని చెప్పగానే, అభిమానులు ఫంక్షన్ ముగిసిందని గమనించి, స్టేజి మీదకు పరిగెత్తుకొస్తుండడంతో, బౌన్సర్లు సంజయిని కవర్ చేస్తూ వెనుక గేట్ గుండా కారు దగ్గరకు తీసుకొచ్చారు. అప్పటికే, సుధాకర్ నాయుడుగారూ, సంధ్యారాణి గారూ కారులో కూర్చుని ఉన్నారు. సంజయ్ నాకు చేయి అందించి కారులోకి లాక్కోగానే, కారు రఁయ్యిమంటూ పరిగెత్తింది.

నేను వసుధ కోసం చూస్తుంటే, తను ఏడుస్తూ కనిపించింది.

శ్రీవిక్రమ్ ఆమెను కౌగిట్లోకి తీసుకుని ఓదార్చడమూ గమనించాను.

కారు దూరమవుతున్న కొద్దీ, వసుధ రూపం కూడా నా కళ్ళ ముందు నుండి కనుమరుగవసాగింది.

***

మేము ఇంటికి చేరుకునే సరికి పన్నెండయింది. సంధ్యారాణి గారు కొడుకు గడప దాటి ఇంట్లోకి అడుగు పెట్టే ముందు దిష్టి తీయించి, హారతితో స్వాగతం పలికింది. సంజయ్ ఇంట్లోకి అడుగుపెట్టగానే తల్లిని కౌగలించుకున్నాడు. ఆంటీ,

“ఏ పాపిష్ఠి వెధవల కళ్ళు పడ్డాయో నా కొడుకు రెండున్నర నెలలు ఇన్ని కష్టాలు అనుభవించాడు.” అని వెక్కివెక్కి ఏడుస్తుంటే, సంజయ్ తల్లిని ఓదార్చాడు.

“నీ పూజలే నన్ను కాపాడాయమ్మా! ఆ రోజు మనం..” అంటుంటే, సుధాకర్ నాయుడుగారు, ఆపి,

“ఆ విషయాలన్నీ రేపు మాట్లాడుకుందాం.” అంటూ సంజయ్ భుజం తట్టాడు, నా వైపు చూస్తూ.

నేను నా ఫ్లాటుకు వెళ్తానంటే,

“రా రా! నువ్వు ఇక్కడే ఉంటున్నావు. నువ్వు చేస్తున్న రాచకార్యాలు అన్నీ నాకు తెలుసు లేరా!” అంటూ పైకి తన గదిలోకి లాక్కుపోయాడు. ఇద్దరం కోట్లు విప్పేసాం. సంజయ్ ఇప్పుడే వస్తానంటూ బాత్రూంలోకి వెళ్ళి పదినిమిషాల్లో స్నానం చేసి, టవల్ చుట్టుకుని బయటకు వచ్చి బీర్లు తీసాడు. రూఫ్ మీదకు వెళ్ళి, సంజయితో కలిసి బీరు సిప్ చేస్తుంటే, మా జీవితాల్లో నుంచి ఒక రెండున్నర నెలల గడ్డుకాలం మాయమయిపోయి, నిన్ననే సంజయితో కలిసి బీరు తాగినట్టుగా అనిపిస్తుంది.

నేనేం జరిగిందని అడగలేదు. తనేం చెప్పలేదు. చెప్పాల్సింది ఉంటే తనే చెప్తాడని నేను పిచ్చాపాటీ, సినిమాలో నేను చేసిన డ్యాన్సులు గురించి మాట్లాడాను.

ఒక గంట తర్వాత సంజయ్ నిద్రొస్తుందని చెప్పడంతో నేను రెండో ఫ్లోరులోని నా గది వైపు నడిచాను. నా గదికి ఎదురుగా ఉన్న వసుధ గది తలుపు తీసి ఉంది. నేను వసుధ ఉందేమోనని పరుగుపరుగున వెళ్ళాను. కానీ, ఆ గది మొత్తం ఖాళీగా ఉంది. ఇద్దరు పనిమనుషులు రూము క్లీన్ చేస్తున్నారు. నేను వాళ్ళను,

“వసుధ గది కదా? తను లేదా? ఆమె సామాన్లేవి?” అని అడిగాను.

“మాకేం తెలియదు బాబూ! అమ్మగారినడగండి.” అన్నారు వాళ్ళు.

నేను నా గదిలోకి వెళ్ళి బట్టలు మార్చుకుని, పడుకుని ‘వసుధ ఏమైంది? సంజయ్‌ని చూడగానే వసుధ ఎందుకు కంగారు పడింది? చివర్లో వసుధ ఎందుకు ఏడ్చింది? శ్రీవిక్రమ్, వసుధను కౌగిట్లోకి తీసుకుని ఓదార్చేంత, చనువు ఎప్పుడు ఏర్పడింది?’ అన్న ప్రశ్నలతో నా తల బద్దలయింది. అదృష్టవశాత్తు, బీరు తాగిన మత్తులో నిద్రలోకి జారుకున్నాను.

***

మరునాడు ఉదయం పది గంటలకు పోలీస్ కమీషనర్ పుష్పా కిరణ్ మేడమ్ సంజయ్ ఇంటికి వచ్చారు. అందరమూ విశాలమైన సంజయ్ ఆఫీసు గదిలో సమావేశం అయ్యాము. మేడమ్, సంజయ్ కూర్చునే కుర్చీలో కూర్చునేంత వరకు మేము నిలబడి, ఆమె తర్వాత మేము కూర్చున్నాము. ఆమె ఏం చెప్తుందా అని నేను ఆతృతగా ఎదురు చూడసాగాను. ఎందుకంటే, సంజయ్ అదృశ్యం, తిరిగి సరిగ్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజునే ప్రత్యక్షమవడం వెనుక, అంతా ముందే ప్లాన్ చేసుకున్న నాటకాన్ని రక్తి కట్టించినట్టుగా, నాకు తెలియని, తెలియనివ్వకుండా జరిగిన డ్రామా ఉన్నదనిపించింది.

నాయుడుగారు, సంధ్యారాణి గారూ, సంజయ్, నేను కూర్చున్న తర్వాత, వాళ్ళ టెక్నికల్ స్టాఫ్ రికార్డింగ్ మెషిన్, అందరికీ కాలర్ మైక్స్ సెట్ చేసి వెళ్ళిన తర్వాత, రికార్డింగ్ ప్రారంభం కాకముందు, మేడమ్,

“ఓకే! ఒకసారి మన సెషన్ మొదలయ్యాక, మన మాటలన్నీ రికార్డు అవుతుంటాయి. కాబట్టి ఎవరూ కూడా కేసుకు సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదు. ఇంకా బెటర్ ఏమిటంటే, నేను అడిగినప్పుడే మీరు సమాధానాలు చెప్తే, ఒక పద్ధతిలో ఇంటర్వ్యూ సెషన్ జరిగి మనకు మున్ముందు సాక్ష్యంగా కోర్టులో ఉపయోగపడుతుంది. అంతగా ఏమైనా అదనంగా మాట్లాడినా మనం ఎడిట్.. చేసుకోవచ్చును కానీ కోర్టులో ఆ సాక్ష్యాన్ని ఎదుటి వాళ్ళు..  ఛాలెంజ్ చేయవచ్చు. ఇది ఎడిటెడ్ కాపీ  అని.. చెప్పే ప్రయత్నం చేయవచ్చు..చ్చును. కాబట్టి, యాజిటీజ్‌గా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం రికార్డెడ్ ఆడియో సాక్ష్యంగా చెల్లదు. కానీ, మేము ఈ కేసులోని సున్నిత అంశాల దృష్ట్యా, హైకోర్టు అనుమతి తీసుకున్నాము. ఇక ప్రారంభిద్దాము. ఓకే.

సంజయ్! అక్టోబర్ 25, 2021 న మీరు, మీ అమ్మగారిని తీసుకుని ట్రీట్‌మెంట్ కోసం శ్రీశైలంలోని గురూజీ ఆశ్రమానికి వెళ్ళారు కదా? మీరు శ్రీశైలం వెళ్ళిన విషయం ఎవరెవరికి తెలిసే అవకాశం ఉంది?” అని అడగగానే,

“మేడమ్! నేను గత సంవత్సర కాలం పైగా అక్కడ నా మెరాల్జియాకు చికిత్స చేయించుకుంటున్నాను. కొంత కాలం పాటు సమస్య తగ్గినా, షూటింగ్ సమయంలో ఎక్కువగా స్ట్రెయిన్ అయితే మళ్ళీ ప్రాబ్లెమ్ మొదలవుతుంది. కానీ నాకు ఇటువంటి సమస్య ఉన్నట్టు, నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు కూడా మా ఇండస్ట్రీలో ఎవరికీ తెలియదు. తెలిసి ఉంటే ఈ పాటికి వెబ్‌సైట్లు కోడై కూసేవి. రెగ్యులర్‌గా నా వెంట ఉండే బౌన్సర్లకు, డ్రైవర్లకు కూడా ఈ విషయం తెలియదు. నేను శ్రీశైలం ట్రిప్ అనుకోగానే, గురూజీ ఆశ్రమం నుండే మనుషులు వస్తారు. కాబట్టి, మా కుటుంబ సభ్యులకు, గురూజీ ఆశ్రమం లోని కొంత మందికి తప్ప నా ప్రయాణం గురించి తెలిసే అవకాశం లేదు. గురూజీ ఆశ్రమంలో కూడా నేను మిగిలిన రోగులకు కనపడకుండా, అక్కడ కూడా నా రక్షణ కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నాయి.” అని వివరంగా చెప్పాడు సంజయ్.

“సంజయ్! అసలు అక్కడ ఏం జరిగింది?”

“మేడమ్! నేను ఆశ్రమానికి వెళ్ళిన తరువాత ప్రతీ రోజూ ఉదయం నా కాళ్ళకు మూలికా తైల మర్దన జరుగుతుంది. మొదటి రోజు అలాగే జరిగింది. ఆ మూలికలు నా చర్మంలోకి ఇంకుతుండగానే నాకు చాలా హాయిగా అనిపించి ఒక రకమైన రిలాక్సేషన్ కలిగి నిద్ర పడుతుంది. రెండో రోజు కూడా అలాగే జరిగింది. కానీ, మొదట మర్దన చేసిన వ్యక్తి వెళ్ళగానే, నేను నిద్రలో జోగుతుండగానే, ఎవరో వచ్చి నా నోరు తెరిపించి, ఒక మాత్ర వేసారు. అంతే పదిహేను నిముషాల్లో నా ఒళ్ళంతా మంటలు మొదలయ్యాయి. కళ్ళు, ముక్కు, నోటి నుంచి నీళ్ళు కారసాగాయి. నేను భరించలేక కేకలు పెడుతూ, లేచి బజ్జర్ నొక్కాను. ఆ కాలింగ్ బెల్ మా అమ్మ గదిలో, గురూజీ గదిలో మోగుతుంది. వాళ్ళిద్దరూ పరిగెత్తుకొచ్చారు. గురూజీ నా పరిస్థితిని గమనించి,

“అమ్మా! బాబు మీద బలమైన విషప్రయోగం జరిగింది.” అని అంటూ ఆఘమేఘాల మీద విరుగుడును తయారు చేసి నాతో తాగించారు. కానీ, నా మీద ప్రయోగించిన విషయమేమిటో తెలియక పోవడంతో, విరుగుడు పని చేయలేదు.

గురూజీ కూడా కంగారు పడి, నల్లమల అడవుల్లోని పావురాల గుట్టకు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న తన గురువు ఆశ్రమానికి వెళ్ళాలన్నారు. ముందుగా వారి గురువుగారికి ఫోన్ చేసి విషయం చెప్పి తక్షణ నష్ట నివారణకు, ఆయన చెప్పిన కషాయం తాగించడంతో నాకు పెద్ద వాంతి అయింది. కానీ, అప్పటికే నా ఒళ్ళంతా నీలం రంగులోకి మారుతుండడంతో, అత్యంత గోప్యంగా, అమ్మతో పాటు ఉన్న వసుధకి కూడా తెలియకుండా నన్ను పావురాల గుట్ట దగ్గర్లోని సిద్ధేశ్వర మఠానికి తీసుకెళ్ళారు. అమ్మ హైదరాబాదుకు వెళ్తే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయని చెప్పినా, గురూజీ ఒప్పుకోలేదు. అప్పటి వరకు ప్రాణాల మీదకు ముంచుకొస్తుందని అన్నారు. పది నిముషాల్లో మేము బయల్దేరాము. అప్పటికి గురూజీ ఆశ్రమం అంతా ప్రశాంతంగానే ఉంది. మూడు గంటల్లో మేము సిద్ధేశ్వర మఠానికి చేరుకున్నాము. గురూజీ తన గురువు గారి పాదాలకు నమస్కరించి,

“స్వామీ! నా ఆశ్రమంలోనే ఆగంతకుడెవరో వచ్చి విష ప్రయోగం చేసారు. చాలా ప్రముఖ వ్యక్తి. నా మానమర్యాదలు కాపాడండి స్వామీ!” అని వేడుకున్నారు. అప్పటికే ఫోనులో పరిస్థితి అంతా వివరించడంతో కొన్ని మూలికలు నూరి సిద్ధంగా ఉంచుకున్నారు. నన్ను పరీక్షించిన సిద్ధేంద్ర గురువు గారు మరికొన్ని మందులు కలిపి, నాకు పట్టించారు. మళ్ళీ పెద్ద వాంతి అయ్యింది. తరువాత నా ఒళ్ళంతా చెమటలు పట్టాయి. నా శరీరం తమలపాకులా వణికిపోసాగింది. అది చూసి, సిద్ధేంద్ర గురూజీ,

“ప్రాణ గండం తప్పింది. కానీ, రెండు రోజుల తర్వాత గానీ, ఆ విషం వల్ల కలిగిన దుష్పరిణామాలను అంచనా వేయలేము. మీరు బాబును ఇక్కడ ఉంచుతారా? తీసుకు వెళ్తారా?” అని సిద్ధేంద్ర గురువులు అడిగారు.

మా గురూజీ సంశయిస్తూ,

“గురువు గారూ! నా ఆశ్రమంలో విషప్రయోగం జరిగిందంటే, నా ఆశ్రమంలోకి కూడా చీడ పురుగులు ప్రవేశించాయన్న మాట. ఇప్పుడు బాబును అక్కడకు తీసుకువెళితే మరొకసారి దాడి జరగదన్న గ్యారెంటీ లేదు. అందుకని బాబుని మీ సంరక్షణలోనే ఉంచుతాను. నేను వెంటనే అక్కడకు వెళ్ళి బాబు లేడన్న విషయాన్ని ప్రపంచానికి ఏం విధంగా తెలియజేయాలో వాళ్ళమ్మగారితో డిస్కస్ చేస్తాను. రెండు మూడు రోజుల్లో తిరిగి వస్తాను. ఈ లోపల మీరు కూడా ఒక అంచనాకు రావొచ్చు!” అని నన్నొదిలి వెళ్ళిపోయారు. ఈ విషయాలన్నీ కూడా నేను స్పృహలోకి వచ్చిన తర్వాత తెలిసినవే!” అని ఆగాడు.

తరువాత కమీషనర్ గారు, కళ్ళు తుడుచుకుంటున్న సంధ్యారాణి ఆంటీ వైపుకు తిరిగి,

“అమ్మా! మీరు ఏడవకుండా అన్ని విషయాలు, విపులంగా, క్షుణ్ణంగా చెప్పండి. నాకు తెలుసని గానీ, మీ వాళ్ళకు తెలుసని గానీ, ఏ వివరమూ వదలొద్దు. సంజయ్ చెప్పినట్టుగా చెప్పండి. అసలేం జరిగిందో తెలియని ఒక కొత్త వ్యక్తికి మీరెలా చెబుతారో అలా చెప్పండి. ఓకే?” అని ప్రొసీడ్ కమ్మని చేత్తో సైగ చేసారు.

“మేడమ్! బాబు మీద విషప్రయోగం జరిగిందని తెలియగానే నా పై ప్రాణాలు పైనే పోయాయి. అసలు నా కొడుకు మీద ఎవరికైనా ఎందుకంత పగ ఉంటుందో నాకర్థం కాలేదు. కానీ, మా వాడు సినిమారంగంలో మంచి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎప్పుడు ఏ విధమైన దాడులు జరుగుతాయోనని, మా సెక్యూరిటీ వాళ్ళు, అలర్టుగా ఉంటారు. ఆ సెక్యూరిటీ సంస్థ వారు మా అందరికి కూడా కొన్ని సూచనలిచ్చారు. ఒకవేళ ఏ విధమైన ప్రమాదం కలిగినా అరిచి గొడవ చేయవద్దనీ; అతి దగ్గర వాళ్ళకు కూడా ప్రమాదం విషయాలు తెలియనీయకూడదనీ; అలా చేయడం వల్ల అవతలి వాళ్ళు అలర్ట్ అయి పారిపోతారనీ; రహస్యంగా తమకు మెసేజ్ పంపాలనీ, ఒక ఫోన్ నెంబర్ నెంబర్ ఇచ్చారు. అందుకే, ముందు బాధపడ్డా నా తక్షణ కర్తవ్యం గుర్తుకొచ్చింది. గురూజీ బాబుని సిద్ధేంద్ర స్వామి మఠానికి తీసుకువెళ్ళాలని చెప్పినప్పుడు నేను కంగారు పడ్డాను. కానీ, నా దగ్గరున్న ఫోన్ నెంబరుకు ఫోన్ చేసి విషయం చెప్పాను. వాళ్ళు బాబును మూడో కంటికి తెలియకుండా తరలించాలని, కానీ ఆ విషయం నాకూ, గురూజీకి తప్ప మరొకరికి తెలియనీయకూడదని చెప్పి, తాము వెంటనే తమ నెట్వర్క్‌ను రంగంలోకి దించుతున్నామనీ, తమలో ఒక వ్యక్తి వచ్చి, ‘సమీర్ నుండి ఉత్తరం వచ్చింది’ అని పాస్‌వర్డ్ చెప్తేనే అతనితో మాట్లాడాలని; అక్కడి నుంచి ఏం చేయాలో మా వాళ్ళు చూసుకుంటారని చెప్పాడు.”

బాబును ఆ కుటీరంలో ఉన్న నేల మాళిగ ద్వారా బయటకు తీసుకెళ్ళి కారులో కూర్చోబెట్టారు. నేను సంజూ బాబును ముద్దాడి, ఏడుస్తూ గురూజీతో,

“నా బాబును ప్రాణాలతో తీసుకొచ్చే బాధ్యత మీదే గురూజీ!” అన్నాను. దానికి గురూజీ,

“అమ్మా! సిద్ధేంద్ర స్వాముల వారు స్వయంగా ధన్వంతరీ సమానులు. ఆయన స్వయంగా నాడీ చూసి, మందు వేస్తే ఏ విషమైనా దిగిపోతుంది. మీ బాబును సలక్షణంగా, సంపూర్ణ ఆరోగ్యంగా తీసుకొచ్చే బాధ్యత నాది. నా ఆశ్రమంలో ఇటువంటి నీచ కార్యం జరిగినందుకు మీ పాదాలనంటి క్షమాపణలు కోరుతున్నాను.” అంటూ గురూజీ వంగబోతుంటే నేనే వారి కాళ్ళకు నమస్కరించి,

“గురూజీ! ఇది మీ వాళ్ళ పని కాదు. మా వల్లనే మీ ఆశ్రమానికి కళంకం ఆపాదించబడింది. ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాము. మీరు ఏం జరిగిందో వెంటనే చెప్పండి. దాన్ని బట్టి, మా సెక్యూరిటీ ఇంఛార్జ్ కూడా వస్తున్నాడు, అతనితో కలిసి ప్లాన్ చేద్దాం!” అన్నాను.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here