[ఔషధ పరిశోధనలలో, క్లినికల్ పరీక్షలలో పారదర్శకతను పాటించవలసిన ఆవశ్యకత గురించి ఈ రచనలో వివరిస్తున్నారు శ్రీమతి ఆర్. లక్ష్మి.]
[dropcap]ర[/dropcap]సాయన శాస్త్రంలో ప్రయోగాలకు సంబంధించిన అతి క్లిష్టమైన ప్రక్రియ ‘కాంబినేషన్స్ అండ్ పర్ముటేషన్స్’. పరిశోధనలలో చాలా కాలం ఈ ప్రక్రియ ద్వారా కావలసిన ఫలితాలను రాబట్టుకోగలగటానికే ఖర్చు అయిపోతుంది. మందుల తయారీ రంగంలో ఔషధాలను వివిధ అంచెలలో ప్రయోగించి ఫలితాలు బావుంటే గాని క్లినికల్ ట్రయల్స్ దశకు రావటానికి వీలు పడదు. ఆ కారణంగా సాంప్రదాయక విధానలలో ఒక ఔషధం రూపొందించటానికి 10-15 సంవత్సరాలు కనీసం పడుతుంది.
వైద్య రంగంలో పరిశోధనలకు సంబంధించినంత వరకు ప్రైవేటు సంస్థల, ఫార్మా కంపెనీల కృషీ, పెట్టుబడులవే మొదటిస్థానం. సహజంగానే వాటి ధ్యాస అమ్మకాలు, లాభాలు వంటి కీలకమైన అంశాల చుట్టూనే ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ‘రీసెర్చ్ అండ్ డెవెలప్‍మెంట్’ కార్యక్రమాలు కొనసాగుతున్నప్పటికీ నిధుల కొరత, అలసత్వం వంటి కారణాల వల్ల అవి నత్త నడకతో సాగుతూ ఉంటాయి.
ఈ నేపథ్యంలో వైద్య పరిశోధనలలో ఇంచుమించుగా సగానికి సగం ప్రచురణకే నోచుకోవు. వ్యతిరేక ఫలితాలు వచ్చిన పరిశోధనలైతే ప్రచురణకు మరీ అనర్హమైనవిగా పరిగణింపబడతాయి. పాజిటివ్ ఫలితాలు వచ్చిన పరిశోధనలు విపరీతమైన పబ్లిసిటీ ఈయబడుతుంది.
ఇకపోతే వ్యక్తుల స్థాయిలోని పరిశోధనలు (వ్యక్తిగతమైనవి) సత్ఫలితాలిచ్చినవి సైతం తగినంత ధనబలం లేని సందర్భాలలో వెలుగునునే చూడని ఉదంతాలు అనేకం.
డచ్ డాక్టర్ Don Poldermans నాన్-కార్డియాక్ సర్జరీలలో బీటా బ్లాకర్స్ వాడచ్చని నిర్ధారిస్తూ పబ్లిష్ చేసిన పరిశోధన ఫలితాలన్నీ తప్పుడు లెక్కలు, తప్పుడు ఫలితాల ఆధారంగానేనని నిరూపింపబడి అతడు పదవి నుండి తొలగించబడ్డాడు. ఆ పబ్లికేషన్ ఆధారంగా జరిగిన సర్జరీల కారణంగా కేవలం యూరప్‍లోనే 8 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారని తేలింది. మందులు వికటించి ఆ మరణాలు సంభవించినట్లు పరీక్షలలో నిరూపణ అయింది కూడా.
‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్’ అంచనా ప్రకారం అమెరికాలో ఏటా నివారించదగ్గ వైద్య తప్పిదాలు/పొరపాట్ల కారణంగానే 1,80,000 మరణాల వరకూ సంభవిస్తున్నాయి. 2009-14 మధ్య కాలంలో అమెరికాలోని 10 అతి పెద్ద మందుల కంపెనీలు తాము పాల్పడిన మోసాలకు కట్టిన జరిమానా అక్షరాల 14 బిలియన్ డాలర్లు.
మెడిసిన్ అండ్ స్టాటిస్టిక్స్ ప్రొఫెసర్ జాన్ లాన్నిడిస్ పరిశీలనలో 60000 క్లినికల్ ట్రయల్స్‍లో కేవలం 7% మాత్రమే నాణ్యమైనవని బయటపడింది. అంటే మిగిలిన పరీక్షలన్నీ ఎఫికసీని నిర్ధారించడానికి పనికిరావు. శస్త్ర చికిత్స విధానాలు, రోగ నిర్ధారణా పరికరాలు, వైద్యం చేసే విధానాలు వంటి వాటికి సంబంధించిన సమాచారం ప్రచురణల్లో – బోలెడు వివక్ష, లెక్కలేనన్ని లొసుగులు! ఈ తతంగాన్నంటటినీ బ్రిటన్ పార్లమెంటులో 2017లో Peter Wilmshurst Committee సమర్పించిన నివేదిక ప్రణాళికబద్ధంగా జరిగిపోతున్న నేరపూరిత చర్యగా అభివర్ణించింది.
ఈ నేపథ్యంలోనే క్లినికల్ పరీక్షలన్నీ పారదర్శకతను పాటించటం అన్న నియమాన్ని అవలంబించాలనీ, సంబంధిత సమాచారం అంతా ప్రజలకు అందుబాటులో ఉండాల్నీ డిమాండ్‍తో ‘ఆల్ ట్రయల్స్’, ‘ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్’ వంటి ఉద్యమాలు/సంస్థలు ప్రారంభమయ్యాయి.