[శ్రీ నవులూరి వెంకటేశ్వరరావు రచించిన ‘మహాకవి గురజాడ – మతం’ అనే వ్యాసాన్ని పాఠకులకు అందిస్తున్నాము. ఇది రెండవ భాగము.]
[dropcap]ఒ[/dropcap]క దశాబ్దం పాటు ఆగిన కథ నాలుగో స్థలం, శిష్యుడు శాయన్న బుగత మేడ చేరింది. పట్నానికి రామగిరి ఎనిమిది మైళ్ళ దూరం. విజయనగరాన్నీ అనామక పట్నంగా, మూడు మతాల [వాటిలోని చీలికలు వదిలేస్తే] సంకర క్షేత్రం రామతీర్థాన్ని రామగిరిగా వ్యవహరించినట్టు తెలుసుకోడానికి ఎలాంటి అవస్థా లేదు. రామతీర్థంలో రాముడిని 1685 -96 మధ్య కాలంలో విజయనగరం జామీనుదారు పూసపాటి సీతారామచంద్రుడు ‘బోడికొండ’ పై కాస్త దిగువగా ప్రతిష్ఠించారు. మేఘదూతంలో యక్షుడు శాపవశాత్తూ గడిపింది వేరేచోటి రామగిరే. ఒక కాలంలో సీతమ్మ నివసించిన ఆ చోటుని చిత్రకూటంగా పెద్దలు గుర్తుపట్టారు. మన రామగిరిలో కథానాయిక మూడవ మహాలక్ష్మిలాంటి నాంచారమ్ముంది. ఆమె పెనిమిటి కృష్ణమాచార్యులు మహా విష్ణువు లాంటివాడు కాకపోయినా. పిరికిగొడ్డయినా, శృంగారానికి లోటేమీలేదు. భార్యతో జరిపే ఆ ఘనకార్యాలు మిత్రుడు శాయన్నదగ్గిర చెప్పుంటుంటాడు. రామగిరిలో బౌద్ధ, జైన శిథిలాలు పుష్కళంగా ఉన్నాయి. అంతేగాక పాండవుల పంచలు [నివాసస్థానాలు] కలవు. ఒక పాత్ర వ్యంగ్యంగా “ఈ దేశంలో పాండవులు వుండని గుహలూ, సీతమ్మవారు స్నానమాడని గుంటలూ లేవు” అంటుంది. చక్కని వ్యంగ్యం. కానీ అది హానిరహిత నమ్మకం.
ఇదంతా దండకారణ్యంతో కూడిన కళింగ ప్రాంతం. అయోధ్యకాండలో భరతుడి దగ్గిరకు వెళ్లిన దూతలు కళింగ ప్రాంతం గుండా, కళింగనగరానికి చేరువగా పయనించారు. వనపర్వంలో ధర్మరాజు, ద్రౌపది, ఇతరులు ముని సలహాతో కళింగలోని వైతరిణిలో స్నానాలాడి, శాంతులు, పూజలు చేసుకుని సముద్ర తీరానికి వెళ్లారు. నేటికీ కళింగ, వైతరణి, సముద్రతీరం ఉన్నాయి. దుర్యోధనుడు కళింగ రాజధాని రాజపురం వెళ్లి స్వయంవరంలో తనను నిరాకరించిన రాకుమార్తెను రాక్షసవివాహం చేసుకున్నాడు. కళింగ రాజులు అదేమీ మనసులో పెట్టుకోకుండా అతని తరఫున కురుక్షేత్రంలో భీముడితో పోరాడి మరణించారు. కాస్త దూరం ఉత్తర దిశగా వెళితే గంజాం ప్రాంతంలోని బరంపురం దగ్గిర మహేంద్రగిరి మీద గంగవంశజుల గోకర్ణ దేవుడికేకాక ధర్మరాజుకు, భీముడికి గుడులున్నాయి. కుంతీదేవికి ఒకటుంది. అవి వెయ్యి సంవత్సరాల క్రితం అంతకుముందు ఎంతకాలం నుంచీ ఉన్నాయో తెలియదు. కళింగరాజ్య చరిత్ర రాద్దామని గురజాడ అనుకుని సమాచారాన్ని కష్టపడి సమీకరించుకుని ఆ పని చేయలేకపోయారు. Rev. J.R. Hutchinson శ్రీకాకుళంకు ఉత్తరంగా ఇరవై మైళ్ళ దురాన కొండమీదున్నపాండవుల మెట్ట/పాండవుల పంచలు వెళ్లి చూసి ఈ విషయంలో ఒక ఆంథ్రోపోలోజిస్ట్ లేక చారిత్రకుడు చూపలవలసిన జిజ్ఞాసను చూపించాడు. హిందూమతస్థుల అజ్ఞానపు వింతగా కొట్టిపారెయ్యక అసలు విషయం తెలుసుకున్నాడు. అవి రెండు నిలువు రాళ్ళ మీద బల్లపరుపు పెద్ద శిలాఫలకాలను పరచి ఆదిమవాసులు నివాసాలుగా వాడుకున్నవి – dolmens. వాటికీ పెట్టుకున్న పేరు ఏదైతేనేమి, ఎవరు ఎప్పుడు పెడితేనేమి, బాలసారె చెయ్యకపోతేనేమి? జల్లుకొట్టకుండా చుట్టూ ఆకులుంచి, నీరు ‘ఇంట్లోకి’ రాకుండా వెలుపల చిన్న కాలువలు తవ్వుకుని చేసుకున్న ఏర్పాట్లను చూసి, వాళ్ళ తెలివితేటలను, ఆ పనిచేయడానికి అవసరమైన శక్తిని అంచనావేసుకుని అచ్చరువొంది ఒక వ్యాసాన్ని The Madras Journal of Literature and Science 1888-89 లో ప్రచురించాడు. దాంట్లో అవి పాండవుల పంచలు కావు అని ఆ కిరస్తానీ అరవలేదు. పాండవుల నివాస స్థానాలా కాదా అన్నది చెప్పలేం అన్నాడు. మొహమాటస్థుడో, మర్యాదస్థుడో! అక్కడ ఆనాడు అలా జీవించిన ఆదిమవాసులు తక్కువవారు కాదన్నాడు ఆంగ్లేయుడు. తెలుగువారికి దగ్గిరవారయిన కోదులు పాండవులను, ముఖ్యంగా హిడింబ [వాళ్ళ తల్లి?] భర్త భీముడిని ఆరాధించేవారు. రామతీర్థంలో భీముని గుహ ఉంది. ఆ వ్యాసం ఉపోద్ఘాతంగా మద్రాస్ ప్రెసిడెన్సీ గవర్నర్ Sir M.A. Grant Daff అన్నమాటలను ఉల్లేఖించాడు: “మనకు ఎక్కువగా కావలసిందేమిటంటే మన భూభాగంలో అక్కడక్కడున్న తెలివైన, సరైన వివిధ పురాతన ఆసక్తికరమైన అంశాలు సేకరించడం. వాటి పేరు బహుళం. కానీ వాటి రహస్యాలను అవి ఇంకా దాచుకుంటూనే వున్నాయి.” ప్రతి మూఢవిశ్వాసానికీ ఒక కారణం ఉంటుంది అని కొడవటిగంటి కుటుంబరావు అన్నారు.
ఒక గుహలోని బౌద్ధ విగ్రహాన్ని శివుడిగా పక్కనున్న దేవి విగ్రహాన్ని గౌరిగా భావించి జంగాలు పూజచేస్తున్నారు అని కథ చెప్పే శాయన్న భుక్త అంటాడు. ఎవరామె? వజ్రయానం వారి శక్తి. తలలో చంద్రుడు, మెడలో పాములేని శివ విగ్రహంలా బుద్ధ విగ్రహాన్నివాడుకున్నారేమో. వాళ్ళు మూఢ భక్తులే కాకా, అంధులుగా కూడా మనం భావించ గలమా?
అక్కడ ఒకదాని పక్కన మరొకటున్న బోడి, గురుభక్త, దుర్గ కొండలలో ఒకదాని పైనుంచీ ఒక బుద్ధ విగ్రహాన్నో జైన విగ్రహాన్నో నాలుగయిదొందల అడుగులు కిందికి దింపాలంటే ఒక నందికేశుడు, ఒక గరుత్మంతుడు సరిపోరు. శరభయ్య అవతారపురుషుడయ్యుండాలి.
బుద్ధుడిని వైష్ణవుడిగా మార్చారు కదా అతన్ని శైవులు ఎలా కొలుస్తున్నారు అని శాస్తుర్లు భుక్తా మేడ మీద సందేహం వెలిబుచ్చగా భుక్త అసలు కథను చెప్పుకొచ్చాడు.
పురావస్తుశాఖవారు అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు. దాన్ని పర్యవేక్షిస్తున్న దొర [Alexander Rea అని అనుకోకూడదు] బుద్ధుడి పాలరాతి గాంధార శిల్పం మీద ‘కన్నేశాడు’. Rea నివేదికలో ఏ విగ్రహము ‘గాంధర్వం’ అన్న ప్రస్తావన లేదు. జంగం శరభయ్య రాత్రివేళ దొంగతనంగా దాన్ని అమ్మజూపితే దొర తీసుకోడానికి నిరాకరించాడు. విషయం నలుగురికి తెలియజేసే ప్రయత్నం చేయడంతో శరభయ్య అదృశ్యమయ్యాడు. దాన్ని శరభయ్య దొంగిలించడం ఎంత నేరమో, దాన్ని తన సొంతానికి దొర కొనడమూ నేరమే. ఆంధ్రదేశానికి అద్వితీయమైన సేవ చేసిన Rea లాంటి దొర అలాంటి పని ఛస్తే చెయ్యడు. కథ గురించి ఒక దొర పాత్ర చేత ఆ పని చేయించుకోవచ్చు. ఎంత భుజబలముందోమరి, శరభయ్య ఒక్కడే వాళ్ళు శివుడిగా కొలుస్తున్న బుద్ధుని రాతివిగ్రహాన్నేపెకిలించి తీసుకుపోగలిగాడు దొర డేరాకు. శివశక్తి!
రామగిరిలో శైవ-వైష్ణవ వైరం చిరకాలంది. శైవం మొనగాడు జంగం శరభయ్య అతగాడి అనుయాయులకు సాక్షాత్తు నందికేశ్వరుడు. ‘శివుడిని’ దొరకు అమ్మజూపి, దొరికి, పారిపోయినా – అతని పైగల మూఢభక్తి కారణంగా దాన్నీ పట్టించుకోరు.
వింటున్న శాస్తుర్లు, “ఔరా వీళ్ళ మూఢభక్తి! ఈ ప్రపత్తి పండితులకు ఉండదు. వీళ్లది ఏమి అదృష్టం” అని [ముక్కున వేలేసుకోకుండా] అంటాడు. మూఢభక్తీ అదృష్టంగా భావించాల! ఆ అదృష్టం పట్టని పండితులను చూసి జాలిపడాలి, పామరులను చూసి అసూయపడాలి శాస్తుర్ల శాస్త్రం ప్రకారం. బుగత శాయన్న పామరులకు మూఢభక్తి ఉంటుందని గురువుతో ఏకీభవిస్తూ, మూఢభక్తి ప్రాణాంతకం అని దానికి సమాధానంగా కథను అందుకుని వినిపిస్తాడు ముక్కుపొడుం పీల్చి; అది పండిత లక్షణం.
కృషీవలుడైన శరభయ్య మిక్కిలి వైభవాన్ని శివస్ధలికి చెమటోడ్చి తెచ్చాడు; ఘర్మజలం ఉరికేపోక వ్యక్తిగత లబ్ధి దక్కింది. మొక్కుబళ్లు, ఉత్సవాలు, జాతర్లు నిరాటంకంగా సాగుతూ కాసులు శివభక్తి తాండవం చేస్తున్నవి.
విష్ణుస్ధలానికొస్తే – రెండొందలేళ్ళనాడు ఒక ‘మహారాజు’ గుడి కట్టించి స్వామి రాజభోగాలకు ఒక గ్రామమర్పించాడు. రంగాచార్యులు కుటుంబం ధర్మకర్తలు. శివ-వైష్ణవ భేదం అంతగాలేని లౌకికవాది. “ఆ ఇంటికి వెలుగు తెచ్చింది మాత్రం” అతని కొడుకు కృష్ణమాచార్యుల భార్య నాంచారమ్మ. ఆంధ్ర, గీర్వాణాలలో పండితురాలు, గుణవతి, బిడ్డల తల్లి. శైవులతో జరిగే గిల్లికజ్జాలలో అయ్యంగార్ తలదూర్చేవాడు కాదు. ఆ పనిని శ్రీమద్గురాళ్వార్ అవతారంగా తనను తాను భావించుకునే సాతాని మనవాళ్ళయ్య తన భుజస్కందాలమీద మోపుకున్నాడు. ఆ కేప్తను పోటీతత్త్వం అయ్యంగారికి నచ్చేదికాదు కానీ మిన్నకుండక తప్పడంలేదు [బ్రాహ్మణ అబ్రాహ్మణ అంశం ఉండటం చేత కూడా కావచ్చు]. ఆ ఊరి నాయలు స్తోమముగలవారు. సారథినాయుడు లక్షాధికారి కాగా, బావమరిది [లేక వియ్యంకుడు] రామినాయుడు గ్రామమునసబు. రామి కొంచం ధూర్తు, నిషాబాజీ, భోజనప్రియుడు. నాలుగేళ్ళ క్రితం ఒక అయ్యవార్లంగారు సారథినాయుడిని మరికొందరు నాయలను చక్రాంకితం [ద్వారకా వద్ద గోమతీనదిలో దొరికే ఒక కన్నాల, చక్రాల తెల్లరాయిని – సాలగ్రామం లాంటిది – ఒంటికి తాకించి పాపప్రక్షాళన చెయ్యడం] చేసి వైష్ణవాన్ని ప్రసాదించారు. రామినాయుడు రామస్వామి కోవెలలో తూమ్పట్టు [తూము = నాలుగు కుంచాలు] పులిహోరా, వైష్ణవం ఒకేసారి పుచ్చుకున్నాడు.
మతం మార్చుకున్న వైష్ణవ నాయుళ్లు శైవం వైపు తొంగి చూడటం మానేశారు. అది శరభయ్య కంట్లో మిరపకాయ రాసుకున్నట్టాయను. నైజాం శివాచార్లు కొందరు దేశ సంచారార్థం రామగిరిలో పీఠంతో ప్రభలతో రుంజలతో పెనుప్రళయం వచ్చినట్టు దిగబడ్డారు. రాత్రివేళ వాళ్ళు చేసే ధ్వనులకు పామరుల మనస్సులలో భయోత్పాతం జరిగేది. ఆ అట్టహాస ప్రభావంతో వైష్ణవులు ఒక్కొక్కరు శైవం ఒడిని చేరడం మొదలయింది. పదోరోజున గుండం తొక్కుతారు. అధికారం, పరపతి గల సారథిని శైవం వైపుకు తిప్పుకునేది ముఖ్య యత్నం. శైవులు వెళ్లి అతన్ని ఉత్సవం చూడటానికి ఆహ్వానించారు. ఈ మతమార్పిడి ప్రయత్నాన్ని రంగాచార్యులు ఖాతరు చెయ్యకుండా రాముడి ఆజ్ఞ ఎలావుంటే అలా జరుగుతుందని తాటస్థ్యం వహించాడు పుల్లంభొట్లలా. సాతాన్లకు ఆ వైఖరి నచ్చలేదు. బ్రాహ్మలది జ్ఞానము కాదు, అజ్ఞానము కాదు అన్నది మనవాళ్ళయ్య అభిప్రాయం. సాతాన్లతో, నాయుళ్లతో మనవాళ్ళయ్య సమావేశం ఏర్పరచాడు. ముఖ్యంగా సారథి మారకుండా చూడాలి. అలా జరగాలంటే అతను శైవ గుండం దరికి వెళ్ళగూడదు. మనవాళ్ళయ్య రాగిధ్వజం ధరించి నాలాయిరం [ఆళ్వారుల స్తోత్రాలు – తమిళ ప్రబంధం అని పిలిచేది] పఠిస్తూ తాను గుండం తొక్కటమే మార్గం అని రామానుజయ్య తేల్చిచెప్పాడు; మనవాళ్ళయ్య నోరెళ్లబెట్టాడు. అందరు ప్రతిపాదనను సమర్థించేసరికి మనవాళ్ళయ్య ప్రాణాలకు రెక్కలొచ్చాయి. నాది భారీ శరీరం – రామానుజయ్య చులాగ్గా, డేగల ఉన్నాడు కనుక ఆ కార్యానికి అతడే కడు సమర్థుడు అని తిప్పికొట్టే విఫల యత్నం చేశాడు. రామానుజ జారుకున్నాడు. రామినాయుడు బాధ్యతను మనవాళ్ళయ్య మీద నుంచి పట్టుబట్టాడు. నిషా మీదున్నాడేమో! పంచభూతాల్లో ఒకటైన అగ్నిని వైష్ణవుడు తొక్కకూడదు, కావలిస్తే సీతగుండం [నీటిలోకి] దూకుతా అన్నాడు ఈత వచ్చిన మనవాళ్ళయ్య. రామినాయుడు బాధల్లా ఖర్చు భరించే సారథినాయుడు జంగపోళ్ళలో కలిసిపోతే దోదశి పులియోరీ శక్కర పొంగలం పోతాయని. అల్లాండం బెల్లాండం [అఖిలాండం, బ్రహ్మాండం] అని తెల్లారగట్ల అరిచే మనవాళ్ళయ్య గుండం తొక్కక తప్పదని అప్పీలు లేని తీర్పు ఇచ్చాడు పెత్తందారు, అధికారీ రామినాయుడు. రేపు దందహ్యమానమైన గుండం దూకుతానన్నాడు రేపన్నది గండం తప్పే వీలివ్వకపోదని. ఈ రోజు శైవులు గుండం తొక్కి సారథి బావ మతం మారిన తరువాత మనవాళ్ళయ్య గుండం తొక్కినా, నీటిలో మునకవేసి చచ్చినా ఒకటే అని రామికి తెలుసు. వైష్ణవుడు నిప్పుల్లో దూకకుండా ఈ రాత్రి గడవడానికి ఒప్పుకోలేదు నాయుడు, జిహ్వకు బానిస. ఉత్సవ విగ్రహం తెస్తే గుండం తొక్కుతానన్నాడు మనవాళ్ళయ్య. బ్రాహ్మణేతరులను రంగాచార్యులు ముట్టుకోనివ్వడని బాగా తెలిసి వెళ్లి అడిగితే మనవాళ్ళయ్య కోరుకున్నట్టే ఇవ్వనన్నాడు. ఐతే ఆయన కొడుకు కృష్ణమాచార్యులు గుండం తొక్కితే పోతుందన్నారు. వాడేందుకు నేనే విగ్రహం ఎత్తుకుని నిప్పులు తొక్కుతానన్నాడు కొడుకును నిప్పులు తొక్కించి చంపుతారని. ఆయనను పైగుడ్డ కూడా వేసుకోనియ్యకుండా లాక్కొచ్చారు. కృష్ణమ భయంతో అటకెక్కాడు [పొతే తండ్రే కదా పోయేదన్నట్టు]. నాంచారమ్మ కరదీపికతో, చురకత్తితో రంగంలోకి దిగి అందరితో చెడుగుడాడింది. “శక్కర పొంగళం, పులియోరీ లేకపోతాయనే కాగా నీ దుఃఖం” అని రామినాయుడు గుట్టు రట్టు చేసింది. తన భార్య గయ్యాళి కనుక ఆడదాయి అంటే భయం ఏర్పడుంది అతనిలో. ముసలాయనను అగ్గిలోకి తోసి పైనుంచీ చూస్తారా మీరు? మీరే గుండంలోకి దూకే పని చెయ్యకుండా అని నిష్టూరంపోయింది. అక్కడే పీరు సాయబున్నాడు ఆమె Man Friday లా. అతను కీర్తనలు పాడే రామభక్తుడు, హఠయోగి, మఠం పెట్టుకున్నాడు – అల్లా భక్తుడేగాక! గుండం తొక్కుతావా అని అడిగింది. ఆమె సెలవైతే అగ్గిలో దూకుతానన్నాడు హనుమంతుడిని మరపిస్తూ. ఈ ‘పచ్చి’ తురకకు గుండం తొక్కడానికి దేముడు ధైర్య సాహసాలు ఇచ్చాడు కావున వైష్ణవం గొప్పదా తురకం గొప్పదా అని ప్రశ్నించింది. గుండం తొక్కడానికి దైవ సహాయం అవసరమనుకోవాలి మనం; గుండం తొక్కడం అనే అగ్నిపరీక్షలో ఏ మతం వాళ్ళు గెలిస్తే ఆ మతం గొప్పదనుకోవాలి. మరి శైవులు ఆ పని చేశారు గదా? సమాధానం దొరకదు కథలో. నిజానికి తురకలు తామస కార్యాలు చేసే వైష్ణవులే అని ప్రకటించింది నాంచారమ్మ. అక్కడున్న ‘మూర్ఖ’ జనానికి అర్థమయ్యే భాషలో ఆమె మాట్లాడిందని, మూర్ఖత్వానికి మూర్ఖత్వమే మందు అని కనిపెట్టిన వైద్యురాలిగా ఆమెను భావించాలి. సరిపుచ్చుకోవచ్చు. ముందు శివాచార్లు, వెంటనే వెండి పీరు పట్టుకుని హాయ్ అల్లా – రామ్ అంటూ సాయబు, ఇతరులు గుండం తొక్కారు.
కథ వినిపించిన శాయన్న భుక్త తన ఇంటి ముందు చావిడిలో ఉన్న పీరు చూపించాడు. శైవులు, వైష్ణవులు కూడా ఆనాటి నుంచీ దాన్ని కొలుస్తుంటారట.
అంతా చల్లారగానే [జరిగిందంతా గుండంతో పోల్చదగిన వేడిదే కదా], కృష్ణమాచార్య అటక దిగాడు. కష్టసాధ్యమును సాధించిన సంతోషంతో [ఉంగరాల జుట్టున్న] నాంచారమ్మ ఇంటికి సవిలాసముగా నడిచిపోతుంటే పెనిమిటి ఎదురైనపుడు ఆమె ‘ప్రేమ పరిహాసములు పెనగొను దృష్టితో’ భర్తను చూశను. ఆ దృష్టి కృష్ణమను అవతారపురుషుడిగా [మన్మథుడిగా?] చేసింది. ఆమె అలాంటి చూపు ఏ పెనిమిటిని అవతార పురుషుడిని చేయదు? అప్పటికి తెల్లారి ఐదుగంటలయుండవచ్చు. ఆమెతో గడిపిన ఆ మధురక్షణాలను తన మిత్రుడు సాయన్నతో పంచుకున్నాడు కృష్ణమాచార్యులు. ఈ మతపోరు కథకు శృంగార మలుపూ అవసరమని గురజాడ భావించారు నాంచారమ్మను సృష్టించిన ప్రభావంతో. ఆమెలో భక్తి, యుక్తి, రక్తి వున్నాయి [వైరాగ్యం లేకపోయినా] – అవి కైవల్యానికి మూడు సోపానాలు.
ప్రహసనమా అనిపించే చాలా అతిశయోక్తులున్నాయి కథలో:
శరభయ్య సాక్షాత్తు నందికేశ్వరుడి అవతారమని – రాత్రులు గుహ [‘శివుడు’ ఉండేది] ముందు వృషభారూపమై మేస్తూవుంటాడని ఇక్కడ జంగాలకూ దేవాంగులకూ నమ్మకం.. ఆ దొర కిందటి జన్మలో పరమేశ్వరుడౌట చేత ఆ విగ్రమును కోరినాడనీ, భక్తవాత్సల్యం చేత శివుడిచ్చిన శలవును అనుసరించే విగ్రహాన్ని [శరభయ్య] పీక్కు వెళ్లాడని, డేరా నుంచి పారిపోవడంతో వృషభ రూపం ధరించి రంకె వేసి మరీ దాటేశాడనిన్నీ ఒక వార్త అప్పుడే అతని శిష్యులు పుట్టించారు.. పెళపెళమని శ్లోకం ఎత్తుబడి చేసేసరికి స్థూలకాయం, బర్రెనామాలు, రాగిధ్వజం, కోలాహలం చూసి కలెక్టరు గుర్రం చెదిరి, కోపమొచ్చి కలెక్టర్ అయిదు రూపాయల జుల్మానా వేసారట.. మనవాళ్ళయ్యంటాడు – “శరభయ్య వృషభావతారమైనపుడు, నేను గరుడాళ్వారి పూర్ణావతారం కాకపోతేకాకపోవచ్చునుగాని, వారి యొక్క అత్యల్పఅంశ వల్లనైన జన్మించి ఉండకూడదా. గరుడాళ్వారు నఖములయొక్క తేజస్సు నాయందు ఆవిర్భవించి వున్నది. కాబట్టే శరభయ్యను యిలా చీల్చి పీల్చుచున్నాను.. ఇంతకాలావయి రాముడి ధ్వజమును జయప్రదంగా మోస్తూ, శైవసంహారం చేసిననేను శ్రీమద్గురుడాల్వారి నఖాగ్రనఖాగ్రము యొక్క అవతారం ఎలా కాను? గరుడాల్వారి నఖములు పెరిగి ఖండన ఐనప్పుడు ఆ ముక్కలు నావంటి భక్తులుగా ఆవిర్భవించి పరమత సంహారమే గాని వృథాగా పోనిచ్చటం ఒట్టిమాట!” అలాంటి వాచాలత గిరీశం మాటలను గుర్తుచేస్తుంది.
ఆ పోటీలో శివాచార్లు కూడా గుండం తొక్కారు గనుక పీరు సాహెబు ఆధిక్యత అంగీకరించడం ఎందుకు, మతసామరస్యం వైపు మొగ్గుచూపడం ఎందుకు?
మతం కన్నా దేవుడిపై గల నమ్మకం ముఖ్యం అన్నది నాంచారమ్మ ఉవాచ; నమ్మకముంటేనే గుండం దాటటం సాధ్యం అన్న సూత్రం బోధిస్తున్నట్లు. శైవాచార్యులంతా గుండం తొక్కగలిగారు కానీ వైష్ణవులలో ఆ పనిచేయడానికి ఒక్కడు లేకపోయాడు; అంటే శైవులలో నమ్మకం ఆ పని చేయించిందా? వైష్ణవులలో అదిలేక వాళ్ళచేత గుండం తొక్కించలేక సాయబును దత్తతు తీసుకోవలసి వచ్చిందా? పీరు సాహెబు మాత్రం అవలీలగా గుండం దాటాడు. వాడు రెండు మతాలను ఎందుకు నమ్ముకోవలసి వచ్చినట్టు ఏదో ఒక మతపు దేవుడిమీద నమ్మకంపెట్టుకోగలిగుంటే? ‘రామ్ వహీ, రహమాన్ వహీ హై’ అని రామగిరి కబీరులా ప్రబోధించడానికి. నాంచారమ్మకన్నా తన వైష్ణవం మీద నమ్మకవుండుంటే ముందు ప్రగల్భము పలికినట్టు ఉత్సవ విగ్రహాన్నిభుజానికి ఎత్తుకుని గుండం అవలీలగా తొక్కేసేది. గుండం దాటటం సాధనవల్ల అలవడేది; ఇతర పల్లెలలోను జరిగే వ్యవహారమే – మతమహిమతో, దేవుడిపై నమ్మకంతో ప్రమేయం లేదు. నాంచారమ్మ తామస చర్యయిన గుండం తొక్కటం సాయిబు వైష్ణవుడు కూడా అవడం వలన సాధ్యపడుతుంది అంటుంది. ఆమెది శైవ, వైష్ణవుల ఘర్షణను ఆపడమనే ఉన్నత లక్ష్యం కాదు, మామగారి ప్రాణం రక్షించుకోడమనే స్వార్థ చింతన తప్ప. ఆ రెండు వర్గాల మధ్య సామరస్యం వెల్లివిరియాలన్న దృష్టి ఆమెకు లేదు అని తెలుపడానికి వైష్ణవులను అవసరమైతే ఆయుధాలు ధరించమని ఆమె హెచ్చరించడం కన్నా రుజువేమి కావాలి? “వేళకు భక్తి నిలుస్తుందో నిలవదో చేతి కఱ్ఱలు మాత్రం మరవకండీ?” చివరకు ఆమె తెలివిని లేక యుక్తిని చిత్రించడమే కథా లక్ష్యంగా మిగిలింది వివిధ పరోక్ష బోధనలు సమయానుకూలంగా చేస్తూ. ఆ గ్రామపు శైవ-వైష్ణవ పోరుకు ఒక ఉమ్ముతడి పరిష్కారాన్ని కనుగొనింది; రెండు మతాల సంఘర్షణకు పరిష్కారం కావాలనుకున్నా, కథలో ఉందనుకున్నా. శైవులు పీరు త్రిశూలం అని, వైష్ణవులు ఊర్ధ్వపుండ్రాలు అనీ అనుకుంటూవుండే భేదభావం పోదు. వాళ్ళవాళ్ళ మతాలనుంచీ మరో మతానికి మార్చలేదు. భవిష్యత్తులో సిగపట్లుండవని గుండెమీద చేతులేసుకుని నిద్రించడానికి లేదు. 2020 డిసెంబరు మాసంలో ఆ విగ్రహం తలను దుండగీడు ఎవరో నరికేశాడు! రాజకీయాలు నడిచాయి.
కథలో చెప్పకపోయినా మనంతట మనం అర్థం చేసుకోవలసిన విషయాలున్నాయి. ఆ గొడవ వైష్ణవులకు కొన్ని మేళ్లు చేసింది. వైష్ణవ ‘మహిమా’ ప్రదర్శితం ఐంది. వైష్ణవుల కోరిక ప్రకారం సారథినాయుడు వైష్ణవం నుంచీ మారడు; ప్రసాదం ఖర్చు భరిస్తుంటాడు. రామినాయుడు మక్కువతో నిరాటంకంగా పులియోరి, శక్కర పొంగలం ఆరగిస్తుండే వీలు కలిగింది. శైవుల ఆటకట్టయింది. గెలుపు వైష్ణవంది. వ్యూహకర్త నాంచారమ్మతల్లి, యోధుడు పీరు సాయబు. నిజానికి ఎవరు గుండం దాటాల అన్నది వైష్ణవుల సమస్యగాని శైవులది కాదు.
కొంత అభ్యంతరం పెట్టవలసిన విషయం మరొకటుంది. పామరుల మూఢభక్తి ప్రాణాంతకం పండితుల భక్తి కాదు అని చెప్పడం. అదే ఈ కథ ముఖ్యోద్దేశం పరమాత్మ ఒక్కడే అనడంతోబాటు. ప్రసాదభక్తుడు ఈ కథలో విలన్. రెండు పిల్లుల తగవులో జిహ్వాచాపల్యం కారణంగా కోతి లాంటి రామినాయుడు త్రాచు పట్టకపోతే రంగాచార్యులు గుండం దాటే ప్రమాదంలో పడుండేవాడు కాదు. ఎంచేతో ఇంత గొడవ ఆ చిన్న పల్లెలో జరుగుతున్నారంగస్థలానికి సారథిబావ రాలేదు. రామిబావ ఆందోళనలో కలుగజేసుకోలేదు.
ఇది రెండు మతాల పోరా ఇరువర్గాల పరస్పర ఆధిపత్య పోరా అంటే రెండోది అని చెప్పాలి. ఆధిపత్య పొర్లు అనేక రకాలు, అనేక రంగాలలో వున్నదే. అది వ్యక్తిగత ఆధిపత్యపోరు కూడా. పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను రచయిత తన పాత్రలతో అనిపించారు. పాత్రల అభిప్రాయాలూ రచయితవి కానక్కరలేదు అన్న తయారుగా వుండే సమాధానం చెప్పవచ్చు. బుద్ధుడిని నాస్తికుడిగా భావించడాన్ని పరిహసించడంతో ఆరంభించి, బుద్ధుడిని తొమ్మిదో అవతారంగా చేర్చినందుకు, బుద్ధుడిని శివుడిగా పూజించదడాన్ని గురువుచేతి చురకత్తికి గురిచేశారు. కథ చివరకు వెనక్కు తగ్గి ఐక్యతను బోధించే ప్రయత్నం జరిగింది ఈ మాటల్లో:
“అయినా తప్పేమి? శివుడన్నా, విష్ణన్నా, పీరన్నా, బుద్ధుడన్నా ఆ పరమాత్మ మట్టుకు ఒక్కడే కదా?” [వెంకన్న]
“అందరు దేవుళ్ళు వక్కరే అయితే, ఆ పీనుగుల్ని అందరిని ఒక్కచోటే నిలిపి అందరు కలిసి పూజ తగ లెయ్య రాదా?” అన్నాడు రెండు మతాలవారు కొలిచే అవధూత పేరున్న శాయన్న.
‘అయితే’ అనడంలో ఆ ఆసామి ఏకీశ్వరోపాసనను సమర్థిస్తున్నట్టా, లేనట్టా?
పీనుగలను కాదుగాని, పీర్లను అన్నింటినీ ఒకేచోట పడుకోబెట్టి, నిలుచోబెట్టి ఉంచి పూజిస్తుంటారు,
ఆ వూళ్ళో అందరు అజ్ఞానులేనా? ముసలాడు చస్తుంటే రామినాయుడుకు భయపడి చూస్తూ వూరుకునేంత పిరికితనం, దుర్మార్గానికి దారితీసేంత మౌఢ్యం వాళ్లలోవుందా? సామాన్య జనం అమాయకులు కావచ్చు, అజ్ఞానులు కావచ్చు, మానవతా లక్షణాలూ కలవారు, దుర్మార్గులు కారు అన్న నమ్మకం ఉండాలి. వాళ్లకు ముసలాయన నిప్పులు తొక్కాలని చూస్తే చస్తాడు అన్న నమ్మకం కొరవడినట్టుంది.
ఇందులో ప్రధానంగా చిత్రించబడిన మరో అంశం ‘మత సంకరం’. అందుకనే – ‘మీ పేరేమిటీ?’ అని ‘సంకరపడిన’ దేవుళ్లను రచయిత వ్యంగ్యంగా ప్రశ్నించారు. ఇందులో పరస్పర విరుద్ధ భావాలను వ్యక్తం చేశారు. పీనుగలను అన్నింటినీ ఒక చోట చేర్చి సామూహికంగా పూజించండి అని ‘హితవు’ వ్యంగ్యంగా పలుకుతూనే, ‘సంకరపడిన’ దేవుళ్లను వాళ్ళ పేర్లు ఏమిటి అని నిలవేస్తున్నారు రచయిత. బుద్ధుడు వైష్ణవ అవతారం అయ్యాడు అని వెటకారం; బుద్ధుడిని శివుడిగా కొలిచారు అని మరొక వెటకారం. ముస్లిములు, హిందువులు కొలిచే సాయిబాబా పేరున్నఆయన కథ చెబుతాడు. పీర్ల సాహెబు వైష్ణవ భక్తుడు కూడానట – పైగా ఒక మఠము కలదు; ప్రధాన మరియు ఆదర్శ మహిళా పాత్రలోనూ సంకరం వుంది. శ్రీరంగం రంగనాథ కోవెల గర్భగుడి పక్కనే ఒక గోడగూడులో ఢిల్లీ సుల్తాన్ తనయ [రాకుమారి] అని చెప్పబడే స్త్రీ, ఆమె గుర్రం పటం ఉంటుంది. శ్రీ రంగడిని ఆ సుల్తాను ఎత్తుకుపోయినపుడు చుసిన ఆమె ఆయనతో ప్రేమలోపడి తిరిగి ఆ విగ్రహం శ్రీరంగం చేరుతున్నపుడు తన గుర్రం మీద వెన్నంటి వచ్చి, ఉండిపోయి ఆయనలో ఐక్యం అయిందని నమ్మకం. [Hindu Spirituality: Post-classical and Modern – ed. K.R. Sundararajan, Bithika Mukerji]. ఆమెకు తమిళ వైష్ణవం ‘తులక్క నాచ్చియార్’ అన్న నామకరణం చేసుకుంది. వైష్ణవ మాయవలన ఆ పేరు తెలుగులోకి బీబీ నాంచారమ్మగా తర్జుమాకాబడి, శ్రీ వేంకటేశ్వరుడి మరో భార్యగా అవతరించింది. చిత్రవిచిత్రాలను నమ్మదలచుకోనివారు అలాటి ఎత్తుగడలు ముస్లిం సైన్యాలనుంచి గుడులను కాపాడుకోడానికి ఎత్తేవారు అనుకోవచ్చు.
‘పీనుగలను’ అన్నింటినీ ఒకచోట [అన్ని మతాల దేవుళ్లను] చేర్చి పూజలు చేసుకోండి అన్నది గురజాడ మౌత్పీస్ శాయన్న సందేశము. అసాధ్యమైనది. జఠిల సమస్యలకు పరిష్కారాలూ జఠిలంగానే ఉంటాయి. సాహిత్యం సమస్యలు తీర్చలేదు. పీనుగలు ఎలా స్పందించావో అలాగే విగ్రహాలు స్పందించవన్న విషయము వ్యక్తమవుతోంది. విగ్రహరూపం లేని మజీదు దేముడు మాత్రం స్పందిస్తాడా? సమస్య నిజమైన మతాల వలన జరగలేదు. ఇతర కారణాలవల్ల జరిగింది. వాటికి ‘మతం’ ఒక మిష. ఆధిపత్య పోరు, స్వార్థం, పోటీతత్వం, అహం, ప్రసాద ప్రీతి చేసే అల్లర్లకు ఈ కథలో మతం ఒక ముసుగు. అసలు కారణాలను దాచి మతమే అన్నిటికీ మూలం అని చెప్పే ప్రయత్నం చేసింది కథ.
సరైన దిసె, లక్ష్యం కొరవడినట్టు సాగింది కథ. నిజానికి అది అనేక లక్ష్యాల కారణంగా ఆలా అనిపిస్తుంది. ఆ కారణంగానే ఒక విషయం నుంచీ మరొక దాంట్లోకి, ఒక స్థలం నుంచీ మరొక దానికి కప్పగంతులేస్తుంటుంది. అమోఘమైన భాషాశైలి. అడుగడుగునా కన్యాశుల్కం లాగానే వ్యంగ్యం. దాని ప్రభావంతోనే రాసినట్టూ అనిపిస్తుంది. కళ్లకు కట్టినట్టు చక్కని పాత్రపోషణ. సులభ గ్రాంథికం మాండలికాల కలనేత హాస్యాన్ని ఇనుమడింపచేసింది. పాళ్ళలో తేడాయేగాని ప్రాజ్ఞులలోనూ పామరులలోను మూర్ఖత్వముంటుంది. రెండు వర్గాల వ్యక్తులలోను కొట్టుకుంటుండే హృదయముంటుంది. అహముండే మనుషులేకాదు వాళ్ళ హృదయాలూ కొట్టుకుంటుంటాయి – ఈ కొట్లాట మనిషి బతికి ఉండటానికి అవసరమైనది. మొదటిది చావడానికి అవసరమైనది. మూర్ఖుడి చేతిలోని అధికారం లేక పెత్తనం ఆనాడైనా ఈనాడైనా చేటుచేస్తుంది ఇతరులకు. మేలు చేస్తుంది వాడికి. రాజకీయం లేని గడ్డ లేదు భారతంలో; కాలాతీతమయినదది. మిగతా విషయాలు ఎలా వున్నా తెలుగు కథా క్షేత్రంలో ఈ కథ చోటు శాశ్వతమైనది. నవ్వించి ఆలోచింపచేస్తుంది; ఆలోచింపచేస్తూ నవ్విస్తుంటుంది. నోస్టాల్జియాతో కూడిన అనిర్వచనమైన అనుభూతినిస్తుంది. చివరగా, కాలానికి ఎదురీది నాంచారమ్మను చూడాలనిపించేట్టు చేస్తుంది.
మతం
పీరు సాయబు కబీరుదాసు. రామానంద శిష్యుడైన కబీరు రాముడిని, అల్లాను కొలిచాడు. కబీరు ప్రభావం బ్రహ్మసమాజం మీద టాగోర్ మీద, స్నేహితుడు గురజాడ మీద ఉండవచ్చు. టాగోర్ కబీర్ వంద సూక్తులను ఆంగ్లంలోకి తర్జుమాచేశాడు. రెండు కథలలోను కబీరు ప్రస్తావనుంది.
ఒకనాటికి మతం మాసిపోతుందని చెప్పినా [అంటే నాస్తికమే శరణ్యం అని] నాస్తికుడు మాత్రం కాదు అని చెప్పవచ్చు. మతం విషయంలో ఆయన మేధమీద పరిపరివిధాల పోయింది.
ఆ రోజులలో తెలుగు సంస్కారులకు బెంగాలీలు ఆదర్శం. బ్రహ్మో అవకుండా గురజాడ దానిని అభిమానించారు బౌద్ధం విషయంలోలాగే. బ్రహ్మసమాజం కన్నా ముందొచ్చిన అక్బర్ పాదుషా దిన్- ఇ -ఇలాహి ఆ కోవదే. కొత్తమతం పాత మతాలకు పరిష్కారం అనుకోలేము. బ్రహ్మసమాజం విగ్రహారాధన, దేవుడి అవతారాలకు వ్యతిరేకం. బ్రహ్మసమాజానికి బహుశా దిన్-ఇ-లాహి, కబీరులు ఆదర్శం. కబీర్ వంద గీతాలను బ్రహ్మో రవీంద్ర టాగోర్ ఆంగ్లంలోకి తర్జుమాచేసి ప్రచురింప చేశాడు. టాగోర్ గురజాడకు సాహిత్య మిత్రుడు. ఆ మైత్రే వందేమాతరం, జనగణమన ప్రభావంతో గురజాడచేత దేశభక్తి గేయం రాయించింది. ఐదవ జార్జ్ అంటే టాగోర్ లాగే గురజాడకు ఇష్టం. కవితా రాశారు. మరో చెంప కాంగ్రెస్ సమావేశానికి హాజరయ్యారు.
గురజాడలో బౌద్ధంపట్ల అమలిన ప్రేముంది. తృణకంకణం కట్టారు. పెళ్లి మాత్రం హిందూమతంతో అయి దానితోనే కాపురం చేశారు. “తన పఠనాగారంలో గౌతమబుద్ధుని ప్రతిమకు ప్రతి ఉదయమూ ఒక పుష్పాన్ని అర్పించేవారట.” ఆయన అభిమానించే కబీరుకు బుద్ధప్రేమ లేదు గనుక కబీర్ బౌద్ధాన్ని పరోక్షంగా విమర్శిస్తూ వచ్చాడు.
బౌద్ధమంటే తనకుగల మమకారాన్ని ఇలా వ్యక్తంచేసుకున్నారు గురజాడ: “దేనిని బుద్ధుడు మనకు ఉపదేశించాడో అదే నిజమైన ఉన్నతమైన ప్రేమ! మానవజాతిపై మనకు ఉండవలసిన ప్రేమ.. ఏనాడూ బౌద్ధమతం భారతదేశంలో తుడిచిపెట్టబడిందో ఆనాడే భారతదేశం మతవిషయిక ఆత్మహత్యను చేసుకుంది.” అంతేకాక – బుద్ధుడిని అవతారపురుషుడిగా మార్చుకోడంలోను మూర్ఖత్వం ఉందన్న ఉద్దేశంతో వెంకన్న “..మరి బుద్ధుడు ఇలాంటి మనిషే గదండి” అంటే; “చాకి బట్టెకీ [బట్టలుతుకుకునే కాలువ] సముద్రానికి సాపత్యం తెస్తివి” అన్నాడు శాస్తుర్లు. బౌద్ధులను చార్వాకులుగా భావించిన గురువులో ఎంత మార్పు!
ఏయే కారణాల వలన బౌద్ధం ఈ దేశంలో అంతరించిందో చరిత్రకారుడు గురజాడకు తెలియనివి కాదు. స్వయంకృతాపరాధం తక్కువపాలేమీ కాదు. Archaeological Surveys of Southern India Vol.IX లో ఆసక్తికరమైన అంశాలున్నాయి. భట్టిప్రోలు, గుడివాడ, ఘంటశాల, పెద్ద గంజాం స్తూపాల/ఆరామాలు పేర్లు ‘లంజల దిబ్బలు’. తన Buddhist Remains in Andhra and history of Andhra లో Dr K.R. Subramanian ఆంధ్రాలో ప్రతి బౌద్ధ దిబ్బ లంజదిబ్బ లేక భోగం దిబ్బ అని, కొందరు ‘సాని’ అన్న పదం (బౌద్ధ) ‘స్వామిని’ నుంచీ వచ్చిందని భావించారని, స్తూపాలను ‘రాక్షస గుళ్ళు’ అని పిలిచేవారని అన్నారు. బౌద్ధ ఆరామాలలో పరస్పర ఘర్షణలు తీవ్రరూపం చెంది పాలకులు కలుగజేసుకుని వాటిని మూసేయించవలసి వచ్చిందట. విజయనగర సంస్థానంలో సుబ్రమణియన్ అధ్యాపకుడిగా ఉంటూ 1929లో పరిశోధన చేశారు. అలా బౌద్ధమంటే ఉన్న ద్వేషంతో బ్రాహ్మణ మతం వారు ప్రచారం చేశారు అని ఆ సత్యాలను తోసిపారెయ్యలేరు.
ఎక్కువమంది నిపుణులు సరిహద్దు ఆవలి నుంచి వచ్చిన ఇస్లామీయుల దాడులు బౌద్ధం అంతరించడానికి ముఖ్యకారణం అంటారు. అశోకుడి ప్రోత్సాహంవలన ఉన్నత దశకు చేరిన బౌద్ధం అతని తదనంతరం క్రమంగా అంతరించింది. ఏడో శతాబ్దంలో దేశంలో ప్రవేశించిన ఇస్లాము 1300 సంవత్సరాల తరువాత కూడా దినదిన ప్రవర్ధమానమవుతోంది. ఐదొందలేళ్ళనాడు [నిజానికి ఒకటో శతాబ్దంలో] ప్రవేశించిన క్రైస్తవం చైతన్యమంతంగా వుంది. వాటికిని హిందూమతం ఎందుకు అరికట్టలేకపోయింది? ప్రేమతత్త్వానికి వస్తే, క్రైస్తవమూ దాన్ని ప్రవచించింది. మానవజాతిపై తనకు గల ప్రేమ కారణంగా క్రీస్తు శిలువ ఎక్కాడని ఆ మతం చెప్పుకుంటోంది. చెంఘీజ్ ఖానుది బౌద్ధమతం. తైమూర్, ఘజని, ఘోరీ, ఒసామా బిన్ లాడెన్ ది ఇస్లాం, ఇరాక్‌ను ధ్వంసం చేసిన జార్జ్ బుష్, జపాన్ పై అణుబాంబును వదిలిన ట్రూమాన్ క్రైస్తవులు. అశోకుడు బౌద్ధం పుచ్చుకున్న తరువాతే కళింగ యుద్ధం చేశాడు. ప్రేమతత్త్వం ఏ మతం సొంత ఆస్తికాదు; నిజానికి దానికీ మతానికీ తప్పనిసరిగా అనుసంధానం ఉండాలని లేదు. ఏ మతం గొప్పదనమైన దానిని అనుసరించేవాళ్ల స్వభావం మీద, ప్రవర్తన మీద, వ్యక్తిత్వం మీద ఆధారపడుంటుంది; మత సూత్రాలమీద కొంతమేరకే, మతం ఏ మానవుడి మౌలిక స్వభావాన్ని మార్చగలదని అనుకోనక్కరలేదు.
“మనిషిచేసిన రాతిబొమ్మకు మహిమకలదని సాగి మొక్కుతూ..” అంటూ విగ్రహారాధనను నిరసించిన గురజాడ అసలు అది బౌద్ధం నుంచే పుట్టిందన్న వాదనను పట్టించుకోలేదు. బుద్ధుడు చనిపోయిన 225/250 ఏళ్లకు శవాన్ని పెకిలించి 84,000 శరీర ధాతువులను రాజ్యం నలుమూలలకు అశోకుడు పంపాడని బౌద్ధులు చెప్పుకున్నట్టు చరిత్రలో ఉంది సాధ్యాసాధ్యాలమాట పక్కనుంచీ. బుద్ధుడు తనను పూజించద్దు అని శిష్యులకు చెప్పాడు; కానీ తన అవశేషాలకు చక్రవర్తికి ఇవ్వవలసిన గౌరవం ఇవ్వండని ఆదేశించాడు. చాలా స్తూపాలు మాత్రం బుద్ధుల [బుద్ధుడివాటితో సహా] శరీర ధాతువుల మీద వెలసి గోపురాలు లేని గుళ్ళుగా వాటిని కొలిచారన్న విషయం గురజాడవారి దృష్టిలో ఉన్నట్టులేదు.
పాలీ భాషా పండితుడు Dr TW Rhys Davids బుద్ధుడు హిందువుగా పుట్టాడు, అలానే పెంచబడ్డాడు, హిందువుగానే జీవించాడు, మరణించాడు అన్నారు. బుద్ధుడి జీవితకాలంలో ఆయనను హిందువుగానే భావించారట. హిందూమహాసముద్రంలో సునామీలా పుట్టిన బౌద్ధం తల్లినే అతలాకుతలం చేసి, ఒడిని చేరి, విశ్రాంతి తీసుకుంటోంది.
మతం మాసిపోవాలని కోరుకున్నారు గురజాడ. అది మహాకవి మహాస్వప్నం. మత విశ్వాసాలనేవి ఆచరణకు అసాధ్యమైనవి; నిరోధకమైనవి; గుదిబండలవంటివి అన్నారాయన. క్రీస్తు Man cannot live on bread alone అన్నాడు. మనిషి మనుగడకు తిండేకాక దైవ చింతనా అవసరమని అర్థం. మతం గురించీ మార్క్స్ అన్నమాటలను ఒదులుగా ఇలా తర్జుమా చేశాను:
మనిషి మతాన్ని సృష్టిస్తాడు, మతం మనిషిని సృష్టించదు అని మత వ్యతిరేకులు అంటారు.. మతం అణగదొక్కబడిన జీవి నిట్టూర్పు, హృదయరాహిత్య ప్రపంచ హృదయం, ఆత్మరహిత స్థితిగతుల ఆత్మా. అది జనాలకు [బాధనుంచీ ఉపశమనాన్నిచ్చే] మత్తుమందు. మత్తుమందును, భ్రమపూరిత ఆనందాన్ని జనం ఒదులుకోవాలంటే దాన్ని ఒక అవసరంగా మార్చిన పరిస్థితులు లేకుండాపోవాలి.. మతాన్ని విమర్శించడం కన్నీటిలోయకు తలపైని కాంతివలయంగా ఉపయోగపడే దానిని విమర్శించడం..
గురజాడ సంధ్యావందనం చేసేవారని, పురోహితుడి చేత దేవతార్చన చేయించేవారని ఆయన తనయ పులిగెడ్డ కొండాయమ్మ ఓ లేఖలో అన్నారు. 22-1-1898, శనివారం, గురజాడ దినచర్య నమోదిలావుంది: సూర్యగ్రహణము. ఉదయమే అక్కాబత్తుళ్ల నిద్దరిని నియమించవలెను. గ్రహణకాలములో బంగారము, వెండి, రాగి కల్పిన మిశ్రమముతో ఎన్ని ఉంగరములు చేయగలడో అన్నింటినీ చేయించవలెను.
(సమాప్తం)