ప్రముఖ కవి శ్రీ చందలూరి నారాయణరావు ప్రత్యేక ఇంటర్వ్యూ

1
4

[సంచిక పాఠకులకు ప్రముఖ కవి శ్రీ చందలూరి నారాయణరావు గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ అందిస్తున్నాము.]

(వృత్తిరీత్యా ఉపాధ్యాయులైన శ్రీ నారాయణరావు 1992 నుంచి అంటే డిగ్రీ చదివే రోజుల నుంచి కవితలు రాస్తున్నారు. ఇప్పటి వరకు 875 కవితలు పైగా వివిధ పత్రికలో ప్రచురితమయ్యాయి. ‘మనం కాసేపు మాట్లాడుకుందాం’ (2018), ‘మనిషి గుర్తులను బ్రతికించుకుందాం’ (2022) అనే కవితా సంపుటులు వెలువరించారు. శ్రీశ్రీ, వేమన, గుంటూరు శేషేంద్ర శర్మ, జాషువా తన అభిమాన కవులనీ, వారి ప్రభావం తనపై ఉందంటారు)

~

సంచిక టీమ్: నమస్కారం నారాయణరావు గారూ.

నారాయణరావు: నమస్కారం.

ప్రశ్న 1. ‘మనిషి గుర్తుల్ని బ్రతికించుకుందాం’ కవితాసంపుటిని వెలువరించినందుకు అభినందనలు. ఇందులోని కవితల ఏకసూత్రతని వివరిస్తారా?

🌻 నా కంటికి కనిపించిన ప్రతి దృశ్యాన్ని మనసుతో ఆలోచించడం అలవాటుగా మారడం అందులో ఎక్కువ శాతం మనిషి, సమాజం, మనసు, విలువలు నేపథ్యంగా సాగేవే నా కవితలు.

ప్రశ్న 2. కవిత్వం అనేది అనుభూతి ప్రధానమైనది. ఎలాంటి అనుభూతులు మీ విభిన్నమైన కవితలకి ప్రేరణగా నిలిచాయి? కొన్ని ఉదాహరణలు చెప్పండి.

🌻 మనసుని వేటాడేవి, మనసుని బాధించేవి, మనసుని ప్రశ్నించేవి పలురకాల అనుభవాలు పునాదిగా నా కవిత్వం సాగుతుంది. ఉదాహరణకు మా ఇల్లు ఓ గొప్ప అనుభూతి. దాని వెనుక విలువతో కూడిన పెంపకంలో మా అమ్మ, నాన్నల కృషి, కష్టం నా మనసుపై చెరగని ముద్ర.. దాని ఫలితంగా పుట్టిన కవితలే – అమ్మ,నాన్న, అపాత మధురం,పచ్చని వెలుగే అమ్మ,నడిచే దేవుడు నాన్న.

ప్రశ్న 3. ఈ కవితలలోని ప్రజల బాధలు వేదనలు మీకు ప్రత్యక్షంగా అనుభవం కాకపోయి ఉండచ్చు. సామాన్యుల కడగండ్లని మీ అనుభవంలోకి తెచ్చుకుని ఎలా వ్యక్తీకరించగలిగారు?

🌻 నా అనుభవం అంటే నా కంటి ఎదురుగా జరిగినవి, చూసినవి అని అర్థం. నేను నా చుట్టూ ఉన్న సమాజంలో పలు బాధలు పడుతూ నలిగి మనుషుల జీవితాలను దగ్గరగా చూసాను. అవన్నీ నాకు వస్తువులే.. నన్ను ఆలోచింపచేసిన వేదనలే.

ప్రశ్న 4. కవిత్వమంటే కష్టాలు, కన్నీళ్ళు, కడగండ్లు మాత్రమేనన్న అభిప్రాయం పాతుకుపోయింది. ప్రకృతి కవిత్వం, భావ కవిత్వం, రొమాంటిక్ కవిత్వం – ఇవన్నీ కవితా ప్రక్రియలలో భాగాలే కదా. మరి ఆధునిక కవులు వీటిని విస్మరించడానికో/తక్కువ ప్రాధాన్యమీయడానికో కారణం ఏమిటని మీరు భావిస్తున్నారు?

🌻 ఆధునిక కవులు తమ అనుభవానికి దగ్గరగా ఉండే కొత్త పోకడలతో వ్రాయడం గమనించవచ్చును. చాలా మంది ఈ కాలానికి తగిన భాషను, శైలిని ఎంచుకోవడం చూస్తున్నాము కదా. చిన్న చిన్న మాటల్లో గొప్పగా అర్థాన్ని చెప్పే ప్రయత్నంలో వెలువడే కవిత నేటి యువతను ఆకర్షిస్తుంది.

ప్రశ్న 5. కవితకి లయ ప్రధానమా? వస్తువు ప్రధానమా? భావ వ్యక్తీకరణ ప్రధానమా? మీరు దేనికి ప్రాముఖ్యతనిస్తారు?

🌻 భావవ్యక్తకరణ ముఖ్యం. కొన్నిటిలో వస్తు ప్రధానం కూడా వ్రాసుకున్నాను. ఏదైనా సులభంగా అర్థం అయెలా వ్రాయడం ముఖ్యం.

ప్రశ్న 6. ఉపాధ్యాయుడిగా బాధ్యతలు నిర్వహిస్తూనే కవితా రచనకి సమయం ఎలా కేటాయించగలుగుతున్నారు?

🌻 కవిత్వం నాకు జీవితంలో ఓ భాగం. నిత్యం ఏదో అంశం గురించి ఆలోచించడం అలవాటై, వాటిని అక్షరాల్లో నింపడం బాగా ఇష్టం. ఈ విధంగా రోజూ ఉదయం, రాత్రి ఓ నాలుగు గంటలు పాటు నేను కేటాయించడం అలవాటుగా మారింది.

ప్రశ్న 7. ‘మనిషి గుర్తుల్ని బ్రతికించుకుందాం’ అనే కవిత నేపథ్యాన్ని వివరిస్తారా? అలాగే ‘బ్రతుకు అర్థాన్ని చూసుకుని’ కవిత గురించి వివరించండి.

🌻 ఒక మనిషి జీవితంలో తన కళ్ల ఎదుటే వచ్చిన ఎన్నో మార్పుల రాకలో తను పోగొట్టుకున్న విలువలు గురించి వ్రాసిన కవిత ఇది. మార్పు అనివార్యం కావచ్చును కానీ, మనసు మనుగడలో మనిషి కొన్ని గుర్తులను కాపాడుకోవాలి.. ఎంత ఎదిగినా మనిషి విలువతో కూడిన మానవ చింతన అవసరం. అది లేకపోతే ఈ విపరీత సుఖాల పరుగులో జీవిత పునాదులను మరువడం జరుగుతుంది. తనకు ఎదురుగా కనిపించే ఓ పెద్ద పుస్తకం ఒక మనిషి అనుభవం. వాటి నుండి పొందే నైతిక విలువలు మరెక్కడా దొరకవు.

‘బతుకు అర్థాన్ని చూసుకుని..’ అనే కవిత మా నాన్న గురించి వ్రాసినది. నూరు శాతం చిన్నప్పటి నుండి ఆయన చేసిన అర్చక వృత్తిలో ఎదురైన కష్టాలు బాగా తెలుసు నాకు. ఒక వైపు భక్తి, మరొకవైపు అదే భుక్తి మధ్యలో నడిచే ఓ సామాన్య పూజారి బతుకు ఎలా ఉంటుందో చూసాను. ఆర్థికంగా ఎంత బాధపడినా నైతికంగా నిర్వర్తించే వృత్తి ధర్మం అర్చకత్వము. దాని నుండి పుట్టినదే ఈ కవిత.

ప్రశ్న 8. ఈ సంపుటిలో మీకు బాగా నచ్చిన కవిత ఏది?

🌻 ‘విశాలంగా పారేదే కన్నీరు..’, ‘దేవుడి భయం..’, ‘దొంగల పరపతి’

ప్రశ్న 9. ఈ సంపుటిలో ఏ కవితని రాయడానికి మీరు ఎక్కువ కష్టపడ్డారు?

🌻 ‘రైతు బానిసా?’, ‘చిన్నతోక.. పెద్ద లోపం’

ప్రశ్న 10. ఈ పుస్తకం ద్వారా సమాజానికి మీరిచ్చే సందేశం ఏమిటి? మీ తోటి కవులకు చూపే ఆదర్శం ఏదైనా ఉందా?

🌻 ప్రతి మనిషి మనసు మూలంలోకి వెళ్ళి అన్వేషించడం నేర్చుకుంటే కొన్ని నిజాలు తెలుస్తాయి. అవే మనసు మనుగడకు మూలాలు. వాటిని గుర్తించి గ్రహించిన అనుభవం చెప్పే పాఠం గొప్ప సందేశం అవుతుంది. సమస్య లోతులోకి వెళ్ళి, సంఘర్షణ జరిగితేగాని ఏ రచనకైనా విలువ రాదు. అలాంటి అడుగులు వేసే భావం నడిపే కవనం శాశ్వతం.. ఈ విషయాన్ని ప్రతి ఒక్క కవి గుర్తుపెట్టుకోవాలి.

ప్రశ్న 11. ఈ పుస్తకం ప్రచురణ అనుభవాలు చెబుతారా? అమ్మకాలు ఎలా ఉన్నాయి? మార్కెటింగ్ ఎలా చేశారు?

🌻 ఓ పిచ్చి ప్రేమ అక్షరం అంటే.. ఏదో ఒక కవిత ద్వారా నా వంతు సాహితి సేవ చేయాలని ఇష్టం. ఆ ఇష్టమే సొంత ఖర్చులతో పుస్తకాన్ని అచ్చువేయించుకోవడం, ప్రచారం చేసుకోవడం తప్పడం లేదు. ఒక రచయిత మరొక రచయిత రచనలు చదవడం లేదు.. తను రచన గురించే ఆలోచన మాత్రమే ఉంటుంది. ఇక పుస్తకాలు అమ్మకాలు అనే ఆలోచన రాలేదు. ఇప్పటివరకు.. అభిమానులకు, తెలిసిన వారికే ఉచితంగా పంచి తన ఉనికిని చూపు కోవడం సరిపోతుంది. ఎవరన్నా వచ్చి పుస్తకాలు అచ్చు వేసి, పంచుదామంటే అంత కన్నా సంతోషం ఏముంటుంది. అలాంటి కాలం మునుముందు వస్తే చాలా సంతోషంగా ఉంటుంది.

ప్రశ్న 12. భవిష్యత్తులో ఎలాంటి రచనలు చేయాలనుకుంటున్నారు?

🌻 తెలుగు నాట క్రమంగా ప్రాథమిక స్థాయి నుండి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి తెలుగును దూరం చేస్తున్న ఈ రోజుల్లో కవిత్వం అనే కళను ఎలా కాపాడుకోవాలి అనే ప్రశ్నకు సమాధానమే నా లక్ష్యం. అతి సులభం భాషలో, అతి సున్నితంగా మెత్తని భావాలను తక్కువ నిడివిలో వ్రాయడానికి ప్రయత్నం చేస్తున్నాను. నేడు కుటుంబాల్లో మనిషి సమస్యలకి మూల కారణాలని గుర్తించి, వాటిపై అవగాహన కలుగచేసే రచనలు చేయాలని కోరిక.

~

సంచిక టీమ్: విలువైన సమయాన్ని కేటాయించి, సంచిక కోసం ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ధన్యవాదాలు నారాయణరావు గారు.

నారాయణరావు: మీకు కూడా ధన్యవాదాలు.

***

మనిషి గుర్తుల్ని బతికించుకుందాం (కవిత్వం)
రచన: చందలూరి నారాయణరావు
ప్రచురణ: సాహితీ స్రవంతి
పేజీలు: 133
వెల: ₹ 100
ప్రతులకు:
విశాలాంధ్ర బుక్ హౌస్, అన్ని శాఖలు
ప్రజాశక్తి బుక్ హౌస్, అన్ని శాఖలు
రచయిత: 9704437247

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here