మహాభారత కథలు-19: దేవదానవులు – వారి అంశలతో వీరుల పుట్టుక

0
3

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

[dropcap]జ[/dropcap]నమేజయుడు వైశంపాయనుణ్ని “మహర్షీ! దేవదానవుల అంశలతో భూమి మీద పుట్టినవాళ్ల గురించి చెప్పే ముందు ఆ అంశలకి మూలకారణమైన వాళ్ల గురించి కూడా చెప్పండి!” అని అడిగాడు. వైశంపాయనుడు మానవజాతి పుట్టుక గురించి ఈ విధంగా చెప్పాడు.

సృష్టికి కారకుడైన బ్రహ్మదేవుడి మానస పుత్రులు ఆరుగురు ఉన్నారు. వాళ్లు మరీచి, అంగీరసుడు, అత్రి, పులస్త్యుడు, పులహుడు, క్రతువు. మరీచి అనే బ్రహ్మమానసపుత్రుడికి కశ్యప ప్రజాపతి జన్మించాడు. కశ్యపుడి వల్ల చరాచర భూతరాశి ఉద్భవించింది. బ్రహ్మ కుడిచేతి బొటనవేలి నుంచి దక్షుడు, ఎడమ చేతి బొటనవేలి నుంచి ధరణి అనే స్త్రీ జన్మించారు. ధరణికి, దక్షుడికి వెయ్యి మంది కుమారులు జన్మించారు. వాళ్లు ఇంద్రియ నిగ్రహంతో సాంఖ్య యోగాన్ని నేర్చుకుని తపస్సు చేసుకుందుకు వెళ్లిపోయారు.

తరువాత దక్షుడికి యాభై మంది కుమార్తెలు కలిగారు. వాళ్లల్లో పదిమందిని ధర్ముడికి, ఇరవై ఏడు మందిని చంద్రుడికి, పదమూడు మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం చేశాడు. దక్షుడు కశ్యపుడికి ఇచ్చిన కుమార్తెల్లో ‘అదితి’ అనే కుమార్తెకి ద్వాదశాదిత్యులు, ‘దితి’ అనే కుమార్తెకి హిరణ్యకశిపుడు అనే సాటిలేని పరాక్రమవంతుడు జన్మించాడు. హిరణ్యకశిపుడికి పరాక్రమవంతులు, గుణసంపన్నులు అయిన అయిదుగురు కుమారులు కలిగారు. ఆ అయిదుగురిలో ప్రహ్లాదుడికి విరోచనుడు, కుంభకుడు, నికుంభుడు అనే పేర్లతో ముగ్గురు కొడుకులు కలిగారు. విరోచనుడికి బలి, అతడికి బాణాసురుడు పుట్టారు.

‘దను’ అనే వనితకి విప్రచిత్తి మొదలైన నలభై మంది రాక్షసులు కలిగారు. వాళ్ల కొడుకులు, మనుమలు కలిసి లెక్కలేనంత మంది రాక్షసులయ్యారు. ‘కల’ అనే వనితకి వినాశుడు, క్రోధుడు మొదలైన ఎనిమిది మంది పుట్టారు. ‘అనాయువు’ అనే వనితకి గొప్ప పరాక్రమం కలిగిన విక్షర, బల, వీర, వృత్రులు అనబడే నలుగురు కొడుకులు కలిగారు. వాళ్లు నలుగురూ ఇంద్రుడికి శత్రువులు. ‘సింహిక’ అనే వనితకి రాహువు పుట్టాడు. ‘ముని’ అనే వనితకి భీమసేనుడు మొదలైన పదహారుమంది గంధర్వులు కలిగారు. ‘కపిల’ అనే వనితకి అమృతం, గోగణం, బ్రాహ్మణులు, అప్సరసలు జన్మించారు.

‘వినత’ అనే వనితకి అనూరుడు, గరుడుడు పుట్టారు. అనూరుడికి ‘శ్యేని’ అనే భార్య వల్ల సంపాతి, జటాయువు జన్మించారు. ‘క్రోధ’ అనే వనితకి క్రోధ వశగణం పుట్టింది. ‘ప్రాధ’ అనే వనితకి సిద్ధులు మొదలైనవాళ్లు కలిగారు. ‘క్రూర’ అనే వనితకి సుచంద్రుడు మొదలైనవాళ్లు పుట్టారు. ‘కద్రువ’ అనే వనితకి శేషుడు, వాసుకి మొదలైన గొప్ప సర్పరాజులు పుట్టాయి.

అంగీరసుడు అనే బ్రహ్మమానస పుత్రుడికి ఉతథ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు, గుణవంతురాలైన యోగసిద్ధి అనే కూతురు జన్మించారు. వాళ్లల్లో బృహస్పతి అన్ని లోకాల్లోను పూజలందుకుని దేవతలకి గురువుగా ప్రకాశించాడు.

అత్రి అనే మానసపుత్రుడికి ధర్మస్వభావం కలిగినవాళ్లు, వేదవేద్యులు, గొప్ప తేజస్సు కలిగినవాళ్లు, పుణ్యాత్ములు, తపస్సంపన్నులు, ఆద్యులు, సత్యపరులైన గొప్ప మహర్షులు జన్మించారు.

పులస్త్యుడు అనే బ్రహ్మమానస పుత్రుడికి అనేకమంది రాక్షసులు జన్మించారు.

పులహుడు అనే బ్రహ్మమానస పుత్రుడికి కిన్నెర కింపురుషులు కలిగారు.

క్రతువు అనే బ్రహ్మ మానసపుత్రుడికి పక్షి సంతతి జన్మించింది.

దేవుడు అనే మనువుకి ప్రజాపతి పుట్టాడు. ఆ ప్రజాపతికి ఏడుగురు భార్యలు. వాళ్లల్లో ‘ధూమ్ర’కి ‘ధరుడు’, ‘బ్రహ్మవిద్య’కి ధ్రువుడు, ‘మనస్వినిక’కి సోముడు, ‘రత’కి అహుడు, ‘శ్వస’కి అనిలుడు, ‘శాందిలికి’ అగ్ని, ‘ప్రభాతకి’ ప్రత్యూష, ప్రభాసులు అనే పేర్లు కలిగిన ఎనిమిదిమంది వసువులు కలిగారు.

ఆ వసువుల్లో ‘ధరుడి’కి ద్రవిణుడు, హుతహవ్యవహుడు అనేవాళ్లు జన్మించారు. ‘ధ్రువుడు’ అనే వసువుకి కాలుడు; ‘సోముడు’ అనే వసువుకి అతని భార్య మనోహర యందు వర్చసుడు, శిబిరుడు, ప్రాణుడు, రమణుడు అనే కుమారులు; పృథ అనే కూతురు పుట్టారు. ‘పృథ’కి పదిమంది గంధర్వులు పుట్టారు. ‘యహుడు’ అనే వసువుకి గ్యోతి జన్మించింది. ‘అనిలుడి’కి శివ యందు మనోజవుడు, అవిజ్ఞాతగతి జన్మించారు.

‘అగ్ని’కి కుమారుడు అనే పేరుగలవాడు పుట్టాడు. ‘ప్రత్యూషుడి’కి దేవలుడు అనే ఋషి జన్మించాడు. బృహస్పతి సోదరి అయిన ‘యోగసిద్ధి’ యందు ప్రభాసుడు అనే వసువుకి విశ్వకర్మ జన్మించాడు. విశ్వకర్మ దేవతల విమానాలు తయారు చేశాడు. అన్ని రకాల దేవతలకి సంబంధించిన ఆభరణాలు తయారుచేసి దేవతల్ని సంతోషపెట్టాడు. అతడు శిల్ప ప్రజాపతిగా ప్రసిద్ధికెక్కాడు.

‘స్థాణుడి’కి మానసపుత్రులుగా ఏకాదశరుద్రులు పుట్టారు. బ్రహ్మ ఎడమ చేతి నుంచి ధర్ముడు అనే ‘మనువు’ ఉద్భవించాడు. అతడికి శముడు, కాముడు, హర్షుడు అనే పేర్లుగల ముగ్గురు కొడుకులు పుట్టారు. ఆ ముగ్గురికి ప్రాప్తి, రతి, నంద అనేవాళ్లు భార్యలు. ‘సవితృడి’కి బడబరూపంతో త్వాష్ట్రికి, అశ్వినుడు జన్మించారు.

బ్రహ్మ హృదయం నుంచి భృగుడు జన్మించాడు. ‘భృగుడి’కి కవి జన్మించాడు. ‘కవి’కి శుక్రుడు జన్మించాడు. శుక్రుడు రాక్షసులకి గురువయ్యాడు. ‘శుక్రుడి’కి నలుగురు కుమారులు పుట్టారు. వాళ్లు రాక్షసులకి యజ్ఞికులయ్యారు. గొప్ప పుణ్యపురుషుడైన ‘భృగుడి’కి చ్యవనుడు జన్మించాడు. పూజ్యుడైన చ్యవనుడు, మనుకన్యక దంపతులకి ఊరులందు ఔర్వుడు జన్మించాడు. అతడికి ఋచీకాదులు అనబడే వందమంది కుమారులు కలిగారు.

వాళ్లల్లో ‘ఋచీకుడి’కి జమదగ్ని జన్మించాడు. ‘జమదగ్ని’మహామునికి నలుగురు కొడుకులు కలిగారు. వాళ్లల్లో పరశురాముడు శ్రీమహావిష్ణువు అవతారం. అతడు శత్రువుల్ని చంపి చిన్నతనంలోనే మహా గొప్పవాడుగా ప్రసిద్ధికెక్కాడు.

‘బ్రహ్మ’కి ధాత, విధాత అనే ఇద్దరు కుమారులు కలిగారు. వాళ్లు మనువుకి సహాయపడ్డారు. వాళ్లతోపాటు లక్ష్మి జన్మించింది. ఆమెకి మానస పుత్రులు అనేకమంది జన్మించారు. జ్యేష్ఠ, వరుణ దంపతులకి బలుడు అనే కుమారుడు, సుర అనే కుమార్తె జన్మించారు. ‘సుర’కి అధర్ముడు పుట్టాడు. అధర్ముడు, నిర్రుతి దంపతులకి భయ, మహాభయ, మృత్యువు అనే ముగ్గురు పుట్టారు.

‘తామ్ర’ అనే వనితకి కాకి, శ్యేని, భాసి, ధృతరాష్ట్రి, శుకి అనే అయిదుగురు కుమార్తెలు కలిగారు. కాకికి గుడ్లగూబలు; శ్యేనికి డేగలు; భాసికి భాసములు, గ్రద్దలు; ధృతరాష్ట్రికి హంసలు, చక్రవాకాలు; శుకికి చిలుకలు జన్మించాయి.

‘క్రోధుడి’కి మృగి మొదలైన తొమ్మిదిమంది కూతుళ్లు కలిగారు. వాళ్లల్లో మృగికి మృగాలు; మృగమందకి ఎలుగుబంట్లు, చిన్న పెద్ద చమరీ మృగాలు పుట్టాయి. హరికి కోతుల సమూహం; భద్రమనసకి ఐరావణం; ఐరావణానికి దేవగజాలు కలిగాయి. మాతంగికి గజాలు; శార్దూలికి సింహాలు, పెద్దపులులు; శ్వేతకి దిగ్గజాలు పుట్టాయి.

‘సురభి’కి రోహిణి, గంధర్వి, అనల కలిగారు. వాళ్లల్లో రోహిణికి పశువులు; గంధర్వికి గుర్రాలు; అనలకి కొండలు, చెట్లు, తీగెలు, తీగపొదలు పుట్టాయి. సురసకు సర్పాలు పుట్టాయి. సకల జీవాలు ఈ విధంగా జన్మించాయి. దేవతలు, మునులు, రాక్షసులు మొదలైన జీవుల పుట్టుక గురించి విన్నవాళ్లకి, చదివిన వాళ్లకి సుఖము, ఆయుష్షు, పుత్రలాభము, పాపక్షయము, గొప్ప వైభవము కలుగుతుంది!

వైశంపాయనుడు భూలోకంలో దేవతలు, రాక్షసుల అంశలతో జన్మించిన వీరుల గురించి జనమేజయుడికి వివరిస్తున్నాడు.

జగత్తుకి మొదటివాడు శ్రీమహావిష్ణువు. ఆయన అంశతో యాదవ వంశంలో దేవకీవసుదేవులకి శ్రీకృష్ణుడు జన్మించాడు. ప్రలంబుడు మొదలైన రాక్షసుల్ని సంహరించడానికి విష్ణుమూర్తి అంశతో రోహిణీ వసుదేవులకి సర్వజనులతోను పూజింపబడే ఆదిశేషుడు ‘బలదేవుడు’ అనే పేరుతో జన్మించాడు.

‘లక్ష్మీదేవి’ అంశతో రుక్మిణి జన్మించింది. ‘సనత్కుమారుడి’ అంశతో ప్రద్యుమ్నుడు, ‘అప్సరసల’ అంశలతో శ్రీకృష్ణుడి పదహారువేలమంది అంతఃపుర స్త్రీలు జన్మించారు. ఆ యా ‘దేవతల’ అంశలతో యదు, వృష్ణి, భోజ, అంధక వంశాల్లో అనేకమంది వీరులు జన్మించారు.

‘ప్రభాసువు’ అనే ఎనిమిదవ వసువు యొక్క అంశతో విద్యలన్నీ తెలిసినవాడు, తన బలపరాక్రమాలతో పరశురాముణ్ని జయించిన భీష్ముడు జన్మించాడు. దేవగురువైన ‘బృహస్పతి’ అంశతో ధనుర్విద్యా గురువు, ప్రజల మన్ననలు పొందినవాడు, అన్ని వేదాల్ని అభ్యసించినవాడు ద్రోణుడు జన్మించాడు. ‘కామక్రోధాల’ కలయిక వల్ల ద్రోణుడికి శత్రువుల్ని సంహరించేవాడు, అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరినవాడు గొప్పబలశాలి అశ్వత్థామ జన్మించాడు.

‘ఏకాదశ రుద్రుల’ అంశతో కృపుడు; ‘సూర్యుడి’ అంశతో కర్ణుడు; ‘ద్వాపర యుగం’ యొక్క అంశతో శకుని జన్మించారు. అరిష్టా పుత్రుడైన ‘హంసుడు’ అనే గంధర్వ రాజు ధృతరాష్ట్రుడుగాను, ‘మతి’ అనే దేవత గాంధారిగాను జన్మించారు. ఆ ఇద్దరికీ ‘కలి’ అంశతో దుర్యోధనుడు కలిగాడు. ‘పౌలస్త్య సోదర వర్గం’ వల్ల దుశ్శాసనుడు మొదలైన దుర్యోధనుడు సోదరులతో కలిసి నూరుగురు అన్నదమ్ములుగా పుట్టారు.

హిరణ్యకశిపుడు శిశుపాలుడిగాను; సంహ్లాదుడు శల్యుడిగాను; అనుహ్లాదుడు ధృష్ణకేతుడుగాను, శిబి అనేవాడు ద్రుమసేనుడుగాను జన్మించారు. బాష్కళుడు భగదత్తుడుగాను; విప్రచిత్తి అనే రాక్షసుడు జరాసంధుడు అనే రాక్షసుడుగాను; అయశ్శిరుడు అశ్వశీర్షుడుగాను, అయశ్శంకుడు, గగనమూర్ధుడు, వేగవంతుడు, అనే ఏడుగురు రాక్షసులుగా కేకయ రాజులుగా జన్మించారు.

కేతుమంతుడు అమితౌజుడుగాను; స్వర్భానుడు ఉగ్రసేనుడుగాను; జంభుడు విశోకుడుగాను; అశ్వపతి కృతవర్మగాను; వృషపర్వుడు దీర్ఘప్రజ్ఞుడుగాను; అజరుడు మల్లుడుగాను జన్మించారు. అశ్వగ్రీవుడు రోచమానుడుగాను; సూక్ష్ముడు బృహద్రథుడుగాను; దుహుడు సేనాబిందుడుగాను పుట్టారు.

ఏకచక్రుడు ప్రతివింధ్యుడుగాను; విరూపాక్షుడు చిత్రవర్మగాను; హరుడు, అహరుడు బాహ్లికులుగాను; చంద్రవక్త్రుడు ముంజకేశుడుగాను; నికుంభుడు దేవాపిగాను; శరభుడు సోమదత్తుడుగాను; చంద్రుడు చంద్రవర్మగాను; అర్కుడు ఋషికుడుగాను; మయూరుడు విశ్వుడుగాను జన్మించారు.

సువర్ణుడు క్రోధకీర్తిగాను; రాహువు క్రోథుడుగాను; చంద్రహంత శునకుడుగాను; అశ్వుడు అశోకుడుగాను; భద్రహస్తుడు నందుడుగాను; దీర్ఘజిహ్వుడు కాశీరాజుగాను; చంద్రవినాసనుడు జనకిగాను; బలీనుడు పౌండ్రమత్స్యుడుగాను; వృత్రుడు మణిమంతుడు గాను జన్మించారు. కాలాపుత్రులు ఎనిమిది మంది వరుసగా జయత్సేన, పరాజిత, నిశధాధిపతి, శ్రేణి, మన్మహౌజు, అభీరు, సముద్రసేన, బృహత్తులుగా జన్మించారు.

క్రోథ వశగణాల వల్ల మద్రక, కర్ణ, వేష్ట, సిద్ధార్థ, కీటక, సువీర, సుబాహు, మహావీర, బాహ్లిక, క్రథ, విచిత్ర, సురథ, శ్రీమన్నీల, చీరవాస, భూమిపాల, దంతవక్త్ర, రుక్మి, జనమేజయ, ఆషాఢ, వాయువేగ, భూరితేజ, ఏకలవ్య, సుమిత్ర, వాటధాన, గోముఖ, కారూషకక్షేమ, ధూర్తి , శ్రుతాయు, రుద్వహ, బృహత్సేన, క్షేమాగ్ర, తీర్థకుహర, మతిమది, ఈశ్వరాదుడు, అనేటటువంటి అనేకమంది జన్మించారు.

కాలనేమి కంసుడుగా పుట్టాడు. నపుంసకుడైన గుహ్యకుడు శిఖండిగా పుట్టాడు. మరుద్గణాల అంశతో పాండురాజు పుట్టాడు. మరుత్తుల అంశలతో అనేక యుద్ధాలలో ఆరితేరినవాళ్లు శాశ్వతమైన కీర్తి, లోకంలో ప్రసిద్ధమైన చరిత్ర కలిగిన ద్రుపదుడు, సాత్యకి, విరాటుడు అనే ముగ్గురు జన్మించారు. మాండవ్య మహాముని తీవ్రమైన కోపంతో ఇచ్చిన శాపం వల్ల యమధర్మరాజు సమస్త ధర్మాల గురించి తెలిసినవాడు విదురుడుగా జన్మించాడు.

సిద్ది, బుద్ధి అనే దేవతలు కుంతిగాను, మాద్రిగాను పుట్టి అన్ని లోకాలకి ఇష్టమైన చరిత్ర కలిగిన పాండురాజుకి పట్టమహిషులయ్యారు. యముడి అంశతో ధర్మరాజు; వాయుదేవుడి అంశతో భీముడు; ఇంద్రుడి అంశతో అర్జునుడు; అశ్వినుల అంశతో నకులసహదేవులు పుట్టారు. లక్ష్మి అంశతో ద్రౌపది; అగ్ని అంశతో దృష్టద్యుమ్నుడు ద్రుపదరాజ వంశంలో పుట్టారు.

దేవాసురుల అంశలతో భూమి మీద జన్మించిన వాళ్ల చరిత్ర గురించి విన్నవాళ్లకి చదివినవాళ్లకి దేవాసురులు కోరికలు తీరుస్తారు!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here