ఏనుగును పెంచుకుందాం

0
9

[డా. కందేపి రాణీప్రసాద్ గారి ‘ఏనుగును పెంచుకుందాం’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]ఒ[/dropcap]కసారి నేను ‘మా బుడుగు’లో మా పెద్దాడి విశేషాలను రాస్తే వాడేమో చదువుకొని సిగ్గుపడ్డాడు. చిన్నావాడేమో చిన్న బుచ్చుకున్నాడు వాడి గురించేమి రాయనందుకు. ఎందుకొచ్చిన గొడవ! చిన్నవాడి అల్లరి పనులు కూడా మీకు చెప్పేస్తే ఓ పనైపోతుందని ఈ రోజు రాస్తున్నాను. వాడు చిన్నప్పుడు తెల్లగా, బొద్దుగా పట్టుకుచ్చులాంటి మెరిసే జుట్టుతో అచ్చం జాన్సన్ బేబీలా ఉండేవాడు. వాడి జుట్టు కొంచమే ఉన్నా మెరుస్తూ నున్నగా ఉండటంతో అందరూ ‘ఏయ్ సిల్కీ’ అని పిలిచే వాళ్ళు. ఇంతకి చెప్పనే లేదు కదూ! మా వాడి పేరేంటో. వాడి పేరు మిల్కీ. అందరేమో సిల్కీ అనేవాళ్ళు.  గుండ్రంగా బొద్దుగా పుష్టిగా ఉన్న మా బాబును చూసిన అందరూ ‘ఆ! వాళ్ళ నాన్న డాక్టరు కదా! మంచి మందులు, పళ్ళు వాడి పిల్లాడ్ని అందంగా తయారు చేశారు’ అనుకునేవాళ్ళు. ఇంకా కొంతమంది పేషెంట్లయితే “సారూ! మీ కొడుకులాగా లడ్డుగయ్యేలా మంచి మందులు రాసియ్యి దొర” అనడిగే వాళ్ళు. అప్పుడు మేం పెద్దవాణ్ణి చూపించేవాళ్ళం. వాడు సన్నగా చలాకీగా ఉండేవాడు. “లావుగా ఉండటం. సన్నగా ఉండటం అనేది వాళ్ళ వాళ్ళ శరీర తత్వాల బట్టి ఉంటుంది. బొద్దుగానే కాదు, ఆరోగ్యంగా ఉంటే చాలు” అని చెప్పి పంపేవారు మా వారు. మా సిల్కీ మిల్కీ దోగాడుకుంటూ వెళ్లి వాళ్ళ నాన్న పేషంట్లను చూసే టేబుల్ కింద కూర్చునేవాడు. పిల్లాణ్ణి ఎవరన్నా తొక్కుతారేమోనని భయంతో నేను ఎన్నిసార్లు ఇవతలికి తీసుకొచ్చినా తను మరలా వెళ్లి అలాగే టేబుల్ కింద కూర్చునేవాడు. ఓ రోజు అలాగే ఫోటో తీశాను వాడు పెద్దయ్యాక చూపిద్దామని. ఇప్పుడు ఫోటో చూపిస్తుంటే “నన్ను అలా వదిలేసి నువ్వేం చేస్తున్నావు అమ్మా” అని నన్నే నిలదీస్తున్నాడు.

పిల్లలిద్దరినీ తీసుకొని మేం ఎవరింటికైనా వెళితే వాళ్ళు మాకు కాఫీ ఇస్తూ పిల్లలకూ ఇచ్చేవాళ్ళు. వెంటనే మా మిల్కీ “మేం కాఫీ తాగం. అందులో ‘కెఫిన్’ అనే మత్తుపదార్థం ఉంటుంది. అందుకని మేం తాగం” అని చెప్పేవాడు. “మరీ మేమందరం తాగుతున్నాం కదా” అని వాళ్ళు మళ్ళీ అడిగితే “మీరు పెద్దవాళ్ళు మేం చిన్న పిల్లలం!” అని గడుగ్గాయిలా సమాధానం చెప్పేవాళ్ళు. వాళ్ళు ‘అమ్మో వీళ్ళు డాక్టరు పిల్లలు కదా భలే విషయాలు తెలుసుకున్నారు’ అంటూ నవ్వుకునే వాళ్ళు. మేం ఇంటికొచ్చాక ఇంట్లో వాళ్ళతో ‘ఇందాక ఫ్రెండ్స్ వాళ్ళింట్లో కాఫీ తాగుతారా అంటే అందులో కెఫిన్ ఉంటుందని చెప్పారు పిల్లలు’ అని అక్కడి విషయాలు చెప్పాం. అప్పుడు మా తమ్ముడు “ఒరేయ్ కాఫీలో కెఫిన్ ఉంటుందని చెప్పడం కాదురా! టీ లో ఏముంటుందో చెప్పారా?” అన్నాడు. వాళ్ళకేమి అర్థం కాక “ఏమో మామయ్య? నువ్వే చెప్పు!” అన్నారు. “కాఫీలో కెఫినుంటే టీ లో ఏముంటది రా! టిఫిను ఉంటుంది. ఈ సారి ఎవరైనా అడిగితే ఇలాగే చెప్పండి” అన్నాడు. వాళ్ళు నిజమే అనుకుని “సరే మామయ్య!’ అన్నారు. మా తమ్ముడి జోక్కీ, మా పిల్లల అమాయకత్వానికి మేమంతా నవ్వీ నవ్వీ పొట్ట చెక్కలయింది. మేమెందుకు నవ్వుతున్నామో అర్థం కాక వాళ్ళు నవ్వేశారు మాతో కలసి.

మావారికి జంతువులంటే ఇష్టం ఉండటం వలన ఇంట్లో ఎప్పుడూ కుక్కలే కాకుండా పావురాళ్ళు, కుందేళ్ళు, చిలుకలు, పిల్లులు, గొర్రెలు, కోళ్ళు ఇలా ఏవో జంతువులు ఉంటూనే ఉంటాయి. మా మిల్కీకి వీటన్నింటినీ చూసి బోర్ కొట్టిందేమో ఒకరోజు సడన్‌గా నాతో “అమ్మా మనం ఒక ఏనుగును పెంచుకుందామమ్మా” అని ముద్దుగా అడిగాడు. వాడేమన్నాడో అర్థం కాక నా తల తిరిగిపోయింది. “ఏనుగుని ఇంట్లో ఎవరూ పెంచుకోరమ్మా!” అని చాలా నిదానంగా బుజ్జగింపుగా చెప్పాను. “ఏం కాదు నేను చాలా సినిమాల్లో చూశాను. ఏనుగుల్ని పెంచుకుంటారు” మా వాడు స్థిరంగానే ఉన్నాడు. “వచ్చే నెలలోనా బర్త్ డేకి డ్రెస్ వద్దులే. ఏనుగు చాలు!” అన్నాడు మా మిల్కీ ‘నీక్కొంచం భారం తగ్గిస్తానులే’ అనే ఫీలింగుతో. ఇక అర్థమయింది ఈ విషయంలో వాడు ఫిక్సయ్యాడని. ఇక మెల్లగా వాడితో మాట్లాడటం మొదలుపెట్టాను. “ఏనుగు మన ఇంటికన్నా చాల ఎత్తుగా ఉంటుదమ్మా. ఏనుగు ఇంట్లోకి రావాలంటే మనింటి కప్పు తీసేయాలి. కప్పు తీసేయచ్చు కానీ వర్షం వచ్చిందనుకో ఇల్లంతా తడిసిపోతుంది. మన బెడ్ కూడా తడిసిపోతుంది. మనమెక్కడ పడుకుంటాము చాల కష్టం కదా!” ఇలా చెప్తూ పోతున్నా నేను. “అమ్మో వర్షం వస్తే పుస్తకాలు కూడా తడిసిపోతాయి. హోం వర్కు మళ్ళీ చేయమంటుంది మా మిస్” అంటూ పుస్తకాల బ్యాగు ఎక్కడుందో వెతుక్కొని జాగ్రత్తగా ఒక మూల పెట్టుకున్నాడు. “అందుకనే ఏనుగును పెంచుకోలేము” అన్నాను నేను వెంటనే కాసేపాగితే మళ్ళా వాడు మనసు మార్చుకుంటాడేమోనని. మావాడు మౌనంగా ఆలోచిస్తూ “పెద్దదాన్ని తెచ్చుకుంటే ఇంటి కప్పు తీసేయాల్సుంటుంది. కానీ ఏనుగు పిల్లను తెచ్చుకుంటే ఏం కష్టముండదుగా. అప్పుడు వర్షమొస్తే నా పుస్తకాలు తడిచిపోవు. అమ్మా! అమ్మా! ఏనుగు పిల్లను తెచ్చుకుందామమ్మా!” అని నన్ను బ్రతిమాలటం మొదలుపెట్టాడు. ఏనుగు పిల్లంటే కుక్క పిల్లంత ఉంటుందనుకుంటున్నాడు వాడు. మా మిల్కీ కిష్టమైన చిన్న కుర్చీ ఏనుగు పిల్ల కోసం త్యాగం చేస్తానన్నాడు. అలా వాడికి తెలిసిన అన్ని పద్దతుల్లో ఏనుగును పెంచుకోవటానికి మమ్మల్ని ఒప్పించాలని ఎంత ప్రయత్నించాడో గుర్తు చేసుకుంటుంటే ఇప్పటికి నవ్వాగదు. అప్పటి వాడి అమాయకపు ముఖం గుర్తుకొస్తే బాల్యం ఎంత అందమైనది అన్పిస్తుంది. ఇన్ని చిలిపి పనులు చేసిన మా మిల్కీ ప్రస్తుతం మెడిసిన్ పూర్తి చేసి రోగగ్రస్థులను ఆరోగ్యవంతులను చేస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఇవండీ మా సిల్కీ మిల్కీ చిలిపి పనులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here