చిరునవ్వుల చిలక

    1
    6

    [box type=’note’ fontsize=’16’] “చిలకా గతమంతా వదలి పెట్టేయ్! ఈ మహానుభావుడు తల్లిదండ్రుల మాటకు కట్టుబడి నా మెళ్ళో ఈ తాళి కట్టారు. ఇప్పుడు నీ మెళ్ళో తాళి లేనంత మాత్రం చేత నువ్వు ఆయనకు భార్య కాకపోవు. ఇప్పుడు మనమంతా ఒక్కటే!” అంటుంది భూతులసి డా. మంతెన సూర్యనారాయణరాజు వ్రాసిన “చిరునవ్వుల చిలక” కథలో. [/box]

    [dropcap style=”circle”]“ఎం[/dropcap]తసేపూ నా ముఖం మీరు, మీ ముఖం నేనూ చూస్తూ కూర్చోవడమేనా లేక బైటికెళ్లి కూరలు, సరుకులు తెచ్చేదుందా!” అని భూతులసి భర్తని అడిగింది. “తులసీ! కాస్సేపు ఇంట్లో ప్రశాంతంగా కూర్చోనియ్యవు. ఎంత సేపూ నన్ను అక్కడికెళ్లండి, ఇక్కడికెళ్లండి అంటూ బైటికి తరిమేస్తావు. అంతటితో ఊరుకోవు, ఇంటి దగ్గర ఖాళీగా కనిపించినా సైకిల్ చక్కగా శుభ్రంగా తుడుచుకోండి. కర్రకు చీపురు కట్టే ఉందిగా ఆ పేరుకు పోయిన బూజులు దులపండి, చెప్పులకు, బూటులకు పాలిష్ చేసుకోండి, చూళ్లేక పోతున్నాం ఆ తల సరిగా దువ్వుకోండి. అంత బద్దకమైతే ఎలాగండీ అంటావు. నేను నీకంటికి ఎలాగ కనిపిస్తున్నానే! నేను గవర్నమెంటు ఆఫీషియల్‌గా రిటైరైన వాణ్ణే! కొంచెం గౌరవంగా మాట్లాడవే!” అన్నాడు గుణసుందరరావు..

    “స్వామీ మీకో నమస్కారం! మీరు ఎప్పుడో పది సంవత్సరాలనాడు చేసిన గొప్ప ఆఫీసరుద్యోగానికి ఓ పెద్ద దణ్ణం! ఈ ముక్కలు మీరు రిటైరైన పదేళ్లనుంచి నేను వినివిని చెవులు తూట్లు పడిపోయాయి. కొన్నాళ్లింకా యిలాగే అరిగిపోయిన గ్రామఫోను రికార్డులా చెప్పిందే చెప్పుకుంటూపోతే నాకు చెవుడు కూడా వచ్చేట్టుంది. ఎప్పటి మాటలో ఇప్పుడెందుకండి. అదివరకైతే మీ ఆఫీసులో ప్యూన్ కూరలు, సరుకులు అన్నీ తెచ్చేవాడు. అడ్డమైన అరవచాకిరీ చేసేవాడు కాదనను. ఇప్పుడు ఈ యింటికి రాజూ మీరే, సేవకుడూ మీరే! నే వెళ్తున్నా! మీతో పెట్టుకుంటే ఎప్పటికి నా వంట ప్రయత్నం పూర్తవుతుంది” అంటూ భూతులసి లోనికెళ్లిపోయింది.

     నోటు చూబెడుతూ “నువ్వెళ్లి ఆ కావలసిన సరుకులు, కూరలు తెచ్చుకో!” అన్నాడు గుణసుందరం. “ఏవిటేవిటి? నేను పచారీ కొట్టుకెళ్లి, కూరల బజారుకీ వెళ్లాలా! నాకసలే బి.పి., సుగర్ అధికంగా ఉంటే. ఇలాగైనా కొన్నాళ్లు ఇంటిచాకిరీ చేస్తూ బతకనివ్వండి. ఎప్పుడో మీ ముందే యిలా మీకు సేవ చేస్తూనే చిటుక్కుమంటాను” అంటూ సన్నాయి నొక్కులు నొక్కింది. తులసి. గత్యంతరంలేక అయిష్టంగానే గుణసుందరరావు పాత స్కూటర్ దగ్గరకు రెండు చేతిసంచీలు తీసుకుని మార్కెట్లోకి తనకు అన్నీ తేవడం తప్పదని గ్రహించి బయల్దేరిపోయాడు.

    భూతులసి పేపర్ చూస్తూ తనలో “ఈ మనిషికి పెళ్లమంటే అలుసే! ఆ దిక్కుమాలిన కన్నతల్లి కొడుకుని ఓ సోమరిలా పెంచింది. నిద్రపోయే మంచం మీద దుప్పట్లూ నేనే వెయ్యాలి. తెల్లవారాకా వాటిల్ని దులపనూ దులపాలి. బాత్రూమ్ కెళ్లి సోప్ అని పిలవగానే సబ్బు పట్టికెళ్లి ఇవ్వాలి. తన టూత్ బ్రష్ తీసి పేస్టు పెట్టి రాగి చెంబులో నీళ్లు తాగేందుకు బ్రష్ చేసాకా రెడీగా ఉంచాలి. ఇంకా మూడ్ బాగుంటే తులసీ నీ అమృతహస్తాలతో వీపు రుద్దవే అని పిలుస్తుంటాడు, అక్కడ కొన్ని తుంటరి పనులు చేయబోతాడు. ఈ దిక్కుమాలిన అలవాట్లేలా అబ్బాయో అర్థం కాదు. వాళ్లమ్మ – లేక లేక పుట్టిన మగ నలుసు ఈయన కావడంచేతే ఏ పనీ నేర్పిఉండదు. పెళ్లయ్యాకన్నా తన పంథా మార్చుకోవాలిగా! ఈయనకి అసలు దేనికీ వళ్లు వంగదు అనుకుంది.

    ఫ్రెష్‌గా, చక్కగా వున్న కాయగూరలు, ఆకుకూరలతో బాటు అన్నిరకాలైన సరకులూ నెలకు సరిపడా తెచ్చి భార్యకు ఇచ్చి, ఏదో అర్జెంటు పని ఉన్నట్లుగా “ఇప్పుడే వస్తాను” అని స్కూటర్ ఆపకుండా గిరుక్కున వెనక్కి తిప్పి వెళ్లిపోయాడు గుణసుందరరావు. భూతులసి “అదేమిటండీ! రెండోసారి టీతాగి వెళ్దురుగాని” అని అడిగింది. కాస్త పనుందిలే అని చెప్పి ఊరుకు దూరంగా వున్న కాలనీవైపు స్కూటర్‌ని పోనిచ్చాడు.

    గమ్మంముందు స్కూటర్ ఆపిన వ్యక్తిని చూసి చిలక గుమ్మంలో చిరునవ్వుతో ప్రత్యక్షమయ్యింది. “రండి ఎన్నాళ్లు మీ కోసం.. మీ రాకకోసం చాతక పక్షిలా నేను ఎదురు చూడాలి” అని అడిగింది. లోపలికి అడుగు పెడుతూనే గుణసుందరరావు చిలకమ్మ భుజంమీద చెయ్యివేసి పక్కకు లాక్కుంటూ “చిలకా! ఇటు ప్రేమని కురిపించే నీవు, అటు పతివ్రతాశిరోమణియైన భూతులసి. మన బతుకు అంటే ఐమీన్ నా లైఫ్ ఇంట్లో యిల్లాలు బైట….” అటూ ఆగాడు. “ఏం ఆగిపోయారే! బైట వెలయాలా… అనేద్దురూ! మా తప్పులేగాని మీ తప్పులు ఏం లేవని మీ మగజాతి గప్పాలు కొడుతుందిగా! ఉద్యోగం వచ్చిన కొత్తలో నాతో ప్రేమలో పడింది మీరు. హద్దు మీరింది మీరు. కాని మీ తల్లిదండ్రుల మాట కాదనలేక చేసుకున్న పెళ్లి ఆవిడతో, ఏ పాప నక్షత్రంలో పుట్టానోగాని నమ్మించి ద్రోహం చేసారని మిమ్మల్ని అనను. తాళి బొట్టుకు దూరమయ్యానని బాధ పడతా” అంది కంటనీరు గుక్కుకుంటూ చిలక.

    “సారీ! చిలకా! నీనవ్వంటే నాకిష్టం. అటువంటి నీనవ్వు కోసం ఇంతదూరం వస్తే నన్నిలా సత్కరిస్తావా! ముందా నీళ్ల టాప్ కట్టేసి, చిరునవ్వుల పలకరింపు ప్రారంభిచెయ్యి. ఏం నేను నీకేం లోటు చేసాను. నా సంపాదనలో నీ సగంవాటా నీకు అందజేస్తున్నానా లేదా! నువ్వు నాకు మా తులసికన్నా ముందుగా భార్య అయిన దానివి. అదీ మానసికంగా, శారీరకంగా నిన్ను అలక్ష్యం చేసానా! ఎప్పుడూ కూడా భార్యకన్నా ఎక్కువగా చూసుకుంటున్నానా లేదా!” అన్నాడు గుణసుండరరావు. చిలక లోనికి వెళ్లి గ్యాస్ స్టా వెలిగించి టీ పెట్టుకొచ్చి గుణసుందరానికి అందిస్తూ “ఏవండీ! మన అమ్మాయి నీళ్ళోసుకుందట. ఒక్కసారి చూసొద్దామా! మీరు కూడా వస్తే” అని అడిగింది. “దానికేం భాగ్యం అలాగే వెళ్దాం! నువ్వు నా దగ్గర నవ్వుతూ కూర్చుంటే ఆ హిమాలయపర్వతాల పైకి రమ్మన్నా వచ్చేస్తాను” అన్నాడు. “ఆ… ఆ కబుర్లు కట్టి పెడుదురూ! అమ్మాయి మంజూషను చూసొద్దాం! కొద్దిగా తీరిక చేసుకు రాగలరా మూడు గంటలకు బయల్దేరి…. పొద్దున్నే వచ్చేయొచ్చు” అంది. “చిలకమ్మ ఆర్డర్ వేస్తే మేం ఎలాకాదనగలం” అన్నాడు. భర్తధోరణికి చిలక కిలకిలా నవ్వింది.

    “ఆ… ఆ… ఆ నవ్వే ఆ….. నవ్వే నాకు కావాలి. నీ నవ్వే నాకు శ్రీరామరక్ష. నీకు అన్నివిధాలా అన్యాయం చేసాననుకుంటున్నావు కదూ! ఛ ఛ అటువంటి దురుద్దేశమే వుంటే నేనిలా ఉండేవాణ్ణికాదు. నీకోసం మన బిడ్డకోసం లకంత యిల్లు కట్టించి నీ పేర పెట్టాను. అంతేనా! మన బిడ్డకు తండ్రిగా నేను కన్యాదానం చేసి భగవత్సన్నిధిలో నా బాధ్యత నేను నెరవేర్చుకున్నా! నీ నిర్మల హృదయంలో నాకు ఎప్పటికీ చోటు నాదే కావాలి. ఎన్నింటికి రమ్మంటావు? ఇంట్లో అర్జెంటు పని తగిలిందని తులసికి చెప్పి వచ్చేస్తాను. మరి మంజూష కోసం ఏమైనా తినుబండారాలు గట్రా చేసి ఉంచావా! దానికిష్టమైనవన్నీ రెడీ చెయ్యి” అంటూ ఓ వెయ్యినోటు చిలకకు ఇచ్చి ఇంటికి బయల్దేరాడు గుణసుందరరావు.

    ***

    తనకు చిలకకు పుట్టిన బిడ్డ మంజూషను పలకరించి, అల్లుడైన అంబరీష్‌ని పలకరించాడు గుణసుందరరావు. చిలక తినుబండారాలను కూతురికి ఇచ్చింది. గుణసుందరరావు కూతురు తల నిమురుతూ “అమ్మా! నీకేంకావాలన్నా అవి కొనుక్కుని తిను. అల్లుడుగారు ఆఫీసుకెళ్తే ఎంత సేపూ టి.వి. చూడొద్దు. తీరికున్నప్పుడు మన రామాయణ, భారత, భాగవత గ్రంథాలు చదుపుతూ ఉండమ్మా! సాత్వికాహారంతో బాటు, ప్రొటీన్రిచ్ ఫుడ్ తీసుకో! ప్రతీనెలా గైనకాలజిస్టు దగ్గరకెళ్లి చెక్ చేయించుకో! వేళకి తింటూ వుండు” అని ఐదువేల రూపాయలు కూతురు మంజూష చేతిలో పెట్టాడు. ఆ తల్లిదండ్రులు తనను విడిచి వెళ్లబోతుంటే మంజూష “నాన్నా!” అంటూ తండ్రి దగ్గరకు పరుగున వచ్చి కౌగలించుకుంది. నీ ఆరోగ్యం జాగ్రత్త అని ఇద్దరూ వెళ్తూంటే మంజూష ఆ ఇద్దరికీ టాటా చెప్పింది. చిలక నవ్వుతూ “పాపా! నీకేం భయంలేదు. రెండు నెలల్లో నేను మన ఇంటికి తాళం వేసి ఇక్కడికొచ్చి నిన్ను కంటికి రెప్పలా కాపాడు కుందుకు రానూ! నాన్నగారు నెలా, పదిహేను రోజులకొక్కసారైనా వచ్చి చూసి పోతుంటారు. మరి వెళ్లిరామా!” అంది. అలాగే అన్నట్లు మంజూష తల ఊపింది.

    ఎలా తెలిసిందో గుణసుందరరావుకి మరో స్త్రీతో సంబంధముంది అని జనాలకి. ఆ మరో స్త్రీ ద్వారా ఒక కూతురు కలిగిందని, ఆమెకు పెళ్లి జరిగి గర్భవతయ్యిందనీ బంధుమిత్రులద్వారా భూతులసికి తెలిసింది. ఆమె ఉద్రేకపడిపోలేదు. మావారు అటువంటి వారుకాదు. కిట్టక మీరలా చెబుతున్నారని, వేశ్యలతో తిరుగడమెరుగని నైష్ఠికుడని వారి మాటల్ని తిప్పికొట్టింది తులసి. మరోవారం రోజుల్లో నీకు సవితి ఉంది. మేం చూసాము. ఆమె పేరు చిలక. చూడచక్కనైనది ఆమె అందం అన్నారు. అదీగాక నీకన్నా ముందుగానే ఆమెకు తాళి కట్టలేదు. తర్వాతే కట్టి ఉండొచ్చు. కానీ శారీరకంగా ఆ యిద్దరికీ ఎప్పట్నుంచో సంబంధం ఉంది అని మరో ఆమెకు నమ్మదగిన వ్యక్తి చెబితే వింది. తెలివైన భూతులసి ఆ ముచ్చట గురించి ఆరాతీసింది. కాని ఇల్లు పీకి పందిరెయ్యలేదు. అలాగని భర్తని నిలదీయనూలేదు. ఎప్పట్లాగే అతనికి చేదోడు వాదోడుగానే నడచుకుంటోంది.

    ఒకరోజున వారి ఊరువాడైన తెలిసిన లాయర్ తన ఇంటికి చూసేందుకు వచ్చాడు. “బాబాయ్ నా అనుమానాలు కొన్ని ఉన్నాయి అవి తీర్చగలనంటే అడుగుతా” అంది. ఆ లాయర్ “అదేంటమ్మా అడుగు” అని భరోసా ఇచ్చాడు తులసికి. “మా వారికి నేను మొదట తాళి కట్టించుకున్న భార్యననుకోండి. తర్వాత ఆయన మరో స్త్రీ మైడలో తాళి కడితే ఆమెకు నాతో సమానహక్కుంటుందా?” అని అడిగింది. “లేదమ్మా. చట్టబద్ధంగా నిన్ను ముందు చేసుకున్నందున నీకే అన్ని హక్కులూ ఉంటాయి. ఒకవేళ నీనుండి ఆయన విడాకులు తీసుకుని, అప్పుడు పెళ్లి చేసుకుంటే చట్టరీత్యా ఆమెకు ఆ హక్కు సొంతమవుతుంది” అన్నాడు. మళ్లీ ఆ లాయరే “అమ్మా! నాకో చిన్న అనుమానం. ఇంతకీ గుణసుందరం రెండో పెళ్లిగాని చేసుకున్నాడా ఏంటి? అలా అడుగుతున్నావు. చేసుకుంటే చెప్పు ఇప్పుడే దాని భరతం పట్టేద్దాం!” అన్నాడు. “బాబాయ్! నువ్వు ఎమోషన్ అవ్వకు. నేనేదో మాట వరసకు అడిగాను. మా ఆయన బంగారం. పెద్ద ఉద్యోగం చేసి మంచిపేరు ప్రఖ్యాతులు పొందిన గుణసుందరుడు” అంది. “అబ్బా అది కాదమ్మాయ్! పేరులో ‘గుణ’ ఉన్నంతమాత్రం చేత గుణవంతుడైపోడు. ఒకవేళ నిన్ను తాను నిరాదరిస్తే అప్పుడు నువ్వు లీగల్‌గా ప్రొసీడ్ అయ్యే వీలు తప్పకుండా ఉంది” అన్నాడు. “మంచిది వెళ్లిరా!” అని ఆ లాయర్ని సాగనంపి వచ్చింది భూతులసి.

    ముప్పై సంవత్సరాల తమ వైవాహిక జీవితంలో ఒకసారి కూడా తాను తల్లి కాలేకపోయింది తులసి. గర్భం ధరించడం అది పోవడం రెండు మూడు పర్యాయాలు జరిగింది. డాక్టర్‌కి చూపించుకుంటే గైనకాలజిస్టు అన్ని పరీక్షలు నిర్వహించి పెదవి విరుస్తూ “నీకు గర్భసంచిలో ఏదో లోపం ఉంది బహుశా నీకు పిల్లలు పుట్టే అవకాశంలేద”ని తేల్చి చెప్పేసింది. ఈ సంగతి తెలిసే తన భర్త మరో స్త్రీని వివాహం చేసుకున్నాడో, ఉంచుకున్నాడో డౌటుగా వుంది అని ఆలోచనలో పడింది. కడుపున పుట్టిన బిడ్డలు లేరని కంట నీరు పెట్టుకుని బాధపడసాగింది. మరో రెండు నెలలు గడిచేటప్పటికి చిలకను తన భర్త పెండ్లి చేసుకోలేదనే నిజాన్ని తెలుసుకుని ఆనందించింది తులసి. చిలకమ్మ కూతురు మంజూష తల్లికి ఫోన్ చేసి “అమ్మా నేను ఎటువంటి పనీ పాటా చేసుకోలేకుండా ఉన్నాను. నాకు అసరాగా వస్తానని రెండు నెలల నాడు మా యింటికొచ్చినప్పుడు అన్నావు గుర్తుందా! రా మరి. అన్నట్టు నాన్నగార్ని కూడా ఒక్కసారి చూడాలని ఉంది. కడుపులో బిడ్డ మాటిమాటికీ తన్నుతున్నాడు. గర్భం పెరిగి పోయింది. మీ అల్లుడు మా అత్తగారొస్తారని ఎదురు చూస్తున్నారు. ఇంకెప్పుడొస్తావు. మరి ఉంటాను నీ రాక కోసం ఎదురుచూస్తాను” అంటూ సెల్ కట్ చేసింది మంజూష.

    చిలకమ్మ కూతురికి పుట్టబోయే బిడ్డకోసం ముడ్డి కిందవాడే గుడ్డల దగ్గర్నుంచి, సున్నిపిండి, శీకాయి పౌడర్ వెండి ఉగ్గుగిన్నె, ఒక కొత్త మోడల్ ఊయల, ఇంకా కొన్ని బొమ్మలు, పాల పీక అమర్చినసీసా బోలెడుకొని మంజు ఇంటికి తీస్కెళ్లింది. బాలింతరాలు కాబోయే కూతురు దేనిగురించి చూడక్కర్లేకుండా ముందుచూపుతో తెచ్చేసింది. భర్త గుణసుందరరావు ఊరు కెళ్తానని చెబితే ఎప్పుడంది? తులసి. ఎల్లుండి అన్నాడు గుణసుందరరావు. అయితే నేను మీకూడా వస్తానంది. గుణసుందరరావుకి తన రెండో భార్య చిలక గురించిగాని, ఆమెకూతురు మంజూష కడుపుతోనున్న సంగతిగాని భూతులసికి తెలిసిందా అంటూ తనలో తాను కంగారు పడ్డాడు. వెంటనే తులసితో “నువ్వెందుకు? రాత్రికే వచ్చేద్దామనుకుంటున్నాను” అన్నాడు. కొంచెం తీవ్ర స్వరంతో భూతులసి “అయితే భార్యగా మీరు నన్ను ఎక్కడికీ తీసికెళ్లకుండా జీవితాంతం నేనో వంటింటి కుందేలుగా అఘోరిస్తూ పతిసేవ చేసుకుంటూ కాలం గడపాలా! కానివ్వండి. మీ యిష్టం వచ్చినట్లు తిరగండి” అంటూ లోనికెళ్లిపోయింది. అదేరోజు రాత్రి కూతురు మంజూషకు శుభనక్షత్రంతో సునాయాసంగా నర్సింగ్ హోమ్‌లో డెలివరీ అయ్యింది. మగపిల్లాడు పుట్టినట్లు మెసేజ్ వచ్చింది. చిలక “ఏవండీ మీరు తాతయ్యారని ఒక్కసారి చూసి పొండ”ని ఫోన్ చేసి మరీ చెప్పింది. ఆలస్యం చెయ్యకుండా గుణసుందరరావు పొద్దున్నే మనవణ్ణి చూసేందుకు బయల్దేరిపోయాడు.

    ఎలా తెలుసుకుందో భూతులసి తనకు సవతి, ఆ సవతికి పుట్టిన కూతురు మంజూష ఆమె కన్న బిడ్డ చిలక అల్లుడు అంబరీష్ వివరాలు అడిగి వాళ్ల గుమ్మం ముందు ఆటో దిగింది. కొత్తగా తన తల్లి ఈడుగల ఒక స్త్రీ మూర్తి ఇంట్లోకి రాబోతున్న వైనం గమనించి మంజూష బిడ్డడున్న ఊయల ఊపడం ఆపింది. “మీరెవరండి? ఎవరు కావాలి మీకు?” అని ప్రశ్నించింది. “నేను నీకు తల్లిలాంటి దాన్ని. ఇంటికొచ్చిన చుట్టాన్ని కనీసం కూర్చోమనైనా చెప్పవా! మంచి నీళ్ళైనా ఇవ్వవా! మీ నాన్నగారు నేర్పిన సంస్కారం ఇదేనా! ఈ ఉయ్యాల్లో పిల్లాడు నీ బాబా! ఏం పేరు పెట్టావు” అని ప్రశ్నలవర్షం కురిపించింది తులసి. ఎందుకనో వచ్చినామె తన భర్తకు ముందు భార్య అనే అనుమానం చిలకకు కలిగి నిలుచుంది. చిరునవ్వుతో “భూతులసక్కా! రా ఇలా కుర్చీలో కూర్చో! మంచినీళ్లు తెమ్మంటానుండు. ఎండనబడి వచ్చినట్టున్నావు. టీ పెట్టి తీసుకొస్తా! మంజూ పెద్దమ్మకు మంచినీళ్లివ్వు” అని లోనికెళ్లి పోయింది చిలక.

    మంచినీళ్లు గ్లాసులో పోసి తీసుకొచ్చి యిస్తూ “పెద్దమ్మా చూసారా! మా బుజ్జిగాడు… పేరు ఏమిటో చెప్పుకోండి చూద్దాం!” అంది. నీళ్లు తాగి ఉయ్యాలలో వున్న పిల్లాడిని చూస్తూ తులసి “ఇంకెవరిదయ్యుంటుంది మీ నాన్నగారి పేరే అయ్యుంటుంది” అంది. ఆ బాలుడు చిరునగవుతో ఉంగా… అంటూ కేరింతలు కొడుతున్నాడు. పిల్లాడిని ఊయలలోంచి తీసుకుని ఎత్తుకుని ముద్దాడుతూ భూతులసి “గుణసుందరం’ అంటూ బుగ్గలు నిమిరింది. కాస్సేపు ఒళ్ళో పెట్టుకుందో లేదో తులసి చీరపై ఉచ్చపోసేసాడు. పిల్లాడిని తను తీసుకుని “పెద్దమ్మమ్మ బట్టలు తడి పేసావురా, తప్పుకదా!” అని వాడిని ఊయలలో పరుండబెట్టి భూతులసిని బట్టలు మార్చుకునేందుకు పెద్దమ్మా రా అంటూ లోనికి తీసికెళ్లిపోయింది.

    రెండురోజులపాటు భార్య భూతులసి ఎక్కడికెళ్లిపోయిందో తెలియక నిద్రపట్టక సిగరెట్టు మీద సిగరెట్టు కాలుస్తూ గుణసుందరరావుకి పిచ్చిపట్టినట్టైంది. ఏనాడూ తనకి చెప్పకుండా భూతులసి గడప దాటి ఎరుగదు. అటువంటిది ఎక్కడికెళ్లి పోయిందో అప్పుడే నలభై ఎనిమిది గంటలైపోయింది. సంసారం పట్ల విరక్తి కలిగి ఎక్కడికైనా వెళ్లి పోయిందా! ఒక్కరు కూడా ఆమె తాలూకు బంధుగణం, రక్తసంబంధీకులెవ్వరు తనకు తెలిసిలేరు. మూడోరోజు మంజుష తండ్రికి ఫోన్ చేస్తూ “డాడీ పెద్దమ్మ ఇక్కడికొచ్చి రెండ్రోజులయ్యింది. మాయింటిలోనే భద్రంగా ఉంది. కంగారు పడకండి. వీలు చూసుకుని మీరొచ్చి ఆమెను తీసుకెళ్లండి. అక్కడ మీరేం తింటున్నారో ఎలా ఉంటున్నారోననే పెద్దమ్మ మీగురించి తల్చుకోని క్షణం లేదు. వట్టి బోళా మనిషి. వచ్చిన దగ్గర్నుంచి మనవడిని ఎత్తుకుని దింపడంలేదు” అంది. గుణసుందరరావులో ఒక్కసారిగా సంభ్రమాశ్చర్యాలు కలిగాయి.

    మరునాడు ఇంటికి తాళంకప్పవేసి కూతురు మంజూష ఇంటికి బయల్దేరాడు గుణసుందరరావు. అప్పటికి మంజూష భర్త అంబరీష్ ఇంటికొచ్చి కొద్దిసేపే అయ్యింది. పిల్లాడు భూతులసి ఒళ్లో కేరింతలు కొడుతున్నాడు. అప్పుడే గడపలో అడుగుపెట్టిన మావగార్ని చూసి అంబరీష్ “బుజ్జీ! మీ తాతయ్య నిన్ను మీ పెద్దమ్మమ్మనూ వెదుక్కుంటూ వచ్చేసార్రా! నీకిప్పుడు ఇంట్లో అంతా నీ చుట్టాలే!” అన్నాడు నవ్వుతూ. చిలక కిలకిల నవ్వుతూ భర్తకు ఎదురెళ్లి మంచినీళ్లు అందించింది. “ఎప్పుడు బయల్దేరారు? అక్కయ్య మీ మనవడిని విడిచి క్షణం ఉండలేకపోతున్నది” అంది. అంబరీష్ బయటి నుంచి కూల్ డ్రింక్ తెచ్చి యిస్తూ “మావయ్యా తీసుకోండి, మంచి ఎండన బడొచ్చారు” అన్నాడు. అల్లుడిచ్చిన డ్రింక్ తాగుతూ గుణసుందరరావు “తులసీ! రెండ్రోజులుగా నువ్వు కనిపించకపోయేసరికి నేనెంత కంగారు పడ్డానో నీకు తెలుసా!” అన్నాడు. “ఏం… రోజూ మనం గంటలతరబడి ఒకళ్ల ముఖం ఒకళ్లు చూసుకుంటూనే ఉన్నాంగా! ఇంకా మిమ్మల్ని నేను చూడాల్సిన అవసరం ఏముంది? మీ జూనియర్ బయల్దేరాడుగా! అందుకే మీ బదులు నేను వీడ్ని చూస్తూ ఇక్కడే ఉండిపోతాను” అంది.

    చిలకకు ఆపుకోలేనంత నవ్వు వచ్చింది. ఆమె నవ్వు ఆ యింటిల్లపాదికీ పువ్వుల జల్లులా అనిపించింది. మంజూష పెద్దమ్మ తులసిని సపోర్ట్ చేస్తున్నట్లు “ఉండిపో పెదమ్మా!” అంది. “అమ్మా మంజూషా! మీ నాన్న ఎంతకైనా తగిన మనిషే తల్లీ! ముందుగా మీ అమ్మను అంటే నా చెల్లిని ప్రేమించి పెళ్లి చేసుకోకుండా నీకు తండ్రి అయ్యారు. కన్నవారి ఋణం తీర్చుకునేందుకు వారి మాటల్ని జవదాటకూడదని నా మెట్లో తాళికట్టి నన్ను భార్యగా స్వీకరించారు. ఆ తర్వాత మీ అమ్మ మెళ్ళో తాళికట్టే ఉంటార్లే!” అంటూ ఆగిపోయింది తులసి, చిలకమ్మ ముందుకొస్తూ “అక్కా.. లేదక్కా! ఆయనకీ నాకూ మానసికంగా పెళ్లి ఎప్పుడో జరిగిపోయింది. మెల్లో తాళికట్టనంత మాత్రాన ఆయన నాకు ఏలోటూ చెయ్యని ధర్మరాజు. నాకు తాళికట్టనంత మాత్రం చేత ఆయనని భర్త కాదని నేను ఏనాడు నిరాదరించలేదు. నన్ను ఆయన నా నవ్వు చూసి చిలకా నువ్వు నవ్వితే నవరత్నాలు రాలినట్లుంటాయే అంటుంటారు. ఆనాటి నుండీ మాలో ప్రేమ అంకురించి శారీరకంగా ఒకటే భార్యాభర్తలమయ్యాం అంది.

    అప్పుడే చిరంజీవి ఊయల్లోంచి కేర్ మన్నాడు. “చిలకా గతమంతా వదలి పెట్టేయ్! ఈ మహానుభావుడు తల్లిదండ్రుల మాటకు కట్టుబడి నా మెళో ఈ తాళి కట్టారు. ఇప్పుడు నీ మెల్లో తాళి లేనంత మాత్రం చేత నువ్వు ఆయనకు భార్యకాకపోవు. ఇప్పుడు మనమంతా ఒక్కటే! నాకీ ఆస్తిపాస్తులతో ప్రమేయం లేదు. మంజూషా నీకు మీ అమ్మెంతో నేనూ అంతే అని భావిస్తే చాలమ్మా! కడుపున పుట్టిన బిడ్డల్నే ప్రేమించడం గొప్పకాదు. అవి పశుపక్ష్యాదులూ చేస్తాయి. అందరూ నావాళ్లని భావించడం గొప్ప సుగుణం, ఆ మంచి బుద్ది మీనాన్నగారికుంది. కాబట్టే ఆయన ఏం చేసినా ఎవరికీ ఎటువంటి అన్యాయం జరగనివ్వలేదు. నాకన్నా నా చెల్లి చిలక బోలెడంత ఆస్తిగలది అని నాకీ మధ్యే తెలిసింది, సంతోషించాను. ముఖ్యంగా ఎంత సిరిసంపదలున్నా చిలక దగ్గర గర్వం, అతిశయం అనే గుణాలే లేవు. అందర్నీ సమానంగా చూసే బుద్ధి తనది. నువ్వు చిలకా ఆయన మనసును గెలిచిన ప్రియురాలిని, భార్యవి. నేను బాంధవ్య బంధితురాలినైనా పేరుకు పెద్దభార్యనని భావించాలి. మన ఇద్దరిలో ఎక్కువ తక్కువలు, తారతమ్యాల్ని ఎంచుకోవడం అవివేకం. నాకు నీపట్ల ఈర్ష్య, అసూయలులేవు. నేను వెళ్ళుతున్నా బేబీ! ఆయనను మీ నాన్నగార్ని తొందరలో నీ దగ్గరకు పంపిస్తా’ అని తులసి లేచింది. “అక్కా భోజనం చేసి వెళ్లండి మీరు ఆయనా!” అని చిలక అంది. “వద్దర్రా పొద్దున్న తిన్నతింటే ఇంకా గొంతులో ఉంది. మంజు నువ్వూ మీ ఆయనా పండగలకి వచ్చి మనింటి దగ్గర పదేసి రోజులు ఉండాలి” అంది తులసి.

    విరగబడి నవ్వుతూ అంబరీష్ “పెద్దత్తయ్యగారూ అన్నాళ్లు మా ఉద్యోగంలో సెలవు పెడితే మా ఉద్యోగాలు ఊడబీకి ఇంటికి పంపేస్తారు. తప్పకుండా ఏదో పండక్కి వస్తాం! మీఇంట్లో రెండ్రోజులు, ఒకరోజు మంజూ వాళ్ల ఇంట్లో తప్పక ఉంటాం. అయినా నేనిప్పుడు ఇద్దరు అత్తల ముద్దుల అల్లుణ్ణి కదా!” అన్నాడు. అంతా పడిపడి నవ్వారు. గుణసుందరరావు భూతులసి ఇద్దరూ బుజ్జిబాబు బుగ్గలు నిమురుతూ “వస్తాంరా బంగారం” అంటూ బయల్దేరుతుంటే వాడు ‘ఊ.. ఊ…’ అన్నట్టు కాళ్లూ చేతులూ తన్నేసుకుంటూ కేరింతలు కొట్టాడు. “ఆరి గడుగ్గాయ్ మీ అమ్మమ్మ చిలక నవ్వు నీకూ వచ్చేసిందిరా భడవా” అంటూ తులసితో గుణసుందరరావు బైటికి దారితీసాడు. మంజూష, అంబరీష్ చిలక అంతా వాళ్లకి ఆనందంగా చేతులు ఊపి వీడ్కోలు చెప్పారు.

     

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here