మలిసంజ కెంజాయ! -20

9
3

[శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి రచించిన ‘మలిసంజ కెంజాయ!’ అనే నవలని ధారావాహికగా సంచిక పాఠకులకు అందిస్తున్నాము.]

[చెప్పినట్టుగానే భాస్కర్ భానక్కని తీసుకువచ్చి వసంత వాళ్ళింట్లో దింపుతాడు. అక్కాచెల్లెళ్ళు తాపీగా కబుర్లు చెప్పుకుంటారు. భానక్క వాళ్ళ ఊర్లో దొరకని వస్తువులని ఇక్కడ కొనుక్కుంటుంది. మధ్యాహ్నం భోజనాలయ్యాకా, నీ ఆస్తుల పంపకం బాధలూ, బెంగల గురించి చెప్పమని అక్కని అడుగుతుంది వసంత. ఇప్పటికే పిల్లలకి పంచేయగా, తన వద్ద ఉన్న బంగారం, డబ్బూ, అమలాపురంలో ఉన్న ఇళ్ల స్థలాలను ఎలా పంచాలనే విషయంలో తన పట్ల భాస్కర్‍కి అనుమానం, వాడి పట్ల తనకి భయం ఉన్నాయని చెప్తుంది భానక్క. భాస్కర్ వచ్చినప్పుడు ఇద్దరినీ కూర్చుని ప్రశాంతంగా ఆలోచించి ఓ నిర్ణయం తీసుకోమంటుంది వసంత. కొడుకేమయినా గబుక్కున ఓ మాటండేమోనని భయపడుతుంది భానక్క. అక్కకి ధైర్యం చెప్పి, తన ఉద్దేశమేమిటో భాస్కర్‍కి స్పష్టంగా చెప్పమని అంటుంది వసంత. మర్నాడు భాస్కర్ వచ్చినప్పుడు తల్లీకొడుకులకి ఏకాంతం కల్పించి వాళ్ళు ప్రశాంతంగా మాట్లాడుకునేలా చేస్తుంది. వాళ్ళు చక్కగా మాట్లాడుకుని, ఆస్తుల విషయంలో ఏం చేయాలో అవగాహనకి వస్తారు. మర్నాడు తల్లీ కొడుకులు బయల్దేరుతుంటే అక్కకి చీర పెడుతుంది వసంత. నా మనసులోని దిగులుని తొలగించావని అంటుంది భానక్క. ఒక రోజు ప్రమీలక్క ఫోన్ చేసి తన కూతురు భార్గవి ఇప్పుడెంతో మారిందని, అందరం సంతోషంగా ఉన్నామని చెప్తుంది. నిర్మల అత్తగారికి టైఫాయిడ్ జ్వరం వస్తుంది. ఆవిడ బాగా నీరసపడుతుంది. వసంతా వెంకట్రావు వెళ్లి ఆమెను చూసొస్తారు. తల్లికి టైఫాయిడ్ అని తెలిసిన రేణుక అమెరికా నుంచి వస్తుంది. తల్లిని జాగ్రత్తగా చూసుకుంటూ, ఇంట్లోంచే పని చేస్తుంది. ఆమె తన అత్తగారికి సేవలు చేస్తున్న తీరు నిర్మలని ఆలోచనలో పడేస్తుంది. తానెప్పుడూ అమ్మ పట్ల అలా లేనెందుకు? అని తనని ప్రశ్నించుకుంటుంది నిర్మల. తన ప్రవర్తన వల్లే అమ్మ తన పట్ల మమకారం కాస్త తగ్గించుకున్నట్లు గ్రహిస్తుంది. ఇక చదవండి.]

[dropcap]రే[/dropcap]ణుక తానే స్వయంగా తల్లికి బత్తాయిరసం తీస్తోంది. ద్రాక్షపళ్ళు ఉప్పునీటిలో వేసి నానబెట్టి శుభ్రంగా కడిగి, పొడి బట్టపై వేసి ఆరబెట్టి బాక్స్‌లో వేసి తల్లికి దగ్గరుండి తినిపిస్తోంది. ఎవరైనా అమ్మని అంత గౌరవంగా, ప్రేమగా చూస్తారా లేక నా ముందు నటిస్తోందా అనుకుంది నిర్మల మొదట్లో. కానీ అది నటన కాదనీ కని, పెంచి, చదివించిన తల్లి పట్ల ఆమెకి నిజంగానే కృతజ్ఞత గుండె లోతుల్లోంచే వస్తోందని తెలిసినప్పటినుంచీ నిర్మల గుండెల్లో ఒక ముల్లు గుచ్చుకుంది. అదేంటో తెలియడానికి రెండు రోజులు పట్టిందామెకి.

తల్లికి అన్నం పెడుతూ ఒకరోజు రేణుక అంటోంది. “అమ్మా! నేను ఇంటర్ చదివేటప్పుడూ, బీ.టెక్. చదివేటప్పుడూ నువ్వు కూడా నాతో పాటు నిద్ర మాని నా పక్కనే కూర్చునేదానివి కదా! నువ్వంత బాగా దగ్గరుండి చదివించడం వల్లే నేనీనాడు అమెరికాలో అంత పెద్ద ఉద్యోగంలో ఉన్నానమ్మా! నీకెంత చేసినా ఋణం తీరదమ్మా!”

“ఎందుకే? నువ్వు అంత శ్రమపడి లక్షలు ఖర్చుపెట్టుకుని వచ్చావు? నిర్మల చూసుకునేది కదా! నాకు సిగ్గుగా ఉందే! అక్కడ మీ ఆయనా, పిల్లలు ఎంత ఇబ్బంది పడుతున్నారో!” నిర్మల అత్తగారు అంటోంది.

“పడనీ అమ్మా! ఏమీ ఫర్వాలేదులే! నీ కంటేనా! నీకు టైఫాయిడ్ అనగానే నాకు కాళ్ళూ, చేతులూ ఆడలేదు. నా కంగారు చూసి ఆయన వెంటనే నాకు టికెట్ బుక్ చేసేసారు. అప్పుడు నాక్కాస్త ఊపిరి ఆడిందమ్మా!”

నిర్మల ఇక వినలేక అక్కడినుంచి వెళ్ళిపోయి, తనలో తాను అనుకోవడం మొదలు పెట్టింది. ‘నేనయితే అమ్మ ఆరోగ్యం గురించి ఒక్కమాట కూడా మాట్లాడను. ఆమె కూడా నా వయసుదే అన్నట్టు చూస్తాన్నేను. అమ్మ ఒక్క క్షణం ఊరికే కూర్చోదు. ఆధ్యాత్మిక పుస్తకాలూ, సాహిత్యపుస్తకాలూ, మ్యాగజైన్‌లూ చదువుతూనో, మిషన్‌పై బట్టలు కుడుతూనో, మొక్కల సంరక్షణ చేస్తూనో ఉంటుంది. నాన్న ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. పార్వతమ్మగారికి తోడుగా ఉంటుంది. నేను సెలవులకి పిల్లల్ని పంపితే వాళ్ళని చూస్తుంది.’ ఇలాగే ఏవేవో తల్లిని గురించిన ఆలోచనలు ఆమెకు అస్తిమితం కలిగించాయి.

ఆ రోజు తన అత్తగారిని చూడడానికి తండ్రితో పాటు వచ్చిన తల్లి వైపు తేరిపారా చూసింది మొదటిసారి నిర్మల. చూడగానే మనసు కలుక్కుమంది. అమ్మ రిటైర్ అయ్యాక డల్ అయ్యింది. నీరసంగా వుంది. మొహం పీక్కుపోయినట్టుగా కూడా వుంది. ఒక్క రోజైనా అమ్మకు తాను అన్నం పెట్టింది లేదు. అసలు దగ్గర కూర్చుని మాట్లాడిందే లేదెప్పుడూ!

అప్పుడప్పుడూ అమ్మకి నడుము నెప్పిగా ఉంటుందనీ, ఒక కాలు లాగుతుంటుందనీ దాని పేరు సయాటికా అనీ చూచాయగా విన్నది కానీ ఎప్పుడూ తాను అడగలేదు. అమ్మ కూడా తనకి చెప్పలేదు. అసలు నేను అడిగితే కదా!

అమ్మకీ, నాన్నకీ టీ చేస్తూ అనుకుంటోంది నిర్మల. టీ తీసుకెళ్ళేసరికి రేణుక, “మావయ్యా, అత్తయ్యా! మీరిప్పుడు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. మీకింకేమీ పనిలేదు, అదొక్కటే పని. చేసినన్నాళ్లు ఉద్యోగాలు చేశారు. చాలిక! మీ అబ్బాయికీ లోటు లేదు. మీ అమ్మాయికీ లోటు లేదు. మావయ్యా! మీ ఉద్యోగం మీకు తేలిగ్గా ఉంటేనే చెయ్యండి. ఏ మాత్రం అలసట అనిపించినా మానెయ్యండి, తప్ప ఉద్యోగం అంటూ హైరానా పడకండి. ప్రతి సంవత్సరమూ మీకు నచ్చిన ప్రదేశానికి వెళ్లి, ఓ వారం రోజులుండి రండి. ప్రశాంతంగా టైం గడుపుకోండి సీజనల్ పళ్ళు బాగా తినండి. వాకింగ్ చేసుకోండి.” అంటూ నిర్మల తల్లితండ్రులకి చెబుతోంది.

“అలాగే నాన్నా!” అంటున్నాడు వెంకట్రావు.

“మా ఇంటికి రాకుండా వెళ్ళిపోతావా!” అంటోంది వసంత.

“మీ ఇద్దరినీ చూసాను కదా! మళ్ళీ వచ్చినప్పుడు తప్పకుండా వస్తానత్తయ్యా” అంటోంది రేణుక.

‘తన ఆడపడుచు పాటి ఆప్యాయత కూడా తానెప్పుడూ వారి పట్ల చూపలేదు కదా!’ అనిపించి తలెత్తి అమ్మా, నాన్నల వైపు చూడలేకపోయింది నిర్మల. వసంత వెళుతూ వెళుతూ కూతురి దగ్గరికి వచ్చి చెంప నిమురుతూ “పనెక్కువయ్యిందే నీకు!” అంది నెమ్మదిగా. మరో నాలుగు రోజులకి నిర్మల అత్తగారికి జ్వరం తగ్గిపోయింది కాస్త నీరసం ఉంది. అది కూడా మరో నాలుగు రోజులకి పూర్తిగా తగ్గిపోయాక రేణుక ప్రయాణం పెట్టుకుంది. తల్లి ఆరోగ్యం గురించి తండ్రికీ, తమ్ముడికీ చాలా జాగ్రత్తలు చెప్పింది. నిర్మలకి మాత్రం నొచ్చుకోకుండా చెప్పింది, “ఆవిడ తిన్నానంటుంది కానీ సరిగా తినదు కాస్త ఒక కన్ను వెయ్యి” అంటూ. ఆ మర్నాడు రేణుక బయలుదేరి అమెరికా వెళ్ళిపోయింది.

***

వసంత ఒకరోజు మొక్కల్లో కలుపు తీసి గొప్పు తవ్వి లేచి వచ్చి సిమెంట్ గట్టు ఎక్కబోతూ కాస్త ముందుకు తూలి నిలదొక్కుకుంది. కుడి పాదం మెలిక పడింది. అప్పటికి ఏమీ లేదనిపించినా తర్వాత చీలమండ దగ్గర బాగా వాచింది. సాయంత్రానికి నడవలేకపోయింది. పార్వతమ్మ కంగారు పడిపోయింది. ఆసుపత్రికి తాను తోడుగా వస్తానంది. వద్దని చెప్పి వెంకట్రావు వసంతను చెయ్యి పట్టుకుని ఆటో ఎక్కించి తీసుకెళ్లాడు.

డాక్టర్ ఎక్సరే తీయించి చూశాడు. ఎముక విరగలేదు. అతి సన్నని క్రాక్ వచ్చిందనీ ఏమీ ప్రమాదం లేదనీ, ఒక నాలుగు రోజులు బాత్రూంకి తప్ప నడవవద్దనీ, తగ్గిపోతుందనీ చెప్పి మందులిచ్చాడు. మందుల షాపుల్లో దొరికే కట్టుకట్టే గుడ్డ తెప్పించి దాన్ని మడమ దగ్గర ఎలా కట్టాలో చూపించి అలా కట్టి ఉంచితే చాలన్నాడు.

పార్వతమ్మ వచ్చి “పోన్లే తల్లీ ! రెస్ట్‌గా ఉండు. మీ ఇద్దరికీ నేనొండి పెడతా” అంది. “నాకు వంటొచ్చండీ” అన్నాడు వెంకట్రావు నవ్వుతూ.

మరో గంటకల్లా తండ్రి ద్వారా కబురు తెలుసుకున్న నిర్మల ఓ రెండు డ్రెస్‌లు బ్యాగ్‌లో పెట్టుకుని ఒక్కతే వచ్చేసింది. రాగానే తల్లి దెబ్బకు కట్టిన కట్టు చూసి “నేనుంటానమ్మా నీ దగ్గర నాలుగు రోజులు” అంది.

“మరి పిల్లలూ?” అంది వసంత.

“మా అత్తగారు చూసుకుంటార్లే!” అని వంటింట్లోకి వెళ్ళిపోయింది నిర్మల.

అన్నట్టుగానే వంటింట్లో పనంతా మొదలు పెట్టేసింది. మర్నాడు తండ్రికి లంచ్ బాక్స్ కట్టి పంపింది. తల్లికి అన్నం పెట్టి, తాను కూడా తెచ్చుకుని ఎదురుగా తినడం చూసి వసంత ఇది కలా నిజమా అనుకుంది. వెంకట్రావు కూడా ఆశ్చర్యపోతూనే ఉన్నాడు. పిల్ల రావడం, తల్లి చేసే పనులన్నీ చెయ్యడం ఊహించలేదెన్నడూ!

మరో రోజుకల్లా వసంతకి ఇదంతా, ఆడపడుచు రేణుక తల్లిని అమెరికా నుంచి వచ్చిచూసుకోవడం వల్ల కూతురి ప్రవర్తనలో కలిగిన పరివర్తన అని గ్రహించింది. ఒకరు చేసే ఉత్తమమైన పనిని ఇతరులు అనుసరిస్తారంటే ఇదే కాబోలు అనుకుంది. నిర్మల తల్లిని దగ్గరుండి బాత్ రూమ్‌కి పంపించి జాగ్రత్తగా రోజంతా రెస్ట్‌లో ఉండేటట్టు చూస్తోంది. పాదానికి ఆయింట్మెంట్ రాసి కట్టు కడుతోంది. “చూశావా! ఊరిలో కూతురు నీ అదృష్టం” అంది పార్వతమ్మ నవ్వుతూ.

“నిజమే పిన్నీ! స్కూల్ కెళ్లే పిల్లల్ని వదిలేసొచ్చింది” అంది వసంత.

“రాబట్టే, నువ్వు కదలకుండా కూర్చున్నావు. లేకపోతే తిరగకుండా ఉండేదానివా?” అందామె

నాలుగో రోజుకల్లా వసంత పాదం మందుల వల్లా, విశ్రాంతి వల్లా తగ్గింది. నెమ్మదిగా నడవగలుగుతోంది. “ఇంక ఫర్వాలేదులే నాన్నా! నువ్వెళ్లు! పిల్లలతో మీ అత్తగారికి శ్రమ అవుతుంది” అంది వసంత. తల్లి అనేవరకూ నిర్మలకి ఆ ఆలోచనే రాలేదు. అమ్మకి తగ్గిపోతే చాలు అన్నట్టుగా తల్లి సేవలో మమేకమై పోయింది.

“తెలుగులో ఒక సామెతుందే నిమ్మీ! కూతురుంటే తల్లికి మంచంలోకే భోజనం వస్తుందట” అని నవ్వింది.

“చాల్లే! నేనెప్పుడు సాయం చేశాను నీకు? ఇదే మొదటిసారి” అంది నిర్మల, తన మీద తానే విసుక్కుంటూ. “తప్పు. అలా అనకూడదు. అవసరం అయినప్పుడు వస్తారు కానీ రోజూ సాయానికొస్తారా ఎవరైనా?” అంది వసంత కూతుర్ని ప్రేమగా మందలిస్తూ. “మధ్యాహ్నం భోంచేసి బయలుదేరుదువుగానీ. పోయి, కొబ్బరి నూనె సీసా, దువ్వెన తెచ్చుకో. తల దువ్వి చక్కగా జడవేస్తాను” అంది వసంత.

నిర్మల అటుతిరిగి కూర్చుంటే వసంత ఆమె తలచిక్కు తీస్తోంది. నిర్మల ఉన్నట్టుండి “అమ్మా! నీ మీదెప్పుడూ నేను కోపం పెట్టుకున్నాను కానీ నిన్ను నేను ప్రేమగా చూడలేదు. చిన్నప్పటినుంచీ నాకు చదువు అంత బాగా వచ్చేది కాదు కదా! నువ్వేమో మంచి టీచర్‌వి. పిల్లలంతా టీచర్! టీచర్! అంటూ నీ చుట్టూ తిరుగుతూ గౌరవించేవారు. తమ్ముడు క్లాస్ ఫస్ట్ ఉండేవాడు. అది నాకింకా కోపంగా ఉండేది. నువ్వు నా వెనకే ఉండి రుద్ది రుద్ది చదివిస్తే టెన్త్ బొటా బొటీగా పాస్ అయ్యాను. ఇంటర్ తప్పాను. నువ్వు దగ్గరుండి చదివిస్తే ఆ సబ్జెక్టులు పాస్ అయ్యాను. డిగ్రీ ఆఖరి సంవత్సరంలో నువ్వు నాకు నోట్స్‌లు కూడా రాసిపెట్టి చదివిస్తే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ లలో మిగిలిపోయిన సబ్జెక్టులు రాసి పాస్ అయ్యాను. అందుకు నాకు ఏదో ఉడుకు మోత్తనంగా ఉండి నీ మీద కోపం వచ్చేది. కారణం ఏమీ లేదు. నీ తప్పు కాదు. ‘నేనెందుకు నీలా తెలివైనదాన్ని కాదు! తమ్ముడిలా మెరిట్ కాదు!’ అని నా మీద నాకే కోపంగా ఉండేది. అది నీ మీదకి తిప్పేదాన్ని. నీ మీద చిర్రుబుర్రులాడుతుంటే నువ్వు చిన్నబుచ్చుకుంటుంటే నాకేదో గొప్పగా, నీ మీద విజయం సాధించినట్టుండేది. అందుకే అలా ప్రవర్తించేదాన్ని.

పెళ్లయ్యాక మా అత్తగారూ వాళ్ళు ధనవంతులు కాబట్టి నీకన్నా ఈ విషయంలో నేను గొప్పదాన్ని అని తృప్తి పడేదాన్ని. అదెంత పిచ్చితనమో ఇప్పుడు తెలిసింది. కనిపెంచిన తల్లితో, దేవత లాంటి అమ్మతో కూతురికి పోటీయా? ఎంత తప్పు?” ఆ తర్వాత మాట్లాడలేక ఆగిపోయింది నిర్మల. అటు తిరిగి మాట్లాడుతున్న కూతురి మొహం వెనుక మనసుని గ్రహించిన తల్లి జడ పూర్తి చేసి, వెనక నుంచి కూతురిని హత్తుకుని తలపై ముద్దు పెట్టింది.

నిర్మల లేచి తిన్నగా వంటగదిలోకి వెళ్ళిపోయింది తన మొహం తల్లికి చూపించకుండా. భోజనాలయ్యాక తల్లి బలవంతం మీద అత్తగారికి ఫోన్ చేసి వస్తానని చెప్పిందామె. మూడు గంటలకల్లా వచ్చిన కారులో అత్తగారు కూడా వచ్చి ఓ గంట సేపు వియ్యపురాలితో కబుర్లు చెప్పి కోడలిని తీసుకుని వెళ్ళిపోయింది.

రాత్రి భర్త వచ్చాక నిర్మలని పంపించేసాననీ, వియ్యపురాలు కూడా వచ్చిందనీ చెప్పింది వసంత. “చూసావా? ఓర్పు పట్టిన వారికి, మంచి జరుగుతుందని నేను చెప్పలేదా? నువ్వనవసరంగా మనసును బాధ పెట్టుకున్నావు” అంటున్న భర్త మాటలకి చిన్నగా నవ్వి “నిజమే! మీరన్న మాట నిజమయ్యింది. మీ అనుభవం నా అనుభవం కన్నా ఎక్కువ అని తెలిసింది” అంది వసంత భర్త వైపు ఆనందంగా చూస్తూ.

ఒకరోజు మధ్యాహ్నం వేళ వెంకటేశ్వరావు మాస్టారు నుంచి ఫోన్ వచ్చింది వసంతకి. “నమస్తే మాష్టారూ! చాలా రోజులయ్యింది ఒకసారి మాట్లాడాలి అనుకున్నాను నిన్ననే” అంది ఆనందంగా.

“సంతోషం అమ్మా! తలుచుకుంటున్నారు, చాలు. ఇప్పుడు నేనెందుకు ఫోన్ చేసానంటే నా మిత్రుడి కొడుకు పవన్ పుట్టినరోజు రేపు. మన ఆశ్రమంలో ఓ యాభై మందికి లంచ్ ఏర్పాట్లు చేస్తున్నాం. నువ్వూ, మీ శ్రీవారూ, పార్వతమ్మగారూ తప్పక రావాలి. రేపు పదకొండుగంటలకల్లా రావాలి. భోజనాలు బైట ఆర్డర్ ఇచ్చాము.”

“మీ ఫ్రెండ్ కొడుకెవరండీ?”

“ఎప్పుడూ చెప్పలేదా నేను? నా మిత్రుడొకాయన కొడుకు పవన్ అనీ ఉన్నాడు. నలభై ఏళ్ళుంటాయి. బ్రహ్మచారి. స్నేహశీలి. మా మిత్రుడిప్పుడు లేడు. చాలా ఏళ్ల క్రితమే కాలం చేసాడు. ఈ పవన్ అప్పుడప్పుడూ మన ఆశ్రమానికి వస్తూ ఉంటాడు. ఒక ప్రభుత్వ రంగ సంస్థలో అక్కౌంట్స్ ఆఫీసర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈసారి తన పుట్టినరోజు ఇక్కడ చేసుకుంటానని తానే అన్నాడు. సరే అన్నాను. అతను నాకే కాదు. నా మిత్రులకు కూడా సన్నిహితుడు. వయసుకు చిన్నవాడయినా వయసుకి మించిన నిదానం కలిగి ఉంటాడు. రేపు చూస్తారు కదా మీరంతా! ఒకసారి చూసి మాట్లాడారంటే వదిలి పెట్టలేరెవరైనా. అంత సరదా కుర్రాడు.”

“అలాగే మాష్టారూ! పిన్నిగారిని కూడా తీసుకొస్తాను” అంది వసంత.

“అలాగే. ఇంకేంటమ్మా, సంగతులు?”

“మీరే చెప్పాలి మాష్టారూ!”

“ఈ ఆశ్రమంలో ఉండేవాళ్ళకి కూడా ఇలా బైట వాళ్లొచ్చి పోతుంటే కాస్త హుషారుగా ఉంటుంది వసంతా! ఎప్పుడైనా ఒకోసారి ఓ రెండు గంటలు గోదారొడ్డుకి కూడా తీసుకెళ్తూ ఉంటాం. మా అమ్మాయిలిద్దరూ ఆస్ట్రేలియా వదిలి రారు. నేను రెండేళ్ళకొకసారి వెళ్లి ఓ నాలుగు నెలలుంటాను. వంటమనిషి వండిపెడుతుంది నాకు. పిల్లలకిచ్చిన పొలాలూ తోటలూ చూసే పని నాదే కాబట్టి అలా కొంత కాలక్షేపం అవుతుంది తప్ప లేకపోతే నేనూ వాళ్లలాగే ఒంటరివాడినే కదా! ఇలా నలుగురం కలిసే కార్యక్రమాలుంటే నాకూ ఇష్టమే!”

“మీతో పాటు మాక్కూడా మాష్టారూ! మాకూ ఇల్లూ, పనీ విసుగనిపిస్తాయి అందుకే మీరు పిలవగానే రావడానికి తయారుగా ఉంటాం, నేనూ పిన్నిగారూ”

“సరేనమ్మా! వచ్చేస్తారుగా! ఉండనా మరి” అన్నారు మాష్టారు.

“మంచిది మాష్టారూ!” అంది వసంత ఫోన్ పెట్టేస్తూ.

ఈ మాట చెప్పగానే పార్వతమ్మ కూడా సంతోషపడింది. “తప్పకుండా వెళదాం. నాక్కూడా ఓసారి వెళ్లాలనుందక్కడికి. రేపు భోజనాలు అక్కడే అన్నావు కాబట్టి వంట బాధ తప్పింది. సాయంత్రం ఏ ఉప్మాయో కలబెట్టుకోవచ్చులే! రేప్పొద్దున్న కాస్త టిఫిన్ చేసుకుంటే సరి” అందామె.

“అవును పిన్నీ!” అని, కాస్త చల్లబడ్డాక వెళ్లి, కొన్ని పళ్ళు కొని పెట్టుకుంది వసంత ఆశ్రమానికి మర్నాడు తీసుకెళ్లడానికి. తర్వాత చీరా, పర్సు చూసుకుని సిద్ధంగా పెట్టుకుంది.

మర్నాడు పార్వతమ్మా, వసంతా ఆశ్రమానికి వెళ్లేసరికి పదకొండున్నర అయ్యింది. ఆశ్రమం బిల్డింగ్ పక్కనున్న ఖాళీ స్థలమంతా చిక్కని కళ్ళాపి చల్లారు. అందమైన ముగ్గులు పెట్టారు.

“ఆడవాళ్లు ఎక్కడుంటే అక్కడ కళే చూశావా?” అంది పార్వతమ్మ ఆ ముగ్గులు చూసి ముచ్చటపడుతూ. ఆ ముగ్గులు తొక్కకుండా ఎలా నడవాలో తెలీక ఆగిపోయిందామె. ఇంతలో ఎదురుగా నాగమ్మ వచ్చి పార్వతమ్మ చెయ్యి పట్టుకుని “అక్కయ్య గారూ! ముగ్గుల మీద మీ పాదం పడితే, మాకు శుభం” అన్నాక కాస్త ధైర్యంగా కాలు వేసిందామె. వసంత ఆమె వెనకే నవ్వుతూ నడిచింది.

అందరూ కలిసి టీవీ చూసే హాల్‌లో ఓ యాభై కుర్చీలు పొందికగా వేసి ఉన్నాయి. వాటి ముందు ఒక టేబుల్ వేశారు. ఉతికిన టేబుల్ క్లాత్ వేశారు. ఆ క్లాత్ నిండా చేతితో కుట్టిన రకరకాల రంగుల పువ్వులున్నాయి. అవి ఓ ఇద్దరు ఆశ్రమవాస మహిళలు కుట్టినవి. అక్కడొక పళ్లెంలో రెండరటిపళ్ళ స్టాండ్ పైన ఓ నాలుగు అగరబత్తీలున్నాయి. అవి గంధం వాసన విరజిమ్మి అక్కడివారి మనసుకు ఆహ్లాదం కలిగిస్తున్నాయి.

ఆ కుర్చీల్లో వెంకటేశ్వరరావు మాష్టారి స్నేహితులున్నారు. వాళ్లంతా పార్వతమ్మనీ, వసంతనీ చూసి స్నేహపూర్వకంగా లేచి నిలబడ్డారు. ఆశ్రమ మహిళలంతా ఎదురొచ్చారు. గోధుమ రంగు కుర్తా పైజామా వేసుకున్న కుర్రాడు మరో పక్కనుంచి వస్తూ “రండమ్మా, రండి! నేనే పవన్‌ని! నమస్తే అమ్మలూ!” అంటూ పవన్ పార్వతమ్మ కాళ్ళకి నమస్కరించాడు. “ఈ అబ్బాయిదేనా పుట్టినరోజన్నారు? అక్షింతలివ్వండమ్మా!” అని అడిగి తీసుకుని “ఆయురారోగ్యాలతో నూరేళ్లు చల్లగా ఉండు నాయనా!” అని దీవించి చేతిపర్సు లోంచి ఓ అయిదువందల నోటు తీసి అతని చేతిలోపెట్టింది పార్వతమ్మ.

“వద్దమ్మా!” అని పవన్ మొహమాటపడుతుంటే “తీసుకో నాన్నా! పెద్దామె ప్రేమతో ఇచ్చారు” అంది వసంత.

ఆ తర్వాత వసంత కాళ్ళకి కూడా నమస్కారం పెట్టేసి “ఇక్కడ ఉన్నవాళ్లందరి కాళ్ళకీ దణ్ణం పెట్టేసాను. మీ ఇద్దరి కాళ్ళ కోసం వెయిటింగ్ అన్నమాట!” అనగానే అంతా గట్టిగా నవ్వారు.

పవన్‌కి జుట్టు అక్కడక్కడా తెల్లబడినా మొహంలో పసితనం అలాగే ఉంది.

“పవన్ నువ్వు జుట్టుకి తెల్లరంగు వేసుకున్నావా ఏమిటి? మాలో కలిసిపోవాలని?” అనడిగింది వసంత.

మళ్ళీ అంతా పగలబడి నవ్వుతుండగా బైటినుంచి బైక్ దిగి లోపలికి వచ్చారు వెంకటేశ్వరరావు గారు. ఆయన వెనకే మరో బైక్‌లో ఒక పెద్ద కేక్ ప్యాకెట్ వచ్చింది. దాన్ని టేబుల్ మీద సర్దారు. ప్లాస్టిక్ చాకు పవన్ చేతిలో పెట్టి వెళ్లిపోయారు బైక్‌లో వచ్చిన కుర్రాళ్ళు.

“అమ్మలూ! నేను కేకు కట్ చెయ్యను. ఈ రోజు ఆశ్రమం గుమ్మంలో అందమైన ముగ్గు ఎవరు వేశారో వాళ్ళే కట్ చెయ్యాలి” అన్నాడు పవన్.

“అయితే, ఆ ముగ్గు వేసింది రమణమ్మ” అన్నారెవరో ఆవిడని ముందుకి లాగుతూ.

ఆమె సందేహించేదే కానీ వెంకటేశ్వరరావుగారు “కానీవమ్మా!” అనగానే చాకు అందుకుంది. ముక్కలన్నిటినీ ఒకే సైజులో చక్కగా అందంగా కోసింది. మరొకామె వాటన్నిటినీ అరటి ఆకుల ముక్కలలో ఒబ్బిడిగా సర్దింది. మరో ముగ్గురు అక్కడున్న నలభై ఐదుమందికీ అందజేసారు. అంతా తిన్నాక లేచి చేతులు కడుక్కుని వచ్చికూర్చున్నారు.

“కేక్ ఎలా ఉందమ్మా?” అడిగాడు పవన్.

“చాలా బావుంది బాబూ!” అన్నారంతా.

“బావుంది కానీ, అందులో గుడ్డు వెయ్యలేదు!” అన్నాడు పవన్ నవ్వుతూ.

“వేసినట్టే బావుందే!”

“అంతే! వేసినట్టు ఉంటుంది కానీ వెయ్యరు. అదే భ్రమింపజేసే మాయ” అన్నాడు పవన్.

అక్కడున్నవారంతా హాయిగా నవ్వారు.

“వేదాంతం బాగానే వంటబట్టిందీ పిల్లాడికి” అందొకామె.

వెంటనే వెంకటేశ్వరరావుగారు “చూడండమ్మా! ఈ అబ్బాయి పురాణాలన్నీ బాగా చదువుకున్నాడు. తండ్రి గారు మహా పండితుడు. చిన్నప్పుడే ఆయన దగ్గర అన్నీ నేర్చుకున్నాడు. మీరన్నట్టు వేదాంత విషయాలు కూడా బాగా మాట్లాడగలడు. వయసుకి చిన్నవాడైనా బుద్ధిలో మనకంటే పెద్దవాడు. మన కష్టాలు ఏమన్నా ఉంటే చెప్పుకోవచ్చు. వింటాడు. మంచి సలహాలు కూడా చెబుతాడు. మీకెవరికైనా సందేహాలుంటే కూడా అడగొచ్చు” అన్నాడు.

“అయితే అడుగుతామండీ” అందొకావిడ.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here