సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు-19

0
4

[విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు, రచయిత గూడురు గోపాలకృష్ణమూర్తి గారు రచించిన ‘సమాంతర రేఖల నీడన స్పర్శరేఖలు’ అనే నవలని ధారవాహికగా పాఠకులకు అందిస్తున్నాము.]

[రెండు రోజులు సెలవులు వస్తే రవి అక్క ఇందిర ఇంటికి వస్తాడు. వచ్చినప్పటి నుండి తమ్ముడు అన్యమనస్కంగా ఉండడం గమనిస్తుంది ఇందిర. రవి ఎందుకలా ఉన్నాడో కారణం తెలుసుకోవాలనుకున్న ఇందిర, సిద్ధార్థకి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చిందట కదా అని అంటుంది. వాడు చాలా అదృష్టవంతుడు అని రవి అంటాడు. నువ్వు దురదుష్టవంతుడనని అనుకుంటున్నావా అని అడుగుతుంది ఇందిర. నీలాంటి అక్కయ్య ఉండగా నేను దురదృష్టవంతుడని ఎందుకు అవుతానని అంటాడు రవి. సిద్ధూ తనకి మంచి స్నేహితుడని అతని పట్ల తనకి వ్యతిరేక భావం లేదని అంటాడు. ఇందిర తమ్ముడికి ఎంతో ధైర్యం చెబుతుంది. ఎంబిఎ గానీ, ఎంటెక్ గానీ చదుకోమని చెప్తుంది. తాను ఇంకా అక్కకి భారం కాదలుచుకోలేదు అంటాడు. నెగటివ్‍గా మాట్లాడద్దని అంటుంది ఇందిర. ఒకరినొకరు కష్టపెట్టుకోకూడని అనుకుంటున్న అక్కాతమ్ముళ్ళు విచలితులవుతారు. సిద్ధార్థ, బిందు, రవి, శకుంతల ఒకరి మీద మీద ప్రేమ పెంచుకుంటారు. కానీ బిందు, శకూ తమ ప్రేమని బహిరంగంగా వెల్లడించలేకపోతారు. తను జీవితంలో స్థిరపడి అక్కయ్య కష్టాల్ని దూరం చెయ్యాలన్నది రవి ఆలోచన. అమ్మ కలల్ని సాకారం చెయ్యాలన్నది బిందు తపన. తనని చేరదీసి పెంచి చదివించిన పుణ్యదంపతులకు కళంకం తేకూడదన్నది శకుంతల అభిప్రాయం. ప్రేమించకపోతే యాసిడ్ పోస్తామనే మనస్తత్వం కాదు సిద్ధూ, రవీ లది. ప్రేమించిన వారు లభించకపోతే జీవితాన్ని అంతం చేసుకునే బలహీన మనస్కులు కారు బిందు, శకుంతల. ఇక చదవండి.]

అధ్యాయం-37

[dropcap]ఉ[/dropcap]దయం కాలం. ఉగాది వచ్చింది. అంటే వసంత కాల ఆగమనం. ప్రకృతి అంతా శోభాయమానంగా ఉంది. మార్చి నెల దాటబోతోంది.

ఎండలు కూడా కొద్దిగా ముదురుతున్నాయి. ఆహ్లాదకరమైన ఆ ఉదయ కాలంలో ఆ ఆహ్లాదాన్ని ఆస్వాదించే స్థితిలో లేదు బిందు.

ఆమె మనస్సు నిండా దిగులు. ఏదో వెలితి. మానసిక అశాంతి. ఒక వేపు ఎమోషన్, మరో వేపు సిట్యువేషన్. బాహ్య జగత్తులో జరుగుతున్నది ఒకటయితే అంతర్జగత్తు ఆశించేది మరోటి అయినపుడు మనస్సు తొట్రుపడుతుంది. సంఘర్షణకి లోనవుతారు మనుష్యులు. సమాజంతో తలపడాలన్నంత ఆవేశం మనలో చోటు చేసుకుంటుంది.

ఒక్కొక్క పర్యాయం మనలో మనమే విభేదించకుంటాం. అటువంటి సమయంలో సంయమనం కావాలి. అదే నిగ్రహం కావాలి. ఓర్పు ఉండాలి. ఓపిక ఉండాలి. తను ఆశించింది నెరవేరాలంటే ప్రతికూల పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకునే నిబద్ధత అవసరం. ఆలోచన క్రమ పద్ధతిలో సాగాలి. ఆచరణ నిర్దిష్ట ప్రణాళికన జరగాలి. అంతేకాని తొందరపాటు చర్య పనికిరాదు. ఒకసారి జరిగిన సంఘటన బిందు కళ్ళెదుట నిల్చింది. ఏవో జ్ఞాపకాల తెరలు స్మృతి పటలంపై నిలిచాయి.

రెండు రోజుల క్రితం తన మనస్సు అశాంతిగా ఉంది. సిద్ధార్థ జ్ఞాపకాలే తనని చుట్టు ముడ్తున్నాయి. కొద్ది రోజుల్లో ఇంజనీరింగ్ ఫైనల్ పూర్తి చేయబోతున్న వాళ్ళకి ఫేర్‍వెల్ ఫంక్షన్ జరగబోతోంది. చదువు పూర్తవుతున్న వాళ్ళలో సిద్ధార్థ కూడా ఉన్నాడు. అతను కాలేజీ విడిచి వెళ్ళిపోతాడు. మరి తనకి కనిపించడు అనే ఆలోచన తన మనస్సును కలతకి గురి చేస్తోంది. గుండెల అడుగు పొరల్లో ఆవేదన ప్రోగు చేసుకుంది. ఏ పనిలోనూ తను ఏకాగ్రత కనబరచలేకపోతోంది. ఏదో దిగులు, ఏదో నిధి పోగొట్టుకుంటున్నట్టు అనిపిస్తోంది.

అన్నం తినకుండా కంచంలో పిచ్చి గీతలు గీస్తూ కూర్చుంది బిందు “పాపా! అన్నం తినకుండా ఏంటా పరధ్యానం?” తల్లి హెచ్చరికతో బాహ్య జగత్తులోకి వచ్చిన బిందు తొట్రు పడ్తూ “ఏం లేదు మమ్మీ!” అంటూ తిరిగి భోజనం చేయడానికి ఉపక్రమించింది. అయినా హితవు కావటం లేదు.

“పాపా! నీవు ఏం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు,” తల్లి గంభీరంగా పలికిన మాటలు విని తృళ్ళిపడి “ఏంటి మమ్మీ!” అని అడిగింది బిందు.

“నీవు ఆలోచిస్తున్నది ఆ సిద్ధార్థను గురించే కదూ!”

తల్లి మాటలకి ఏం జవాబియ్యకుండా తలవొంచుకుంది బిందు.

తన కూతురి మానసిక స్థితి బాగులేదని భావోద్వేగానికి గురవుతోందని గ్రహించింది ఉమాదేవి. ఈ వయసులో ఈ భావోద్వేగాల భావోద్రేకాలు సహజమే. తగిన గైడెన్సు ఉంటే వాటిని సక్రమమైన మార్గంలో పెట్టచ్చు, పెట్టాలి అని అనుకుంది. కూతురికి నచ్చజెప్పడానికి పూనుకుంది.

“పాపా ఒక్క విషయం. జీవితంలో మనం ఎందర్నో కలుస్తాం. విడిపోతాం. అదంతా ఎందుకు ట్రైనులోనో, బస్సులోనో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఎంతమందో తారసపడ్తారు. వాళ్ళు మనతో పరిచయం పెంచుకుంటారు. ఆత్మీయంగా మాట్లాడుతారు. ప్రేమగా తియ్యగా మాట్లాడుతారు. వరసలు కలుపుతారు. అక్కా పిన్నీ, వదిన, చెల్లి ఇలా ఎన్నో వరసలు. అయితే గమ్యస్థానం చేరగానే విడిపోతాము. అలా ప్రయాణం పరిచయం అయిన పరిచయాలు నిలబడవు. తాత్కాలికం మాత్రమే. బండి దిగగానే వాళ్ళకి వీడ్కోలు ఇస్తాం. మరుక్షణమే మరిచిపోతాం. మరి వాళ్ళని చూడము. వాళ్ళతో మాట్లాడము.

ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నానంటే సిద్ధార్థతో నీ పరిచయం కూడా అంతే. మనకి జీవితంలో ఎంతమందో పరిచయం అవుతారు. విడిపోతారు. ఈ జీవన యాత్రలో ఇది సహజం. సిద్ధార్థతో నీ పరిచయాన్ని అంత సీరియస్‌గా తీసుకో అవసరం లేదు. అందరితోనూ బంధాలు పెంచుకుంటూ పోతే ఎన్నో చిక్కులు. జీవితం అశాంతి మయంగా తయారవుతుంది. ఇవన్నీ నా అనుభవ పూర్వకంగా చెప్తున్న మాటలు. నాకెదురయిన అనుభవం నీకు ఎదురు కాకూడదు. అదే నా బాధ – నా ఆరాటం. నీకు ఏ లోటూ రాకుండా – నీ మనస్సు కలత పెట్టకుండా ఇంతవరకూ నేను నిన్ను పెంచుకొస్తున్నాను. మరో విషయం జీవిత పాఠం మరోసారి చెప్తున్నాను. జీవితంలో ఒకటి కావాలనుకుంటే మరోటి వదులు కోవాలి. అలా చేయడం తప్పదు కూడా. ఇప్పుడు నీ ముందున్నది నీ భవిష్యత్తు, నీ ఉజ్వలమైన భవిష్యత్తు. బంగారుమయమైన భవిష్యత్తు. అలాంటి భవిష్యత్తుని తాత్కాలికమైన భావ మనో వికారాల్తో పాడు చేసుకుంటావా?

ఇప్పుడు నేను నీ తల్లి స్థానంలో కాకుండా నీ మంచి కోరే, నీ శ్రేయస్సు కోరే శ్రేయోభిలాషి స్థానంలో ఉన్నాను. ఇప్పుడు నా బాధ్యత నీ శ్రేయస్సు కోరడమే. తప్పు త్రోవలో నీవు నడవకుండా నిన్ను సరియైన మార్గంలో నడిపించాలి. అదే నా లక్ష్యం. అదే నా బాధ్యత. ఇప్పటికే నీవు సిద్ధార్థకి చేసింది ఎక్కువ అని నేను అనుకుంటున్నాను.

నీవు సిద్ధార్థ చదువు నిమిత్తం ఆర్థికంగా సహాయపడ్డం, అదీ నాకు తెలియకుండా ఆ పని చేయడం నాకు నచ్చకపోయినా నిన్ను మందలించ లేకపోయాను. ఎందుకో తెలుసా? నీది జాలి గుండె అని నాకు తెలుసు.

నీలో ఉన్న మానవత్వ గుణం నా నోరు తెవరనీయకుండా చేసింది. అతనికి ఆర్థికంగా సహాయపడ్డావు. అంత వరకూ బాగానే ఉంది. ఆ తరువాత విషయాలే నాకు నచ్చటం లేదు. అతని మీద నీవు ఆశలు పెంచుకున్నట్టు నాకనిపిస్తోంది. ఇంతటితో దీనికి ముగింపు పలుకు. ఇదే నా సలహా.”

తల్లి మాటలు బిందుకి రుచించటం లేదు. అలా అని తల్లిని వ్యతిరేకించనూ లేదు. బిందూ ఆలోచిస్తోంది. ‘తన తల్లి మాటల్ని బట్టి మమ్మీ జీవితంలో ఏదో అపశృతి దొర్లి ఉంటుంది. అందుకే అలా అంటోంది. ఆ అపశృతి ఏంటో తెలుసుకోవాలి అని తనకి ఉన్నా అది సాధ్యపడేది కాదు. బాధనంతా తనలో దాచుకున్న నిండు కుండ. ఏదో రోజున మమ్మీయే చెప్తుందన్న నమ్మకం. ఇప్పుడే ఆ ప్రస్తావన తెచ్చి ఆమెను మనస్తాపానికి గురి చేయడం తన కిష్టం లేదు’, ఇలా ఆలోచిస్తూ అచటి నుండి కదిలిపోయింది బిందు.

‘ఆ సిద్ధార్థ చదువు ఎలాగూ అయిపోయింది. అతను ఇక ఇక్కడ నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు అతని జ్ఞాపకాలు మరుగున పడిపోతాయి. తన కర్తవ్యం ఏంటో కూతురికి తెలుస్తుంది. అంత వరకూ తను సంయమం పాటించాలి. నేడు సమాజం, ప్రపంచం ఎంత ముందుకు దూసుకు వెళ్తున్నా మనుష్యుల్లో మాత్రం సంయమం కొరవడుతోంది. మనుష్యులు బాలెన్స్ తప్పుతున్నారు. ఫలితంగా మానవ విలువలు, ప్రాపంచిక విలువలు మసక బారుతున్నాయి.’

ఇలా భావుకతతో ఆలోచిస్తోంది ఉమాదేవి. ఆమె ప్రస్తుత పరిస్థితికి, తన ఆలోచనలకి పొంతం లేదని అనిపించినా భావుకత ఆమెను విడిచి పెట్టలేదు.

అధ్యాయం-38

మనల్ని అభిమానించే వాళ్ళకంటే మనం అభిమానించే వాళ్ళంటే మనకి ఎంతో ఇష్టమయిన వాళ్ళగా అగుపడ్తారు. భావ మనోవికారాల్లో అది ప్రేమ అవచ్చు, శ్రద్ధ అవచ్చు, ఆపేక్ష అవచ్చు. ఆ ఇష్టం సిద్ధార్థ వ్యక్తిత్వం చూసి అవచ్చు, అతని రూపం చూసి అవచ్చు, అతని గుణాలు చూసి అవచ్చు. ఏది ఏమైనా బిందు సిద్ధార్థను ఇష్టపడుతోంది అన్నది నిజం. భౌతికంగా కాకపోయినా మానసికంగా అతనికి చేరువయింది.

బిందు సిద్ధార్థను ఇష్టపడ్తున్నట్టే రవిని శకూ ఇష్టపడుతోంది. అయితే ఆమె గుంబనంగా ఉంది. పైకి మాత్రం తేలలేదు. బిందుది, శకూదీ ఇద్దరిదీ మూగ ఆరాధనే. అందుకే సుకుమారి బిందు దగ్గర సిద్ధార్థ ప్రస్తావన తెచ్చింది.

ఫేర్‌వెల్ ఫంక్షన్ రోజున కాలేజీ ప్రాంగణం కళకళలాడుతోంది. ఎవరిని చూసినా వారి ముఖాల్లో ఆనందం, సంతోషం, వాటితో పాటు ఒకింత ఆవేదన తొంగి చూస్తోంది. ఇంత వరకూ తమతో కలిసి చదువుకుని, కలిసి తిరిగిన వాళ్ళు ఇక కాలేజీలోకి అడుగు పెట్టరు. ఇక వారు తమకి కనిపించరు అనే ఆవేదన తొంగి చూస్తోంది. అయినా తప్పదు. కొత్త నీరు వస్తే పాత నీరు ముందుకు సాగుతుంది. విద్యార్థులు, చదువు విషయంలోనూ అంతే పాత విద్యార్థులు చదువులు ముగించుకుని పోతుంటే క్రొత్తవారు వచ్చి విద్యా సంస్థలో వచ్చి చేరుతారు.

“బిందూ! పాపం సిద్ధార్థ నీకు మరి అగుపించడు. అతను కాలేజీ విడిచి వెళ్తున్నాడు. శకూ పరిస్థితీ అంతే, రవికి దూరమవుతోంది శకూ!” ఈ రెండు ప్రేమ జంటల గురించి తెలిసిన సుకుమారి సానుభూతి చూపిస్తూ అంది.

“అవునవును” కొన్ని కంఠాలు కోరస్‌గా పలికాయి. అయితే బిందు మనస్సు కకావికలమై ఉంది. అనుభూతుల్ని అందుకునే స్థితిలో లేదు బిందు. ఆమె మనస్సు నిండా ఆవేదన. ఏదో తెలియని గుబులు. తనకీ శకూకీ ఉన్న తేడా అదే. తను సిద్ధార్థను ఇష్టపడ్తున్నట్టే రవిని ఇష్టపడుతోంది.

అయితే రవి తనకి దూరమవుతాడన్న దిగులు శకూలో లేదు అని అనిపిస్తోంది, ఆమె హావభావాలు, ముఖ కవళికలు చూస్తుంటే. ఉన్నా తన బాధను తనలోనే దాచుకునే గుణం శకూది. అలాంటి గుణం ఆమె పెరిగిన వాతావరణం బట్టి ఆమెకి అలవడింది. అందుకే నిండుకుండ అనచ్చు. తను ఉత్త పిరికిది. పైకి గంభీరంగా ఉన్నట్టు అగుపిస్తుంది. కాని తనలో ఉన్నంత బేలతనం మరెవ్వరిలోనూ ఉండదేమో అని అనిపిస్తుంది. చప్పున ఎమోషన్సుకి గురవుతుంది. భావోద్వేగాలు, భావోద్రేకాలు తనని మరింతగా ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. ఇలా సాగిపోతున్నాయి బిందు ఆలోచన్లు.

“సుకుమారీ! నీకు సెన్సు లేదు. ఇవాళ ఆనందంగా గడుపుకుంటున్న సమయంలో నీవిలా మాట్లాడ్డం అవసరమా? పరిస్థితుల్ని బట్టి మాట్లాడ్డం తెలియదా? నీ శరీరం పెరిగింది కాని నీ ఆలోచనా విధానం మాట తీరు మారలేదు,” ఓ సీనియర్ సుకుమారిని సున్నితంగా మందలిస్తూ అంది.

“సారీ! బిందూ! నేనంత డీప్‌గా ఆలోచించలేదు, క్యేజువల్‌గా అన్నాను. నా మాటలేం పట్టించుకోకు సుమీ!” బాధపడ్తూ అంది సుకుమారి.

“అదేం లేదు,” అంది బిందు ముఖం మీద నవ్వును తెచ్చి పెట్టుకుంటూ.

“మరిచేపోయాను ఇవాళ నీ డాన్సు ప్రోగ్రామ్ ఉంది కదూ! ఈ ఉత్సాహ సమయంలో నేను ఇలాంటి ప్రస్తావన తెచ్చేనేంటి? పిచ్చిదాన్ని నా మాటలు పట్టించుకోకు. వెళ్ళి డాన్సు ప్రాక్టీసు చెయ్యి,” అంటూ సుకుమారి ముందుకు నడిచింది.

“బిందూ! సుకుమారి మాటలే ఆలోచిస్తున్నావా?” శకూ అక్కడికి వచ్చి అంది.

“సుకుమారి మాటల్లో నిజం – నిజాయితీ ఉంది శకూ. ఆమె చెప్పింది కూడా యథార్థమే. ఆ యథార్థాన్ని గ్రహించలేక ఒక్కొక్క సారి మనమే అజ్ఞానులం అవుతాము. అయితే ఒక విషయం. నాకు ఏమనిపిస్తోందంటే జీవితాన్ని సుఖమయం చేసుకోడానికి దేనినైనా ఎవరినయినా తక్కువ ఆశించడం మంచిది. అసలే ఆశించకుండా ఉండలేం కాని. అలా తక్కువ ఆశించటంలోనే ఆనందం ఉంది.”

“నీవు చెప్పింది నిజమే బిందూ! ఈ మధ్యనే భగవద్గీత చదివాను. అక్కడ ఒక దగ్గర కృష్ణుడు అర్జునునితో అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. పని చేయడం నీ విధి. పని ఫలితాన్ని కాదు. పని వల్ల వచ్చే ఫలితానికి నీవు హేతువు కారాదు. ఇది జీవిత సత్యం. ఏమీ ఆశించకుండా చేసిన పనిలో ఫలితం ఆనందం కలిగిస్తుంది. ఫలితానికి నీవే హేతువు అని అనుకుంటే గర్వం కలుగుతుంది. అట్లా అని పని మానరాదు. ఎందుకంటే పనియే జీవితం.”

శకూ పెద్ద పెద్ద మాటలు బిందూకి అర్థం కావటం లేదు. ఇన్ని మాటల్ని లోతైన గంభీరమైన మాటల్ని శకూ నోటి వెంబడి వింటూ ఉంటే వింతగా ఉంది బిందూకి.

“అయితే ఈ సమయంలో నీ మాటల్లో అర్థం ఏంటి?”

“బాగా ఆలోచిస్తే నీకే అర్థం అవుతుంది.”

“నీ అంత అవగాహన శక్తి నాకు లేదు అని ఒప్పుకుంటున్నాను.”

“సిద్ధార్థ మీద నీకు ఇష్టం కలిగింది. అది ప్రేమ అవచ్చు, ఆకర్షణ అవచ్చు, అనురాగం అవచ్చు. ఆ ఇష్టం కారణం చేత అతని చదువు మధ్యలో ఆగిపోతోందని తెలిసి కలత చెందావు. ఆర్థికంగా ఆదుకున్నావు. అంత వరకూ బాగానే ఉంది. ఆర్థికంగా అతడ్ని ఆదుకున్నానని ఫలితాన్ని ఆశించకూడదు. ఏమీ ఆశించకుండా చేసిన పని ఫలితం ఆనందాన్ని ఇస్తుంది.”

శకూ మాటలకి బిందూ చిన్నబుచ్చుకుంది. “నన్ను ఇదేనా నీవు అర్థం చేసుకున్నది. నేను ఏదో ఫలితాన్ని ఆశించి సిద్ధార్థకి సహాయ పడలేదు” అంది.

“అలా అయితే మంచిదే. ఒక్క మాట. జీవితం ఆశల, నిరాశల, దురాశల మీద ఆధారపడి ఉంది. ఆశ మనిషిని బతికిస్తుంది. నిరాశ మనల్ని కృంగదీస్తుంది. దురాశ మరీ చెడ్డది. అది దుఃఖం కలిగిస్తుంది. మనం ఆశించినది ఒకటయి, జరిగింది వేరొకటి అయితే మనకి అశాంతే మిగులుతుంది. అలా కాకుండా దేనినయినా మనం తక్కువ ఆశించి, ఎక్కువ ఫలితం లభిస్తే మనకి సంతోషం కలుగుతుంది. జీవితం సుఖమయం చేసుకోడానికి తక్కువ ఆశించడం మంచిది.”

శకూ గంభీరమైన, లోతైన మాటల్ని మననం చేసుకుంటోంది బిందు. “మీరిద్దరూ ఇలా మాట్లాడుతూ కూర్చుంటారేంటి? అవతం లంచ్  టైమ్ అవుతూ ఉంటే,” తిరిగి అక్కడికి వచ్చిన సుకుమారి అంది. “ఆఁ వస్తున్నాం.” అంది శకూ!

“బిందూ! నేను అన్న విషయం గురించే కదూ ఆలోచిస్తున్నావు.”

“అబ్బే! అదేం లేదు,” బిందు సమాధానం.

డైనింగ్ హాలు మహా సందడిగా ఉంది. అది చాలా పెద్ద హాలు. గుంపులు గుంపులు కొద్దీ అమ్మాయిలూ – అబ్బాయిలు. ఆ హాలు నిండా అగుపడ్తున్నారు. ఆ హాలులో ఒక వేపు పెద్ద స్టేజ్ ఉంది.

ఆ స్టేజ్ మీద రకరకాల వినోద ప్రదర్శనలు జరుగుతున్నాయి. సినీమా యాక్టర్సు గొంతుకల్ని అనుకరిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు కొందరయితే రాజకీయ నాయకుల్ని అనుకరిస్తూ మాట్లాడుతున్న వాళ్ళు మరి కొంతమంది. వింటూ, చూస్తూ వినోదిస్తున్నారు అమ్మాయిలూ – అబ్బాయిలూ. బఫే భోజనాలు. అమ్మాయిలూ అబ్బాయిలూ ప్లేట్లు పట్టుకుని ప్లేట్లలో ఆదరువుల్ని వేయించుకుని తినడానికి వుద్యక్తులవుతున్నారు.

“ఈ కర్రీ ఏంటో తెలుసా?” ఓ విద్యార్థి గట్టిగా అరిచాడు. తింటున్న వాళ్ళందరి దృష్టి ఆ విద్యార్థి మీద నిలిచింది.

“అదా! గుత్తి వంకాయ కూర,” మరో విద్యార్థి అరిచాడు.

అందరి ఆలోచన్లు వర్తమానం నుండి భూతకాలంలోకి మళ్ళాయి. ఒక్కసారి ర్యాగింగ్ రోజులు గుర్తుకు వచ్చాయి. ముఖ్యంగా బిందూ, శకూ కాలేజీలో జాయినయినప్పటి ర్యాగింగ్ దృశ్యాలు అందరికీ స్మృతి పటలంలో మెదులుతున్నాయి.

“బిందూ! పాత రోజులు రిపీట్ అవుతున్నాయి. ప్లీజ్! నా మాట వింటావా?” బ్రతిమాలుతున్నట్లు అంది సుకుమారి.

“ఏంటి?”

“ర్యాగింగ్ సమయంలో సిద్ధార్థ చేత గుత్తి వంకాయ కూర తినిపించావు. ఆ పని మరో పర్యాయం చేయవా?” అంది సుకుమారి.

“చేయాలి. తప్పదు, తప్పదు” అనేక కంఠాలు ఒక్కసారే పలికాయి.

సిగ్గు ముంచుకొస్తుండగా చిరునవ్వుతో “అలాగే,” అంది బిందు.

“క్విక్!” అందరూ ఒక్కసారి అరిచారు.

బిందే యాంత్రికంగా సిద్ధార్థ ఉన్న వేపు అడుగులేస్తోంది. గుత్తి వంకాయ కూర పట్టుకుని తమాషాగా తల పైకెగరేస్తూ బిందు వేపు అపురూపంగా చూస్తున్నాడు సిద్ధార్థ.

“అప్పటి లాగే నీ చేత ఈ కర్రీ తినిపించమన్నారు కదూ!” సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు.

“అవును.”

“అయితే ఎందుకాలస్యం?” అంటూ నోరు తెరచాడు సిద్ధార్థ. ఆ కర్రీ అతని నోటికందించింది. అలా చేస్తున్నప్పుడు ఆమెలో రెండవ సారి మధురానుభూతులు చోటు చేసుకున్నాయి. ఆమె తన్మయత్వాన్ని ఓర కంటితో అవలోకిస్తున్న అతని మనస్సు నిండా సంతోషం. మరుక్షణమే ఆత్మీయులైన మనుష్యుల్ని పరిచయం అయిన పరిసరాలను విడిచి వెళ్ళిపోతున్నానే అనే బాధ అతని వదనంపై కదలాడింది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here