జ్ఞాపకాల పందిరి-177

21
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

చాలా ఏళ్ళ తర్వాత సుల్తాన్ బజార్‌కు..

[dropcap]ఒ[/dropcap]కప్పుడు హైదరాబాద్ లోని సుల్తాన్ బజార్‌ ఒక ప్రత్యేకతను సంతరించుకుని ఉండేది. ఒక్క హైదరాబాద్‌కే కాదు, హైదరాబాద్ – సికిందరాబాద్ జంటనగరాలకు సుల్తాన్ బజార్ ఒక దర్శనీయ ప్రదేశంగా ఉండేది. అప్పట్లో కోఠీ, సుల్తాన్ బజార్, అబిడ్స్ వంటి ప్రదేశాలు ముఖ్య వ్యాపార కేంద్రాలుగా ఉండేవి. ఈ మూడు ప్రదేశాలూ ఒకదానిని ఒకటి ఆనుకుని ఉండడం కూడా మరొక ప్రత్యేకత. ఇప్పుడు ప్రతి చోట ఫ్లైఓవర్‌లు వచ్చి అంతా మూసుకు పోయినట్టు అయింది కానీ అప్పుడు ఉదయం నుండి రాత్రి వరకూ జనంతో క్రిక్కిరిసి ఉండేది. కారణం అన్నింటికీ ముఖ్య కూడలిగా ఉండేది. అందరికీ అందుబాటులో వుండే చిన్న చిన్న వ్యాపారాలు, కూరగాయల అంగడి అన్ని వర్గాల ప్రజలకూ అందుబాటులో ఉండే విధంగా ఉండడం, కొనుగోలుదారులే కాక, సరదాగా జనాన్ని చూడడానికి వచ్చే కుర్రకారుతో సుల్తాన్ బజార్ కళకళ లాడుతుండేది. తర్వాత కోఠి నుండి జంటనగరాలలోని ప్రతి ప్రాంతానికీ బస్సు సౌకర్యం ఉండేది. డబుల్ డెక్కర్ బస్సులు (మేడ బస్సులు), ట్రైలర్ బస్సులు ఇక్కడినుండి ప్రారంభం అయ్యేవి. ప్రత్యేకమైన రూపంలో ఆంధ్రాబ్యాంక్ (ఇప్పుడు యూనియన్ బ్యాంకు) భవనం, బ్యాంకు ప్రధాన కార్యాలయం అక్కడే ఒక చూడదగ్గ భవనంలా కనిపించేది. సాహిత్యకారులకు మాత్రం ఇష్టమైన గ్రంథాలయం/సమావేశ మందిరం సుల్తాన్ బజార్ లోనే ఇప్పటికీ వుంది.

లేఖిని ఆహ్వానం

అది ఒకప్పుడు, ‘శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం’ గా పిలవబడేది. ఇప్పుడది ‘శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం’గా పిలవబడుతున్నది. బహుపురాతన ప్రభుత్వేతర గ్రంథాలయాలలో ఇది ఒకటని చెబుతారు. ఈ గ్రంథాలయం సెప్టెంబర్ ఒకటి,1901 నాడు ప్రారంభించినట్లు చరిత్ర చెబుతున్నది. తెలంగాణలో మొదటి పురాతన గ్రంథాలయంగా దీనిని చెబుతారు.

నాన్నలేని కొడుకు నవల

నేను 1967 ప్రాంతం నుండి హైదరాబాద్‌తో సంబంధాలు కలిగి ఉండడం వల్ల, ఈ శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గురించి నాకు తెలుసును.

అప్పట్లో పెద్ద పెద్ద సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రభుత్వ కార్యక్రమాలు రవీంద్రభారతిలో జరిగేవి. ఇక చిన్న చిన్న సాహిత్య కార్యక్రమాలైనా నాణ్యమైన కార్యక్రమాలు ఈ గ్రంథాలయంలో జరిగేవి. అలాంటి కార్యక్రమాలలో నాటి ‘యువభారతి’ పేరుతో జరిగిన కార్యక్రమాలు చెప్పుకోదగ్గవి. మహా గొప్ప సాహితీవేత్తలను నేను అక్కడే చూసాను. మంచి మంచి సాహిత్య ఉపన్యాసాలు, అవధానాలు, కవి సమ్మేళనాలు అక్కడ చూచాను, విన్నాను. శ్రీ దివాకర్ల వెంకటావధాని, శ్రీ జి, వి. సుబ్రహ్మణ్యం, శ్రీ సి.నా.రె, శ్రీ బిరుదురాజు రామరాజు, శ్రీమతి యశోధరా రెడ్డి, శ్రీ శీలా వీర్రాజు, దేవులపల్లి రామానుజరావు గారు, శ్రీ సుధామ వంటి సాహితీ పెద్దలను, కానేటి మధుసూదన్, శ్రీ ఎస్. వి. ఎల్. ఎన్. శర్మ వంటి కార్యకర్తలను నేను అక్కడ చూచాను.

నవలా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు

యువ భారతి లోగోను స్వర్గీయ శీలా వీర్రాజు గారు వేసినట్టు గుర్తు. ఎందుచేతనంటే ఆయన అక్షరాలను సులభంగా గుర్తు పట్టవచ్చును. యువభారతి వారు అప్పట్లో ఉషస్సు.. అనే కవితా సంకలనం ప్రచురించినట్టు గుర్తు (ఇంకా అనేక సాహితీ గ్రంథాలు ప్రచురించారు). అందులో ఎక్కువ యువకవులకు కవయిత్రులు ప్రాధాన్యం ఇచ్చారు. ఇది నాకు బాగా గుర్తుండి పోవడానికి ప్రధాన కారణం మా చిన్నన్నయ్య డా మధుసూదన్ కానేటి (ఆకాశవాణి విశాఖపట్నం) కవిత కూడా ఆ కవితా సంకలనంలో వుంది.

సమావేశంలో వేదిక

అయితే అప్పుడు ఈ గ్రంథాలయంలో సమావేశ మందిరం అంత సౌకర్యంగా ఉండేది కాదు. రోడ్డుకు కాస్త ఎత్తుగా వుండి మెట్లు ఉండేవి. హాలు మామూలుగా ఉండేది. ఒక ప్రక్క గ్రంధాలయమూ ఉండేది. నా చదువు పూర్తి అయి ఉద్యోగంలో చేరిన తర్వాత, నాకు సుల్తాన్ బజార్ గాని, శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయం గాని చూడవలసిన అవసరం రాలేదు. ఎందుకంటే నా ఉద్యోగ పర్వం అంతా, వరంగల్ – కరీంనగర్ జిల్లాలలోనే ముగిసిపోయింది.

ఈ నేపథ్యంలో, మొన్నీమధ్య అంటే 1980 తర్వాత మళ్ళీ ఇప్పుడు సుల్తాన్ బజార్‌ను, అక్కడ వున్న శ్రీకృష్ణ దేవరాయ భాషా నిలయాన్ని చూసే అవకాశం కలిగింది. ఈ సదవకాశం కలిగించిన వారు, హైదరాబాద్‍, చెందిన ‘లేఖిని రచయిత్రుల వేదిక’. ముఖ్యంగా ప్రముఖ కథా రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారి ద్వారా జరిగింది. అది పూర్తిగా స్త్రీమూర్తుల వేదిక. మరి నన్ను ఎందుకు పిలిచారో ముందు అర్థం కాలేదు.

అలా 16-08-2023 సాయంత్రం సుల్తాన్ బజార్ లోని శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయానికి వెళ్లాను. ఒకప్పుడు నేను చూసిన భాషా నిలయం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. మొదటి అంతస్తులో చిన్న ఏసీ – సమావేశమందిరం కట్టారు. చిన్న చిన్న సమావేశాలకు అది చాలా అనువుగా వుంది. ఇంతకీ అక్కడ కార్యక్రమం ఏమిటంటే, శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మిగారు, సంచిక – అంతర్జాల వారపత్రికలో రాసిన చిరు సీరియల్ నవల పుస్తక రూపంలో రావడంతో, ఈ వేదిక ఆధ్వర్యంలో కొందరు సాహితీ మిత్రులతో చర్చా సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఆ నవల పేరు ‘నాన్నలేని కొడుకు’. నవల టైటిల్ వింతగా అనిపించింది.

ఉపన్యసిస్తున్న రచయిత

కార్యక్రమం 5 గంటలకే ప్రారంభం కావలసి వున్నా రావలసిన వారు సకాలంలో రాకపోవడంతో కాస్త ఆలస్యంగానే సభ ప్రారంభమయింది. ముప్పై మంది వరకూ సభ్యులు వచ్చారు. అందులో మగప్రాణిని నేను ఒక్కడినే! అదృష్టవశాత్తు అక్కడ నా చిరకాల మిత్రమణి శ్రీమతి ఝాన్సీ కొప్పిశెట్టి, సాహితీ పెద్దలు శ్రీమతి శీలా సుభద్రాదేవి, శ్రీమతి అల్లూరి గౌరీలక్ష్మి గార్లు సమావేశంలో ఉండడంతో నాకు కొంత ఉపశమనం లభించినట్లయింది. ఈలోగా నిర్వాహకులు ఏమనుకున్నారో ఏమోగానీ, సంచిక పత్రిక పక్షాన నన్ను కూడా వేదిక మీదికి పిలవడం వల్ల అక్కడ నేను అనుకోని అతిథినయ్యాను. వేదిక మీద కూడా కొంత ఇబ్బందికి లోను కాక తప్పలేదు. అక్కడ ఒక్క విజయలక్ష్మి గారు మాత్రమే నాకు పరిచయం.

నవల గురించి వివిధ రచయిత్రులు తమ సూచనలను, స్పందనను వినిపించారు. కొందరు నవల నిడివిని పెంచమన్నారు. కొందరు కొన్ని పాత్రల స్వభావాన్ని పెంచమన్నారు. ఇలా తమ తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించారు. నాకు ఇటువంటి సమావేశం కూడా కొత్త. అందుకే వేదిక మీద వుండి, శ్రద్ధ గల శ్రోతనయ్యాను. చివరగా విన్న విషయాలు క్రోడీకరించి నేను కూడా రెండు నిముషాలు మాట్లాడాను. నిజానికి అది ఒక సాహిత్య కార్యక్రమంలా కాకుండా, ఒక ఆత్మీయ సమ్మేళనంలా ఆనందంగా ముగిసింది.

లేఖిని సభ్యులతో రచయిత

ఈ విధంగా కొన్ని సంవత్సరాల తర్వాత, సుల్తాన్ బజార్‌ను, శ్రీ కృష్ణ దేవరాయ భాషా నిలయాన్నీ చూసే అవకాశం కలిగింది. అనుకోని విధంగా ఈ అవకాశం కలిగించిన, లేఖిని రచయిత్రుల వేదికకు, ముఖ్యంగా ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్మి గారికి కృతజ్ఞతలు చెప్పకుండా ఉండలేను. సాహిత్య పరంగా ఇది నాకు ప్రత్యేక అనుభవం.

విద్యార్థి దశలో సాయంత్రం పూట సుల్తాన్ బజార్‌లో, మిత్రులతో సరదా షికార్లు మరచిపోదామన్నా మరచిపోయేవి కాదు, ఆ.. రోజులే వేరు కదా!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here