కలవల కబుర్లు-33

0
3

[ప్రసిద్ధ రచయిత్రి కలవల గిరిజారాణి గారు అందిస్తున్న ఫీచర్ ‘కలవల కబుర్లు’.]

[dropcap]శ్రా[/dropcap]వణమాసం వచ్చిందంటే ప్రతీ ఇల్లూ, సందడి సందడే. ముందుగానే ఇల్లూ వాకిలీ శుభ్రపరుచుకోవడం, బూజులు దులుపుకోవడాలూ ప్రతీ ఇల్లాలూ తలమునకలై వుంటుంది కదూ?

ప్రతి వాకిలి ముందు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తూ అందమైన రంగవల్లులు తీర్చిదిద్దడంతో మొదలెడతారు. వ్రతాలూ, పసుపులీను పాదాలూ, కుంకుమ మెరిసే ఫాలభాగాలు, పట్టుచీరలూ, పేరంటాలు, తొమ్మిది ముడుల చేమంతుల తోరాలు, వరలక్ష్మి ప్రతిమలూ, కలశాలూ, పేరంటాలూ, ఇస్తినమ్మ వాయినాలూ, పుచ్చుకుంటి వాయినాలూ, శెనగలూ, నగలూ..

ముందురోజే కావలసిన వస్తువులని, సంభారాలనీ సమకూర్చుకుని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని ఆవాహన చేసి, పూజలనొనర్చి, నవకాయ పిండి వంటలని నివేదన చేసి, సాయంత్రం ఇరుగు పొరుగులని పిలిచి వారితో కలిసి అమ్మవారిపైన కీర్తనలో, పాటలో కాసేపు పాడుకుని, పసుపు కుంకుమ, పండు తాంబూలం ఇచ్చి సాగనంపేవారు.

ముందురోజే ఎవరయితే వరలక్ష్మి వ్రతం చేసుకుని పేరంటం చేసుకోదలిచారో వారు ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టు పెట్టి, రేపు మా ఇంటికి వాయినం తీసుకుందికి రండి అంటూ ఆహ్వానించేవారు.

మరిప్పుడు అందరూ వుండే సామూహిక వాట్సాప్ గ్రూప్‌లో, ఓ మెసేజ్ పెట్టేయడమే.

ఆ రోజుల్లో సాయంత్రాలు ఇలా పేరంటానికి వెళ్ళడం గుర్తుందా? శెనగలు, పండు తాంబూలం జేబురూమాలికి మూట కట్టుకుని ఇంటికి చేరే వాళ్ళు. మధ్యలో ఇంటికోసారి వచ్చి, నిండిన ఆ శెనగల మూటని గిన్నెలో పోసుకుని మరో పేరంటానికి వెళ్ళడం. ఎవరింటికీ కూడా మానేయకుండా వెళ్లి పసుపు కుంకుమ తీసుకునేనారు.

ఇదంతా ఒకప్పటి సంగతి.

ఇప్పుడు ఆరాధన కన్నా ఆర్భాటం ఎక్కువ అయిపోయింది. ఇళ్లలోనే పెద్ద ఎత్తున అమ్మవారి విగ్రహాలు ఏర్పాటు చేసేసి ఇల్లే ఒక గుడిలా మార్చేసి అలంకారాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వాటికే వున్న సమయమంతా అయిపోతోంది. ఆ అలంకారం కూడా వేలం వెర్రిగా ఒకరిని చూసి మరొకరు, తమ తమ స్తోమత దాటిపోయి కూడా చేయడం జరుగుతోంది. ఉన్నంతలో చేసుకోవచ్చు కాదనడం లేదు. కానీ, ఫోటోలూ, వీడియోలూ, ఇన్‌స్టాలో రీల్స్ పెట్టడం కోసమే ఈ పూజలు అన్నట్లు చేస్తున్నారు కొందరు. అమ్మవారికి చేసే పూజలకన్నా, తాము ప్రదర్శించే నగలు, వెండి బంగారాలని, పట్టుచీరలని ఎగ్జిబిట్ చేయడం ఎక్కువ అవుతోంది.

అసలు ఈ సోషల్ మీడియా మూలానా, యూట్యూబ్ లలో రకరకాలుగా చెప్పడం మూలానా ఈ వెర్రి పెరిగిపోతోంది. ఇదివరకటి రోజుల్లో ఇలా లేదు. ఈ మధ్యనే కొత్త కొత్త పూజలు, వ్రతాలూ కూడా మొదలయ్యాయి.

ఇక దీపాల విషయానికి వస్తే.. ఫలానా దేవుడికి ఫలానా కుందెలోనే దీపం పెట్టాలి. దీంతో ఇత్తడి సామానుల వ్యాపారుల వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా వుంటోంది. ఫలానా నూనె మాత్రమే పొయ్యాలి. ఇన్ని వత్తులు మాత్రమే వేయాలి అంటూ ఒకొక్కరు ఒకొక్క రకంగా చెపుతూ చెవుల తుప్పు వదిలేస్తున్నారు. దేముడికి దీపం పెట్టడం ముఖ్యం. అంతేకానీ తాబేలు దీపం పెట్టామా? వెంకటేశ్వరని నామాలున్న ప్రమిదలో పెట్టామా? కామాక్షి దీపం పెట్టామా? అనేది ముఖ్యం కాదు. సాధారణంగా మట్టి, రాగి, ఇత్తడి, వెండి ప్రమిదల్లో పెట్టాలంటారు. కానీ ఇప్పుడు ఇతర లోహాలు కూడా పూజల్లో చోటు చేసుకోవడం కనపడుతోంది.

అసలు పూర్వీకులు, మన అమ్మలు, అమ్మమ్మలు ఆచరించిన పద్ధతులు కనుమరుగైపోయి, యూట్యూబ్ లలో పుట్టగొడుగులులాగా వచ్చేసి చెప్పేవారివే నిజం కాబోలనుకుని, అలా చేస్తేనే అమ్మవారి కృపకు నోచుకుంటాం కాబోలనుకునేవారే ఎక్కువగా వున్నారు.

ఇంటి ఆనవాయితీ ప్రకారం చేసుకునే పూజలు, ప్రసాదాల స్థానే కొత్త కొత్త రకాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు, వ్రతం ఆచరించేరోజు ఉదయం శుచి శుభ్రతతో నైవేద్యాలు వండి అమ్మవారికి నివేదన చేసే సమయం సరిపోవడం లేదట. ముందురోజునే పూర్ణం చేసుకోవచ్చు, పులిహోర పేస్ట్ చేసుకోవచ్చు అంటూ ఇచ్చే సలహాలని పాటించడం జరుగుతోంది. మరి ఇదివరలో మనకి ఇప్పుడు వున్నటువంటి ఆధునిక సౌకర్యాలు ఏమీ లేకుండానే మనవాళ్ళు ఒక పక్క పూజ, మరో పక్క నవకాయ పిండి వంటలు సమయానికి ఎలా అమర్చుకునేవారో?

ఈ మధ్య మరో అడుగు ముందుకు వేసి, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితికి ప్రసాదాలు ఆన్‌లైన్‌లో కూడా బుక్ చేయడం జరుగుతోంది.

ఓపిక లేకపోతే ఇంత పప్పో, పులగమో, బెల్లం ముక్క వేసి పాలో నైవేద్యం పెట్టినా మన అమ్మవారు ఏమీ అనుకోరు. ఆవిడకి కావలిసినది మనం భక్తి శ్రద్ధలతో పూజ సలపడమే కావాలి. మన మనసులో రూపు దిద్దుకున్న ఆ అమ్మవారి రూపాన్ని మనం మన ఇంట్లో ఎలా ప్రాణ ప్రతిష్ఠ చేసినా, ఆ రూపంలోనే ప్రత్యక్షమవుతుంది. మనం చేసే ఆరాధనకి ముగ్ధురాలవుతుంది. మనస్ఫూర్తిగా మనం ఏదిచ్చినా స్వీకరిస్తుంది. తన చల్లని చూపుతో మనల్ని అనుగ్రహిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here