మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు-4

0
4

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మన ప్రాచీన సాహిత్యంలో వ్యక్తిత్వ వికాస పరిమళాలు’ అనే వ్యాస పరంపరని అందిస్తున్నాము.]

Othello and Desdemona:

[dropcap]షే[/dropcap]క్‌స్పియర్ వ్రాసిన ఒథెల్లో నాటకంలో ఆయనకు తన భార్య డెస్డిమోనాపై అనుమానం కలిగేంత వరకు తన evil design ను కొనసాగిస్తాడు ఇయాగో. ఒథెల్లో అందవిహీనుడు. డెస్డిమోనా అతిలోక సౌందర్యరాశి. కానీ అతని వీరత్వాన్ని, పరాక్రమాన్ని ఆమె త్రికరణ శుద్ధిగా ప్రేమించింది. అతడు వికారరూపుడనే ఊహే ఆమె మనసులో లేదు. కానీ ఒథెల్లోలో ఒక inferiority complex ఉంటుంది. భార్య సౌందర్యవతి అయిన పురుషులందరిలో ఇది సహజం అంటారు ప్రఖ్యాత సాహిత్య విమర్శకులు మేథ్యూ ఆర్నాల్డ్.

ఇయాగోను కాకుండా క్యాసియో (Cassio)ను తన chief lieutenant గా నియమిస్తాడు ఒథెల్లో. ఇయాగో ఒథెల్లో మీద ద్వేషాన్నీ, క్యాసియో మీద అసూయను పెంచుకుంటాడు. ‘Prince of Essayists’ అని పేరుగాంచిన Francis Bacon ఇలా అంటారు – “Envy takes no holidays”.

నాలుగు పదాల వాక్యమైనా, వ్యక్తిత్వ వికాసానికి తీవ్రమైన ప్రమాదాన్ని తెచ్చిపెట్టే అసూయను గురించి brief గా, effective గా చెప్పారు బేకన్. ‘అసూయకు సెలవులుండవు’ అంటే ‘మనిషి మనస్సులో అసూయ నిరంతరం పని చేస్తూనే ఉంటుంది’ అని అర్థం.

క్యాసియోకు, డెస్డిమోనాకు అక్రమ సంబంధం ఉందని ఒథెల్లోకు నూరిపోస్తాడు ఇయాగో. బలహీన మనస్కుడైన ఒథెల్లో అది నమ్ముతాడు.

ఎందుకు ఒథెల్లోను ప్రేమించావు? అని డెస్డిమోనాను అడిగితే, “I loved the dangers he hath passed” అని అంటుంది. అతను ఎదుర్కున్న ప్రమాదాలను చూసి అతన్ని ప్రేమించానంటుంది. ఒథెల్లోని అడిగితే, “I loved her because she loved me” అంటాడు. అటువంటి చిత్తశుద్ధి కలిగిన భార్యాభర్తలను విడదీయగలిగాడు ఇయాగో. చివరికి ఒథెల్లో తన భార్యను అనుమానంతో, గొంతు నులిమి హత్య చేస్తాడు. తర్వాత ఆమె నిర్దోషి అని తెలుస్తుంది. అనంతమైన పశ్చాత్తాపంతో, మనోవేదనతో తానూ చనిపోతాడు.

కళాతపస్వి కె. విశ్వనాథ్ ‘స్వాతికిరణం’ అనే అద్భుతమైన సైకలాజికల్ సినిమా తీశారు. అందులోని థీమ్ కూడా అసూయే. ఒక మహా గాయకుడు ఒక చిన్నపిల్లవాడిపై అసూయ పెంచుకుంటాడు. కారణం వాడు తనకంటే బాగా పాడుతున్నాడని. ఆ పిల్లవాడు చచ్చిపోయేంత వరకూ ఆ అసూయ ఆయనను వదలదు.

దీన్ని బట్టి తెలిసిందేమిటి? అసూయ అనేది సమాన హోదా, సమాన స్థాయి కలవారి మధ్యే ఉండాల్సిన పని లేదు. రామాయణం, ఒథెల్లో, స్వాతికిరణం వరకూ వెళ్ళనక్కరలేదు. మన మామూలు దైనందిన జీవితాల్లో కూడా ఇది ప్రభావాన్ని చూపుతుంది. ఉదాహరణకు ఒక ఇంట్లో పనిమనిషి ఉంది. ఆమె భర్త తాగుబోతు. అదేమిటో గాని, చాలా మటుకు, పనిమనుషుల భర్తలు తాగుబోతులై ఉంటారు. కుటుంబాన్ని పట్టించుకోకుండా బాధ్యతారహితంగా ఉంటారు. మంచి భర్తలు కూడా అరుదుగా ఉంటారు.

పనిమనిషి భర్త తాగి వచ్చి ఆమెను తంతాడు. ఆమె కష్టపడి సంపాదించిన డబ్బును లాక్కుపోతుంటాడు. ఆమె జీవితం నిజంగా దుర్భరం. ఆమె పని చేసె ఇంట్లో అమ్మగారిని, ఆమె భర్త ప్రేమగా చూసుకుంటూ ఉంటాడు. ఆర్థిక వ్యవహారాలన్నీ ఆమెకే అప్పగిస్తాడు.

ఈ అమ్మగారిపై, పనిమనిషికి అసూయ! కాబట్టి దానికి సమాన స్థాయి అక్కరలేదు. దుర్యోధనుడు పాండవులపై అసూయ పడ్డాడు. అసలు అసూయకు బ్రాండ్ అంబాసిడర్ ఆయనే. అందులో కొంత లాజిక్ ఉంది. కాని పనిమనిషికి అమ్మగారికీ మధ్య? అసూయతో రగిలిపోయేవాడి మనస్తత్వాన్ని తిక్కనామాత్యుడు, భారతంలో, దుర్యోధనుని మాటల్లో అద్భుతంగా వర్ణించాడు. దానిని విశ్వవిఖ్యాతనట సార్వభౌమ యన్.టి.ఆర్. గారు ‘దానవీరశూరకర్ణ’ చిత్రంలో అద్భుతంగా పండించారు.

శ్రీనాథుని పద్యంలో కొంత భాగం..

‘కంటికి నిద్ర వచ్చునె? సుఖంబెరుగనే రతికేళి..
కంటకుడైన శాత్రవుడొకండు తనంతటివాడు గల్గినన్’.

అసూయ పడకుండా ఉండటం వ్యక్తిత్వ వికాసంలో మరో ముఖ్యమైన అంశం. అంతే కాదు, మనమంటే అసూయ పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం కూడా అంతే ముఖ్యం. అసూయ వ్యక్తిత్వాన్ని paralyse చేయగలదు. ఎంతకు దిగజారడానికైనా మనిషిని సిద్ధం చేయగలదు. Vices (దుర్గుణాలు)లో రాజు అది!

భార్యాభర్తల అనుబంధం

ఉత్తమ వ్యక్తిత్వానికి దర్పణం భార్యాభర్తల మధ్య పరస్పర అనురాగం, అవగాహన. భారతంలో భీష్మ పితామహుడు ధర్మరాజుకు ఈ బంధాన్ని ‘శరణాగత ధర్మం’గా బోధిస్తాడు. భార్య, భర్త లిద్దరూ ఒకరికొకరు శరణం అంటే ఆశ్రయం అని దానర్థం. ఇద్దరి ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు ఆ ఆజన్మ బ్రహ్మచారి!

“నాస్తి భర్తృసమో నాథః నాస్తి భర్తృ సమం సుఖం,
విసృజ్య ధన సర్వస్వం భర్తావై శరణం స్త్రియాః”

అట్లే..

“నాస్తి భార్యాసమో బంధుః నాస్తి భార్యా సమాగతిః,
నాస్తి భార్యా సమోలోకే సహాయో ధర్మసంగ్రహే”

“స్త్రీకి భర్తకి మించిన భద్రతలేదు. భర్తతో సమానమైన సుఖం లేదు. ధనమంతా పోయినా భర్తే నిజమైన తోడు. అదే విధంగా, భార్యకు సమానమైన బంధువు, శ్రేయోభిలాషి లేరు.”

ఈ భావాన్ని ఒంటబట్టించుకుంటే సంసార జీవితం కాంతులీనుతుంది. భార్యాభర్తల మధ్య అపార్థాలకు, అపోహలకు తావు ఉండకూడదు. ఒకరినొకరు అధిగమించే ప్రయత్నం (domination) చేయకూడడు. ఒకరొనొకరు సొంతం చేసుకోవాలనుకునే (possession) ఆలోచన రాకూడదు. ఇద్దరికీ ప్రత్యేక, భిన్న, వ్యక్తిత్వాలుంటాయి. అభిరుచుల్లో, అభిప్రాయాల్లో తేడాలు ఉంటాయి. వాటిని పరస్పరం గుర్తించి, గౌరవించినపుడు, ఏ సమస్యలు రావు.

William Congreve వ్రాసిన ‘The Way of the World’ అన్న నాటకం చాలా గొప్పది. దానిలోని థీమ్ ఇదే. దానిని విశ్లేషిస్తూ, ప్రముఖ మనస్తత్వ శాస్త్రవేత్త ‘Bonamy Dobree’ ఇలా అన్నారు:

“Marriages can be successful only when the ‘otherness’ of the other individual is identified and respected.”

భీష్ముడి అంతరంగం కూడ ఇదే. ‘Otherness’ అనే మాట చాలా లోతైనది. Dobree గారే దానిని సృష్టించారు. అలా సృష్టించిన పదాలను ‘coinages’ అంటారు. ఇతరులకి కూడా ప్రత్యేక వ్యక్తిత్వం ఉండడం అని అది సూచిస్తుంది.

ఈనాడు యువతరం వివాహ వ్యవస్థను అపహాస్యం చేస్తూంది. Ego clashes తో, ప్రేమించి పెళ్ళి చేసుకున్నవారు కూడా కోర్టులకెక్కుతున్నారు, విడాకుల కోసం! వీరికి జ్ఞానోదయం కలిగించడానికి social counsellors పుట్టుకొస్తున్నారు. ఇంకో కొత్త పోకడ ‘సహజీవనం’! అంటే పెళ్ళి చేసుకోకుండా, కలిసి ఉండడం! ఆ బంధాలు కూడా చాలా మటుకు చట్టుబండలవుతున్నాయి. పెళ్ళి ఎందుకు చేసుకోరంటే, ముందుచూపు! రిస్క్ ఫ్రీ! ఒకవేళ విడిపోయినా, లీగల్ సమస్యలు రాకుండా అన్న మాట. విడిపోతామని ముందుగానే ప్రిపేరయి, కలిగి ఉండేవారి బంధాలు ఎంతకాలం నిలుస్తాయి?

భార్యాభర్తలు పరస్పరం గౌరవించుకోవడం వ్యక్తిత్వ వికాసంలో తలమానికమైనది. Male Chauvinism (పురుషాధిక్యత), feminism (స్త్రీవాదం) లాంటివి ఎందుకు పుట్టుకొస్తాయంటే, పరస్పర గౌరవం లేకే.

“I love you with all your flaws” – నీ బలహీనతలన్నింటితో సహా నిన్ను నేను ప్రేమిస్తాను” అని అనగలిగినప్పుడే, నిజమైన బంధాలు పరిఢవిల్లుతాయి.

శ్రేష్ఠులను అనుసరించడం

“యద్య దాచరతి శ్రేష్ఠః తత్త దేవేతరో జనః
సః యత్ప్రమాణం కురుతే లోక స్తదనువర్తతే”

అన్నాడు శ్రీకృష్ణ పరమాత భగవద్గీతలో. సమాజంలో శ్రేష్ఠులుగా పరిగణింపబడేవారిని మనం రోల్ మోడల్స్‌గా తీసుకోవాలి. మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుకోవడానికి వారి precedences తోడ్పడుతాయి. వారు ఆచరించినదే ప్రమాణంగా సమాజం స్వీకరిస్తుంది. ఎందుకంటే వారు ఆచరించి గాని, బోధించారు కాబట్టి. ఈ శ్రేష్ఠులనే వారు మన గురువులు కావచ్చు, జాతీయ నాయకులు కావచ్చు, శాస్త్రవేత్తలు కావచ్చు, మన బంధుమిత్రులు కూడా కావచ్చు. సామాన్య మానవులలో సైతం శ్రేష్ఠులుంటారు. కర్మ, వికర్మ, అకర్మల మధ్య వ్యత్యాసాన్ని గమనించి బ్రతికేవారుంటారు. ఉదాహరణకు ఒక ఆటో డ్రైవరు బాలింతలను, గర్భవతులను తన ఆటోలు ఉచితంగా తరలిస్తున్నాడనుకోండి, అతడు నిస్సందేహంగా శ్రేష్ఠుడే. అతని నుంచి మనం సేవాదృక్పథాన్ని నేర్చుకోవాలి. మన పరిధిలో మనం ఇతరులకు చేతనైనంత సేవ చేయగలం.

“పాత పేపర్లు కొంటాం” అని కొందరు వస్తూంటారు. వారి దగ్గర కూడా గీచి గీచి బేరాలు చేసేవాళ్ళుంటారు. మనింట్లో పోగుపడిన పాత పేపర్లను, వారికి ఉచితంగా ఇస్తేనేం? వారికి కొంత తోడ్పాటుగా ఉంటుంది. అది కూడా సేవే.

Simple Living and High Thinking

‘నిరాడంబరంగా జీవించడం, ఉన్నతంగా ఆలోచించడం’ అన్నదాన్ని మహాత్మా గాంధీ, మదర్ తెరీసా, ఒబామా లాంటి వారి (శ్రేష్ఠులు) నుంచి నేర్చుకుని ఆచరించాలి. అట్లే భగవాన్ రమణ మహర్షి, షిరిడీ సాయి, ‘పెరియవ’ చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి లాంటి శ్రేష్ఠుల నుండి bliss (అలౌకికానందం) పొందే క్రమాన్ని నేర్చుకోవాలి. ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కూడా శ్రేష్ఠుడే. నిరాడంబరంగా, ఎలాంటి ప్రచారార్భాటం లేకుండా ఆయన ఒరిస్సాను ఎంతో కాలంగా పాలిస్తున్నాడు. దానికి కారణం ఆయన పరిపాలనా దక్షతే కాదు, ఆయన వినయం, ఆయన సౌశీల్యం, నిరాడంబరత!

జి. పుల్లారెడ్డి గారు మహాదాత. ఎన్నో విద్యాసంస్థలు స్థాపించారు. కర్నూలు వన్ టౌన్‍లో ఒక స్వీట్/మిక్చర్ తోపుడు బండితో మొదలయిన ఆయన వ్యాపార ప్రస్థానం, రాష్ట్రపతి భవన్‍లో జరిగే, విదేశీ అతిథులకిచ్చే, విందుల్లో సైతం పుల్లారెడ్డి స్వీట్స్ లేకుండా జరగని పరిస్థితికి ఎదిగింది. డా. దివాకర్ల వెంకటావధాని గారు ఒకసారి ఇలా చమత్కరించారు – “ఆయన పేరులో పులుపు ఉంది కాని ఆయన మనసంతా తీపే!”.

వారు హైదరాబాదులో నడుపుతూన్న ఒయాసిస్ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగం కోసం (1982లో), దివాకర్ల వారు లెటర్ వ్రాసి ఇస్తే, మెహదీపట్నం లోని వారి యింటికి వెళ్ళాను. ఇంటి బయట బెంచీ మీద సైనుగుడ్డతో కుట్టిన చేతుల బనియన్, ఒక సాధారణ పంచె ధరించి మాసిన గడ్డంతో, ఒక మధ్యవయస్కుడు కూర్చుని ఉన్నాడు. అతని దగ్గరకు వెళ్ళి “పుల్లారెడ్డి గారున్నారా?” అని అడిగాను, అతన్ని పనివాడనుకొని. ఆయన పక్కకు జరిగి, “కూచోప్పా, నేనే గదా పుల్లారెడ్డిని!” అన్నాడు. నిరుత్తరుడినయ్యాను. “క్షమించండి, మీరని తెలియక..” అని నీళ్ళు నములుతుంటే, “క్షమించేంది ఎందుకప్పా, నీకు తెలియదు కదా, నేనేనని? దాందేముంది గానీ, యా పని మీద వచ్చిండావో చెప్పు మల్ల!” అన్నాడా మహానుభావుడు! ఎంత నిరాడంబరం! కోటీశ్వరుడాయన. ఒక వ్యాపార సామ్రాజ్యానికి అధినేత. గొప్ప విద్యావేత్త! ఆర్.ఎస్.ఎస్. నాయకుడు. ఆయన ఉద్యోగం ఇచ్చినా, అనివార్య కారణాల వల్ల నేను చేరలేదనుకోండి, అది వేరే సంగతి! అటువంటి శ్రేష్ఠుల వద్ద ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమ’నే వ్యక్తిత్వ వికాస పాఠాన్ని నేర్చుకోవాలి.

ఈశ్వర చంద్ర విద్యాసాగర్

వీరు గొప్ప సంఘ సంస్కర్త, భాషా నిపుణులు. బెంగాలీ గద్యమును సంస్కరించినవారు. మన గిడుగువారితో సమానులు. విధవా పునర్వివాహ చట్టము – లార్డ్ డల్‍హౌసీ కాలంలో రూపుదాల్చడానికి కారణం ఆ మహనీయుడే. హౌరా బ్రిడ్జికి ‘విద్యాసాగర్ సేతు’ అని ఆయన పేరే పెట్టారు. 1970లో కేంద్ర ప్రభుత్వం ఒక తపాలా బిళ్ల విడుదల చేసింది. ఆయన నిగర్వి, నిరాడంబరుడు, మహా వక్త.

ఒకసారి హౌరా స్టేషనులో ఒక నవ ఆధునిక యువకుడు రైలు దిగాడు. అతని చేతిలో అంతగా బరువు లేని ఒక పెట్టె ఉంది. దాన్ని మోసుకుని రావడానికి పోర్టరు కోసం చూసి, ఎవరూ లేకపోయేసరికి అసహనానికి గురవుతున్నాడు. సొంతంగా మోసుకొని పోవడానికి నామోషీ.

అదే రైల్లోంచి ఒక పెద్దాయన దిగారు. చాలా సాధారణంగా ఉన్నారు. ఈ యువకుని వ్యవహారం గమనించి, “బాబూ, పద, ఈ పెట్టె నేను బయటికి తెస్తాను” అని దానిని పట్టుకుని వెళ్ళి బయట టాంగాల దగ్గరకి చేర్చారు. యువకుడు ఆయనకి కూలీ డబ్బు ఇవ్వబోతే, సున్నితంగా తిరస్కరించాడు.

ఆ యువకుడు కలకత్తాకు వచ్చింది ఈశ్వర చంద్ర విద్యాసాగర్ గారి ఉపన్యాసం వినడానికి. సాయంత్రం సభకు వెళ్ళాడు. ఆ మహనీయుడిని చూడబోతున్నాననే ఉద్వేగం! తీరా చూస్తే, ఆయన ఎవరో కాదు. స్టేషన్‍లో తన పెట్టె మోసుకువచ్చినాయనే. తనను రిసీవ్ చేసుకోడానికి, స్వాగతం పలకడానికి ఆయన ఎవర్నీ అనుమతించలేదు. యువకునికి కళ్ళు తెరుచుకున్నాయి. పశ్చాత్తాపం అతన్ని కుదిపివేసింది. Dignity of labour గొప్పదనాన్ని తెలిపిన మహనీయుడు విద్యాసాగర్. అటువంటి ‘శ్రేష్ఠులు’ ఆచరించి చూపినదాన్ని మనం ప్రమాణంగా భావించి, దాన్ని మన జీవితంలో కూడా అమలు చేయగలిగితే, మన వ్యక్తిత్వం వికసిస్తుంది! ఈ వృత్తాంతం మాకు తొమ్మిదో తరగతిలో (1969) హిందీ వాచకంలో పాఠ్యాంశంగా ఉండేది. మా హిందీ సారు ప్రత్తిగుడుపు వెంకటేశ్వరరాజు గారు ఆ పాఠాన్ని వివరించేటప్పుడు, భావోద్వేగమునకు లోనయ్యేవారు.

అబ్దుల్ కలామ్

ఈయన వదాన్యత జగమెరిగినదే. రాష్ట్రపతిగా ఉన్నపుడు ఆయన బంధువులు తమిళనాడు నుంచి ఢిల్లీలోని పర్యాటక ప్రదేశాలను చూడడానికి వస్తే, వారి బస, రవాణా, భోజన ఖర్చులన్నీ తన స్వంత డబ్బుతో భరించారట. ఆయన బంధువులందరూ అతి సామాన్య జీవితాలు గడిపినవారే. అధికారంలో ఉన్నన్నాళ్ళూ ప్రభుత్వ ధనాన్ని, సౌకర్యాలను, వి.ఐ.పి. ట్రీట్‍మెంట్‍ను విచ్చలవిడిగా అనుభవించిన వారున్నారు. వారే అధిక శాతం. అప్పుడు తిరుమల వేంకటేశ్వర స్వామి మీద ఎక్కడ లేని భక్తి పుట్టుకొస్తుంది. పూర్ణకుంభంతో స్వాగతం, ప్రధానార్చకులచే ఆలయ ప్రాశస్త్య వర్ణన, శేషవస్త్రం, ఈయన గారి దర్శనమయ్యేంత వరకూ క్యూలు ఆపేయడం, ఆ వైభోగం చెప్పనలవి కాదు. స్వామి వైభోగం దీని ముందు చిన్నబోవాల్సిందే. ఈయన తిరుపతికి రావడం అదేదో ఘనకార్యమైనట్లు, పత్రికలు దాన్నో వార్తగా ప్రచురించడం, అదో అసహజమైన రిచ్యుయల్. పదవి పోయిం తర్వాత మళ్ళీ తిరుపతి వైపు చూస్తే ఒట్టు! అందుకే అన్నారు – “అధికారాంతమునందు చూడవలె గదా ఆ అయ్య సౌభాగ్యముల్”.

శ్రీరాముని ఆదర్శం

ఇక్కడ రామాయణం మళ్ళీ తలచుకోవాలి. “లక్ష్మణా! పట్టాభిషేకం కోసం తెప్పించిన పుణ్యతీర్థాల జలాలతో పవిత్ర స్నానం చేసి అడవులకు బయలుదేరుతాను” అంటాడు శ్రీరాముడు. వెంటనే ఆయనకు అది ధర్మం కాదని గుర్తొస్తుంది. “వద్దులే లక్ష్మణా! ఈ తీర్థజలాల కోసం రాజద్రవ్యాన్ని ఖర్చుపెట్టారు. అవి వద్దు. మన బావిలో నీళ్ళు పోసుకుంటాను” అన్నాడట.

“అథవా కిం మమైతేన రాజద్రవ్యమయేన తు
ఉధృతం మే స్వయం తోయం వ్రతాదేశం కరిష్యతి”

తను రాజు కానపుడు, తత్సంబంధిత లాంఛనాలను ఆయన నిరాకరించాడు. నోటీసులిస్తే గాని ప్రభుత్వ నివాసాన్ని ఖాళీ చేయని ప్రబుద్ధులెందరో ఉన్నారు!

నరేంద్ర మోదీ

మన ప్రధాని చాలా విలువైన దుస్తులు వేసుకుంటారని విమర్శలు ఉన్నాయి. కానీ ఆయన తమ్ముడు, తల్లి, ఇతర బంధువులు అత్యంత సామాన్యులు. ఆయన మాతృమూర్తి ఆటోలో వచ్చి ఓటు వేసి వెళ్ళేవారు. తన పుట్టిన రోజున ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె ఆశీర్వాదం తీసుకునేవారు మోదీ! ఆయనకు ఆమె ఒక వంద రూపాయలు జేబులో పెట్టేవారు, ఏదైనా కొనుక్కో నాయనా! అని. ‘ఢిల్లీకి రాజయినా తల్లికి కొడుకే కదా!’.

ఇలా చెప్పుకుంటూ పోతే, అన్ని రంగాలలో శ్రేష్ఠులు మనకు ఉన్నారు. వారు ఆచరించేదే వ్యక్తిత్వ వికాసానికి ప్రమాణం.

శత్రువులు లేకపోవడం, సత్యాన్ని ఆచరించడం, క్రోధాన్ని జయించడం: ఇవి త్రితయం

‘అజాతశత్రువు’ అనే బిరుదు ధర్మరాజుకు మాత్రమే ఉంది. ఏదో ఒక విధంగా మనమంటే పడనివాళ్ళు తయారవుతారు. మన ప్రవర్తన ద్వారా కూడా వాళ్ళను తయారు చేసుకుంటాము. ఇతరుల అభిప్రాయాన్ని గౌరవించడం, మర్యాద, మన్నన, ప్రసన్నత, మృదూక్తులు, మన తప్పులను ఒప్పుకోవడం, ఇతరుల తప్పులను సహించడం ద్వారా చాలా వరకు శత్రువులను లేకుండా చేసుకోవచ్చునని భర్తృహరి మహాశయుడు తన సుభాషితాలలో వివరించాడు. శత్రువులనుంచి సైతం మంచిని గ్రహించగలగాలి. రావణాసురుడి చివరి ఘడియల్లో, అతని నుండి రాజనీతి రహస్యాలను తెలుసుకుని రమ్మని లక్ష్మణుడిని పంపిస్తాడు రాముడు.

శత్రుత్వం సిద్ధాంతాల వరకే పరిమితం కావాలి. వ్యక్తిగతంగా మారకూడదు. ప్రస్తుత రాజకీయాలను గమనిస్తే, ప్రతిదీ వ్యక్తిగతంగా తీసుకుని, ఒకరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం సాధారణమైపోయింది.

వ్యాసమహర్షి ధృతరాష్ట్రునితో చెప్పాడు –

“ఏతద్ధి త్రితయం శ్రేష్ఠం సర్వభూతేషు భారత
నిర్వైరతా మహారాజ సత్యమద్రోహ ఏవ చ”

ఇక సత్యం! హరిశ్చంద్ర చక్రవర్తి అంతటి సత్యవాక్పరిపాలకుడిలా మనం కానక్కరలేదు కాని, అలవోకగా అబద్ధాలు చెప్పడం మానుకోవాలి. ఆ లక్షణం మన వ్యక్తిత్వానికి మెరుగులు దిద్దుతుంది. కాని అది చాలా కష్టం. నోరు తెరిస్తే చాలు, మనకు అబద్ధాలు అతి సులభంగా వచ్చేస్తాయి.

‘ఏప్రిల్ 1 విడుదల’ అని, రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటుంది. దాంట్లో, కథానాయిక, హీరోకు, తాను ప్రేమించడానికి ఒక షరతు పెడుతుంది. అదేమంటే ఒక నెలంతా అతడు కేవలం ‘నిజాలు’ మాత్రమే మాట్లాడాలి! ఇక చూడండి రాజేంద్ర ప్రసాద్ తిప్పలు! ఆ క్రమంలో చివరికి జైలు కెళ్ళవలసి వస్తుంది! అదేదో హాస్యానికిలే అనుకోకూడదు మనం. దాంట్లో విలువైన వ్యక్తిత్వ వికాస అంశం ఉంది.

Francis Bacon: ‘Of Truth’

బేకన్ వ్రాసిన వ్యాసాల్లో తలమానికమైనది ‘Of Truth’.

“భగవంతుడు సృష్ట్యాదిన ‘కాంతి’ని సృష్టించాడు. ఆరవ రోజున మానవసృష్టి జరిగింది. మానవునికి ‘light of reason’ అనే వరాన్నిచ్చాడు సృష్టికర్త. Reason అంటే విచక్షణా జ్ఞానం, హేతుబద్ధత.”

“A mixture of lie with truth adds pleasure” అంటారాయన. కవులు తమ కవిత్వంలో చెప్పేవన్నీ అబద్ధాలే (imagination) అని చమత్కరిస్తారు. పోను పోనూ వ్యాసం పదును తేలి ‘సత్యం’ యొక్క అసలు రూపం ఆవిష్కృతమవుతుంది.

“The love of Truth, the quest for Truth and the belief in Truth is the only free will of human nature”.

సత్యాన్ని ప్రేమించడం, దాని కొరకు అన్వేషించడం, దానిలో నమ్మకం కలిగియుండడమే మానవుని ఏకైక స్వేచ్ఛాంతఃకరణానికి ప్రతీక అంటారు బేకన్.

“No pleasure is comparable to the standing upon the vantage ground of Truth and to see the errors and wanderings.. in the vale below.”

ఎంత అద్భుతమైన మాట! “సత్యం అనే ఉన్నత శిఖరం మీద నిలబడి క్రింద అగాధమైన లోయలోని తప్పులను, మానసిక అపసవ్య సంచారలను చూడడం వల్ల ఆనందం, దేనితోనూ పోల్చలేనిది”.

మనిషి భూమి మీదనే స్వర్గాన్ని పొందాలంటే,

“If a man’s mind can move in charity, rest in providence, and turn upon the poles of Truth, he will certainly find heaven on earth.”

“ధర్మాన్ని ఆచరిస్తూ, భగవంతుడిని (విధిని) నమ్ముతూ, సత్యధ్రువాలను ఆలంబనగా చేసుకున్న వానికి భువియే స్వర్గము.”

మహాత్మగాంధీ:

మన జాతిపిత స్వీయచరిత్రకు ‘My Experiments with Truth’ అని పేరు. ‘సత్యముతో నా ప్రయోగాలు’. అందులో ఎక్కడా స్వోత్కర్ష ఉండదు. తన జీవితంలో తాను ఎక్కడెక్కడ పొరపాటు పడిందీ, దాన్ని తరువాత ఎలా దిద్దుకున్నదీ చెబుతాడాయన. దీనినే self-examination (ఆత్మపరిశీలన) అంటారు. వ్యక్తిత్వ వికాసంలో ఇది ముఖ్య పాత్ర పోషిస్తుంది.

మన జీవితంలో మన వ్యక్తిత్వం వన్నెలీనాలంటే ఈ క్రింది విషయాలను మనం పరిగణించాలి:

  1. మనం చెబుతున్న అబద్ధం అసంకల్పితంగానే చెబుతున్నామా?
  2. అబద్ధం చెబితే తప్ప, మనం ఈ పరిస్థితి నుంచి బయటపడలేమా?
  3. ఇతరులను మభ్యపెట్టడానికి మనం అబద్ధాలు చెబుతున్నామ?
  4. మన అబద్ధాలు హానికరమైనవి కావా (harmless)?
  5. కేవలం ‘అబద్ధం కోసమే అబద్ధం’ (lie for lie’s sake) మనం చెపుతున్నామా? దాని వల్ల మనం మానసికానందాన్ని పొందుతున్నామా?
  6. అబద్ధం చెప్పేవాళ్ళంటే మనకు ఇష్టమా? అయిష్టమా?

మహాభారతంలోని ఈ పద్యం సత్యం యొక్క విశిష్టతను విప్పి చెబుతుంది.

నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటె సూనృత
వ్రత! యొక బావి మేలు; మఱి బావులు నూరింటి కంటె నొక్క స
త్క్రతువది మేలు; తత్క్రతు శతంబున కంటె నుతుండు మేలు; త
త్సుత శతకంబు కంటె నొక సూనృత వాక్యము మేలు చూడఁగన్‌

మంచినీటితో నిండిన నూతులు వంద కంటే, ఒక బావి మేలు. ఆ బావులు వందైనా ఒక యజ్ఞానికి సరిపోలవు. అట్టి యజ్ఞాలు వంద చేసినా, ఒక సుపుత్రునికి సాటిరావు. అట్టి సుపుత్రులు వంద మంది కంటే ఒక్క ‘నిజం’ గొప్పది!

కాబట్టి, సాధ్యమైనంత వరకు, అవసరం లేనప్పుడు కూడా, అబద్ధం చెప్పకుండా, ఇతరులు చెప్పే అబద్ధాలను గుడ్డిగా నమ్మకుండాఅ, కెరీర్‍లో, మానవ సంబంధాల్లో, మనం get on  కాగలిగితే మన వ్యక్తిత్వాన్ని చాలా వరకు మనం కాపాడుకునట్లే!

క్రోధాన్ని జయించడం

కోపం వ్యక్తిత్వ వికాసానికి అవరోధం. మహా తపస్సంపన్నులైన దూర్వాస విశ్వామిత్రుల వంటివారు, దాని వల్ల చాలా నష్టపోయారు. మనమెంత?

‘Morose Temper’ మన personality ని చాలా damage చేస్తుందన్నాఅరు ఎ.జి.గార్డినర్. ‘On saying please’ అనే తన ప్రఖ్యాత వ్యాసంలో. ఈ కోపాన్ని మనం మనకంటే inferior beings మీద, subordinates మీద మాత్రమే చూపగలం. మనకంటే అధికుల మీద చూపలేం. దీన్ని బట్టి అర్థమవుతుంది కదా, అదెంత డొల్లతనం కలదో?

భావోద్వేగాలలో ఒకటి కోపం. దానివల్ల మనలో విచక్షణా జ్ఞానం నశిస్తుంది. మన మనసు మీద మనం అదుపు కోల్పోతాము. దీంట్లో short temper అని ఒకటుంది. అలా వచ్చి ఇలా వెళ్లిపోయే కోపం. దాంతో ప్రమాదం అంత లేదు. ఎందుకంటే అది క్షణికం కాబట్టి.

కన్యాశుల్కంలో లుబ్ధావధాన్లు గిరీశంతో చెబుతాడు “ఏమనుకోకండి, నాకు కించిత్ ప్రథమ కోపమున్నూ..”

పండితులకు వచ్చే కోపం తాత్కాలికం అన్నారు నన్నయ్య.

“విప్రుల యలుకయు దృణ హుతాశానంబు దీర్ఘమగునె”

వారి కోపం గడ్డిమంట లాంటిదట.

ఆడవాళ్ళకు కోపం వస్తే, “కోపంలో కూడా నీవు ఎంత అందంగా ఉన్నావు!” అని కితాబిస్తే ఇట్టే కరిగిపోతారు.

కోపాన్ని జయించటం అనేది మనలాంటి వారికి అసాధ్యం. జయించాలని చెప్పడం సులభం. జయించలేకపోయినా, కొంతవరకు అదుపు చేసుకోగలిగితే, మన వ్యక్తిత్వానికి అది ప్లస్ పాయింట్ అవుతుంది!

కోపం వచ్చినప్పుడు పది అంకెలు లెక్క పెట్టడం లాంటి చిట్కాలు వినడానికి బాగుంటాయి గాని ప్రాక్టికల్‍గా పని చేయవు.

“ఆయనది కోపిష్టి మనస్తత్వం”, “ఆయనకు కోపం వస్తే ముందూ వెనుకా చూడడు” ఇలాంటి మాటల ద్వారా కోపిష్టి వాళ్ళను గ్లోరిఫై చేసి, వారి కోపాన్ని ఒక ఘనతగా వర్ణిస్తుంటారు కొందరు. దాని వల్ల వారు తమ కోపాన్ని ఒక virtue (గా) భ్రమపడే ప్రమాదం ఉంది.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here