అమ్మ కడుపు చల్లగా-42

0
4

[ప్రకృతిని, పర్యావరణాన్ని, వనరులను కాపాడుకోవలసిన అవసరాన్ని వివరిస్తున్నారు ఆర్. లక్ష్మి ఈ వ్యాసంలో.]

[dropcap]ఏ[/dropcap]నాడో 1987లోనే నార్వే ప్రధాని గ్రో హార్లెమ్ సుస్థిరాభివృద్ధి అంటే భవిష్యత్తు తరాల భవితతో రాజీ పడడం కాదని నిష్కర్షగా ప్రకటించారు. పెరుగుతున్న సముద్రమట్టాలు తమ దేశాలను తుడిచిపెట్టేయగలవని చిన్న దీవుల రాజ్యాలు ఐక్యరాజ్యసమితి సమావేశాలలో ఆందోళన వెలిబుచ్చుతూనే ఉన్నాయి. అయినా యథాతథ స్థితి కొనసాగుతూ రావడమే కాకుండా మీదు మిక్కిలి ప్రకృతి వ్యవస్థల విధ్వంసం మరింతగా పెరిగిపోయింది.

మైక్రో ప్లాస్టిక్స్ ఎత్తైన శిఖరాలనూ, సముద్ర గర్భాలనూ ఒకే రీతిని కమ్మివేస్తున్నాయి. ‘ఫర్ ఎవర్ కెమికల్స్’ని అయితే సర్వాంతర్యామిగా చెప్పుకోవచ్చు.

మనిషి విచక్షణా రహితమైన తన కార్యకలాపాలతో ‘బయోస్ఫియర్‍’నే మార్చేశాడు. శిలాజ వనరుల విచక్షణా రహితమైన తవ్వకం/వాడకం ద్వారా సముద్రాల సహజ సిద్ధమైన రసాయన సంతులనమూ చెదిరిపోయింది. కొండల విధ్వంసంతో, నేలలు రసాయనాలతో – మనిషి దురాశకు గురికాని ప్రకృతి వ్యవస్థ లేదంటే అతిశయోక్తి కాదు. సముద్రాల రంగు సైతం మారిపోతోంది.

1945లో మొదలైన అణ్వాయుధాల ప్రయోగాల నుండి వెలువడిన ప్లుటోనియం – గ్లేసియర్స్‌ను డ్రిల్ చేసినపుడు కనబడడం విడ్డూరం కాదా! వాడిపారేసే మొబైల్‍తో మొదలుపెట్టి, ట్రేస్ గాసెస్, రసాయనాలు, మైక్రో ప్లాస్టిక్స్ ఇవన్నీ ప్రకృతి వ్యవస్థలపై మానవుడి ఆధిపత్య ధోరణికి అద్దం పడుతున్నది. అనేక జాతులు, జీవులు వివిధ ప్రాంతాలకు విస్తరించడానికి మనిషే మూల కారణం.

కాకపోతే ఎక్కడి ఫసిఫిక్ దీవులు? అక్కడి వరకూ ఎలుకలు విస్తరించడమేమిటి? 1945 నాటి అణుపరీక్షల తాలూకా రేడియోధార్మిక ప్రభావం ఇంకా కొనసాగుతోందనడానికి నిదర్శనంగా కొన్ని సంవత్సరాల క్రిందట అంటార్కిటాకాలో సాగించిన మంచు ఫలకాల త్రవ్వకాలలో ప్లుటోనియం జాడలు బయటపడ్డాయి.

2020లో మనిషి సృష్టించిన వ్యర్థాలు భూమండలం పైనున్న జీవుల మొత్తం బరువు కంటే అధికమని పరిశోధకులు లెక్క తేల్చారు. సంబంధిత రంగంలోని పరిశోధకులు వీటిని ‘టెక్నోఫాసిల్స్’గా వ్యవహరిస్తున్నారు. పర్యావరణ విధ్వంసం తాలూకు దుష్పరిణామాలను ప్రత్యక్షంగా చూస్తున్న/అనుభవిస్తున్న ఈ తరం యువత విపరీతమైన ఆందోళనను గురి కావడం కూడా జరుగుతోంది.

పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన ఆందోళన వారికి తమ చదువు, కెరీర్, పేరు ప్రతిష్ఠలు వంటి కీలకాంశాల జాబితాలో చేరిపోయింది. కారణాలు అనేకం – ఏడాదికి 200 జాతులు జీవులు అంతరించిపోతున్నాయి. కన్జర్వేషన్ అంచనాలలో లక్ష సంవత్సరాలలో ఎదురుకాగలదనుకుంటున్న ప్రమాదం అతి దగ్గరలోనే ఉన్నట్లు తేలిపోయింది.

వివిధ జాతుల, జీవుల వైవిధ్యాన్ని పోగుట్టుకునే లోగానే వాటి వివరాలన్నిటినీ సమగ్రంగా నమోదు చేయాలని శాస్త్రజ్ఞులు (పాపం!) కంగారు పడుతున్నారు. 5/6 సంవత్సరాల లోపునే పగడపు దిబ్బలు విస్తరించడం నిలిచిపోగలదనే ఒక అంచనా.

భూమండలానికి ఉపశమనం కలిగించే అమెజాన్ వర్షారణ్యాలు తమ నైసర్గిక స్వభావం నుండి భూమికి హాని కలిగించే దిశగా మారిపోతున్నాయి. వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం అమెజాన్‍లో అడవుల విధ్వంసం విచక్షణా రహితంగా కొనసాగుతుండడమే ఈ పరిణామాలన్నిటికీ కారణం. అమెజాన్ వర్షారణ్యాలు భూమండలం మొత్తానికి శ్వాసకోశాల వంటివి. ఈ ఆడవులు 1975-96ల నడుమ సాలీనా హెక్టారుకు శోషించుకున్న కార్బన్ అంచనాలతో పోలిస్తే ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నదో అర్థం అవుతుంది.

2021లో అమెజాన్ బేసిన్ మొదటిసారిగా శోషించుకున్న హరితగృహ వాయువుల కంటె – విడుదల చేసిన ఉద్గారాలు ఎక్కువ అని అధ్యయనాలు వెల్లడించడం ఇక్కడ ప్రస్తవించాలి. ప్రకృతి వ్యవస్థ గానీ, మరేదైనా గానీ దెబ్బ తినడం మొదలుపెట్టాకా, సంభవించే గొలుసుకట్టు పరిణామాలను నివారించగలగడం అంత తేలికైన వ్యవహారం కాదన్నది నిజం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here