[శ్రీ శ్రీధర్ చౌడారపు రచించిన ‘సంధ్య’ అనే కవితని పాఠకులకు అందిస్తున్నాము.]
[dropcap]చి[/dropcap]రువెలుగుల ప్రభాతంలో
చీకటి ముంగిటి సాయంత్రంలో
కళ్ళకు సప్తవర్ణాల విందులు చేస్తూ
కవ్విస్తూ పలుకరిస్తుంటుంది సంధ్య
తనువు నిలువెల్లా పులకరించేలా
తన సాన్నిహిత్యంకై మనసు పలవరించేలా
ఎంతగా వేడుకుంటే ఏం లాభంలే
వెంట జంటగా నడువకుండా
పక్కన తోడుగా ఏమాత్రం ఉండకుండా
వెలుగుని వెంటపంపి పగలు గడపమంటుంది
చీకటితో బంధం వేసి రాత్రిని దాటేయమంటుంది
చిన్నగా నాపై ఓ చిన్ననవ్వు విసిరేసి
కాలాన్ని కలకండలా బుగ్గన అరిగించేసి
చిలిపిగా నావైపు కన్నుకొట్టి
కళ్ళముందే మెల్లగా కరిగిపోతుంది సంధ్య
పగటిలోకో రాత్రిలోకో
మౌనంగా మాయమైపోతుంది సంధ్య
చర్వితచరణమే అయినా
ఆశ కలుగుతూ ఉంటుంది నాకు
రేపేమైనా మార్పు ఉంటుందేమోనని
మరి, ఆశ నెరవేరేనా..?
లేక, అది అడియాశ అయ్యేనా..?