[dropcap]దు[/dropcap]ర్యోధనుడి పుత్రుడైన లక్ష్మణ కుమారుడి పేరు చెప్పగానే మనకు ‘మాయాబజార్’ సినిమాలో రేలంగి గుర్తుకు వస్తాడు. ఆ కల్పిత శశిరేఖ పరిణయం అనే కథ వల్ల, ‘మాయాబజార్’ సినిమా పుణ్యమా అని మనకు లక్ష్మణ కుమారుడు అంటే పిరికివాడు, కోతలు కోసేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది. నిజానికి దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడు ఒక వీరుడు, అభిమన్యునికి విరోధి.
భారతములో అతని పాత్ర ఎక్కువగా వివరింపబడకపోయిన కురుక్షేత్ర యుద్ధంలో సంజయుడు లక్ష్మణ కుమారుడి పరాక్రమాన్ని అతడు చేసిన పోరాటం గురించి ధృతరాష్ట్రునికి వివరిస్తాడు.
కురుక్షేత్ర యుద్ధంలో అభిమన్యునితో తలపడి భీకరంగా యుద్ధం చేస్తాడు. రెండవ రోజు కురుక్షేత్రంలో జరిగిన యుద్ధంలో అభిమన్యునితో తలపడి అభిమన్యుని విల్లును విరుస్తాడు. ఆ రోజు జరిగిన యుద్ధంలో ప్రతిష్టంభన ఏర్పడటం వలన అభిమన్యునిపై విజయం సాధించ లేకపోయినప్పటికీ కౌరవ సేన ప్రశంసలు పొందుతాడు.
కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు సంజయుడు ధృతరాష్ట్రునికి యుద్ధ వివరాలను తనకున్న అతీంద్రియ శక్తి ద్వారా ప్రత్యక్షంగా చూస్తున్నట్లుగా కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తాడు. ఈ వివరణలో కౌరవ వీరుల సాహస పరాక్రమంతో పాటు లక్ష్మణ కుమారుడు జరిపిన పోరాటాన్ని కూడా ధృతరాష్ట్రునికి వివరిస్తాడు. సంజయుడు దృతరాష్ట్రునికి తెలిపిన లక్ష్మణ కుమారుడి యుద్ధ విశేషాలు తెలుసుకుందాం.
“ఓ మహారాజా, దుర్యోధనుని కుమారుడైన లక్ష్మణ కుమారుడు సుభద్ర కుమారుడైన అభిమన్యునిపై తొమ్మిది బాణాలను అత్యంత నేర్పుగా ప్రయోగించాడు. ప్రతిగా అభిమన్యుడు కోపముతో లక్ష్మణ కుమారునిపై కొన్ని వందల శరములను ప్రయోగించాడు. లక్ష్మణ కుమారుడు కూడా బాణాలను ప్రయోగించి వాటిలో కొన్నింటిని ఛేదించాడు. ఓ రాజా ఇది చూసిన కౌరవ సేనలు లక్ష్మణ కుమారుడిని ప్రశంసిస్తూ జేజేలు కొట్టాయి. అభిమన్యుడు విరిగిన విల్లును తీసివేసి కొత్త విల్లుతో యుద్ధము ప్రారంభించాడు. ఈ విధంగా ఇరువురు వీరోచితంగా పోరాటం చేస్తున్నారు. ఇద్దరు కూడా ఏమాత్రం తగ్గకుండా ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ అస్త్రాలు ప్రయోగిస్తూ యుద్దాన్ని కొనసాగిస్తున్నారు. ఈ విధంగా ఈ ఇద్దరి మధ్య సాగుతున్న యుద్ధం దుర్యోధనుడు కల్పించుకోవడం వలన విజయం ఎవరిదో నిర్ణయింప పడకుండానే ముగిసింది. నీ కుమారుడు దుర్యోధనుడు తన కుమారుడికి సహాయముగా వచ్చాడు. దుర్యోధనుడు తన కుమారుడి వైపు వెళుతున్నప్పుడు ఇతర కౌరవసేన అర్జునుడిని అన్ని వైపులా నుండి చుట్టూ ముట్టారు. ఇంతమంది చుట్టూ ముట్టినా అర్జునుడు తన కుమారుడికి రక్షణగా నిలిచాడు.” అని చెప్పాడు సంజయుడు.
మూడవరోజు యుద్ధంలో లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు మళ్లా తలపడ్డారు. ఈసారి యుద్ధంలో అభిమన్యుడిదే పైచేయిగా ఉండి అభిమన్యుడు లక్ష్మణ కుమారుడి సారథిని సంహరించాడు. ఆ సమయంలో కృపాచార్యుడు లక్ష్మణ కుమారుని తన రథంలో తీసుకొని వెళతాడు. ఆ విధంగా సంజయుడు లక్ష్మణ కుమారుడు అభిమన్యుడు చేస్తున్న యుద్దాన్ని ధృతరాష్ట్రుడికి వివరిస్తూ ఉంటాడు
“ఓ మహారాజా, నీ మనవడు లక్ష్మణ కుమారుడు కోపముగా అభిమన్యునిపై, అతని రథసారథిపై బాణాలను ప్రయోగిస్తున్నాడు. అభిమన్యుడు కూడా లక్ష్మణ కుమారుని పైన, అతని రథసారథి పైన బాణాలను సంధిస్తూ దాడి చేస్తున్నాడు. ఆ దాడిలో లక్ష్మణ కుమారుని రథము యొక్క అశ్వములు చనిపోతే లక్ష్మణ కుమారుడు రథంపై నిలబడి కోపంగా తన శులాన్ని అభిమన్యుడి రధము వైపుకు విసిరాడు. కానీ అభిమన్యుడు తన వైపు వస్తున్న శూలాన్ని తన బాణాలతో విచ్ఛిన్నం చేశాడు. ఆ సమయంలో కౌరవ సేన లోని ఇతర యోధులు లక్ష్మణ కుమారుని తమ రథంలో సురక్షితముగా తీసుకుని వెళ్ళారు” అని చెప్పాడు సంజయుడు. మొత్తం మీద లక్ష్మణ కుమారుడు అన్ని విధాలుగా ప్రతిభ కలిగిన యోధుడు. యుద్ధంలో అభిమన్యుడితో తలపడి అతనితో పోటీ పడగలనని రుజువు చేసుకున్నాడు.
కానీ దురదృష్టవశాత్తు 13వ జరిగిన యుద్ధంలో పద్మవ్యూహం ఏర్పాటు చేసినప్పుడు, అభిమన్యుడు సర్పము ఆకృతి గల బాణాన్ని లక్ష్మణ కుమారునిపై ప్రయోగించి అతని శిరస్సును ఖండిస్తాడు. అభిమన్యుడు పద్మవ్యూహములోనే శల్యుని కుమారులైన బృహద్బల వంటి ఇతర వీరులను కూడా వధిస్తాడు. అదే పద్మవ్యూహంలో అభిమన్యుడిని కౌరవ వీరులు చుట్టుముట్టి నిరాయుడిని చేసి రథచక్రముతో యుద్ధం చేస్తున్న సమయంలో యుద్ధ నియమాలకు విరుద్ధంగా వధిస్తారు. ఆ విధంగా లక్ష్మణ కుమారుడు, అభిమన్యుడు ఒకే రోజున పద్మవ్యూహంలో వధింపబడి వీరమరణం పొందుతారు.