[డా. కోగంటి విజయ్ రచించిన ‘పిల్లి ఒకటి చిన్నది’ అనే కవితని అందిస్తున్నాము.]
~
[dropcap]ఓ[/dropcap] తల్లి పిల్లి వదిలేసిన
కూన ఒకటి నీరసంగా మెట్ల పక్కన కనిపించింది
తెలుపూ నలుపూ చారల కూన
జాలి కళ్ళ పిల్లి పిల్ల
ఇంటిల్లి పాదీ దాని చుట్టూ చేరి
మాటల ముద్దులు కురిపించాం
చాలామంది మనుషుల కన్నా నయమని
కల్లా కపటం తెలీనిదని ప్రేమ ప్రకటించాం
పాలూ నీరు వేరుచేయలేనిదని ధైర్యంగా
రెండూ కలిపి ముప్పొద్దులా ముందుంచాం
మా పాలకో పరగడుపు మాటలకో
అలవాటైన పిల్లి కూనకై మేమే చూడటం
అది కనపడగానే చిత్రాలుగా బంధించడం
దానికర్థం కాకున్నా దాన్నడగకుండానే
ఉక్కిరిబిక్కిరి పేర్లతో పిలవడం చేసేశాం.
పిల్లిని మాలిమి చెయ్యద్దంటూ
ఇంటికి అరిష్టం చూడండంటూ
ఉన్నట్టుండి ఎవరో అరిచిన మాట
మా బుర్రలో పురుగులా తొలిచింది
అవునా మరి ఏం చేద్దాం అంటూ
కాళ్ళకు చుట్టుకు తిరిగే కూనని
కొంచెం పాలుపోయమని కూచుని చూసే పిల్లిని
రాకు పో అంటూ
తలుపులు మూసేశాం
బెదిరించి తోలేశాం
వారం తిరగక ముందే మనసంతా కల్లోలంతో
మూగబోయిన వుదయాలూ మధ్యాహ్నాలలో
కిటికీలకు కళ్ళలాగే అంటించి నుంచున్నాం
ఇంతదానికే అంత అభిజాత్యమేంటని
ఆశ్చర్యాలూ ప్రకటించి చూశాం
ఇపుడెక్కడ చప్పుడైనా అదేనేమోనని
మాయామర్మం తెలీంది కదాని
కుళ్ళూ కుచ్చితం లేంది కదాని
మూఢ బుద్ధులు మనుషులకే కదాని
అసూయతో మనని చూడనిది కదాని
అహంకారపు కూత కూయనిది కదాని
ఎంత తప్పు చేసేశామని
మనిషి కాదు కదా
మళ్ళీ రాకుండా వుండకుండా వుంటుందా అనీ
ఇంకా వెతుకుతూనే వేచి చూస్తూనే వున్నాం