‘కాకతీయ యుగంలో స్త్రీల సామాజిక స్థితిగతులు – ఒక పరిశీలన’ -18

0
3

[డా. మంత్రవాది గీతా గాయత్రి గారు 1995లో పిహెచ్‍డి పట్టా కోసం ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకి సమర్పించిన సిద్ధాంత వ్యాసాన్ని సంచిక పాఠకులకు ధారావాహికంగా అందిస్తున్నాము.]

ప్రకరణం 5 – కాకతీయుల కాలంలో స్త్రీలు వివాహాది సంస్కారాలు: రెండవ భాగం

కన్యాదానం:

కన్యలను వరునకు ఇవ్వతగినవారు: ప్రాచీనకాలం నుంచి కన్యను వరునికి ఇవ్వదగిన వారిలో తండ్రి మొదటివాడు అని ధర్మశాస్త్రాలు చెప్తున్నాయి.

కేతన విజ్ఞానేశ్వరంలో

“జనకుడు తాతయు భ్రాతయు
దనకులజుడు తల్లియును యథాక్రమమున నీ
జనవరులగుదురు కన్యకు
మనమున దోషంబు లేక మనువారైనన్”

అని చెప్పడాన్ని బట్టి తండ్రికే ఎక్కువ అధికారమున్నదని తెలుస్తుంది. తాత, సోదరుడు, తనకులంవాడు, తల్లి ఈ నలుగురు తండ్రి తరువాతి వారే. అంతేకాదు తండ్రి ఉండగా కన్య తనంతట వరించకూడదని ఆనాటి వారు భావించినట్లు ఆనాటి సాహిత్యం వల్ల తెలుస్తున్నది.

నన్నయ గాంధారీ వివాహ సందర్భంలో తండ్రి అంగీకరించిన వరుని కన్య వరించాలి అన్న విషయాన్ని వ్యక్తం చేశాడు. అంధుడైన ధృతరాష్ట్రునికి కన్యనిమ్మని భీష్ముడు గాంధారి తండ్రి సుబలునికి వర్తమానం పంపితే అతడు అంగీకరించాడు. ఇతరులెవ్వరూ ఈ ప్రస్తావనను అంగీకరించక పోయినా గాంధారి ‘పితృవచనదత్తగా’గా భావించుకొని తనకు ధృతరాష్ట్రుడే భర్తగానీ ఇతరులను పతిగా నేను అంగీకరించను అని తన అంగీకారాన్ని తెలిపింది.

కన్యలు తండ్రి తమను ఎవరికిస్తే వారినే పెళ్ళాడాలి. తమంతట తాముగా ఎవరినీ వరించకూడదు అని రంగనాధ రామాయణం, భాస్కర రామాయణంలో కుశనాభుని కూతుళ్ళ వృత్తాంతం ద్వారా తెలుస్తుంది.

‘ఓడక మాతండ్రియుండ మాయంత
గూడుట యటుసేయ గులహాని గాదె
యిరవార మాతండ్రియెవ్వరికిచ్చు
బరికింప నాత డు పతిమాకుననిన’
~
‘యనుచిత భంగి నీకు నిటులాడగ గూడునె? తండ్రి మీఱిని
న్నె నయవరింప మాకు దగునే? కులశీలము దాటవచ్చునే?’

కుశనాభుని కూతుళ్ళను చూచి వాయుదేవుడు తనని వరించమని వారినడిగినపుడు వారు ఇచ్చిన సమాధానం ఆ కాలంలో కన్యలందరికీ వర్తిస్తుంది. కన్యను తండ్రి, ఆ తరువాత తాత, భ్రాత, తన కులంలోని పురుషుడు (బంధువు) తల్లి, ఈ ఐదుగురిలో ఎవరైనా వరునికిచ్చి వివాహం చేయాలేగానీ, కన్య తనంతట తాను వరించడం కులశీలాన్ని అతిక్రమించినట్లు భావించేవారు.

అంటే కన్య నివ్వదగ్గవారు (తండ్రి, తాత, భ్రాత, బంధువు, తల్లి) అలా అని పైవారు కన్యను దోషాలున్న వరునికి ఇవ్వడం తప్పనీ, ఉంకువ తీసుకొని పెళ్ళి చేయదలచినపుడు గుణవంతుడైన వరుడు లభ్యమైతే, ముందర అనుకున్న వరుడిలో దోషాలుంటే మొదటి వరునికి ఇవ్వక గుణవంతునికి ఇవ్వడం ధర్మమని ధర్మశాస్త్రకారులు నిర్దేశించారు.

చ.
ఒకనికి గూతునిచ్చి తగ నుంకువ గైకొని పెండ్లిసేయను
త్సుక మతినున్న చోట గుణశోభితు డొక్కండు వచ్చెనేనియుం
బ్రకటిత దోషముల్ మొదలి భర్తపయింగలవేని తండ్రిక
న్యక గుణవంతుడైన పతికచ్చుగ నిచ్చుట ధర్మమెమ్మెయినో

కన్యనిచ్చేవారు తగిన వరునికి ఇవ్వాలి. లేకపోతే కన్య తనకు తగిన వరుని తనంతట తాను చేసుకోవచ్చని కేతన చెప్పడాన్ని బట్టి కాకతీయుల కాలంలో కన్యలకి కొంత స్వతంత్రం ఇచ్చి ఉంటారని భావించవచ్చును. అంతేకాదు ఒక కన్య కోసం ఉంకువ ఇచ్చిన వరుడు మరణిస్తే ఆమె ఆ వరుని తమ్ముని వివాహమాడవచ్చును. ఒకవేళ అతడు వయసులో చిన్నవాడైతే అతడిని ఆమె చెల్లెలికి ఇచ్చి వివాహం చెయ్యవచ్చునని కేతన చెప్పాడు. చెల్లెలిని పెండ్లాడాలని లేకపోతే ఉంకువగా తీసుకొన్న ధనం వరుని వైపు వారికి కన్య తండ్రి తిరిగి ఇవ్వాలి.

కన్యలో దోషాలేమైనా ఉంటే చెప్పకుండా చూపకుండా దాచి పెళ్లిచేయడం ఆమె తండ్రి తప్పు. అందుకు దండుగ చెల్లించుకోవాలి. కానీ దోషాలు లేని కన్యపై అబద్ధపు నిందలు వేయటం, ఆమెను దూషించడం నేరం. అటువంటి దూషకునికి నూరు మడుగులు రాజు దండుగ విధించాలి.

పై ధర్మసూత్రాల వల్ల మనం తెలుసుకోవలసిన విషయాలు

  1. కన్యకు వరుని చూడవలసిన బాధ్యత తండ్రిదే. తరువాతనే తక్కినవారు.
  2. కన్యను తగిన వరునికిచ్చి పెళ్ళి చేయాలే గానీ, ఎవరో ఒకరికి ముడిపెట్టి బాధ్యత వదిలించుకోరాదు.
  3. కన్యను గుణవంతుడైన వరునికిచ్చి పెళ్ళిచేయాలి. దోషాలున్న వరుడికి తెలియక ముందు మాట ఇచ్చినా అతడిని కాదని గుణవంతుడికిచ్చి వివాహం చేయాలి.
  4. కన్యలో దోషాలేమైనా ఉంటే దాచిపెట్టి పెళ్ళి చేయకూడదు. అదే విధంగా పరులు లేని దోషాలను వధువుపై మోపకూడదు.
  5. ఉంకువ తీసుకొన్న తరువాత వరుడు మరణిస్తే కన్యను అతని తమ్ముడికి ఇచ్చి చేయాలి, లేదా అతడు వయసులో చిన్న వాడైతే ఆమె చెల్లిలిని ఇచ్చి చేయాలి. అతడు నిరాకరిస్తే ఉంకువగా తీసుకున్న ధనం తిరిగి ఇచ్చేయాలి.

ఆధునిక యుగంలో ముఖ్యంగా పందొమ్మిది ఇరవై శతాబ్దాలలో ఆడపిల్లలని ఏదో విధంగా ఒక అయ్య చేతిలో పెట్టాలనే తల్లిదండ్రులు చూసేవారు. అంతేకానీ కన్యని దృష్టిలో పెట్టుకొని ఎవరూ తగిన వరుడిని చూసేవారు కాదు. ఈనాటికీ వరుడి అభిప్రాయానికే విలువ ఇస్తారు కానీ కన్యకు ఏది మంచిదో అని ఆలోచించడంగానీ, వరుని పట్ల కన్య అభిప్రాయం తెలుసుకొని, ఆమెకు నచ్చిన వరునికిచ్చి చేయాలని గానీ కుటుంబంలో పెద్దవారు అనుకోరు. కానీ కాకతీయుల కాలానికి చెందిన కేతన విజ్ఞానేశ్వరాన్ని బట్టి ఆడపిల్ల పెళ్ళి బాధ్యత తండ్రిదే అయినా పెళ్ళి విషయంలో ఆమెకు అన్యాయం జరగకుండా ధర్మశాస్త్రాలు పరిరక్షించాయని చెప్పవచ్చును.

స్వయంవరం:

వివాహానికై ఆహ్వానితులైన వరులలో ఒకరిని ఎన్నుకోవడం గానీ, తనంతట తానే వరుని వరించడంగానీ చేస్తే ఆ వివాహం స్వయంవరం అనిపించుకొంటుంది. రాజకుటుంబాలలో ఈ స్వయంవరం సంప్రదాయం ఉండేది కానీ బహుతక్కువ. కన్య అపురూప సౌందర్యవతి, గుణాతిశయం కలది, వంశం ఎంతో ఉన్నతమైనదీ అయితే వరులు ఆ కన్య కోసం పోటీపడతారు. ఇతిహాసాలలో సీత, ద్రౌపది, దమయంతి, కాశీరాజు కుమార్తెలు అంబ, అంబిక, అంబాలిక వంటి వారికి ఈ స్వయంవరాలు జరిగాయి. కనోజు రాజు జయచంద్రుని కుమార్తె సంయుక్తకు స్వయంవరం ద్వారా పృధ్వీరాజు చౌహాన్‌తో వివాహం జరిగిందన్నది చారిత్రకంగా సుప్రసిద్ధమైన విషయం. అటువంటి ఉదాహరణలు బహు తక్కువ. ఒక రకంగా స్వయంవరం అన్నది ఆ కన్య ప్రత్యేకతను చాటుతుంది. కాకతీయుల కాలంలో స్వయంవరం ప్రసక్తి కాకతి మేలమాంబ వేయించిన త్రిపురాంతక శాసనంలో కానవస్తుంది. కాకతి మైలమ స్వయంవరానికి ఏతెంచిన రాజులలో ప్రసిద్ధి పొందిన వంశంవాడైన నతవాడి రుద్రుని వరించింది అని త్రిపురాంతకం శాసనంలో చెప్పబడింది.

యాంచ స్వయంవర సమాహృత రాజలోకాం
లోకోత్తమా ముదవహత్ప్రథితాన్యశ్రీ
శ్రీనతవాడి విషయాధి ప బుద్ధభూమి పాల
ద్వితీయసుత ఎక్కడి మల్లరుద్రః

మేలమాంబకు ముందు, తరువాత, కాకతీయ వంశంలో రాజకన్యలు గానీ సమకాలీనమైన రాజవంశాలలోని రాజకుమార్తెలు గానీ ఈ స్వయంవర పద్ధతిలో వివాహమాడలేదు. ఇంతకు ముందు చెప్పినట్లు ఆ రోజుల్లో ఎక్కువ మేనరికపు వివాహాలు లేదా రాజకీయ వివాహాలు జరిగేవి. మైలమ స్వతంత్ర భావాలు కల వ్యక్తి. వివాహం తర్వాత కూడా ఆమె పేరు కాకెత మైలమ అనే వ్యవహరింపబడినట్లు ఆమె వేయించిన శాసనాల వల్ల తెలుస్తుంది. ఆమె పుత్రులు కూడా తల్లిని కాకెత మైలమ మహాదేవి అని, తండ్రిని నతవాడి రుద్రదేవ మహారాజు అనీ శాసనంలో చెప్పడం వల్ల వివాహానంతరం కూడా ఆమె కాకెత మైలమ అని వ్యవహరింపబడిందని గ్రహించవచ్చును. అటువంటి విశిష్ట వ్యక్తిత్వం గల మైలమ పెద్దవారి అనుమతితో కాక తాను స్వయంగా ఎంచుకొన్న వ్యక్తిని వివాహమాడింది. నిజానికి నతవాడి బుద్ధభూపతి మొదటి కొడుకు రుద్రభూపతికి మేలమాంబ సోదరి కుందమాంబను ఇచ్చి వివాహం చేసినవాడు మహాదేవుడు. నాతవాటి బుద్ధభూపతి రెండవకొడుకు రుద్రభూపతి తమ్ముడు అయిన ఎక్కటి మల్లరుద్రుడు కాకెత మైలమకు బావ వరుసవాడే, కానీ కాకతీయుల రాజనీతి ప్రకారం మైలమ మరొక రాజవంశానికి చెందిన వ్యక్తిని వివాహమాడి ఉండాల్సింది. పైగా ఒకే కుటుంబంలోని అన్నదమ్ములకు అక్కచెల్లెళ్ళు వివాహమాడడం ఈనాటివారు ఇష్టపడనట్టే బహుశా ఆనాడు అంతగా ఇష్టపడలేదేమో? కుందమాంబ వేయించిన కుందవరం శాసనంలో మహాదేవుడు కుందమాంబను రుద్రభూపతికి సముద్రుడు లక్ష్మీని విష్ణువునకిచ్చినట్లు హిమవంతుడు పార్వతిని శివునికిచ్చినట్లుల ఇచ్చి వివాహం చేసినట్లు ఉన్నది. మైలమాంబ వేయించిన శాసనాలలో ఆమెను తండ్రిగానీ, సోదరుడు గానీ ఎక్కడి మల్లరుద్రునికిచ్చి వివాహం చేసినట్లు లేదు. మైలమ స్వయంవరాన్ని ఆమె బంధువులంతగా అనుమతించి ఉండకపోవచ్చును. నిడిగొండ, కుందవరం శాసనాలలో కుందమాంబ మైలమాంబను తన సోదరిగా చెప్పటం గానీ, కాకతి మైలమ తన త్రిపురాంతకం, కోటగడ్డ, బయ్యారం, ఇనుగుర్తి, మొదలైన శాసనాలలో కుందమాంబ గురించి చెప్పటం గానీ చెయ్యలేదు. వీరు ఇద్దరూ మహాదేవ బయ్యమాంబలకు పుట్టినవారు. గణపతిదేవుని సోదరీమణులు. ఒకర్ని గురించి మరొకరు ప్రస్తావించలేదంటే మైలమ వివాహం సోదరి కుందమాంబ అంగీకరించి ఉండకపోవచ్చునని భావించవచ్చును.

మైలమాంబ స్వయంవరం తప్ప ఇంక ఏ స్వయంవరం ఆ కాలంలో జరిగినట్లు సాహిత్యంలో ఆధారాలు లేవు కనుక దీన్ని సాధారణ విషయంగా కాక విశేషంగా భావించాలి. ఆ విధంగా స్వయంవరంలో వరుని ఎన్నుకోగలిగిన స్వతంత్రం చూపిన కాకతీయుల ఆడపడుచు మైలమ వ్యక్తిత్వం యొక్క ప్రభావం తప్పక ఆనాటి స్త్రీలపైన ఉండి ఉంటుంది. కేతన కూడా కన్య తనంతట తాను వరించడం గురించి ఈ విధంగా చెప్పాడు.

జనకుడు మొదలుగ నేవురు
దగు, వరునకు నిచ్చువారు దగ లేకున్నం
దనకును దగియెడు వరునిం
దనయంతన చేసికొనుట తగు గన్నియకున్

కన్యకు వరుసకీయ దగినవారు లేకపోతే ఆ కన్య తనంతట తాను తనకు తగిన వరుని ఎన్నుకొని వివాహం చేసుకోవచ్చును. సుమారు వెయ్యేళ్ళ క్రిందట దర్మశాస్త్రాలు పై విధంగా చెప్పినప్పటికీ, కన్య తనంతట తాను వివాహం చేసుకోవడమన్నది ఇరవైయవ శతాబ్దాంతంలో కూడా సంఘానికి ఆమోదయోగ్యం కాదు. ఆ ధైర్యం లేక సమాజం మద్దతులేక ఎంతో మంది వయసైపోయిన ఆడపిల్లలు అవివాహితలుగానే ఉండిపోతున్నారు.

బహుభార్యత్వము:

బహుభార్యత్వం ఒక్క రాజకుటుంబాలలో తప్ప తక్కిన వారిలో లేదనే చెప్పవచ్చు. కాకతి రుద్ర దేవునికి పద్మావతి, దన్నలదేవి అనే భార్యలున్నట్లు, కాకతి గణపతిదేవునికి సోమలదేవి, నారమ పేరమలు; రెండవ ప్రతాపరుద్రునికి విశాలాక్షి లక్ష్మాదేవి మొదలైన రాణులున్నట్లు మొదటి ప్రకరణంలో చెప్పడమైంది. వెలనాటి రెండవ గొంకరాజుకు నలుగురు భార్యలుండేవారు. వారు సబ్బమ, రెండవ చోడరాజుతల్లి సొమ్మన దియమ్మ, ప్రోలమ కామిదేవి అనే వారు. రెండవ చోడరాజుకు నలుగురు భార్యలు అగ్రమహిషి కొండపడమటి రాజకుమారి అక్కాంబిక, పండాంబిక, గోకాంబిక పిన్నజియ్య తక్కిన భార్యలు అని పరిగణిస్తారు కానీ వీరిలో గోకాంబిక, పిన్నమ జియ్య అనేవారు భోగస్త్రీలు.

రాజకుటుంబాలలో బహుభార్యత్వం రాజకీయ కారణాల వల్ల జరుగుతుంది. కాని తక్కిన వారిలో సంతానం అంటే పురుష సంతానం కలగనప్పుడే వివాహం చేసుకొనేవారు. భార్య ఉండగా మరొకర్ని చేసుకోవడం మొదటి భార్యను వదిలివేయడం వంటివి ఆనాటి ధర్మశాస్త్రకారులు సమ్మతించలేదు. వివాహమన్నది వంశాభివృద్ధి కోసం కనుక కొడుకు పుట్టకపోతే రెండవ వివాహం చేసుకోవచ్చు. అప్పటికీ మొదటి భార్యను వదిలిపెట్టగూడదు. ఈ విషయం గురించి కేతన విజ్ఞానేశ్వరంలో ప్రస్తావిస్తూ ఏ పరిస్థితులలో మగవాడు మొదటి భార్య ఉండగా రెండవ వివాహం చేసుకోవచ్చనో ఈ క్రింది విధంగా తెలిపాడు.

మ.
సురసేవించిన, వాతి వాడి యయిన సొమ్మెల్ల బోనాడినం
బురుషద్వేషిణీ యైన గొడ్డయిన నెప్డుం గూతులంగన్న మై
బర పౌరోగములున్న ధూర్తయయినన్ భార్యంబెడబాసి య
ప్పురుషుండొండొక పెండ్లి యాడినను నొప్పుం తప్పులేదేమియున్.

మద్యం సేవించేది, పరుషంగా మాట్లాడేది, ధనమంతా పోగొట్టేది, పురుషద్వేషిణి, గొడ్రాలు, ఎప్పుడు కూతులను కనేది, రోగిష్ఠి, ధూర్త అయిన భార్యను వదిలేసి ఇంకొక పెండ్లి చేసుకుంటే తప్పులేదన్నారు.

కానీ పై కారణాలేమీ లేక, చెప్పిన పని వెంటనే చేసేది, సత్ప్రుతుని కన్నది, వినయంతో సంభాషించేది అయిన సతిని వదిలి రెండవ పెండ్లి చేసుకోవటం భర్తకు తగదు అని అనటంవల్ల ఆనాటి సమాజం బహుభార్యత్వాన్ని అంగీకరించినా ఎక్కువగా ప్రోత్సహించలేదని చెప్పవచ్చు. పైగా పుత్రులున్న భార్యను వదిలి రెండవ పెండ్లి చేసుకుంటే భర్త పెద్దభార్యకు ధనంలో మూడవభాగం ఇవ్వడం ధర్మమని కేతన చెప్పాడు.

దీన్ని బట్టి బహుభార్యత్వాన్ని నాటి ధర్మశాస్త్రాలు గానీ, సమాజంగానీ అంతగా ప్రోత్సహించలేదని చెప్పవచ్చు కానీ అసలు లేదని చెప్పలేము. ఆ కాలంలో భోగస్త్రీలను లంజ్య పెండ్లము అని శాసనాలలో వ్యవహారం ఉండటాన్ని బట్టి కులపత్ని అయిన స్త్రీ ఒక్కరేనని, పురుషునికి భోగస్త్రీలు లేదా వేశ్యలు ఇతర భార్యల స్థానాన్ని భర్తీ చేశారని చెప్పవచ్చును.

వివాహసమయంలో ఇచ్చి పుచ్చుకునే సంప్రదాయాలు:

అరణం

కాకతీయుల కాలంలోని సాహిత్యంలో అరణం ప్రసక్తి చాలా చోట్ల కానవస్తుంది. అరణము అంటే వివాహసమయంలో వధూవరులకిచ్చు ధనాదికము, యౌతకాదికము అని నిఘంటువులో చెప్పబడింది. శాసనశబ్దకోశంలో పెండ్లికాలమందు పెండ్లికుమార్తె కిచ్చు వస్తుధన, భూరూపమైన కానుక అని వున్నది (పు. 18). ఈ అరణమన్నది ఎక్కువగా రాజకుటుంబాల వివాహాల సందర్భంలో ప్రసక్తమైనది.

చందవోలు (చందవోలు) నేలిన వెలనాటి చోడుడు అనుగురాజుతో యుద్ధం చేసి ఓడిపోయి తన కుమార్తె మైలమాదేవినిచ్చి వివాహంచేసి అరణంగా పలనాటి సీమనిచ్చాడు అన్నది ప్రసిద్ధమైన విషయం. పలనాటి వీరచరిత్రలో ఈ సందర్భంలో

చందవోలు పృధ్వీశ జననాయకుండు
చిన్నకూతురి పెండ్లిచేసేనావేళ
పెంపార పుత్రిక పృథ్వీశ్వరుండు
ఇంపార పసపున కిచ్చె పల్నాడు

అని చెప్పడం వల్ల పలనాడును మైలమకు స్త్రీధనంగా ఇచ్చినట్లే భావించాలి.

అదే కావ్యంలో వీరసోముడు తన కుమార్తె సిరాదేవిని పెదమలిదేవునికి ఇచ్చి వివాహం చేసినపుడు తాను అరణంగా ఇవ్వవలసిన వాటిని సిరాదేవి కోరుకున్న విధంగానే ఇచ్చాడు.

బ్రహ్మనాయకుడు చెప్పినట్లు సిరాదేవి వేయిగోవులను, వెయ్యి గొఱ్ఱలను, రాయపడవాలు, వారి తమ్ముడు బాలగోపన్న అనే గొల్లవీరులను అరణంగా కోరుకున్నది.

క్రీ.శ. 1265 నాటి ఆచంట రామేశ్వరాలయ శాసనంలోనూ ఈ అరణం ప్రసక్తి ఉన్నది.

‘స్వస్తి సవ్వ’ లోకాశ్రయ శ్రీ విష్ణువర్ధన మహారాజులైన విజయాదిత్య దేవ చక్రవర్తి దమకూంత్తుఱు మైలారదేవిని యసంట్టి సూరపరాజునకిచ్చి అసంట్ట గుండ్డాము అల్వునుత్తరాన పోంక్క తోంట్ట యేనూఱు తోడ నరణమిచ్చెను.

శాసనశబ్దకోశంలో అరణానికి పెండ్లికాలమందు తల్లిదండ్రులు పెండ్లికుమార్తె కిచ్చు వస్తు ధన భూరూపమైన కానుక అని అర్థం చెప్పి పై శాసనాన్ని ఉదహరించారు.

కుమారసంభవంలోనూ ఈ అరణం ప్రసక్తి కానవస్తుంది. గౌరీశంకరుల వివాహమైన తరువాత హిమవంతుడు సకల బంధుమిత్ర సపరివారంతో తన రాజ్యవిభవైశ్వర్యాలతో పాటు తనను తాను అరణంగా శివునికి అర్పించుకొన్నాడు.

కతిపయ దినముల కానగ
పతి సకళత్రాప్త మిత్ర బాంధవ రాజ్యో
న్నత నుత విభవైశ్వర్యా
న్వితముగ దన్నరణమిచ్చె విశ్వేశునకున్

అరణం అని చెప్పకపోయినప్పటికీ వరునికి కానుకలివ్వడం అన్నది ప్రతాపచరిత్రలో ప్రస్తావించబడింది. దేవగిరి రాజు యుద్ధంలో మహాదేవరాజును చంపినపుడు గణపతిదేవుడు క్రోధంతో అతనిపై దండెత్తి చంపగా, హతశేషులైన రాజబంధువులు ఆ రాజు కూతురు రుద్రాదేవిని సర్వాభరణ భూషితురాలిని చేసి, కోటి ద్రవ్యాలు కానుకగా గణపతిదేవునికి ఇచ్చారు. అంటే వరునికి కానుకగా చాలా ధనాన్ని అర్పించుకొన్నారు. ఈ సందర్భంలో సిద్ధేశ్వర చరిత్రలో కూడా దేవగిరిరాజు బంధువులు గణపతి దేవుడికి కట్నాలు, కానుకలు ఇచ్చినట్లు ఉన్నది.

పసగల కట్నాలు పద్మరాగములు
వెసనాణి ముత్యాల వేల హారములు
తమ తమ జనగూడ(?) తగు కానుకలును
నమరంగ రుద్రమ్మ యను కన్యనిచ్చి
గణపతిరాజుకు గల్యాణమపుడు గణనకెక్కగ జేయ..

పై సందర్భాలన్నీ పరిశీలిస్తే వధువు తల్లిదండ్రులు లేదా బంధువులు వివాహకాలంలో వరునికి ఇచ్చే కానుకలనే అరణం అని అంటారని తెలుస్తుంది.

కొన్ని కుటుంబాలలో బహుశా ఈ అరణం ఇచ్చే సంప్రదాయం ఉండి ఉండదు. పలనాటి వీరచరిత్రలో మాంచాల బాలచంద్రుని వివాహ సందర్భంలో అరణమిచ్చినట్లు ప్రసక్తం కాలేదు కానీ మాంచాల తండ్రి తమ కులంలో ఓలిమాడలున్నాయని చెప్పి బాలచంద్రుని తల్లి ఐతాంబ వద్ద నుండి తన కూతుర్నివ్వటానికి ఓలిగా తూమెడు మాడలు రాబట్టాడు అని తెలుస్తుంది.

రంగనాథ రామాయణంలో జనకుడు సీత ఊర్మిళాది కన్యలకు కానుకలనేకం ఇవ్వటమేకాక అల్లుళ్ళకు అరణంగా గజాశ్వ భట గణాలను, ఆభరణాలను ఇచ్చినట్లున్నది.

గరమొప్ప బుద్ధులు గఱపి కూతులకు
వరరత్న భూషణావళులు విచిత్ర
చిత్రాంబరములు దాసీజనంబులును
నేత్రోత్సవంబుగా నెమ్మితో నొసగి
కరి రథ హయ భట గణ భూషణాదు
లరణంబుగా దనయల్లుండ్రకిచ్చి

కనుక అరణం అన్నది అల్లుళ్ళ కిచ్చే కానుకలని చెప్పవచ్చును. అయితే ఈ అరణంపైన స్త్రీలకు హక్కు ఉన్నదా, లేదా? అరణం అన్నది వరుడు కోరుకుంటే వధువు తండ్రి ఇస్తాడా లేక తన శక్తికొద్దీ ఇష్టాపూర్వకంగా ఇస్తాడా? అరణం తాలూకు ధనంకానీ, వస్తువులు కానీ భూమికానీ వారసత్వంగా ఎవరికి చెందుతుంది అన్న ప్రశ్నలకు సమాధానాలు వెదకాలి.

పలనాటి వీరచరిత్రకు సంబంధించి మైలమాదేవికి పల్నాటిసీమను వెలనాటిరాజు అరణంగా ఇచ్చాడు అని లోకంలో ప్రసిద్ధి. కానీ కావ్యంలో ఆమెకు పసుపునకిచ్చె పల్నాడు అని ఉండటం వల్ల పల్నాడు మైలమకు స్త్రీధనంగా వచ్చిందని అనుకోవాలి. కానీ పల్నాటిపై పూర్తి అధికారం అనుగురాజుదే కానీ మైలమకు గానీ, నలగామరాజుకు గానీ రాజ్యం హక్కుగా రాలేదు. అనుగురాజు మరణానంతరం నలగామరాజు పట్టపుదేవి వీరవిద్యలదేవి కొడుకైన మలిదేవరాజుతో పాటు రాజ్యభాగం పంచుకోవలసి వచ్చింది. దీనికి కారణం బహుశా స్త్రీధనంగా మైలమకు పలనాడు లభించినా పలనాటి రాజుగా అనుగురాజు పాలించాడు కనుక అతని సంతానం అతని మరణానంతరం పంచుకొని ఉంటారు. ఈ సందర్భంలోనే మరొక విశేషం తెలపాలి. అనుగురాజును శాసనాలలో మైలలకామరాజని వ్యవహరించారు. క్రీ.శ. 1165 నాటి పిన్నలి శాసనంలో

“స్వస్తిశ్రీ సకవషంబులు అగునేంటి శుభాను
సంవత్సర భాద్రపద శుద్ధ ఆదివారమున
శ్రీమన్మహామండలేశ్వర మైలదేవి కామ రా
జు కొడుకు సమధిగత పంచ మహాశబ్ద మహా
మండలేశ్వర……..
………… శ్రీ మన్మహా
మండలేశ్వర యనుంగుం గామరాజుల..” అని ఉన్నది.

పై శాసనంలో మైలల కామరాజు అని వ్యవహరింపబడినవాడే పలనాటి వీరచరిత్ర కావ్యంలోని అనుగురాజు. అతని కొడుకు ‘అనుంగుం గామరాజు’ అన్నవాడే కావ్యంలోని నలగామరాజు. క్రీ.శ. 1147 నాటి పెదకొదమగుండ్ల (పల్నాడు తాలూకా) శాసనంలో మహామండలేశ్వర కామరాజుల మల్లిదేవరాజు ప్రసక్తి కానవస్తుంది. పై శాసనాలలోని మైలల కామరాజు, కామరాజు, పల్నాటి వీరచరిత్ర కావ్యంలోని అనుగురాజు ఒక్కరేనని చెప్పవచ్చును. ఈ విషయం గురించి పలనాటి వీరచరిత్ర కావ్యాన్ని పరిష్కరించిన ఆచార్య పింగళి లక్ష్మీకాంతంగారు విశదంగా చర్చించి కావ్యంలోని అనుగురాజే మైలలకామరాజు అని తేల్చి చెప్పారు. అనుగురాజు పలనాడును మైలమ ద్వారా పొంది రాజవటం వల్ల, అతనికి మైలల కామరాజని పేరు కలిగి ఉంటుంది. నలగామరాజును శాసనంలో అనుంగు గామరాజు అన్నారు.

మైలల కామరాజు పట్టపుదేవి అయిన వీరవిద్యల దేవి పుత్రుడు పెదమలిదేవుని కంటే బహుశా మైలమదేవి కొడుకు చిన్నవాడై ఉంటాడు. కనుకనే అతనిని శాసనంలో అనుంగు గామరాజు అని వ్యవహరించి ఉంటారు. అనుంగు శబ్దం చిన్నవాడనే అర్థంలో వాడడం ఉన్నదే. (మలిదేవరాజు శాసనం. క్రీ.శ. 1147 నాటిది అయితే నలగామరాజు శాసనం 1165 నాటిది) పలనాటినేలిన అనుగురాజు జ్యేష్ఠపుత్రుడిగా, పట్టపుదేవి కుమారుడుగా మలిదేవునికి, మైలమదేవికి హరిద్రమాన్యంగా వచ్చిన భూమి కనుక మైలమ పుత్రుడిగా నలగామరాజుకి పలనాటిపైన హక్కు సమానంగానే ఉండి ఉంటుంది. కావ్యంలో అనుగురాజు రాజ్యాన్ని నలగామునికే ఇవ్వమని చెప్పినా బ్రహ్మన కోరినట్లు రాజ్యాన్ని మలిదేవునితో పాటు పంచుకొనేందుకు నలగాముడు ఒప్పుకొన్నాడు.

పలనాటి వీరచరిత్రలో సిరాదేవి తండ్రి అరణంగా పంపిన మల్లవీరులపైనగానీ, గోవుల పైనగానీ సిరాదేవికి హక్కు ఉన్నట్లు అనిపించదు. వారిపై హక్కు అరణం పొందిన మలిదేవునికి, బ్రహ్మనాయునికే ఉన్నట్లు వారు ఆ మల్లయోధులనుపయోగించుకున్న పద్ధతిని బట్టి తెలుస్తుంది. మలిదేవునికి సిరాదేవికి వివాహమైన తరువాత భోజనాల సమయంలో గొల్లవీరుల ప్రతాపాన్ని చూసిన బ్రహ్మనాయుడు ఆ గొల్లవీరులను అరణంగా సిరాదేవిచేత అడిగించి తమ యుద్ధాలలో ఉపయోగించుకొన్నాడు.

దీన్ని బట్టి అరణం పైన అల్లునికే గానీ, కూతురికి హక్కు ఉండదని చెప్పవచ్చును.

ఉంకువ:

ఉంకువ అన్నది పెళ్ళికుమారుడి తరఫువారు పెళ్ళికూతురి తండ్రికివ్వవలసిన ధనం. కాకతీయుల నాటి సాహిత్యంలో ఈ ఉంకువ ప్రసక్తి పలుచోట్ల వచ్చింది. ఉంకువ అంటే సూర్యరాయాంధ్ర నిఘంటువులో కన్యార్థము మామకు గాని కన్యకకు గాని యిచ్చు ద్రవ్యము అని అర్థమున్నది. ఉంకువకు ఓలి, కన్యాశుల్కము అన్నవి పర్యాయపదాలు. నన్నెచోడుడు రచించిన కుమారసంభవంలో గౌరీకల్యాణ సందర్భంలో శివుడు గిరిజను పరిణయమాడతానన్న ప్రస్తావనను స్వీకరించిన హిమవంతుడు

క.
ఇది నాకు నుంకువిచ్చుట
యిది మొదలుగ నన్ను నరణమిచ్చితి

అన్నాడు.

రంగనాధ రామాయణంలో ‘ఉడురాజ బింబాన్య కుంకువ గలదు’ అని జనకుడు అన్నాడు.

దీన్ని బట్టి మగ పెండ్లివారు ఆడపిల్ల తండ్రికి ఇచ్చే కానుకలను ఉంకువ అంటారని అర్థమౌతుంది. ఆ సందర్భంలో పెళ్ళికూతురి తండ్రి పెళ్ళికొడుకుకు అరణంగా కానుకలివ్వడం కూడా పైన చెప్పినట్లు కొన్నిచోట్ల ఆచారం కావచ్చును. పలనాటి చరిత్రలో ఓలి ప్రసక్తి ఉన్నది.

బాలచంద్రుని తల్లి ఐతాంబ తన అన్నతో బాలచంద్రునికి అతని కూతుర్ని ఇవ్వమని అడిగినపుడు అతడు తమ కులంలో ఓలిమాడలు ఉన్నాయని, అవి చెల్లించనిదే మాంచాలను ఇవ్వనన్నాడు.

‘మనకులంబన నోలిమాడలు గలవు
తగిన ధనంబీక తానీయననెను’

పై వాక్యాలను బట్టి కన్యను కోరినవారు ఆ కన్య తండ్రికి తగిన ధనం ఇస్తేగానీ అతడు వరునికి పిల్లనిచ్చేవాడు కాదని అనేవాడని, కన్యను కోరి ఇచ్చే ధనాన్ని ఓలి అని కూడా అనేవారని తెలుస్తున్నది. 20 శతాబ్దం ప్రారంభం వరకు అంటే మహాకవి గురజాడ కాలం వరకు ఉన్న కన్యాశుల్కానికి పూర్వ రూపమే ఈ ఓలి అని భావించవచ్చును. ఈ రోజుల్లో కూడా పల్లెటూళ్ళలో పామరజనులలో ఈ ఓలి ఆచారం ఉన్నది. ఈ ధనం స్త్రీకి చెందదు. కన్య తల్లిదండ్రులకు మాత్రమే చెందుతుంది.

ఉంకువ ఇవ్వడం అన్నది వేశ్యలలో కూడా ఉన్నది. పలనాటి వీరచరిత్రలో బాలచంద్రుడు యుద్ధానికి బయలుదేరుతూ తనతో వేశ్య సబ్బాయిని తీసుకువెళ్ళదలచినపుడు ఆమె తల్లి బాలచంద్రుని ఉంకువగా ధనం ఇప్పించమన్నది. ‘ఇంతి కుంకువగాగ నిప్పించుమనియె’.

ఆ కాలంలో సాహిత్యాన్ని బట్టి పైన చెప్పిన ఉదాహరణల్లో తల్లిదండ్రులు వరుడినుంచి ఉంకువ అడిగినప్పటికీ వారు కూతురి మంచిచెడ్డలు ఆలోచించక, విక్రయించిన పద్ధతిలో అడగలేదు. ఆ కన్యకున్న అర్హతలను బట్టి ఈనాటివారు వరకట్నం అడిగిన పద్ధతిలో అడిగేవారు, ఆశించేవారు. రానురాను ఆ పరిస్థితి పోయి ఆడపిల్లలను అమ్మి ధనం రాబట్టుకునే రోజులు వచ్చాయి. ముక్కుపచ్చలారని పసిపిల్లను మూడో పెళ్లికి సిద్ధమయే మూడుకాళ్ళ ముసలి తాతకి డబ్బుకి కక్కుర్తి పడి అమ్మే రోజులు వచ్చాయి. బాలవితంతువులు ఎక్కువైపోయారు. ఆ పరిస్థితిలో కన్యాశుల్కం నాటకం ద్వారా గుఱజాడ అప్పారావుగారు దురాచారాలకు బలి అయ్యే స్త్రీల విమోచనం కోసం ప్రయత్నించారు. కేతన విజ్ఞానేశ్వరంలో ఈ ఉంకువ గురించి కొన్ని ధర్మసూత్రాలు చెప్పాడు.

గుణవంతుడైనా రెండు గోవులను ఉంకువగా ఇచ్చి కన్యను పెళ్ళాడితే అది ఆర్షవివాహమని చెప్పాడు.

ఒకడికి కూతురునిచ్చి తగిన ఉంకువ తీసుకొని పెండ్లి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, గుణవంతుడెవరైనా పెండ్లాడవస్తే మొదటి భర్తలో దోషాలేవైనా ఉంటే కన్యకను గుణవంతునకు ఇవ్వడమే ధర్మమని చెప్పాడు కేతన. అంటే ఉంకువ తీసుకున్నంత మాత్రాన కన్యను అనర్హుడికి ఇవ్వరాదు అని చెప్పినట్లు గ్రహించవచ్చును.

కన్యకు ఉంకువ ఇచ్చి, మూడుముళ్ళు పడకముందే ఆ వరుడు మరణిస్తే అతడి తమ్ముడికి ఆ కన్యనిచ్చి చేయడం న్యాయము. అతని వయసు సరిపోకపోతే ఆ కన్య చెల్లెలిని ఇచ్చి వివాహం చేయాలి. అతడికి చెల్లెలిని వివాహమాడడం ఇష్టం లేకపోతే ముందు ఇచ్చిన ఉంకువ వెనక్కి తిరిగి ఇచ్చేయడం న్యాయము అని కేతన చెప్పాడు

వరకట్నం:

ఆ కాలంలో వరుని అర్హతలను బట్టి ఆడపిల్ల తల్లిదండ్రులు వరుని అర్హతలను బట్టి ఇంత ధనం కట్నం అని నిశ్చయించి ఇవ్వడం అనేది ఉండేదికాదు. అల్లునికిచ్చే అరణమైనా కన్యతల్లి దండ్రుల ఇష్టాన్ని బట్టి వారి స్తోమతను బట్టి ఇచ్చేవారు. ఈనాటి పద్ధతిలో కట్నాల బేరసారాలు, వర విక్రయాలు లేవు. అసలు అవివాహిత కన్యలే ఉండేవారు కాదు.

కాకతీయుల కాలం నాటికి స్త్రీల కోసం ఇచ్చే ఉంకువ గానీ, ఓలి గానీ ఆ స్త్రీల స్థాయిని బట్టి ఉండేది. కానీ ఆధునికయుగంలోని కన్యాశుల్కంలాగా ఆడపిల్ల నమ్ముకున్న పద్ధతిగా ఉండేది కాదు. వివాహ సమయంలో పెళ్ళికూతురి వైపువారు వరునికి అరణం ఇచ్చేవారు. వధువుకై వరుడి వైపువారు ఉంకువ ఇచ్చేవారు. స్త్రీలకు శ్రీధనం ఇచ్చేవారు.

స్త్రీధనం:

వివాహ సందర్భంలో తల్లిదండ్రులు తమ కుమార్తెకు కొంత భూమినో, ధనాన్నో ఇవ్వడం కాకతీయుల కాలం నుంచి నేటివరకు భూస్వాముల కులాలలో రాజవంశాలలో ఉన్నది. దీనిని పసుపుకుంకుమ కొరకు అనీ, హరిద్రమాన్యమని, స్త్రీధనమని అనేవారు. ఈ ధనంపైన స్త్రీకి దానవిక్రయాది సర్వహక్కులుండేవి. కాకతి మహదేవుని కుమార్తె కుందమాంబ పాణిగ్రహణవేళ తండ్రి మహదేవుడు హరిద్రార్థం ఇచ్చిన వేములతోట అనే గ్రామాన్ని కుందవరం పేరుతో బ్రాహ్మణులకు అగ్రహారంగా ఇచ్చింది. కాకతి మైలమ తన స్థలంలో ఉన్న దిత్తాలు అనే ఊరులో భూమిని దేవబ్రాహ్మణ వృత్తులుగా దానం ఇచ్చింది. ‘తమ స్థలమునం దిత్తాలనియెడు’ అన్న వాక్యాన్ని బట్టి ఆ స్థలం ఆమెకు స్త్రీధనంగా వచ్చిందని గ్రహించవచ్చును.

వివాహ సమయంలో పెళ్లికుమార్తెకు తల్లిదండ్రులు, బంధువులు, భర్త, అత్తమామలు ఇచ్చే కానుకలు, సంపదలు కూడా స్త్రీధనంగా భావించబడుతుంది. ఆ ధనం ఖర్చుపెట్టుకునే హక్కు పూర్తిగా ఆ స్త్రీకే ఉంటుంది. ఇంకెవరూ ఆ ధనాన్ని వాడరు. స్త్రీలు తమ ధనాన్ని స్వేచ్ఛగా దానధర్మాలకు, ఆభరణాలు, వస్త్రాలు మొదలైనవాటికి ఖర్చు పెట్టేవారు. శాసనాలలో ఎంతో మంది స్త్రీలు అన్నివర్గాలకు చెందినవారు దేవాలయాలు కట్టించడం, చెరువులు, బావులు తవ్వించడం, పుష్పవాటికలు, సత్రాలు, మఠాలు నిర్మించడంల లింగ ప్రతిష్ఠలు చేయించడం, అఖండ దీపాలర్పించడం వంటివి చేశారని బ్రాహ్మణులకు బీదసాదలకు దానాలు చేశారని ఉన్నది. వీటన్నిటికీ కావలసిన ధనం తమ స్త్రీధనం నుంచి తమకున్న భూముల రాబడి నుంచి ఖర్చు పెట్టారని కాకతి మైలమ కుందమాంబ, మొదలైన స్త్రీలు వేయించిన శాసనాల వల్ల తెలుస్తుంది.

కాకతి గణపతి దేవుని సోదరి కుందమాంబ వేయించిన నిడిగొండ కుందవరం శాసనాలలో ఆమె తండ్రి మహదేవుడు ఆమె వివాహ సమయంలో హరిద్రార్ధం వేములతోట అనే ఊరును ఇచ్చినాడనీ, దానిని కుందవరం పేరుతో అగ్రహారం చేసి, కుందసముద్రం కట్టించి దేవ బ్రాహ్మణులకు సమర్పించిందని ఉన్నది.

కాకతి మైలమ తమ స్థలమైన దిత్తాలనే ఊరులో భూమిని దేవబ్రాహ్మణులకై సమర్పించినదని త్రిపురాంతకం శాసనంలో ఉన్నది. కాకతి మహదేవుడు రాజు కనుక తన కుమార్తెలిద్దరికీ వివాహ సమయంలో ఎన్నో భూములు, గ్రామాలు ఇచ్చాడు. ఆ విధంగానే ఆ కాలంలో మండలేశ్వరులు, భూస్వాములు అంటే నాయకులు, సేనాధిపతులు, మంత్రులు వంటి ధనికవర్గం వారు తమ కుమార్తెలకు వారివారి అంతస్తులను బట్టి శక్త్యనుసారం స్త్రీధనం ఇచ్చేవారు. ఆస్తులకు కొడుకులు వారసులు కనుకను తమ యింటి ఆడపడుచులను పరాయి యింటికి పంపినపుడు అత్తింట ఆమె ఎవరినీ అడగవలసిన అవసరం రాకుండా స్వేచ్ఛగా ధనాన్ని ఖర్చు పెట్టుకొనేటందుకు ఆనాటివారు ధనాన్ని, భూములను ఇచ్చేవారు. తమ ఆడపిల్లలు అత్తింట సుఖంగా ఉండేందుకు దాసదాసీ జనాన్ని, గోసంపదను ఇచ్చేవారు. ఇరుగు పొరుగు రాజులతో సంబంధబాంధవ్యాలు పెంచుకొనేందుకు చిన్నవయసులో ఉన్న ఆడపిల్లలను పెళ్ళిచేసి పంపించేవారు కనుక బహుశా తమ కుమార్తెలకు తమ శక్తికొద్దీ కానుకలను, ఇవ్వడం ధర్మంగా భావించేవారు.

ఆనాటి శాసనాలు పరిశీలిస్తే స్త్రీలు చేసే దానాల విషయంలో విశేషాలు గోచరిస్తాయి. భర్త ఆలయం కట్టిస్తే భార్య భూములను ఆ ఆలయంలోని అంగరంగ భోగాలకు దేవ బ్రాహ్మణులకు దానంచేసేది. భార్య ఆలయం కట్టిస్తే భర్త దేవాలయ నిర్వహణకు భూములను దానంచేసేవారు. క్రీ.శ. 1104 నాటి నిడిగొండ శాసనాన్ని బట్టి నతవాడి దుగ్గభూపతి భార్య ముప్పమాంబ ముప్పేశ్వర దేవరను ప్రతిష్ఠించి ఆలయం కట్టించి, గుండెనిబండ లోని నెపరుంగుంట ను దానమివ్వగా ఆమె భర్త దుగ్గభూపతి రట్టసముద్రం వెనుక రెండు మర్తుర్లు వరిభూమి, ఇరవై ముర్లు కరంబం దానమిచ్చాడు అని తెలుస్తున్నది’. కాకతి రెండవ ప్రోలుని మంత్రి బేతన భార్య మైలమ కడలాలయ బసది కట్టించగా, భర్త బేతన భూమిని దేవర పూజార్థం పూజారి ఆహార నిమిత్తం దానం చేశాడు.

స్త్రీ భర్త వల్ల పొందిన ధనాన్ని తగిన వారికివ్వవచ్చును గానీ, క్షేత్రం మాత్రం తాననుభవించకుండా ఇతరులకు ఇవ్వడం అనుచితమని కేతన చెప్పాడు. దాన్నిబట్టి స్త్రీలు భూదానాలు, భర్త ద్వారాకాక తమ స్త్రీధనంగా లభించినవాటి నుండి చేసేవారని చెప్పవచ్చును.

దానధర్మాలకే కాక స్త్రీలు తాము నోచుకొనే నోములకు తీర్థయాత్రలకు పండుగలకు ధనాన్ని ఖర్చు పెట్టేవారు. చివరికి సహగమనం చేసే రోజున కూడా దానాలు చేసేవారు. వీటన్నింటికీ తమ స్త్రీ ధనం నుండే ఖర్చు పెట్టేవారని ఇంతకుముందు చెప్పడమైనది. అయితే తమ పిల్లలకు సంబంధించిన వానికోసం స్త్రీ ధనం నుండి ఖర్చు పెట్టేవారు కాదేమో. ఇటువంటి సందర్భం పలనాటి వీరచరిత్రలో కానవస్తుంది. బాలచంద్రుడు బొంగరాలాటకై తనకు బొంగరాలు చేయించమని తల్లి ఐతాంబ నడిగినపుడు ఆమె మామూలు బొంగరాలు చేయమని ఓజులకు చెప్పింది. బాలచంద్రుడు తల్లితో నిష్ఠూరమాడాడు.

ఏడుకోటుల సంఖ్య నెసగిన ధనము
కలిగిన యాగండు కన్నమనేని
చెల్లెలవైయుండి సిరుల చెన్నొంది
చెనటి బొంగరములు చేయుంచు కొరకు
ఏరీతి మనసొప్పె నేణాక్షి నీకు

ఆమె తనకు బొంగరాలు చేయించడంలో లోభత్వం చూపించిందని పలికి, ఆమె తండ్రి సొమ్ము తనకు వద్దనీ, తన తండ్రి బ్రహ్మనాయుడు సంపాదించిన ధనంతో బంగారు బొంగరాలు చేయించమన్నాడు.

నీ తండ్రి సొమ్ముకై నేనాసపడను
సకల దేశాధీశ సంఘంబునెల్ల
సమర రంగంబున సాధించి మించి
వారిచే మాతండ్రి వలసినయట్లు
అప్పనంబులు గొన్న అధిక ధనంబు
పొందుగా తెప్పించి పుటము పెట్టించి
పైడి బొంగరములు పరగ చేయింపు

దీన్నిబట్టి స్త్రీలకు వారి పుట్టింటి నుంచి లభించిన ధనం ఇంటిఖర్చులకు వాడవలసిన అవసరం లేదని గ్రహించవచ్చును.

భర్తలు భార్యలు విడివిడిగా దానాలు చెయ్యడం, దేవాలయాలు కట్టించడం చెరువులు తవ్వించడం చేసేవారు కనుక వారు దానికై ఖర్చుపెట్టే ధనం కూడా ఉమ్మడి ధనం కాక ఎవరిది వారిదే అయి వుండవచ్చును.

బ్రాహ్మణ స్త్రీలలో రాజోద్యోగుల కుటుంబాల స్త్రీలకు కొంత స్త్రీధనం లభించేదేమో కానీ బ్రాహ్మణ స్త్రీలు దానధర్మాది కార్యాలకు ఖర్చుపెట్టినట్లు గానీ, అలంకరణకు వెచ్చించినట్లు గానీ సాహిత్యంలో కనిపించదు. పెద్దకుటుంబాల స్త్రీలు చేసే పూజలు, శుభకార్యాలు, నోముల సందర్భాలలో ఈ బ్రాహ్మణ స్త్రీలకు వాయనాల రూపంలో నిత్యావసర వస్తువులు లభించేవి. సహగమనం చేసే వేళలో కొందరు స్త్రీలు బ్రాహ్మణ స్త్రీలకు సొమ్ములు, చీరలు, పసిడి శూర్పాలు దానం చేసినట్లు సాహిత్యంలో కానవస్తుంది. కానీ ఆ సందర్భాలు బహు తక్కువ. ఎక్కువగా నిత్యావసర వస్తువులే వాయనాల రూపంలో అందేవి. దాన్నిబట్టి ఆనాటి బ్రాహ్మణ స్త్రీల ఆర్థిక పరిస్థితిని అంచనా వేయవచ్చును. రాజులు, భూస్వాములు, రాజోద్యోగులు మొదలైన వారి కుటుంబాల స్త్రీలకు స్త్రీధనం ఉండేదని, దాన్ని ఖర్చుపెట్టే స్వాతంత్ర్యం వారికి ఉండేదని శాసనాలను బట్టి చెప్పవచ్చును. (చూడుడు స్త్రీలు- ధర్మకార్యాలు)

స్త్రీధనం – వారసత్వం:

స్త్రీధనంగా చెల్లే ధనమంతా తల్లి నుండి కూతురికి, కూతురు నుండి కూతురి కూతురికి చెందుతుంది. కూతురు లేకపోతే కొడుకుకు సంక్రమిస్తుంది. కానీ ఇంకెవరికీ చెందదు అని కేతన విజ్ఞానేశ్వరంలో చెప్పాడు.

‘స్త్రీధనంబు పేరఁజెల్లిన ధనమెల్ల
గూఁతురు జేరు గూఁతు కూఁతుఁజేరు
గూఁతు గానకున్న గొడుకు పాలగు గాని
వేరుపాలివారు వెదకలేరు’

స్త్రీధనంలో పతి ద్వారా సంక్రమించిన ధనం కూడా ఉంటుంది. స్త్రీ భర్త వల్ల పొందిన ధనం తగినవారికి ఇచ్చే హక్కు ఆమెకున్నది. కానీ క్షేత్రం మాత్రము తాననుభవించకుండా ఇతరులకు తన చనువుకొద్దీ ఇవ్వడం అనుచితమని కేతన చెప్పాడు.

స్త్రీలు ధరించే సొమ్ములు కూడా స్త్రీధనంగా పరిగణింపబడినప్పటికీ భార్య చనిపోతే ఆమె వంటి మీది నగలు ఆమె పుట్టింటివారికి చెందవు. అవి భర్తకే చెందుతాయని బెజవాడకు చెందిన తెలికి లేవురు అనే వర్తకసంఘం వేయించిన శాసనం వల్ల తెలుస్తున్నది.

సంఘం చేసిన సమయం ప్రకారం భార్య చనిపోతే ఆమె వంటిమీద నగలు ఆమె భర్తకే చెందుతాయి కానీ ఆ స్త్రీ తాలూకు బంధువులు వానికోసం ఆశించితే పాతకం కలుగుతుంది. ఈ శాసనం కులోత్తుంగ రాజేంద్రచోడుని కాలంనాటిది.

‘శ్రీమతు బెజవాడ శాసనులైన తెలికివేవురు సేసిన సమయము యాలు చచ్చిన ఆయాలికిం గలట్టి పాటి తొడవు మగనిద కాని యాలివారు పెనగిరేని మహాపాతకము సేసినవారు’

పెళ్ళిసమయంలో పెళ్ళికుమార్తెకు వరుడి బంధువులు, అత్తమామలు ఇచ్చే కానుకలు, ఆభరణాలు అన్నీ ఒకప్పడు స్త్రీధనంగా పరిగణింపబడింది. ఈ శాసన కాలానికి ముందు బహుశా స్త్రీధనంలో భాగంగా భావించబడిన ఆభరణాలు బహుశా ఆ స్త్రీ మరణించాక ఆమె పుట్టింటివారు తీసుకొనేవారేమో? ఈ శాసనాలు వేయించిన నాటినుండి ఆమె వంటిమీద ఆభరణాలు స్త్రీధనంగా భావించబడలేదని, అవి భర్తకే చెందేవని గ్రహించవచ్చు.

స్త్రీధనం ఖర్చుచేసే హక్కు భర్తకు లేదు. కొన్ని విపత్కర సమయాలలో తప్ప, తమ వ్యసనాలకు, ఇంటిఖర్చులకు భార్యకు చెందిన స్త్రీధనాన్ని భర్తవాడకూడదనే నియమం ఆ రోజుల్లో ఉండేది. ఈ సందర్భంలో కేతన ఏ పరిస్థితులలో భర్త స్త్రీధనాన్ని వాడవచ్చునో ఈక్రింది విధంగా చెప్పాడు.

గాలిని దెవులున నాప
త్కాలంబున మేటిరాజకార్యంబున ని
ల్లాలి ధనము పతిగొన దగు
బోలదు పెఱపట్ల యందు బుచ్చుకొనంగన్

కరువుకాలంలోను, ఆపద సంభవించినపుడు, రాజకార్యాలకు సంబంధించిన ఖర్చులకు భార్య ధనం భర్త ఖర్చుపెట్టవచ్చు. తక్కిన సమయాలలో స్త్రీధనం భర్త ఉపయోగించరాదు.

ఋణం:

వారసులకు తండ్రి ఆస్తి సంక్రమించినట్లే అతని అప్పులు తీర్చే బాధ్యత కూడా ఉన్నది. కొడుకులేని ధనవంతుడు చనిపోతే అతని ధనం తీసుకొన్నవాడు అతని అప్పు తీర్చాలి. ధనం, పుత్రులు లేని వాడి అప్పు తీర్చవలసిన బాధ్యత అతని భార్యకుగానీ ఇతర బంధువులకు గానీ లేదని కేతన నిర్దేశించాడు.

‘తనయ విహీనుడు చచ్చిన
ధనముంగొని ఋణమా నరువ దగు దాయాదుల్
ధనపుత్రహీను పిమ్మట
బనిలేదు ఋణంబు దీర్ఘ బత్యాదులకున్’

భార్య తాను తీసుకున్న ఋణం, భర్త తీర్చమని చెప్పిన ఋణము, భర్త ఇవ్వవలసిన ఋణం తీర్చవచ్చును గానీ, ఇతరత్రా అప్పు తీర్చవలసిన బాధ్యత ఆమెకు లేదు.

‘సతి తనకొన్న ఋణంబును
బతి యిమ్మని నిశ్చితముగ బనిచిన ఋణమున్
బతి యియ్యకొలుపు ఋణమును
వితతంబుగ నచ్చు గాని పెఱయరువదిలన్’

పై సందర్భాలలో భార్య భర్త అప్పు తీర్చవచ్చునేమో గానీ అతడి వ్యసనాల వల్ల అయిన అప్పులు తీర్చవలసిన బాధ్యయత భార్యకి లేదు.

పాన స్త్రీ ద్యూతాదుల
నైన ఋణము తల్లిదండ్రులకు వరు సుతు డుం
దానవరుడు వారి ఋణము
మానుగ నాలరువ దెందు మగని ఋణంబున్

భార్య చేసిన అప్పు:

భార్యలు చేసే అప్పులకు భర్తలెంతవరకు బాధ్యులు? ఏ పరిస్థితులలో భర్త భార్య చేసిన అప్పులు తీర్చాలి? అన్న ప్రశ్నలకు కేతన విజ్ఞానేశ్వరంలో ఈ విధంగా చెప్పాడు.

గొల్లవాడు, వ్యాధుడు అంటే బోయవాడు, చాకలి, కల్లు అమ్మేవాడు మొదలైనవారు వారి భార్యల అప్పు తీర్చాలి. పైన చెప్పినవారి భార్యలు ఇంటిబాధ్యతలు చూసుకొని ఇల్లు నడిపేవారు. వారు చేసే అప్పు ఇంటి కోసమే కనుక ఆ అప్పు తీర్చవలసిన బాధ్యత భర్తదేనని చెప్పవచ్చు. ప్రత్యేకించి కొంతమందిని మాత్రమే పేర్కొని వారు మాత్రం భార్యల అప్పు తీర్చాలి అంటే తక్కిన జాతులవారెవ్వరికీ భార్యల అప్పు తీర్చవలసిన బాధ్యత లేదనే అనుకోవలసి ఉంటుంది.

గొల్లఁడు వ్యాధుఁడు రజకుఁడు
కల్లమ్మెడువాఁడు లోనుగా గొందఱు దా
రిల్లాలప్పరువందగు
నిల్లునడపుచనవు దానికిచ్చిన కతనన్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here