[box type=’note’ fontsize=’16’] “హిమాలయాలకు ఒక గొప్పతనం ఉంది. మనల్ని మంత్రముగ్ధులను చేసేస్తాయి. ప్రాపంచిక విషయాలు గుర్తుకు రానీయవు” అంటూ హిమాచల్ ప్రదేశ్‌లో తాము తాము పొందిన అనుభూతిని పాఠకులతో పంచుకుంటున్నారు డి. చాముండేశ్వరి “హిమాచల్ యాత్రానుభవాలు” అనే ఈ యాత్రాకథనంలో. [/box]
మను టెంపుల్:
[dropcap style=”circle”]న[/dropcap]గ్గర్ క్యాజల్ చూసి వెనక్కి వచ్చిన తరువాత హోటల్ స్టాఫ్ మా మనాలి యాత్ర ఎలా జరుగుతున్నదని అడిగారు. చాలా బాగా జరుగుతోందని చెప్పాము. అంతే కాదు వారు మాకు మరిన్ని దర్శనీయ ప్రదేశాల గురించి చెప్పారు.
మనాలి ప్రయాణం పెట్టుకున్నప్పుడు మాకు ఇక్కడ ఇన్ని ప్రదేశాలు ఉన్నాయని తెలియదు. రెండు మూడు రోజుల ప్యాకేజీతో వస్తే కొన్ని ముఖ్య ప్రదేశాలు మాత్రమే చూపిస్తారు. కానీ మేము స్వయంగా ప్రయాణం, హోటల్ ఇతర ఏర్పాట్లు చేసుకోవటంతో ఎక్కువ ప్రదేశాలు చూడగలిగాము.
హోటల్ మేనేజర్, ఓనర్ విక్కీ డోగ్రా ఇతర స్టాఫ్ చాలా స్నేహపూర్వకంగా మసలి ఇంటిలో ఉన్న ఫీల్ ఇచ్చారు.
ఫుడ్ బాగుంది. రోజు ఉదయం అల్పాహారం తిని, వివిధ ప్రదేశాలు చూడటానికి వెళ్లేవారం. రాత్రికి తిరిగి వచ్చి హోటల్‌లో డిన్నర్ చేసేవాళ్ళము.
మరునాడు మేము ఓల్డ్ మనాలిలోని మను టెంపుల్, వసిష్ఠ టెంపుల్, హాట్ స్ప్రింగ్స్‌కి వెళ్లాలని అనుకున్నాము. మరునాడు ఉదయం త్వరగా బయలుదేరి మనాలి మాల్ రోడ్ వెళ్ళాము. అక్కడనుండి లోకల్ ఆటో, టాక్సీల్లో మను, వసిష్ఠ టెంపుల్ ఇతర ప్రాంతాలకు వెళ్ళవచ్చు.
మేము ముందుగా మను టెంపుల్‌కి వెళ్ళాము. ఓల్డ్ మనాలిలో ఉన్న ఈ టెంపుల్ దోవ ఇరుకుగా ఉన్నా చాలా బాగుంటుంది. ముఖ్యంగా లోకల్ ప్రజల జీవన విధానం దగ్గరగా చూడవచ్చు. వృద్ధులు కూడా చలాకీగా పనులు చేస్తూకనిపించారు. ఇంటి లోనే మహిళలు కులు ఉన్ని శాలువాలు ఇతరాలు అల్లుతూ, నేస్తూ కనిపిస్తారు.
కనువిందు చేసే పచ్చదనం ఆహ్లాదం ఇస్తుంది. మనాలిలో అతి పురాతనమైన ఆలయాలు అనేకం కలవు. అనేక మంది భక్తులు ప్రభావితులవుతారు.
‘మను స్మృతి’ రచించిన, మన ప్రపంచ నిర్మాత ఋషి మనువుకి అంకితంగా ఈ ఆలయం నిర్మితమైంది.
దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారం కథలోని ఋషి మనువు ప్రయాణించిన నావ చేరిన ప్రదేశం, పునః సృష్టి చేసిన చోటు మనాలి అని చెబుతారు. మను పేరు నుండే మనాలి పేరు వచ్చిందిట.
ఈ టెంపుల్ మాల్ రోడ్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంది. దగ్గర్లో బియాస్ నది ఆకర్షణీయంగా ఉంది.
మన దేశంలో ఋషి మనువుకు అంకితం ఇచ్చి నిర్మించిన ఆలయం ఇదొక్కటే. ఆయన ఇక్కడే తపస్సు చేశారట.
మేము వెళ్ళినప్పుడు అక్కడ గ్రామ పెద్దల సమావేశం జరుగుతోంది. ఆ కట్టడం పురాతన ప్రాంతీయ పద్దతిలో కట్టిన చిన్న ఆలయం.
వసిష్ఠ గుడి:
మను టెంపుల్‌ని దర్శించి వెనక్కి మనాలి మాల్ రోడ్‌కి వచ్చి అక్కడి హోటల్‌లో లంచ్ చేసి అక్కడే విశ్రమించాము. అక్కడే ఉన్న హిమాచల్ ప్రదేశ్ పర్యాటక శాఖ ఆఫీస్‌లో మనాలి నుండి లేహ్ మరియు రోహతాంగ్ పాస్‌కి వెళ్ళటానికి ఉన్న బస్సు వివరాలు అడిగి తెలుసుకున్నాము. మాకు వెళ్ళటానికి వీలు కాలేదు.
మాల్ రోడ్‌లో షాపింగ్ చూసాము. వులెన్స్ ఎక్కువగా అమ్ముతారు. అక్కడే ఉన్న దుర్గ మాతా గుడిని దర్శించుకున్నాము.
తరువాత ఆటో స్టాండ్ నుండి ఆటోలో వసిష్ఠ గ్రామంలోని వసిష్ఠ గుడికి వెళ్ళాము. అక్కడొక ఆలయ సముదాయం ఉంది. మనాలికి 6 కిమీ దూరంలో కొండ శిఖరాగ్రం మీద ఉన్న పచ్చదనం ఉట్టిపడే పురాతన గ్రామం.
దోవ పొడవునా మనకు హిమాలయ మంచు శిఖరాలు కళ్ళు తిప్పనివ్వవు. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. చాలా మంది విదేశీ యాత్రికులు ఇక్కడే బస చేస్తారట. అందువల్ల చాలా విదేశీ ఆహార హోటల్స్, బేకరీలు ఉన్నాయి. ఎక్కడ బస వసతి చౌకగా దొరుకుతుంది.
ఈ గ్రామం బియాస్ నదికి దగ్గర్లో ఉంది. అంతే కాదు గ్రామం ఇరుకు దారుల్లో కనిపించే సెలయేళ్ళు స్వచ్ఛమైన చల్లని నీటిని తాకి పులకించిన అనుభవం అద్భుతం. వాటిని వదిలి రా బుద్ధి కాదు సుమా!
తన 100 మంది కుమారులను విశ్వామిత్ర ఋషి చంపినా బాధలో ఆత్మహత్య మహా పాపం అని తెలిసీ విఫల ప్రయత్నం తరువాత కొత్త జీవన అధ్యాయాన్ని మొదలు పెట్టటానికి ఘోర తపస్సు చేసిన చోటుట.
అంటే కాదు వసిష్ఠ ఋషిని కలవటానికి వచ్చిన లక్ష్మణుడు, ఋషి దూరప్రాంతం నుండి నీటిని తేవటం చూసి శ్రమ తగ్గించటానికి తన బాణాన్ని భూమిలోకి ప్రయోగిస్తే వేడి నీటి ఊట ఒకటి పైకి ఉబికి వచ్చి నేటికీ ప్రవహిస్తూ గుడి ప్రక్కనే ఉన్న ఉష్ణ గుండంగా భక్తుల ఆరోగ్య సమస్యలు తీరుస్తుందని ప్రతీతి… స్త్రీ పురుషులకు విడిగా స్నాన గదులు ఉన్నాయి. 20 రూపాయలు వసూలు చేస్తారు.
వసిష్ఠ టెంపుల్ 4000 ఏళ్ళు పురాతనమయినదట. మూల విరాట్టు వశిష్ఠుడి దానికి ప్రక్కనే వేరొక ప్రాంగణంలో అతి పురాతనంగా చెప్పబడిన రామాలయం ఉంది. బయటకి కొత్తగా కనిపించే చెక్క కట్టడం. లోపలి వెళితే వేరొక పురాతన చెక్క కట్టడం లోపల కనిపిస్తుంది.
దానికి దగ్గర్లో మరొక ఆలయం శివునిది. ఈ ఆలయాలన్నీ హిమాచల్ పురాతన సాంప్రదాయ పద్దతిలో కట్టినవి.
మన దేవుని కూడా ఆయా కాలమాన ప్రాంతీయ అవసరార్ధం ఆ యా పద్దతులలో పూజిస్తారు. అయినప్పటికీ ఆ దేవదేవుడు అందరి సేవలను స్వీకరించి దీవిస్తాడు. కానీ మనుషులే ప్రాంతీయ వివాదాల్లో దూరాన్ని పెంచుకుంటున్నాడు.
ఆలయదర్శనం, రామాయణ స్మరణం తరువాత తిరిగి హోటల్‌కి చేరుకొని రూమ్ బాల్కనీలో కూర్చుని వేడి టీ
సేవిస్తూ ఎదురుగా కనిపిస్తున్న నదిని, హిమ గిరుల శిఖరాలను చూస్తూ ఆనందిస్తూ మరుసటి రోజు ఎక్కడికి
అని చర్చించుకొని చీకటి పడ్డాక లోపలి వచ్చాము.
హిమాలయాలకు ఒక గొప్పతనం ఉంది. మనల్ని మంత్రముగ్ధులను చేసేస్తాయి. ప్రాపంచిక విషయాలు గుర్తుకు రానీయవు. ఫోన్, టీవీ, ఇంటర్నెట్ వాడక పోయినా బోర్ కొట్టదు. నిజమైన మానసిక ప్రశాంతత, ఒత్తిడి లేని జీవితం అనుభవం అయింది. సో పీస్‌ఫుల్!
(సశేషం)