సర్వజీవ సమానత్వం బోధించిన శ్రీ సాయి

0
3

[శ్రీ సి.హెచ్. ప్రతాప్ గారి ‘సర్వజీవ సమానత్వం బోధించిన శ్రీ సాయి’ అనే రచనని అందిస్తున్నాము.]

[dropcap]సా[/dropcap]ధకులు ఆధ్యాత్మిక జీవనం అలవరచుకుంటే సర్వజీవ సమానత్వాన్ని పొందగలుగుతారు. తద్వారా సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని కూడా సాధించగలుగుతారు. స్త్రీల పట్ల మాతృభావన కలిగి ఉండండి. లేకపోతే దేశము, ధర్మము అనేవి మిగలవు. స్త్రీలను భోగవస్తువులుగా చూడకండి అని మన శాస్త్రాలు స్పష్టంగా చెబుతున్నాయి.

‘సర్వజీవ నమస్కారం కేశవం ప్రతిగచ్ఛతి’ – సమస్త ప్రాణులకు నమస్కరించడం భగవంతుడికి నమస్కరించడంతో సమానం. ‘సర్వజీవ తిరస్కరం కేశవం ప్రతిగచ్ఛతి’ – అన్ని ప్రాణులను ధిక్కరించడం భగవంతుని ధిక్కారం అని శాస్త్ర వాక్యం. భగవంతుడు ప్రతి జీవిలో నివసిస్తున్నాడని మరియు ఆయన ఇక్కడ మరియు ఇప్పుడు సాక్షాత్కరింపబడతాడని మన గ్రంథాలు పదేపదే ధృవీకరిస్తున్నాయి. అతను అందరికీ అందుబాటులో ఉంటాడు. ఈ సత్యాన్ని సద్గురు శ్రీ సాయిబాబా తన లీలల ద్వారా భక్తులకు ఎన్నో సార్లు స్పష్టం చేసారు.

ఒకరోజు శిరిడీలో శ్రీమతి ఖపర్డే మడి కట్టుకొని వంట చేస్తోంది. వంట త్వరగా పూర్తి చేసి నైవేద్యాన్ని శ్రీ సాయికి సమర్పించాలన్న ఆతృతతో ఆమె వుంది. అప్పుడు ఒక కుక్క వాసన బట్టి వంటింట్లోకి జొరబడింది. అది వంటకాలను తాకి అపవిత్రం చేస్తుందన్న భావనతో శ్రీమతి ఖపర్డే పొయ్యిలోనుండి ఒక కట్టెను తీసి ఆ కుక్కపై విసిరింది. తర్వాత ఆమె మశీదుకు నైవేద్యం తీసుకొని వెళ్తే దానిని స్వీకరించడానికి శ్రీసాయి ససేమిరా నిరాకరించారు. నేను వస్తే నాపై మండుతున్న కట్టెను విసురుతావా, చూడు నా శరీరం ఎలా కాలిందో అని కఫ్నీ పైకి ఎత్తి చూపించగా అక్కడక్కడా కాలిన బొబ్బలు కనిపించి శ్రీమతి ఖపర్డే చలించిపోయింది. తాను ఆరాధించే శ్రీ సాయి ఆ కుక్కలో కూడా అంతరాత్మ రూపంలో వున్నారని అర్థం చేసుకున్నాక ఆమెలో వున్న అజ్ఞానం పటాపంచలయ్యింది.

మరొక సందర్భంలో లక్ష్మీబాయి షిండే అనే ఒక భక్తురాలు సాయి తనకు ఆకలిగా వుందంటే గబ గబా వెళ్ళి రొట్టె, కూరలు చేసుకొని తీసుకువచ్చింది. సాయి దానిని కనీసం రుచి కూడా చూడక పక్కన ఆకలితో వున్న ఒక కుక్కకు వేసారు. దానిని చూసిన లక్ష్మీబాయి చిన్నబుచ్చుకొని “అదేమిటి బాబా, అలా చేసారు? మీకు ఆకలిగా వుందని నేను ఆఘమేఘాల మీద భోజనం తయారు చేసి తీసుకువచ్చాను” అని అంది. అప్పుడు శ్రీ సాయి చిరునవ్వుతో “తల్లీ, నువ్వు చాలా మంచి పని చేసావు. దాని ఆకలి తీరితే నా ఆకలి కూడా తీరినట్లే. దానికి నోరు లేదు కాబట్టి తన ఆకలిని బయటకు చెప్పుకోలేదు. ఆకలితో వున్న ఏ జీవికి అన్నం పెట్టినా నాకు పెట్టినట్లే అని తెలుసుకో” అని హితబోధ చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here