మహతి-15

2
3

(సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ సినీ కవి, రచయిత శ్రీ భువనచంద్ర అందిస్తున్న ధారావాహిక.)

[ఇంటర్ తరువాత ఏం చదవాలనే ఆలోచనలో మహతి ఉండగా, ఒక రోజు అల ఫోన్ చేస్తుంది. తన కథని కూడా మహీనే రాయమంటుంది. తను సినిమాల్లోకి వెళ్లాక ఏం జరిగిందో అల మహీ ద్వారా చెప్పడం మొదలుపెడుతుంది. ఇక అల కథ. తాను సినిమాల్లోకి రావడం అయితే తేలికగానే వచ్చాను కానీ, మొదటి మూడు స్థానాలలో నిలదొక్కుకోడానికి మాత్రం బాగా కష్టపడ్డానని చెప్తుంది అల. తను నటించి మొదటి సినిమా ‘ధీర’ గురించి చెప్తుంది. మొదట ఆ సినిమాలో ఒక చిన్న పాత్ర ఇద్దామనుకున్న దర్శకులు అల ప్రతిభని గుర్తించి మెయిన్ హీరోయిన్‍గా మారుస్తారు. సెకండ్ హీరోయిన్‍గా నటిస్తున్న సర్రీ స్వభావం గురించి చెబుతుంది అల. షూటింగ్ మొదలవుతుంది. ముందుగా హీరో, అతని ఫ్రెండ్ మీద సీన్లు తీస్తారు. ఆ తర్వాత, అల, సర్రీల మీద తీస్తారు.  అలకి డైరక్టర్ సత్యమోహన్ ఎంతో ధైర్యం చెప్తారు. సినిమాల్లో రాణించగలవని ప్రోత్సాహమిస్తారు. ఆ సినిమాకి పని చేస్తున్న ముఖ్యమైన టెక్నీషియన్‍లని పరిచయం చేస్తుంది అల. అసోసియెట్ డైరక్టర్ వసంత్ అందరికీ తలలో నాలుకలా ఉంటాడు. అలకి అవసరమైన సూచనలిస్తాడు. ఎవరితో ఎలా మసలుకోవాలో జాగ్రత్తలు చెప్తాడు. ఆ సినిమా గీత రచయిత అవకాశాలు దక్కించుకోడం కోసం తానెంత కష్టపడినదీ అలకి చెప్తాడు. అల కూడా చక్కగా ప్రాక్టీస్ చేస్తూ, రకరకాల హావభావలను అందంగా పలికిస్తూ డైలాగులు రకరకాల మాడ్యులేషన్‍లో చెప్తూ సెట్‍లో అందరి అభిమానం పొందుతుంది. ఓల్డెస్ట్ కోడైరక్టర్ అయిన సదాశివరావు గారు అలకు మరిన్ని మెలకువలు చెప్తారు. తన దగ్గర శిక్షణ పొందినవాళ్ళు గొప్ప నటీనటులుగా పేరుతెచ్చుకోవడమే తనకి ఆనందమని అంటారు. – ఇక చదవండి.]

మహతి-2 అల-2:

[dropcap]ఆ[/dropcap]డవాళ్ళ టచప్ వుమన్ పేరు కనకాక్షి అని చెప్పాను కదా. ఆ అమ్మాయి చాలా సాఫ్ట్. ఓసారి షాట్ గాప్ వచ్చింది. నా కాళ్ళ దగ్గర కూర్చుని “మీరు చాలా మంచి వాళ్ళు” అన్నది.

“అదేం” అన్నాను.

“ఇంతకు ముందు చాలా హీరోయిన్ దగ్గరా, ఇతర కంపెనీల్లోనూ టచప్ వుమన్‍గా వుండేదాన్ని. హీరోయిన్లకి అహంభావం ఎక్కువ. మీలాగా మర్యాదగా మాట్లాడరు” అన్నది.

నేనేమీ మాటలు పొడిగించలేదు. దానిని కారణమూ వసంత కుమార్ చేసిన సద్బోధే. ఎవరికీ చనువు ఇవ్వొద్దనీ, కాస్త చనువు ఇచ్చినా నెత్తిమీదకి ఎక్కడమే కాక రకరకాల పుకార్లు పుట్టిస్తారనీ, టచప్ వాళ్ళతోటీ, డ్రైవర్లతోటీ గంభీరంగా, రిజర్వ్‌డ్‌గా ఉండమనీ అతనే చెప్పాడు.

“అంతే కాదండీ, మమ్మల్ని పనిమనుషుల్లా ట్రీట్ చేస్తారు. మీరు అలాగ కాదు. మరండీ ఇలా అద్దమూ టచప్ సామానూ పట్టుకుని వెనక వెనక తిరగడానికి కూడా చచ్చేంత వ్యవహారం వుందండీ. అబ్బో..” అన్నది.

ఆ మాట మిన్నాక మా కె.వి.ఎం. కాలేజీ ఇంగ్లీషు లెక్చరర్ రవీంద్రనాథ్ గారి మాటలు గుర్తొచ్చాయి – “పిల్లలూ రచన అనేది కొండ మీద కోతో, ఆకాశంలో నక్షత్రమో కాదు. రచన అనేది నిజంగా చెబితే ఓ ‘స్టడీ’. నిరంతరం నీ చుట్టూ వున్న వాళ్ళ జీవితాన్ని గమనించు. ఒక్కో జీవితం పాతిక కథల పెట్టు. ప్రతి జీవితమూ ఓ నవలే. మనం చెయ్యాల్సిందల్లా ఆ జీవితంలోని సన్నివేశాలను అక్షరబద్ధం చెయ్యడమే” అని. అందుకే,

“కనకా.. అంత కష్టమా?” అన్నాను. సైలెంట్ అయింది కనక. అంతే కాదు, జవాబు చెప్పకుండా తల వొంచుకుంది. నేనేమీ ఆమెని మరో మాటతో ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందుకే నా చేతిలో వున్న కిషన్ చందర్ నవల ‘అయిదుగురు లోఫర్లు’ చదవడం మొదలెట్టా. కాలేజీలో కూడా నాకు పుస్తక పఠనం అంటే పెద్దగా గిట్టేది కాదు. జనాల్నించి తప్పించుకోవడానికి పుస్తక పఠనం ఓ మిష. ముఖ్యంగా సినిమాలలో. అఫ్‌కోర్స్ రియల్ బుక్ రీడర్సు కూడా ఇక్కడున్నారు. అది వేరే విషయం. కిషన్ చందర్‌నీ, ఆర్. కె. నారాయణ్‌నీ, ప్రేమ్‌చంద్‌నీ, శరత్ నవలల్ని చదువమని నన్ను ప్రోత్సహించింది కూడా వసంత కుమారే. ‘అయిదుగురు లోఫర్లు’ నవల నా చేతికిచ్చిందీ ఆయనే. అంతకు ముందే ఆయనిచ్చిన విప్రదాసు, చరిత్ర హీన (శరత్) నవలలు చదివా. మనసు ఎక్కడికో వెళ్ళిపోయింది.

‘అయిదుగురు లోఫర్లు’ కథనమే అద్భుతంగా ఉంది. సొసైటీ మీద విసిరిన వ్యంగ్య బాణం అది. చార్లీ చాప్లిన్ సినిమాలో లాగా ఓ పక్క ఆలోచనా మరో పక్క కన్నీరూ ఒకేసారి అనుభూతిస్తాం.

“అబ్బా.. ఏంటమ్మాయ్.. నువ్వు పుస్తకాల పురుగువి అయ్యావు. పైకి రావాలంటే నీక్కావలసింది పుస్తకాలు కాదు. కాస్త ప్రొడ్యూసర్లనీ, కాస్త డైరెక్టర్లనీ అలరించావనుకో.. ఇండస్ట్రీలో నీకు ఢోకా ఉండదు” అతి చనువు చూపిస్తూ అన్నది చిత్రాణి.

“ఈ సినిమా వరకూ సరిగ్గా చేస్తే చాలు ఆంటీ! ఇక ఫ్యూచర్ సంగతి అంటారా. దాని గురించి నాకు దిగుల్లేదు” చిన్నగా నవ్వి అన్నాను.

“ఆ మాటా నిజమేలే. ఎంత మందిని అలరించినా నేను బావుకున్నది ఏమిటీ? ఏ వేషమైనా ఒరిగేది ఏముందీ! తల్లి వేషాలు వేసినా తలరాత మారదు కదా. ఆ కుర్ర హీరో ఫలానా కుమార్ గాడు పరమ రోగ్. వాడికి తల్లిగా వేషం వెయ్యమంటే చాలా సంతోష పడ్డాను. ఓ సీన్లో నన్ను పట్టుకుని ‘అమ్మా అమ్మా’ అని ఏడవాలి. వెధవ.. అమ్మా అమ్మా అంటూనే అక్కడా ఇక్కడా అని లేకుండా నలిపి పారేశాడనుకో! ఏమైనా, నీ తీరే వేరు” అంటూ ఓ కుర్చీ వేయించుకుని నా పక్కన భైఠాయించింది. నా అదృష్టం ఏమంటే “షాట్ రెడీ” అని అసిస్టెంటు వచ్చి నాకు చెప్పడం.

***

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే స్త్రీ కి శతృవు స్త్రీయే. అమ్మ వేషాలు వేసే చిత్రాణి, యీ సినిమాలో నాకు మదర్. బహుశా ఆవిడ పూర్వ జన్మలో మహా తిరుగుబోతైన మగవాడిగా జీవితం చాలించి వుండాలి. ఏదో రహస్యం చెప్పాలన్నట్టు పక్కకొచ్చి కూచుని వెయ్యకూడని చోట చేతులు వేసేది. నేను చిరాగా నెట్టేస్తే, “నువ్వు లేడీవే నేనూ లేడీనే, చికాకెందుకూ?” అని వెధవ నవ్వు నవ్వేది. ఆవిడ మాట్లాడే బూతులు ఎంత నేలబారు మగవాడూ మాట్లాడటానికి సాహసించడు సరికదా, సిగ్గు పడతాడు.

ఓ రోజు టచప్ వుమన్ కనకాక్షి కునుకు తీన్తూటే చిత్రాణి ఆమెని లేపి “ఎవడే నిన్ను ఇంతలా నలిపేసిందీ?” అంటూ ఎకసెక్కాలాండిది. పాపం కనక అమాయకంగా “రాత్రి తెల్లార్లు అమ్మ దగ్గుతూనే ఉందమ్మా. తెల్లార్లూ నేను మెలుకునే ఉన్నాను” అని నిట్టూర్చింది.

“కాదులే.. ఇది నిద్రపట్టని యవారం కాదు. ఈ కునుకు ‘చిత్తడి’ కునుకు” అని పకపకా నవ్వింది. నూటికి ఎనభై వంతుల రూమర్లు స్ప్రెడ్ చేసేది ఇటువంటి ఘటాలే.

ఇక మా కథా రచయిత ఓ చిత్రమైనవాడు. అన్నం తినేప్పుడు తప్ప సర్వకాల సర్వావస్థల్లోనూ చేతిలో ట్రిబుల్ ఫైవ్ సిగరెట్టు వెలుగుతూనే ఉండాలి. పది నిముషాల సీన్‌కి పది గంటల సొల్లు చెబుతాడు. కానీ ఫైనల్‌గా మంచి రిజల్టే ఇస్తాడు. కానీ, సొల్లుని భరించడం ఎవరి తరం. వింటే తల నెప్పి. వినకపోతే ‘పాత్ర’ని కుదించేస్తాడన్న భయం. ఎప్పుడు మాట్లాడినా ఆయన స్టృష్టించిన ‘గత’ సినిమాల పాత్రల గురించీ అవి వేసిన నటీనటులు కురిపించిన పొగడ్తల గురించే. ఒక్కోసారి విని వినీ పిచ్చెక్కేది.

మేకప్‌మన్ చూపు గద్ద చూపు. గుంటనక్క, గద్ద కలిసి కాపరం చేస్తే పుట్టిన సంతానం లాంటి వాడు. కొలతలు చూపుల్తో తీసి తీసి రాటు తేలిపోయన రకం. ఇక మా కాస్యూమర్ కొలతలు తీసేటప్పుడల్లా ఎవరు బ్రెస్ట్ పాడ్స్‌ని వాడతారో, ఎవరు ‘సీట్’ పాడ్స్ వాడుతారో, ఎవరి రంగు ఎక్కడ ఎలా ఉంటుందో వాగుతూనే ఉండేవాడు. వింటున్నట్లు నవ్వుతూ నటించాలి.

అతి తక్కువ బడ్జట్‌లో ఓ సినిమా తీస్తానని డైరెక్టర్ ఓ సినిమా ఫంక్షన్‌లో ఛాలెంజ్ చేస్తాడు. అలా తీయగా మిగిలే కోటి రూపాయలు గిఫ్ట్ ఇస్తానని ఓ ప్రొడ్యూసర్ అందరి ముందరా ఎనౌన్స్ చేస్తాడు. ఇదీ కథ. అసలా డైరెక్టరు అతి తక్కువ బడ్జట్‌తో సినిమా తీశాడా? ఎలా తియ్యగలిగాడు? అన్నమాట ప్రకారం మాట ఇచ్చిన ఆ ప్రొడ్యూసర్ కోటి ఇచ్చాడా? అసలా సినిమా తీయడంలో ఎన్ని ఇబ్బందులకి డైరెక్టర్ గురయ్యాడు ఎట్సెట్రాని సినిమా స్టోరీగా సత్యమోహన్ గారే రాసుకున్నారు.

ఇందాక సత్యమోహన్ గారు తీసిన రెండు సన్నివేశాలు ఆ సినిమాలోవే. చాలామంది యీ సినిమాకి అటంకాలు కల్పిస్తుంటారు. అవన్నీ దాటుకుంటూ సినిమా తియ్యడమే పందెం. సినిమాలో ‘ధీర’ ఓ మధ్య తరగతి అమ్మాయి, నిశ్చల్ నిగమ్ ఓ సినీ నటుడు (శ్రవణ్ కూడా). ధీరని హీరోయిన్‌గా దర్శకుడు సెలెక్టు చేస్తాడు. ఆ సందర్భంలో హీరో హీరోయిన్లు పలికే డైలాగ్‌లు అవి.

సడన్‌గా మూడో రోజున సత్యమోహన్ గారు వసంత కుమార్‌తో, “వసంత్.. మన సినిమాలో ఛాలెంజ్ చేసిన డైరెక్టర్ వేషం నువ్వే వేయ్యాలి. కోటి ఇస్తానన్న ప్రొడ్యూసర్ వేషం సదాశివరావు గారు వేస్తారు. రేపే ఆ సీన్ షూటింగ్” అన్నారు. వసంత్ అవాక్కయ్యాడు.

“సార్” అన్నాడు ఓ నిముషం తరువాత.

“యస్.. నువ్వే చేస్తున్నావు. డైరెక్షన్ నీకు కొట్టిన పిండే కనుక ఏ మాత్రం టెన్షన్ పడక్కర లేదు. సదాశివరావుగారు చాలా సీనియర్. ప్రొడ్యూసర్ పాత్రకి ఆయన అనుభవం వన్నె తెస్తుంది.” చిన్నగా నవ్వి అన్నారు సత్యమోహన్.

“అంత సడన్‌గా నిర్ణయం ఎలా తీసుకున్నారు సార్?” ఆశ్చర్యంగా అన్నాడు రైటర్ కమలాక్ష. అది అతని సినిమా పేరు.

“నిజం చెబితే మీ కథే నాకు విచిత్రంగా ఉంది. సినిమాలో సినిమా.. అదీ కొందరు సినిమా వాళ్ళతో” నవ్వి అన్నది చిత్రాణి.

“విచిత్రంగా ఉండొచ్చు. కానీ చిత్రా, అసలు ఈ సినిమానే అతి తక్కువ బడ్జెట్‌తో ఎందుకు తియ్యకూడదు?” నవ్వారు సత్యమోహన్.

“ఏం బ్రెయినండీ మీది! సినిమాకి పని చేసే టెక్నీషియన్సే వేషాలు వేస్తారు. అంటే సింగిల్ పేమెంట్‌తో డబుల్ వర్క్ అన్నమాట” గట్టిగా నవ్వి చప్పట్లు కొట్టారు కమలాక్ష.

“ఏదన్నా అనుకోండి. ఒక్కమాట మాత్రం నిజం. అసలు ఎక్కడెక్కడ మనం ఖర్చు తగ్గించవచ్చో అది ఘాటింగ్ అయిపోయాక ప్రతి రోజూ డిస్కస్ చేద్దాం. మరొకటి ఏమంటే, పిక్చర్ హిట్ అయితే, అందరికీ ఆర్థికంగా కూడా లాభం కలిగేలా నేను చూస్తానని ప్రామిస్ చేస్తున్నా” కుర్చీలోంచి లేస్తూ అన్నారు సత్యమోహన్.

***

ఆ రోజు ఘాటింగ్ అయ్యాక యూనిట్ మీటింగ్ జరిగింది.

సదాశివరావు గారు మొదటి వక్త.

“అయ్యా.. ఒక సీనియర్‌గా నాకు చాలా చాలా భావాలు ఉన్నాయి. తరాలు గడుస్తున్నా సినిమాల తీరు మాత్రం మారడం లేదు. హీరో హీరోయిన్లకి ఇచ్చే రెమ్యూనరేషనో, గౌరవమో ఇతర నటీమణులుకు ఇవ్వడం లేదు. ఒక్కోసారి పాత సినిమాల్ని గుర్తుకు తెచ్చుకోండి. NTR, ANR లకు ఎంత ప్రాముఖ్యతనిచ్చేవారో SVR, రేలంగి, రమణారెడ్డి, కస్తూరి శివరావు, రాజబాబు లకి కూడా అంతే ప్రాముఖ్యత నిచ్చారు. అంతే కాదు ఓ. ఆర్. నాగేశ్వరావు, ఓ రాజనాల, జగ్గయ్య, అంతెందుకు గుమ్మడి గార్లు కూడా వారి నటనాపటిమతో ఓ వెలుగు వెలిగి యీ నాటికీ చెదరని ముద్ర వేశారు. ప్రేక్షకుల హృదయాల్లో సావిత్రి, దేవిక, బి. సరోజ, కాంచన, లక్ష్మీ, జమున వంటి హీరోయిన్లే గాక కన్నాంబ, సూర్యకాంతం, రమాప్రభ, గిరిజ వంటి వారికి కూడా ఆనాడు అదే ప్రాధాన్యత నిచ్చేవారు. అందుకే ఆ సినిమాలు యీనాటికీ మనకి గుర్తుండిపోయాయి. ఈనాడు హీరోని తప్ప ఇతర పాత్రల్ని పట్టించుకుంటున్న దర్శకులు ఎంతమంది?” ఆగారు సదాశివరావుగారు.

“మీరన్నది అక్షర సత్యం. ఇవ్వాళ పరిశ్రమ మొత్తం హీరోల మీదే ఆధారపడి వుంది. అసలు ప్రొడ్యూసర్‌కే విలువ లేకపోతే, సినిమా ఫ్యూచర్ ఏమిటి? కథలన్నీ హీరో చుట్టూ తిరగడంతో జనాలకి విసుగు పుట్టి ఇతర వినోద కార్యక్రమాలపై దృష్టి నిలుపుతున్నారు” అన్నాడు కమలాక్ష.

“కమల్ జీ.. మీరు కూడా మాట్లాడాలి.. అదీ కూలంకషంగా, సదాశివరావుగారు మీరు మీ ప్రసంగం కొనసాగించండి” అన్నారు సత్యమోహన్.

“అలాగే, అయ్యా. ‘సినిమా’ అనేది సమతుల్యంగా వుండాలిగానీ, ఏక పక్షంగా వుండకూడదు. పక్కన సరైన నటుడు పోటీగా వుంటేనే హీరో పాత్ర కూడా ఎలివేట్ అవుతుంది. రావణుడు అత్యంత శక్తిమంతుడు. జానకిరాముడు జన్మించాల్సి వచ్చింది. అలాగే ప్రతినాయకుడు బలవంతుడూ శక్తివంతుడూ అయినప్పుడే హీరో గొప్ప తెలుస్తుంది. ప్రతి పాత్రనీ తీర్చిదిద్దినప్పుడే సినిమా అద్భుతంగా వస్తుంది గానీ, అయిదు పనికిమాలిన పైట్లు, ఆరువందల మంది డాన్సర్లనీ పెడితే కాదు. కనుక నా సలహా ఏమంటే, 1. డాన్సర్ల సంఖ్యను అతి పరిమితం చేయ్యండి. ఈనాటికీ నంబర్ వన్ అయిన మిస్సమ్మ సినిమాలో ఎందరు డాన్సర్లు ఉన్నారూ? అవసరం వున్నప్పుడు OK. లేనప్పుడు బస్సుల్లో జనాల్ని కుక్కినట్లు వెండి తెరని డాన్సర్లతో ఎందుకు నింపాలి? అలాగే ఫైటర్లు. ఒక హీరో వందమందిని ఒంటి చేత్తో విరగదంతాడు. ఇది సాధ్యమా? అలాగే మరో ఒక్కతన్ని తన్నితే ఫైటర్ పది అడుగుల ఎత్తుకి ఎగిరి వందగజాల దూరంలో పడతాడా? ఇంతకన్నా హాస్యాస్పదమైనది మరేదైనా ఉందా?” మళ్ళీ ఆగారు సదాశివరావుగారు.

“మీరన్నది నూటికి నూరుపాళ్ళు నిజం” అన్నాడు శ్రవణ్.

“అంతే కాదు, ఫైట్లు కోసం మాల్స్‌నీ, వెజిటెబుల్ మార్కెట్స్‌నీ, మటన్ మార్కెట్లనీ సెలెక్టు చేస్తాం. ఒక టమోటో మన చేతికి రావాలంటే మూడు నెలల పాటు రైతు చేమటోడ్చాలి. ప్రకృతి కరుణించాలి. తుఫానులు వరదలూ రాకుండా వుండాలి. అలాగే ఇతర కూరగాయలు కూడా. ఫైటర్లతోనూ హీరోతోనూ జనాలు తినే కూరగాయల్ని నుజ్జు నుజ్జు చేయ్యడం ఎంత వరకూ సబబూ? ఏం ఏ మైదానంలోనో, చెరువులోనో బురదలోనో కొట్టుకోవచ్చుగా! అదీ అవసరమైన ఫైట్లతో! ఫైట్ అనేది ముఖ్యంగా మారిందిప్పుడు. దానికి తోడు ఫైట్ మాస్టర్లు, ఫైట్ కంపోజర్లు. ఒకేసారి వంద సుమోలు గాల్లో ఎగురుతాయి. హీరో చిటికేస్తే వంద మైళ్ళ స్పీడుతో వెళ్ళే ట్రైను క్షణాల్లో ఆగిపోతుంది. ఇలాంటి చెత్త అంతా సినిమాకి అవసరమా? బ్రూస్ లీ, జాకీచాన్‌ల వంటి కరాటే, కుంగ్‌ఫూ యోధులు అద్భుతమైన సినిమాలు తీస్తున్నారు. సినిమా అంతా ఫైట్లమయమైనా అన్ని సన్నివేశాలకీ సూత్రంగా చక్కని సెంటిమెంట్ కథ ఉంటుంది. అయ్యా ఫైట్లనీ, అనవసరపు డాన్సులనీ మనం తగ్గిస్తే చాలా సమయమూ డబ్బూ కూడా ఆదా అవుతాయి” స్పష్టంగా తన అభిప్రాయం చెప్పి కూర్చున్నారు సదాశివరావుగారు.

“డైరెక్షన్ విషయంలో మీ సలహాలు?” అడిగారు సత్యమోహన్.

“అయ్యా, నేను ఎప్రెంటీస్‌గా వచ్చినప్పుడు స్క్రిప్ట్ బౌండ్ బుక్‌లో వచ్చేది. 24 గంటల ముందే ఎవరి పోర్షన్స్ వారికి ఇచ్చి డైలాగ్స్‌ని బాగా గుర్తుండేలా చదువుకోమనే వాళ్ళం. షాట్‌కి ముందు చక్కగా ప్రాక్టీస్ చేయించడంతో చాలా సీన్‌లు ఫస్ట్ షాట్ లోనే ok అయిపోయేవి. అలాగే, రోజు మొత్తానికి ప్లాన్ చేసిన సీన్లల్లోఎందరు నటీనటులు వుంటారో వారికి టైం ముందరే ఇచ్చేవాళ్ళం. ఘాటింగ్స్‌లో బయటి వాళ్ళకి నో ఎంట్రీ. అందువలన అన్నీ పర్‌ఫెక్ట్‌గా టైం ప్రకారం జరిగిపోయేవి. ఇప్పటి పరిస్థితి వేరు. హీరోల స్నేహితులు, హీరోల ఇతర ప్రొడ్యూసర్లతో గంటలు గంటలు సాగతీత జరుగుతోంది. టైం ని పాటించే నాథుడే లేడు. ఇక ప్రొడక్షన్ వాళ్ళకి టిఫిన్లు, ప్రత్యేక భోజనాలు సప్లై చేయడంతో తల ప్రాణం తోకకి వస్తోంది. ముఖ్యంగా ఆదా చెయ్యవలసినది సమయం.” గాలి పీల్చుకున్నారు సదాశివరావు గారు. తల పంకించాడు వసంతకుమార్.

“నా ఉద్దేశ్యంలో స్క్రిప్టుని అత్యవసరమూ, ప్రయోజనకరమూ అయితే తప్ప స్పాట్ ఛేంజస్ చెయ్యకూడదు. దాని వల్ల కథనంలో జర్క్‌లు వస్తాయి.” తనూ పాలు పంచుకున్నాడు డైలాగ్ రైటర్ ఆదివిష్ణు. అతను చాలా మితభాషి.

“అసలు స్క్రిప్టు అనేది ఎక్కుండుందీ? సెట్స్ లోనే డైలాగులు రాసీ/రాసుకునే కాలం దాపురించింది. ఒక సీనుకీ మరో సీనుకీ లింక్ వుండదు సరికదా, భాషే మారిపోతుంది” ముఖం చిట్లించి అన్నది చిత్రాణి.

“ఆ మాటా నిజమే. ‘ఫలానా’ సినిమా డైలాగ్స్ సెట్స్ మీదే రాసుకున్నారు. ఓ రోజు రైటర్ బదులు రైటర్ గారి అసిస్టెంట్ డైలాగ్ పేపర్లు తెచ్చాడు. స్పాట్ ఛేంజస్‌ని డైరెక్టరు చెబితే ఆయనే మార్చి రాశాడు. చిత్రం ఏమంటే, అంతకి ముందున్న డైలాగ్ గోదావరి భాషలో వుంటే ఈయన తెలంగాణా యాసలో రాశాడు. ఎడిటర్ పాతిక సార్లు తలకొట్టుకోవలసి వచ్చింది” అన్నాడు కమలాక్ష.

“OK.. OK.. ఇవాల్టికి యీ మీటింగ్ చాలిద్దాం. నా రిక్వెస్టు ఏమిటంటే, మనం ఏమేమి వేస్టు అని చర్చించుకుంటున్నామో, ఆ ‘వేస్టు’ మన సినిమాలో జరగకూడదు. ముఖ్యంగా సమయం వేస్టు కాకూడదు. అఫ్‌కోర్స్ ఇవాల్టి నించే నటీనటులకు డైలాగ్స్ ముందుగా ఇవ్వబడతాయి. సరేనా..” లేచి నిలబడ్డాడు సత్యమోహన్.

మాంఛి టీ తో సమావేశం ముగించి అందరం గదుల్లోకి చేరుకున్నాం.

నాకిచ్చిన హోటల్ పేరు హోటల్ తమన్నా. అది స్టార్ హోటల్ కాదు గానీ, చాలా కంఫర్టబుల్ హోటల్. ఆ హోటల్‌లో ఆరు రూమ్స్ మా కంపెనీనే బుక్ చేసింది. నాకూ, నిశ్చల్‍కీ విడి విడి రూమ్స్ ఇచ్చారు. మిగతా నాలుగింట్లో రెండు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు, ఒక దాన్లో చిత్రాంగి, సర్రీ, మరో దాన్లో ముగ్గురు ఇతర కారక్టర్ ఆర్టిస్టులూ ఉన్నారు. బ్రేక్‌ఫాస్టు కంపెనీ వారే రూమ్‌కి పంపుతారు. లంచ్ ఘాటింగ్ లోదే. డిన్నర్ మాత్రం హోటల్లో, ఆర్డర్ చేసే దాన్ని. ఒక్కోసారి అందరమూ ‘పికాసో’ అంటే హోటల్ రెస్టారెంట్ లోనే కూర్చుని డిన్నర్ చేసే వాళ్ళం. చర్చలు జరుగిన రోజున వసంత్, నిశ్చల్, శ్రవణ్, సదాశివరావుగారూ అందరం పికాసాలోనే కూర్చుని కబుర్లాడుకుంటూ భోజనం చేశాం. సదాశివరావుగారు మూడు దశాబ్దాల క్రితం సినిమా మేకింగ్ గురించి చెబుతుంటే మాకు టైమ్ తెలియలేదు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here