[ప్రసిద్ధ రచయిత వేదాంతం శ్రీపతిశర్మ గారి ‘పూచే పూల లోన’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]
[తన రిసార్టులో కూర్చుని జరిగిన అవమానానికి బాధపడుతుంటాడు కోపల్. ఫోన్ చెయ్యమని మేనేజర్‍కి కోపంగా చెప్తాడు. మేనేజర్ మళ్ళీ ఫోన్ చేయడానికి లోపలికి వెళ్తాడు. అక్కడున్న పూలని చూసి, అవి ఇక్కడెందుకు ఉన్నాయని అరుస్తాడు. బావుంటాయని, మేనేజర్ తెచ్చి అక్కడ పెట్టారని కుర్రాడు చెప్తాడు. అవి తన ఇంట్లో ఉండాలని, ఇక్కడ కాదని అంటాడు కోపల్. మేనేజర్ వచ్చి, ఎవరికైతే కోపల్ ఫోన్ చేయమన్నాడో, ఆయన ఇంటి నుంచి బయల్దేరారని చెప్తాడు. కాగితాలు సిద్ధమయ్యాయా అని కోపల్ అడిగితే అయ్యాయని జవాబిచ్చి, ఆ ఫైల్‌ని టీపాయ్ మీద పెడతాడు మేనేజర్. ఆ పూలని చూపించి, వాటిని ఇంటికి పంపించమంటాడు కోపల్. కాసేపయ్యాకా, జీపు శబ్దం అవుతుంది. ఆ వచ్చినది ఎస్.పి. పులస్కర్. ఆయన యూనిఫార్మ్‌లోనే ఉంటాడు. జరిగినదానికి బాధపడుతున్నానని చెప్తాడు ఎస్.పి. దాడి గురించి నీకు తెలీదా అని కోపల్ అడిగితే, రాణోలతో తనకి మంచి సంబంధాలున్నంత మాత్రానా ప్రతి దాడీ తనకి తెలిసి జరుగుతుందని అనుకోవద్దని అంటాడు పులస్కర్. నువ్వేం చేయలేవన్న మాట అని కోపల్ అంటే, చెయ్యటానికి ఆర్డర్స్ ఉండవు, మీకు సమాచారం మాత్రం చెప్పగలం అంటాడు పులస్కర్. టీపాయ్ మీద ఉన్న ఫైల్‍ని పులస్కర్‍కి ఇచ్చి చదవమంటాడు కోపల్. అందులోని విషయం చదివిన పులస్కర్ ఆశ్చర్యపోతాడు. అందులో ఉన్న ప్రకారం నడుచుకుని మెడల్ తెచ్చుకోమని అంటాడు కోపల్. ఆరువందల మంది కూలీలను చాకిరి నుండి విముక్తులను చేస్తున్నట్లు రాసి ఉంటుందా ఫైల్‍లో. పాత తేదీతో నోటీసుని నేను తయారు చేసుకోవాలి, అంతేగా అని అడుగుతాడు పులస్కర్. అవునంటాడు కోపల్. మరి మీకు కూలీలెలా అని పులస్కర్ అడిగితే, రెట్టింపు జీతానికి కార్వార్ నుంచి రప్పించుకుంటానని అంటాడు కోపల్. తనకి తగిలిన దెబ్బకు కోపల్ ప్రతీకారం తీర్చుకోనున్నాడని పులస్కర్‍కి అర్థమవుతుంది. అసలు రాణోలు కోపల్ ఇంటి మీద దాడి చేయడానికి కారణం – కోపల్ కొడుకు సమీరేనని ఎస్.పి. చెప్తాడు. కారులో సుందర్‍ని తీసుకుని వెళ్తుంటాడు సమీర్. మాట్లాడుకుంటూ డ్రైవ్ చేస్తూండగా, హఠాత్తుగా ఓ చోట యు-టర్న్ చేసి కారుని పక్కకి ఆపుతాడు. వాళ్ళని ఓ టాటా సుమో ఫాలో అవుతుండటం గమనిస్తాడు. ఇక చదవండి.]
[dropcap]“మ[/dropcap]నలను వెంబడించే వారైతే అలా ఆ సుమో బండి కూడా ఎందుకు ఆగుతుంది?” అనడిగాను.
“నిజమే. అందుకే కారులోంచి దిగటం లేదు. వాళ్లు ఏం చేస్తారో చూసి అప్పుడు ముందుకు వెళదాం.”
“సినిమాల్లో కారు ఛేసులు చాలా చూసాము.”
“నేనూ చూసాను.”
“అలవాటుందా?”
“అక్కడలా జరుగదు. ఇదోగో ఈ చెట్లు, పుట్టలు, ఆకాశం వంటివి పరుగులు తీస్తాయి..” అంటూనే మాట్లాడవద్దని తన పెదాల మీద వేలు పెట్టాడు. రియర్ మిర్రర్‌లో ఓ పొడుగాటి వ్యక్తి మా వైపు అడుగులు వేస్తూ వస్తున్నట్లు కనిపించాడు. పాంటు, షర్టు వ్యవహారం చూస్తే ఈ ప్రాంతం వాడిలాగానే ఉన్నాడు. సమీర్ తన సీటు బెల్టు తీసేసి నా సీటు ముందరున్న డెక్ తెరిచాడు. నాకు కనబడని గన్ను అతని చేతికి ఇట్టే తగిలింది. క్షణంలో తీసి డెక్కును మూసేసి గన్నును సిద్ధం చేసుకున్నాడు. నన్ను కొద్దిగా క్రిందికి జారమన్నాడు. కొత్తగా అనిపించింది. అలా సద్దుకుంటేనే అతను దగ్గరగా వచ్చే వేళకి కారును కొద్దిగా పోనిచ్చాడు. అతను ఆగమంటూ అడుగులు తొందరగా వేస్తున్నాడు. అతని చేతిలో ఏదీ లేదని నిర్ధారించుకున్న తరువాత కారు ఆపాడు. అతను కారును సమీపించాడు. కిటికీ అద్దంలోంచి సమీర్‌ను చూస్తూ అద్దాన్ని ఆనుకుని చూపుడు వేలుతో కొడుతున్నాడు. అద్దాన్ని క్రిందకి దింపాడు సమీర్.
“మీరు సమీర్ కదూ?” అడిగాడు.
“మీరు” అడిగాడు సమీర్.
“ఫర్నాండిజ్.”
“అంటే?”
అతను ఆ సుమో వైపు సూపించాడు.
“టాటా సుమోలు బాగు చేస్తారా?”
అతను నవ్వాడు.
“మిమ్మల్ని కలవాలని చాలాసార్లు అనుకుంటున్నారు.”
“ఎవరు?”
అతను ఆ బండి వైపు తిరిగి సైగ చేసాడు. ముసలి వాళ్లు ఇద్దరు ఇవతలికి వచ్చారు. నేను గుర్తు పట్టాను. రిసార్ట్‌లో సమీర్‌కు ప్రక్కగా కూర్చుని ఏదో ప్రార్థనలు చేసిన ముసలి జంట ఇది. జాగ్రత్తగా రోడ్డు దాటి ఎంతో ఆనందం ప్రకటిస్తూ వచ్చారు. మా కారు వెనుక సీటు తలుపు తెరచి లోపలికి దూరి చక్కగా కూర్చున్నారు.
“స్టార్ట్” అన్నాడతను.
“ఎక్కడికి?” సమీర్ అడిగాడు.
“మన ఇంటికి.”
“అది ఎక్కడుంటుంది?”
“తప్పు.”
“ఏంటి తప్పు?”
“అలా మాట్లాడటం. నువ్వు మా మనుమడివి.”
“కాదు. కావలిస్తే మీ ఇంట్లో దించుతాను.”
“నువ్వు అన్నీ మరచిపోయావు. ఎన్నో ప్రార్థనలు చేసాక ఇక్కడ దొరికావు.”
సమీర్ ఆలోచించాడు. నన్ను ఓ చూపు చూసాడు. ఫర్నాండిజ్ ఎప్పుడో రోడ్డు దాటేసి వెళ్లిపోయాడు.
“నన్ను ఎందుకు వెంబడిస్తున్నారు?”
“ఈ వయసులో మాకు వేరే దారి లేదు. మాకు ఓపిక కూడా లేదు సమీర్.”
“అతనెవరు?”
“స్టెల్లాకి కజిన్. మేనమామ కొడుకు.”
“స్టెల్లా ఎవరు?”
అతను సుమోలోంచి చెయ్యి చూపించి వెళ్లిపోయాడు.
వృద్ధులిద్దరూ ఒకళ్ల మొహాలొకళ్లు చూసుకున్నారు.
“దేవుని కోసం సమీర్.. స్టెల్లాకు అన్యాయం చెయ్యకు. పద! ఇంటికి పోదాం.”
నేను వాళ్ల వైపు తిరిగాను.
“నా పేరు సుందర్” చెప్పాను.
“హలో సుందర్” ఏక కంఠంతో పలికారు.
“మీరెవరు?”
“నేను సెబాస్టియో..” అతను అన్నాడు.
“నేను అనా.. మిసెస్ సెబస్టియో.”
“మీరేం చేస్తూ ఉంటారు?”
“మాకు కాష్యూనట్ తోటలున్నాయి. ప్రశాంతమైన జీవితం మాది. టైం బాగుండక సమీర్ అన్నీ మరచిపోయాడు.”
“సమీర్ క్రైస్తవుడు కాదు. మీకు తెలుసు.”
“అవును. కానీ మాకు మనుమడు. ఇంటికి పదండి. అన్నీ చెబుతాను.”
సమీర్ దిక్కులు చూసాడు. చిత్రంగా నవ్వాడు. నన్ను ఓ చూపు చూసి కారు ముందుకు పోనిచ్చాడు.
“ఆ ఇల్లు తెలుసా?” అడిగాడు.
“వీళ్లు దారి చూపుతారు.”
వీళ్లు అప్పటికే ప్రార్థనలు మొదలు పెట్టారు.
“ఎయిర్‌పోర్ట్‌కు మడ్‌గాంవ్ నుంచి వెళ్లే అడ్డదారిలోకి పోనీయమనండి. ఆ చర్చ్‌ను దాటితే చాలు, అన్నీ గుర్తుకొస్తాయి.”
కారు అలా ముందుకు దూకుతోంది. సమీర్ ఏం చేస్తున్నాడో అర్థం కావటంలేదు.
“సమీర్..” అడిగాను.. “..వీళ్లతో వీళ్ల ఇంటికి వెళ్లటం సబబా?”
“ఎందుకో మీతో ఉన్నాను కాబట్టి ఈ పని చెయ్యాలనే అనిపిస్తోంది”
“ఎందుకని?”
“ఇక్కడికి వచ్చినప్పటి నుంచే వీళ్ల తలనొప్పి ఎక్కువగా ఉంది.”
“అక్కడికి వెళితే ఇంకా ఎక్కువ కావచ్చు.. ఆలోచించండి.”
“సుందర్ గారూ, ప్రతి ఆదివారం వీళ్లు వచ్చి ఆ రిసార్ట్స్ వాళ్లకి ఏం చెబుతారో తెలియదు. రాత్రి వేళ ఆ విన్యాసం చూసి వెళ్లిపోతారు. ఈసారి ఇలా తగులుకున్నారు.”
వెనక్కి తిరిగాను.
“మీ ప్రార్ధనలు ఫలించాయా?” అడిగాను వాళ్ల భాషలో.
“సమీర్ దొరికాడు. ప్రభువు ఇంటికి వచ్చేలా చేసాడు. ఫలించినట్లే కదా?”
“ఇలా ఎవరి కోసమైనా ప్రార్థిస్తారా?”
“లేదు. మాకు చాలా పనులున్నాయి.. సమీర్, దారి మరిచిపోలేదు. ఆ పైన యూ టర్న్ తీస్కో.”
ఒక విషయం అర్థం కాలేదు. సమీర్ మటుకు ఎన్నో సార్లు ఈ దారిలో ప్రయాణించినట్లు కారు నడుపుతున్నాడు. ఆ మాటకొస్తే ఇతని డ్రైవింగ్ ఎప్పుడూ అంతే. ఏదో ఓ చోటకి వెళుతున్నట్లు తీసుకునిపోతాడు. చివరికి ఎక్కడికో అతనికే తెలియాలి!
“జీడిప్పపు తింటారా?” అడిగాడు.
“ఓ”
“ఇక్కడి జీడిప్పపు విశేషమైనది.”
“ఫేనీ గురించి విన్నాను.”
“అది అలా ఉంచండి. నేను స్వయంగా ఆరు రకాల జీడిపప్పు చూసాను. అందులో ఒకటి ప్రత్యేకంగా నేను డ్రింక్‌తో తీసుకుంటాను.”
“ఆ వెరైటీ అని నాకో తెలియదు కానీ అది విపరీతంగా తింటున్నప్పుడు గమనించాను.”
“320 వెరైటీ ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినది. ఇది లేని చోట నేను టేబుల్ దగ్గర కూర్చోను.”
“ఏంటి అంత స్పెషాలిటీ?”
“మీలాగ?”
“అదేంటి?”
“మన వెనుక నన్ను మనమడు అని నిర్ధారించి పళ్లికిలిస్తూ కూర్చున్నారు ఇద్దరు. చేతిలో గన్ను లేక పోయినా మెడ పట్టుకుని ఇంటికి తీసుకుని పోతున్నారు.”
“ఓ అమ్మాయి ఎదురు చూస్తోందంటున్నారు.”
“కామెడిగా లేదూ?”
“ఉంది మరి?”
“మీరు పిచ్చి స్పీడులో వెళ్లిపోతున్నారు. ఇది కామెడీగా ఉంది!”
“కాదు. దీన్ని వదిలేసి జీడిపప్పు గురించి మాట్లాడుకుంటున్నాం. ఏమంటారు?”
“దేవుడున్నాడు, విపరీతమైన కామెడీ చేస్తున్నాడు, ఆయనకది చాలా ఇష్టం అన్నది స్పష్టమైనదని అంటూ.”
ఏమర్థమైందో గానీ ఆ ముసలాయన నవ్వుతున్నాడు. నాకు కేటాయించిన డ్రైవరు ఈయన అసలు మనుమడై ఉంటాడు. అచ్చం ఇలాగే నవ్వేవాడు.
“కరెక్ట్. అందుకే ఆ జీడిప్పును మీతో పోల్చాను.”
“అర్థం కాలేదు.”
“ఏం లేదండీ. ఆ వెరైటీ – వేయించిన దాన్ని ఓ గుప్పెడు తీసుకుని నోట్లో పెట్టుకుని నమిలేసి ఓ బీరు బాటిల్ క్రింద పెట్టుకుని ఖాళీ చేసినప్పుడు మీ చుట్టూతా గోవా కనీసం ఆరు ప్రదక్షణలు చేస్తున్నట్లు కనిపస్తుంది!”
“ఓ అదా కథా? ఆ సమయంలో వీళ్లిద్దరూ మీ ప్రక్కన కూర్చుని ప్రార్థనలు చేసారన్న మాట!”
విరగబడి నవ్వాడు.
“కావచ్చు. వాళ్ల ఐటమే జీడిప్పు.”
కారు నడుపుతూనే ఓ చిన్న బాటిల్ తీసి రెండు గుటకలు మింగాడు సమీర్.
“సార్..” మెల్లగా అన్నాడు..
“జీవితం, జీవితకాలం, జన్మ, పునర్జన్మ, అంతా ట్రాష్!”
“కరెక్ట్..”
“అయ్, మీరు తాగరు. ఐనా ఒప్పుకుంటున్నారు. పొన్లెండి. దిక్కుమాలిన సమస్యలన్నీ బాధలన్నీ ఇదిగో ఈ మందులాంటివి. జీడిపప్పు లాంటి మేధశక్తిని నోట్లో పెట్టి మథించి సమస్యను మ్రింగేయాలి! కిక్కు వస్తుంది. సమస్యలు అనుకోని అతిథులు. దేవుళ్లు కాదు! దెయ్యాలు కాదు. ఉంటారు. కనపడరు. ప్రత్యేక్షమవుతూ ఉంటారు. మనం పట్టించుకున్నా అలా కనపడకూడదు. ఏంటి?”
నేనేమీ మాట్లాడలేదు. ఈ మనిషి తీరే అంత. ఈ వృద్ధ జంట వ్యవహారం కూడా చూద్దామనిపించింది ఎందుకో. బాటిల్ ఖళీ చేసేసాడు సమీర్.
“స్టెల్లా..” అన్నాడు.
వెనుక ఉన్న ముసలి వాళ్లు నిటారుగా కూర్చున్నారు. గట్టిగా నవ్వాడు సమీర్.
“సార్, స్టెల్లాట! అమ్మాయి.. నా కోసం ఎదురు చూస్తోందంట! ఓ చూపు మనమూ చూద్దాం..!”
“మీరు.. నేను కాదు!”
“ఓ. అదీ చూద్దాం!”
(ఇంకా ఉంది)