యువభారతి వారి ‘వ్యాస సాహితీ సంహిత’ – పరిచయం

0
3

[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే విజయదశమి వరకూ సాగుతుంది.]

వ్యాస సాహితీ సంహిత

[dropcap]భా[/dropcap]రతీయుల కవితా ప్రతిభకు సంకేతం వాల్మీకి రామాయణం. భారతీయుల బహుముఖీన విజ్ఞాన సంపదకు సంకేతం వ్యాస మహర్షి రచించిన పురాణేతిహాసాలు. వాల్మీకిని, వ్యాసుణ్ణి అధ్యయనం చేయనివాడు భారతాత్మను దర్శించలేదు. పుట్టినది మొదలు గిట్టు వరకు భారతీయుల బ్రతుకులను, ఆలోచనలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో నేటికీ ఈ మహామనీషుల సందేశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఎన్ని కథలకు, ఎన్ని నాటకాలకు, ఎన్ని జాతీయాలకు, ఎన్ని పదబంధాలకు, ఎన్నెన్ని న్యాయాలకు, ఎన్నెన్ని శబ్దాలకు, ఎన్నెన్ని సంకేతాలకూ పురుడు బోసినవీ మహితాత్ముల రచనా సామర్థ్యాలు !!

వ్యాస సాహిత్యం భారతీయ జీవితాన్నీ, సాహిత్యాన్నీ విస్తృతంగా ఆవరించింది. గీతావాక్యం చోటుచేసుకోని జీవిత సంఘటనం ఉండదు; భారత కథను ఉదాహరించని జీవన విన్యాసం ఉండదు; గోవిందనామ స్మరణం చేయని సత్సంగం ఉండదు; భాగవతార్థ స్పర్శ లేని ఆధ్యాత్మిక చింతనం ఉండదు; పురాణార్థ ప్రసక్తి లేని జీవిత వ్యవస్థ ఉండదు; బ్రహ్మసూత్రార్థ ప్రపంచనం లేని ఉపనిషద్వాక్య విన్యాసం ఉండదు; వేదాంత చర్చ ఉండదు. చతుర్వేద మంత్రాలు లేని భారతీయ కర్మ ప్రవృత్తి ఉండదు. కర్మ, భక్తి, జ్ఞాన ప్రవృత్తులన్నీ వ్యాస సాహితి లో ఉపజీవించేవే. వ్యాస సాహితి – కావ్యలతలకు కల్పకోద్యానం, జీవన తరంగిణులకు హిమవన్నగ శృంగం; జాతి సంస్కృతికి జీవగర్ర.

పురాణాలలో లేనిది ఎక్కడా లేదు. అంతటా ఉన్నది పురాణాలలోనే ఉన్నది. ఐతే వాటిని అధ్యయనం చేసి కాలానుగునంగా వ్యాఖ్యానించుకొని అనుసరించడంలోనే ఔచిత్యం ఉంది గానీ – గుడ్డిగా అనుకరించడంలో లేదు. అనుకరణలో వికసితమైన వివేకం ఉండదు. అనుసరణంలో మేల్కొన్న వివేకం జాడలు కనిపిస్తాయి. వాల్మీకి వ్యాసులను చదవనిదే వెయ్యేళ్ళ తెలుగు కావ్యాల పంటలు చేతికందవు – నోటికందవు – మనసుకు పట్టవు.

వ్యాసుని బహుముఖీన విజ్ఞానాన్ని తొమ్మిది విభాగాలుగా వింగడించి, వాటిపై విజ్ఞుల చేత ఉపన్యాసాలు ఏర్పాటు చేసి, వాటిని ‘వ్యాస సాహితీ సంహిత’ గా మలచి పాఠక లోకానికి అందించింది యువభారతి.

భగవద్గీత పై డా. ఎస్ బి రఘునాథాచార్య గారు, బ్రహ్మసూత్రములు, స్తోత్ర సాహిత్యం పై డా. రత్నాకరం బాలరాజు గారు, శ్రీ మధ్భా గవతంపై డా. ధూళిపాళ శ్రీరామమూర్తి గారు; వ్యాస మహర్షి ధర్మనీతి దృక్పధాలు అన్న అంశం పై శ్రీ కేశవపంతుల నరసింహ శాస్త్రి గారు, భారతీయ సాహిత్యం పై వ్యాసుని ప్రభావం అన్న విషయం పై శ్రీ గుంటూరు శేషేంద్ర శర్మ గారు, శ్రీదేవీ భాగవత తత్త్వం పై డా. ప్రసాదరాయ కులపతి గారు, వ్యాసుని రచనలు – అష్టాదశ పురాణాలు అన్న విషయం పై డా.పుల్లెల శ్రీరామచంద్రుడు గారు, వ్యాస సాహిత్యం సార్వకాలికత అన్న సంశంపై డా. కొత్తపల్లి ఘనశ్యామల ప్రసాదరావు గారు, మహాభారతం – మహాకావ్యం అన్న అంశంపై డా. దివాకర్ల వేంకటావధాని గారు చేసిన ప్రసంగ పాఠాల గుచ్ఛమే – ఈ “వ్యాస సాహితీ సంహిత”.

క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.

https://archive.org/details/YuvaBharathi/%E0%B0%B5%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%B8%20%E0%B0%B8%E0%B0%BE%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4%E0%B1%80%20%E0%B0%B8%E0%B0%82%E0%B0%B9%E0%B0%BF%E0%B0%A4/mode/2up

లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదువుకోవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here