[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న ‘తులసీ రామాయణంలో అవాల్మీకాలు’ అనే వ్యాస పరంపర.]
[dropcap]“కూ[/dropcap]జంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్”
(కవిత అనే చెట్టు కొమ్మ మీద కూర్చుని రామ రామ అంటూ మధుర గానం చేసిన వాల్మీకి కోకిలకు నమస్కారములు)
ఎన్నోవేల సంవత్సరాల క్రితం వాల్మీకి మహర్షి శ్రీరాముడి కథని రామాయణ రూపంలో రచించాడు. రామాయణంలో మాయలు లేవు, మంత్రాలు లేవు, మహత్యాలు లేవు. ధర్మబద్ధంగా జీవించిన మానవుడి కథ ఇది. రవ్వంత అయినా అధర్మం లేకుండా సుపరిపాలన అందించటమే కాకుండా మానవుడు ఎలా జీవించాలో ఆచరించి చూపాడు రాముడు. అందుకే భారతీయులకు ఆదర్శప్రాయుడై, వేల సంవత్సరాల నుంచీ దేవుడిగా పూజలందుకుంటున్నాడు. అయితే పండితులకి మాత్రమే పరిమితమైన సంస్కృత భాషలో ఉన్న వాల్మీకి రామాయణాన్ని అనేక మంది కవులు సామాన్యులకు అర్థమయ్యేటట్లు అనేక భాషలలో, అనేక దృష్టి కోణాలలో అనువాదం చేశారు. ఈ క్రమంలో కొన్ని కల్పనలు కూడా చేసారు. సీతాన్వేషణ కోసం వెళ్ళిన రాముడికి దారిలో ఆమె జాడ చెప్పిన చిలుక ‘రామచిలుక’గా, కోకిల ‘గాన కోకిల’గా పేరుపొందాయని జానపద సాహిత్యంలో చెప్పారు. అలాగే భాస్కర రామాయణం, రంగనాధ రామాయణం, మొల్ల రామాయణం మొదలైన వాటిలో కూడా కవులు కల్పనలు చేసారు. శబరి ఎంగిలి పండ్లు, లక్షణ రేఖలు వంటివి. ఇవన్నీ మనోహరమైన కల్పనలు.
అదే విధంగా ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన ప్రయాగ ప్రాంతానికి చెందిన భక్తకవి గోస్వామి తులసీదాసు రామాయణాన్ని 1631లో ‘రామచరిత మానస్’ పేరుతో అప్పటి వ్యవహార భాషయైన అవధి భాషలో రచించాడు. దీనిలో వాల్మీకి రామాయణంలో లేని అనేక కల్పనలు చేశాడు. తన కాలంలో ప్రచారంలో ఉన్న ఇతర రామాయణ గాథావిశేషాలని పరిశీలించి, ప్రజల అభీష్టాలను అనుసరించి తన రామచరిత మానస్‌లో అదనంగా కొన్ని సన్నివేశాలను చిత్రించినట్లు తులసీదాసు స్వయంగా ప్రస్తావించాడు. అయితే ఇవి వాల్మీకి సృష్టించిన పాత్రల వైశిష్టాన్ని ఏమాత్రం తగ్గించనివి, చదివేవారికి అపరిమితమైన ఆనందాన్ని కలిగించేవిగా ఉన్నాయి. అవేమిటో క్లుప్తంగా చూద్దాం.
వాల్మీకి మహర్షి గంగానదీ తీరంలో ఉన్న తమసానదికి స్నానానికి బయలుదేరాడు. అదే సమయానికి ఆనందంగా గడుపుతున్న క్రౌంచపక్షుల జంటలో పోతుపక్షిని ఒక వేటగాడు బాణం వేసి కొడతాడు. అతడిని చూస్తూ ఆయన నోటివెంట అప్రయత్నంగా ఒక శ్లోకం వస్తుంది. దాని గురించే ఆలోచిస్తూ కూర్చున్న మహర్షికి బ్రహ్మ దేవుడు ప్రత్యక్షమై రామకథను వ్రాయమనీ, తన ప్రభావం వలన నిగూఢమైన అనేక విషయాలు గోచరిస్తాయనీ, అది ఆదికావ్యంగా ప్రసిద్ధి పొందుతుందనీ చెప్పి అదృశ్యమైపోతాడు. ఇది వాల్మీకి రామాయణం ప్రారంభంలో జరిగినది. కానీ తులసీదాసు ప్రారంభంలోనే చాలా పెద్ద కల్పనలు చేసాడు.
ప్రయాగలో నివసిస్తున్న భరద్వాజ మహర్షి దగ్గరకు ఒకసారి యాజ్ఞవల్క్య మహర్షి వస్తాడు. “మహాత్మా! పరమేశ్వరుడు నిరంతరం జపించే రాముడు ఎవరు? అయన చరిత్ర వివరంగా చెప్పండి” అని అడుగుతాడు భరద్వాజుడు. అప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి ఈ కథ చెప్పినట్లుగా మొదలు అవుతుంది రామచరిత మానస్‌లో. ఆ కథలో ప్రారంభంలో రామనామం ధ్యానిస్తూ కూర్చున్న పరమశివుడిని చూసి సతీదేవి “పరమేశ్వరుడు జగత్పూజ్యుడు. ఆయనకి దేవతలు, మునులు, మనుషులు అందరూ ప్రణమిల్లుతూ ఉంటారు. అటువంటి ఈశ్వరుడు ఒక రాకుమారుడిని ధ్యానించటమా! ఆ రాముడు ఎంతటివాడో పరీక్షించి వస్తాను” అని అనుకుని సీత రూపం ధరించి శ్రీరాముడు ఉన్న చోటకి వెళుతుంది. అప్పటికి లంక మీదకు దండెత్తి వెళ్ళటానికి వానరుల చేత సముద్రం మీద వారధి నిర్మాణం జరుగుతూఉంటుంది. సీత రూపంలో ఉన్న సతీదేవి రాముడి దగ్గరకు వచ్చి “ప్రభూ! మీ వియోగబాధ లంకలో ఉన్న నాకు వినిపించింది. ఆగలేక వచ్చేశాను” అన్నది.
ఆమె ఈశ్వరుని భార్య అని గుర్తించిన రాముడు లేచి నమస్కరించాడు. “అమ్మా! నీవు జగన్మంగళకారిణి వైన శివసతి వని నాకు తెలుసు. నీకీ వేషధారణ ఎందుకమ్మా!” అన్నాడు. దానితో సిగ్గుపడి అదృశ్యమై యథారూపంలో ఆమె తిరిగి భర్త దగ్గరకు వచ్చేస్తుంది. కానీ ఈశ్వరుడు మాత్రం ‘ఈమె నేను ఆరాధించే సీత రూపుని ధరించింది. నేను పత్నీభావంతో చూస్తే భక్తి మార్గానికి కళంక మేర్పడుతుంది’ అనుకుని దూరంగా ఉంటూ ఉంటాడు. అయన మనోభావం గ్రహించిన సతీదేవి ‘భర్తని శంకించి ఆయనకు దూరం అయ్యాను. ఈ శరీరాన్ని త్యజించి మరోజన్మ ఎత్తుతాను’ అనుకుంటుంది.
తర్వాత దక్షయజ్ఞానికి వెళ్ళటం, అక్కడ పరాభవం పొంది యోగాగ్ని రగుల్చుకుని కాలిపోవటం, తర్వాత జన్మలో హిమవంతుడి కుమార్తె పార్వతిగా జన్మించి శివుడి కోసం తపస్సు చేయటం, శివుడు మూడవ కన్ను తెరిచి మన్మథుడిని దహించటం, శివపార్వతుల కల్యాణం మొదలైనవన్నీ జరుగుతాయి. ఈ ఘట్టాలు అన్నీ మనకు శివపురాణంలో కనబడతాయి. తులసీదాసు క్లుప్తంగా వివరిస్తాడు. పార్వతి శివుడి అర్ధాంగి అయిన తర్వాత “నాథా! పూర్వజన్మలో నేను శ్రీరాముడి ప్రభావాన్ని ఆ సాగరతీరంలో చూశాను. ఆయన్ని సంశయించి ఫలితం అనుభవించాను. నాకు ఇంకా ఆ విషయం గురించి సంశయం ఉన్నది. దయచేసి మీరు నిరంతరం ‘రామ రామ’ అని ధ్యానించే ఆ రాముడి కథ నాకు వివరించండి” అని అడుగుతుంది. పరమేశ్వరుడు సరే నని రామకథను వినిపిస్తాడు.
రాముడు జన్మించటానికి ముందు అసలు సీతారాముల వియోగం సంభవించటానికి కారణం ఏమిటి అనేదానికి కూడా తులసీదాసు ఒక కథను కల్పన చేశాడు. అదేమిటంటే –
ఒకసారి నారదుడు హిమాలయ పర్వతాల వద్ద తపస్సు చేసుకుంటుంటే అయన తపోశక్తి చూసి ఇంద్రుడు భయపడి, తన సింహాసనం కోసమే నేమో అనే సందేహంతో తపోభంగం చేయమని మన్మథుడిని తోడిచ్చి రంభ, ఊర్వశి మొదలైన అప్సరసలను పంపిస్తాడు. వాళ్ళు ఎంత ప్రయత్నించినా నారదుడి తపస్సు భంగం చేయలేక తిరిగి వెళ్ళిపోతాడు. తర్వాత నారదుడు విష్ణువు దగ్గరకు వెళ్లి తను మన్మథుడిని జయించానని అతిశయంతో మాట్లాడతాడు. ‘ఇతడి మనసులో దురభిమాన బీజం నాటుకున్నది. దీనిని నిర్మూలించాలి. భక్తులను కాపాడటమే నా వ్రతము కదా!’ అనుకుంటాడు శ్రీమహావిష్ణువు. నారదుడు తిరిగి వెళ్ళిపోతాడు. వెళ్ళేదారిలో తన మాయాప్రభావంతో ఒక మహానగరాన్ని సృష్టిస్తాడు విష్ణువు.
ఆ నగరాన్ని పరిపాలించే రాజు పేరు శీలనిధి. అయన కుమార్తె పేరు విశ్వమోహిని. ఆమె అతిలోక సౌందర్యరాశి. నారదుడు ఆమెని చూసి మోహపరవశుడై ఎలాగైనా ఆమెని వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. తిరిగి విష్ణువు దగ్గరకి వెళ్లి “విశ్వమోహిని స్వయవరం త్వరలో చాటించనున్నారు. ఆమె నన్ను వరించేటట్లు సుందరరూపుడిగా మార్చండి” అని అడుగుతాడు.
“నారదా! రోగి తనకు హానికరమైన ఆహారాన్ని అడిగితే వైద్యుడు దానిని ఇవ్వడు. అలాగే నీకు హితాన్ని కలిగించటానికే నిశ్చయించుకున్నాను” అని చెప్పి అతడి రూపాన్ని వానర ముఖంగా మార్చేస్తాడు. శ్రీహరి మాటల్లోని అంతరార్థం గ్రహించలేక తను మారిపోయానని అనుకుని స్వయంవరానికి వెళతాడు నారదుడు. అదే స్వయవరానికి విష్ణువు కూడా రాజకుమారుడి రూపంలో వెళతాడు. విష్ణువునే పెళ్ళాడాలనే తలంపుతో ఉన్న విశ్వమోహిని అతడి మెడలో హారం వేస్తుంది. నారదుడి వంక కన్నెత్తి కూడా చూడదు.
ఆ స్వయంవరానికి శివుడి ప్రమథగణం లోనుంచీ ఇద్దరు వస్తారు. వాళ్ళు నారదుడి వానర ముఖం చూసి వినోదిస్తూ ఉంటారు. విశ్వమోహిని స్వయంవరం ముగిసిన తర్వాత నారదుడితో “ఒకసారి మీ రూపాన్ని అద్దంలో చూసుకోండి” అని చెప్పి వెళ్ళిపోతారు. నారదుడు తన రూపాన్ని అద్దంలో చూసుకుని, విష్ణువు తనని మోసగించాడు అనే ఆగ్రహంతో “నేను వరించిన స్త్రీని నాకు దక్కకుండా చేసిన నువ్వు కూడా స్త్రీ వియోగంతో బాధపడతావు. నాకు వానరాకృతిని ఇచ్చావు కాబట్టి నీవు కూడా కూడా వానరులను ఆశ్రయింపక తప్పదు. నువ్వు చేసిన కర్మ నువ్వే అనుభవిస్తావు” అని శపిస్తాడు. అందువలన మరుజన్మలో శ్రీమహావిష్ణువు రామావతారమెత్తి సీతావియోగం అనుభవించ వలసి వచ్చిందనీ, వానరుల సహాయం తీసుకోవలసి వచ్చిందనీ తులసీదాసు రామచరిత మానస్‌లో చెప్పాడు.
దీనితో పాటు శ్రీమహావిష్ణువు శ్రీరాముడిగా అవతరించటానికి ఇంకొక కథ ఉన్నది. స్వాయంభువ మనువు కొంతకాలం రాజ్యంచేసిన తర్వాత కొడుకుకి రాజ్యం అప్పగించి, భార్య శతరూపతో కలసి తపోవనాలకు వెళ్ళిపోతాడు. అక్కడ విష్ణువు గురించి ఘోరతపస్సు చేస్తారు ఇద్దరూ. విష్ణువు ప్రత్యక్షమైన తర్వాత “నీవు మాకు పుత్రుడిగా జన్మించాలి” అని వరం కోరతారు. “తధాస్తు” అని అదృశ్యమై పోతాడు విష్ణుమూర్తి. తర్వాత జన్మలో స్వాయంభువ మనువు, శతరూపలు దశరధుడు, కౌసల్యగా జన్మిస్తారు. వారికిచ్చిన వరం సఫలం చేయటానికి విష్ణుమూర్తి శ్రీరాముడిగా జన్మిస్తాడు.
రావణ కుంభకర్ణుల పుట్టుక గురించి కూడా ఒక కథ చెబుతాడు తులసీదాసు రామచరిత మానస్‌లో. కైకయ రాజ్యాన్ని పరిపాలించే ప్రతాపభానుడు మహా పరాక్రమవంతుడు. అతడి తమ్ముడి పేరు అరిమర్దనుడు. బలశాలి అయిన తమ్ముడి సహాయంతో ప్రతాపభానుడు సమస్త భూమండలాన్ని జయించి సర్వసుఖాలని అనుభవిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా ఒకరోజు వేట కోసం వింధ్యాటవికి వెళ్ళాడు. మధ్యాహ్నం వరకు వేటాడాడు.
చివరికి ఒక అడవిపందిని తరుముకుంటూ అడవి లోపలకి వెళ్ళిపోయాడు. అడవిపంది దట్టంగా వ్యాపించిన చెట్ల మధ్య అదృశ్యమైపోయింది. దాన్ని వెతుక్కుంటూ వెళుతుంటే అక్కడ ఒక మున్యాశ్రమం కనిపించింది. ప్రతాపభానుడు ఆ మునికి నమస్కరించి, తను ఆకలి, దాహంతో ఉన్నానని, ఆకలి తీర్చమని అడిగాడు. ఆ ముని సరే అని కొన్ని పళ్ళు, కందమూలాలు తినటానికి ఇచ్చి, దాహానికి నీరు కూడా అందించాడు. అవి తిని అలసటతో అక్కడే పడుకుని నిద్రపోయాడు ప్రతాప భానుడు.
వాస్తవానికి అతడు ముని కాదు, క్షత్రియుడే! ప్రతాపభానుడి చేతిలో ఓడిపోయి, రాజ్యం కోల్పోయి ఇక్కడ అజ్ఞాతంగా జీవిస్తున్నాడు. అతడు రాజుని గుర్తించాడు గానీ, రాజు అతడిని గుర్తించలేదు. ఆ కపట సన్యాసిలో ప్రతీకార జ్వాల రేగింది. తనను అధోగతి పాలుచేసిన రాజు మీద పగ సాధించాలనుకున్నాడు. ప్రతాపంతో రాజుని జయించలేడు, ఉపాయంతోనే సాధించాలి అనుకున్నాడు. రాజు నిద్రలేచిన తర్వాత కపట సన్యాసితో “స్వామీ! మీరెవరు? మీకిక్కడ అరణ్యవాసమెందుకు? నాతో మా రాజ్యానికి రండి. మీకు కావలసిన సౌకర్యాలు అన్నీ కలగజేస్తాను” అన్నాడు.
“రాజా! నా పేరు ఏకతనుడు. అంటే సృష్టి ప్రారంభమైనప్పుడే నేను జన్మించాను. ప్రాపంచిక విషయాల పట్ల రోసి ఇక్కడ తపస్సు చేసుకుంటున్నాను. అయితే నీకు మేలు చేయటానికి ఒక విషయం చెబుతాను. కొంతమంది బ్రహ్మణులను భోజనానికి ఆహ్వానించు. నేను స్వయంగా వంట తయారు చేస్తాను. వంటవారికి అప్పగిస్తే ఏదైనా దోషం చేయవచ్చు. బ్రాహ్మణులకు ఆగ్రహం కలిగితే శపిస్తారు. బ్రాహ్మణ శాపం భయంకరమైనది. వారు అనుగ్రహించి ఆశీర్వదిస్తే నీకు శుభం కలుగుతుంది” అన్నాడు అభిమానం నటిస్తూ.
ప్రతాపభానుడు సంతోషించి కపటసన్యాసిని తన వెంట రాజ్యానికి తీసుకువెళ్ళాడు. బ్రాహ్మణులను విందుకి ఆహ్వానించాడు. అతడి తమ్ముడు వారికి కావలసిన సౌకర్యాలు చేసి, గౌరవంగా చూసాడు. కపటసన్యాసి విందు భోజనం తయారు చేస్తూ కూరల్లో రహస్యంగా జంతుమాంసం కలిపాడు. అది తెలియని ప్రతాపభానుడు తానే స్వయంగా అతిధులకు వడ్డించాడు. ఇంతలో ఆకాశవాణి “ఈ భోజన పదార్థాలు కలుషితమైనాయి. వీటిలో జంతుమాంసం కలిసింది.” అని చెప్పింది.
దానితో బ్రాహ్మణులంతా ఆగ్రహంతో లేచి “మమ్మల్ని భోజనానికి పిలిచి ఇంత అవమానిస్తావా! ఈ అపరాధానికి నువ్వు, నీ పరివారం రాక్షసులై జన్మించండి” అని శపించి వెళ్ళిపోయారు. తన పన్నాగం ఫలించినందుకు సంతోషిస్తూ కపటసన్యాసి అక్కడ నుంచీ ఉడాయించాడు. తర్వాత జన్మలో ప్రతాపభానుడు రావణాసురుడిగా, అతడి తమ్ముడు కుంభకర్ణుడిగా, పరివారం అంతా రాక్షసులుగా జన్మిస్తారు.
(ఇంకా ఉంది)