సిరివెన్నెల పాట – నా మాట – 8 – మరువలేని ప్రేమగీతం

2
3

[ప్రముఖ గీత రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి పాటలని ‘సిరివెన్నెల పాట – నా మాట’ అనే శీర్షికలో విశ్లేషిస్తున్నారు శ్రీమతి ఆర్. శ్రీవాణీశర్మ.]

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల

~

చిత్రం: నువ్వొస్తానంటే నేనొద్దంటానా?

సంగీతం: దేవిశ్రీ ప్రసాద్

సాహిత్యం: సిరివెన్నెల

గానం: ఎస్పీ బాలసుబ్రమణ్యం

~

సాహిత్యం

ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్, ఘల్ ఘల్
ఘల్ ఘల్ ఘల్ ఘల్ ఘలం ఘలం ఘల్ ఘల్ ఘల్..
పల్లవి:
ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల.. అందించే ఆహ్వానం ప్రేమంటే..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే..
అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం,..
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం..
దాహంలో మునిగి చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో
నిద్దురపోయిన రంగులనన్ని రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ||ఆకాశం||
చరణం:
ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో  గుర్తించేందుకు వీలుందా..
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో
గమనించే సమయం వుంటుందా
ప్రేమంటే ఏమంటె చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటే
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా
తనలోఆ వురవడి పెంచిన తొలి చినుకేదంటే?

సిరిపైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా

తనలో కనిపించే కళలకు తొలిపిలుపేదంటే ||ఆకాశం||
చరణం:
మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదనుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై వుండే విలువే వుంటే అలాంటి మనసుకు
తనంత తానై అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా
నీ అడుగుల్లో అడుగులు కలిపే జతే వుంటే నడకల్లో
తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా
నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే
ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతై ఎదురవదా?||ఆకాశం||

Love is the language which a dumb can speak and a deaf can hear.. ఏ నిర్వచనానికి అందనిదే ప్రేమ. ఎందుకంటే అది మనసు భాష, మనసుకు మాత్రమే అందే భాష! అయితే సాహిత్యంలో, మరి ముఖ్యంగా సినిమా పాటలలో వేల సంఖ్యలో ప్రేమకు నిర్వచనాలు ఇవ్వబడ్డాయి. ఒక్కొక్క ప్రసిద్ధ సినీకవి వందలాదిగా ప్రేమకు భాష్యం చెప్పే మధురమైన పాటలు వ్రాసి, తెలుగు ప్రేక్షకులను ప్రేమ వాహినిలో ముంచి వేశారు. ఇటువంటి భావాతీతమైన ప్రేమను అక్షరాలతో నిర్వచించడం కష్టమనుకుంటే, ఇక తొలివలపు భావాలను పదాల్లో పలికించడం మరీ కష్టం.

ఆంగ్ల సాహిత్యంలో గమనిస్తే, John Keats ప్రేమని, మై రిలీజియన్ అని నిర్వచిస్తున్నాడు.

You are always new, the last of your kisses was ever the sweetest. Love is my religion – I could die for it. My love is selfish. I cannot breathe without you.

ప్రేమే నా మతం, నేను దాని కోసం మరణించడానికి సైతం సిద్ధం. నా ప్రేమ పూర్తిగా స్వార్థపూరితమైనది, నీవు లేకుండా నేను ఊపిరి కూడా తీసుకోలేను అంటారు Keats.

Keats ను Poet of Beauty అని వర్ణిస్తే, Shelley ని Poet of Love అని నిర్వచిస్తారు. కాకపోతే ఆయన  ప్రేమను చాలా రకాలుగా విభజించినా , ఆయన Philosophy of Love పూర్తిగా Platonic, Divine..

~
The fountains mingle with the river
And the rivers with the ocean,
The winds of heaven mix for ever
With a sweet emotion;
Nothing in the world is single;
All things by a law divine
In one spirit meet and mingle.
Why not I with thine?—

సృష్టిలో ఏది ఒక్కటిగా లేదని, అన్ని ఒకదానితో ఒకటి సంగమిస్తూనే ఉన్నాయని, ఏ జంట అయినా దైవికమైనదని, నీతో నేను ఎందుకు కలిసి ఉండకూడదు? అని ప్రియురాలి ప్రశ్నిస్తాడు Shelley.

కానీ ఈ ప్రేమ భాషను వినిపించడంలో ఎందరో కవులు తమ సృజనాత్మక చాతుర్యంతో చాలావరకు సఫలత సాధించారు. ఆ కవితా శిల్ప నిర్మాణంలో ఒక్కొక్క కవిది ఒక్కొక్క ఒరవడి. నాయక నాయకులను బట్టి కూడా ఒక ప్రత్యేక శైలి ఉంటుంది. ఒక్కో దశాబ్దం దాటేకొద్దీ, ప్రేమ నిర్వచనాన్ని వ్యక్తీకరించడంలో ఒక్కొక్క కొత్త శైలి పుట్టుకొచ్చింది. కొంతమంది కవుల ప్రేమ గీతాలలో ప్రేమ నిర్వచనాన్ని ఒకసారి ఆస్వాదిద్దాం.

హిందీ సినిమాల్లో ప్రేమను నిర్వచించే పాటలెన్నో వున్నాయి. ముఖ్యంగా ఉర్దూ ప్రాధాన్యం అధికంగా కల హిందీ పాటల్లో ప్రేమభావన పరవళ్ళు తొక్కుతుంది. పారసీ, ఉర్దూ భాషల్లోని ప్రేమ కవిత్వం, సూఫీ తత్వంలోని ప్రేమభావనలను కలగలిపి ప్రేమను ఏంతో లోతుగా, విభిన్నమైన కోణాల్లో ప్రదర్శిస్తాయి హిందీ సినిమాపాటలు. అయితే  సాహిర్ లాంటి కవులు ప్రేమభావన ఒక మోసం అన్నట్టు పాటలు రాస్తే, శకీల్ లాంటి కవులు ప్రేమను భగవంతుడి స్థాయికి ఎదిగింపచేశారు. అయితే, ప్రేమను విభిన్నంగా నిర్వచించిన పాటలలో కవి నీరజ్ రాసినపాట ‘శోఖియోమే ఘోలా జాయే ఫూలోంకా శబాబ్, ఉస్మే ఫిర్ మిలాయీ జాయే థోడీసీ శరాబ్, హోగా యూన్ నషా జో తయ్యార్ హై, వో ప్యార్ హై..’ ప్రేమను ఓ రసాయనం తయారీలా, మత్తులా వర్ణిస్తుంది.  పూలల్లో వుండే చంచలత్వం, యవ్వనాలకు కాస్త మద్యాన్ని కలిపితే కలిగే మత్తు ప్రేమ అంటాడు నీరజ్

ఒక అమూర్తమయిన భావనకు అమూర్తమయిన రూపాన్ని అక్షరాలలో కల్పించి నిర్వచించాడు గుల్జార్.

హమ్ నె దేఖీహై ఉన్ ఆంఖోంకి మహెక్తీ  ఖుశ్బూ

హాథ్ సే ఛూకే ఇసే రిశ్తోంక ఇల్జామ్ న దో

సిర్ఫ్ ఎహెసాస్ హై యే రూహ్ సే మహెసూస్ కరో

ప్యార్ కో ప్యార్ హి రహెనేదో కొయి నామ్ న దో

అతని కళ్ళల్లో పరిమళిస్తున్న సువాసనను నేను చూశాను. చేతితో తాకి, దానికోక బంధాన్ని ఆపాదించి దాన్ని నేరంలా మార్చకు. ఇదొక భావన. ఆత్మతో అనుభవించాలి. ప్రేమను ప్రేమగానే వుంచండి. దానికి పేర్లు పెట్టకండి.

ఇక తెలుగు పాటలను పరీక్షిస్తే….

పాతాళభైరవి(1951) చిత్రం కోసం శ్రీ పింగళి నాగేంద్ర రావు రచించిన తొలితరం ప్రేమ గీతం..

కలవరమాయే మదిలో నా మదిలో@2
కన్నులలోన కలలే ఆయే
మనసే ప్రేమ మందిరమాయే
…………
నాలో ఏమో నవ భావనగా మెల్లన వీణ మ్రోగింది@2
అనురాగాలే ఆలాపనగా మనసున కోయిల కూసే..

మనసులో ఏవో కొత్త కొత్త భావాలు పుట్టుకు వచ్చి, వసంత మాస కోయిలలాగా అనురాగాలు ఆలపించడం మొదలుపెట్టింది.. మనసంతా ఏదో కలవరంగా ఉంది.. అన్నది అప్పటి తరం తొలివలపు ప్రేమ గీతం..

~

బందిపోటు (1963) చిత్రం కోసం ఆరుద్రగారి రచన..

ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే
ప్రియా.. ఊహలు గుస గుస లాడే
నా హృదయం ఊగిస లాడే
……………
వలదన్న వినదీ మనసు కలనైన నిన్నే తలచు@2
తొలిప్రేమలో బలముందిలే అది నీకు మునుపే తెలుసు
…….
నను కోరి చేరిన బేల దూరాన నిలిచేవేల@2
నీ ఆనతి లేకున్నచో విడలేను ఊపిరి కూడ..

ప్రేయసి ఆనతి లేకుండా ఊపిరి కూడా వదలనన్నంత గాఢమైన వ్యక్తీకరణ..ఎంతో గొప్ప భావుకత! మన మనసులను ఏదో లోకాలకు తీసుకువెళ్తుంది..

~

గంగ మంగ చిత్రం కోసం దాశరథి ఇలా వ్రాశారు..

తొలి వలపులలో ఏ చెలికైన అలక ఉండునని విన్నాను..
అది కవుల కల్పననుకున్నాను..
అది కవుల పైత్యమనుకున్నాను..
నీలో నాపై అలకను చూసి వలపు చేష్టలనుకున్నాను..
నీ చెలిమి కోరుతూ ఉన్నాను..

~

శ్రీవారికి ప్రేమలేఖ.. సినిమా కోసం వేటూరి గారి గీతమిది..

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నొ కథలు.. ఎన్నెన్నో కథలు..

~

ఆత్మ గౌరవం (1966) చిత్రంలో దాశరధి గారి సాహిత్యం.. పూల బాణం తగిలి ప్రేమ దీపం వెలిగింది అని..

ఒక పూల బాణం తగిలింది మదిలో
తొలి ప్రేమ దీపం వెలిగిందిలే, నాలో..
వెలిగిందిలే

~

నీడలేని ఆడది చిత్రంలో సినారె తొలివలపును.. తీయగా వుంటూ మాయకుండా ఉంటుందని భాష్యం చెప్పారు..

తొలి వలపే.. తొలి వలపే
తియ్యనిదీ.. తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
…….
తొలి వలపే తియ్యనిదీ
మదిలో ఎన్నడు మాయనిది
నీ కొరకే దాచినదీ వేరెవరూ దోచనిదీ

~

ఆచార్య ఆత్రేయ గారి బాణీ.. ప్రేమ చిత్రంలో

ఈనాడే ఏదో అయ్యిందీ.. ఏనాడూ నాలో జరగందీ
ఈ అనుభవం మరలా రానిదీ.. ఆనంద రాగం మోగిందీ
అందాలా లోకం రమ్మందీ..

~

శీను (1999) చిత్రంలో వెన్నెలకంటి సాహిత్యం..

ప్రేమంటే ఏమిటంటే నిను ప్రేమించినాక తెలిసే మనసంటే ఏమిటంటే అది నీకివ్వగానే తెలిసే.
…….
ఇదివరకు తెలియంది ఈ అనుభవం ఎద మేలుకొలిపింది ఈ పరిచయం

~

చిత్రం: నువ్వు లేక నేను లేను (2002). రచన చంద్ర బోస్ గారు..

ఎలా ఎలా ఎలా ఎలా ఎలా తెలుపను..
ఎదలోని ప్రేమను మృదువైన మాటను..

~

ఇంతమంది దిగ్గజ కవులు, భావ కవులు ప్రేమను అక్షరీకరించడం సాధ్యం కాదని, అది అవ్యక్తమైందని, ఎలా తెలపాలో చెప్పడం కష్టమనీ.. పాటలు రాశారు. కాబట్టి, దాన్ని అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం.

“We can only learn to love, by loving.”

అందుకే “ప్రేమించు సుఖముకై, ప్రేమించు ముక్తికై, ప్రేమించు ప్రేమకై”, అని ప్రేమ తత్వాన్ని వర్ణించారు బసవరాజు గారు.

ప్రేమ కథ చిత్రాల్లాగానే, ప్రేమ గీతాలు అసంఖ్యాకంగా ఉన్నా, సిరివెన్నెల గీతాల్లో ప్రేమ స్వభావాన్ని విశ్లేషించే ప్రయత్నం ఎక్కువ జరిగింది.

గోవిందా.. గోవిందా చిత్రంలో..

ప్రేమంటే నిజంగా ఏమంటే ఇదంటూ ఎట్టా చెప్పగలం?
ప్రేమించే ఎదలో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలం?
తొలి చినుకుల తడి ఇదని తొలి కిరణపు తళుకిదని ఎట్టాగా పోల్చడం?

తొలి చినుకుల తడి, తొలి కిరణపు మెరుపు అనుభవించి తెలుసుకోవాలిగానీ, వివరించి చెప్పడం సాధ్యం కాదు. అదేవిధంగా ప్రేమికుల ఎదలో ఉన్న భావాలని పదాల్లో చూపడము సాధ్యం కాదు.. అని తేల్చి చెప్పారు సిరివెన్నెల.

“హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ..” అంటూ ఎంతో భావుకత్వంతో గొప్పగా ప్రేమ తత్వాన్ని వర్ణించినా, నాకు మాత్రం ఆకాశం తాకేలా పాట.. ఎంతో హృద్యంగా, కవితాత్మకంగా అనిపిస్తుంది. అందుకే ఆ పాటను, దాని భావాన్ని, నా మనసు మాటగా, మీకు అందించాలని నిర్ణయించుకున్నాను. మధురమైన ఈ సాహిత్యానికి, ఎస్పీబీ గారి అజరామరమైన అమృతగళం, అద్యంతం మనసును పరుగులు పెట్టించే అందమైన సంగీతం.. అన్నీ కలగలిపి దీన్ని ఒక మరువలేని ప్రేమగీతంగా తీర్చిదిద్దాయి.

ఆకాశం తాకేలా వడగాలై ఈ నేల.. అందించే ఆహ్వానం ప్రేమంటే..
ఆరాటం తీరేలా బదులిచ్చే గగనంలా వినిపించే తడిగానం ప్రేమంటే..
అణువణువును మీటే మమతల మౌనం పదపదమంటే నిలవదు ప్రాణం,..
ఆ పరుగే ప్రణయానికి శ్రీకారం..
దాహంలో మునిగి చివురుకు చల్లని తన చెయ్యందించి
స్నేహంతో మొలకెత్తించే చినుకే ప్రేమంటే మేఘంలో
నిద్దురపోయిన రంగులనన్ని రప్పించి
మాగాణి ముంగిట పెట్టే ముగ్గే ప్రేమంటే ||ఆకాశం||

ప్రేమను ప్రకృతి సంబంధమైన దృష్టాంతాల సహాయంతో ఎంతో గొప్పగా నిర్వచించారు సిరివెన్నెల. వయసు అనే వడగాలని ఆకాశానికి అందిస్తూ నేలమ్మ ఆహ్వానం పలికితే.. వర్షపు చినుకులతో ఆ ఆరాటాన్ని తీర్చిందట, ఆకాశం. వడగాలికి తడి గానం బదులిచ్చిందట. ఎంత ముచ్చటైన పదబంధం! మమతల మౌనంతో ప్రాణం పరిగెట్టి.. ప్రేమకు శ్రీకారం చుట్టింది. దాహంతో ఉన్న చిగురాకుకు స్నేహ హస్తాన్నందించిన చినుకులో, భూమిపైన రంగుల రంగవల్లిని పండించిన మేఘంలో.. నిండైన ప్రేమ కనిపించింది సీతారామశాస్త్రిగారికి.

ప్రాణం ఎపుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో.. గుర్తించేందుకు వీలుందా..
ప్రణయం ఎవరి హృదయంలో ఎపుడు ఉదయిస్తుందో..
గమనించే సమయం వుంటుందా..
ప్రేమంటే ఏమంటె చెప్పేసే మాటుంటే ఆ మాటకు తెలిసేనా ప్రేమంటే
అది చరితలు సైతం చదవని వైనం కవితలు సైతం పలకని భావం..
సరిగమ లెరుగని మధురిమ ప్రేమంటే..
దరిదాటి వురకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో
ఆ వురవడి పెంచిన తొలి చినుకేదంటే?

సిరిపైరై ఎగిరే వరకూ చేనుకు మాత్రం తెలిసిందా

తనలో కనిపించే కళలకు తొలిపిలుపేదంటే ||ఆకాశం||

ప్రాణం పోసుకున్న సమయం, తొలిప్రేమ చిగురించిన శుభ తరుణం, ఎవరికైనా గమనించడం సాధ్యమా? ప్రేమ అంటే ఇదే అని చెప్పడానికి ఏదైనా మాట ఉందా? ఒకవేళ ఉంటే.. ఆ పదానికి దాని భావం తెలుసా? గట్టు దాటి పొంగిపొరలే నదికి, దాని ఒరవడికి కారణమైన తొలి చినుకు ఏదో తెలుస్తుందా? అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ.. ప్రేమను ఏ చరిత్ర చదవలేదని, ఏ కవితలు పలక లేవని తేల్చి చెప్పారు. మధురాతి మధురమైన సరిగమలకు కూడా ఈ ప్రేమ మధురిమ తెలియదని, సిరివెన్నెల చాలా దృఢంగా చెప్పారు.

మండే కొలిమినడగందే తెలియదే మన్ను కాదు ఇది స్వర్ణమంటు చూపాలంటే
పండే పొలము చెబుతుందే పదనుగా నాటే నాగలి పోటే చేసిన మేలంటే
తనువంతా విరబూసే గాయాలే వరమాలై దరిచేరే ప్రియురాలే గెలుపంటే
తను కొలువై వుండే విలువే వుంటే అలాంటి మనసుకు
తనంత తానై అడగక దొరికే వరమే వలపంటే జన్మంతా
నీ అడుగుల్లో అడుగులు కలిపే జతే వుంటే నడకల్లో
తడబాటైన నాట్యం అయిపోదా రేయంతా
నీ తలపులతో ఎర్రబడే కన్నులు వుంటే
ఆ కాంతే నువ్వు వెతికే సంక్రాంతై ఎదురవదా?||ఆకాశం||

సాఫీగా సాగిపోయే ప్రేమ చరిత్రలే కాక, కఠిన పరీక్షలను ఎదుర్కొనే ప్రేమల గురించి కూడా ఈ చరణంలో వర్ణిస్తున్నారు సిరివెన్నెల. బంగారం నిగ్గు తేలాలంటే కొలిమిలో కాలాల్సిందే. ఏపుగా పొలం పెరగాలంటే కఠినమైన నాగలి పోటు పడాల్సిందే. బలమైన పరీక్షలు ఎదుర్కొని దక్కించుకున్న ప్రియురాలే గెలుపుకు ఒక మైలురాయి అవుతుంది. తను ఎవరి మనసులో కొలువై ఉన్నారో, అడగకుండా వాళ్లంతట వాళ్లే ప్రేమను వ్యక్తపరచడమే వలపు గెలుపు. జీవితకాలం మనతో జతకట్టి నడిచే వాళ్ళుంటే తడబాటు కూడా నాట్యం అయిపోతుంది.. మనకోసం అహర్నిశలు ఎదురుచూసే వాళ్ళు ఉంటే.. ఎదురుచూపులో వాళ్ళ కళ్ళు ఎర్రబడితే.. ఆ క్రాంతి మన జీవితానికి సంక్రాంతి అవుతుంది! అని, మెండైన ప్రేమను చక్కటి ఉపమానాలతో, కొత్త కోణాల్లో నిర్వచించారు సిరివెన్నెల.

ప్రేమంటే ఏంటో ఎట్లా చెప్పగలం? ప్రేమించే ఎదల్లో ఏముందో పదాల్లో ఎట్టా చూపగలం? అని ప్రశ్నిస్తూనే, అందమైన అక్షరాల రంగవల్లుల్లో ప్రేమ భావాన్ని ఎంతో మృదువుగా తన సాహిత్యపు కాన్వాస్ మీద నింపేశారు. అంతుచిక్కని ప్రేమ స్వభావాన్ని, అమృతమయమైన ప్రేమ తత్వాన్ని తన భావ కవితా వెన్నెలలో కురిపించి, తన ముద్రను బలంగా మన మనసులలో నాటారు సిరివెన్నెల.

Images Courtesy: Internet

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here