తులసీ రామాయణంలో అవాల్మీకాలు-2

0
4

[శ్రీ గోనుగుంట మురళీకృష్ణ అందిస్తున్న ‘తులసీ రామాయణంలో అవాల్మీకాలు’ అనే వ్యాస పరంపర.]

[dropcap]వా[/dropcap]ల్మీకి రామాయణంలో రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు మొదలైన వారి పుట్టుక గురించి ఉత్తర కాండలో చెబుతారు. రాముడు అయోధ్యకు పట్టాభిషిక్తుడు అయిన తర్వాత ఒకసారి అగస్త్యుడు, విశ్వామిత్రుడు, కణ్వుడు, వశిష్టుడు, అత్రి, మేధాతిధి మొదలైన మునులందరూ చూడటానికి వచ్చి లోకానికి రావణ బాధ తొలగించినందుకు ప్రశంసించి, ఆశీర్వదిస్తారు. అప్పుడు రాముడు “ఎవరీ రావణుడు?” అని అడిగితే అతడి పుట్టు పూర్వోత్తరాలు అన్నీ వివరిస్తాడు అగస్త్యుడు. కానీ తులసీదాసు అవన్నీ బాలకాండ లోనే చెప్పేస్తాడు. ప్రతాపభానుడు రావణుడిగా పుట్టటం, సోదరులతో కలసి తపస్సు చేయటం, బ్రహ్మ ప్రత్యక్షమై వరాలు ఇవ్వటం, మండోదరితో రావణుడి వివాహం, కుబేరుడిని జయించి లంకని స్వాధీనం చేసుకోవటం, కైలాస పర్వతాన్ని పెకలించి తలమీద పెట్టుకోవటం మొదలైన ఘట్టాలు అన్నీ బాలకాండలోనే వచ్చేస్తాయి రామచరిత మానస్‌లో.

రావణాది అసురులు చేసే దుష్కృత్యాలు సహించలేక తనని కాపాడమని భూదేవి శ్రీమహావిష్ణువుతో మొరపెట్టుకుంటుంది. అప్పుడు తాను రాముడిగా అవతరించి భూభారం తొలగిస్తానని మాట ఇస్తాడు. రావణసంహారం కోసం దేవతలని వానరవీరులుగా ప్రభవించమని చెబుతాడు విష్ణువు. ఇవి తులసీదాసు రచించిన రామాయణంలో ఉన్నాయి. కానీ వాల్మీకంలో లేవు. బ్రహ్మదేవుడి ఆనతి మీద దేవతలు ఆయా వానరవీరులుగా జన్మించినట్లు చెబుతాడు వాల్మీకి. అలాగే ఇందులో విశ్వామిత్రుడి యాగసంరక్షణార్ధం రామలక్ష్మణులు వెళ్ళటం, దారిలో అహల్యా శాపవిమోచనం చేయటం వంటివి చెప్పాడు. అహల్యని గాలిలో, ధూళిలో కలసిపోయి ఇక్కడే పడిఉండు అని గౌతమ మహర్షి శపించినట్లుగా చెబుతాడు వాల్మీకి. కానీ తులసీదాసు మాత్రం అహల్య శిలారూపంలో ఉన్నట్లు చెబుతాడు.

ఈ మధ్యలో సగరచక్రవర్తి అశ్వమేధయాగం చేయబోవటం, భగీరధుడు గంగ కోసం తపస్సు చేయటం, గంగావతరణం, విశ్వామిత్రుడు రాజుగా ఉన్నప్పుడు కామధేనువు కోసం వశిష్ఠుడితో యుద్ధానికి రావటం, విశ్వామిత్రుడి తపస్సు, త్రిశంకు స్వర్గం మొదలైన ఘట్టాలు వాల్మీకి రామాయణంలో కనబడతాయి. కానీ తులసీదాసు మాత్రం అవన్నీ వదిలేశాడు. సూటిగా సీతా స్వయంవరం దగ్గరకు వచ్చాడు. స్వయంవరంలో రాముడు శివధనుస్సు భంగం చేయటం గురించి చెప్పాడు.

వాల్మీకి రామాయణంలో అసలు స్వయంవరమే లేదు. జనకుడు చేసే యజ్ఞం చూడటానికి రామలక్ష్మణులతో కలసి వస్తాడు విశ్వామిత్రుడు. ఆ సందర్భంలో శివధనుస్సు ప్రసక్తి వస్తుంది. శివధనుస్సు తన దగ్గరకు ఎలా వచ్చిందో వివరించి, ఎందఱో రాకుమారులు ఎక్కుపెట్టలేక విఫలురు అయ్యారు అని చెబుతాడు జనకుడు. “రామా! అదేమిటో చూడు” అంటాడు విశ్వామిత్రుడు. గురువు ఆజ్ఞ మీద రాముడు దానిని ఎక్కుపెట్టబోతుంటే ఫెళ్లున విరిగిపోతుంది.

సీతారాముల కళ్యాణ మహోత్సవం గురించి చాలా బాగా వర్ణించాడు తులసీదాసు. జనకుడు, దశరథుడు కలుసుకుని అభిమానంగా మాట్లాడుకోవటం, గౌరవించుకోవటం, అటు రాణివాసంలో కూడా స్త్రీలు ప్రేమ పూర్వకంగా మెలగటం, అందరూ ఆనందంగా కళ్యాణ ఉత్సవం జరుపుకోవడం, వంటివి చాలా బాగా వర్ణించాడు తులసీదాసు. అవి చదువుతుంటే ఆ కళ్యాణం మన కళ్ళ ఎదురుగా జరుగుతున్నట్లు అనుభూతి చెందుతాము. ఇక్కడ సీత తల్లి, జనకుడి భార్య అయిన సునయనా దేవి గురించి కూడా చాలా చెబుతాడు తులసీదాసు. సునయన తన కుమార్తెని పెళ్ళికూతురు చేయటం, గౌరీపూజ చేయించటం, జనకుడు సునయన కలసి రాముడి కాళ్ళు కడిగి కన్యాదానం చేయటం, అత్తవారింటికి పంపేటప్పుడు తల్లి కుమార్తెకి పతివ్రతా ధర్మాలు బోధించటం వంటివి వర్ణించి చెబుతాడు. వాల్మీకంలో సునయనా దేవి ప్రసక్తి ఉండదు.

అలాగే రామలక్ష్మణ భరతశతృఘ్నుల వివాహాలు ముగిసి అయోధ్యకు వెళ్ళే దారిలో పరశురాముడు కనబడినట్లుగా, గర్వభంగం జరిగినట్లుగా వాల్మీకంలో ఉన్నది. కానీ వివాహానికి పూర్వమే పరశురాముడు వచ్చినట్లుగా చెపుతాడు రామచరిత మానస్‌లో. అంతేకాకుండా పరశురాముడికి, లక్ష్మణుడికి మధ్య సంవాదం చాలాసేపు జరుగుతుంది. లక్ష్మణుడు పరశురాముడిని చూసి యజ్ఞోపవీతం, పరశువు రెండూ ధరించావు. బ్రాహ్మణుడివి కాదు, క్షత్రియుడవి కాదు అని ఎగతాళి చేస్తాడు. క్షత్రియులని చూస్తేనే మండిపడే పరశురాముడికి ఎందుకో లక్ష్మణుడి పరిహాసపు మాటలు విన్నా ఆగ్రహం రాలేదు. తర్వాత రాముడు “నా తమ్ముడు పసివాడు, బాల్యచాపల్యం చేత అలా మాట్లాడాడు, మన్నించండి” అని చెబుతాడు, తమ్ముడిని కూడా వారిస్తాడు. ఈ సంవాదం కూడా తులసీదాసు కల్పనే! నలుగురి అన్నదమ్ముల కళ్యాణ మహోత్సవంతో బాలకాండ ముగుస్తుంది.

అయోధ్యాకాండ

అయోధ్యాకాండను చాలా వివరంగా చెబుతారు వాల్మీకి, తులసీదాసులు ఇరువురూ. భరతుడి గురించి విపులంగా తెలుసుకోవాలంటే అయోధ్యాకాండ చదవాలి. వాల్మీకంలో మంధర స్వభావసిద్ధం గానే అసూయాపరురాలు, దుష్టబుద్ధి. ఒకరోజు యాదృచ్ఛికంగా కైకేయి మేడ మీద విహరిస్తూ ఉంటే అయోధ్యా నగరం అంతా శోభాయమానంగా అలంకరించి ఉండటం, పౌరులంతా ఉత్సాహంగా తిరుగుతూ ఉండటం మంధర కంట పడుతుంది. అందుకు కారణం ఏమిటి అని ఎదురు మేడమీద ఉన్న మరో దాసిని అడుగుతుంది. ఆమెకి మంధర స్వభావం తెలిసియుండి కూడా సంతోషం పట్టలేక తెల్లవారితే రాముడి యువరాజు పట్టాభిషేకం అని చెబుతుంది. మంధర మనసు ఈర్ష్యతో భగ్గు మంటుంది. కిందకి వచ్చి కైకకి దుర్భోధ చేస్తుంది.

కానీ తులసీదాసు ఇక్కడ కొంత కల్పన చేశాడు. రామపట్టాభిషేకం ఏర్పాట్లు జరుగుతుంటే ఇంద్రుడు, ఇతర దేవతలు అంతా సత్యలోకం వెళ్లి “రాముడు రాజు అయి అయోధ్యలోనే ఉంటే రావణసంహారం ఎలా జరుగుతుంది? రాముడు రాజ్యాన్ని వదలి అడవులకు వెళ్ళేటట్లు చేయి. అందువలన దేవతల కార్యం సిద్ధిస్తుంది” అని సరస్వతీ దేవిని ప్రార్థిస్తారు. దేవతల మేలు కోరి సరస్వతి మంధర బుద్ధి వక్రీకరించి, కైక మనసు మార్చేటట్లు చేస్తుంది. ఇక్కడ కైకను ఉత్తమురాలిగా చిత్రీకరించాడు. రామ పట్టాభిషేక వార్త మంధర చెప్పగానే కైక పట్టరాని ఆనందంతో “నాకు రాముడయినా భరతుడైనా ఒకటే!” అంటుంది. “విధాత చల్లగా చూసి నాకు మళ్ళీ మానవజన్మ ప్రసాదిస్తే శ్రీరాముడు కుమారుడుగానూ, సీత కోడలు గానూ జన్మించాలి” అంటుంది. అంతేకాక మంధర మాటలు విని కోపంతో “చాలించు నీ అధిక ప్రసంగం. కుటుంబంలో తగవులు పెట్టటంలో నీకు నువ్వే సాటి, ఇంకోసారి ఇలా మాట్లాడితే నీ నాలుక చీలికలు చేస్తాను” అంటుంది. కానీ మంధర పదేపదే నొక్కి చెప్పటం వలన క్రమక్రమంగా ఆమె మనసు మారిపోతుంది.

కైకకి రాముడి మీద ప్రేమ ఉన్నా పుట్టుకతోనే మొండిదాని గానూ, స్వార్థబుద్ధి కలదానిగానూ చిత్రీకరిస్తాడు వాల్మీకి. కైక తండ్రికి పశుపక్ష్యాదుల, సృష్టి లోని సమస్త జీవుల భాషలు తెలుసు. ఒకసారి చీమలు చెప్పుకునే మాటలు విని నవ్వుకుంటాడు. కైక తల్లి అది చూసి, “ఎందుకు నవ్వుకుంటున్నారు? కారణం నాకు చెప్పండి” అని అడుగుతుంది. “అది దేవరహస్యం. చెబితే నేను తల పగిలి మరణిస్తాను” అంటాడు. ‘అయినా సరే, చెప్పి తీరాల్సిందే’ అని పట్టుపడుతుంది. “భర్త మరణించినా ఫర్వాలేదా, నీ పంతమే నెగ్గాలా! ఛీ! స్వార్థపరురాలా! నా దేశంలో నుంచీ వెళ్ళిపో!” అని ఆమెని గెంటేస్తాడు కేకయ రాజు. మంత్రి సుమంత్రుడు ఈ విషయం గుర్తుచేసి, “నీకు కూడా తల్లి మొండితనమే వచ్చింది” అని కైకను నిందిస్తాడు.

దేవాసుర యుద్ధం జరగటం, దశరథుడు తనను కాపాడిన కైకకు రెండు వరాలు ఇస్తానని చెప్పటం, ఆ సంఘటన చాలా వివరంగా వాల్మీకి రామాయణంలో వస్తుంది. తులసీదాసు మాత్రం “మునుపు నాకు రెండు వరాలు ఇస్తానని వాగ్దానం చేసిన ప్రకారం..” అని కైక అన్నట్లుగా ఒక్క వాక్యంలో చెబుతాడు. శ్రవణ కుమారుడి వృత్తాంతం కూడా వాల్మీకంలో వస్తుంది. దశరథుడు యువకుడుగా ఉన్నప్పుడు ఒకసారి వేటకు వెళతాడు. చెట్టుచాటు నుంచీ బుడబుడమని శబ్దం రావటంతో ఏదో మృగం నీరు తాగుతున్నది అని భ్రమించి శబ్దవేది అస్త్రం ప్రయోగిస్తాడు. అది వెళ్లి కుండతో నీరు ముంచుతున్న ఒక ముని కుమారుడి గుండెను ఛేదించుకుంటూ వెళుతుంది. అతడు మరణిస్తాడు.

విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు దుఃఖిస్తూ “పుత్రశోకంతో మేము మరణించినట్లు గానే నీవు కూడా పుత్రశోకం తోనే మరణిస్తావు” అని శపించి ప్రాణాలు వదులుతారు. “సంతానం లేక పరితపిస్తున్న నాకు పుత్రశోకం ఏమిటా!” అనుకుంటూ దశరథుడు అయోధ్యకు తిరిగివస్తాడు. రామలక్ష్మణులు అడవికి వెళ్ళిన తర్వాత ఈ సంఘటన కౌసల్యతో చెప్పి “ఇదంతా ముని దంపతుల శాప ఫలితం. నలుగురు కొడుకులు ఉండి కూడా ఎవరూ దగ్గర లేకుండానే మరణిస్తున్నాను” అని ప్రాణం వదిలేస్తాడు దశరథుడు. అయితే ఈ సంఘటన తులసీ రామాయణంలో లేదు. అయోధ్యకు తిరిగి వచ్చిన సుమంత్రుడు ‘సీతా రామలక్ష్మణులను అడవులలో దించి వచ్చాను’ అనే వార్త చెప్పగానే అంతులేని పరితాపంతో దశరథుడు మరణించినట్లుగా చెబుతాడు తులసీదాసు.

భరత శత్రుఘ్నులు మేనమామ ఇంటి నుంచీ అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత తండ్రి మరణించటం, అన్న అడవులకి వెళ్ళటం తల్లి ద్వారా వింటారు. అదే సమయానికి ఒంటినిండా నగలు అలంకరించుకుని కులుక్కుంటూ వచ్చిన మంధరను చూసిన శత్రుఘ్నుడికి అగ్నిలో ఆజ్యం పోసినట్లుగా అవుతుంది. పట్టరాని ఆగ్రహంతో దాని గూని మీద కాలితో ఒక్క తన్ను తంతాడు. ఆమె నేలమీద బొక్కబోర్లా పడిపోతుంది. పళ్ళు ఊడిపోయి, నోటి నుండీ రక్తం కారుతుంది. “నేనేం చేశాను? మీకు మేలు చేసినందుకు ప్రతిఫలమా ఇది?” అని గావుకేకలు పెట్టి ఏడుస్తుంది. ఆమెని లేవదీసి కొప్పు పట్టుకుని ఈడ్చేస్తాడు. భరతుడు తమ్ముడిని శాంతపరచి ఆమెని విడిపిస్తాడు. అయితే ఈ విషయం వాల్మీకి చెప్పలేదు. ఆడదాని మీద, అందునా దాసీమీద ప్రతాపం చూపించే అల్పులు కాదు ఇనవంశీయులు అన్నట్లు ఆమెని క్షమించినట్లు చెబుతాడు.

శృంగిబేరిపురాన్ని పరిపాలించే నిషాద రాజు గుహుడు. రాముడు గంగానదిని దాటటానికి ముందు గుహుడి దగ్గర ఆ రాత్రి గడిపి మర్నాడు గంగానదిని దాటి అడవిలోకి వెళ్లిపోయినట్లుగా వాల్మీకంలో ఉంది. గుహుడు తన నావలో రామలక్ష్మణులను గంగ దాటించి సాగనంపుతాడు అంతవరకే గుహుడి పాత్ర. కానీ రామచరిత మానస్‌లో మాత్రం రాముడిని విడిచిపెట్టలేక “నేనూ నీతో పాటు కొంత దూరం వస్తాను” అని అడుగుతాడు గుహుడు. రాముడు అంగీకరిస్తాడు. భరద్వాజ ఆశ్రమం దాకా వచ్చి తిరిగి వెళ్లిపోయినట్లు చెబుతాడు తులసీదాసు. మళ్ళీ భరతుడు వచ్చినప్పుడు అతడితో పాటు గుహుడు కూడా పంచవటి దాకా వచ్చినట్లు చెబుతాడు.

అయితే ఇక్కడ కొన్ని కల్పనలు చేశాడు తులసీదాసు. రాముడు అడవులకు వస్తున్న వార్త తెలిసి వాల్మీకి మహర్షి వచ్చి పరామర్శించి, మీరు కొంతకాలం చిత్రకూట పర్వతంపైన నివసించండి, అది మనోహరమైన ప్రదేశం, ఆశ్రమం నిర్మించుకోవటానికి అనుకూలమైనది అని చెప్పి వెళ్ళిపోతాడు. వాల్మీకంలో ఈ మాటలు భరద్వాజ మహర్షి చెబుతాడు. కధ ప్రారంభంలో, మళ్ళీ ఉత్తరకాండలో లవకుశులు జన్మించినప్పుడు మాత్రమే వాల్మీకి పాత్ర కనబడుతుంది. ఈ మధ్యలో ఆయన ప్రసక్తి ఉండదు.

అలాగే ఇంకొక సంఘటన కూడా తులసీదాసు కల్పించాడు. భరతుడు రాముడిని ఒప్పించి తిరిగి అయోధ్యకు రప్పించాలని బయలుదేరతాడు. ఈ సంగతి ఇంద్రుడికి తెలిసి భయపడిపోతాడు. రాముడు అంగీకరించి అయోధ్యకు తిరిగి వెళ్ళిపోతే రాక్షస సంహారం జరగటం ఎలా! అని అనుకుని మళ్ళీ సరస్వతీదేవిని ప్రార్థించి, భరతుడికి రామదర్శనం కాకుండా మాయ కలిగించమని అడుగుతాడు. అది విని సరస్వతీ దేవి “నీకు వెయ్యి కళ్ళు ఉన్నా గుడ్డివాడిలాగా ప్రవర్తిస్తున్నావు. రాముడు తండ్రికి ఇచ్చిన మాట తప్పేవాడు కాదు” అంటూ చివాట్లు పెడుతుంది. భరతుడు, రాణి వాసపు స్త్రీలు అందరూ రాముడి దగ్గర కొన్ని రోజులు ఆనందంగా గడుపుతారు. తర్వాత అయోధ్యకు వచ్చి సింహాసనం అధిష్టించమని అన్నను వేడుకోవటం, అయన అంగీకరించక పోవటం, రామ పాదుకలకు పట్టాభిషేకం చేయటం, తాను రామ ప్రతినిధిగా ఉండటం మొదలైన వన్నీ జరుగుతాయి.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here