నాదొక ఆకాశం-16

0
3

[సంచిక పాఠకుల కోసం ప్రసిద్ధ రచయిత, సినీ దర్శకులు డా. ప్రభాకర్ జైనీ అందిస్తున్న ధారావాహిక.]

[పోలీసుల ఆధ్వర్యంలో జరుగుతున్న రికార్డింగ్ సమయంలో సుధాకర్ నాయుడు నిగ్రహం కోల్పోయి ఏడుస్తే, సంజయ్ పరుగున వెళ్ళి ఆయన పట్టుకుని ఓదార్చి కంట్రోల్ చేసుకోమని చెప్తాడు. రికార్డింగ్ ఆపాలా అని టెక్నికల్ ఎక్స్‌పర్ట్‌కి సందేహం వస్తే, వద్దని సైగ చేస్తారు కమీషనర్. రెండు నిమిషాల తరువాత తేరుకున్న నాయుడు గారు తనకి కొడుకు సంజయ్ మీద ఎంత ప్రేముందో చెప్తారు. మీ అమ్మ ఏడ్చి దుఃఖభారాన్ని దింపుకుంది, నాకా అవకాశం లేకపోయింది అని సంజయ్‍తో చెప్తాడు. కమీషనర్ మేడమ్ వారించారు కనుక హత్యాప్రయత్నం చేసిన వాళ్ళని ఏమీ చేయకుండా వదిలేశానని అంటారు. లోకం అమ్మ ప్రేమనే గాని, తండ్రి ప్రేమని గుర్తించదని అంటారు. అక్కడున్న వాళ్ళంతా కన్నీరు తుడుచుకుంటారు. ఆయనలోని భావుకతకి, లాలిత్యానికి, సున్నితత్వానికి సమీర్ కూడా ఆశ్చర్యపోతాడు. సంజయ్‍తో పాటు సమీర్ కూడా వెళ్ళి ఆయన భుజం మీద చెయ్యి వేస్తాడు. ఆ క్షణంలో తన తండ్రిని తలచుకుంటాడు సమీర్. చివరగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమీషనర్ పుష్పా కిరణ్ మాట్లాడుతూ – సంజయ్ హత్యకి భారీ కుట్ర జరిగిందని, టోనీ తమ కస్టడీలోనే ఉన్నాడనీ, వసుధ కూడా తమ కనుసన్నలలోనే ఉందని, మొత్తం కుట్రకు సూత్రధారులను, మిగతా పాత్రధారులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పి, ఈ ఆడియో ద్వారా మాత్రమే కాకుండా తమ వద్ద ఉన్న మరిన్ని ఫిజికల్, కెమికల్, ఎలక్ట్రానిక్, బ్యాంకు రికార్డులు వంటి సాక్ష్యాధారాల దృష్ట్యా నేరస్థులకి కఠిన శిక్ష పడుతుందని చెప్పి ముగిస్తారు. సమీర్‍ని అనుమానించినందుకు సారీ చెప్పి, వసుధతో జాగ్రత్తగా ఉండమని చెప్పి, సమీర్ సినిమాలో వసుధ పార్ట్ షూటింగ్ పది రోజుల్లో ముగించమని చెప్పి వెళ్లిపోతారామె. సంజయ్ లోని ప్రశాంతతని, ముఖంలో వచ్చిన కాంతిని చూసి ఆశ్చర్యపోతాడు సమీర్. సంజయ్ తిరిగి రావడంతో ఇల్లంతా మహా సందడిగా ఉంటుంది. అభిమానుల తాకిడి కూడా ఎక్కువగానే ఉంటుంది. ప్రెస్ మీట్లు, పోలీసుల విచారణలు, టాలీవుడ్ ప్రముఖుల పరామర్శల మధ్య రోజులు చకచకా గడిచిపోతాయి. కొడుకుకు ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడన్న శుభవార్త వల్ల,  ‘ప్లేసిబో’ ఎఫెక్ట్ వల్ల కూడా సంధ్యారాణి గారి ఆరోగ్యం మెరుగైందని గురూజీ చెప్పారు.  మర్నాడు వసుధ సంజయ్ ఇంటికి వచ్చి నాయుడుగారికీ, సుధారాణి గారికీ పాదాభివందనం చేసి, ఇప్పుడు తాను హీరోయిన్ స్థాయిలో, వాళ్ళింట్లో ఉండడం సముచితంగా కాదనీ, పరిశ్రమలో పడని వారు కోడై కూస్తారని చెప్పి సెలవు తీసుకుంటుంది. వెళ్ళిపోతూ సమీర్‍తో నువ్వు కూడా బయటకు వచ్చేయ్, మనం పెళ్ళి చేసుకుని పిల్లల్ని కందాం అని అంటుంది. కానీ, తాను కూడా ఇప్పుడే బయటకొస్తే, మొదటికే మోసం వస్తుందనీ, సంజయ్ తిరిగి వచ్చాడు కాబట్టి, కొత్త సినిమాను తామిద్దరితో బదులు, సంజయ్‌తోనే తీస్తే, తమకు ఛాన్స్ మిస్సవుతుందనీ, తాను సంజయ్ పక్కనే ఉండి, పాచిక వేసి, ముందు తమ సినిమా, సెట్స్ మీదకు వచ్చే విధంగా ప్లాన్ చేస్తానని నమ్మబలుకుతాడు సమీర్. అతని మాటలు నిజంగానే నమ్మిందో లేదో గానీ, నమ్మినట్టు చూసి, మరోసారి కౌగిలించుకుని వెళ్ళిపోతుంది వసుధ. – ఇక చదవండి.]

[dropcap]సం[/dropcap]జయ్ ‘త్రిపుల్ యస్’ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. మూడు రోజుల్లోనే వంద కోట్ల గ్రాస్ కలెక్షన్లతో, బాహుబలి తరువాత నెక్స్ట్ బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఓవర్సీస్ రిపోర్టులు కూడా చాలా బాగున్నాయి. డబ్ చేసి పెట్టుకున్న సినిమాను, వెంటనే అన్ని భాషల్లో రిలీజ్ చేసారు. బాలీవుడ్ సంజయ్‌కి గులామయి సలాం కొట్టింది. డబ్బింగ్ పాటలు, డైలాగులే అయినా భారతదేశం, ప్రపంచం మొత్తం ‘త్రిపుల్ యస్’ మానియాతో ఊగిపోయింది. ఇంటర్నేషనల్ క్రికెటర్లు ఈ సినిమాలోని పాటలకు డ్యాన్సులు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. మేమ్స్ {memes} ఫేస్‌బుక్ ‘రీల్స్’లో వందల కొద్దీ పోస్ట్ అవుతున్నాయి.

ఇక నిర్మాత ఆఫీసులో, సంజయ్ ఇంట్లో ఆనందాలకు అంతే లేదు. ప్రతీ రోజూ సంబరాలే. ‘త్రక్ష’ వచ్చి సంజయ్‌కి కేక్ తినిపించి వెళ్ళింది. తను నాతో మాట్లాడలేదు. నా సినిమా ‘నాదొక ఆకాశం’లో తనకు హీరోయిన్ పాత్ర ఇప్పించలేదనీ, నా ప్రియురాలైన వసుధకి ఇప్పించానని అందరికీ చెపుతూ, నా మీద ‘త్రక్ష’ కక్ష సాధిస్తుంది.

సినిమా ప్యాన్ ఇండియా మూవీగా హిట్ అయింది. అందుకు సంజయ్ ‘కిడ్నాప్’ ఎపిసోడ్ కూడా బాగా హైప్ క్రియేట్ చేసింది. కొన్ని వెబ్‌సైట్లయితే, ‘అసలు కిడ్నాప్ లేదు. ఏం లేదు. పబ్లిసిటీ స్టంట్’ అని కొట్టిపారేసాయి.

అది కూడా ఒకందుకు మంచిదే అయింది. కుట్రదారులు రిలాక్స్ అయ్యారు. పోలీసులు, చాప కింద నీరులా తమ పని తాము చేసుకుంటూ వెళుతున్నారు.

ఒక రోజు నిర్మాత, డైరెక్టర్ సంజయ్ ఇంటికి వచ్చి, నాయుడు గారిని కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. తరువాత నిర్మాత తటపటాయిస్తుంటే, శ్రీవిక్రమ్,

“సార్! మీ దయ వల్ల, మీ ఆశీస్సుల మహిమ వల్ల, ఈ సినిమా, నా కెరీరులో హయ్యెస్ట్ గ్రాసరుగా నిలిచింది. నిర్మాతకు కూడా ఊహించనన్ని లాభాలు తెచ్చి పెట్టింది. అందుకని సత్యంగారు సంజయ్‌కి ఆ లాభాల్లో వాటా ఇవ్వాలనుకుంటున్నారు.” అన్నాడు. నిర్మాత నాయుడి గారి ముఖం వైపే ఆతృతగా చూస్తున్నాడు. మేమిద్దరం కూడా నాయుడి గారి స్పందన కోసం ఎదురు చూస్తుంటే, నాయుడు గారు నవ్వుతూ,

“అరే! డబ్బులు ఇస్తామంటే వద్దంటామా? మీ ఇష్టం. మీకు లాభాలు వచ్చినప్పుడు మీ హీరోలను మరిచిపోక పోవడమన్నది చాలా మంచి లక్షణం కదా!” అన్నాడు.

సుధాకర్ నాయుడు గారు, ‘హీరోలు’ అని బహువచనం వాడడంలోని అంతరార్థాన్ని నేను గ్రహించాను. ఆయన నన్ను దృష్టిలో పెట్టుకునే ఆ మాట అన్నారని అర్థమయింది.

సత్యం గారు బ్రీఫ్ కేసులో నుండి, యాభై కోట్లకు రాసిన చెక్కును సంజయ్‌కి ఇవ్వబోతే, సంజయ్ నాన్నగారికి ఇవ్వమన్నట్టుగా చూపించారు. నాయుడుగారు ఆ చెక్కును తీసుకోకుండా టీపాయ్ మీద పెట్టమని సూచించారు.

అందరం విస్తుపోయాము. శ్రీవిక్రమ్ పరిస్థితిని గమనించి, నిర్మాత చెవిలో ఏదో చెప్పాడు. సత్యం గారు బ్రీఫ్ కేసులో నుండి మరో చెక్కు తీసి, నా పేరు మీద ఐదు కోట్ల మొత్తానికి రాసి, సంతకం చేసి నాకివ్వబోతుంటే, నేను కూడా నాయుడి గారికే ఇవ్వమని చెప్పాను.

అప్పుడు నాయుడు గారు సంతోషంగా రెండు చెక్కులను తీసుకున్నారు.

అదే రోజు సంజయ్‌తో మరో సినిమాకు అగ్రిమెంట్ చేసుకుని మరో యాభై కోట్లకు అడ్వాన్స్ చెక్ ఇచ్చాడు. నాతో కూడా మరొక సినిమా తీస్తానని ప్రామిస్ చేసాడు. వాళ్ళు వెళ్తుంటే, నాయుడు గారు,

“మీకు తెలియడం లేదు గానీ, మా సమీర్ మీ సినిమాలో నటించడం వల్లే మీకీ అనూహ్య విజయం లభించింది. వాడిది గోల్డెన్ లెగ్! గుర్తు పెట్టుకోండి.” అని అన్నారు.

***

నా సినిమా ‘నాదొక ఆకాశం’ షూటింగ్ శరవేగంగా సాగుతుంది. రెండు మూడు రోజులు సంజయ్ రావడంతో కొంచెం భయపడ్డాను. వసుధ కూడా సంజయ్ ముందర ఫ్రీగా నటించలేక పోవడంతో, సంజయ్ షూటింగ్ స్పాట్‌కు రావడం మానేసాడు.

వసుధ చాలా సార్లు నన్ను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసింది.

కానీ, ‘మన సినిమా షూటింగు జరుగుతున్నప్పుడు ఎటువంటి పుకార్లకు ఆస్కారం ఇవ్వొద్ద’ని నమ్మబలికి తన బారి నుండి తప్పించుకున్నాను.

నాకు మరో రెండు చిన్న సినిమాల్లో అవకాశం వచ్చింది. సంజయ్ సంవత్సరానికి ఒక సినిమా మాత్రమే చేస్తానని చెప్పి, నిర్మాతలకు నా పేరు రికమెండ్ చేస్తుంటే, నేను కూడా, ఒక దాని తర్వాత మరొక సినిమా చేస్తానని చెప్పినా, వినకుండా నాయుడు అంకుల్‌, ఆంటీతో, చివరకు ఊళ్ళో ఉన్న మా అమ్మతో కూడా రికమెండేషన్లు చేయించసాగారు.

నాయుడు గారు నాకు చేసిన గొప్ప సహాయం, మా అమ్మను నాతోపాటు ఉండేందుకు ఒప్పించి హైదరాబాదుకు పిలిపించారు. అందుకు గాను సంజయ్ పేరు మీద మా ఊళ్ళో ఒక హాస్పిటల్ నిర్మిస్తానని ఒట్టు వేసేసరికి, తను అక్కడ ఉండడం కన్నా, తన వల్ల అక్కడ ఒక హాస్పిటల్ వస్తుంది కాబట్టి, అమ్మ సంతోషంగా ఒప్పుకుంది.

నాయుడు గారే, వాళ్ళింటికి దగ్గరలోనే, ఒక మంచి ఇల్లు చూసి, నా పేరు మీద కొన్నారు. మా అమ్మను తీసుకుని కొత్త ఇంట్లోకి అడుగు పెట్టాను.

***

నా సినిమా షూటింగుకు ఒక రోజున అమ్మను తీసుకు వెళ్ళాను. అమ్మ వసుధను చూసి,

“పిల్ల చిదిమి దీపం పెట్టుకునేంత అందంగా ఉంది.” అని మెచ్చుకుంది.

వసుధ కూడా అమ్మను ‘అత్తయ్యా’ అని పిలుస్తూ ప్రేమ కురిపించింది.

మరునాడే నా సినిమా షూటింగ్‌కు, ఈ కపట నాటకానికి తెర పడబోతుందని నాకు తెలుసు కాబట్టి నేను మౌనం వహించాను. నా మౌనం వెనుక సప్త సముద్రాలు ఉప్పొంగుతున్నాయి.

***

“కట్!” అన్నాడు డైరెక్టర్ శ్రీవిక్రమ్.

ఆ మాట వినగానే, నా అసిస్టెంట్ గొడుగు తెరిచి పట్టుకుని, అప్రమత్తంగా నిలబడ్డాడు. నా పీయ్యే కూడా సంసిద్ధంగా నిలబడ్డాడు. డైరెక్టర్ కట్ చెప్పగానే, నేను వసుధ కౌగిలిని విడిపించుకుని బయటకు వచ్చిన మరుక్షణం, బిలబిలమంటూ పోలీసులు వచ్చి వసుధను అరెస్ట్ చేసారు.

యూనిట్ అంతా విస్తుబోయి చూస్తూ నిలబడిపోయింది. పోలీస్ వ్యానులో ఎక్కుతూ వసుధ నా వైపు పాములా బుసలు కొడుతూ చూసింది. ఆ చూపులను నేను పట్టించుకోలేదు.

శ్రీవిక్రమ్ కూడా నిస్సహాయంగా చూస్తూ నిలబడిపోవడంతో వసుధ అతన్ని కూడా నమిలి మింగేటట్టుగా, గుర్రుగా చూస్తూ ఏమో అన్నది.

పోలీస్ వ్యాను వెళ్ళిపోతున్నంతలోనే, దూరంగా రివ్వాల్వర్ పేలిన చప్పుడు వినిపించింది. మరుక్షణంలో,

“డైరెక్టర్ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు.” అని ఎవరో అరిచారు.

“ఏ డైరెక్టర్?” అని మరెవరో ప్రశ్నించారు.

“ఏమో తెలియదు.” అని మరెవరో సమాధానం చెప్పారు. ఎందుకంటే రామోజీ ఫిల్మ్ సిటీలో ఐదారు సినిమాల షూటింగులు ఒకే సమయంలో, సైమల్టేనియస్‌గా జరుగుతుంటాయి.

కానీ, నాకు తెలుసు ఆ డైరెక్టర్ ఎవరో?

వ్యానిటీ వ్యానులోకి అడుగు పెట్టిన నా కళ్ళల్లో నీళ్ళు నిండాయి. నా మొదటి సినిమా హీరోయిన్ షూటింగ్ చివరి రోజునే అరెస్టయింది. నా డైరెక్టరు కూడా..

నా కోసం ఎదురు చూస్తున్న సంజయ్ నన్ను కౌగలించుకుని,

“కంగ్రాట్స్ రా! విజయవంతంగా పది రోజుల్లో మూడు షిఫ్టుల్లో పనిచేసి సినిమా షూటింగ్ పూర్తి చేసావు.” అన్నాడు.

నేను దూరంగా రామోజీ ఫిల్మ్ సిటీ గేటు వైపు వెళ్తున్న పోలీస్ వ్యానును, దానికి వ్యతిరేకదిశలో లోపలికొస్తున్న మరి కొంత మంది పోలీసులను చూస్తుంటే,

“అనవసరంగా బాధపడకు. వాళ్ళేం చేసారో తెల్సుగా..?” అన్నాడు.

నేను ఔనన్నట్లుగా తలూపాను.

***

యాభై సెంటర్లలో పది రోజుల పాటు హౌస్‌ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్న నా సినిమా ‘నాదొక ఆకాశం’ విజయోత్సవ సభకు, హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వెళ్ళిన మా అమ్మను తీసుకు రావడానికి సంజయ్ బహుకరించిన కొత్త ‘ఆడీ’ కారులో మా ఊరికి వెళ్తున్నాను.

మీరు కూడా తప్పక రండి!

బై!

(సమాప్తం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here