మరుగునపడ్డ మాణిక్యాలు – 60: న్యూటన్

0
3

[సంచిక పాఠకుల కోసం ‘న్యూటన్’ అనే సినిమాని విశ్లేషిస్తున్నారు పి.వి. సత్యనారాయణరాజు.]

[dropcap]దే[/dropcap]శంలో అప్పుడే ఎన్నికల హడావిడి మొదలయింది. జమిలి ఎన్నికలు పెట్టాలని ఒక కమిటీ కూడా వేశారు. ముందస్తు ఎన్నికలు వస్తాయని ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. జమిలి ఎన్నికలతో ఖర్చు తగ్గుతుంది. మంచిదే! మరి హంగ్ అసెంబ్లీ వస్తే ఏం చేయాలి, ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం కూలిపోతే ఏం చేయాలి అని తర్జనభర్జనలు జరుగుతున్నాయి. వీటికి పరిష్కారం ఉండకపోదు. కానీ కొన్ని ప్రాంతాల్లో ఎన్నికలకు అర్థం కూడా తెలియని వారున్నారు. ఇవి ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాలు. వారి సంఖ్య తక్కువని తీసిపారేయటం సరికాదు. వారి రాజ్యాంగ హక్కు గురించి వారికి అవగాహన కల్పించాలి. ఇప్పుడు ‘నోటా’ అనే ఆప్షన్ కూడా వచ్చింది. దాని గురించి ఎంతమందికి తెలుసు? ఇంకో పక్క నక్సలైట్లు ఎన్నికలని బహిష్కరించాలని ఆదివాసీలని బెదిరిస్తారు. ప్రభుత్వం పోలీసు బలగాల్ని నియమించి ఎన్నికలు జరిపిస్తుంది. కానీ ఇంత చేసినా ఎన్నికల సక్రమంగా జరుగుతాయా? ఇదే అంశాన్ని స్పృశిస్తూ వచ్చిన హిందీ చిత్రం ‘న్యూటన్’ (2017). పేరు వింతగా ఉంది కదా? పేరు చూసి మోసపోకండి. ఇది పక్కా భారతీయ చిత్రం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో లభ్యం.

చిత్రం మొదట్లో ఒక రాజకీయ నాయకుడు ఎన్నికల ప్రచారం చేస్తూ ఉంటాడు. ప్రచారం ముగించుకుని అడవి ప్రాంతం గుండా ఇంటికి వెళుతుంటే నక్సలైట్లు అతన్ని కాల్చి చంపేస్తారు. అది ఛత్తీస్‌గఢ్‌లో అడవి ప్రాంతం. ఆ సంఘటనతో ఆ ప్రాంతమంటే అందరికీ బెదురు పుడుతుంది. అక్కడుండే ఆదివాసీలకి మాత్రం ఇది రోజూ జరిగే వ్యవహారమే. న్యూటన్ కుమార్ ఒక కొత్త ప్రభుత్వోద్యోగి. అతని అసలు పేరు నూతన్ కుమార్. నూతన్ అనే పేరు ఉత్తరభారతంలో అమ్మాయిలకి పెడతారు. చిన్నప్పుడు అందరూ ఏడిపిస్తుంటే పదో తరగతి పరీక్ష అప్లికేషన్లో అతను తన పేరు న్యూటన్ కుమార్ అని రాస్తాడు. అదే స్థిరపడిపోతుంది. తర్వాత డిగ్రీ వరకు చదువుకుంటాడు. ఎన్నికల నిర్వహణకి అతను రిజర్వ్ అభ్యర్థి. అంటే ఏ పోలింగ్ కేంద్రంలో అయినా నిర్వహణ అధికారి అనివార్య కారణాల వల్ల వెళ్ళకపోతే ఈ రిజర్వ్ అభ్యర్థుల్లో నుంచి ఒకరిని అప్పటికప్పుడు పంపిస్తారు. మీరు ఊహించే ఉంటారు. ఎవరూ వెళ్ళనంటే అతన్ని అడవి ప్రాంతానికి పంపిస్తారని. అతను ఎన్నికల నిర్వహణ పై జరిగే శిక్షణ కార్యక్రమానికి వెళతాడు.

మన దేశంలో సాధారణ ఎన్నికల ఖర్చు ముప్ఫై వేల కోట్లు. శిక్షణలో శిక్షకుడు “పార్లమెంటుకి గుండాలు ఎంపీలుగా వెళ్ళినా పర్వాలేదు గానీ ఎన్నికల్లో గుండాయిజం జరగకుండా చూడటం మన పని” అంటాడు. ఈ మాట ఒక్కసారి ఆలోచించండి. ఎంతమంది నేరచరితులు పార్లమెంట్లో ఉన్నారు? వారంతా ఎలా ఎన్నికవుతున్నారు? ధనబలంతోనే కదా? సంస్కరించవలసింది ఇదా లేక ఎన్నికలు ఎలా జరపాలి అనే సాంకేతిక విషయమా? జమిలి ఎన్నికల ద్వారా ఎన్నికల్లో ధనబలం ప్రాధాన్యం తగ్గించగలమా? కొంతవరకు తగ్గించవచ్చేమో! అయినా ప్రజలు అప్పనంగా వచ్చిన డబ్బులకి ఆశపడే వరకు అది పూర్తిగా తగ్గదు. అందరూ అందరే. ఈ విషయం అందరూ ఆలోచించాలి. శిక్షణలో ఒకతను “పోలింగ్ కేంద్రం మీద నక్సలైట్లు దాడి చేస్తే?” అని అడుగుతాడు. శిక్షకుడు “మీరు హీరో అవ్వాలని ప్రయత్నించకండి. వాళ్ళు ఏమి అడిగితే అది ఇచ్చేయండి. ఈవీఎం అడిగినా ఇచ్చేయండి. అక్కడి ఎన్నికల్ని రద్దు చేసి మళ్ళీ ఎన్నికలు పెడతాం” అంటాడు. ఒకతను “మళ్ళీ ఎన్నికలు పెట్టినపుడు కూడా దాడి చేస్తే?” అని అడుగుతాడు. శిక్షకుడు “మళ్ళీ ఎన్నికలు పెడతాం” అంటాడు. న్యూటన్ ప్రశ్న అడగాలని చేయి ఎత్తుతాడు. అతనేదో తెలివైన ప్రశ్న అడుగుతాడని మనం అనుకుంటాం. అతను “మూడో ఎన్నికల్లో కూడా దాడి చేస్తే?” అని అడుగుతాడు. శిక్షకుడు “రెండు తర్వాత మూడు, మూడు తర్వాత నాలుగు, నాలుగు తర్వాత? అర్థమయింది కదా? కూర్చోండి” అంటాడు. అందరూ నవ్వుతారు. న్యూటన్ అడిగినది తెలివి తక్కువ ప్రశ్న అని అనిపించవచ్చు. కానీ అతని ఉద్దేశం ఏమిటంటే మూలం లోకి వెళ్ళి పరిష్కారం వెతకాలి కానీ ఇలా పై పై పరిష్కారాలు ఎంత కాలం? తర్వాత న్యూటన్ శిక్షకుడితో మాట్లాడతాడు. శిక్షకుడు అతని పేరు తెలుసుకుని “న్యూటన్ ప్రపంచాన్ని మార్చేశాడంటారే! అది ఎలాగంటే ప్రకృతి ఎదుట అందరూ ఒకటే అని నిరూపించాడు. రాజైనా పేదైనా ప్రకృతి ముందు ఒకటే. కొండ మీద నుంచి పడితే ఇద్దరూ పోతారు” అంటాడు. న్యూటన్ ఎక్కడ పని చేస్తాడో అడుగుతాడు. న్యూటన్ “కలెక్టరాఫీసులో పనిచేస్తున్నాను. అఫీసులో అందరూ లంచాలు తీసుకుంటారు. నాకు ఇష్టం లేదు” అంటాడు. “నీకు నిజాయితీపరుడినని అహంకారం. నిజాయితీగా ఉండటం ఘనకార్యం కాదు. నిజాయితీగా పనిచేస్తూ పో” అంటాడు శిక్షకుడు. శిక్షకుడి పాత్రలో సంజయ్ మిశ్రా చక్కగా నటించాడు. యుద్ధరంగంలోకి వెళ్ళే న్యూటన్‌కి గీతోపదేశం చేసిన కృష్ణుడిలా ఉంటుందీ పాత్ర. అయితే ఆనాడు అర్జునుడు మమకారంతో యుద్ధం మానేస్తానన్నాడు. ఇప్పుడు న్యూటన్ అహంకారంతో నేనొక్కడినే యుద్ధం చేయాలి అనుకున్నాడు. శిక్షకుడు ‘ఒక్కడివే అయితే ఏంటి? నీ పని నువ్వు చెయ్యి’ అంటాడు.

ఎన్నికల ముందురోజు న్యూటన్‌ని, మరో ఇద్దరు ఉద్యోగుల్ని హెలికాప్టర్లో అడవి ప్రాంతంలో దింపుతారు. న్యూటన్ ఎన్నికల నిర్వహణ అధికారి. అందరూ అతని మాట వినాలి. పోలింగ్ కేంద్రం పరిధిలో సీఆర్పీఎఫ్ బలగాలు, వారి అధికారి కూడా అతని మాటే వినాలి. సీఆర్పీఎఫ్ జవాన్లు ఎన్నికల ఉద్యోగుల్ని జీపులో పోలింగ్ కేంద్రానికి కొంత దూరంలో ఉన్న గుడారానికి తీసుకువెళతారు. “ఈ జిల్లాలో గత ఎన్నికల్లో ముప్ఫై మంది చనిపోయారు. ఈ పోలింగ్ కేంద్రం కొత్తగా పెట్టారు. ఇక్కడ ఎంతమంది పోతారో రేపు సాయంత్రం తెలుస్తుంది” అంటాడు జీపులో ప్రయాణం చేసే జవాను. వీరికి నవ్వాలో ఏడవాలో తెలియదు. ఆ జవాను “కాస్త దూరంలో ఒక నది ఉంది. నది దాటితే పాకిస్తానే. అంటే నక్సలైట్ల ప్రాంతం. ఇటు వైపు కూడా మందుపాతరలు పెడుతూ ఉంటారు. జాగ్రత్త” అంటాడు. నక్సలైట్లు అంటే ఎవరు? మన దేశం వారే. సీఆర్పీఎఫ్ వాళ్ళు ఇలా వారిని పరాయి దేశం వారితో సమానంగా చూస్తున్నారంటే అర్థమేమిటి? వారి అధికారులు వారికి అలాంటి భావన కలిగించారు. వారికి రాజకీయ నాయకులు ఆ భావన కలిగించారు. ఇది ఎంత ఘోరం! నక్సలైట్ల మార్గం తప్పే కావచ్చు. కానీ వారు శత్రువులు కాదు. వారిని శత్రువులుగా చూసే ధోరణి మారాలి.

న్యూటన్‌తో వచ్చిన ఉద్యోగుల్లో ఒకతను లోకనాథ్. యాభై ఏళ్ళుంటాయి. కథలు రాస్తుంటాడు. జాంబీల గురించి ఒక కథ రాస్తున్నానని చెబుతాడు. ఇంకొకతను శంభు. ముప్ఫై ఏళ్ళుంటాయి. ఈ అడవి ప్రాంతానికి రావటానికి ఎందుకు ఒప్పుకున్నావని ఎవరో అడిగితే శంభు “నేను హెలికాప్టర్ ఎక్కాలని ఆశపడ్డాను” అంటాడు. ఒక్కొక్కరిదీ ఒక్కో సరదా. ఎన్నికల రోజు తెల్లవారుఝామునే అందరూ సిధ్ధమవుతారు. సీఆర్పీఎఫ్ అధికారి ఆత్మాసింగ్ వస్తాడు. యూనిఫార్మ్ కూడా ఉండదు. బనియన్లో ఉంటాడు. “మీరిక్కడే ఉండండి. మావాళ్ళు వెళ్ళి ఓటింగ్ చేయించుకుని వస్తారు” అంటాడు. న్యూటన్ ఒప్పుకోడు. “ఇక్కడ 76 మంది ఓటర్లు ఉన్నారు. వారి ఓట్లు ఎంతో ముఖ్యమైనవి” అంటాడు. ఆత్మాసింగ్ “వీళ్ళు చదువురాని మొద్దులు. పైగా నక్సలైట్లు ఎన్నికల్ని బహిష్కరించమన్నారు. ఎవరూ ఓటు వేయటానికి రారు. కావాలంటే రాసిస్తాను” అంటాడు. “అయితే రాసివ్వండి” అని కాయితం ఇవ్వబోతాడు న్యూటన్. ఆత్మాసింగ్ నివ్వెరపోతాడు. ఇక తప్పదని వారికి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ఇచ్చాక అందరూ బయల్దేరతారు. మల్కో అనే ఆదివాసీ యువతి బూత్ లెవెల్ ఆఫీసర్‌గా వస్తుంది. ఆమె ఒక టీచర్. ఆమెకి కూడా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఇవ్వబోతే ఆమె వద్దంటుంది. “నేను ఆదివాసీని. ఈ జాకెట్ వేసుకుంటేనే నాకు ఎక్కువ ప్రమాదం” అంటుంది. అంటే ఆదివాసీలు సీఆర్పీఎఫ్‌తో కలిశారని తెలిస్తే వారికి నక్సలైట్ల నుంచి ప్రమాదం.

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలు గోండీ భాష మాట్లాడతారు. యువతీయువకులు హిందీ కూడా మాట్లాడతారు కానీ పెద్ద వయసు వాళ్ళకి హిందీ రాదు. సీఆర్పీఎఫ్‌కి సహాయంగా ఒక ఆదివాసీ ఉంటాడు. అతను దుబాసీగా పని చేస్తుంటాడు. న్యూటన్‌కి, అతని ముగ్గురు సహోద్యోగులకి రక్షణ వలయంగా సీఆర్పీఎఫ్ బలగాలు ఏర్పడి, అందరూ కలిసి పోలింగ్ బూత్‌కి బయల్దేరతారు. ఎనిమిది కిలోమీటర్ల దూరం. అంతా అడవి. నడిచే వెళ్ళాలి. వెళ్ళే దారిలో కొందరు ఆదివాసీలు కనబడతారు. వాళ్ళు యువతీయువకులు. వాళ్ళు పని చేసుకోవటానికి వెళుతుంటారు. ఆత్మాసింగ్ వారి ఓట్లు అక్కడే వేయించుకోమంటాడు. ఓటర్ కార్డులు లేకుండా వేయించుకోనని అంటాడు న్యూటన్. ఆత్మాసింగ్‌కి తతంగం అయిందనిపించాలి అంతే. కానీ న్యూటన్ నిబంధనలు ఉల్లంఘించడు. ఆ ఆదివాసీలని ఓటరు కార్డులు తీసుకుని పోలింగ్ బూత్‌కి వచ్చి పోలింగ్ చేయమని హిందీలో చెబుతాడు. వాళ్ళు సరేనంటారు. సీఆర్పీఎఫ్ సహాయకుడు గోండీ భాషలో పదకొండున్నరకి పోలింగ్ ముగుస్తుందని చెబుతాడు. మల్కో అది విని న్యూటన్‌కి చెబుతుంది. పోలింగ్ ముగిసేది మూడు గంటలకి. అదే మాట మల్కో చేత గోండీ భాషలో చెప్పిస్తాడు న్యూటన్. ఆత్మాసింగ్ తన బలగాల రక్షణ కోసం పోలింగ్ సమయం తప్పు చెప్పిస్తాడు. అతనిదే తప్పు అనటానికి లేదు. బలగాలకి కావలసిన రక్షణ సామగ్రి లేకపోవటం వల్ల అతను ఇలా పక్కదారులు వెతుకుతున్నాడు. సామగ్రి కోసం ప్రభుత్వాన్ని అడిగితే వాళ్ళు తాత్సారం చేస్తారు. తిలాపాపం తలా పిడికెడు.

ఆత్మాసింగ్‌కి తన మాట కాదన్నాడని న్యూటన్ మీద గుర్రుగా ఉంటుంది. “మీరెప్పుడైనా క్రికెట్ ఆడారా?” అని అడుగుతాడు. ఆడానంటాడు న్యూటన్. “బ్యాట్స్‌మనా? బౌలరా?” అంటాడు ఆత్మా. “అంపైర్” అంటాడు న్యూటన్! “అనుకున్నాను” అంటాడు ఆత్మా. మనకి కిసుక్కున నవ్వొస్తుంది. ఆత్మా “మీరు కేవలం పుస్తక పరిజ్ఞానంతో ఏదో ఊడబొడిచేస్తున్నానని అనుకుంటున్నారు. నేను కశ్మీర్, మణిపూర్ లాంటి చోట్ల పని చేసి వచ్చాను. ఈ దేశరక్షణ బాధ్యత మా భుజాలపై ఉంది” అంటాడు. న్యూటన్ ఆత్మాసింగ్‌తో మాటిమాటికీ తలపడుతుండటంతో లోకనాథ్ అతని దగ్గరకి వచ్చి “మీకు మంత్రిగారు ఎవరైనా చుట్టమా? లేక పెద్ద తలకాయ ఎవరన్నా మీ వెనక ఉన్నారా? లేకపోతే పోలీసువాళ్లతో ఇలా గొడవ పెట్టుకోరు” అంటాడు. ఇది విని మల్కో నవ్వుకుంటుంది. చివరికి పోలింగ్ కేంద్రానికి చేరుకుంటారు. అదొక చిన్న ఊరు. అయితే ఇళ్ళన్నీ తగలబడి ఉంటాయి. అక్కడొక చిన్న స్కూలే పోలింగ్ కేంద్రం. న్యూటన్ ఆత్మాని “ఈ ఇళ్ళెవరు తగలబెట్టారు?” అని అడుగుతాడు. ఆత్మా సూటిగా జవాబు చెప్పకుండా “ఇక్కడి వాళ్ళందరూ క్యాంపుల్లో సురక్షితంగా ఉన్నారు” అంటాడు. స్కూలు పరిస్థితి చూస్తే అక్కడ పోలింగ్ చేయించటం కష్టం అనిపిస్తుంది న్యూటన్. ఆత్మా “నేను ముందే చెప్పాను. టీ తాగి తిరిగి వెళ్ళిపోదాం” అంటాడు. మల్కో “నిర్వహణ అధికారి ఎక్కడైనా పోలింగ్ చేయించవచ్చు అని నియమావళిలో ఉంది కదా. అయినా ఇక్కడ ఎన్నికల గురించి శ్రద్ధ ఎవరికుంది?” అంటుంది నిర్వేదంగా. న్యూటన్ ఆలోచనలో పడతాడు. స్కూల్ వెనక గోడల మీద నక్సలైట్లు రాసిన విప్లవ సందేశాలు ఉంటాయి. వాటి గురించి న్యూటన్ అడిగితే “ఊరు తగలబెడితే కోపం రాదా?” అంటుంది మల్కో. అంటే సీఆర్పీఎఫ్ వాళ్ళే ఇళ్ళు తగలబెట్టారన్నమాట. దానికి కారణం ఏదైనా కావచ్చు. కానీ అది మాత్రం తప్పే. ఇదంతా చూసి న్యూటన్‌కి పట్టుదల పెరుగుతుంది. పోలింగ్ చేయించాలని నిశ్చయించుకుంటాడు.

నిజాయితీగా పని చేసేవాడిని చూసి నీకు తిక్క అనో, నీకు మొండి ధైర్యం అనో అంటారు. ఉదాసీనంగా ఉండటమే ఈరోజుల్లో ఆనవాయితీ. నేనొక్కడినే మారితే ఏం లాభం అనే ధోరణే కనిపిస్తుంది. కలియుగంలో ఇంతే అని మన ఋషులు ఎప్పుడో చెప్పారు. అయితే నిజాయితీగా ఉంటే మనసు తేలిగ్గా ఉంటుంది. ఒకవేళ ప్రాణం మీదికొస్తే అప్పుడు ఉద్యోగమైనా వదులుకోవాలి కానీ అక్రమాలకి పాల్పడకూడదు. నేను కాకపోతే ఇంకొకడు నా పదవిలోకి వచ్చి అక్రమాలు చేస్తాడు అనే వాదన తప్పు. సీఆర్పీఎఫ్ వాళ్ళు ఊరు తగలబెట్టడం దారుణం. ఆ ప్రాంతాన్ని అధీనంలోకి తీసుకోవటానికి వారు ఆ పని చేశారు. మూలాల్లోకి వెళ్ళకుండా ఇలాంటి చర్యలకి పాల్పడితే సమస్య ఇంకా జటిలమవుతుంది. అంత విజ్ఞత ఎవరికుంది?

న్యూటన్‌గా రాజ్ కుమార్ రావు నటించాడు. చిన్న మేనరిజాల దగ్గర నుంచి పాత్ర మీద శ్రద్ధ పెట్టి నటించాడు. రెప్ప వేసేటపుడు కొంత మంది ఎక్కువ సేపు రెప్పలు మూసి పెడతారు. ఇది ఆందోళన కలిగినపుడు ఎక్కువ కనిపిస్తుంది. ఈ మేనరిజాన్ని న్యూటన్ పాత్రకి పెట్టారు. ఆత్మాసింగ్‌గా పంకజ్ త్రిపాఠీ నటించాడు. పాత్రని బాగా ఆకళింపు చేసుకుని నటించాడు. జాతీయ అవార్డులలో ప్రత్యేక జ్యూరీ అవార్డు అందుకున్నాడు. తర్వాత ‘మీర్జాపూర్’ సీరీస్ ద్వారా ఖ్యాతి సంపాదించాడు. మల్కో గా అంజలి పాటిల్ నటించింది. ‘నా బంగారు తల్లి’ చిత్రం ద్వారా ఈమె తెలుగు ప్రేక్షకులకి పరిచయమే. లోకనాథ్‌గా సీనియర్ నటుడు రఘువీర్ యాదవ్ నటించాడు. ‘ఈ వ్యవస్థ ఇంతే’ అనే విరక్తి గల పాత్ర ఇది. అలవోకగా నటించాడు. అమిత్ మాసుర్కర్, మయాంక్ తివారీ స్క్రీన్ ప్లే వ్రాశారు. అమిత్ మాసుర్కర్ దర్శకత్వం వహించాడు. న్యూటన్ పెళ్ళిచూపులకి వెళ్ళే చిన్న ఉపకథ కూడా చిత్రంలో ఉంది. దేశంలో ఇంకా చాలా విషయాల్లో అవగాహనాలోపం ఉందని ఇది నిరూపిస్తుంది. ఇలాంటి చిత్రాలు చూసి ఒక్కరు మారినా మంచిదే. కానీ ఇలాంటి చిత్రాలు చూసేవారే తక్కువ. మారటం సంగతి దేవుడెరుగు. ఈ చిత్రాన్ని 2017లో విదేశీ చిత్రం ఆస్కార్ అవార్డ్ పోటీకి భారత ప్రభుత్వం ఎంపిక చేసింది. ఉత్తమ హిందీ చిత్రంగా జాతీయ అవార్డు ఇచ్చింది.

ఈ క్రింద చిత్రకథ మరికొంచెం ప్రస్తావించబడింది. చిత్రం చూడాలనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు. చిత్రం చూసిన తర్వాత ఈ క్రింది విశ్లేషణ చదవవచ్చు. ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించలేదు. ముగింపు ప్రస్తావించే ముందు మరో హెచ్చరిక ఉంటుంది.

ఎంత సేపైనా ఓటు వేయటానికి ఎవరూ రారు. ఇంతలో విదేశీ పాత్రికేయురాలు పోలింగ్ మీద రిపోర్టింగ్ చేయటానికి వస్తోందని డీఐజీ నుంచి సందేశం వస్తుంది. పోలింగ్ బాగా జరుగుతోందని ఆమెకి చూపించాలి అని ఆదేశం. సీఆర్పీఎఫ్ బలగాలు దగ్గర్లో ఉన్న ఊరికి వెళ్ళి అక్కడున్న ముసలివాళ్ళని బలవంతంగా తీసుకువస్తారు. ఊరిలోని యువతీయువకులు పనికి వెళ్ళారు. ముసలివాళ్ళకి ఎన్నికలంటే సరైన అవగాహన లేదు. ఓటరు కార్డులు మాత్రం పట్టుకు వస్తారు. ఈవీఎంని చూసి ఏం చేయాలో తెలియక తికమక పడతారు. న్యూటన్‌కి పరిస్థితి అర్థం అవుతుంది. ఓటర్లందరినీ బయట కూర్చోబెట్టి ఎన్నికలు అంటే ఏమిటో చెబుతాడు. మల్కో అభ్యర్థుల జాబితా చదువుతుంది. వారి పార్టీ పేర్లు కూడా చదువుతుంది. “మీరు ఎన్నుకున్నవారు దిల్లీకి వెళ్ళి మీకోసం పని చేస్తారు” అంటాడు న్యూటన్. “నేనే దిల్లీ వెళతాను” అంటాడు ఊరి పెద్ద! ఆ అభ్యర్థుల పేర్లు వారెవరూ అంతకు ముందు వినలేదు. ఈ తతంగమంతా చూసి ఆత్మా ఓటర్లతో “ఈ సార్లు కష్టపడి ఇక్కడికి వచ్చారు. మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. ఈవీఎం మీద బొమ్మలుంటాయి. మీకు ఇష్టమైన బొమ్మ పక్కన మీట నొక్కండి. అంతే” అంటాడు. న్యూటన్ అభ్యంతరం చెప్పినా లాభం ఉండదు. అందరూ ఓటింగ్ చేస్తారు. ఎవరికి ఓటు వేస్తున్నారో తెలియకుండానే ఓటు వేస్తారు. విదేశీ పాత్రికేయురాలు వచ్చి చూసి భారత ప్రజాస్వామ్యం ఎంతో ప్రభావవంతమైనదని రిపోర్టింగ్ చేస్తుంది. డీఐజీకి న్యూటన్ ఫిర్యాదు చెయ్యబోతే “హింస జరిగిందా? బూత్ క్యాప్చరింగ్ జరిగిందా? రిగ్గింగ్ జరిగిందా? లేదు కదా” అని నవ్వేసి వెళ్ళిపోతాడు. ఆత్మా ‘నువ్వెక్కడ దొరికావురా బాబూ’ అన్నట్టు చూస్తాడు న్యూటన్‌ని. లోకనాథ్ కూడా న్యూటన్ మీద చిరాకు పడతాడు. “అంతా నియమావళి ప్రకారం జరిగింది కదా. మీ పాఠాలు ఆపండి” అంటాడు. మల్కో కూడా “మీరింత చదువుకున్నారు. ఓ మాట చెప్పనా? ఎప్పటి నుంచో ఇలాగే జరుగుతోంది. ఏదీ ఒక్కరోజులో మారదు” అంటుంది.

ఎన్నికలంటే తెలియని వారికి సరైన అవగాహన కల్పించాలనే ఉద్దేశం ఎవరికీ లేదు. ఆదివాసీ ప్రాంతాల పట్ల ఉదాసీనత ఒక పక్క, నక్సలైట్లంటే భయం మరో పక్క. తప్పుడు పధ్ధతిలో ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాలు ఎన్ని ఉన్నాయో! రిగ్గింగ్ మాత్రమే సమస్య కాదు. ఎన్నో సమస్యలున్నాయి. వాటిని పరిష్కరించాలి. అసలు ఎంపీలకి, ఎమ్మెల్యేలకి ఎక్కువ ప్రాబల్యం ఎందుకుండాలి? సర్పంచులకే పాబల్యం ఉండాలి. నిధులు వారి చేతికే నేరుగా వెళ్ళాలి. ఆదివాసీ ఊరి పెద్ద అన్నట్టు పెత్తనం అతనికే ఇవ్వాలి. ఎక్కడికక్కడ పాలనా కేంద్రాలు ఉంటే దేశం సమృద్ధిగా ఉంటుంది. మొత్తం అధికారమంతా ఒకేచోట ఉంటే అవినీతి పెరుగుతుంది. చూస్తూనే ఉన్నాం. వికేంద్రీకరణ జరిగితే అవినీతి జరిగినా తక్కువ స్థాయిలో ఉంటుంది. తేడా వస్తే ఊరి ప్రజలే నిలదీస్తారు. గాంధీజీ కోరుకున్నది గ్రామస్వరాజ్యం ఇదే. ఇది పట్టించుకోకుండా ఎన్నికల ఖర్చు తగ్గిస్తాం అంటే ఉపయోగమేమిటి? అయితే న్యూటన్ లాంటివారు ఓపిక పట్టాలి. కష్టపడి పనిచేయాలి. అధికారులుగా మారి పరివర్తన తీసుకురావాలి. మల్కో అన్నట్టు ఏదీ ఒక్కరోజులో మారదు.

ఈ క్రింద చిత్రం ముగింపు ప్రస్తావించబడింది. తెలుసుకోకూడదనుకునేవారు ఇక్కడ చదవటం ఆపేయగలరు.

అందరూ భోజనానికి వెళితే న్యూటన్ మాత్రం నిస్పృహతో కూర్చుని ఉండిపోతాడు. మిగతా వాళ్ళందరూ భోజనం చేస్తారు. ఆత్మా న్యూటన్‌కి భోజనం పట్టుకొస్తాడు. ఇంతలో కాల్పులు మొదలవుతాయి. ఆత్మా ఎన్నికల సిబ్బందిని సామాను సర్దుకుని త్వరగా బయల్దేరమని చెబుతాడు. అందరూ సీఆర్పీఎఫ్ రక్షణలో బయల్దేరతారు. మల్కో ఊరు దాటాక తన ఊరికి వెళ్ళిపోతుంది. వెళ్ళే ముందు న్యూటన్‌తో “మీ మేధని ఉపయోగించండి” అని చెబుతుంది. న్యూటన్ ఆలోచనలో పడతాడు. లోకనాథ్‌తో “పోలింగ్ కేంద్రానికి వెళ్ళొద్దని అన్నారు. వెళ్ళాం. టీ తాగి బయల్దేరండి అన్నారు. తర్వాత భోజనం చేసి బయల్దేరండి అన్నారు. భోజనాలు అవ్వగానే దాడి జరిగింది. ఈ కథ బావుంది కదా. మీరు రాయండి” అంటాడు. మొదట్లో జీపులో వచ్చిన జవాను ఈ మాటలు విన్నా విననట్టుంటాడు. న్యూటన్ ఆ జవానుతో “దాడి జరిగినా మీ వాకీ టాకీలో సమాచారం ఏమీ రావట్లేదు. అక్కడ పరిస్థితి ఎలా ఉందో?” అంటాడు. జవాను వాకీ టాకీ ఆన్ చేస్తాడు. అందులో భోజనాల కబుర్లే వినపడతాయి. అంటే నిజంగా దాడి జరగలేదు. జరిగినట్టు కాల్పులు చేసింది సీఆర్పీఎఫ్ వాళ్ళే. ఇది మల్కోకి అర్థమయింది. న్యూటన్‌కి ఇప్పుడు అర్థమై ఈవీఎం తీసుకుని వెనక్కి పరుగెడతాడు. అతన్ని వెంబడిస్తారు జవాన్లు. ఆత్మాకి విషయం తెలిసి అక్కడికి వచ్చి న్యూటన్‌ని నేలపై పడేసి తొక్కిపెడతాడు. న్యూటన్ కదలలేక వారికి లొంగిపోతాడు. అతను మళ్ళీ పారిపోకుండా ఇద్దరు జవాన్లు చెరోవైపు పట్టుకుని అతన్ని వెనక్కి తీసుకువెళతారు. దారిలో ఉన్న లోకనాథ్, శంభు అతని పరిస్థితి చూసి ఒక్క క్షణం అవాక్కయి ఉండిపోతారు. అందరూ కలిసి గుడారం వైపు నడక సాగిస్తారు.

దారిలో నలుగురు యువతీయువకులు కనపడతారు. ఓటింగ్ చేయటానికి వెళుతున్నట్టు చెబుతారు. ఆత్మా “ఓటింగూ లేదు ఏమీ లేదు వెళ్ళండి” అంటాడు. ఇది నాకు కొంచెం అసంబద్ధంగా అనిపించింది. ఓటరు కార్డు, ఈవీఎం ఉంటే ఎక్కడైనా ఓటింగ్ చేయించవచ్చు. ఆత్మా ఆ నలుగురి ఓట్లు వేయించుకోమని చెబితే సరిపోయేది. కానీ అతని ఆత్మాభిమానం మీద అప్పటికే న్యూటన్ దెబ్బ తీశాడు. అందుకు అతను కసి మీద ఉన్నాడనుకోవచ్చు. ఓటర్లని వెళ్ళిపొమ్మనే సరికి న్యూటన్ అభ్యంతరం చెబుతాడు. ఆత్మా ససేమిరా అంటాడు. న్యూటన్ హఠాత్తుగా ఆత్మా తుపాకీ లాక్కుని అతని మీదే గురిపెడతాడు. ఈ పరిణామంతో ఆత్మా ఖంగు తింటాడు. జవాన్లందరినీ తుపాకీలు కింద పెట్టమంటాడు న్యూటన్. ఆత్మా ఆదేశంతో జవాన్లు తుపాకీలు కింద పెడతారు. “ఎవరికి ఓటెయ్యాలో తెలుసా?” అని ఓటర్లని అడుగుతాడు న్యూటన్. తెలుసంటారు వారు. న్యూటన్ చెప్పటంతో లోకనాథ్ ఓటరు కార్డులు పరిశీలించి ఓటింగ్ చేయిస్తాడు. మూడు గంటలు కొట్టటానికి ఇంకా రెండు నిమిషాలు టైముందని న్యూటన్ తుపాకీ అలాగే పట్టుకుని ఉంటాడు. ఇంకా ఎవరైనా ఓటింగ్ చేయటానికి వస్తారని అతని ఆలోచన. మూడు గంటలు కొట్టగానే తుపాకీ కింద పెట్టేస్తాడు. ఆత్మాతో సహా జవాన్లందరూ అతని మీద పడి పిడిగుద్దులు కురిపిస్తారు. ఆర్నెల్ల తర్వాత మల్కో కలెక్టరాఫీసులో అతన్ని కలుసుకోవటానికి వస్తుంది. అతని మెడకి పట్టీ కట్టి ఉంటుంది. అంటే గాయాలు ఇంకా మానలేదు. ఎన్నికల రోజు తాను వెళ్ళిన తర్వాత అంతా సవ్యంగానే గమ్యం చేరారా అని మల్కో అడుగుతుంది. ఐదు నిమిషాల్లో భోజన విరామం ఉందని, అప్పుడు చెబుతానని న్యూటన్ పనిలో పడతాడు.

తన బాధ్యత సక్రమంగా చేసింది న్యూటన్ ఒక్కడే. దానికి అతనికి దేహశుద్ధి కూడా జరిగింది. అయినా అతను కుంగిపోలేదు. విచిత్రమేమిటంటే కథలో నక్సలైట్లు అసలు రాలేదు. గొడవంతా సీఆర్పీఎఫ్, న్యూటన్ మధ్యే. నిజానికి ఇరువురూ ఒకే పక్షాన ఉన్నారు. ప్రభుత్వ పక్షం. అయినా గొడవ తప్పలేదు. ఒకే పక్షాన ఉన్నా సిద్ధాంతాలు వేరు. ఆంగ్లంలో ఒక నానుడి ఉంది – “Who needs enemies when you have friends like this?” మిత్రులే ఇలాంటి వారైతే ఇక శత్రువులతో పనేంటి? మన ప్రజాస్వామ్యంలో ఎంతో డొల్లతనం ఉంది. ఉదాహరణకి అభ్యర్థి గెలుపు ఎలా నిర్ణయిస్తారో చూడండి. ముగ్గురు అభ్యర్థులు ఉన్నారనుకుందాం. మొదటి అభ్యర్థికి నలభై శాతం, రెండో అభ్యర్థికి ముప్ఫై ఐదు శాతం, మూడో అభర్థికి ఇరవై ఐదు శాతం ఓట్లు వచ్చాయనుకుందాం. ఎవరు గెలిచారు? మొదటి అభ్యర్థి. అతనికి వ్యతిరేకంగా అరవై శాతం మంది ఓట్లు వేశారు. అయినా అతనిదే గెలుపు! తర్కంతో ఆలోచిస్తే ఇది తప్పనిపిస్తుంది. మరి ప్రత్యామ్నాయం ఏమిటి? అమెరికా లాంటి దేశాల్లో రెండే పార్టీలు ఉంటాయి కాబట్టి గొడవ లేదు. కొన్ని దేశాల్లో దేశవ్యాప్తంగా పోలయిన మొత్తం ఓట్ల నిష్పత్తి ప్రకారం ఒక్కో పార్టీకి పార్లమెంటు సీట్లు ఇస్తారు. ఇది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ఇంకా ఎన్నో సమస్యలున్నాయి. రాజకీయం మారనంత వరకు ఈ సమస్యలు తీరవు. న్యూటన్ లాంటి వాళ్ళు పోరాడుతూనే ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here