[శ్రీమతి వావిలికొలను రాజ్యలక్ష్మి రచించిన ‘మళ్ళీ పెళ్ళి’ అనే కథని అందిస్తున్నాము.]
[dropcap]ప్ర[/dropcap]భాకర్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడన్న ఆ శుభవార్త అతని బంధువర్గంలోని చాలా కుటుంబాల్లోనే కాక, ఆ ఊళ్ళో ఉన్న అతన్ని తెలిసిన వాళ్ళు, ఆఫీస్ లోని స్నేహితులు, ఇరుగు పొరుగు వాళ్ళలో కూడా ఎంతో సంచలనాన్ని కలుగు చేసింది.
“ఇదేమిటి వదినా! భార్య చనిపోయిన ఇన్ని సంవత్సరాలకు ఇప్పుడీయన మళ్ళీ పెళ్ళి చేసుకోవడమేమిటి?” అంటూ ఒక ఇల్లాలు, “పోనిద్దురూ! అతనికి ఇన్నేళ్ళకి పెళ్ళాం మీద మోజు పుట్టింది కాబోలు!” అని నవ్వుతూ ఇంకొకరు, “అయినా ఇంత వయస్సులో ఇప్పుడు అతనికి ఇదేం పాడుబుద్ది?” అంటూ మరొకరు సాగదీశారు.
“ఆ, అయినా అతని వయస్సు ఎంతనీ? నలభై ఐదేగా? ఈ రోజుల్లో అంత వయస్సున్న ఎంత మంది పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదూ? పిల్లల్ని కనడం లేదూ?” ఇద్దరు పిల్లలుండి రెండో పెళ్ళి చేసుకున్న ఓ నడివయస్కుడు వాళ్ళ మాటల్ని తేలిగ్గా తీసి పారేశాడు.
“అయినా పెళ్ళిడుకెదిగిన కూతురుండగా ఇప్పుడు తన పెళ్ళికేం తొందరొచ్చింది?” ఒకరి ప్రశ్న.
“అవును నిజమే. కానీ, ఆయన కూతురు తన దగ్గర లేదుగా! వాళ్ళ అమ్మమ్మగారింట్లో గారాబంగా పెరుగుతుందిగా!” ఇంకొకరి జవాబు.
“కట్నకానుకలకు ఆశపడే మళ్లీ పెళ్లి చేసుకున్నాడేమో?..”
“అయ్యో! ఎంతమాట. పాపం అన్యాయంగా అనుకోకూడదు గాని, ఆయన దగ్గర అలాంటి కక్కుర్తి బుద్ధులేం లేవు లెండి! మొదటి పెళ్ళిలో కూడా కానీ కట్నం తీసుకోలేదు. నిజానికి ఆయన స్వభావము చాలా మంచిది” అతన్ని బాగా తెలిసున్న మరో ఆయన ఖచ్చితమైన అభిప్రాయం.
“ఏ దిక్కుమాలిన వాడిచ్చాడో పిల్లని?” మరో అతని వ్యాఖ్యానం.
“ఎందుకు ఇవ్వరు పిల్లను? అతనికి ఏం తక్కువ? నెలకు బోలెడంత డబ్బు సంపాదిస్తున్నాడాయె! గవర్నమెంట్ ఉద్యోగమాయె! ఉన్న ఒకానొక తమ్ముడు ఆర్మీలో ఎక్కడో ఉన్నాడు. ఇక ఇంట్లో అత్త, ఆడబిడ్డ అంటూ ఎవరి బాదరబందీ లేదు కదా! ఏకాకిగా కాలం గడుపుతున్నాడాయె! ఈ రోజుల్లో ఏ ఆడపిల్ల తండ్రి అయిన కళ్ళకద్దుకొని మరి ఇస్తారు పిల్లని”
“ఊహూ, అది కాదండీ బావగారూ! విషయం ఏమిటంటే మొదటి భార్య చనిపోయిన కొత్తలో మన వాళ్లు మళ్లీ పెళ్లి చేసుకోమని ఎంత ఒత్తిడి చేసినా, ఖచ్చితంగా చేసుకోనని చెప్పి పెళ్లి పట్ల విముఖత చూపిన ఆ పెద్దమనిషి ఎన్ని సంవత్సరాలకు ఇలా హఠాత్తుగా మళ్ళీ పెళ్ళి చేసుకోవడం చాలా ఆశ్చర్యంగా లేదూ?”
“లేకేం ఉంది. కానీ, కాలమండీ బాబూ కాలం. అప్పటికీ ఇప్పటికీ ఒకే రీతిగా ఉందా? ఎన్నెన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అట్లాగే మనిషి బుద్ధులు కూడాను. ఏ పెళ్ళిళ్ళ పేరయ్యనో మెడలు వంచి ఒప్పించి ఉంటాడు..” అంటూ మరో పెద్ద మనిషి సమర్థించాడు.
అలా ఆ విధంగా ఎన్నెన్నో ప్రశ్నలూ, వాటికి తగిన జవాబులూ, విమర్శలు అన్నీ ఎవరికి తోచిననట్లుగా వాళ్ళు మాట్లాడుకోసాగారు.
లోకులు, బంధువులు అనుకున్నట్లుగా ప్రభాకర్ పరిమళను మోజుతో, ప్రేమతో మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. కట్నం కానుకులకి ఆశపడి అంతకన్నా కాదు. మానవత్వం గల మనిషిగా ఓ పెళ్ళళ్ళ పేరయ్య ప్రోద్బలంతో, పుట్టగానే అతి పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకొని పినతండ్రి ఇంట్లో ఘోర నరకాన్ని అనుభవిస్తున్న అనాథ అయిన పరిమళని జాలితో సహృదయంతో గృహిణిగా స్వీకరించి ఆమెకు ఆ రకమైన నరక కూపంలాంటి చెరని విడిపించి పుణ్యం కట్టుకున్నాడు.
ప్రభాకర్ మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి మొదటి భార్య తల్లిదండ్రులైన తన అత్తామామల పోరు కూడా చాలా ఉంది. “ఎన్నాళ్ళని మోడులా బతుకుతావ్? పేరయ్య గారు చెప్పినట్లుగా పెళ్ళి పేరుతో అమ్మాయి మెడలో తాళికట్టి నీ ఇంట్లో ఆశ్రయం కల్పించు.. నీకు వేళకు ఇంత వండి పెడుతుంది. తోడు నీడగా ఉంటుంది” అంటూ ఎన్ని విధాలుగా హితబోధలు చేయాలో అన్ని విధాలా చేసి అల్లుడిని ఒప్పించి, ఆ పెళ్ళి గుళ్ళో సింపుల్‌గా జరిపించి తమ దారిన తాము వెళ్ళి పోయారు.
ఎన్నెన్నో కోరికలతో మరెన్నో ఆశానురాగాలతో కొత్త పెళ్ళికూతురైన పరిమళ ప్రభాకర్ ఇంటిలోకి ఇల్లాలుగా అడుగు పెట్టింది. కాపురానికి వచ్చిన కొద్ది రోజులలోనే భర్త మనస్తత్వాన్ని బాగానే అర్థం చేసుకుందామె.
అందరి కన్నెపిల్ల లాగానే పరిమళ కూడా మొదట్లో భవిష్యత్తుని గురించి ఎన్నెన్నో మధురమైన రంగురంగుల కలలు కంది. ఆ ఆశలన్నీ కల్లలుగానే మిగిలిపోయి, పినతండ్రి ఇంట్లో వంటమనిషిగా, పనిమనిషిగా ఇంటెడు చాకిరీ చేస్తూ అలాగే తన జీవితం వెళ్ళబారి పోతుందనుకుంది.
కానీ, తన నుదిటన విధాత ఏ కాస్తో అదృష్టరేఖ రాయబట్టి, తమ ఊరి పేరయ్యగారు తన దీన కష్టాల గాథను విని, ప్రత్యక్షంగా చూసి మనస్సు చలించి పోయి జాలితో కాకవికలమైనాడు. తన శాయశక్తుల కృషి చేసిన ఆయన పుణ్యాన హఠాత్తుగా ఇలా ప్రభాకర్‌తో తన పెళ్ళి జరగడమన్నది కలలో కూడా ఊహించని అద్భుతమైన విషయం.
అసలే చక్కని చుక్కైన పరిమళ యవ్వనం తెచ్చిన సోయగాలతో అరవిచ్చిన మల్లెమొగ్గలా ఉంటుంది. పెళ్ళయ్యాక మంచి పోషకాలున్న ఆహారం, పండ్లు, పాలు మున్నగునవి తినడం వలన మరికొన్ని కొత్త అందాల్ని సంతరించుకున్నది. ఇంట్లో ఎవరి బాదర బందీ లేదు.
ఆ పని చేయి, ఈ పని చేయి అని సతాయించే మనుష్యులు లేరు. ఎంతో సుఖంగా సంతోషంగా ఉంది ఆమె మనస్సుకు. భర్త ప్రభాకర్ చాలా సౌమ్యుడు.. మృదు భాషి. అతని నుంచి ఏ సమస్యా లేదు.
ప్రభాకర్ భార్య మనసులోని కోరికలని సరదాలని గ్రహించలేనంతటి మూర్ఖుడే కాదు కాబట్టి, ఆమె కోరిన నగలు చీరలు కొనిచ్చాడు. తను సాధ్యమైనంత వరకు ఆమెకు అనుగుణంగా ప్రవర్తిస్తూ వీలు చిక్కినప్పుడల్లా అడపాదడపా అలా సినిమాలకి షికారులకి తీసుకెళ్లేవాడు.
“ఓహో, అప్పుడే పడుచు పెళ్ళాన్ని వెంటేసుకొని తెగ తిరుగుతున్నాడు” అంటూ తోటి ఉద్యోగస్థులు హేళన చేసినా, నవ్వినా కూడా అంతగా లెక్క చేయలేదు ప్రభాకర్. అలాగే రెండు మూడు నెలలు సరదాగా గడిచిపోయాయి.
ఉన్నట్లుండి ఒకరోజు ప్రభాకర్‌కు బాగా జ్వరం వచ్చింది. పదిరోజుల వరకు మంచం దిగలేకపోయాడు. ఆఫీసుకు సెలవు పెట్టాడు. అన్ని రోజులు దగ్గరుండి చిన్న పిల్లలకి చేసినట్లుగా సపర్యలు చేసి భర్త త్వరగా కోలుకునేలా చేసింది పరిమళ.
ప్రభాకర్ మళ్ళీ ఆఫీసుకు వెళ్ళి వస్తున్నా, మనిషి మాత్రం మునుపటిలా ఉండడం లేదు. ఎంతో నీరసంగా ఏమీ చేతకానివాడిలా తయారయినాడు.
భర్తలోని మార్పుని కనిపెట్టిన పరిమళ ఓరోజు రాత్రి పండుకునే ముందు “ఏమిటో, మీరీ మధ్య మునుపటిలా లేరు, ఓమారు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి” అంటూ ఎంతో ప్రేమానురాగాలు ఉట్టిపడే స్వరంతో అంది.
“నాకేమైంది? బాగానే ఉన్నాను. జ్వరపడి లేచానుకదా! కాస్త నీరసంగా ఉన్నానంతే..” అని చిన్నగా నవ్వి అంటూ భార్య సంతోషం కొద్ది దగ్గరికి తీసుకున్నాడామెను.
***
ప్రభాకర్ ప్రతిరోజు ఉదయం తొమ్మిదింటికి భోజనం చేసి ఆఫీసుకెళ్ళిపోతే, మళ్ళీ సాయంత్రమే ఆరింటికే ఇంటికి చేరడం. ఇక ఇంట్లో ఒక్కత్తె ఉండే పరిమళకి పగలల్లా ఏమీ తోచేది కాదు. చేతినిండా పని లేక ఆమె మనస్సంతా ఏదో తెలియని అసంతృప్తి అలుముకోసాగింది.
తమ ఎదురింటి కుర్ర లెక్చరర్ కాలేజీ నుంచి రాగానే స్కూటర్ పైన భార్యని తీసుకొని ప్రతిరోజు ఎక్కడికో షికారు వెళ్ళి అలా అలా తిరిగి మళ్ళీ ఏ పదింటికో నవ్వుతూ తుళ్ళుతూ ఇంటికి చేరేవారు. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్న వాళ్ళ జంటని చూసినప్పుడల్లా పరిమళ మనస్సంతా ఏదో తెలియని ఈర్ష్యాద్వేషాలు భర్తమీద నిండి పోయేయి.
వయస్సు మళ్ళిన వాడిని పెళ్ళి చేసుకోవడం వలన తాను పోగొట్టుకున్నదేమిటో ఆమెకు మెల్లిమెల్లిగా అర్థం అవ్వసాగింది.
సాయంకాలపు వేళ భర్త వాడిన ముఖంతో ఉస్సురుమంటూ ఇంట్లోకి రాగానే పరిమళ ముఖమంతా చిట్లిస్తూ కాఫీ అందిస్తూ, “ఓ సరదా లేదు, పాడూ లేదు” అని విసుగ్గా సణుక్కోవడం కొత్తగా మొదలయ్యే సరికి ప్రభాకర్ కనుబొమ్మలు ముడిచి నీరసంగా ఓ నిట్టూర్పు విడిచాడు.
అతని అనారోగ్యం మూలంగా ఎక్కడికి బయటికి వెళ్ళడమే లేదు. ఎవరో తనని జైలు లాంటి నాలుగు గోడల మధ్య బంధించి ఉంచినట్లుగా ఫీలవ్వ సాగిందామె. అలాంటి సమయంలోనే ఢిల్లీలో ఆర్మీలో పని చేస్తున్న సుధాకర్ సెలవు మీద అన్నగారి దగ్గరికి హఠాత్తుగా ఊడిపడ్డాడో రోజు.
‘అరవిచ్చిన మల్లె మొగ్గలా అందంగా, తనకన్నా చాలా తక్కువ వయస్సుగల పరిమళ తనకు వదినా?’ అన్నట్టుగా ఆశ్చర్యంగా తలమునకలై పోయాడు సుధాకర్.
ఆ రోజు రాత్రి భోజనం చేస్తున్నప్పుడు “నీవిక పెళ్ళి చేసుకోవా సుధా?” బాధ్యత గల పెద్దమనిషిలా ప్రేమగా అడిగాడు తమ్ముడిని ప్రభాకర్.
“ఎందుకు చేసుకోను అన్నయ్యా? వదిన లాంటి అందమైన అమ్మాయి దొరికితే, తప్పకుండా పెళ్ళి చేసుకుంటాను..” వడ్డన చేస్తున్న వదినగారి తెల్లటి నాజుకైన చేతులకేసి ఆసక్తిగా చూస్తూ చిన్నగా నవ్వి హుషారుగా అన్నాడు సుధాకర్. తమ్ముడిచ్చిన ఆ సమాధానం ప్రభాకర్‌కు అస్సలు నచ్చలేదు. ప్రశ్నార్థకంగా ముఖం పెట్టి అదోలా చూశాడు.
కాని, పరిమళ మనస్సు మాత్రం మరిది దగ్గరినుంచి తన అందానికి ప్రశంసా పూర్వకమైన గుర్తింపు లభించేసరికి.. ఆనందంతో ఉప్పొంగి పోయింది. బుగ్గల్లో మందారాలు పూశాయి. పారవశ్యంతో కన్నులు అరమోడ్పులు అయినాయి.
సుధాకర్ రాకతో పరిమళ ఒంటరితనంతో పడే బాధంతా ఒక్కసారిగా పూర్తిగా పటాపంచలై పోయింది.
నిజానికి సుధాకర్ చాలా సరదా అయిన మనిషి. అస్తమానం ఏవేవో జోక్స్ వేస్తూ తాను నవ్వుతూ ఎదుటివాళ్ళు హాయిగా నవ్వేలా మాట్లాడుతాడు. ఏ మాత్రం జంకు బొంకు లేకుండా అతనితో ఫ్రీగా మసులుకోసాగింది పరిమళ,
ప్రభాకర్ మాత్రం వాళ్ళిద్దరి ప్రవర్తనకి మనసులో రవంత బాధ పడసాగాడు. ఓ రోజు సాయంత్రం అతను ఆఫీస్ నుంచి వస్తుంటే ముందు హాల్లో కూర్చున్న పరిమళ, సుధాకర్ ఎందుకనో విరగబడి పెద్దగా నవ్వుతున్నారు. వాళ్ళిద్దరి నవ్వులు వీధి వాకిలి వరకు వినిపిస్తున్నాయి.
అతను ఇంట్లోకి రాగానే ఎవరో మంత్రించినట్లుగా వాళ్ల నవ్వులు ఠక్కున ఆగిపోయాయి. సుధాకర్ సోఫాలో నుంచి చటుక్కున లేచి అన్నకు ఎదురెళ్లి “అన్నయ్యా, ఇందాకటి నుంచి మేము నీకోసమే ఎదురు చూస్తున్నాం. త్వరగా తయారవు, చాలా మంచి హిందీ పిక్చర్‌కి మూడు టికెట్స్ బుక్ చేయించి తీసుకొచ్చాను. అందరం కలిసివెళ్ళుదాం” ఉత్సాహంగా అన్నాడు.
ఇప్పటికే తన అలంకరణ పూర్తి చేసుకుని, మరిది తెచ్చిన తెల్లటి కాశ్మీర్ సిల్క్ చీర కట్టుకొని అందంగా తయారై ఉన్న భార్యకేసి క్షణం తేరిపారగా చూశాడు ప్రభాకర్.
“నేను రాలేను రా, ఒంట్లో బాగాలేదు. చాలా తలనొప్పిగా ఉంది. మీరిద్దరూ వెళ్ళిరండి” అన్నాడు నిదానంగా జోళ్ళు విడుస్తూ.
“నీవు రాకుంటే వదిన నాతో వస్తుందా?” సుధాకర్ కళ్ళు రవ్వంత సందేహంతో ఆమె వంక చూశాడు.
“ఏం ఎందుకు రాదు వస్తుందిలే. వెళ్తావా?” ప్రభాకర్ భార్యవంక చూస్తూ అడిగాడు.
‘వారికలా ఉంటే నేనెలా సినిమాకు వస్తాను. మీరు వెళ్ళండి’ అని అంటుందేమోనని ఆశించాడు. కానీ, పరిమళ ఏమాత్రం సందేహించక “సరే అలాగే వెళ్తాను” అంటూ హుషారుగా తలాడించి “ప్లాస్క్‌లో కాఫీ పోసి ఉంచాను. తలనొప్పి మాత్ర వేసుకొని ఆ కాఫీ తాగి హాయిగా పడుకోండి. మేము వచ్చాక భోజనం చేద్దాం” అంది. మరో మాటకైనా ఆగకుండా మరిదితో పాటు వడివడిగా వెళ్ళిపోతున్న భార్యవంక కళ్ళప్పగించి చూడసాగాడు ప్రభాకర్.
ఆ ఒక్క రోజే కాదు, ప్రభాకర్ ఇంట్లో లేనప్పుడు, అతడు ఇంట్లో ఉన్నప్పుడు అడిగి కొన్నిసార్లు, అతనికి తెలియకుండా మరి కొన్నిసార్లు అలా సినిమాలకి షికారులకి మరిదితో జంటగా తెగ తిరగసాగింది పరిమళ.
“మీ అన్నయ్య ఏమన్నా అనుకుంటారేమో!” అని మొదట్లో పరిమళ కొంచెం సందేహించినా, “ఆ మరేం పర్వాలేదు లెద్దూ! అన్నయ్య ఏమీ అనుకోడు. ఆయనది అంతా సంకుచిత స్వభావం కాదులే” అని నవ్వుతూ తేలిగ్గా తీసిపారేసి ఆమెకు ధైర్యం చెప్పేవాడు సుధాకర్.
***
ఆర్మీలో ఉండడం వల్ల సుధాకర్‌కి అన్ని సుగుణాలు అబ్బాయి. తన చిన్ననాటి ఫ్రెండ్స్ అంతా కలిసి హోటల్లో పార్టీ చేసుకుంటున్నామని చెప్పి వెళ్లి పీకలదాకా చిత్తుగా తాగి అర్ధరాత్రికి ఇంటికి చేరాడు ఆ రోజు.
ఆఫీస్ పని మీద భర్త పై ఊరికి వెళ్లడం వలన పనిపిల్లని తనకి తోడుగా ఇంట్లోనే ఉంచుకుంది పరిమళ,
సుధాకర్ రాత్రి పూట వచ్చి దబ దబా తలుపులు బాదేసరికి ముందు హాల్లోనే పడుకొని ఉన్న పనిపిల్ల లేచి తలుపులు తెరిచింది. తూలుతూనే ఇంట్లోకి వచ్చాడు సుధాకర్.
“మీ అమ్మగారు పడుకుందా?”
“ఆ, పడుకున్నారు. మీరు భోజనం చేస్తారా, బాబుగారు?”
“అక్కర లేదు. హోటల్లో తినే వచ్చాను. నీవు వెళ్ళి పడుకో” అని చెప్పి సుధాకర్ అప్రయత్నంగానే అన్నా వదిన పడుకునే గది వైపు వెళ్ళాడు.
కోడె వయసులో ఉన్న పరిమళకి తీయని ఊహలతో కోరికలతో మనసూ, తనువూ వేడెక్కిపోతుంటే నిద్ర రాక అటు ఇటు దొర్లి అశాంతిగా మథన పడసాగింది. మరిది రావడం, పనిపిల్ల తలుపు తీయడం అంతా వింటూనే ఉంది. అతను తడబడే అడుగులతో తన గదిలోకి రావడం, తలుపు నెమ్మదిగా వేయడం, లైట్ వెలిగించడం అంతా గమనిస్తూనే ఉందామె కళ్ళు మూసుకొని.
“ఏం చేస్తున్నావ్? నిద్ర రావడం లేదా? ఒంటరిగా ఉంటే ఎలా వస్తుంది?” అని చిన్నగా నవ్వుతూ కాంక్ష నిండిన కళ్ళతో చూస్తూ ముందుకెళ్ళి ఆమె మనస్సు గ్రహించిన వాడిలా సరాసరి మంచం పై కూర్చుని ఆమె సన్నని నడుము చుట్టూ తన బలిష్టమైన రెండు చేతులు జంట సర్పాల్లా పెనవేశాడు.
అతని స్పర్శకి పరిమళ శరీరమంతా విద్యుత్ పాకినట్లు అయింది. అసలే కోరికలతో వేగిపోతున్న ఆమెకు ఆ తరుణంలో మరిది అలా ప్రవర్తించడం ఏ మాత్రం తప్పుగా భావించిక, అతని చర్యకు ఎలాంటి అభ్యంతరం కూడా చెప్పలేదు. వివేకం కోల్పోయిన ఆమె అతన్ని లతలా పెనవేసుకో పోయింది.
భర్తకు ద్రోహం చేస్తున్నానన్న భయం కానీ, సుధాకర్ ఎవరు? తనకి వరసకి ఏమవుతాడన్న విషయం గానీ పరిమళ మెదడుకు తట్టలేదా క్షణంలో..
ఆమె ప్రోద్బలంతో సుధాకర్ హుషారుగా మరింతగా విజృంభించాడు. “ముసలివాడైన మా అన్న నిన్నేం సుఖపెడతాడు, నాతో వచ్చేసేయ్ పరీ!” ముద్దు ముద్దుగా అంటూ ఆమెను నిలువెల్లా ఆక్రమించుకున్నాడు.
ఆ ఒక్క రోజే కాదు. ఏకాంత సమయం దొరికినప్పుడల్లా ప్రభాకర్ కళ్ళు కప్పి వాళ్ళిద్దరి ప్రేమాయణం చాలాసార్లు సాగించారలా..
సుధాకర్ రెండు నెలల సెలవు పూర్తి అయి పోయింది. ఆనెల చివర్న తిరిగి ఢిల్లీ వెళ్ళి పోయాడు.
అతను వెళ్ళిపోయిన రోజు పరిమళ బాధ అంతా ఇంతా కాదు. ఏదో పోగొట్టుకొన్న దానిలా తెగ ఫీలవ్వసాగిందామె. తమ్ముడు వెళ్ళిపోగానే భార్యలో కలిగిన ఆ వింత మార్పుని ప్రభాకర్ బాగానే గమనించాడు. అయినా ఆమెను ఏమీ అనలేదు. ముభావంగా ఉండిపోయాడు.
ఈమధ్య కాలంలో పరిమళలలో ఏదో మార్పు వచ్చింది. తిండి సహించక పోవడం, వికారంగా ఉండడం, అప్పుడప్పుడు వాంతులు కావడం. అది పెళ్ళి అయ్యాక చాలా ఆడవాళ్ళకు వచ్చే మామూలు వేవిళ్ళు జబ్బే అయినా, అదేం గ్రహించలేని ప్రభాకర్ ఒకరోజు భార్యని బలవంతంగా తనకి బాగా పరిచయం ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాడు.
ఆ డాక్టర్ పరిమళని అన్ని పరీక్షలు చేసి “నీకేం జబ్బు లేదమ్మాయ్! తల్లివి కాబోతున్నావు. నీరసంగా ఉన్నావు కాబట్టి, బలానికి మంచి మందులు రాసి ఇస్తాను.” అని చిన్నగా నవ్వుతూ చెప్పి “మీరెళ్ళి బయటనున్న మీవారిని ఓమారిలా లోపలికి పంపండి” అని చెప్పింది.
తాను తల్లి కాబోతున్నందుకు పరిమళకు ఆ క్షణంలో ఎంతో సంతోషం కలిగింది. ఆనందంతో వెలిగిపోతున్న ముఖంతో గర్వంగా బయటికి వస్తున్న భార్యని కొంచెం అయోమయంగా చూస్తూ “ఏమైంది, డాక్టర్ ఏమన్నది?” ఆత్రుతగా అడిగాడు ప్రభాకర్.
భర్త అలా అడిగేసరికి ఈసారి పరిమళ బాగా సిగ్గు పడిపోయింది. బుగ్గల్లో మందారాలు పూసాయి. “మిమ్మల్ని డాక్టర్ గారు లోపలికి రమ్మన్నారు ఎందుకో!” తల వంచుకొని సన్నని స్వరంతో అందామె.
డాక్టర్ గదిలోకి వెళ్లిన ప్రభాకర్ మళ్లీ ఓ ఐదారు నిమిషాలకు తెల్లగా పాలిపోయిన ముఖంతో బయటికి వచ్చాడు. కళ్ళెత్తి భార్య వంక ఓమారు తీక్షణంగా చూసి “పద” అన్నాడు.
డాక్టర్ లోపల అతనితో ఏం చెప్పిందో, క్షణంలో భర్త ఎందుకలా మారిపోయాడో, ఏం అర్థం కాని పరిమళ ఏదో తెలియని అయోమయావస్థలో పడిపోయింది.
‘బహుశా, ఈ వయసులో తండ్రి కాబోతున్నందుకు సిగ్గుబిడియాలతో లోకులకి భయపడుతున్నాడు కాబోలు’ అనుకొని సరిపెట్టుకుంది. ఆ రాత్రి ప్రభాకర్ భోజనం కూడా చేయలేదు. ఆకలిగా లేదని వద్దన్నాడు. డాక్టర్ దగ్గర నుంచి వచ్చిన క్షణం మొదలు అతని మనసు మనసులో లేదు. లెక్కలేనన్ని ఆలోచనలు మనసులో గజిబిజిగా అలుముకున్నాయి. కంటి మీదికి కునుకే రాలేదు. సిగరెట్ల మీద సిగరెట్లు తెగ కాలుస్తూ ఇల్లంతా పిచ్చివాడిలా తెగ పచార్లు చేయసాగాడు.
భర్త వాలకం అర్థం కాని పరిమళ “ఏమైంది? ఎందుకలా ఉన్నారు?” అంటూ రెండు మూడు సార్లు అడిగి బాగా చివాట్లు తిన్నది. దానితో ఆమెకు ఉక్రోషం ముంచుకొచ్చింది.
“మీరు తండ్రి కాబోతున్నందుకు సంతోషించక ఎందుకంతగా తలబద్దలు కొట్టుకోవడం. ఈ వయస్సులో పిల్లలు ఏమిటని అనుకొని నాకు అబార్షన్ చేయించుదామని ఆలోచిస్తున్నారేమో! నా దగ్గర ఆ పప్పులేం ఉడకవు. అయినా మొదటి నుంచి నాకు పిల్లలంటే ఎంతో ప్రేమ ఇష్టం. మీకు కూతురు ఉన్నందుకు చాలనుకుంటున్నారు కాబోలు. నాకు పిల్లలు కావాలి, నేను తల్లిని అవ్వాలి. మీరు ఎన్ని చెప్పినా నేను మాత్రం చస్తే అబార్షన్ చేయించుకోను.” కోపావేశాలతో విసురుగా అంటున్న భార్యవంక కళ్ళప్పగించి చూడసాగాడు ప్రభాకర్.
***
ఆ మరుసటి రోజు పరిమళ నిద్ర లేచేసరికి బారెడు పొద్దెక్కింది. పనిపిల్ల వచ్చి నిద్ర లేపింది. కళ్ళు నులుపుకుంటూ మంచంపై కూర్చుని ఓమారు చుట్టూ కలియ చూసింది.
ఎటు చూసినా గదినిండా ఖాళీ సిగరెట్టు డబ్బాలు, కాల్చి పారేసిన సిగరెట్టు పీకలే కుప్పలు కుప్పలుగా పడి వున్నాయి. ‘ఊ, రాత్రంతా నిద్ర పోకుండా ఇట్లా సిగరెట్లు తగలేస్తూ గడిపారు కాబోలు!..’ అనుకుని “అయ్యగారు నిద్ర లేచారా?” అడిగింది పనిపిల్లని.
“అయ్యగారు ఇంట్లో లేనట్లున్నారమ్మా! తెలుపులు దగ్గరగా వేసి ఉంటే, తీసుకుని నేను వచ్చాను. నాకు అంట్ల గిన్నెలు పడేయండమ్మ గారూ! ఈ రోజు త్వరగా వెళ్ళాలి.. మా అమ్మను హాస్పిటల్‌కు తీసికెళ్ళాలి” అంటూ ఇల్లు చిమ్మడానికి మూలనున్న చీపురిని చేతిలోకి తీసుకుంది.
ఆ మాట వినగానే పరిమళ మంచం మీది నుంచి దిగ్గున లేచింది. భర్త కోసం ఇల్లంతా కలయ తిరిగింది. ప్రభాకర్ ఎక్కడ కనిపించలేదు.
ఏదో తెలియని భయాందోళనతో గుండెలు దడ దడ లాడుతుంటే మళ్లీ ముందు హాల్లోకి వచ్చిన ఆమెకు టీవీ స్టాండ్‌పై ఓ పక్కగా మడత పెట్టి ఉంచిన కాగితమేదో కనిపించింది. ఒక్క వుదుటన వెళ్లి వణుకుతున్న చేతులతో అది అందుకుని విప్పి చదవసాగింది.
“పరిమళా!
నిన్న డాక్టరు చెప్పిన వార్త విన్నప్పటి నుంచి నా మనసు షాక్ తిన్నట్లు అయింది. ఆ లేడీ డాక్టర్ నా మొదటి భార్య అమల ఉన్నప్పటి నుంచి బాగా పరిచయం. అమలకి మొదటి కాన్పులో మా అమ్మాయి నీత అదే హాస్పిటల్లో పుట్టింది. నీత తర్వాత ఆరేడు సంవత్సరాలకి అమల మళ్ళీ గర్భవతి అయింది. అసలే చాలా నీరసంగా అనారోగ్యంగా ఉండే అమలకు రెండోసారి కాన్పు కావడం చాలా కష్టమైంది. చివరికి బాబు పుట్టాడు. ‘మీ భార్య మళ్ళీ కాన్పంటూ వస్తే ఆవిడ మాత్రం ఈ మారు మీకు దక్కదు’ అని డాక్టర్ ఖచ్చితంగా చెప్పడం వలన ఆ వెంటనే నేను పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నాను. ఇది జరిగిన నాలుగు రోజులకే ఇంకా హాస్పిటల్ లోనే ఉన్నా, అమలకి ఏదో విష జ్వరం సోకి హఠాత్తుగా కన్ను మూసింది. పొరపాటుగా తల్లిపాలు తాగడం వలన పుట్టిన ఆ పసివాడు కూడా నాకు దక్కలేదు. నేనీ విషయం అంతా వివరంగా నీకు ఇప్పుడు ఎందుకు తెలియజేస్తున్నానంటే మీ ఊరి పేరయ్యకి నేను ఈ సంగతి చెప్పాను. నీతో కూడా చెప్పమన్నాను. నా వలన ఆ అమ్మాయి తల్లి అయ్యే ఆస్కారం లేదని చెప్పి, నీకు ఇష్టమైతేనే ఈ పెళ్లికి ఒప్పుకోమని చెప్పాను. ఆయన నీతో ఈ విషయం చెప్పే ఉంటాడన్న ఉద్దేశంతో నేను కూడా నీతో ఎప్పుడూ ఈ ప్రసక్తి తీసుకురాలేదు. కానీ నిన్న డాక్టరు నీవు తల్లివి కాబోతున్నావని చెప్తుంటే నా మతి పోయింది. నేను ఆపరేషన్ చేయించుకోవడం ఆవిడకు తెలుసు కాబట్టి ‘పెళ్లి చేసుకున్న మీరు పిల్లలు కలగడానికి తిరిగి ఆపరేషన్ చేయించుకున్నారా’ అంటూ చనువుగా అడిగింది ఆ మాటకి నాకేం మాట్లాడాలో తోచక సిగ్గుతో చితికిపోయాను. లేదన్నట్లుగా తల అడ్డంగా గబగబా ఆడించాను. ‘మరి ఇదేమిటి మీ ఆవిడ ప్రెగ్నెంట్ ఇప్పుడు.. అంటే..’ అంది అదోలా చూస్తూ. ఇక అక్కడ ఒక్క క్షణం కూడా నిల్చోలేకపోయాను. వెంటనే బయటికి వచ్చేసాను. నిన్నటి నుంచి నేను పడ్డ నరకయాతన అంతా అంతా కాదు. ఇంకెప్పుడు నీకు సర్వం అర్థమైంది అనుకుంటాను. నీవు నా వలన తల్లివి కాలేదు. నీ కడుపులో పెరుగుతున్న శిశువుకి తండ్రి ఎవరో నీకు తెలుసు. వాడే సుధాకర్. వాడితో తప్ప నీవెవరితో అంత విచ్చలవిడిగా తిరగలేదు అనుకుంటాను. ఈ విషయం అంతా తమ్మునికి వివరంగా లెటర్ రాశాను. వాడు సాధ్యమైనంత త్వరలో వస్తాడు. తప్పకుండా నిన్ను తనతో తీసుకుపోతాడు. నాకు ఆ నమ్మకం ఉంది.. ఆఫీసుకు నేను కొన్నాళ్లు సెలవు పెట్టి మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేసరికి నీవు ఆ ఇంట్లో ఉండకూడదు, వెళ్లిపోయి ఉండాలి. నేను నిన్ను మళ్ళీ పెళ్ళి చేసుకున్నాను. నీవు కూడా సుధాకర్‌ను మళ్ళీ పెళ్ళి చేసుకో. పశు పక్ష్యాదులకు వావి వరసలు తెలియవు. కానీ, మనిషికి తప్పు ఒప్పుల విచక్షణ తెలుసు, అది చాలా అవసరం గూడాను. తప్పు అని తెలిసీ మాత్రం అసలు చేయగూడదు. క్షణం కాల సుఖం కోసం అనైతికంగా ప్రవర్తిస్తే ఫలితం చెడుగానే, వ్యతిరేకంగానే ఉంటుంది. అన్ని తెలిసిన మనుష్యులు మాత్రం నేడు మృగాలుగా మారిపోతున్నారు. ఇంతకు మించి నేనేమీ రాయలేను.”
అది చదివిన పరిమళ భోరున విలపించసాగింది. పెళ్ళే కాదనుకున్న తన జీవితంలో ప్రభాకర్ పెద్ద మనసుతో పెళ్ళి పేరుతో ఇంతటి అదృష్టం తనకు ఇస్తే, తనేం చేసింది? అతన్ని మోసం చేసింది. అయ్యో! అని హృదయం విదారకంగా విలపించసాగింది. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏం లాభం?