‘పోరాట పథం’ – డాక్టర్ హెచ్.నరసింహయ్య ఆత్మకథ -22

1
3

[ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, గాంధేయవాది డాక్టర్ హెచ్.నరసింహయ్య గారి ఆత్మకథ అనువాదాన్ని అందిస్తున్నారు శ్రీ కోడీహళ్ళి మురళీమోహన్.]

మహిమల తనిఖీ మరియు సత్యసాయిబాబాగారు

మహిమల పరిశీలనా కమిటీ

[dropcap]జ్యో[/dropcap]తిషం, మహిమలు మొదలైన మూఢనమ్మకాలు ప్రపంచమంతటా వ్యాపించాయి. అయితే మనదేశంలో ఉన్నంత జ్యోతిషులు, మహిమాన్వితులు, మంత్రగాళ్ళు ప్రపంచంలోని వేరే ఏ దేశంలోనూ లేరు. పేటకొక మాంత్రికుడు, వీధికొక దైవాంశభూతుడు. మనిషిపై గ్రహాల ప్రభావం ఉంది అన్న దానిపై ఒక శాస్త్రం – జ్యోతిష శాస్త్రాన్నే మనిషి సృష్టించుకున్నాడు. ప్రకృతి నియమాలను ఉల్లంఘించే సంఘటనలే మహిమలు. ఈ అర్థంలో నీటి మీద నడవడం, శూన్యం నుండి వస్తువులను సృష్టించడం మొదలైనవన్నీ మహిమలే.

మొదటి నుండీ ఇలాంటి నమ్మకాలపై నా వ్యతిరేకత ఉంది. మాయలను, మూఢనమ్మకాలను పరీక్షించడం సత్యాన్వేషణ. ఇలా పరీక్షించి వాటిలోని నిజానిజాలను ప్రజలకు తెలియజేయడం తెలిసినవారు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు తప్పనిసరిగా చేయవలసిన పని. ఇదొక సమాజ సేవ. ఈ అతిముఖ్యమైన విషయాన్ని సుదీర్ఘంగా ఆలోచించి 1976లో ఒక పరిశీలనా కమిటీని నియమించాను. అప్పుడు నేను బెంగళూరు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఉన్నాను. ఇలాంటి ఒక పరిశీలనకు 25000 రూపాయలను విశ్వవిద్యాలయ వార్షిక బడ్జెట్లో కేటాయించాము. ఆ కమిటీ పేరు ‘మహిమలు మరియు పరీక్షించదగిన మూఢనమ్మకాల పరిశీలనా సమితి (Committee to Investigate Miracles and Verifiable Superstitions)’. కొన్ని మూఢనమ్మకాలను పరీక్షించడానికి కుదరదు. అందుకే ఆ సమితి పేరు అలా ఉంది. వివిధ రంగాలలోని ప్రముఖులను ఆ సమితిలో సభ్యులుగా చేర్చుకున్నాము.

ఆ సమితి ఈ క్రింది విధంగా ఉంది.

1 డా.హెచ్.నరసింహయ్య, ఉపకులపతి, బెంగళూరు విశ్వవిద్యాలయం అధ్యక్షులు
2 డా.ఎ.ఆర్.వాసుదేవమూర్తి, రసాయనశాస్త్ర ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సభ్యులు
3 ప్రొ.ఆర్.నరసింహ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సభ్యులు
4 డా.కె.పి.సిన్హా, భౌతిక శాస్త్ర ప్రొఫెసర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సభ్యులు
5 ప్రొ.బి.కుప్పుస్వామి, మానసికశాస్త్ర మాజీ ప్రొఫెసర్, మైసూరు విశ్వవిద్యాలయం సభ్యులు
6 డా. (శ్రీమతి) వినోద ఎన్.మూర్తి, మానసికశాస్త్ర ప్రొఫెసర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ సభ్యులు
7 డా.(శ్రీమతి) అనుపమా నిరంజన్, వైద్యులు సభ్యులు
8 డా.ఎన్.ఆర్.నారాయణ, శస్త్రవైద్యులు సభ్యులు
9 శ్రీ బి .నీలకంఠన్, రిటైర్డ్ ఛీఫ్ ఇంజనీర్, ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ సభ్యులు
10 ప్రొ. ఎ. ఎం.ధర్మలింగం, న్యాయశాస్త్ర ప్రొఫెసర్ సభ్యులు
11 శ్రీ ఎస్. కెండగణ్ణ స్వామి, డిప్యుటీ రిజిస్ట్రార్, బెంగళూరు విశ్వవిద్యాలయం సంచాలకులు

ఇలాంటి ఒక మహిమలను పరీక్షించే సమితి ఏర్పాటును పత్రికలలో చదివి మైసూరు సమీపంలోని శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి, కొడగులోని సాయి శంకర్ ఇంకా ఇద్దరు ముగ్గురు తాము మహిమలను ప్రదర్శించబోమని ప్రకటించారు. వారికి ముందు ఆలోచన ఎక్కువ!

పాండవపురం సాయికృష్ణ

మైసూరు సమీపంలో ఉన్న పాండవపురలో ఒక చిన్న పిల్లవాడు మహిమలను చూపుతున్నాడనే వార్త వ్యాపించింది. ప్రముఖ వ్యక్తులు దాని మోహంలో పడ్డారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ శ్రీ మోహన్ లాల్ సుఖాడియా గారు కూడా అక్కడికి వెళ్ళారు. సరే, ఇక మొదలయ్యింది పాండవపురలో తొక్కిసలాట. ఆ మహిమలను చూడటానికి ప్రజలు తండోపతండాలుగా అక్కడి వెళ్ళడం మొదలుపెట్టారు.

ఈ ‘మహిమ’ను పరీక్షించడానికి మా కమిటీలోని ముగ్గురు సభ్యులు అంటే డా (శ్రీమతి) వినోదా ఎన్.మూర్తి, డా (శ్రీమతి) అనుపమా నిరంజన్ మరియు ప్రొ.బి.కుప్పుస్వామి గార్లు శ్రీ ఎస్.కెండగణ్ణస్వామి గారితో పాటు 1976 జూలై 6వ తేదీన పాండవపురానికి అందరూ వెళ్ళినట్లే వెళ్ళారు. వారు ఎవరన్నదీ ఎవరికీ తెలియదు. ఆ రోజు గురువారం. ప్రతి గురువారం భజన నడుస్తుంది. అదే రోజు మహిమల ప్రదర్శన కూడా ఉంటుంది. అయితే ఆ రోజు మహిమలు చూపలేదు. నిరాశతో తిరిగివచ్చారు. ఒక వారం విడిచిన తరువాత గురువారం జూలై 13వ తేదీన ఆ నలుగురు ఇంకా మరో ముగ్గురు అదే అజ్ఞాత వేషాలలో వెళ్ళారు. భజన జరిగే సమయంలో ఆ పిల్లవాడు పడుకుని ఉన్నాడు. భజన ముగిసింది. పిల్లవాడు లేచాడు. దానికన్నా ముందు ఆ పిల్లవాడు నడుముపై పదే పదే చేతులు పెట్టుకోవడం ఒకరిద్దరు సభ్యులు గమనించారు. అక్కడ వానికి ఏదో ఇబ్బంది కలిగినట్లు తోస్తోంది. పైగా నడుమునుండి ఒక దారం వేలాడుతోంది. కుతూహలంతో, సంశయంతో మా కమిటీలోని ఒక సభ్యుడు ఆ దారాన్ని లాగారు. నడుముకు చుట్టూ ఒక సంచిని చుట్టారు. దానిలో బూడిద నింపి ఉన్నారు. దారం లాగిన వెంటనే బూడిద జలజలా రాలి కుప్పలా పడింది. అందరూ గగ్గోలు పెట్టారు. దారాన్ని లాగింది ఎవరో, మిగిలిన వారు ఎవరో తెలిసిపోయింది. అతని తల్లి కమిటీకి శాపనార్థాలు పెట్టింది. సాయికృష్ణ మహిమలు బట్టబయలు అయ్యాయి. ఈ వార్తను అన్ని పత్రికలూ ప్రముఖంగా ప్రకటించాయి. ప్రజలలో కమిటీపై మంచి అభిప్రాయం కలిగింది. సాయికృష్ణ మాయలను పటాపంచలు చేయకపోతే ఈపాటికి అతడు మరొక సాయిబాబా అయ్యి సమాజంలో మౌఢ్యాన్ని మరింత పెంచేవాడు.

సాయికృష్ణ భవిష్యత్తుకు ముగింపు పలికిన తరువాత సహజంగానే మా దృష్టి అంతర్జాతీయ ఖ్యాతిని పొందిన సత్యసాయిబాబాగారి వైపు పారింది. వారు చేతి గడియారం, ఉంగరం, సరం మొదలైనవాటిని శూన్యం నుండి సృష్టిస్తారనే ప్రతీతి బలంగా వ్యాపించి ఉంది. అంతే కాకుండా నీటిని పెట్రోలుగా మార్చే శక్తి కూడా ఉందని వారి శిష్యులు చెప్పుకునేవారు. వారి శిష్యులకు బాబాగారు మహిమగల దివ్యపురుషులు, మరికొందరికి సాక్షాత్ దేవుడు!

శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించి నియంత్రిత పరిస్థితులలో వారిపైన తనిఖీ చేయడానికి వారి సహకారం కోసం విన్నవిస్తూ శ్రీ సత్యసాయిబాబా గారికి ఈ క్రింద పేర్కొన్న మూడు ఉత్తరాలను వ్రాశాను.

బెంగళూరు విశ్వవిద్యాలయం

జ్ఞానభారతి

బెంగళూరు – 560056

నెం.వి.సి.పి 73:76                                                                 తేదీ 02.06.1976

శ్రీ సత్యసాయిబాబా,

బృందావన్,

కాడుగూడి పోస్ట్,

వైట్ ఫీల్డ్, బెంగళూరు జిల్లా,

బెంగళూరు గారికి

ప్రియ స్వామీజీ,

తమకు తెలిసినట్లు మన దేశంలో ఎక్కువమంది తమకు ఇంద్రియాతీతశక్తులు ఉన్నాయని చెప్పుకుంటారు. వారిలో కొందరు శూన్యం నుండి వస్తువులను సృష్టిస్తారనే నమ్మకమూ ఉంది. శూన్యం నుండి సృష్టి మనకు తెలిసిన శాస్త్రనియమాలను ఉల్లంఘించినట్లు ఔతుందన్న విషయం మీకు తెలుసు. ఇలాంటి వాటితో పోల్చితే ప్రపంచమంతటా ఇంతవరకూ కనిపెట్టబడిన శోధనలు, పరిశోధనలు అన్నీ తృణప్రాయమౌతాయి. సహజంగానే ఈ ప్రకృతి అతీత శక్తుల గురించి మాలో కొందరు తీవ్రంగా ఆలోచిస్తున్నాము. అంతే కాకుండా మన దేశం అనేక మూఢనమ్మకాలతో మునిగిన ప్రజలపై వాటివల్ల సంభవించే అపాయకర పరిణామాలపై చాలా విచారంగా ఉన్నాము.

హేతుబద్ధంగా, శాస్త్రీయంగా మహిమలను మరియు మిగిలిన పరీక్షకు లొంగే మూఢనమ్మకాలను తనిఖీ చేయడానికి ఈ మధ్య బెంగళూరు విశ్వవిద్యాలయం ఒక కమిటీని నియమించింది. ఈ తనిఖీ దేవుడు లేదా ధర్మం విరుద్ధంగా కాదు. కమిటీ సభ్యులు వివిధ రంగాలకు చెందినవారు. వీరు మహిమలు మరియు మూఢనమ్మకాలలోని వాస్తవాన్ని తెలుసుకోవడంలో తగిన సమర్థవంతులనే విషయం మీరు మాతో అంగీకరిస్తారని నమ్ముతున్నాం. ఈ తనిఖీ కేవలం సత్యాన్వేషణ మాత్రమే. వేరే ఇంకేమీ కాదు.

మీ అతీంద్రియ శక్తుల గురించి చాలా విన్నాము. మీరు దైవికశక్తులను పొందారని, ఆ శక్తులతో మీరు చాలా మహిమలను ప్రదర్శిస్తారని మన దేశంలోనూ, విదేశాలలోనూ ప్రసిద్ధి పొందారు. శూన్యం నుండి సృష్టించడం ఆ దైవికశక్తులలో అత్యంత ప్రజాదరణ పొందాయి. మీరు ధర్మప్రచారకులు, సత్యానికి ప్రాముఖ్యతను ఇస్తారని కూడా తెలుసు. అందువల్ల ఈ విషయాలనన్నింటి గురించి మీతో చర్చించడానికి మా కమిటీ సభ్యులకు మిమ్మల్ని దర్శించుకోవడానికి అవకాశం ఇవ్వాలని విన్నవించుకుంటున్నాను. దానితోపాటు విజ్ఞానరంగంలో అందరికీ తెలిసిన నియంత్రిత పరిస్థితులలో(Controlled conditions) మిమ్ములను పరీక్ష చేయడానికి అవకాశం ఇవ్వాలని ప్రార్థన. ఘనమైన వ్యక్తిత్వం మరియు దివ్యశక్తులున్నాయని ప్రసిద్ధులైన మీరు సత్యం అంటే దేవుని పేరుమీద అర్థవంతమైన తనిఖీని నడపడానికి అవకాశం ఇస్తారని నమ్ముతున్నాను. ఇలాంటి తనిఖీలు మన దేశపు మరియు విదేశీ ప్రజలకు అత్యంత ఎక్కువ విలువలతో కూడినవి.

మిమ్మల్ని కలుసుకునే స్థలం, దినం, సమయాలను దయచేసి మాకు తెలిపితే అదొక మహద్భాగ్యం అని భావించి మిమ్ములను దర్శించుకోగలం.

గౌరవ పూర్వక వందనాలతో,

మీ

హెచ్.నరసింహయ్య

ఉపకులపతి

మరియు కమిటీ అధ్యక్షులు

రెండవ ఉత్తరం

బెంగళూరు విశ్వవిద్యాలయం

నెం.వి.సి.పి 99:76                                                                 తేదీ 16.06.1976

ప్రియ స్వామీజీ,

నా వెనుకటి ఉత్తరం మీకు అందినదని నమ్ముతున్నాను. మీ నుండి బదులు రాలేదు అని తెలుపడానికి విచారిస్తున్నాను. దయచేసి మీరు ఈ ఉత్తరానికి వీలైనంత త్వరగా వీలుచేసుకుని బదులు ఇవ్వండి. మేము మిమ్ములను కలుసుకునే చోటు, తేదీ, వేళలను తెలిపితే మేము కృతజ్ఞులుగా ఉంటాము. మీ అవగాహన కోసం వెనుకటి ఉత్తరం నకలును జతచేశాను.

గౌరవ పూర్వక వందనాలతో

 మీ

హెచ్.నరసింహయ్య

 ఉపకులపతి

దానికీ సమాధానం లేదు.

చివరగా ఈ క్రింది మూడవ లేఖను వ్రాశాను.

బెంగళూరు విశ్వవిద్యాలయం

                                                                                      తేదీ 05.07.1976

ప్రియమైన స్వామీజీ,

నా 1976 జూన్ 2వ తేదీ నాటి ఉత్తరానికి మీనుండి సమాధానం లేకపోవడం అత్యంత విచారకరమైన విషయం. 1976 జూన్ 17వ తేదీ రిమైండర్ కూడా ఫలితాన్ని ఇవ్వలేదు.

మీరు మహిమలను ప్రదర్శిస్తారన్న నమ్మకం మీద మీ చుట్టూ ఒక ప్రభావవలయం (Halo) నిర్మించబడింది. మీ మహిమలు అభూత కల్పన అని తెలిసిన వెంటనే మీరు ఒక సామాన్యమైన మనిషి అవుతారని మీకు తెలుసు. అందువల్ల మీరు ఆ ప్రభావవలయాన్ని తీసివేసే అన్ని ప్రయత్నాల నుండి తప్పించుకోవడాన్ని అత్యంత తార్కికరీతులలో అనుసరిస్తున్నారని తెలుస్తున్నది. మీరు సహకరించకపోవడానికి మద్దతుగా ఈ కొన్ని వాదనలను చేయవచ్చు. “ఇలాంటి మహావ్యక్తి, దివ్యపురుషుడు, దేవుడు ఇలాంటి తనిఖీని ఎలా ఎదుర్కుంటాడు? ఇలాంటి కట్టుబాట్లకు వారు అతీతులు కదా?” ఈ మహిమలు అసమర్థనీయమని చెప్పక తప్పదు.

ఒక వ్యక్తి తాను చెప్పినదాన్ని సమర్థించుకోవాలి. తాను చేసేదాన్ని వివరించాలి. ఇది ఒక మర్యాద కలిగిన మనిషి నుండి ఆశించదగిన ప్రాథమిక అవసరం.

ఎక్కువమంది ప్రజలను దారిమళ్ళించడం లేదా వంచించడం సులభమే. అయితే ఏ వ్యక్తీ తన ఆత్మసాక్షిని వంచించలేడు. ఇది మీకు బాగా తెలుసు. మన చేతలన్నింటికీ సదా ప్రత్యక్షసాక్షి మన ఆత్మసాక్షే. ఎవరైనా సరే తన ఆత్మసాక్షికి నిజాయితీగా ఉండాలి. వాస్తవానికి ఇది మనందరి నైతికచర్య.

మహనీయులైన వ్యక్తులు ఎప్పుడు తమ చేతలను, మాటలను స్పష్టం చేయడమే జీవిత ధ్యేయంగా చేసుకున్నారు. బుద్ధభగవానుడు, స్వామి వివేకానంద మరియు గాంధీ మహాత్ముడు వీరు తమను పరీక్షించి మరియు ధృవీకరించిన తరువాతే స్వీకరించాలని తమ అనుయాయులను ఒత్తిడి చేశారు. వారి బ్రతుకు తెరచిన పుస్తకాలు. వారు ఏ సమస్యనూ అల్పమైనదిగా పరిగణించలేదు. వారు అన్ని సమస్యలకూ సమాధానం చెప్పారు మరియి ప్రతి ఒక్క చర్యను ప్రత్యక్షంగా ఆచరణలో చూపించారు. వారు నిరహంకారులు, సామాన్యులు. పేదలు, అణగారిన వర్గాల ప్రజల నడుమ బ్రతికినవారు. ఈ దైవపురుషులు రహస్యంగా చేసింది ఏమైనా ఉందా? మీ జీవన విధానం ఈ మహనీయులకే కాక నిజమైన ధార్మికులకు, దివ్యవ్యక్తులు నడిపిన జీవనానికి అపవాదును కలిగిస్తుంది. మహావ్యక్తులు, ధార్మిక పురుషులు అందరూ సత్యమే దేవుడు, రహస్యం పాపమని చెప్పారు.

గౌరవప్రదమైన వారసత్వం ఉన్న మన దేశంలో జీవితపు సమస్యలను ధైర్యంతో ఎదుర్కోలేక సులభంగా మోసపోయే మరియు చమత్కారాలకూ, కుతంత్రాలకు కళ్ళుమూసుకుని బలైపోయే ప్రజలు నిరంతరంగా ఆధ్యాత్మికం పేరుతో దోపిడీకి గురవుతుండడం దురదృష్టకరమైన విషయం.

మిమ్మల్ని దూషించడం లేదా మీ భావాలను నొప్పించడం ఈ లేఖ ఉద్దేశం కాదు. అయితే అదే సందర్భంలో ఇలాంటి విషయాలపై బెంగళూరు విశవిద్యాలయపు సత్యాన్వేషణపై ఉన్న తీవ్రమైన కోరికను మీరు మెచ్చుకునేలా ఈ ఉత్తరం వీలైనంత బలంగా ఉండాలని నా ఆలోచన.

ఇది ఈ వరుసలో నేను మీకు వ్రాస్తున్న చివరి లేఖ. 1976 జూలై 19వ తేదీ లోగా నీ నుండి సమాధానం రాకపోతే ఈ విషయంలో మీరు చెప్పేది ఏమీ లేదని భావించి నేను ఈ ఉత్తరాలను విధిలేక పత్రికలకు విడుదల చేసే ఒత్తిడికి గురి అవుతాను.

మీరు నా విన్నపాన్ని ఇప్పుడైనా ఒప్పుకునే నైతికధైర్యాన్ని ప్రదర్శించగలరని నమ్ముతున్నాను.

మీ విశ్వాసి

హెచ్.నరసింహయ్య

ఉపకులపతి

దానికీ బదులు లేదు. మూడు లేఖలను పత్రికలకు విడుదల చేశాను. మీరు బాబాగారిని కలిస్తే మీకు ఏ వస్తువు కావాలని అడుగుతారు అని ఒక విలేఖరి అడిగారు. “గుమ్మడికాయ కావాలని అడుగుతాను. ఎందుకు అంటే దానిని గడియారం, ఉంగరం వంటి చిన్న వస్తువుల మాదిరిగా దాచిపెట్టుకోవడానికి కుదరదు” అన్నాను. అందరూ నవ్వారు. అన్ని దిన పత్రికలలో, మ్యాగజైన్లలో, జాతీయ పత్రికలలో కూడా విస్తృతంగా దీనిని ప్రస్తావించారు. ప్రసిద్ధ పత్రికల సంపాదకులు నన్నూ, సాయిబాబా గారినీ సందర్శించారు. ఈ వివాదం తీవ్రతను తెలుసుకున్న కొందరు పత్రికావిలేఖరులు పుట్టపర్తికి యాత్ర చేశారు. బాబాగారు నన్ను వాచామగోచరంగా దూషించారు. అవహేళన చేశారు. నెలల తరబడి చర్చ నడిచింది. చాలా రోజులు వరుసగా నన్ను చంపుతామని బెదిరిస్తూ టెలిఫోన్ కాల్స్ వచ్చాయి. కొన్ని రాత్రి 12 గంటల తరువాత కూడా వచ్చేవి. ఆకాశరామన్న ఉత్తరాలూ వచ్చాయి. నేను దేనినీ లెక్కచేయలేదు. బాబాగారిని కలవడానికి అంతిమ ప్రయత్నం చేయాలని ఆలోచించి 1977 మే 29 ఉదయం 10 గంటలకు వారి వైట్‌ఫీల్డ్ నివాసంలో కలుద్దామని తెలిపి వారి బదులు కోసం ఎదురుచూడకుండా కమిటీ సభ్యులు, పత్రికా విలేఖరులతో కలిసి ఒక బస్సులో వెళ్ళాము. ఇలాంటి ప్రయత్నం తీవ్ర పరిణామాలకు దారితీస్తుందని బాబాగారి స్థానిక ప్రముఖ భక్తులు మమ్ములను హెచ్చరించారు. దేన్నీ లెక్క చేయకుండా మేము వారి నివాసం ముందుకు చేరినప్పుడు మమ్మల్ని లోనికి వదలలేదు. బాబాగారు ఆశ్రమంలోనే ఉన్నారు. అక్కడినుండి నిరాశగా వెనుదిరిగాము.

Dr. H Narasimhaiah

ముఖ్యమైన దర్యాప్తు

బాబాగారి మహిమలను పరీక్షించేందుకు మరియు వారిని కలిసేందుకు మా కమిటీ చేసిన నిరంతర ప్రయత్నాలు ముగిసాయి. అయితే సుమారు 15 నెలలు కొనసాగిన ఈ వివాదం ప్రజల ఆలోచనాసరళిపై ఆరోగ్యకరమైన పరిణామాన్ని కలిగించింది. ప్రజలకు ప్రశ్నించే ధైర్యం వచ్చింది. వారి సన్నిహిత భక్తులలోనూ సంశయ బీజాలు మొలకెత్తాయి. కొందరు ప్రముఖ అనుయాయులు ముఖ్యంగా డా.ఎస్.భగవంతం మొదలైన వారు బాబాగారిని విడిచిపెట్టారు. బాబాగారి వర్చస్సు, ప్రభావం తగ్గుముఖం పట్టింది. దైవపురుషులైన బాబాగారి మహిమలపై దర్యాప్తు చేసేందుకు మా కమిటీ చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా ఇది ఒక చరిత్రను సృష్టించింది. మనోభావాల దృష్టితో ఇదొక ప్రముఖమైన దర్యాప్తు. ఇంతవరకూ ఏ సంస్థ కానీ, విశ్వవిద్యాలయం కానీ, శాస్త్రవేత్తలు కానీ, బుద్ధిజీవులు కానీ ఇలాంటి విస్తృతమైన తనిఖీని చేయలేదు. కారణం చాలమందికి భయం, కొంతమందికి మనకూ దీనికీ సంబంధం లేదు అనే భావన. ప్రతి విశ్వవిద్యాలయంలో జ్యోతిషం, మహిమలు, ప్రజలను తప్పుదారి పట్టించే వాటిని శాస్త్రీయంగా పరిశీలించడానికి ఒక విభాగమే ఉండాలి. ఇదొక ముఖ్యమైన సమాజసేవ. సమాజంలో ముఖ్యంగా పట్టణాలలో మురికివాడలను నిర్మూలించి సమాజపు ఆరోగ్యాన్ని కాపాడటం ఎంత ముఖ్యమో ప్రజల తలలలో ఉండే మురికి ప్రదేశాలను నిర్మూలించడం అంతే ముఖ్యం. ఒక విధంగా దానికంటే ఎక్కువ ముఖ్యం.

బాబాగారికి తాలూకాయే గతి

సుమారు 8-10 సంవత్సరాల క్రింద బాబాగారి కొందరు భక్తులు బాబాగారు నివసిస్తున్న అనంతపురం జిల్లా పేరును సత్యసాయి జిల్లా అని మార్చాలని భగీరథ ప్రయత్నం చేశారు. దానికి ప్రజల నుండి బలమైన వ్యతిరేకం వచ్చింది. చివరకు ఆ ప్రయత్నాన్ని విధిలేక వదిలివేయవలసి వచ్చింది. చివరకు పుట్టపర్తి తాలూకానైనా సత్యసాయి తాలూకా అని నామకరణం చేయాలని వారి శిష్యులు గొణిగారు. కొందరు ఉన్నతాధికారుల మద్దతు దొరికింది. మన పుట్టపర్తిని అంతర్జాతీయ పటంలో వచ్చేలా (కారణం ఏదైనా కానీ) చేసిన బాబాగారి పేరును పుట్టపర్తి తాలూకాకు పోనీ పాపం ఇద్దామని ఒప్పుకున్నారు. ఇది ఎక్కువమంది దృష్టికి రాలేదు. వచ్చినా దీని గురించి ఎవరూ లోతుగా ఆలోచించలేదు. తమిళనాడుకు చెందిన హేతువాది పెరియార్ రామస్వామి నాయకర్ పక్కా నాస్తికులు. దేవుళ్ళను, వారి చిత్రపటాలను హీనంగా అవమానించారు. అలాంటి వారి పేరును వారు జన్మించిన జిల్లాకు పెరియార్ జిల్లా అని సంతోషంతో ఏకాభిప్రాయంతో నామకరణం చేశారు. రాజకీయ వ్యక్తులైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం మరియు రంగారెడ్డి గార్ల పేరును జిల్లాలకు పెట్టారు. అయితే ‘భగవాన్’ బాబాగారికి దక్కింది కేవలం ఒక తాలూకా మాత్రమే. వారు దొరికిందే లాభమని దానినే ఒప్పుకున్నారు. దీనికన్నా అవమానమైన పని ఏదీ లేదు. ఇంతవరకూ ఏ ధార్మిక వ్యక్తి పేరును ఒక జిల్లాకు, ఒక తాలూకాకు పెట్టడానికి ఎవరూ ప్రయత్నించలేదు. అయితే బాబాగారి ఆశీర్వాదంతో వారి కొందరు భక్తుల తీవ్ర ప్రయత్నంతో చివరకు పుట్టపర్తి తాలూకా వారికి దక్కింది. ఏ దృష్టితో చూసినా ఇది సంతోషించదగిన విషయం కాదు. అన్నింటికన్నా ఎక్కువగా ఇది బాబాగారి వైఖరిని, బుద్ధిమట్టాన్ని సూచిస్తుంది. ఇలాంటి దిశలోనే ఇంకొక ప్రయత్నం చేసి అపఖ్యాతిని గడించారు. మహనీయుడు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి పుట్టిన ఊరు చిక్కబళ్ళాపురానికి సమీపంలో ఉన్న ముద్దేనహళ్ళి. అక్కడ బాబాగారు ఒక హైస్కూలును స్థాపించారు. ఆ పాఠశాల ఉన్న ప్రాంతాన్ని సాయిగ్రామ్ అనే పేరును తమ ఇష్టప్రకారం పెట్టుకున్నారు. వారికి ముద్దేనహళ్ళి పేరును చెరిపివేసి తమ సంస్థానాన్ని స్థాపించడం కుదరలేదు. ఇలాంటి చిల్లరపనులే బాబాగారు చేసేవి. సామాన్య మానవుడు కూడా ఈ స్థాయికి దిగజారడు. అయినా కొందరికి వీరు భగవానుడు, సాక్షాత్తు దేవుడు. భగవంతుడా ఇలాంటి దేవుళ్ళ నుండి మమ్మల్ని కాపాడప్పా!

గమనించవలసిన మరో అంశం

మన దేశంలో, రాష్ట్రంలో చాలా ధార్మిక మఠాలున్నాయి, స్వాములు ఉన్నారు. ఇంతకు ముందు వారు కేవలం తమ ధార్మిక కార్యక్రమాలలో పాల్గొనేవాళ్ళు. ఒకే వేదికమీద కలిసేవారు కాదు. ఇప్పుడిప్పుడు ఒక మార్పును చూస్తున్నాము. ధార్మిక లేదా సాంస్కృతిక కార్యక్రమాలలో పెక్కురు మఠాధిపతులు ఒకే వేదిక మీద మాట్లాడుతున్నారు. అయితే బాబాగారు ఇంతవరకూ ఏ కార్యక్రమంలోనూ ఇంకొక స్వామిగారి జతలో వేదికను పంచుకోలేదు. ఇది బాబాగారి న్యూనతనో లేక తామే భగవాన్ అనే అహంకారమో తెలియదు. చాలామంది ధర్మాధిపతులు విద్వాంసులు, ధార్మిక గ్రంథాలపైన పట్టు ఉన్నవారు. బాబాగారు అలాంటివారితో ధార్మిక విషయాల గురించి చర్చ చేయడం ఎలా సాధ్యం? బాబాగారి ప్రవచనాల గ్రంథాలను చదివాను. అవన్నీ సామాన్య విషయాలు. అలాంటి ప్రసంగాలు చేయడానికి విద్వత్తు అవసరం లేదు. అయితే వారికి, మిగిలిన ధార్మిక స్వాములకు లేనటువంటి అస్త్రం – బ్రహ్మాస్త్రం వారి బూడిద – మొండి బూడిద. అదే వారి పెన్నిధి. వారి కోట్లాది రూపాయల పెన్నిధికి మూలమూ అదే.

ఇటీవలి మాయ

ఇటీవల పుట్టపర్తిలో ఒక అతి భయంకరమైన సంఘటన జరిగింది. జూన్ 6, 1993 పుట్టపర్తిలోని బాబా గారి ఆశ్రమంలో నలుగురు విద్యార్థులు బాబా గారి ఆశ్రమాన్ని కాపలా కాస్తున్న ఇద్దరు ద్వారపాలకులను కత్తితో పొడిచి చంపివేశారు. ఆ నలుగురి ఉద్దేశం ఆ ఇద్దరు సెక్యూరిటీ గార్డులను చంపడం కానే కాదు. బాబాగారి నివాసంలోనికి వెళ్ళాలన్నదే వారి ఉద్దేశం. అయితే ఆ గార్డులు వారిని అడ్డగించారు. నలుగురి కత్తిపోట్లకు బలైయ్యారు. గదిలో ఉన్న బాబాగారు భీతిల్లి అక్కడున్న అలారం నొక్కారు. బాబాగారు ఒక మూలలో దాగుకొని కూర్చున్నారు. అపాయపు సైరన్ మ్రోగించారు. పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నుండి ఆయుధాలతో పోలీసులు బాబాగారికి రక్షణగా వచ్చారు. అంతలోనే సమీపంలో ఉన్న గదిలో ఆ నలుగురు దాక్కొని తలుపులు మూసుకున్నారు. పోలీసులు తలుపులు తీసి ఆ నలుగురిని తమ తుపాకీగుళ్ళతో చంపివేశారు. ఆ నలుగురి దగ్గర బాంబులు లేవు. లేదా ఆధునిక అస్త్రాలు లేవు. చాకులు, కత్తులు మాత్రం ఉంచుకున్నారు. వారిని సులభంగా బంధించి ఉండవచ్చు. అయితే వారిని చంపాలని ‘దైవ ప్రేరణ’ కావచ్చు. ఇలాంటి హత్యను ఇంగ్లీషులో Cold blooded murder అని అంటారు. ఆ నలుగురిని హత్యచేసిన ఉద్దేశం సుస్పష్టం. వారు బ్రతికి ఉంటే సత్యసాయిబాబా గారి ‘సత్యం’ బయటపడుతుంది. అందువల్ల ఎలాంటి సమాచారం, సాక్ష్యాధారాలు లభించకుండా నాశనం చేశారు.

బాబాగారు సామాన్య మానవులు. వారికి ఏ అతీంద్రియ శక్తులు లేవు అని నేను చాలా నిదర్శనాలను చూపుతూ ప్రతిపాదిస్తూనే ఉన్నాను. ఇలాంటి నా వైఖరికి ఇంకొక బలమైన ఆధారం దొరికింది. వీరి కొందరు శిష్యులు చెప్పినట్లు బాబాగారు సర్వజ్ఞులు అనేది నిజమే అయితే వారి ద్వారపాలకుల హత్యలను ముందుగానే ఎందుకు పసిగట్టలేక పోయారు? వారికి మానవాతీతశక్తులు ఉంటే ఆ నలుగురిని వారి శక్తితోనే ఎందుకు బూడిద చేయలేదు. పోనీ అదీ వద్దు, వారిని ఎందుకు ఆపలేకపోయారు. బాబాగారు పరిగెత్తిపోయి దాక్కొన్నారు. వారు తమ ప్రవచనాలలో Why fear when I am here అని తమ శిష్యులకు మరీ మరీ చెప్పేవారు. వారే భయంతో ఒక మూలలో దాగుకున్నారు! ఇలాంటి పరిస్థితిలో నేనైనా అలాగే చేసేవాణ్ణని అనిపిస్తుంది. భగవానులకు అలారం బెల్లు అవసరమా. తమ రక్షణకు పోలీసుల సహాయం ఎంత వైపరీత్యం! ఈ సంఘటన నుండి తగిన ఆలోచనాశక్తి ఉన్న కొందరు శిష్యులకు జ్ఞానోదయం కలిగి బాబాగారి శిష్యరికానికి మంగళం పలికారు. ఇంకా కొంతమంది శిష్యులకు శిష్యరికాన్ని వదలడానికి భయం, అవమానం. ఇన్ని సంవత్సరాలు శిష్యులయ్యాక ఇప్పుడు వదలడం సరికాదు, తప్పో ఒప్పో కొనసాగిద్దాము అని అలాగే కాలం గడుపుతున్నారు. కొందరు శిష్యులనయితే ఈ జన్మలో మార్చడానికి వీలుకాదు. వారు వితండవాదులు, మొండి ఘటాలు. మొత్తానికి ప్రశాంతి నిలయం అశాంతి నిలయం అయ్యింది. కురుక్షేత్రం అయ్యింది. ఇంత విపత్తూ నేను పుట్టిన రోజే (జూన్ 6) జరగాలా! అంతా దైవసంకల్పం! అన్నట్లు హత్యలు జరిగి రెండు సంవత్సరాలైన తరువాతా వాటి గురించి ఏ విచారణా జరగలేదు. అన్నీ మూసివేశారు. బాబాగారి మహిమలు ఇలాంటివే!

ఇలాంటి మాయామహిమలను చేసే బదులు ఎండి బెండు అయిపోయిన, వెనుకబడిన తమ పుట్టపర్తి తాలూకాకు (ఇప్పుడు సత్యసాయి తాలూకా) సమయానికి వర్షాలు కురిసేటట్లు చేసి ఆ తాలూకానైనా సారవంతమైన సుక్షేత్రంగా చేసి ఉంటే అక్కడున్న పేద ప్రజలంతా బాబాగారిని దేవుడని పూజించేవారు.

నేను బాబాగారిని ప్రశ్నించినప్పుడంతా నేను బాబాగారికి సవాలు విసురుతున్నానని వారి శిష్యులు ఆరోపిస్తారు. అది శుద్ధ తప్పు. విషయాలను తెలుసుకొనడానికి ప్రశ్నించే స్వభావాన్ని పెంచుకోవాలని నా వేలాదిమంది శిష్యులకు మొదటి నుండీ చెబుతూనే వస్తున్నాను. ఎవరైనా తనకు ప్రకృతి నియమాలను ఉల్లంఘించే శక్తి ఉందని చెప్పుకుంటే సైన్సు విద్యార్థిగా దానిని నేను ప్రశ్నించకపోతే ఆత్మవంచన చేసుకున్నట్లు అవుతుంది. నాది ప్రశ్నించే స్వభావం. సత్యాన్వేషణ నా అభిమతం. ఇప్పుడైనా బాబాగారికి సమయం మించిపోలేదు. వారు నా ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. నా ముందూ మరియూ నాలాంటి స్వభావమున్న మిగిలినవారి ముందు తమ మహిమలను ప్రదర్శించాలి. వారికి ఇవేవీ కాకపోతే భగవంతుడు వారికి సద్భుద్దిని ఇచ్చి ఇలాంటి మోసపూరిత మహిమలను నిలిపి వేసేలా ప్రేరేపించాలి. దేవుని పేరుమీద, ధర్మం పేరు మీద ఇంతవరకూ వేలాది మంది ప్రజలను తప్పుదారి పట్టి యిచ్చినందుకు మనస్ఫూర్తిగా పశ్చాత్తాప పడాలి.

గుట్టు రట్టయ్యింది – మహిమ మట్టి కరిచింది

1992 ఆగష్టు 29వ తేదీ బాబాగారి మహిమ మట్టిలో కలిసిపోయింది. ఆరోజు హైదరాబాదులో బాబాగారి పేరుమీద కట్టిన అతి పెద్ద కళ్యాణమంటపం ప్రారంభం. ప్రధానమంత్రి మొదలైన అనేకమంది ప్రముఖులు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. బాబాగారు అప్పుడు అక్కడ తప్పనిసరిగా ఉండాలికదా! ఎందుకంటే బాబాగారు అసాధ్యులైన ప్రచార ప్రియులు. తమ జన్మదినోత్సవాన్ని దానితోపాటే జరిపించుకునే ఆధ్యాత్మిక వ్యక్తి! మూడు నాలుగు రోజుల ముందు నుండే ప్రముఖ పత్రికలలో ఖరీదైన ప్రకటనల ప్రచారం. వారి విజయాల బాకాలు, బాజా భజంత్రీలు. ఇవన్నీ నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తికి నిషిద్ధం కావాలి. జాగ్రత్తగా గమనించిన వారికి వారి ప్రతి అడుగులోనూ వారి డొల్లతనం కనిపిస్తుంది.

అది అలా ఉండనియ్యండి. మళ్ళీ హైదరాబాద్ కార్యక్రమానికి వెళదాం. ఎదురుచూసినట్లే అత్యంత వైభవంగా ఆ ఉత్సవం భగవాన్ సమక్షంలో జరిగింది. ఆ కళ్యాణమంటపం కట్టిన ప్రముఖులకు బాబాగారి మహిమాన్వితమైన ప్రదర్శన ద్వారా కానుకలు. ఈ కానుకలన్నీ పిడికిలిలో పట్టే వస్తువులే! దానికన్నా పెద్ద వస్తువులను సృష్టి చేయడానికి కుదరదు. ఎందుకంటే వాటిని దాచిపెట్టడానికి వీలుకాదు. చివరలో ఆ కళ్యాణ మంటపాన్ని నిర్మించిన ప్రముఖ ఎల్. అండ్ టి.(Larsen & Toubro) గ్రూపుకు చెందిన ముఖ్య కార్యనిర్వాహకులైన శ్రీ ఎ.రామకృష్ణ గారికి అత్యంత విలువైన బంగారు సరాన్ని ‘సృష్టించి’ వారి కంఠంలో వేశారు. సహజంగానే అలాంటి ముఖ్యమైన కార్యక్రమాన్ని దూరదర్శన్ వారు, ఇతరులు వేరే వేరే దిక్కులనుండి చిత్రీకరించారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆ చిత్రాన్ని నిదానంగా (Slow motion) నడిపినప్పుడు బాబాగారి నమ్మకపాత్రుడైన ఒక సహాయకుడు ఆ బంగారు హారాన్ని వెనుక నుండి గుట్టుగా బాబాగారికి ఇచ్చింది యథాతథంగా చిత్రీకరించబడింది. దీనిని చూసిన ఆ అధికారులు ఖంగుతిన్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినప్పుడు దానిని నాశనం చేయాలని ఆజ్ఞ అయ్యింది. ఆ చిత్రీకరణపు అన్ని ప్రతులలోనూ ఆ బాబాగారి ‘మాయ’ భాగాన్ని నాశనం చేశారు. మూలప్రతిని ఢిల్లీ ఆఫీసులో సురక్షితమైన, భద్రమైన ప్రదేశంలో దాచిపెట్టి ఉండవచ్చని ఒక ఊహ. ఈ పాటికి దానినీ నాశనం చేసినా ఆశ్చర్యంలేదు. అయితే చిత్రీకరణ చేస్తున్న ఒక ప్రైవేటు సంస్థ చిత్రంలోనూ ఈ గుట్టు బయటపడింది. వారు సుమారు 50 ప్రతులు తీశారు. హైదరాబాదు, సికిందరాబాదు అంతా గోలగోల అయ్యింది. బాబా గారి మాయ బట్టబయలు అయ్యింది. దొంగవాడి పెండ్లాం ఏనాటికైనా ముండమోపే. దర్యాప్తుకు లోనయ్యే మహిమలన్నీ మట్టి కరిచేవే!

ఈ ఉత్సవం నడిచిన రెండు మూడు రోజులలో ఈ మాయ గురించిన గుసగుసలు మొదలయ్యాయి. అయితే దానికి గట్టి ఆధారం దొరకడానికి రెండు మూడు నెలలే పట్టింది.

ఈ వివరాలన్నీ ఫోటోలతో సహా హైదరాబాదుకు చెందిన దినపత్రిక డెక్కన్ క్రానికల్ (Deccan Chronicle) 1992 నవంబర్ 13వ తేదీ పత్రికలో ప్రకటించింది.

శాసనమండలి సభ్యునిగా

ఊహించని నామినేషన్

ఒకరోజు (ఆదివారం అనుకొంటాను) బసవనగుడి నేషనల్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆఫీసులో ఒక మీటింగులో ఉన్నాను. ఆ కాలేజీ కొన్ని విభాగాల అధిపతులూ ఉన్నారు. కుమారకృప నుండి ఒక టెలిఫోన్ కాల్ వచ్చింది. నేను ముఖ్యమంత్రిగారైన శ్రీ ఆర్.గుండూరావు గారిని కలవాలని, అందుకోసం నాకు ఒక వాహనాన్ని వెంటనే పంపుతున్నారని, నేను అక్కడే ఉండాలని ఫోన్‌లో ఒక అధికారి చెప్పారు. “అలాగే” అన్నాను. నేను ఎందుకు అంత అర్జెంటుగా కలవాలి అన్నది ఎంత ఆలోచించినా తట్టలేదు. అంతలో ఒక కారు వచ్చింది. హొసకోట కాంగ్రెస్ నాయకులైన శ్రీ మునేగౌడు గారు వచ్చి “రండి వెళదాం” అన్నారు. ముఖ్యమంత్రి నన్ను దేనికోసం పిలుస్తున్నారనే విషయం వారికీ తెలియదు. కుమారకృప గెస్ట్ హౌస్‌కు వెళ్ళాము. అక్కడ ఆజానుబాహువు అయిన ముఖ్యమంత్రిగారు మంచంపై తమ ఎడమ చేతిపై తలను పెట్టుకుని శ్రీరంగపట్టణంలోని రంగనాథ స్వామి వలె పడుకుని ఉన్నారు. ఆప్యాయతతో ఆహ్వానించారు. మా హైస్కూలు, కాలేజీలు ఎలా నడుస్తున్నాయని అడిగి తెలుసుకున్నారు. “మిమ్మల్ని విధాన పరిషత్తుకు నామినేట్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. ముందు మీ అనుమతి తీసుకోవాలి. దానికోసం మిమ్మల్ని ఇక్కడికి పిలిపించాను. మీ అంగీకారం తీసుకున్న తరువాత ప్రధాని ఇందిరాగాంధీ గారి సమ్మతిని తీసుకోవాల్సి ఉంది” అన్నారు. “థాంక్యూ సార్” అని శాంతంగా చెప్పాను. ఉప్పు, పులుపు, కారం ఏమీ లేని నా ప్రతిక్రియ వారికి కొంచెం నిరాశ కలిగించినట్లు ఉంది. “చూడండి, నరసింహయ్యగారూ! ఐదు లక్షలు ఇస్తాను నన్ను నామినేట్ చేయండి అని ఒకరు అడిగారు. ఈ సభ్యత్వానికి చాలా బరువుంది, విలువ ఉంది” అన్నారు. “చాలా థాంక్స్ సార్, దీనికి నేను చాలా కృతజ్ఞుడై ఉన్నాను” అని చెప్పి అక్కడి నుండి వెనుదిరిగాను.

నేనెప్పుడూ దీనిని ఊహించలేదు. కొన్ని సంవత్సరాలైన తరువాత ఈ ప్రతిపాదిత సభ్యత్వాన్ని పొందడానికి ఉన్న పోటీ, డబ్బు ఖర్చుపెట్టడం, ప్రముఖులనుండి సిఫారసులు మొదలైనవి తెలుసుకుని నాకు ఆ సభ్యతం ఇచ్చింది ఆశ్చర్యం అనుకున్నాను. శ్రీమతి జయమ్మ, శ్రీ పీరణ్ణ మరియు నా పేర్లను శాసనమండలి (విధానపరిషత్తు) సభ్యత్వానికి ప్రతిపాదించారు. కొన్ని రంగాలనుండి సభ్యులను నామినేట్ చేయడానికి నియమాల ప్రకారం అవకాశముంది. వైజ్ఞానిక, విద్యా రంగాలకు నేను ప్రతినిధిని. నామినేషన్ ప్రకటన వెలువడిన తరువాత విధానపరిషత్తు సమావేశానికి ముందు వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమానికి ముగ్గురినీ ఆహ్వానించారు. శ్రీ పీరణ్ణగారు హాజరు కాలేదు. నేను మరియు శ్రీమతి జయమ్మగారు ఇంటర్వ్యూలో పాల్గొన్నాము. చాలా ప్రశ్నలు ఇద్దరినీ అడిగారు. సమాధానాలు చెప్పాము. ‘కన్నడప్రభ’ విలేఖరి శ్రీ రాంప్రసాద్ గారు “రేపటి నుండి మీరు కాంగ్రెస్ పార్టీ” అని నాకు కాంగ్రెస్ పార్టీ ముద్రను వేశారు. నాకు ఆశ్చర్యం వేసింది. “నేను ఏ రాజకీయ పక్షానికీ చెందినవాడిని కాను. కాంగ్రెస్ పార్టీకి కూడా చెందినవాడిని కాను. విద్యా వైజ్ఞానిక రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న స్వతంత్ర అభ్యర్థిని. విద్యా వైజ్ఞానిక రంగాలకు రాజకీయాలతో సంబంధం లేదు. ఉండకూడదు” అని చెప్పాను. “అదంతా తాత్వికంగా కరెక్టేగానీ వారి ఉప్పు తిన్న తరువాత ఋణం తీర్చుకోవాలి కదా” అన్నారు. “ఈ మాట నాకు వర్తించదు. నేను స్వతంత్ర అభ్యర్థిని. కాంగ్రెస్ వారు నన్ను నామినేట్ చేసినంత మాత్రాన నేను కాంగ్రెస్ పార్టీకి చెందినవాడిని కాను” అనేది నా వాదన.

మరుసటి రోజు దినపత్రికలలో ఇంటర్వ్యూకు సంబంధించిన వార్త ప్రముఖంగానే ప్రచురింపబడింది. నా అభ్యర్థిత్వంపై నేను వ్యక్తం చేసిన అభిప్రాయమూ ప్రచురింపబడింది. ముఖ్యమంత్రిగారు ఫోన్ చేశారు. “ఏమండీ నరసింహయ్యగారూ, మిమ్మల్ని పోనీ పాపం అని ఉదారమైన మనసుతో నామినేట్ చేశాను. మీరు కాంగ్రెస్ పార్టీ కాదని చెప్పారు” అని చాలా కోపంగా మాట్లాడారు. నేను శాంతంగానే నా వైఖరిని తెలియజేశాను. “మీ తర్కం గిర్కం అన్నీ నాకు అనవసరం. మేము మిమ్మల్ని నామినేట్ చేశాము. అంటే మీరు మా పార్టీ సభ్యుడు అయ్యారు. మా పార్టీ సభ్యుడిని అని చెప్పుకోవడానికి మీకు ఇష్టం లేకపోతే వెంటనే రాజీనామా చేయండి” అని కోపంతో ఫోన్ పెట్టేశారు. నా మనసుకు చాలా బాధ కలిగింది. దీని గురించి సావధానంగా ఆలోచించాను. రాజీనామా చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు. ఈ పదవి కోసం నేను ఏ ప్రయత్నమూ చేయలేదు. ఎవరితోనూ పరోక్షంగా కూడా దీని గురించి ప్రస్తావించలేదు. అయితే దీనిలో ఒక తత్వం దాగున్నది. నాకు తెలిసినట్లు రాజ్యసభకు నామినేట్ చేయబడిన సభ్యులు స్వతంత్రులు. ఏ పార్టీకీ చెందినవారు కారు. చాలామంది నామినేట్ సభ్యులు తమ స్వంత ఇష్టం ప్రకారం పార్టీ సభ్యులు కావడం నిజం. మన రాష్ట్రం విధాన పరిషత్తులోనూ (శాసనమండలి) ఇదే పరిస్థితియే. తాత్వికంగా నేను రాజీనామా చేయవలసిన పనిలేదు అనే విషయంలో నాకు ఎలాంటి సందేహమూ లేదు. అయినా గవర్నరు గారిని కలిసి వారి అభిప్రాయాన్ని తీసుకున్నాను. రాజీనామా చేయవలసిన పనిలేదు. స్వతంత్ర అభ్యర్థిగా నిరభ్యంతరంగా కొనసాగవచ్చు అని చెప్పారు. రాజీనామా చేయకూడదని నిర్ణయించుకున్నాను. ప్రమాణస్వీకారాన్ని దేవుని పేరుమీద లేదా సత్యం పేరుమీద తీసుకునే అవకాశం ఉంది. నేను సత్యం పేరుమీద ప్రమాణ స్వీకారం చేశాను. మీకు దేవుని మీద నమ్మకం లేదా అని సంబంధించిన అధికారులు అడిగారు. “దేవుని అస్తిత్వం నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అయితే సత్యం నమ్మకంపై ఆధారపడదు. వాస్తవస్థితిపై ఆధారపడుతుంది. ఒకవేళ దేవుడు లేకపోతే నా ప్రమాణస్వీకారానికి విలువ ఉండదు. అయితే సత్యం లేదని ఎవరూ చెప్పలేరు. అదీకాక సత్యమే దైవం అని కూడా అంటారు” అని చెప్పాను. సమావేశాలు ప్రారంభమయ్యే ముందు రోజు నాకు సీటు ఎక్కడ కేటాయించారని విధాన పరిషత్తు అధికారులను అడిగాను. “ఇంకెక్కడ వేస్తాము సార్. పాలకపక్షం కాంగ్రెస్ పార్టీ వారితో కూర్చునే ఏర్పాట్లు చేశాము” అన్నారు. సరే వారికి నా ప్రవచనమంతా చెప్పి దయచేసి స్వతంత్ర సభ్యులు కూర్చునేచోట నాకు సీటును ఏర్పాటు చేయమని అడిగాను. వారు ఆశ్చర్యంతో “సరే సార్, మిమ్మల్ని అక్కడే కూర్చోబడతాము” అన్నారు. విధానపరిషత్ మొదలయ్యే ముందు రోజు సభకు వెళ్ళి దీనిని నిర్ధారించుకున్నాను.

కొత్త అనుభవం

ఇది నాకు కొత్త అనుభవం. మొదటి రెండు నెలలు కార్యకలాపాలను జాగ్రత్తగా గమనించాను. సభ కార్యకలాపాలలో రాజకీయ అంశాలదే సింహభాగం. అయితే ఇక్కడ విద్య మరియు ఇతర విషయాలపై మాట్లాడటానికి విధాన సభ(శాసన సభ)కన్నా ఎక్కువ అవకాశం లభిస్తుంది. విధానసభలో సూమారు 230 మంది సభ్యులున్నారు. విధానపరిషత్తులో సుమారు 70 మంది సభ్యులు ఉన్నారు. విధానపరిషత్తును పెద్దల సభ అని పిలుస్తారు. కొన్ని రాష్ట్రాలలో ఈ రెండవ సభ అయిన విధానపరిషత్తును వివిధ కారణాలతో రద్దు చేశారు.

విద్య మరియు శాస్త్రీయ విషయాలపై మాత్రమే నేను మాట్లాడేవాన్ని. ఎప్పుడూ రాజకీయ విషయాలపై ఒక్కమాటా మాట్లాడలేదు. సభలో వాకౌట్లు, సభాధ్యక్షుల ముందుండే బావి(Well)లో ధర్నా చేయడాలు, అరిచి గీపెట్టడాలు మామూలే. హోరాహోరీ వాగ్వాదాలు. నేను ఉన్న ఆరేళ్ళలో ఎప్పుడూ చేయీ చేయీ కలపలేదు. కేవలం ప్రచారదృష్టితో మాట్లాడే సభ్యులకూ కొరత లేదు. అధ్యక్షులకు సభ్యులు చేసే సుదీర్ఘ ప్రసంగాలను ఆపడం గొప్ప ప్రయాసతో కూడిన పని. ఎంతగా చెప్పినా, ఎన్ని సార్లు బెల్ కొట్టినా నిర్లిప్తంగా ప్రసంగం కొనసాగిస్తూనే ఉంటారు. ఇలాంటి పెద్దల సభలో నిజానికి బెల్ ఉండకూడదు. సభ్యులే సంయమనంతో తమ ప్రసంగాన్ని నిర్ణీత వ్యవధిలో లేదా ఒకటి రెండు నిమిషాలు అటూ ఇటూ ముగించాలి. అలాంటి వైఖరి వైపు దృష్టి సారించకపోతే సభ గందరగోళంగా తయారవుతుంది.

ఒకసారి “ఉదయం నుండి సాయంకాలం వరకూ, కొన్నిసార్లు రాత్రి కూడా ప్రజలు తమ వ్యక్తిగత సమస్యలను పరిషరించుకోవడానికి మంత్రులను ముట్టడిస్తారు. రాష్ట్రం యొక్క, దేశం యొక్క గంభీరమైన సమస్యల గురించి ఆలోచించడానికి సమయం ఎప్పుడు దొరుకుతుంది?” అనే ప్రశ్నను పంపాను. అప్పుడు మంత్రులైన శ్రీ నజీర్ సాబ్ గారు మాత్రం నా ప్రశ్నను చాలా మెచ్చుకున్నారు. “మీరడిగిన ప్రశ్న అర్థవంతంగా ఉంది. మాకు ఆలోచించడానికి ఒక నిముషం కూడా దొరకదు. ఎప్పుడూ ప్రజలకు పని ఇప్పించడం, బదిలీ చేయించడం లేదా నిలిపివేయడం ఇలాంటి పనులే ముఖ్యమైపోయినాయి” అని ఒప్పుకున్నారు. నాకు తెలిసినట్లు అభివృద్ధి చెందిన ఏ దేశంలోనూ ఇలా ప్రజలు మంత్రులను ముట్టడి చేయరు. ఒక గుమాస్తా చేసే పనికి మంత్రులను చూడవలసిన పరిస్థితి నెలకొనివుంది. మంత్రులు దేశం యొక్క, సమాజం యొక్క అనేక విషయాలపై గంభీరంగా, ప్రశాంతమైన వాతావరణంలో అధ్యయనం చేయాలి. అనేక పుస్తకాలను చదవాలి. అప్పుడే వారి మార్గదర్శనం అర్థవంతమవుతుంది.

విద్యారంగానికి సంబంధించిన రెండు ప్రశ్నలను ఒకసారి పంపాను. అప్పుడు మాన్యులు శ్రీ జె.బి.శంకరరావు గారు విద్యామంత్రిగా ఉన్నారు. మొదటి ప్రశ్నకు అసంబద్ధమైన సమాధానం ఇచ్చారు. “నాది అధ్యాపక వృత్తి. ఇలాంటి అర్థరహితమైన సమాధానాన్ని నా విద్యార్థి వ్రాసి ఉంటే సున్నా మార్కులను ఇచ్చేవాణ్ణి” అన్నాను. కొంతమంది సభ్యులు నవ్వారు. మంత్రి ఏదో సంజాయిషీని ఇవ్వడానికి ప్రయత్నించారు. రెండవ ప్రశ్నకు ఉత్తరమైతే మరీ అధ్వాన్నంగా ఉంది. దానిని చదివి నాకు షాక్ కొట్టినట్టయ్యింది. నిస్సహాయుడినై ‘అయ్యో భగవంతా’ అన్నాను. దానికి కాంగ్రెస్ నాయకులు శ్రీ టి.ఎన్.నరసింహమూర్తిగారు “ఓ వినండి, వినండి, నరసింహయ్యగారు భగవంతుడిని తలుచుకున్నారు. కనుక వారు ఏమి అడిగితే అది ఇచ్చేద్దాం” అన్నారు. ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడో, వాహనాల ప్రమాదం లేదా మరోవిధమైన ప్రమాదం జరిగిన సందర్భంలోనో నేను సాధారణంగా ‘అయ్యో భగవంతా’ అనే అలవాటు మొదటినుండీ వచ్చింది. విశ్వవిద్యాలయం మీటింగులలో, స్నేహితులతో మాట్లాడేసమయంలో ‘అయ్యో భగవంతా’, ‘దేవుడే కాపాడలి’ అని చాలా మామూలుగా ఉపయోగిస్తాను. ఇది అలవాటుగా వచ్చిందే కానీ దీనికేమీ విశేషమైన అర్థం లేదు. ఈ సందర్భంలో నాకు జ్ఞాపకం వచ్చిన ఒక సంఘటనను శ్రీ నరసింహమూర్తిగారి ప్రతిక్రియకు స్పందిస్తూ చెప్పాను. ఒక పత్రికాగోష్ఠిలో పేరు పొందిన కమ్యూనిస్ట్ నాయకులు శ్రీ ఇ.ఎం.ఎస్.నంబూదరిపాద్ గారు విలేఖరి అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “దేవుడికే తెలియాలి (God only knows)” అన్నారు. అక్కడున్న అందరికీ ఆశ్చర్యం వేసింది. నంబూదరిపాద్ సిసలైన నాస్తికులు. “మీరు నాస్తికులై ఉండి దేవునికి తెలుసు అంటున్నారే” అని ప్రశ్నించారు. దానికి చాకచక్యంతో వారు “దేవునికే తెలుసు అంటే ఎవరికీ తెలియదు అని అర్థం (When I say God only knows means nobody knows)” అని చెప్పి అందరినీ చకితులను చేశారు. ఎంత చురుకైన బుద్ధో చూడండి. ఎంతైనా శంకారాచార్యుల నేలపై పుట్టినవారు కదా!

సభలో మూఢత్వం

ఒకసారి ఒక కాంగ్రెస్ సభ్యుడు ప్రమాదాలపై చర్చ జరుగుతున్నప్పుడు తమ ఊరికి వెళ్ళే ఒక మార్గంలో తరచూ ప్రమాదాలు జరగడానికి భూతాలే కారణం అన్నారు. ఇలాంటి వారిని దేవుడే కాపాడాలి.

అది సంజయ్ గాంధీ మరణించినప్పుడు సంతాపాన్ని వ్యక్తం చేసే సందర్భం. శ్రీ ఎ.కె.సుబ్బయ్యగారు మాట్లాడుతూ “సంజయ్ గాంధీగారు దుస్తుల (Safety Jacket and Shoes) విషయంలో విమాన చాలకుల నియమాలను అనుసరించి ఉంటే ఇలాంటి దుర్ఘటన జరిగిఉండేది కాదు” అని చెప్పారు. దానికి ఒక కాంగ్రెస్ సభ్యులు (శ్రీ పుట్టస్వామి గౌడ్ గారు అనుకుంటాను, వారు కాకపోతే వారు నన్ను క్షమించాలి) “దుస్తులకూ, ప్రమాదానికీ ఏమీ సంబంధం లేదు. ప్రమాదాలు, మరణించడం విధి నియమం. వాటిని తప్పించడం ఎవరివల్లా కాదు” ఈ విధంగా సంజయ్ గాంధీ దుర్మరణానికి వ్యాఖ్యానం చేశారు. ఇలాంటి అసంబద్ధమైన సమాధానం విని నేను సహనాన్ని కోల్పోయాను. అయితే అది సంతాపాన్ని సూచించే సభ. ఏదైనా ఎక్కువ వివాదాస్పదంగా మాట్లాడటం సభ్యత కాదు. అయితే మరీ అహేతుకంగా మాట్లాడుతున్నప్పుడు ఊరికే ఉండటం కూడా సరికాదు. ఈ ఊగిసలాట మధ్య “గౌరవనీయులైన సభ్యులు చెప్పింది అర్థరహితం. వారి నమ్మకం ప్రకారం ప్రమాదాలు, చావు మొదలైనవి విధి లిఖితంగా, మార్చడానికి ఎవరికీ వీలుకాకపోతే ఈ వాహన నియామలన్నీ ఎందుకుండాలి? కూడలిలో వాహనాలను నియంత్రించడానికి ఎరుపు, పచ్చ లైట్లు ఎందుకు ఉండాలి? కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ట్రాఫిక్ పోలీస్ దళాన్ని ఎందుకు పెట్టుకోవాలి? వాహనాలను స్వేచ్ఛగా వదలండి. విధి లిఖితం ప్రకారం ప్రమాదాలు, మరణాలు సంభవిస్తాయి” అని చెప్పాను. సభ్యులు గట్టిగా నవ్వడానికి వీలులేని సందర్భం. కొందరు ముసిముసినవ్వులు మాత్రం నవ్వారు. నేను నా సంభాషణను పొడిగిస్తూ “శవాన్ని కాల్చేటప్పుడు గంధపు చెక్కలు ఉపయోగించడమూ, నెయ్యి పోయడమూ సరైనదికాదు. ఎండిపోయిన ఏ చెట్టు, సీమనూనెను ఉపయోగిస్తే చాలు” అని చెప్పి సంజయ్ గాంధీ గురించి ఒకటి రెండు మంచి మాటలు చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను. ఎవరు మరణించినా పూడ్చలేని నష్టం జరిగింది అని చెప్పడం మనకున్న చెడు అలవాటు. కొందరు సంవత్సరాల తరబడి వ్యాధితో మూలుగుతూ 80 యేళ్ళు దాటినవారు మరణించినా నష్టాన్ని భర్తీచేయలేమని పలువురు సభ్యులు బాధపడుతున్నట్లు నటించి మాట్లాడుతారు. అలాంటివారు ఏ రంగంలో ఎంత ప్రతిభావంతులైనా, ఆ వయసులో అలాంటి పరిస్థితులలో సమాజానికి ఏవిధంగా ఉపయోగపడగలరు? ఇలాంటి సందర్భంలో ఒకసారి నేను మాట్లాడుతూ “అందరూ చనిపోవాల్సిందే. వారు ఎన్ని సంవత్సరాలు నిస్సహాయ స్థితిలో, అనారోగ్యం నుండి ఎంతమాత్రమూ కోలుకోవడం అసాధ్యమైనప్పుడు వారి మరణం పూడ్చలేని నష్టం అని చెప్పడానికన్నా వారి గురించి మనం వెచ్చిస్తున్న సమయం నిజంగా పూడ్చలేని నష్టం” అని చెప్పి కూర్చున్నాను. సంతాప సభకు ముందు అందరూ ఖుషీగా ఉంటారు. సభ ముగిసిన తరువాత కూడా అందరూ సంతోషంగా ఉంటారు. వారి దుఃఖమంతా సంతాపసభకు మాత్రమే పరిమితమై ఉంటుంది.

సుమారు 10 సంవత్సరాల క్రితం ప్రభుత్వ రంగ సంస్థలైన అన్ని కర్మాగారాల సామూహిక సమ్మె సుమారు 54 రోజులు నడిచింది. ఈ సుదీర్ఘమైన సమ్మె కారణంగా కార్మికులు అయోమయంలో పడిపోయారు. ఎక్కువమందికి ఉపవాసమే గతి అయ్యింది. ఎంతో మంది తమవద్ద ఉన్న సామానులను కుదువ పెట్టి జీవనం కొనసాగించారు. దీనికి పరిష్కారం కనుగొనడానికి బెంగళూరు నియోజకవర్గం ఎమ్మెల్యేలు, సంబంధించిన మంత్రులు మరియు అన్ని కార్మికసంఘాల నాయకుల సమావేశాన్ని విధానసౌధలోని ఒక హాలులో ఏర్పాటు చేశారు. దానిలో పాల్గొనడానికి నాకూ ఆహ్వానం వచ్చింది. ఇలాంటి సభలలో పాల్గొని నేను మాట్లాడను. మొదటే చెప్పినట్లు నాది విద్య, వైజ్ఞానిక రంగాలు. విధాన పరిషత్తు సభ జరుగుతున్నప్పుడే ఆ సభను కూడా ఏర్పాటు చేశారు. విధానపరిషత్ కార్యకలాపాలు చాలా నీరసంగా నడుస్తూ ఉంది. అందువల్ల ఆ చర్చా సభలో ఏమి జరుగుతోందో చూద్దామని అక్కడికి వెళ్ళి కూర్చున్నాను. వాదవివాదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో స్వీటు కారం మొదలైనవాటితో కూడిన టిఫెన్ ప్లేట్లు చాలా ప్రత్యక్షమైనాయి. వీధిపాలైన కార్మికుల గురించి కన్నీరు కారుస్తూ ఏ మొహమాటం లేకుండా తిండి తినడాన్ని చూసి నాకు బాధకలిగింది. నిజంగా వారికి కార్మికులపైన కనికరం ఉంటే అలాంటి మంచి తినడానికి మనసెలా వచ్చింది? గాంధీజీ గారు అయివుంటే వారూ ఉపవాసం చేసేవారు. లేదా అలాంటి ఎలాంటి తిండినీ ముట్టుకునేవారు కాదు. గాంధీ తత్వానికీ, కొన్ని వామపక్ష సిద్ధాంతాలకూ ఇలాంటి వ్యత్యాసం ఉంది.

బాణామతి కమిటి

1980 జూలై నెలలో నడుస్తూ ఉన్న విధానపరిషత్ సమావేశాలలో గుల్బర్గా, బీదర్ జిల్లాలలోని పల్లెలలో ప్రకృతి విరుద్ధమైన క్షుద్రశక్తుల ఇబ్బందులతో (దీనిని బాణామతి అని పిలుస్తారు) గ్రామప్రజలు అనుభవిస్తున్న కష్టాల ప్రస్తావన వచ్చింది. ఈ భూతవిద్యల స్వరూపాన్ని పరిశోధించడం ద్వారా కనిపెట్టాలని, దానికోసం ఒక కమిటీని వేయాలని ప్రతిపాదించారు. ప్రభుత్వం ఈ సలహాను ఒప్పుకుని ఆగష్టు నెలలో ఈ క్రింద పేర్కొన్న కమిటీని ఏర్పాటు చేసింది.

అధ్యక్షులుగా డా.హెచ్.నరసింహయ్య, సభ్యులుగా బెంగళూరు విశ్వవిద్యాలయపు మానసికశాస్త్ర విభాగం అధిపతి ప్రొ.వినోదా ఎస్.మూర్తి, బెంగళూరులో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ అండ్ న్యూరో సైన్స్ ప్రొఫెసర్ హెచ్.ఎస్.నారాయణ్, సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజీకి చెందిన డా.జి.ఎస్.రెడ్డి, శాసనసభ్యులు శ్రీ ఎస్.మల్లికార్జునయ్య (ప్రస్తుతం లోకసభ ఉపాధ్యక్షులు), శ్రీ అబ్దుల్ నజీర్ సాబ్ మరియు ఎం.సి. పెరుమాళ్ గారలు. వీరితోపాటు ఏడుగురు మానసికవైద్యుల బృందం సహాయం తీసుకుని గుల్బర్గా, బీదర్ జిల్లాలలోని 12 పల్లెలను సందర్శించి బాణామతితో పీడితులయిన సుమారు 225 మందిని పరీక్షించాము. దుస్తులు ఉన్నట్టుండి కాలిపోవడం, ఇళ్ళపై రాళ్ళు పడటం, వ్యాధి పీడితులు గట్టిగా అరచడం, ఏడ్వడం, అసంబద్ధంగా మాట్లాడటం, ఇతరులను నోటికి వచ్చినట్లు తిట్టడం, వస్తువులు మాయం కావడం మొదలైనవి మా దృష్టికి వచ్చిన బాణామతికి సంబంధించిన సంఘటనలు.

విస్తృతమైన పరీక్ష

మానసికోద్రేక, ఉన్మాదానికి (Hysteria) సంబంధించిన అనేక వ్యాధులను మా వైద్యుల సూచనల మేరకు రోగులలో చికిత్స ప్రారంభమయ్యింది. వారి సూచనల మేరకు వాటిని నిలిపివేశారు. ఒక రోజు రాత్రి గుల్బర్గా నుండి సుమారు 50 కి.మీ. దూరంలో ఉన్న ఒక పల్లెలో చాలాసేపు పరీక్షిస్తున్నాము. సుమారు రాత్రి 10 గంటల సమయంలో ఒక స్త్రీ గట్టిగా అరవడం, కేకలు వేయడం చెప్పడానికి వీలుకానంతగా కొనసాగుతోంది. నేనైతే అలసిపోయాను, ఆకలి అవుతోంది. పైగా 50 కి.మీ.దూరంలో ఉన్న గుల్బర్గాకు రాత్రి వెళ్ళాల్సి ఉంది. నేను విసుగుతో “చాలు ఆపమ్మా నీ అరుపులు” అన్నాను. తక్షణం నిలిపివేసింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

మా సందర్శనలో జరిగిన ఒక సంఘటన ఇంకా జ్ఞాపకం ఉంది. బీదర్ నుండి సుమారు 7 కి.మీ.ల దూరంలో ఉన్న బెనకనహళ్ళి గ్రామానికి 1981 జనవరి 10వ తేదీ వెళ్ళాము. ముందు రోజు ఆ గ్రామ పెద్దలు మమ్మల్ని ఆహ్వానించారు. ఉదయం 11 గంటలు. పల్లె జనాభా సుమారు 1000మంది. సుమారు 200కన్నా ఎక్కువమంది వచ్చి కూర్చున్నారు. వారిలో స్త్రీలే ఎక్కువ. గ్రామపెద్దలు బాణామతి నుండి ఆ పల్లె పడుతున్న కష్టాలను వివరించారు. అక్కడికి వచ్చిన ప్రజలంతా మమ్మల్ని ఆత్రుతగా అన్యమనస్కంగా చూస్తున్నారు.

మా కమిటీలోని ఒక సభ్యుడు ఒక స్త్రీకి సలహా ఇస్తున్నారు. అంతలో ఆమె తన తలను అటూ ఇటూ ఊపడం మొదలుపెట్టింది. మిగిలిన స్త్రీలు ఆమెను అనుసరించారు. పురుషులూ వెనుకంజ వేయలేదు. కొన్న్ని నిముషాల తరువాత పిచ్చికేకలు, ఏడ్పులు, భయంకరంగా అరుపులు మొదలయ్యయి. మొత్తం ఊరు ఊరే అరుస్తున్నట్లు తోచింది. దుర్బల మనస్కుడినైతే నేనూ వారిలో ఒకడిని అయ్యేవాడిని. దీనిని సామూహిక ఉన్మాదం (Mass Hysteria) అంటారు. సుమారు 15-20 నిముషాల తరువాత ఠక్కున అది ఆగిపోయింది. వీటన్నింటినీ కూలంకషంగా తనిఖీ చేశాము. ఈ రోగాలను నయం చేస్తామని చెప్పుకుని మాంత్రికులు, సాధువులు వీరినుండి వందలాది రూపాయలు తీసుకుని మోసం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమాయక ప్రజలను వీలైనంత దోపిడీ ఈ నెపంతో జరిగింది. మా కమిటీ 40 సంఘటనలను పరిశీలించి సుదీర్ఘమైన రిపోర్టును 1981 మార్చి నెలలో ప్రభుత్వానికి ఈ క్రింది తీర్మానాలు మరియు సిఫారసులతో ఇచ్చాము.

కమిటీ సిఫారసులు

ఈ తనిఖీలో మేము గమనించింది ఏమంటే బాణామతి సామాన్యంగా చాలా దూరంలో ఉండే కుగ్రామాలలో అతి పేదరికంలో ఉన్నవారిలో కనిపిస్తుంది. శ్రీమంతులు బాణామతి నుండి మినహాయించబడ్డారు. భయం, మూఢత్వం, వ్యక్తిగత మరియు కుటుంబ సమస్యలు, పేదరికం, ధార్మిక నమ్మకాలు, పల్లెలలో ఉండే ముఠా వైషమ్యాలు మొదలైనవి బాణామతికి కారణాలు. బాణామతికి సంబంధించిన ఎక్కువ సంఘటనలు మనోదౌర్బల్యంతో కూడిన వ్యాధులు, ఉన్మాదాలు, సామూహిక ఉన్మాదాలు. వీటి అన్ని వివరాలను ఇచ్చే అవసరం లేదు. అన్నీ కూలంకషంగా, సావధానంగా పరిశీలించిన తరువాత ఈ బాణామతికి సంబంధించిన ఏ ఒక్క సంఘటనా మానవాతీత శక్తుల నుండి కాదు అని ఖచ్చితంగా ఏకగ్రీవంగా నిర్ధారణకు వచ్చాము. బాణామతికి విద్యావంతుల మూఢత్వమూ పుష్టిని ఇచ్చింది. అంతేకాకుండా వీటి గురించి కొన్ని ప్రాంతీయ పత్రికలలో అసంబద్ధమైన, బాధ్యతారహితమైన, అహేతుకమైన వ్యాసాలు, వార్తలు బాణామతి వ్యాప్తి చెందడానికి ప్రోత్సాహమిచ్చాయి. ఇది కొన్ని పల్లెలలో ఎంత వ్యాపించింది అంటే సాధారణంగా వచ్చే తలనొప్పి, కడుపునొప్పి, జ్వరాలు కూడా బాణామతి ప్రభావం నుండి అని భయపడుతున్నారు.

అప్పుడప్పుడూ మానసిక వైద్యచికిత్సకు శిబిరాలను నడపాలి. ఇవి మానసిక రోగాలే తప్ప ఏ భూత ప్రేతాల చేష్టలు కావు అని ప్రజలకు ధైర్యం చెప్పే వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. ప్రజలు ఇంకా ఇలాంటి మాయ మంత్రాలపై నమ్మకం పెట్టుకుని వుంటే అప్పుడప్పుడు వాటిని పరిశీలించే సమర్థవంతమైన సంస్థలను ఏర్పాటు చేసి వాటి నివేదికలను ప్రజలకు తెలపాలి. ప్రజలలో ఇలాంటి నమ్మకాలను పోగొట్టడానికి ఎవరైనా ఇలాంటి మానవాతీత శక్తులు ఉన్నాయని నిరూపిస్తే వారికి తగినంత బహుమానం ఇవ్వాలి మొదలైనవి కమిటీ ముఖ్యమైన సిఫారసులు. కమిటీ రిపోర్టును ప్రభుత్వానికి యథావిధిగా అందజేయబడింది. ప్రభుత్వమూ యథావిధిగా ఇప్పటివరకూ, ఇకముందూ ఆ నివేదికను వెలుతురు తగలకుండా భద్రమైన అరలలో దాచిపెట్టి కాపాడుతూ ఉంది.

విద్యా విషయాలు

నేను మొదటే చెప్పినట్లు విద్యా విషయాలకు సంబంధించి ఎక్కువ భాగం చర్చలలో చురుకుగా పాల్గొనేవాడిని. ప్రాథమిక విద్యకు తగిన భద్రత కల్పించపోతే విద్యారంగం అస్థిరంగా ఉంటుంది. ఏకోపాధ్యాయ పాఠశాలల (Single Teacher Schools)ను రద్దుచేసి ఎక్కువమంది ఉపాధ్యాయులను నియమించాలని, ప్రతి ప్రభుత్వ పాఠశాలను మాదిరి పాఠశాల (Model School) చేయాలని అనేకసార్లు ఆగ్రహపూర్వంగా నొక్కి చెప్పాను. సామాన్యంగా పేదలు, పల్లెటూరివారే ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళేది. అందువల్ల ఆ పాఠశాలలకు అన్ని సౌకర్యాలు ఇవ్వడం మొదటి కర్తవ్యం. ఇప్పటికీ సరైన భవంతులు లేని పాఠాశాలలు ఎక్కువగా ఉన్నాయి. ఈ ప్రభుత్వ పాఠశాలలన్నీ అనాథాలయాలయ్యాయి.

ఒకసారి రిజర్వేషన్ల గురించి చర్చ సాగుతోంది. ఆర్థిక, సామాజిక దృష్టితో రిజర్వేషన్లను నేను సమర్థిస్తాను. అయితే అవి ఎంత ప్రమాణంలో ఉండాలి, ఎంత కాలం ఉండాలి అనేవి వివాదాస్పదమయ్యాయి. రిజర్వేషన్ల నుండి నిజమైన పేదవారికి, వెనుకబడినవారికి సహాయం లభించాలి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలలో ఉండి పేదరికంలో మగ్గుతున్న వర్గంలో పుట్టినవాడు అన్ని కనీస సౌకర్యాలను పొంది సామాజికంగా, ఆర్థికంగా ముందున్న వర్గాలకు చెందిన విద్యార్థులతో పోటీ పడటం అసాధ్యం. దురదృష్టవంతులను పైకి లేపడానికి వ్యవస్థ ఏర్పరిచిన మార్గం రిజర్వేషన్లు. అయితే ఈ రిజర్వేషన్ల నెపంతో ఒక వర్గంలోని బలవంతులు అదే వర్గంలోని బలహీనులను దోపిడీ చేయరాదు. ఇలా జరుగుతున్న స్పష్టమైన సూచనలు కనిపిస్తున్నాయి. రిజర్వేషన్లు పొందుతున్న అన్ని వర్గాలకూ ఆదాయ పరిమితి ఉండాలి. అప్పుడు ఆ వర్గాలలోనే ఎక్కువ మంది లబ్దిదారులను వారి వర్గంలోని పేద ప్రజల పేరుతో లాభాన్ని పొందడాన్ని తప్పించగలము. ఇప్పుడు ఇది వెనుకబడిన తరగతులలో అమలులో ఉంది. అయితే షెడ్యూలు కులాలు, తెగలలో ఈ ఆదాయ పరిమితి లేదు. షెడ్యూలు కులాలు, షెడ్యూలు తెగలు అత్యంత వెనుకబడిన వర్గాలు. అయితే రిజర్వేషన్ సౌలభ్యం వల్ల వారిలో ఇప్పుడు ఎక్కువమంది పెద్ద పెద్ద అధికారులు అయ్యారు. ఇది చాలా సంతోషించదగ్గ విషయం. అయితే ఇలాంటి వారి సంతానంతో పల్లెలలో గుడిసెలలో నివసిస్తూ ఒక పూట తింటే మరో పూటకు అన్నం దొరకని విద్యార్థులు ఎప్పటికీ పోటీ పడలేరు. ఆదాయ పరిమితి లేనందువల్ల షెడ్యూలు కులాలు, తెగలలో క్రీమీలేయర్ పైనున్న వారికి ఈ సౌకర్యాలు లభిస్తూ అదే వర్గంలో క్రింద ఉన్నవారు అలాగే మిగిలి ఉన్నారు. ఇంతకు ముందు షెడ్యూలు కులాలు, తెగలవారికి సామాజికంగా, ఆర్థికంగా ముందున్న వర్గాలతో ఎలాంటి సమస్యలు ఎదురయ్యేవో అవే సమస్యలు ఇప్పుడు రిజర్వేషన్లు పొందుతున్న తమ వర్గంవారితో ఎదురవుతున్నాయి. అందువల్ల షెడ్యులు తెగలు, కులాలలోనూ ఒక ఆదాయ పరిమితి ఉండాలి అని విధాన పరిషత్తులో ప్రతిపాదించాను. అందరూ నా వాదనను విన్నారు. సమర్థించలేదు విరోధించనూ లేదు. నా వాదన గురించి దినపత్రికలు ఒక అక్షరమూ వ్రాయలేదు. ఈ సున్నితమైన విషయంలో పై స్థాయిలో ఉన్న షెడ్యూలు కులాల, జాతుల నాయకులు క్రిందనున్న తమవారైన అమాయక ప్రజలకు మానవతా దృష్టితో సామాజికన్యాయాన్ని కల్పించడానికి ప్రయత్నించాలి.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here