[శ్రీ శ్యామ్ కుమార్ చాగల్ రచించిన ‘రెడ్ హ్యాండెడ్’ అనే పెద్ద కథని పాఠకులకి అందిస్తున్నాము. ఇది మూడవ, చివరి భాగం.]
“రేపు ఢిల్లీ వెళ్తున్నాను” అన్నాడు మహి.
“ఎన్ని రోజులు” గోముగా అంది మేఘన, మహి భుజం మీద తల పెట్టి.
చూపులు తిప్పుకుని, మంచం పక్కన కిటికీలో నుండీ కనపడుతున్న చంద్రుని వంక చూస్తూ చెప్పాడు “మూడు రోజులు” అని.
“అబ్బో.. అన్ని రోజులే!..” అంది మేఘన, భర్త చుట్టూ చేయి వేసి.
మారు మాట్లాడకుండా పక్కకు తిరిగి, బెడ్ లైట్ ఆర్పేశాడు మహి.
***
“రహీం, తమ్ముడికి స్పృహ వచ్చిందని హాస్పిటల్ నుండీ ఫోన్ వచ్చింది” అంది రహీం భార్య మొబైల్ చేతిలో పట్టుకుని. భార్యను సంతోషంతో నమ్మలేనట్లుగా చూసాడు రహీం ఖాన్.
“సుభానల్లా” అని తింటున్న భోజనం వదిలేసి బయటకు పరిగెత్తాడు రహీం ఖాన్.
కాసేపటికి తన ఇద్దరు స్నేహితులతో కలిసి హాస్పిటల్‌లో గదికి చేరుకున్నాడు. బయట నిలబడ్డ నలుగురు కానిస్టేబుల్స్‌ని చూసి “అప్పుడే మీకు తెలిసిందా?” అంటూ లోని కెళ్ళాడు.
రహీం ఖాన్‌ని చూసిన అతని తమ్ముడు నీరసంగా నవ్వాడు. అతన్ని గట్టిగా పట్టుకుని
“దేవుడు ఇప్పటికి దయ చూపించాడు. అయిదు సంవత్సరాల తర్వాత లేచావు. ఆత్మహత్య చేసుకునే కర్మ నీకేంటిరా” అని అతడిని కౌగిలిలో బిగించి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు.
కాసేపటి తర్వాత ఇన్‌స్పెక్టర్ రాజు లోపలికి అడుగు వేసి “మీరందరూ కాసేపు బయటకు వెళ్లి కూర్చోండి” అన్నాడు.
రహీం ఖాన్‌తో సహా అందరూ బయట కూర్చున్న గంట తర్వాత ఇన్‌స్పెక్టర్ రాజు, బయటకు వచ్చి రహీంని పక్కకు తీసుకెళ్లి “మీ తమ్ముడు ఆత్మహత్య చేసుకోవాలనుకోలేదు. ఇంట్లో కోటి రూపాయల కాష్ ఉండాలి అంటున్నాడు. మీరేమో లాకర్ ఖాళీ అని రిపోర్ట్ చేసినట్లుగా వుంది. మీ తమ్ముడి భార్యతో ఒక సారి మాట్లాడాలి, ఆవిడ ఎక్కడ వుంటారు” అని మిగిలిన విషయాలు చెప్పసాగాడు.
కళ్ళు చిన్నవి చేసి భృకుటి ముడిచి ఆలోచనలో పడ్డాడు రహీం ఖాన్.
***
“నీ ఫ్లైట్ రేపు, నేను సాయంత్రం వెళ్తున్నాను. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే నాకు ఫోన్ చేయి.” మెల్లిగా అన్నాడు మహి, ఫోన్ నోటికి దగ్గరగా పెట్టుకుని.
“సరే సర్” అంది అటువైపు నుండీ లిజీ.
“తప్పకుండ రావాలి, మిస్ చేయొద్దు. నీ టికెట్ నేనే స్వయంగా డబ్బులు కట్టి తెప్పించాను” అన్నాడు మహి.
“సరే” అని ఫోన్ పెట్టేసింది లిజీ.
తన చేతుల్లోని ఫోన్ టేబుల్ మీద పెట్టి, సంతోషంగా ఊపిరి పీల్చాడు. రేపు లిజీతో గడిపే క్షణాలను ఊహించుకుంటూ ఆఫీసు కుర్చీలో వెనక్కి వాలాడు మహి. అతని ఒళ్ళంతా వేడెక్కింది. అతనిలో కోరిక కార్చిచ్చులా రగిలి పోతూవుంది. కళ్ళు మూసుకుని లిజీ నవ్వుని గుర్తు చేసుకుని తన్మయత్వంలో మునిగిపోయాడు.
సాయంకాలం ఫ్లైట్ ఎక్కి కూర్చుని ఒకసారి లిజీకి ఫోన్ చేసాడు. ఫోన్ రింగ్ అవుతూ ఉంది, కానీ లిజీ నుండీ జవాబు రాలేదు. ఒకసారి ఫోన్ కట్ అయ్యింది. చాలా మార్లు ప్రయత్నించాడు. ఆమె నుండీ సమాధానం రాక పోయేసరికి అతనిలో టెన్షన్ పెరగసాగింది.
కూల్‍గా ఉండటానికి యత్నించిన కొద్దీ అతని తల వేడెక్కసాగింది. మస్తిష్కంలో అలజడి చిరాకు మొదలయ్యింది. అంతలో మొబైల్ ఫోన్ రింగ్ అయ్యింది.
‘అమ్మయ్య! మొత్తానికి ఫోన్ చేసింది’ అనుకుని చటుక్కున ఫోన్ లేపి “హలో” అని అటునుండి తీయని గొంతు వినగానే “ఏమైంది? ఎనీ ప్రాబ్లెమ్” అన్నాడు ఆతృతగా
“నాకేం ప్రాబ్లెమ్ లేదే, ఎందుకలా అడిగారు” అంది అటునుండి మేఘన. వెంటనే స్క్రీన్ మీద నెంబర్ చూసాడు. అది మేఘన నెంబర్.
తడబాటుతో “అబ్బె.. ఇప్పుడే చాలా సార్లు.. నీకు ఫోన్ చేసాను.. ఫోన్ దొరికి చావలేదు, కంగారు పడ్డా” అన్నాడు మహి.
“చేసావా? థ్యాంక్యూ మహి. ఐ లవ్ యు” అంది మేఘన ఎంతో ఉత్సాహంగా.
అతనికి మరొక కాల్ వస్తున్నట్లుగా బీప్ టోన్ రాసాగింది. ఫోన్ స్క్రీన్ చూసాడు. లిజీ ఫోన్ చేస్తూ వుంది.
“ఓకే. ఐ టూ లవ్ యూ. వుంటాను. ఫ్లైట్ కదుల్తూ ఉంది.” అన్నాడు కంగారుగా.
“ఓకే. బై” అంది. కాల్ కట్ అయ్యింది.
వెంటనే లిజీకి నంబర్ కలిపాడు మహి.
ఫోన్ లేపి “హలో, మీరు ఫోన్ చేసినప్పుడు మేడం నా ముందే వున్నారు, అందుకే లేపలేదు” అంది లిజీ.
“ఓహ్.. సరే, రేపు ఇదే సమయానికి ఫ్లైట్. ఎయిర్‌పోర్ట్‌లో దిగగానే క్యాబ్ తీసుకుని హోటల్ రూమ్‌కి వచ్చేద్దు. నా పక్క రూమ్ బుక్ చేసాను. రాగానే ఫోన్ చేయి” అన్నాడు మహి.
“నాకు భయంగా ఉంది. నేను రాలేనేమో” అంది బెరుకుగా.
చిరాకుగా చేతితో తల బాదుకున్నాడు మహి. “ఏమీ భయం అక్కర లేదు. రిసెప్షన్ దగ్గర అడిగితే నీ రూమ్ కీస్ ఇచ్చేస్తారు. రూమ్‌కి వచ్చి నాకు ఫోన్ చేయి.” అన్నాడు ధైర్యం చెప్తున్నట్లుగా.
అటునుండి సమాధానంగా “సరే” అని ఫోన్ కట్ చేసింది లిజీ.
లిజీ తప్పనిసరిగా వస్తోందనే ఊహ అతని మనసు సముద్రపు అలల్లాగా ఎగసి పడుతోంది.
***
మరుసటి రోజు త్వరగా పని ముగించుకుని హోటల్ రూంకి చేరుకున్నాడు మహి. కోటు, టై విప్పి సోఫాలో కూర్చుని లిజీకి ఫోన్ చేసాడు.
“హలో ఇదుగో.. ఇప్పుడే ఫ్లైట్ ఎక్కుతున్నాను” అంది. ఆమె గొంతులో చిన్న వణుకు గమనించాడు మహి.
“గుడ్. ఐ విల్ వెయిట్” అని చెప్పి ఉద్వేగంతో మంచం మీద వాలాడు. కళ్ళు మూసుకుని కాసేపు కునుకు తీద్దామని ప్రయత్నించాడు కానీ నిద్ర పట్టలేదు. మనసంతా సముద్రం లాగా అల్లకల్లోలంగా వుంది. కాసేపటిలో లిజీతో కలయిక అనే ఆలోచన అతడిని ఉద్రేకానికి గురి చేస్తూ వుంది. అతనిలో సంతోషం అదుపులేకుండా ఎగసి పడుతూ వుంది. అంతలోనే మేఘన గుర్తొచ్చింది. అతనిలో అంతర్మథనం మొదలయ్యింది. నీవు చేసేది తప్పేమో అంది అతని అంతరాత్మ.
మరి నా కోరికలు ఎలా తీరాలి? అని ప్రశ్నించాడు. కోరికలకు అంతెక్కడా? మళ్ళీ ప్రశ్నించింది అంతరాత్మ. కళ్ళ ముందు అందాలను ఎలా వదులుకోవాలి? సమాధానం చెప్పుకున్నాడు. నీ ఖర్మ అంది అతని అంతరాత్మ.
ఇలాంటి సందిగ్ధా వస్థలో మెల్లిగా మగత నిద్ర లోకి జారుకున్నాడు.
ఏదో చప్పుడికి ఉలిక్కి పడి నిద్ర లేచాడు మహి. డోర్ బెల్ మోగుతూ ఉంది. లిజీ వచ్చిందనే ఆవేశం, సంతోషము కలగలిపిన ఉద్రేకంతో, ఒక్క ఉదుటున లేచి వెళ్లి తలుపు తీసాడు.
తలుపు తీయగానే ఒక్క సారిగా మీద పడి ముద్దుపెట్టుకుంది మేఘన. ఆమెను చూసి ఒళ్ళంతా చల్లబడి నిలబడి పోయాడు మహి.
“డార్లింగ్, సర్‌ప్రైజ్ కదా!” అంది మేఘన అతని మీద మీద చేతులు వేసి జారగిలా పడుతూ..
నోట మాట రాక కంగారుగా నిటారుగా నిలబడి, తడబాటుతో అన్నాడు “అవును” అతని మొహం రక్తం లేనట్లుగా పాలిపోయింది.
“ఏంటి, అలా వున్నావు? సంతోషంగా లేదా” అంది మేఘన అతని మొహంలోని కంగారు గమనించి.
“అబ్బెబ్బే సంతోషమే, కానీ ముందుగా తెలిస్తే ఇంకా బావుంటుంది.” అన్నాడు.
“మూడు రోజులు ఇక్కడే ఉండాలి అని చెప్పావుగా, అందుకే నిన్ను వదలి ఉండలేక వచ్చేసా” అంది వేళ్ళతో అతని ఛాతిని గోకుతూ.
“మంచి పని చేసావు.. నాకూ బోర్‌గా వుంది..” అని ఇంకా ఏదో అనబోతున్న మహి పెదాలను మూసేసి గట్టిగా పెనవేసుకుంది మేఘన.
కాసేపటిలో లిజీ గదిలోకి వచ్చేస్తే ఎలా అనే భయంతో అతనికి చెమటలు పట్టసాగాయి.
అతని శరీరంలో ఏ మాత్రం చలనం లేకపోయేసరికి అతని పెదాలని వదలి, ఆప్యాయంగా అతని మొహాన్ని పరికించి చూసి
“ఏంటి మహి, ఎనీ ప్రాబ్లెమ్?” అంది.
అది గమనించిన మహి మనసు బాధగా మూల్గింది.
“ఏమీ లేదు మేఘా” అని సోఫా వేపు నడుస్తూ ఆలోచించసాగాడు.
చెప్పకుండా ఎందుకొచ్చింది. నా మీద అనుమానమా?. ఇంకా నయం కాసేపటి తర్వాత వస్తే, రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయి వుండేవాడిని. థ్యాంక్ గాడ్ అని దేవుడికి మొక్కుకుని, ఇప్పుడెలా బయట పడటం ఎలా? అని వేగంగా ఆలోచించసాగాడు. అప్పుడే అతని ఫోన్ మ్రోగసాగింది.
వెంటనే కంగారుగా ఫోన్ తీసుకుని “హలో” అన్నాడు.
“ఫ్లైట్ దిగాను. వస్తున్నా” అంది లిజీ అవతలి నుండీ.
“సర్.. నేను బిజీగా వున్నాను. మళ్ళీ కలుద్దాం. ఇప్పుడు కుదరదు” అన్నాడు, ఒక కంట ఓరగా మేఘనను గమనిస్తూ. అతని గుండె వేగంగా కొట్టుకోసాగింది.
“ఎందుకు ఏమైంది, నేను లిజీ మాట్లాడుతున్నాను” అంది ఆతృతగా.
“ఇప్పుడు కుదరదు, మేఘన వచ్చింది” మెల్లిగా గుసగుసగా అని నుదుటన పట్టిన చెమటను చేతితో తుడుచుకున్నాడు.
“సరే, నే రిటర్న్ ఫ్లైట్‌కి వెళ్లిపోతాను” అని చెప్పి ఫోన్ కట్ చేసి, పకపకా నవ్వసాగింది లిజీ.
కాసేపు అలాగే నవ్వుకుని, ఫోన్ తన మంచం మీద పడేసి వంటింట్లోకి అడుగులు వేసింది.
రెండు రోజులు మేఘనతో గడిపి వెనక్కి వచ్చేసాడు మహి.
ఆఫీసుకి రాగానే ఇంటర్‍కమ్ నొక్కి “లిజీ ప్లీజ్ కమ్” అని చెప్పి తన కుర్చీలో చేరగిలబడ్డాడు.
కొద్దిసేపటికి దిగాలు మొహంతో లోనికి అడుగు పెట్టిన లిజీని జాలిగా చూసాడు మహి.
“సారి లిజీ. అసలు తానెలా వచ్చిందో, ఎందుకొచ్చిందో, నాకేమీ అర్థం కాలేదు.” అన్నాడు.
“సార్ నేను ఆ రాత్రంతా ఎయిర్‌పోర్ట్‌లో కూర్చుని ఉదయం మొదటి ఫ్లైట్‌కి వచ్చేసాను. నేను ఇక ఇటువంటి వాటికి రిస్క్ తీసుకోను. సారీ. నన్నింకా బాధ పెట్టకండి” అని చెప్పి, మహి ఏదో చెప్పబోయే లోపు కేబిన్‌లో నుండీ బయటకు వెళ్లిపోయింది.
విసుగ్గా టేబుల్ మీద చేతితో కొట్టి, నీరసంగా కూర్చున్నాడు. ఆ రోజంతా అతనికి పని మీద ధ్యాస లేదు. ఆఖరి నిమిషంలో లిజీతో కలయిక తప్పి పోయినందుకు చిరాకుగా వుంది.
మేఘన మరీ ఇంతలా తన మీద గూఢచర్యం ఎందుకు చేస్తోంది? ఎక్కడా ఒంటరిగా వదలటం లేదు. తన జీవితంలో ఇక ప్రైవసీ ఉండదా? ఆర్థికంగా అసలే స్వాతంత్య్రం లేదు. మేఘనను పెళ్లి చేసుకొని పొరపాటు చేశానా? అని ఆలోచించసాగాడు.
ఆ రోజంతా క్షణ క్షణానికి లిజీ మీద అతనికి కోరిక పెరిగిపోసాగింది. అందమైన లిజీ దొరకకుంటే ఈ జీవితం వృథా అనుకున్నాడు. సాయంత్రం వరకూ లిజీ అందాలను నెమరేసుకుంటూ గడిపాడు. చీకటిపడే వరకూ అతి కష్టం మీద ఆఫీసులో ముంజేయి వాచీ చూస్తూ గడిపాడు.
చాలా సేపు కళ్ళు మూసుకుని ఆలోచించి, ఒక నిర్ణయానికొచ్చి చటుక్కున లేచి బయటకు నడిచాడు.
కాసేపటి తర్వాత తన కారుని లిజీ ఇంటి కాస్త దూరంగా వున్నప్పుడు కారు లైట్లు ఆర్పివేసి మెల్లిగా ముందుకు వెళ్లి ఆపాడు.
కారు దిగి చూసాడు. లిజీ ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి. చుట్టూ చూసి, లిజీ ఇంటి మెట్లెక్కి తలుపు తట్టాడు. తలుపు పక్కనుండే స్విచ్ నొక్కి వరండాలో లైట్ తీసేసాడు.
“ఎవరూ” అని తలుపు తీసింది లిజీ.
లోకొచ్చి తలుపులు మూసేసాడు మహి. మారు మాట్లాడకుండా ఆమెను చుట్టేశాడు.
దాదాపు పదిహేను నిమిషాలు ఇద్దరికీ ఊపిరాడలేదు. అంతలో వున్నట్లుండి అతన్ని దూరంగా నెట్టి “నో.. సర్, మేడంకు తెలిసిందంటే నా బ్రతుకు రోడ్డున పడటం ఖాయం, మీరెళ్ళి పొండి.. ప్లీజ్” అంది.
నిస్సహాయంగా ఆమెను చూసి “మరేం చేయాలి, నిన్ను వదలలేను” అని అరిచాడు.
“మేడం బ్రతికుండగా మీరేం చేయలేరు” అంది భయంగా.
అప్పుడు అనిపించిందతనికి మొదటి సారిగా, నిజమే మేఘన ఉండగా తనకెలాంటి స్వాతంత్య్రం లేదు. డబ్బు లేదు, లిజీ దొరకదు.
“ఒక వేళ మేఘన లేకుంటే?” అన్నాడు. అలా ఎందుకన్నాడో అతనికే అర్థం కాలేదు.
“లేకుండా ఎటెళ్తారు?” అంది.
ఆ ప్రశ్న విని అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అతని చూపుల్లో ఎటువంటి భావం లేదు. శూన్యంగా చూశాడామె వేపు.
అతని దగ్గరగా వచ్చి రెండు భుజాలు పట్టుకుని ఊపింది “చెప్పండి మేడం ఎటెళ్తారు?” అంది.
కాసేపు ఆమె కళ్ళలోకి చూసి అన్నాడు “తెలీదు. కానీ నువ్వన్నది నిజమే. తానుండగా మనం కలవడం కష్టమే. ఏదో చేయాలి” అన్నాడు.
“ఎలా? మేడంని ఏమీ చేయకండి. వద్దు, అలాంటి పనులు. అలాంటి పనులేమైనా చేస్తే చట్టానికి దొరికిపోతారు, వద్దు మేడంని ఏమీ చేయొద్దు, ఏం చేస్తారు, చంపేస్తారా?” అని కళ్ళు పెద్దవి చేసింది.
ఆ మాటలతో అతనిలో ఒక భయంకరమైన ఆలోచన రూపుదిద్దుకోసాగింది. ఆ ఆలోచన మనసులోకి రాగానే అతని ఒళ్ళంతా చల్లబడి కోరికలన్నీ గాలిలో కలిసి పోయాయి.
మాటలు లేకుండా బొమ్మలాగా నిలబడ్డ అతడిని చేయి పట్టుకుని బెడ్ రూమ్ లోకి తీసుకెళ్లింది లిజీ.
***
“మన విషయం ఏ మాత్రం తెలిసినా మనిద్దరినీ బయటకు పంపించేస్తుంది. నా మూలంగా మీరు మళ్ళీ మధ్య తరగతి జీవితంలోకి వెళ్లడం నాకిష్టం లేదు.” అంది లిజీ అతని తలలో వెంట్రుకలు నిమురుతూ.
“ఏదో ఆలోచించాలి. నిన్ను వదులుకోలేను..” అని చెప్పి లేచి “బాగా ఆలస్యమై పోయింది. వెళ్ళొస్తాను” అన్నాడు మహి లేచి నిలబడి.
“వెళ్ళాలా? రాత్రికి ఇక్కడే ఉండలేరా?” అంది.
అతనిలో ఎలాంటి చలనం లేదు. మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు.
మరుసటి రోజునుండీ మేఘనను వదిలించుకోవడం ఎలా.. ఆస్తి ఎలా పొందాలి లాంటి ఆలోచనల్లో గడపసాగాడు. ఎలా చేయాలో మాత్రం అతని బుర్రకి తట్ట లేదు.
“ఏంటీ మధ్య అదో రకంగా ఉంటున్నావు, ఏం కావాలి డార్లింగ్?” అంది మేఘన అతని వెనక వేపు నుండీ పెనవేసుకుని.
“అబ్బె అలాంటిదేమీ లేదు మేఘ. పని ఒత్తిడి” అన్నాడు మహి.
“నీకు కష్టంగా ఉంటే, మరొక జనరల్ మేనేజర్‌ని పెట్టుకుందాం. నువ్వు నా ముందుంటే చాలు” అంది.
మనసులో చిరాకుని దాచుకుని నవ్వుతూ “పర్లేదు, వ్యాపారంలో మామూలే కదా” అని ఆమె చేతులు విడిపించుకున్నాడు.
“వచ్చే వారం మీకొక మంచి వార్త చెప్తాను” అంది.
ఆమె చెప్పింది వినిపించుకోకుండా గదిలోకి వెళ్ళిపోయాడు మహి.
మరుసటి రోజు ఆఫీసులో లిజీ ని పిలిచి ఎదురు చూడ సాగాడు.
లిజీ లోపలికొచ్చి “చెప్పండి” అంది.
“ఈ రాత్రి ముఖ్యమైన విషయం మాట్లాడాలి, వస్తాను” అన్నాడు.
“జాగ్రత్తగా ఉండాలి, ఎవరైనా చూస్తే ప్రమాదం” అంది.
ఆమె భయం చూసి “పిచ్చి పిల్ల.. ఏమీ కాదు.” అన్నాడు చిన్నగా కన్ను గీటి.
రాత్రి లిజీ ఇంట్లో సోఫాలో కూర్చొని “జాగ్రత్తగా విను లిజీ. మేఘను ఏమార్చి కొన్ని పేపర్ల మీద సంతకాలు తీసుకుని, ఆ తర్వాత వదిలించుకోవడం ఉత్తమం.” అన్నాడు.
“అది అయ్యేపని కాదు, ఆమె బ్రతికుండగా అదంతా తేలిక కాదు.” అంది విసుగ్గా. అతను మాట్లాడకుండా ఆలోచించ సాగాడు.
“అయితే ఏదోలా లేకుండా చేయలేవా?” అంది మెల్లిగా.
“..అదెలా” అని ఆమె కళ్ళలోకి లోతుగా చూసాడు.
“అదే అర్థం కావడం లేదు” అంది కళ్ళు మూసుకుని.
కాసేపాగి “ఒక వేళ విష ప్రయోగం చేస్తే?” అంది.
“విష ప్రయోగం!! కానీ ఎలా” కంగారుగా అన్నాడు.
“నేను ఎక్కడైనా సంపాదిస్తాను విషాన్ని” అంది.
“ఛ ఛ..” అని చటుక్కున లేచాడు.
‘మేఘ ప్రాణం తీయడమా? ఘోరమైన ఆలోచన’ అనుకున్నాడు. అతని మనసు మెలి వేసినట్లయ్యింది. తల విదుల్చుకుని బయటకు నడిచాడు. వున్నట్లుండి వెళ్ళిపోతున్న మహిని అనుమానంగా, అసహనంగా చూసింది.
మరుసటి రోజు మహి కేబిన్ లోకి వచ్చి మహి టేబిల్ మీద చిన్న సీసా పెట్టింది లిజీ.
ఏంటది అన్నట్లుగా చూసాడు మహి.
“నిన్న అనుకున్నాం కదా.. విషం!” అంది.
పాముని చూసినట్లుగా వెంటనే ఉలిక్కిపడి లేచి నిలబడ్డాడు.
అతన్ని ఒకసారి చూసి “తాగిన వెంటనే ఏమీ కాదు. ఒక రోజు తర్వాత ప్రాణం పోతుందట, జాగ్రత్త, ఎవరికీ అనుమానం రాదు. విషం ఇచ్చాక మరుసటి రోజు ఏదైనా దూరం సిటీకి బిజినెస్ టూర్ వేసుకో. ఆ రకంగా నీకు ఎలిబీ ఉంటుంది. నేను కూడా వేరే బ్రాంచ్‌కి వెళ్తాను. నీ మీద అనుమానం రాదు. ఇది ఫైనల్. ఇక ఈ దాగుడు మూతలు అనవసరం, నీకు నేను కావాలంటే ఈ రాత్రికే చేయాలి.” అని చెప్పి బయటకు వెళ్లిపోయింది లిజీ. ఆ బాటిల్‌ని చూసి తలలో నుండీ కారుతున్న చెమట తుడుచుకున్నాడు. కాసేపటికి లేచి ఆ బాటిల్‌ని జేబులో పెట్టుకున్నాడు.
సాయంత్రం బ్రిడ్జి మీద నుండీ కారు నడుపుతూ ఒక పక్కగా ఆపి దిగి కాసేపటి తర్వాత వచ్చి కారెక్కాడు మహి.
***
“ఇన్‌స్పెక్టర్ గారు, మీరేం చేస్తారో తెలీదు, నా అనుమానం నిజం..” అని చెప్పటం ఆపాడు రహీం ఖాన్.
“మీ తమ్ముడు చెప్పిందాన్ని బట్టి చూస్తే, ముంబై ఇంటిలో అతను ఆ రోజు విస్కీలో ఏదో కలుపుకుని తాగి పడిపోయాడు. ఆత్మహత్య ప్రయత్నం అన్నారు. ఆయనేమో ఐదేళ్ల తర్వాత, చావు తప్పిపోయి కోమాలో నుండీ ఇప్పుడే లేచాడు. ఇప్పటి వరకూ ఏం జరిగిందో ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. మీరొక సారి మళ్ళీ చూసి, ఖచ్చితంగా ఒకరేనా కాదా చెప్పాలి.. పట్టుకుని అరెస్ట్ చేయటం ఎంత సేపు.. నువ్ చెప్పేది తప్పయితే నాకు ఇబ్బందులు తప్పవు.” అన్నాడు ఇన్‌స్పెక్టర్ రాజు.
“సరే మీకు ఈ రోజే చెప్తాను” అంటూ లేచాడు రహీం ఖాన్.
***
ఆ తర్వాత ఇంటికెళ్లి సోఫాలో కూలబడ్డాడు మహి. మేఘన ఆ రాత్రి చాలా సంతోషంగా వుంది మేఘన. భోజనాలయ్యిం తర్వాత ఎన్నెన్నో కబుర్లు చెప్పసాగింది. మహికి అవేవి తలకెక్కడం లేదు.. ఛీ ఛీ ఈ డబ్బులు ఆస్తి, నగలు, బంగళాల గురించి కట్టుకున్న భార్యను చంపటమా? ఏంటి నేనిలా దిగజారిపోయాను. అసలు నేనేంటి ఇలా నీచుడిలా మారిపోయాను. ఇంతటి రాక్షసత్వం ఎలా వచ్చింది? ఇలాంటి పని చేయను కాక చేయను, కానీ లిజీని ఎలా వదులుకోవడం అని ఆలోచిస్తూ అన్యమనస్కంగా వినసాగాడు. అలా కబుర్లు చెప్తూ నిద్ర లోకి జారుకుంది మేఘన.
లిజీ గుర్తుకు రాగానే అతనిలో కోరికలు నిద్ర లేచాయి. అప్పటి వరకూ అతనిలో మేల్కొన్న అంతరాత్మ అతనిలోని కోరిక ముందు ఓడిపోయింది. వాచీలో సమయం చూసాడు. అర్ధరాత్రి కావొస్తోంది. టేబుల్ మీదున్న పాల గ్లాస్ పట్టుకుని మెల్లిగా మేఘనను పట్టుకుని ఆమె పెదాలకు గ్లాస్ అందించాడు. సగం నిద్రలో వున్న మేఘన కొద్ది కొద్దిగా తాగేసింది. అలాగే ఆమెను వెనక్కి పడుకోబెట్టాడు.
మేఘన పూర్తిగా నిద్ర పోయిందని నిర్ధారించుకుని లేచాడు మహి. ఒక వేళ నిద్ర లేచి చూస్తే ఎలా అని అనుకుని భయపడ్డాడు. లిజీ ఇంటి వేపు చూసాడు. దూరంగా లిజీ ఇంటి ముందు అప్పుడే కారు ఆగినట్లుగా కనపడింది. కారు లైట్స్ ఆరిపోయి మళ్ళీ అంధకారం అలుముకుంది. ఈ రాత్రి లిజీ వద్దకు వచ్చేదెవరూ అని తీక్షణంగా ఆలోచించాడు.
వెంటనే ఒక నిర్ణయానికొచ్చి బయటున్న కారు ఎక్కి లిజీ ఇంటి వేపు వెళ్ళాడు.
లిజీ ఇంటి ముందు కారు ఆపి చూసాడు. అర్ధరాత్రి లోన లైట్లు వెలగటం చూసి కాస్త ఆశ్ఛర్యపోయాడు. లోపలనుండి మాటలు వినిపిస్తున్నాయి. లోపల ఎవరో వున్నారు, ఎవరై వుంటారు అనుకుని, లోనికి వెళ్లాలా వద్దా అనుకుంటూ మెట్లెక్కి తలుపు దగ్గర ఆగాడు.
లోనుండీ లిజీ గొంతు వినిపించింది.
“ఈ పాటికి విషం కలిపి తాగించి వుండొచ్చు” అంది.
“చెప్పలేం. అంత ధైర్యం చేయగలడా?” అంది మగ గొంతుక.
“నా మీద చెప్పలేనంత పిచ్చిలో వున్నాడు. ఖచ్చితంగా చేస్తాడు.” అంది లిజీ.
“తర్వాత కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. పోలీసులకు నీ గురించి చెప్తే నువ్ కూడా ఉరికంబం ఎక్కితే?” అన్నడతను.
“ఆ విషం నేను ఆన్‌లైన్‌లో అతని పేరు మీద తెప్పించా, దానికి డబ్బులు అతని కార్డు నుండీ పంపించాను. అతని ఫోన్ నుండే బుక్ చేసాను. నా ప్రమేయం ఎక్కడా లేకుండా చూసా.” అని భళ్ళున నవ్వింది లిజీ.
ఇదంతా వింటున్న మహి ఒంట్లో రక్తం వేడెక్కి, పిడికిలి బిగుసుకుంది.
“ఢిల్లీకి వెళ్ళమని మేఘనకు నేనే హింట్ ఇచ్చి టికెట్ బుక్ చేసాను. నేను నా పడక గది దాటకుండా ఆడించా. నేను ఢిల్లీకి వచ్చాననుకుని తెగ భయపడి పోయాడు.. పాపం.”
“ఈపాటికి విషం ఇచ్చి ఉంటాడు. అది వెంటనే పని చేస్తుంది. కానీ అది మెల్లిగా మరుసటి రోజు పని చేస్తుందని చెప్పాను. అతడే హంతకుడని పోలీసులకి దొరికిపోతాడు. ఆమె చనిపోయిన తర్వాత ఆమె కంపెనీలన్నీ నాకే వస్తాయి.” అంది లిజీ.
అది వినగానే మహి కాళ్ళ కింద భూమి కదలి పోయింది.
“ఏమో ఇవన్నీ నాకు భయం వేస్తున్నాయి” అంది మగాడి గొంతు.
“అన్నీ జాగ్రత్తగా పథకం వేసాను. అతను పూర్తిగా నన్ను నమ్మేశాడు. మనకేం భయం లేదన్నయ్యా. నువ్ జైలు నుండి రాక ముందే నేను అతన్ని బుట్టలో వేసాను” అంది లిజీ.
మహిలో కోపం కట్టలు తెంచుకుంది. ఇక వినలేక పోయాడు. తలుపుని ఒక్క తన్ను తన్ని లోనికి అడుగు వేసాడు.
మహిని చూడగానే భయంగా చిన్న కేక పెట్టింది లిజీ. కుర్చీలో కూర్చుని విస్కీ తాగుతున్న గడ్డపు వ్యక్తి కంగారుగా లేచి నిలబడ్డాడు.
“రాక్షసి.. ఎంత నమ్మాను నిన్ను.” అన్నాడు మహి. పట్టలేని ఆవేశంలో వున్న అతని గొంతులోనుండీ మాట రావటం లేదు. వేగంగా వెళ్లి లిజీ చేయి పట్టుకున్నాడు.
“వదులు ఇడియట్” అని అతన్ని బలంగా నెట్టింది లిజీ.
ఆ విదిలింపుకి దూరంగా వెళ్ళాడు మహి. ఆమె బలం చూసి ఆశ్చర్య పోయాడు.
“ఎంత నటన, నా మీద ప్రేమ. ఇంతలా మోసం చేస్తావా” అని కోపంగా అరిచాడు మహి.
“ఛీ, నీ మీద ప్రేమేంటి. నా అందాన్ని చూసి వెంటబడ్డావు. మేఘనను పెళ్లి చేసుకుని నాకు చెందాల్సిన కంపెనీలన్నీ స్వంతం చేసుకున్నావు. అసలు పెళ్లి అనే ఆలోచనలు లేని ఆమెను ముగ్గులో దింపి, నా ఆశలకు, నా ప్లాన్‌కి అడ్డం పడ్డావు. నాతో ప్రేమాయణంలో నిన్ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టిద్దామని ట్రై చేసాను. ఆవిడేమో నీ మీద గొంతునిండా ప్రేమలో కూరుకుపోయింది. నీవు చేసేవి ఆమెకు అర్థం కావటం లేదు. అందుకే నీతో విషం పెట్టించాను. నా పని అయిపోయింది. నువ్ ఉరికంబానికే. మొత్తం ఈ కంపెనీలు, ఆస్తులు నాకే వస్తాయి.”
ఆ మాటలు వినగానే కట్టలు తెంచుకున్న కోపంతో లిజీ మీదకు వెళ్ళబోయాడు మహి.
“మిస్టర్ దూరంగా నిలబడు. లేదా కాల్చేస్తాను” అన్నాడు ఆ గడ్డపు వ్యక్తి. అతని చేతిలో పిస్టల్ మెరిసింది.
***
సరిగ్గా అదే సమయానికి చీకటిలో ఇన్‌స్పెక్టర్ రాజు, మరి కొందరు పోలీసులు మెల్లిగా లిజీ ఇంటి వేపు అడుగులు వేయసాగారు.
“జాగ్రత్త! కాస్త మెల్లిగా వెళ్ళాలి. లోపలేదో అరుపులు వినపడుతున్నాయి” అని మిగతా వారి వేపు చూసి చెప్పాడు ఇన్‌స్పెక్టర్ రాజు.
***
గడ్డపు వ్యక్తి చేతిలోని పిస్టల్ చూసిన మహి, లిజీని వదలి అతని వేపు తిరిగి “ఓహో నువ్ ఈవిడ అన్నయ్యవా? గుడ్ ఇద్దరూ దొరికి పోయారు.” అని; మళ్ళీ లిజీ వేపు చూసి “చాలా తెలివిగా డ్రామా ఆడావు. కానీ దురదృష్టం ఏమిటంటే మనిద్దరినీ మొదటిసారి హోటల్‍లో పార్టీ చేసుకుంటుండగా రహీం ఖాన్ చూసాడు. మొన్నీ మధ్య అడిగాడు, నీ పేరు సుల్తానానా? అని. అప్పటి నుండీ నాకు అనుమానం మొదలయ్యింది. కానీ నీ అందం నన్ను ఆలోచించనివ్వ లేదు. అసలు నువ్వెవరు?” అన్నాడు
అది విని పకపకా నవ్వి ఆ గడ్డపు వ్యక్తి “అక్కడ నీ భార్యకు విష ప్రయోగం చేసావు, నువ్వు ఇప్పుడు హంతకుడివి. ఇక నీకేం తెలిసినా మాకు నష్టం లేదు” అని నవ్వు మొహంతో అన్నాడు.
“అవును. నువ్ ఉరికంబానికి వెళ్ళటం ఖాయం. ఇప్పుడు నిన్ను షూట్ చేసినా మాకేం కాదు. నువ్ అక్కడ నీ భార్యను చంపి, ఇక్కడకు వచ్చి డబ్బుల సీక్రెట్స్ నన్ను అడిగితే నేను చెప్పలేదని అందుకని నన్ను కూడా చంపే ప్రయత్నం చేసావని, నా అన్నయ్య సమయానికి నన్ను రక్షించటానికి చేసే యత్నంలో నిన్ను షూట్ చేశామని పోలీసులకు జెప్తాము.” అని క్రూరంగా అతని వేపు చూసింది లిజీ.
అలా మాట్లాడుతున్న లిజీని అపనమ్మకంతో చూసాడు మహి.
“అన్నా, ఇంకా చూస్తావేంటి షూట్ చేయి” అని అరిచింది. అది విన్న గడ్డపు వ్యక్తి కాస్త సందేహించాడు.
అంతలో “రేయ్ పిస్టల్ కింద పారెయ్” అన్న అరుపు విని తలుపు వేపు చూసారందరూ.
ఇన్‌స్పెక్టర్‌తో బాటు మరో నల్గురి చేతుల్లో ఆయుధాలు కనపడ్డాయి.
చేతిలో పిస్టల్ కింద పారేశాడు గడ్డపు వ్యక్తి.
“సర్, ఇదుగో వీడు మా మేడంకు విషం ఇచ్చి హత్య చేసాడు. ఇప్పుడు నన్ను చంపుదామని వచ్చాడు.” అంది లిజీ కళ్ళు తుడుచుకుంటూ .
“అదంతా తర్వాత ముందు నువ్ జీప్ ఎక్కు సుల్తానా” అన్నాడు వెనకనుండి ముందుకొచ్చిన రహీం ఖాన్. అతన్ని చూడగానే లిజీ నోరు భయంతో మూతబడింది.
“రేపు మీరొక సారి స్టేషన్‌కు రండి. లేదా నేనొచ్చి మిగతా విషయాలు చెప్తాను సర్. మీరు చాలా లక్కీ. రహీం ఖాన్ సమయానికి మిమ్మల్ని రక్షించాడు. మీరు భార్యను చంపడం అంటోంది అదేంటి” అన్నాడు ఇన్‌స్పెక్టర్ నవ్వుతూ.
“అదేమీ లేదు ఇన్‌స్పెక్టర్. తాను హాయిగా నిద్ర పోతోంది.” అని నిర్మలంగా నవ్వాడు మహి.
“సార్ రేపు కలుస్తాను” అని నమస్కారం పెట్టి తన కారు వేపు నడిచాడు రహీం ఖాన్.
అందరూ వెళ్ళిపోయాక అక్కడే కాసేపు నిలబడి పోయాడు మహి. ఆకాశంలో మబ్బులు విడిపోయి చంద్రుడు వెన్నెల కురిపించసాగాడు.
తేలిక పడ్డ మనసుతో కారెక్కి స్టార్ట్ చేసాడు మహి. ఇంటి ముందు కారు దిగి మెట్లెక్కి వెళ్లి, గదిలో గాఢ నిద్రలో వున్న మేఘనను చూసాడు.
మెల్లిగా మేఘన పక్కన ఒదిగి పడుకుని ఆమెను దగ్గర తీసుకున్నాడు మహి.
“మహీ” అంది మేఘన గుసగుసగా.
సమాధానంగా మరింత దగ్గరకు హత్తుకున్నాడు మహి. అతని మనసు ద్రవించి పోయింది.
“గుడ్ న్యూస్ అన్నాను, గుర్తుందా.. ఈ రోజే అన్ని ఆస్తులు, కంపెనీలు నీ పేరు మీద ట్రాన్స్‌ఫర్ చేయించాను.” అంది అతని చెవి దగ్గర పెదాలు పెట్టి.
అతనిలో దుఃఖం ఎగతన్నుకు రాసాగింది. వున్నట్లుండి వెక్కిళ్ళతో ఏడవ సాగాడు.
“ఛ ఛ మహి ఇదేంటి, చిన్న పిల్లాడిలా, నాకు నువ్వు చాలు, ఆస్తి ఇవన్నీ నీ ముందు దండగ” అంటూ అతని కళ్ళు తుడవసాగింది.
“లేదు లేదు మేఘన, నాకే ఆస్తి అక్కరలేదు. నీ మనసు చాలు.” అని మరింత గట్టిగా గుండెలకి హత్తుకున్నాడు మహి.
అతని మనసంతా దూదిపింజలాగా అయిపోయి తేలికగా మారిపోయింది. కొద్దిసేపటిలో ప్రశాంతంగా నిద్రా దేవత ఒళ్ళోకి జారిపోయాడు మహి.
తూరుపున రవి ఆగమనానికి సూచనగా ఆకాశంలోని నలుపు పలచబడసాగింది. చీకట్లు తొలిగి వెలుగు రేఖలు విచ్చుకోసాగాయి.
***
“ముంబైలోవుండే ఈ సుల్తానా ఇదుగో రహీం ఖాన్ తమ్ముడిని వలపు వలలో వేసుకుని పెళ్లి చేసుకుంది. ముందు నుండీ క్రిమినల్ బ్రెయిన్ వుండే సుల్తానా తన అన్నతో కలిసి ఇతని డబ్బులు నగలు కాజేసి వెళ్ళిపోద్దామని పథకం వేసి, భర్త తాగే విస్కీలో విషం కలిపి అతను పడిపోగానే అన్నీ తీసుకుని దాచేసుకుని, ఉదయం లేచి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని అందరికీ ఫోన్లు చేసింది. బంధువులు, రహీం ఖాన్ వచ్చి చూసి, అతనిలో ఇంకా ఊపిరి ఆడటం చూసి హాస్పిటల్ తీసుకెళ్లారు. సుల్తానా దురదృష్టం కొద్దీ అతను చావలేదు కానీ కోమా లోకి వెళ్లిపోయాడు. తర్వాత మంచి రోజు చూసుకుని అక్కడ నుండీ బిచాణా ఎత్తేసి మీ వద్ద పనిలో చేరింది. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం జరిగింది. అయిదేళ్ల తర్వాత మొన్న రహీం తమ్ముడు కోమా లోనుండీ బయటకు వచ్చి, ఆ రోజు తన భార్య బలవంతంగా విస్కీ తాగిపించిందని చెప్పిన తర్వాత మాకు సుల్తానా మీద అనుమానం మొదలయ్యింది. అనుకోకుండా వేషం మార్చిన సుల్తానాను కాస్త ఆలస్యంగా గుర్తుపట్టాడు రహీం ఖాన్. సాయంత్రం వెంటనే వచ్చి అరెస్ట్ చేద్దామనుకున్నాం. ఎందుకైనా మంచిదని రాత్రి ఇంటికెళ్తున్న లిజీని మళ్ళీ రహీం ఖాన్ చూసి వచ్చి ఖచ్చితంగా ఈవిడ సుల్తానా, అందులో అనుమానం లేదని చెప్పిన తర్వాత మేం రంగప్రవేశం చేసాం. ఇంతకీ మీరెందుకు వెళ్ళారక్కడికీ?” అని అనుమానంగా మహిని చూసాడు ఇన్‌స్పెక్టర్ రాజు.
“మా ఆవిడ నిద్ర పోయాక నాకు నిద్ర పట్టకపోతే బయట వరండాలోకి వచ్చి కూర్చున్నాను. ఇంతలో ఏదో కారులిజీ ఇంటికి వెళ్తున్నట్లుగా కారు హెడ్ లైట్స్ కనిపించాయి. ఇంత రాత్రి ఎవరు, ఏమిటి అని అనుమానంతో వెళ్లాను. అక్కడ మా డబ్బులు ఎలా దోచుకోవాలో వాళ్లిద్దరూ మాట్లాడుకోవటం విన్నాను. అది విన్న కోపంతో లోపలికెళ్ళి గట్టిగ మాట్లాడేసరికి, నాకు పిస్టల్ చూపించి బెదిరించారు. మిగిలినది మీరు చూసారుగా?”అన్నాడు మహి.
అది విన్న ఇన్‌స్పెక్టర్ రాజు ఒకసారి మేఘన వేపు చూసాడు. ఆమె మొహంలో అతనికేమీ కనపడలేదు.
“ముందు ఒప్పుకోలేదు. కానీ మా పద్ధతిలో అడిగే సరికి భర్తకు తానే ఏదో విషం కలిపి ఇచ్చిందట. అయితే అది పూర్తిగా పని చేయక ఆమె అదృష్టం బోర్లా పడింది.. ఓకే సార్ నేను మళ్ళీ కలుస్తాను” అని లేచి వెళ్ళిపోయాడు ఇన్‌స్పెక్టర్.
“ఆఫీసుకి టైం అయ్యింది. నే బయలు దేరుతాను మరి” అన్నాడు మహి.
“అబ్బా.. ఈ ఒక్క రోజు వెళ్ళకపోతే ఏంటి. అదుగో కొత్త సెక్రెటరీ పెట్టుకున్నా.” అని వేలెత్తి, మెట్లెక్కి వస్తున్న స్త్రీని చూపించింది మేఘన.
పూర్తిగా నెరిసిన జుట్టుతో వస్తున్న ఆమెను చూసి ఆశ్చర్య పోయిన మహి “ఏంటీ ఇంత పెద్ద వయసున్న ఆవిడనా” అన్నాడు.
“గుడ్ మార్నింగ్ మేడం” అంది ఆ నడి వయస్సు స్త్రీ, ముక్కు మీదకు జారుతున్న లావాటి కళ్లద్దాలు సర్దుకుంటూ.
“గుడ్ మార్నింగ్. సార్‌తో కలిసి ఈ రోజు ఆఫీసుకు వెళ్ళండి” అని ఆమెకు చెప్పి
“ఓకే మహి, సాయంత్రం త్వరగా రా, షాపింగ్‌కి వెళ్ళాలి. నా దగ్గర డబ్బులేమీ లేవు. ఇప్పుడన్నీ నీ పేరు మీదేగా” అని నవ్వుతున్న మేఘనను చూసి మనస్ఫూర్తిగా నవ్వుకుని బయటకు నడిచాడు.
(సమాప్తం)