[కన్నడంలో శ్రీ ప్రేమశేఖర్ రచించిన ‘Yogaayoga’ అనే కథని అనువదించి అందిస్తున్నారు శ్రీ చందకచర్ల రమేశబాబు. ఇది మొదటి భాగం.]
దట్టమైన చెట్ల వరసల మధ్యనుండి వెళ్తున్న రోడ్డును దాటి ఎడమ వైపుకు తిరుగగానే, నల్లబడిన ఆకాశాన్ని, ఒక వైపు నుండి ఇంకో వైపుకు సరసరమని దూసుకు పోయిన మెరుపును చూసి గాబరా పడ్డాడు ఆదిత్య. దాని వెనుకనే చెవులు చిల్ల్లులు పడేలా ఉరుము.
“ఓహ్! వర్షం వచ్చేటట్టుంది” అని తనలో తనే గొణుక్కుంటూ వాహనం వేగాన్ని పెంచాడు. రోజంతా తీరిక లేకుండా తిరిగినందువల్ల దేహం, మనస్సు రెండూ డస్సిపోయాయి. విశ్రాంతి కావాలంటున్నాయి.
ఉదయం బెంగళూరునుండి బయలుదేరి, మడికేరి చేరుకుని మిత్రుడి పెళ్ళిలో పూర్తిగా పాల్గొని రోజంతా గడిపాడు. మడికేరి నుండి బయలు దేరినప్పుడు సాయంత్రం ఆరున్నర. హెగ్గడ దేవన కోటెలో ఒక చిన్న పని ముగించుకుని రాత్రి పది గంటలకల్లా మైసూరు చేరుకోవచ్చును అనుకున్నవాడికి, కోటెలో నిరాశ ఎదురైంది. వెతుక్కుంటూ వెళ్ళిన వ్యక్తి దొరకలేదు! అతడి కోసం రెండు గంటలు కాచుకుని నిరాశతో మైసూరుకు బయలుదేరినప్పుడు రాత్రి పదింబావు. అయినంత తొందరగా మైసూరు చేరుకుని చెల్లెలి ఇంటికెళ్ళి పరుపు పైన పడిపోవాలనుకుని కారును వేగంగా తోలసాగాడు. మైసూరు పబ్లిక్ స్కూల్ దాటిన తర్వాత ఇంకో ఇరవై నిమిషాల్లో ఇల్లు చేరుకోవచ్చు అనుకుంటుండగానే విండ్ స్క్రీన్ పైన చినుకుల చిత్రాలు కనిపించసాగి కళ్ళు చికిలించాడు. కారు టాప్ పైన చినుకుల టపటప శబ్దం వినిపించి ఒక్కరక్షణం నిరాశ పడ్డాడు.
“వర్షం ఎక్కువైనా ఫర్లేదు. ఇల్లు చేరడానికి అంతేం సమయం పట్టదు” అని ధైర్యం చెప్పుకుని వాహనాన్ని మరింత వేగవంతం చేశాడు. కారు హడ్ లైట్ల వెలుగులో ఎదురుగా కనబడిన షటర్ పైన పెద్ద అక్షరాల బోర్డు కనిపించింది.
‘స్నేహ బేకరి’
ఇంకో నిమిషంలో శివపుర వస్తుంది. అది దాటితే మైసూరే ఇక. వివేకానంద నగర్ లోని ఇల్లు చేరడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇంటికి చేరి, ఫుల్లుగా నిద్రపోయి రేపు ఉదయం బెంగళూరుకు బయలుదేరాలి. మిత్రుడు ఇన్‌స్పెక్టర్ ఉత్తప్పను కలవడం ఈ సారికి వీలవదు అని అనుకుంటుండగానే మళ్ళీ కళ్ళు మిరుమిట్లు గొలిపే మెరుపు, చెవులు చిల్లులు పడేలా ఈ సారి పిడుగు. ఉన్నట్టుండి వర్షం ఉధృతం ఎక్కువయ్యింది. ఆకాశానికి చిల్లులు పడినట్టుగా ఒకే ధారగా పడుతున్న వర్షపు ధాటిని అంతసేపూ ఎదుర్కొన్న వైపర్లు ఇక చేతకాదన్నట్టు ఓడిపోయాయి. కారు వేగం తగ్గింది. రోడ్డు పైన దృష్టి కేంద్రీకరించాడు ఆదిత్య.
ఒక మెరుపు కళ్ళను గుచ్చింది. ఒకదాని వెనుక ఇంకోటి, రెండు పిడుగులు.. వాహనం మలుపులో నిదానంగా ఎడమ వైపుకు తిరిగింది. వెంటనే గబుక్కున బ్రేక్ నొక్కాడు ఆదిత్య.
రోడ్డు ఎడమ వైపున ఉన్న చెట్ల గుంపునుండి పరిగెత్తి వచ్చిన ఒక ఆడ మనిషి! చేతులు పైకెత్తి కారుకు అడ్డంగా వచ్చిందామె! ఆమెకు ఒక పది అడుగుల దూరంలో ఆమె వైపు వేగంగా వచ్చిన నల్ల డ్రెస్ వేసుకున్న మగాడు!
కారు ఆగుతున్నట్లుగానే మగాడు మెరుపల్లే వెనక్కి తిరిగి పరిగెత్తాడు. గెంతుకుంటూ వేగంగా వెళ్ళిన మనిషి రోడ్డు అంచుల్లోని వర్షపు నీటిలో కాలు వేసి ఎర్రని నీటిని చిమ్మి క్షణంలో చెట్ల గుంపులో మాయమయ్యాడు. నల్లటి జర్కిన్ వేసుకున్న, తలకు నల్లటి క్యాప్ పెట్టుకున్న అతడి ముఖాన్ని సరిగ్గా చూడడం చేతకాలేదు ఆదిత్యకు. కొన్ని క్షణాల వరకు చెట్ల గుంపు వైపే ఆశ్చర్యంగా చూసిన ఆదిత్య తన చూపును ఆ ఆడామె వైపు తిప్పాడు. బ్యాలన్స్ పోగొట్టుకుని అటూ ఇటూ ఊగిన మనిషి కారు బానెట్‌కు ఆనుకుని ఆదిత్యవైపు బేలగా చూసింది.
పాతికేళ్ళకు అటూ ఇటూ అనిపించిన ఆమె అందంగా, తెల్లగా ఉంది. మొహం పైన కారుతున్న వర్షపు ధార. తడిసి ఒంటికంటుకున్న దుస్తులు. ఆమె కళ్ళల్లో గాభరా. వణకుతున్న పెదవులు.
భయానకమైన తుఫాన్ రాత్రి. నిర్జనమైన రోడ్డు పైన ఒంటరి ఆడది! గద్ద లాగ వెంటాడి వచ్చిన రౌడీ!
ఆదిత్యకు ఆశ్చర్యం వేసింది. సర్దుకోవడానికి అతడికి కొన్ని క్షణాలు పట్టాయి. నిదానంగా కిటికీ అద్దాలు దించాడు. భర్రుమంటూ మొహానికి కొట్టింది గాలి. “ఎవరు మీరు? ఇక్కడేం చేస్తున్నారు?” అని అడిగాడు ఆమెను.
ఆమె చటుక్కున కిటికీ వైపు జరిగింది. తడబడుతూ “వాడు.. వాడు నన్ను పట్టుకోబోతున్నాడు..” ఎగశ్వాసతో అన్నది. మొహం పైన పారుతున్న వర్షపు నీటిని ఎడమ చేతితో తుడుచుకుంది.
ఎడమ చెయ్యి చాచి లాక్ తీశాడు ఆదిత్య “లోపలకు రండి” అంటూ తలుపు తీశాడు. ఆమె ఆత్రంగా లోపలికి వచ్చి సీటు పైన కూలబడింది. వెనుకే తలుపు వేసి, అద్దం పైకి జరిపింది. దీర్ఘంగా నిట్టూర్చింది. రౌడీ నుండి చివరికి రక్షణ దొరికిందన్న నెమ్మది నిట్టూర్పు అది.
ఆదిత్య లైట్ వేశాడు. తల పైనుండి, మొహం నుండి జారుతున్న నీటిని, అప్పటికే తడిసిన దుపట్టాతో తుడిచే వ్యర్థ ప్రయత్నంలో ఉన్నఆమె మొహమాటంతో “లైట్ తియ్యండి” అన్నది. తడిసిన ఆమె దుస్తులు ఒంటికి అంటుకుని పోయుండడం వల్ల ఆమెకు సిగ్గుగా ఉండడం సహజమే అనిపించి, ఆదిత్య “సారీ” అంటూ స్విచ్ ఆఫ్ చేశాడు. వెనుక సీటు పైనున్న బ్యాగ్ తీసి, అందులోని పొడి టవల్ తీశాడు. “తీసుకోండి. దీనితో తుడుచుకోండి” అంటూ ఆమె వైపు చాచాడు. తను వద్దంటుదేమో అన్న సందేహం కనిపించలేదు. “థ్యాంక్స్” అంటూ టవల్ తీసుకుని తల వెంటుకలకు ఒత్తి పట్టుకుంది. ఒక్క నిమిషం పాటు ఓపికతో ఉన్న ఆదిత్య నిదానంగా “ఇంతకీ మీరెవరు? ఈ వర్షపు రాత్రిలో ఇక్కడికి ఎందుకొచ్చారు? ఇప్పుడైనా చెప్పచ్చు కదా?” అన్నాడు.
తడి టవల్‌ను తొడమీది పెట్టుకుందామె. “నేను అమితా.. అమితా మాధవన్. నా భర్తను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాను.”
“ఏంటి?” ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య. “కొంచెం వివరంగా చెప్పండి.”
“మాధవన్ ఈ రోజు సాయంత్రం ఆఫీసునుండి ఇంటికి రాలేదు. నేను కంగారు పడ్డాను. ఆఫీసుకు ఫోన్ చేశాను. ఆయన సహోద్యోగులు తను ఇంటికి వెళ్తానని చెప్పి, మధ్యాహ్నమే బయలుదేరి పోయాడని చెప్పారు. కొందరు స్నేహితుల్నివిచారించాను. వాళ్ళెవరికీ ఈయన ఎక్కడికీ వెళ్ళింది తెలియదు. నాకు చెప్పకుండా మాధవన్ ఎక్కడికి వెళ్ళుంటాడని అంతు పట్టలేదు. భయం కూడా వేసింది. ఏం చెయ్యాలో తోచలేదు. ఊరకే కూర్చున్నాను. తొమ్మిదిన్నరకు ఫోన్ వచ్చింది..” ఆపిందామె.
“ఫోన్ చేసింది మీ ఆయనేనా?” ప్రశ్నించాడు ఆదిత్య.
ఆమె నిట్టూర్చింది. “కాదు. అది మాధవన్ కాదు. ఎవరో వేరే మగ గొంతు. నీ భర్తకు ఒంట్లో బాగోలేదు. స్నేహ బేకరి వద్ద ఉన్నారు. వెంటనే వచ్చి తీసుకెళ్ళు అని చెప్పాడు. నేను పరుగెత్తి వచ్చాను” ముక్కుకు టవల్ పెట్టుకుంది.
ఏం జరిగి ఉంటుందో స్థూలంగా ఆదిత్యకు అర్థమయింది. “స్నేహ బేకరి వద్ద మీ ఆయన లేడు” ఆమెనే సూటిగా చూస్తూ మెల్లగా అడిగాడు.
“ఆయన అక్కడ లేరు. నేను అరగంట ఇక్కడంతా తిరిగాను. మాధవన్ దొరకలేదు. వానకు తడిశాను. అప్పుడు వాడు.. ఆ రౌడీ ఎక్కడినుండో వచ్చినవాడు నన్ను చూసి ఏదేదో వెకిలిగా మాట్లాడాడు. దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకున్నాడు. నేను అరిచాను. నా సహాయానికి ఎవరూ రాలేదు. నేను వాణ్ణి తోసేసి పరిగెత్తాను. వాడు వదల్లేదు. నా వెంటే వచ్చాడు. సమయానికి సరిగ్గా మీరు వచ్చారు. లేకుంటే..” అరచేతిలో మొహం మూసుకుని వెక్కింది.
“ఇలాంటి చోటికి ఒంటరిగా రావడం అపాయం అని తెలీదా? మీకు ఏమైనా అయ్యుండేది” అన్నాడు ఆదిత్య. ఆమె వెక్కిళ్ళే జవాబిచ్చాయి.
“మీరిక్కడ వెతుకుతూ ఉండగా మీ ఆయన ఇంటికి వెళ్ళుండచ్చు. అక్కడ మీరు లేకపోవడం చూసి గాబరా పడుండచ్చు.” ఆమెను ఓదార్చడానికి అన్నాడు ఆదిత్య.
ఆమె చటుక్కున తల ఎత్తింది. “అవును. నాకూ ఆలాగే అనిపిస్తూంది. ఇంటికి వెళ్ళి చూడాలి” స్వగతమన్నట్టుగా గొణిగింది.
“సరే. అలాగే చేద్దాం. మీ వెహికల్ స్నేహ బేకరి దగ్గర ఉందా?”
“వెహికల్ తీసుకు రాలేదు” ఆమె మెల్లగా గళం విప్పింది.
“వెహికల్ తీసుకు రాలేదా?” మరొక్కసారి ఆశ్చర్యం కనబరచాడు ఆదిత్య. “మరి ఇక్కడికి ఎలా వచ్చారు?”
“నడిచి వచ్చాను. మా ఇల్లు ఇక్కడే దగ్గిరే, బెమల్ లేఅవుట్‌లో. స్నేహ బేకరికి చాలా దగ్గర.” అతడి వైపు చూడకుండానే చెప్పింది. “నాకు డ్రైవింగ్ రాదు” మెత్తగా కలిపింది.
ఆదిత్య మెదడులో మరికొన్ని ప్రశ్నలు. కానీ బయట పెట్టాలనుకోలేదు. ఒక్కసారి దగ్గి, గంభీరంగా అడిగాడు.
“సరే. ఇప్పుడు మిమ్మల్ని ఇంటికి చేరుస్తాను.” అంటూ కారును వెనుక తిప్పాడు. స్నేహ బేకరి వద్ద వేగం తగ్గించాడు.
“కుడి వైపుకు తిరగండి” చెప్పింది అమితా. కారు ఇరుకైన దారిలోకి కుడి వైపుకు తిరిగింది.
అడవి చెట్లు, పొదల నడుమ సాగిన మట్టి చేరిన తారు రోడ్డది. అటూ ఇటూ ఇళ్ళున్నట్టు కనబడలేదు. ఆదిత్యకు ఈ జాగా పరిచయం లేదు.
“నాకు ఈ ఏరియా పరిచయం లేదు. ఎలా వెళ్ళాలో మీరే చెప్పండి” ఆమె వైపు తిరక్కుండా చెప్పాడు.
“అలాగే నేరుగా వెళ్ళండి. ఎదర ఇళ్ళు కనిపిస్తాయి. అక్కడ కుడివైపుకు తిరగాలి” ఇంకా తడిగా ఉన్న తల వెంట్రుకలను గట్టిగా తుడుస్తూ చెప్పింది అమితా.
కారు హెడ్ లైట్ల్ వెలుగులో కొన్ని ఇళ్ళు కనబడ్డాయి. తళుక్కున మెరిసిన మెరుపు వెలుగులో రోడ్డుకు కుడి వైపునున్న చెట్ల చాటున అరకొరగా తొంగి చూస్తున్న వాటర్ ట్యాంకొకటి అస్పష్టంగా కనిపించింది.
ఇళ్ళ దగ్గరికి రాగానే అమితా చెప్పినట్టుగా కుడి వైపుకు తిరుగు మళ్ళీ ఎడమ వైపుకు కారు తిరిగింది. ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఎడమ వైపుకుంది.
నీళ్ళు నిండిన గుంతనొకదాన్ని తప్పిస్తూండగానే అమితా అరిచింది. “ఇక్కడే, ఇక్కడ ఎడమ వైపుకు మళ్ళండి అక్కడ కనిపిస్తూంది కదా గ్రే కలర్ ఇల్లు. అదే.”
కారును గబుక్కున ఎడమ వైపుకు తిప్పాడు ఆదిత్య. ఎత్తుగా ఉన్న చెట్ల మధ్య ఉన్న చిన్న రోడ్డుపైన కాలువలా పారుతున్న వర్షపు నీటిని నిదానంగా దాటిన వాహనం కొంత దూరంలో ఒంటరిగా నిలుచున్న బూడిద రంగు ఇంటిని సమీపించింది.
“మీ భర్త వచ్చినట్టుంది. ఇంట్లో లైట్లు వెలుగుతున్నాయి” కనిపిస్తున్న దీపాల వైపు దృష్టి పెడుతూ అన్నాడు ఆదిత్య.
“దీపాలు.. నేనే వేశాను. ఇంటినుండి బయలుదేరే హడావిడిలో ఆర్పడం మరచిపోయుంటాను” ఆమె సన్నగా అంది. కారు ఆగగానే డోర్ తెరిచి బయటికి గెంతింది అమితా. ఇంజన్‌ను ఆపి దిగిన ఆదిత్యకు ఆమె నిట్టూర్పు వినిపించింది. ఆ వైపుకు వెళ్ళాడు. విగ్రహంలా నిలబడ్డ ఆమెనొకసారి, తలుపుకున్న తాళాన్నొకసారి మౌనంగా చూశాడు. మాధవన్ ఇంటికి రాలేదు అన్నది అరచేతి లోని అద్దమంత స్పష్టంగా కనిపించింది.
చిన్నగా పడుతున్న వర్షం. అక్కడొక్కటి, ఇక్కడొక్కటి కనిపించే ఒంటరి ఇళ్ళు. చిక్కగా ఉన్న చీకటి. అప్పుడప్పుడే జనవసతి ప్రారంభమైనట్టున్న ఆ కాలనీలోని దట్టమైన నల్లని రాత్రిలో వినిపిస్తున్న చప్పుళ్ళంటే కురుస్తున్న వర్షం యొక్క యాంత్రిక శబ్దం, కప్పల సమూహగానం.
వెక్కుతూ నిలుచున్న ఆమె వైపు జాలిగా చూశాడు ఆదిత్య. “శ్రీమతి మాధవన్” మెల్లగా పిలిచాడు. ఆమె వెక్కిళ్ళు ఎక్కువయ్యాయి. రెండడుగులు ముందుకు వేశాడు ఆదిత్య.
“మీ బాధ నాకర్థమవుతుంది. మీ భర్తను వెతకడానికి నేను సహాయపడగలను. ఈ సమయంలో మీరు నా కారుకు అడ్డంగా రావడం, మనమిద్ధరం ఇలా జతగా ఉండడం ఒక కాకతాళీయం.”
గబుక్కున తల ఎత్తి చూసింది అమితా. ఆమె కళ్ళలో కంగారు కనిపించింది.
మరో అడుగు ముందుకు వేశాడు ఆదిత్య. “నా పేరు ఆదిత్య. బెంగళూరు విశ్వవిద్యాలయంలో అధ్యాపకుణ్ణి. గూఢచార్యం నా వృత్తి కాదు. కానీ నాకు అందులో అనుభవం ఉంది.”
అమితా రెప్పలు పటపటా కొట్టుకున్నాయి. ఆదిత్య కొనసాగించాడు. “నా చెల్లెలు మైసూరులోనే ఉంటుంది. రెండు సంవత్సరాల క్రితం ఒక హత్య కేసులో వాళ్ళాయన ఇరుక్కున్నాడు. నేరస్థులు అతడి వైపు సందేహం వచ్చేట్టుగా సాక్ష్యాలను తిప్పేశారు. అతణ్ణి కాపాడడానికి, నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దడానికి నేను కొద్దిగా పరిశోధన చేయాల్సి వచ్చింది. అప్పట్నుండి తీరిక దొరికినప్పుడు, ఇక్కడి ఇన్‌స్పెక్టర్ ఉత్తప్పతో కలిసి కిడ్నాప్ కేసుల్లో తలదూరుస్తుంటాను.” ఆశ్చర్యంగా చూస్తున్న ఆమె వైపు చూసి కొనసాగించాడు. “అన్నట్టు ఉత్తప్ప ఇక్కడే ఉన్నాడు మైసూరులోని ఒక స్టేషన్‌లో. అతడి స్టేషన్ వ్యాప్తికే మీ ఏరియా వస్తుంది. అందుకే నా పని కూడా సులభం అవుతుంది.”
మౌనంగా అతడి ముఖాన్నే పరికించింది అమితా.
“మీ భర్త కనిపించక పోయిన విషయాన్ని ఇన్‌స్పెక్టర్ ఉత్తప్పకు తెలియబరచే బాధ్యత నాది. అలా చెయ్యడానికి ముందు నాకు ఒకట్రెండు వివరాలు కావాలి. మీకు అభ్యంతరం లేకపోతే ఇంట్లో కూర్చుని మాట్లాడుకుందామా?” గంభీరమైన గొంతుతో అన్నాడు ఆదిత్య.
మౌనంగా తాళం తెరిచి తలుపు తోసింది అమితా. కాళ్ళీడుస్తూ వెళ్లి సోఫాలో కూలబడింది. ఆమె వెనకే ఆదిత్య లోపలికి వచ్చి ఆమె ఎదుట కూర్చున్నాడు.
“ఇక సమయం వ్యర్థం కానీయకూడదు. నాకు వివరాలివ్వండి. మీ భర్త ఎక్కడ పనిచేస్తారు?”
“జి.ఆర్. కన్‌స్ట్రక్షన్‌లో చీఫ్ అకౌంటెట్.” తల వంచుకునే జవాబిచ్చింది అమితా.
“మీకు తెలియబరచకుండా ఆఫీస్ పనుల పైన ఆయన బయటికి వెళ్తారా?”
వేగంగా తలాడించింది అమితా లేదన్నట్టు.
“లేదు. ఆఫీసు పని మీద ఆయన బయటకు వెళ్ళరు. అలాగని కంపెని ఎం.డి. వసంత్ గారే నాతో అన్నారు”
“సరే. ఆయనకు మీ మీద ఏమన్నా అసంతృప్తి?” మెల్లిగా ప్రశ్న అడిగి ఆమె మొహం వైపు చూశాడు.
అమితా మాట్లాడలేదు. కుడికాలి బొటనవ్రేలితో నేలను తొక్కింది.
“విషయం ఏమున్నా నాతో చెప్పచ్చు మీరు. అది ఉత్తప్ప గారికి తప్ప ఇంకెవ్వరికీ చెప్పను” భరోసా ఇచ్చాడు ఆదిత్య.
“రెండు మూడు నెలలనుండి నన్ను పట్టించుకోవడం లేదు.” ఆమె గొంతు సన్నగా కంపించింది. తల దించుకునే ఉంది.
“అలాగా! దానికి కారణం?”
ఆమె నుండి జవాబు రాలేదు.
“మీ శ్రేయోభిలాషిగా అడుతున్నాను” ఆదిత్య మృదువుగా అన్నాడు.
అమితా మౌనాన్నే ఆశ్రయించింది. ఆదిత్య వేరొక రూటులో వచ్చాడు.
“అతడికి వేరే అమ్మాయితో ఏమైనా అఫైర్ ఉందా? అలా ఉండే అవకాశం ఉందా?”
అమితా ఒక్కసారిగా వెక్కింది. తటాలున మొహాన్ని అరచేతుల్లో దాచుకుంది. ఆదిత్య ప్రశ్నకు బదులు దొరికింది.
“వెల్! నాకర్థమవుతూంది లెండి. ఆమె ఆయన ఆఫీసమ్మాయా?”
చేతుల్లో మొహం మూసుకునే కాదన్నట్టు ఆమె తలాడించింది. వెక్కిళ్ళు ఎక్కువయ్యాయి.
ఒక నిమిషం తర్వాత మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు ఆదిత్య.
అమితా దుపట్టాతో కళ్ళు తుడుచుకుంది. తల ఎత్తింది.
“ఈ సంగతి నాకు తెలిసిందే ఇటీవల. అంతలోకే వారిద్దరి సంబంధం చాలా ముందుకెళ్ళింది. నాకు తెలియకుండా వాళ్ళిద్దరు రెండు మూడు సార్లు మైసూరు నుండి బయటికి వెళ్ళి జతగా గడిపారు. నాకు తెలిసిన వెంటనే ఈయనతో పొట్లాడాను, ఏడ్చాను. కానీ ఆయన నా మాటల్ని లెక్క చెయ్యలేదు. ఆ రోజునుండి మా మధ్య మాటల్లేవు” ఒకే గుక్కలో చెప్పేసి అలసిపోయినట్టుగా గట్టిగా ఊపిరి పీల్చింది.
“మాధవన్ తన ప్రేయసితో పాటు బయటికి వెళ్ళుంటారు. దాన్ని మీ నుండి దాచడంలో ఒక అర్థం ఉంది” ఆదిత్య తర్కించాడు. అంతలోనే ఇంకో ప్రశ్న అతడి ముందుకు వచ్చింది.
‘అలాగయితే ఆయన ఆరోగ్యం బాగోలేదు, స్నేహ బేకరి దగ్గర ఉన్నాడు అని అమితాకు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరు?’
అది మాధవన్‌దే ఉపాయమా? చిమ్మ చీకటి రాత్రిలో ఆ నిర్జన ప్రదేశానికి భార్యను రమ్మని, అక్కడ ఆమెను అంతమొందించే ప్లాన్ ఏమైనానా? అమితా వెనకాల ఉన్న ఆ రౌడీ, మాధవన్ ఏర్పరచిన కిరాయి రౌడీనా? ఈ మొత్తం సంఘటన, నచ్చని భార్యను అంతమొందించి ప్రేయసితో ఉండే ప్రయత్నమా? ఈ సమయంలో నేను అదే దారిలో వచ్చింది ఒక కాకతాళీయమా? దాన్నుండి అమితా బతికిపోయిందా?
కొలిమిలా మారిన తన తలను నొక్కి పట్టుకున్నాడు. అలాగే లేచి నుంచున్నాడు. ఒక్కో పదం నొక్కి చెపుతూ “ఇప్పుడు అర్ధరాత్రి దాటింది. మీరు మీవారి కోసం కాచుకోవడంలో అర్థం లేదు. అలాగని ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడమూ మంచిది కాదు. మీకు ఇప్పుడు రక్షణ అవసరం. ఈ ఊళ్ళో మీవాళ్లెవరైనా ఉంటే చెప్పండి. మిమ్మల్ని అక్కడ దింపుతాను. ఈ రాత్రి అక్కడ గడపండి.”
“వద్దు” దృఢంగా వచ్చింది బదులు. “ఈ ఊళ్ళో నాకెవరూ తెలిసిన వాళ్ళు లేరు. నేనిక్కడే ఉంటాను. ఈ ఇంట్లో నన్ను నేను బాగానే చూసుకోగలను. మీరూ చూపుతున్న శ్రద్ధకు థ్యాంక్స్. దయచేసి రేపు ఉదయాన్నే వచ్చి నన్ను మీ ఉత్తప్ప గారివద్దకు తీసుకెళ్ళండి.”
ఆమె వైపు ఆశ్చర్యంగా చూశాడు ఆదిత్య. ఏదో చెప్పడానికని వెళ్ళినవాడు మానుకుని బయలుదేరాడు. తలుపు వద్దకు వచ్చి “ఇంతకూ మీ భర్త ప్రేయసి పేరేమిటి?” అని ప్రశ్నించాడు.
“జమున” స్పష్టంగా చెప్పిందామె.
***
2
మాధవన్ కనిపించకుండా పోయిన సంఘటన గురించిన వివరణ ముగించి ముందున్న కాఫీ కప్ తీసుకున్నాడు ఆదిత్య. మౌనంగా విన్న ఇన్‌స్పెక్టర్ ఉత్తప్ప పెదవుల పైన మందహాసం తొణికిసలాడింది.
“ఈ మాధవన్ అనే మనిషికి నేను ఋణపడి ఉండాలి.”
“ఎందుకు?” ఆశ్చర్యంగా అడిగాడు ఆదిత్య.
“మైసూరుకు వచ్చినా నా మొహం చూడకుండా పారిపోయే ఆలోచన ఉండింది మీకు. ఈ శాల్తీ గాయబ్ అయ్యి మీరు స్వయంగా నా వద్దకు వచ్చేలా చేశాడు. ఈ ఉపకారానికి అతడికి కృతజ్ఞుడై ఉండాలిగా నేను?” పెదాలు సాగతీస్తూ నవ్వాడతను.
“ఇప్పుడేమో అతడికి కృతజ్ఞత గురించి మాట్లాడుతున్నారు. ఈ కేసులోని గందరగోళం వల్ల బుర్ర చెడిపోయి, రేప్పొద్దున్నకల్లా ఈ పాడు మనిషి ఎందుకైనా అదృశ్యమయ్యాడో అని మీరే శాపనార్థాలు పెడతారు. అది సరే. నాకు తెలిసిన విషయాలు మీ చెవిన వేశాను. మీరు ఆ అమితాను వీలైనంత త్వరగా కలిసి మాట్లాడండి. అలాగే మాధవన్ బాస్ తోనూ ఒకసారి మాట్లాడండి. అది చాలా ముఖ్యమైనది. మాధవన్ ప్రేయసి జమున గురించిన వివరాలను కూడా సేకరించండి. ఒకవేళ అతడితో పాటు ఆమె కూడా కనబడకుండా పోకుంటే అది మన.. కాదు, అమితా అదృష్టం. ఇప్పుడు నేను బెంగళూరుకు వెళ్తున్నాను. రేపు నాకు కాన్ఫరెన్స్ ఉంది. దాన్ని ముగించుకుని ఎల్లుండి మళ్ళీ మైసూరుకు వస్తాను. తరువాత ఒక వారం ఇక్కడే ఠికాణా. అప్పటిదాకా ఈ కేస్ ఇలాగే ఉంటే మీతో చేతులు కలుపుతాను. ఇప్పుడు నాకు సెలవిప్పించండి సార్!” అంటూ నాటకీయంగా చేతులు జోడించాను.
తల పట్టుకుని కూర్చున్నాడు ఇన్‌స్పెక్టర్ ఉత్తప్ప. తల కొలిమిలా కాలిపోతోంది. నిన్న ఉదయం అమితాతో మాట్లాడి వచ్చినప్పటి నుండి మాధవన్ గురించిన, తల తిరిగిపోయేలా కొన్ని వివరాలు బయటపడ్డాయి.
మాధవన్ మొన్న మధ్యాహ్నం నుండి కనబడడం లేదు. అతడెక్కడికి పోయాడు అని ఎవరికీ ఆచూకీ తెలియదు. జమునతో అతడి సంబంధం గురించిన ఎక్కువ వివరాలు కంపెనీలో దొరకలేదు. కానీ అశ్చర్యకరమైన విషయమేమిటంటే జమున కూడా మొన్న సాయంత్రం నుండి కనబడడం లేదు. ముంబైలో ఉన్న తన అన్నగారి ఇంటికి వెళ్తానని ఒక వారం సెలవు తీసుకుని వెళ్ళింది. సెలవు చీటీలో ఉన్న ఆ అన్నయ్య నంబర్‌కు ఎన్ని సార్లు ఫోన్ చేసినా కలవలేదు. చివరికి ముంబై పోలీసులకు ఫోన్ చేసి వివరాలు ఇచ్చి ఆమె అక్కడికి వచ్చిందా అని కనుక్కోమని చెప్పడం జరిగింది. ఇప్పటికి ఇది జరిగి పన్నెండు గంటలయ్యాయి. ముంబై నుండి ఏ విధమైన సమాచారమూ లేదు. ఇది కాకుండా మాధవన్ కనిపించడం లేదని లోకల్ పేపర్లలో ప్రకటన ఇవ్వడమూ జరిగింది. కానీ ఇంతవరకూ ఎవరినుండీ ఎలాంటి సమాచారమూ అందలేదు.
ఇంతకీ ఏం జరిగింది?
హెడ్డు సణ్ణయ్య అనుమతి కూడా అడక్కుండా లోపలికి వచ్చాడు.
“ఎవరో వచ్చారు సార్. మిమ్మల్ని చూడాలట.”
“సరే. పంపు” చెప్పి తలుపు వైపు చూశాడు ఇన్‌స్పెక్టర్ ఉత్తప్ప.
నిన్న కలిసిన జి.ఆర్. కన్‌స్ట్రక్షన్ ఎం.డి వసంత్, ఛీఫ్ ఇంజినియర్ శేషగిరి లోపలికి వచ్చారు. ఇద్దరి ముఖాలూ భూతదర్శనమైనట్టు పాలిపోయి ఉన్నాయి. “ఏమయ్యింది?” అని అడగడానికి మునుపే వసంత్ చెప్పసాగాడు.
“ప్రమాదం జరిగిపోయింది సార్. మాధవన్ కంపెనీ డబ్బులు కొట్టేశాడు.”
అధికారి చెవులు రిక్కించాడు.
“వివరంగా చెప్పండి”
“మా కంపెనీ అకౌంటు సిండికేట్ బ్యాంకులో ఉంది. మా కంపెనీకి దగ్గరే దాని బ్రాంచు. మాధవన్ రెండు నెలల క్రితం న్యాషనల్ ట్రస్ట్ బ్యాంకులో కంపెనీ పేరిట దొంగ అకౌంటు ఓపన్ చేశాడు. కంపెనీకి వచ్చిన కొన్ని చెక్కులను అందులో జమ చేశాడు. అది మాకు చెప్పనేలేదు. మొన్న శనివారం పరారీకి ముందు ఆ దొంగ అకౌంటును క్లోస్ చేసి అందులోని డబ్బునంతా తీసుకుని పారిపోయాడు”
“అలాగా! ఇది మీకు తెలిసిందెప్పుడు?”
“ఒక గంట క్రితం. న్యాషనల్ ట్రస్ట్ బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేసి మా అకౌంట్ ఎందుకు క్లోజ్ చేశారు, మా పైన నమ్మకం లేదా అని అడిగారు. ఆ బ్యాంకులో అకౌంట్ ఉన్నదని తెలిసిందే అప్పుడు.”
ఉత్తప్ప గడ్డం గోక్కున్నాడు. “ఆ బ్యాంకులో అకౌంట్ తెరిచేటప్పుడు కానీ, క్లోజ్ చేసేటప్పుడు కానీ, ఆ అకౌంటును ఆపరేట్ చేయడానికి కానీ, మీ బెంగళూరు హెడ్ ఆఫీసునుండి ఉత్తరువులు కావాలి కదా?”
“అవును. అలాంటి రెండు ఉత్తరువులను మాధవన్ బ్యాంకుకు ఇచ్చాడు. ఆ రెంటినీ మేము ఇప్పుడు చూసే వస్తున్నాము. అవి రెండూ దొంగ పత్రాలే. వాటిలోని మా ఎం.డి. సంతకాన్ని ఇతడు ఫోర్జరీ చేశాడు”
“అలాగా! ఈ విషయాన్ని మీ ఎం.డిగారికి తెలిపారా?”
“తెలిపాము. ఫోన్ చేసి చెప్పాము. ఆయనకూ షాక్”
“ఇదొక క్రిమినల్ కేస్. వెంటనే అక్కడి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ రిజిస్టర్ చేయించడం మంచిది”
“అది కూడా చేసేశాం సార్. ఇప్పుడు అక్కడినుండే వస్తున్నాము. అతడు పరారీలో ఉన్న కేసు మీ దగ్గర ఉన్నది కాబట్టి ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం మంచిది అని ఇక్కడికి పరుగెత్తుకుని వచ్చాం”
నోటు బుక్కులో చక చకా నోట్ చేసుకున్న అధికారి తరువాత తల ఎత్తి ప్రశ్నించాడు.
“కంపెనీ నుండి దొంగిలించిందెంత?”
“నలభై లక్షలు”
“నలభై లక్షలా?” ఆశ్చర్యంగా అడిగాడు ఉత్తప్ప.
వసంత్, శేషగిరి బయటికి వెళ్ళి రెండు నిమిషాలైనా కాలేదు. ఫోన్ మొత్తుకోసాగింది. రిసీవర్ ఎత్తి “హలో” అన్నాడు ఇన్‌స్పెక్టర్ ఉత్తప్ప.
“గుడ్ ఆఫ్టర్‌నూన్ సర్. నేను సతీశ్ కుమార్‌ని. బృందావన్‌లో ఉన్న హోటెల్ ప్రియా మేనేజర్‌ని.”
“వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ టు యు మిస్టర్ సతీశ్ కుమార్. ఏమి చెప్పదలచుకున్నారు?”
“ఉదయం పత్రికలో మాధవన్ అనే వ్యక్తి కనబడుట లేదు అని చూశాను. శనివారం మధ్యాహ్నం మాధవన్ అనే పేరుగల మనిషి తన భార్యతో పాటు మా హోటల్‌కు వచ్చాడు. తను చెన్నై నుండి వస్తున్నానని చెప్పాడు. రిజిస్టర్‌లో అక్కడిదే చిరునామా రాశాడు. ఇంకా చెప్పాలంటే వెనుకటి రోజే ఫోన్ చేసి తనకొక డీలక్స్ రూమ్ బుక్ చేసుకున్నాడు.”
“అలాగా! అతడెలా ఉన్నాడు?”
“మంచి పొడుగరి. దృఢకాయం. తెల్ల రంగు..” సతీశ్ కుమార్ మాటలను మధ్యలోనే కట్ చేసిన ఉత్తప్ప, విసుగ్గా అన్నాడు “ఓహ్! మనకు కావలసిన మాధవన్ కాడులే. మేము వెతుకుతున్న మాధవన్ కేవలం ఐదుంపావు అడుగుల ఎత్తు, సాధారణ బాడీ, చామన చాయ రంగుగల వ్యక్తి.”
“ఎస్. నాకది తెలుసు. మీరు చెప్పే మాధవన్‌ను పూర్తిగా పోలే వ్యక్తి సాయంత్రం ఆరు గంటలకు ఇక్కడికి వచ్చాడని మా రిసెప్షనిస్ట్ సుకన్య చెబుతోంది. పేపర్లో వచ్చిన మాధవన్ ఫోటోని ఆమె చూసింది. ఆ ఫోటోకు సాయంత్రం వచ్చిన వ్యక్తికి ఎలాంటి తేడా లేదని ఆమె ప్రమాణం చేసి చెబుతోంది.”
“అతడు తన పేరు ఏం చెప్పాడు?” చాలా కుతూహలంతో రిసీవర్‌ను చెవికి నొక్కి పట్టి అడిగాడు ఇన్‌స్పెక్టర్. హోటల్‌కు భార్యతో వచ్చిన మాధవన్ నకలీ అని, తరువాత వచ్చిన వాడు అసలు మాధవన్ ఉండచ్చా అనే ప్రశ్న మదిలో మెదిలింది.
“అతడు ఇక్కడ ఎవ్వరితోనూ మాట్లాడలేదు. వచ్చినవాడు సుకన్యతోనూ ఏమీ మాట్లాడకుండా మాధవన్, అతడి భార్య ఉన్న రూముకు వెళ్ళాడు.. అయితే.. అతడు మళ్ళీ తిరిగి వెళ్ళడం ఎవరూ చూడలేదు.”
“వాట్! ఏంటి మీరు చెప్పేది?”
“అవును. ఆ వ్యక్తి హోటల్ నుండి బయటికి వెళ్ళడం సుకన్య కానీ, ఏడు గంటల తరువాత డ్యూటీలో ఉన్న గణపతి కానీ, సాయంత్రమంతా గేట్ వద్దే ఉన్న గేట్ కీపర్ పొన్ను స్వామి కానీ చూడలేదు. ఇంకో కుతూహలకారి విషయం..”
“చెప్పండి” అధికారి ఉద్వేగం ఆపుకుంటూ అన్నాడు.
“ఇక్కడికి మధ్యాహ్నమే వచ్చిన మాధవన్, ఆయన భార్య రెండు రోజులకని రూమ్ బుక్ చేసుకున్నారు. కానీ రాత్రి ఎనిమిదిన్నర సమయానికి ఉన్నట్టుండి రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయారు.”
“ఎక్కడికి?”
“తమ పరిచయస్థుల ఇంటికి వెళ్తామన్నారట. ఒక లోకల్ అడ్రెస్ ఇచ్చారట. చెప్పనా?”
“చెప్పండి” అంటూ పెన్ తీసుకున్నాడు ఉత్తప్ప. సతీశ్ కుమార్ చెప్పిన అడ్రెస్‌ను రాసుకున్నాడు. ఒకసారి మెల్లగా దగ్గి ప్రశ్నించాడు “అతడు ఎలా ఉన్నాడట?”
“తలకు క్యాప్ ఉండిందట. కళ్ళకు కూలింగ్ గ్లాసెస్. కాబట్టి అతడి ముఖాన్ని సరిగ్గా గమనించలేక పోయాను అని సుకన్య చెప్తోంది.”
“అతడి భార్య ఎలా ఉండింది?”
“సుకన్యకు ఆమెను కూడా సరిగ్గా చూడడానికి కుదరలేదట. ఆమె రిసెప్షన్ వద్దకు రానే లేదట. రూమ్ అలాట్ అయ్యేదాకా ఆమె బయట ట్యాక్సీ లోనే కూర్చుందట. తరువాత తల పైన కొంగు కప్పుకుని తల వంచుకుని వడివడిగా మెట్లెక్కి వెళ్ళిపోయింది అని సుకన్య చెపుతోంది. ఏడు గంటలకు ఆమె డ్యూటీ అయిపోయింది. తరువాత రిసెప్షన్‌లో ఉన్న గణపతి కూడా ఆమెను సరిగ్గా చూడడానికి కుదరలేదు అంటున్నాడు. రాత్రి రూమ్ ఖాళీ చేసేటప్పుడు ఆయన మాత్రం రిసెప్షన్ వద్దకు వచ్చాడట. బిల్ పేమెంట్ జరుగుతుండగా ఆమె మెట్లు దిగి వచ్చి తల వంచుకుని నేరుగా ట్యాక్సీ ఎక్కి వెళ్ళిపోయింది అని గణపతి చెప్తున్నాడు”
“ఆమె పేరు రిజిస్టర్ లో ఉందా?”
“ఉంటుంది. ఒక్క నిమిషం సార్. చూసి చెప్తాను.”
ఉత్తప్ప రిసీవర్‌ను చెవిమి నొక్కి పట్టుకునే కాచుకున్నాడు. ఆత్రంగా పేజీలను తిప్పుతున్న శబ్దం వినిపించింది. అర నిమిషంలో సతీశ్ కుమార్ గొంతు వినిపించింది. “ఉంది సార్. ఆమె పేరు జమున సార్”
ఉత్తప్ప ఉలిక్కిపడ్దాడు. “మై గాడ్” అతడి గొంతునుండి వెలువడ్డ మాట అవతలి వాడికి వినిపించి ఉండాలి. “వాళ్ళున్న రూము ఇంకా ఖాళీగా ఉందా?”
“దాని గురించే చెపుదామనే అనుకున్నాను సార్. ఒక అరగంట క్రితం వరకూ ఖాళీగానే ఉండింది. కార్వార్ నుండి వచ్చిన ఒక ఫ్యామిలీకి ఇచ్చాను. వారేమో లోపలికి వెళ్ళిన ఐదు నిమిషాలకే బయటికి వచ్చి వేరే రూమిమ్మని అడుగుతున్నారు”
“ఎందుకు?”
“ఆ రూమ్ బాత్రూంలో రక్తపు మరకలున్నాయని చెపుతున్నారు. నేను వెళ్ళి చూశాను. వాళ్ళు చెప్పింది నిజం. బాత్రూం నేల పైన, గోడల పైన చాలా చోట్ల లేత ఎరుపు రంగు మరకలున్నాయి. అవి రక్తపు మరకలే అని మా సుకన్య ఖచ్చితంగా చెప్తోంది.”
“ఆ రూముకు ఎవ్వరినీ వెళ్ళనీయవద్దు. నేను వెంటనే బయలుదేరి వస్తాను.” దాదాపు అరచినంత పని చేసి, రిసీవర్ పడేసి రూమ్ బయటికి వడివడి అడుగులతో బయటపడ్డాడు ఉత్తప్ప.
అతడు హోటల్ ప్రియ చేరుకున్నప్పుడు మ్యానేజర్ సతీశ్ కుమార్ తలుపులోనే కనిపించాడు. అతడితో రెండు నిమిషాలు మాట్లాడాడు. సన్నటి దేహం, చురుకు కళ్ళున్న సుకన్య మేనేజర్ చెప్పిన విషయాలనే పునరుచ్చరించి, మరో ఆసక్తిదాయకమైన విషయాన్ని బయటపెట్టింది. నకలి మాధవన్ తను తన కళ్ళద్దాలు తేలేదని చెప్పి, హోటల్ రిజిస్టర్‌లో తన వివరాలను రాయలేదు. ఆయన చెప్పిన వివరాలను సుకన్యయే నింపింది. అతడు మాధవన్ అని గజిబిజిగా సంతకం చేశాడంతే. తన చేతివ్రాత రిజిస్టర్‌లో కనిపించకూడదని ఆ నాటకం ఆడి ఉంటాడని ఉత్తప్ప చురుకు మెదడు లెక్క వేసింది.
గేట్ కీపర్ పొన్నుస్వామి అమూల్యమైన సమాచారం అందించాడు.
“మధ్యాహ్నం వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు వాళ చేతిలో ఉన్నది ఒక సూట్ కేస్, ఒక ఏర్ బ్యాగ్. సుమారు మూడు గంటలప్పుడు అతడు మాత్రం బయటకు వెళ్ళాడు. ఒక గంట తరువాత అతడు తిరిగి వచ్చినప్పుడు అతడి చేతిలో రెండు భారీ సూట్ కేస్‌లు తీసుకొచ్చాడు. రూం బాయ్స్ చేతికి ఇవ్వకుండా తనే రెండింటినీ మోస్తూ సునాయసంగా మెట్లెక్కి పోయింది చూస్తే వాటిలో ఏం లేదు అని గ్యారంటీగా చెప్పొచ్చు” అంటూ సన్నగా నవ్వాడు పొన్నుస్వామి.
“రూమ్ ఖాళీ చేస్తున్నప్పుడు కూడా ఆ సూట్ కేస్‌లను తనే మోసుకెళ్ళాడా?” అడిగాడు ఉత్తప్ప.
“లేదు. అప్పుడు మాత్రం రూమ్ బాయ్స్ ని పిలిచాడు. అవి చాలా బరువుగా ఉన్నాయి అని శ్రీకంఠ చెప్తున్నాడు” అక్కడే చేతులు కట్టుకుని నిలుచున్న ఒక సమవస్త్రధారి వైపు చూపాడు పొన్నుస్వామి’
అధికారి దృష్టి తన వైపు తిరగ్గానే రెండడుగులు ముందుకు వచ్చాడు శ్రీకంఠ. “ఔను సారూ! అవి రెండూ చాలా బరువుగా ఉన్నాయి సార్” మెల్లగా అన్నాడు.
అరక్షణం ఏదో ఆలోచనలో నిమగ్నమైన అధికారి తల ఎత్తి గంభీరంగా “సరే. రూము చూపించండి” అన్నాడు.
ఇరవై-పదిహేను అడుగుల విశాలమైన గది అది. మధ్యలో జంట మంచాలు, పరుపులు. ఒక వైపు సోఫా, టీపాయ్‌లు. వాటెదురుగ్గా టి.వి. తలుపుకు నేరుగా మూసిన కప్ బోర్డ్, డ్రెస్సింగ్ టేబల్.
నిదానంగా బాత్రూం వైపు నడిచాడు ఉత్తప్ప. అక్కడ అప్పుడే లైటు వెలుగుతోంది.
“లైటు నేనే సార్ వేసింది” సతీశ్ కుమార్ సంజాయిషీ ఇచ్చాడు. అతడి మాట వైపు లక్ష్యం పెట్టకుండా బాత్రూంలోకి అడుగు పెట్టాడు.
మొదట అసహజంగా ఏమీ కనిపించలేదు. సూక్ష్మంగా గమనించినప్పుడు వాష్ బేసిన్ కుడి వైపు గోడ పైన రుపాయి నాణ్యమంత వెడల్పు లేత ఎరుపు రంగు మరక కనిపించింది. అది రక్తపు మరకే అని ఉత్తప్ప అనుభవం కనిపెట్టింది. అది కనబడగానే తెల్ల టైల్స్ పైన నేలమీద, గోడల పైన అక్కడక్కడ చిన్న, పెద్ద మరకలు ఒకదాని వెనుక ఒకటిగా కనిపించసాగాయి. అన్ని చోట్ల పడిన రక్తపు మరకలను కడిగి తుడిచి వేసే ప్రయత్నం జరిగిందని అర్థం చేసుకోవడానికి ఉత్తప్పకు ఎక్కువ సమయం పట్టలేదు. వెనక్కి తిరిగి “నకలీ మాధవన్, అతడి భార్య రూము ఖాళీ చేయగానే ఇక్కడ క్లీన్ చేసిందెవరు?” గట్టిగా అడిగాడు.
“అది వెంకట్ సార్. తన కళ్ళకు ఆ మరకలు కనబడలేదని చాముండమ్మవారి ప్రమాణంగా చెబుతున్నాడు”
“బేకూఫ్ నా కొడుకు” అసహనంగా గొణిగాడు ఉత్తప్ప. “తన్ని లాక్కురండి వాణ్ణి” ఆజ్ఞాపించాడు.
భోరుమని ఏడుస్తున్న, నలభై దాటిన బట్టతల వెంకట్‌ను ఇద్దరు రూమ్ బాయ్స్ ఒక్కొక్క రెక్క పట్టుకుని లాక్కుని వచ్చి ఉత్తప్ప ముందుంచారు. అతడి దయనీయ పరిస్థితి చూసిన వెంటనే నెత్తికెక్కిన పైత్యం దిగింది ఉత్తప్పకు. మెల్లగా “ఏ వూరయ్యా నీది?” అడిగాడు.
“కొళ్ళేగాల సార్” ఏడుస్తూనే బదులిచ్చాడు వెంకట్.
“బాత్రూంలోని రక్తాన్ని ఎందుకురా కడిగేశావు?” అకస్మాత్తుగా బిగ్గరగా వినిపించిన అధికారి గొంతుకు వెంకట్ బెదిరిపోయాడు. దబుక్కున కింద కూర్చుని ఉత్తప్ప కాళ్ళు పట్టుకున్నాడు “మీ పాదాల సాక్షిగా నాకేం తెలీదు సార్. నేను ఉత్తినే చిమ్మేసి, బాత్రూంకు ఒకట్రెండు బకెట్ల నీళ్ళు పోసి, బెడ్షీటు, దిండు కవర్లు మార్చి ఎల్లిపోయాను సార్. నేనే రక్తాన్నీ చూడలేదు సార్. నా మాట నమ్మండి సార్. నన్నేం చేయద్దు సార్. మీ బానిసను సార్” ఉత్తప్ప కాళ్ళను ఇంకా గట్టిగా పట్టుకుని పెద్ద గొంతుతో ఏడవసాగాడు వెంకట్.
వాడి దయనీయ స్థితి చూసి ఉత్తప్పకు జాలి కలిగింది. అతడు అబద్ధం చెప్పడం లేదు అనిపించింది.
“లేరా పైకి” రెక్క పట్టుకుని లేపాడు. “బాత్రూంలో అన్ని రక్తపు మరకలు నీకు కనిపించలేదారా?”
“లేదు సార్. అమ్మవారి తోడు నేను చూడ్లేదు సార్ అన్ని రక్తపు మరకలు. నా కళ్ళు సరిగ్గా కనిపించవు సార్. రెండూ కళ్ళలోనూ పూలు పడ్డాయి సార్.” భోరున ఏడవసాగాడు. మళ్ళీ ఉత్తప్ప కాళ్ళు పట్టుకోవడానికి వంగాడు.
“థత్” అంటూ రెండడుగులు వెనక్కి వేసిన ఉత్తప్ప రూమ్ బాయ్స్ వైపు తిరిగి “లాక్కెళ్ళండ్రా వీణ్ణి” అన్నాడు.
(సశేషం)