పున్నము నాటి పురుషుడు

0
4

[శ్రీ నల్ల భూమయ్య రచించిన ‘పున్నము నాటి పురుషుడు’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

‘చెంద్రక్క’కు ముందుగాల ఇద్దరు ఆడిపోరగండ్లు, ఆకిర్న ఒగ మొగ పోరడు. పోరగండ్లు సిన్నగున్నప్పుడే చెంద్రక్క మొగడు ‘పొయ్యిండు’. అమాస నాడు ఆడిది, పున్నము నాడు మొగోడు పుడుతె యిగ గాళ్ళకు మించిన నసీబుమంతులు వుండరని చెంద్రక్క గూడ యిన్నది. ఆడి పోరగండ్లు అమాస నాడు పుట్టలేదు గని, మొగపోరడు మట్టుకు పున్నం నాడే పుట్టిండు. గది కార్తీక పున్నమో లేకుంటే కామును పున్నమో గని, మొత్తానికైతే ఏదో పున్నం నాడే పుట్టిండు. పున్నం నాడు పురుషుడు పుట్టుడు, తండ్రినంపుడు ఒక్కపారే జరిగినై. తను భూమ్మీద పడి, తండ్రిని భూమిలోపలికి అంపిన గా పాడు పోరనికి మంచిపేరు పెట్టద్దని, ఆనికి ‘మొండోడు’ అని పేరువెట్టిండ్రు.

మొగడు పొయ్యినందుకు – మొగ పోరడున్నడు – పున్నం నాడు పుట్టవల్సిన పురుషుడు. ఇగ, తనకు నిశ్చింతే గద. మొగడు పొయ్యేనాటికి యిల్లు, గింతంత పెరడి, బేడు వుండె. గీ పెరట్ల పండింది ఉడుకు నీళ్ళకు సన్నీళ్ళవారం (వలె). కైకిలి జేసి – కలువ పొయ్యి, కొయ్య వొయ్యి, యిరువ వొయ్యి బతుకుడు. ఇద్దరాడి పోరగండ్ల పెండ్లిండ్లు జేసింది. ఆడి పోరగండ్లు యిద్దరు గూడ సూసుటానికి మంచిగుంటరు. గదీం తోటి, కాలేర్లల్ల, కంపిన్లల్ల జీతాలు జేసే మొగండ్లు దొరికిండ్రు ఆడి పోరగండ్లకు. సిన్న బిడ్డె మొగడైతే సీన్మల హీరో వారమే వుంటడు.. ఆడి పోరగండ్లు మా మంచిగనే బతుకుతండ్రు.

ఇగ తనకేం సింత? పున్నం నాడు పుట్టిన మొగపోరడాయె! పేరు కస్తడు, పేరు దెస్తడు. గా పేరు వజనుకు యిగ తన మిడుసుంపులే వోర్సుకోవాలె, గని, పెద్దపేరు మూటనే తెచ్చి మీదేస్తడు! అట్టిగనేనా, మరి, పున్నం నాడు పుట్టిన పురుషుడంటె! తను మొగడు లేని ముండరాలైనా గూడ, ముందు ముందు కాలం మొగండ్లున్న ఆడోళ్ళందరి కన్నా గూడ తనే మస్తుగ సుకపడ్తది – గిప్పుడు ఎంత కట్టపడితే ఏంటిది. మగని కాలమందు మగువ కష్టించిన, సుతుల కాలమునందు సుఖముజెందు అన్నరు. గని, మొగడు లేని తను ఎంతెంత కష్టపడుతదో, గిప్పుడు – గంతగంత సుకపడ్తది ఆనెంకకు. సుతుని కాలంల తను జూడవొయ్యే సుకాల గుట్టల ముందట గీ కష్టాల గొట్టికాయలు ఏపాటి. సతికి సుతుల వలన సౌఖ్యంబు గలుగదా? పున్నం నాటి పురుషుడాయె.. ముందట ముందట, కన్నతల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసేరోజు.. గిప్పుడు మక్కగటుక, జొన్న గటుక తింటన్నదల్ల గప్పటికి సన్నబియ్యం బువ్వ తింటది. మొగండ్లన్న ఆడోళ్ళందరు గూడ దొడ్డుబియ్యం తినగల్గుతె తను ‘రాజునాలలు’ తింటది. గిప్పుడు అనుప పప్పు, సిక్కుడు పప్పు తింటే గప్పటికి కందిపప్పే తింటది. గిప్పుడు సేతినేత దొడ్డు సీరెలు కట్టేది గప్పటికి గప్పుడు మిషినిమీది సన్న సీరెలు కడ్తది. గిప్పుడు, వైసుల సేతి కుట్టు రైకలు తొడుగేటిది, గప్పటికి, ముసలితనంల మిషిని కుట్టురైకలు తొడుగుతది. పున్నంనాడు పురుషున్ని కన్నందుకు తనను, పుట్టినందుకు కొడుకును లోకమంతగూడ మెచ్చుకుంటాంటే, ఆగో, బతుకంటె, తనది బతుకు. లోకం కండ్లన్ని తనమీదనే. గప్పుడు సలిదినం గూడ ‘జిట్టి’ తీసుకునుడే వుంటది – సీపురు పుల్లలతోటో, మిరుపకాయల తోటో జిట్టి తీసుకునుడే వుంటది! తనకు కొడుకు పుట్టి, తండ్రిని సాగనంపినందుకు అందరుగూడ అన్ని శెపిచ్చిండ్రు. ‘లంజకొడుకని పోరడు! పోరడు పుట్టిండు, అయ్యని సాగనంపిండు. గీడేం పోరడవ్వ! పోరన్ని పొయ్యిల గుచ్చ!’ అని తిట్టిండ్రు గని, ముందుముందు కాలంల, బతికుంటే, గా తిట్టిన నోటితోటే ఆన్ని మెచ్చుకోవల్సి అస్తది ఆళ్ళందరికి గూడ.

కని, మొండోడు పెరుగుతాంటే పేరుకు తగ్గట్టుగనే అందరి పోరగండ్ల మీద ఆడు మొండోడే అయ్యిండు. ఆడు వున్న వూర్లె, ఆని అక్కల వూర్లల్ల, ఆ సుట్టూత వూర్లల్ల, ఆడు కొసకొమ్మల్లకు ఎక్కి దునుకని సెట్టులేదు, దిగి, ఈదని బాయి లేదు! ఆని తోటోళ్ళకు తినవోతె కూడు దొరుకక, కట్టవోతె బట్టదొరుకక, సదువుకుందామంటె ఎల్లక, కాయకష్టం జేస్తుంటే, మొండోన్ని మట్టుకు అవ్వ బళ్ళె ఏసింది సదువుకునుటానికి. తను గటుక కూడు తినుకుంట పోరనికి బియ్యం బువ్వ అండి పెడ్తది. పావురం! మొండోని సదువుడు మట్టుకు గాపాటే. అంతటి పూర్తిగనే! బడికి పోతాన్నావురా అంటె, పోతన్న అన్నట్టుగనే, ఎగురుడు, మత్తుగ దూం జేసుడు – అందరి పిల్లగండ్లకన్న ఎక్కో. పుట్టలెక్కుడు, గుట్టలెక్కుడు, పాటలు పాడుడు – సెట్టు లెక్కగలవా, నరహరి పుట్టలెక్కగలవా, సెట్టిలెక్కియా సిటారు కొమ్మల చిగురు కోయగలవా అనుకుంట సిగురుగోసుడు! ఆడు ఆడని ఆటే లేదు సిర్రెగోనెలు, సీకులు, గోలీలు, పతంగులు, బౌడ్‍బందర్, చోర్ పోలీస్, కబడి. పనిలేని మొండోనికి జంటకు ఏ పోరడు దొరుకక పోతే, ఒక్కడే కబడి ఆడుతడు! ఈని కోర్టులకెళ్ళి ఎవ్వడులేని ‘ఆని’ కోర్టులకు గూత వట్టుకుంట పోతడు! అక్కడవున్న ‘ఆకాశరామన్న’ మీదికి కాళ్ళు లేపుతంటడు, సేతులాడిస్తాంటడు, ఆ కొసనుంచి ఈ కొసకు, ఈ కొసనుంచి ఆ కొసకు ఉరుకుతాంటడు గూతవట్టక! గూత ఆగిపోతాంటే తన కోర్టుకు మలిగస్తడు. ఇప్పుడు ఆ కోర్టు తనది, అవుతల కోర్టు ఆకాశరామన్నది ఆ కోర్టు నుంచి ఈ కోర్టుకు గూతవట్టుకుంట అస్తడు. నోరు, కాళ్ళు, సేతుల తీపుల తీరేదనుక ఆడుతడు. ‘ఎల్లమ్మలోల్ల’ ఎంట, ’కాటిపాపలోల్ల’ ఎంట తిరుగుడు. ‘పిరీల’ కాలంల గుండాలెగురుతడు, పులి ఏశాలు కడ్తడు. జాజిరి ఆడ్తడు. జాత్రలు తిరుగుతడు. ఈసుగామ మల్లన్న గుడిల – ఆలేరు బయ్యన్న పక్కపొంటి..

ఒగనాడు ‘గారవోడు’ యింక ఆట షురు వెట్టకమునుపే మొండోడు అక్కడ ఆజిరైండు ఆటనడుమ గారడోనికి ఒక మొగపోరడు అవుసురమైండు పాతాళ భైరవి సీన్మల ఎస్వీరంగరావుకు ‘యింటిగాని’ అవుసురం అచ్చినట్లుగ! మాయలపక్కీరోని ‘దుర్బినిల’ ‘యింటిగాడు’ కన్పిచ్చినట్టుగ గారడోనికి మొండోడు కన్పించ్చిండు! గారడోడు ‘ఆలేసి’ సూత్తె, మొండోని నాడి దొరికింది. తన పనికి మొండోడే తగ్గ మొగోడు అనిపిచ్చింది గారడోనికి.

“ఇంతమందిల, ఏ మొగోడన్న గూడ, మొగతనమున్న మొగోడే అయితె, గుండె బలం వున్న మొగోడు ఎవడన్న వుంటె ముందుకు రాండ్రి, సూద్దాం!” అన్నడు గారవోడు ఎవ్వరు గూడ బయిపడి ముందుకు రాకుంటే, మొండోడు ఒక్కడు మట్టుకు ముందు కచ్చిండు “సూపియ్యి! ఏం జూపిస్తవో! నేను గూడ జూస్త” అన్నడు మొండోడు.

“గింత మందిల, సుతారి మొగోనివి, సూరత్తపు మొగోనివి, నువ్వొక్కనివే నన్నమాట! సూపియ్యిమంటవా యిగ న పురుషత్తనాన్ని గూడ, మరి?” అడిగిండు గారవోడు.

“సూపియ్యు, ఏం జూపిస్తవో నేను గూడ జూస్త” అన్నడు మొండోడు.

గారడోడు బాజవట్టిండు, నాగసరం మాదిండు, డోలు మోగుతాంటే నాగసరం పట్టుకుంట ఒకసారి గుండ్రంగ నిల్సున్నమంది ముందటినుంచి గోలుగ తిరిగిండు.

“ఇగ జూస్కో నా సుతారితనాన్ని… గిప్పుడు జూస్కో యిగ నీ ‘…….!’ గిప్పుడు జెప్పు యిగ! వున్నయ్యా నీ ‘……….’ ఎప్పటోలిగనే?” అడిగిండు గారవోడు.

మొండోడు ఆని ‘…….’ పునికి సూసుకున్నడు! గని, ఆని ‘………….’ తలుగలేదు! అంటే మొండోని ‘………..’ లెవ్వు. మాయమైనై! గప్పుడు మొండోడు యిగ ఏడ్సుడందుకున్నడు! మొత్తుకునుడు వెట్టిండు. కాళ్ళు తన్నుకుంట ఎగురవట్టిండు.

“నా ‘……….’ నాకిచ్చేయి… నా ‘………….’ నాకు వాపసుజెయ్యి” అనవట్టిండు మొండోడు.

“ఏంటిది! నీ ‘…………’ లెవ్వా? మాయమైనయా? నువ్వు ఏడుత్తన్నవా ‘గవి’ మాయమైనందుకు? సెబ్బాస్ ఏ మొగోడన్న వున్నడా అని నేను షరారతు జేస్తె, వున్న నువ్వు తొడ జరిస్తివిగదా! గంతటి మొగోనివి, మరి గిప్పుడు ఆడిదాని వారం ఏడుస్తన్నవు! వారెవా!” అని మంది మొకం తిరిగి, సుట్టూర జూసుకుంట.

“సూసిండ్రా గిక్కడున్న నా తండ్రులు, అన్నలు, తమ్ముళ్ళు, సెళ్ళెండ్రు, అంతగూడ సూసిండ్రు గద, ఈ గారడోని మైమ! నేను సెప్పుకునుడు గాదు, మీ మంది నడుమ నుంచి అచ్చివోడు జెప్పుతండు! ఉన్న ‘………..’ మాయమైనయని! ఉన్న ‘……….’ మాయంజేసిన మైమలోన్ని! గంతనే అనుకుంటన్నరా ఏంటిది? ఉన్నదాన్ని మైమలోన్ని! గంతనే అనుకుంటన్నరా ఏంటిది? ఉన్నదాన్ని మాయం జేసిన మైమలోన్నే అనుకుంటున్నరు గిట్టనా? ఊహుఁ మాయమైన దాన్ని మళ్ళ, ఎప్పటోలిగె రప్పించగల మైమలోన్ని! సూడుండ్లి గా మైమను గూడ మీ కండ్ల తోటే.” అనుకుంట నాగస్వరాన్ని పట్టుకుంటా ఒకపారి గుండ్రంగ తోగచ్చి

“తమ్మీ, గిప్పుడు జూసుకోరా నీ ‘……’ వున్నయా లెవ్వా, ఇగగిప్పుడు జెప్పురా గిక్కడున్న గీ మందికి నీ ‘……’ వున్నయా, లెవ్వా” అడిగిండు గారవోడు మొండోన్ని.

మొండోడు ఆని ‘……’ పుణికి సూసుకున్నడు. ‘గవి’ ఆనికి తలిగినై! ఎప్పటోలిగనే! మొండోడు నవ్వు మొకం పెట్టిండు. గారవోడు అడిగిండు.

“తమ్మీ! మొదుగాల మొదుగాల నువద్దిగనే నీకు ‘………..’ వుండెనారా?” అని

“వుండే!” మొండోడు.

“గా తరువాత ఏమైనయిరా?” గారడోడు.

“మాయమైనై!” మొండోడు.

“మళ్ళ గిప్పుడేమైనయిరా?” గారవోడు.

“మళ్ళ ఎప్పటోలిగనే అచ్చినై” మొండోడు.

“సెబ్బాస్ బిడ్డ! వున్నాటిని వూడగొట్టి మళ్ళ ఎప్పటోలిగనే అతుక వెట్టిననన్న మాట! మాయం జేసిన ‘……’ మళ్ళ ఎప్పటోలిగనే తేకుంటవుంటే నీ అయ్య, అవ్వలు అచ్చి నా పాణాలు తీసెటోళ్ళే గదరా! నా పాణాల్ని మీ సేతులల్ల పెట్టి బతుకుతున్నోన్ని! ఇగ మీరే జూడాలె నాదిక్కు – అయ్యలార, నా తండ్రులార, అన్న, తమ్ముళ్లార!” అన్నడు. మంది సప్పట్లు సర్సిండ్రు. పైసలు కుర్సిండ్రు.

ఇగ, గానాటి సంది మొండోడు గారడోని ‘దరి’ దాటి సొచ్చుక పొయ్యెటోడుగాదు. ఎవ్వరో సెప్పంగ యిన్నడు – గారడోని ‘కనుకట్టు’ ‘దరి’ ఆవల్నుంచి జూస్తే ఆని కనుకట్టు అంతగూడ బట్టబయలుగ సూడచ్చు అని. గందుకని, మొండోడు దూరంగ సెట్టిమీద ఒరిగి కాలుమీద కాలేసుకోని జూత్తుంటడు ‘కిట్టమూర్తి’ వారం!

సిర్రెగోనె ఆటల, ‘దండు’ పుస్కొపొయ్యి, అచ్చి తలుగుతె ఆని కనుబొమ్మ పొట్టలు పలుగేటియి. ఎత్తు మీదినుంచి ‘గిల్లి’ పడి తలుకాయ సీద్రమై నెత్తురు కారేటది. ఒడ్లమీది నుంచి దునికితె కాళ్ళ గుత్తులు బెణికేటియి. తల్లికి ఆనితోటి రోజుగూడ ఏదన్న గండమే. బుడమ కాయ చేదు ముదిమిన తీపగు అని సముదాయిచ్చుకుంటది – ఎంతన్నా గూడ పున్నం నాడు పుట్టినోడయె. ‘కిట్టమూర్తి’ వారం గిప్పుడు దూం జేసినా గూడ ఆనెంక బుద్దిమంతుడు గాడా అనుకునేటిది.

సదువు అబ్బలేదు. బడి బందు జేసిండు. గింతంత ఓనుమాలు, ఒంట్లు అస్తయిగా వట్టి, తల్లి ఆళ్ళ కాళ్ళు, ఈళ్ల కాళ్ళు పట్టుకోని జంగ్లాతు ఆఫీసుల ఆనికి నౌకరి పెట్టిచ్చింది.

మొండోనికి నౌకరి దొరికినంక – సూటు బూటు కుట్టించి ‘సుక్క’ గూడ మరిగినాడు.. గా నడుమ ‘తాగుడు నిషిద్ధం’ వుండె. మంది మా బాగనే వుండె. గని మళ్ళేమచ్చె! మూలకు వడ్డదాన్ని సర్కారోడు మళ్ళ ముంగ టేసిండు.. లఫంగు, లుఛ్ఛా లీడర్లు. ‘ప్రజల్ని మేసే ప్రభుత్వాలు? లుఛ్ఛా లీడర్ల పునాదులు, మంది బతుకుల సమాదుల మీద.. మందికి ‘నీరు’ యియ్యరుగని, ‘బీరు’ వాగులు పారిస్తంటరు! గూండాలంతా జేరి ‘గూండా’ చట్టం జేసిరి!

గదంతోటి మొండోని తాగుడు గూడ ఎదిగింది. మొండోని ఏషం జూసి మేనమామ పిల్లనియ్యనన్నడు.. తల్లి, ఏరే పిల్లని జూసి మొండోనికి పెండ్లి జేసింది. పిల్ల మంచిగుంటది. ఏ సీమ దానవో, ఎగిరెగిరి వచ్చావు. అలసివుంటావో మనసు చెదిరి వుంటావో..

గని, మొండోని తాగుడు ఎదుగుతోనే పొయ్యింది.

మొండోనికి పిల్లగండ్లు పుట్టిండ్రు, ఎదుగుతండ్రు గవీటికి పక్కపొంటే మొండోని తాగుడుగూడ.. మొండోడు సురకు నిచ్చినట్లు సుమతులకీయడు. సంపాదనంత తాగుడుకు సాలది.. లొట్టతాగి యతాడు లోకుల – గాదు పెండ్లాం, పిల్లగండ్లను, సంసారాన్ని సెరిసిండు.. ఒకరి నోరు గొట్టి నొకరు భక్షింతురు.. పెండ్లాం, పిల్లగండ్ల బతుకుల్ని గొట్టిమొండోడు బతుకవట్టిండు. తాగుడుతోటి నౌకరికి పోతే పోకటి, లేకుంటే లేదు.. పెండ్లాం పిల్లగండ్లకు పొద్దుంటే మాపుండదు, మాపుంటే రేపుండది. గదిగూడ మొండోని తల్లి, పెండ్లాం పనులు జేసుకుంటు యిల్లు ఎల్లదీయాలె.

తాగి అచ్చినంక యింట్ల పెండ్లాం, పిల్లగండ్లతోటి రోజుగూడ రవుసే. తల్లి, పెండ్లాం, పిల్లగండ్లు కలతలకు లొంగి, కష్టముల క్రుంగి.. కళలు మాసి కాంతివాసి గ్రహణం పాలైనారు.. మనుగడ చీకటి మాయమైపోయె.. పెండ్లాం బతుకు, పెయ్యి, యిరువైలో అరువై..

“సిన్నపోరి నవ్వ బట్టె సిల్లిగవ్వ లేకపాయె – పెద్దోడు కచ్చి పెద్దపోరి గుండెలమీద కుంపటాయె.. మొగ పోరగండ్లు అంటె ఎట్లనన్న బతుకుతరు, గని, ఆడిపోరగండ్లు ఎట్లరా” అని తల్లి పోరువెడ్తె –

“నీ యవ్వ! గదానికి నన్నేం జెయ్యమంటవే! నేనేం జేసుడే! నేనేం జెయ్యాల్నే? గదీనికి నువ్వు లెవ్వా, నీ కోడలు ముండ లేదా? ఏమన్న జెయిండ్రి, ఎట్లనన్న జెయ్యిండ్రి మేలెంచు పెద్దలు లేరా? నాదే భారం ఏల! నోరు తెరుస్తె గా ఒక్కటే. ఆడి పోరగండ్లు, ఆడి పోరగండ్లు! ఔను మళ్ళీ ఆడి పోరగండ్లే. అయితే ఏం జెయ్యాలె? వయసొచ్చి వంపులన్ని పొంగుతుంటె, వయసేమొ మనసు తోటి పోరుతుంటె వైసు ఎక్కడ ఆగనియ్యకుంటె, బరువైతె, మొయ్యలేకుంట వుంటె గప్పుడు, గాళ్ళే ఎవన్నన్న పట్టుకోని పోతరు! పోనియ్యి. గంతనే గని, గదీనికి నేనేం జేయగల్గుత!” అంటడు మొండోడు.

పెండ్లాం తల్లిగారి ఆసరతోటి, అట్లజేసి, యిట్లజేసి ఆడిపోరగండ్ల పెండ్లిండ్లు జేసింది.. మొండోడు – పొట్టు దినెడి, లండి బువ్వలు పెట్టునా అన్నట్టుగ.. ఉన్నదంతగూడ అమ్ముకుంట తాగుడు..

తల్లి, పెండ్లాం, పిల్లగండ్ల బతుకులు – ఆశలు తీరని ఆవేశములో, ఆవేదనలో, చీకటిమూగిన ఏకాంతములో కన్న కలలు అన్ని గూడ కల్లలాయెనే. ఆశ నిరాశ పుల్లా పుడక ముక్కున కరచి, గూడును కట్టితివోయి.. వానకు తడిసి నీ బిగిరెక్కలు ఎండకు ఎండినవోయి.. పున్నం నాడు పుట్టిన పురుషుడు తల్లి, పెండ్లాం, పిల్లగండ్ల బతుకుల్ల అమాస రోజులు నింపిండు.. అదియె మరుభూమిగా నీవు మార్చవులే.. తాగి, తాగి, వ్యాధులు, బాధలు ముసిరేవేళ మంచం పట్టి – సిక్కి, సిక్కి సచ్చిపోయిండు – నడుమంతురానే లోకాలకే నీవు దూరం – లోకాల పెండ్లాం పిల్లగండ్లకే భారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here