జ్ఞాపకాల పందిరి-179

18
3

[“కొన్ని అనుభవాలు, కొందరి జీవితాలకు జ్ఞాన మార్గాలు కావచ్చు. జీవనశైలిని సరిదిద్దుకునే వినూత్న పోకడలు కావచ్చు. అందుకే, అందరి అనుభవాల జ్ఞాపకాలూ, అందరికి అవసరమే..!!” అంటూ తమ జ్ఞాపకాల పందిరి క్రింద విహరింపజేస్తున్నారు డా. కె. ఎల్. వి. ప్రసాద్.]

పెరిగే వయస్సు – తరిగే ఆరోగ్యం..!!

[dropcap]పు[/dropcap]ట్టిన ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు గిట్టవలసిందే! అది అందరికీ తెలిసిందే. కానీ ప్రతి మనిషి ‘ఆరోగ్యమే మహాభాగ్యము’ అనే నానుడి ఆసరాగా, బ్రతికినంత కాలం ఆరోగ్యంగా ఉండడానికి, తద్వారా ఎక్కువ కాలం బ్రతకడానికి విశ్వప్రయత్నం చేస్తాడు. కొందరైతే బ్రతికినంత కాలం ఇష్టమొచ్చిన రీతిలో బ్రతకాలనే కోర్కెతో, భవిష్యత్తు కోసం అసలు ఆలోచించకుండా, ఆనందంగా తమకు తోచిన రీతిలో బ్రతికేస్తుంటారు.

అలాంటి వాళ్లకు ఆరోగ్యం/అనారోగ్యం అనే సమస్యలతో పని లేదు. తమ ఆనందాన్ని ఆరోగ్యం కోసం ఎట్టి పరిస్థితి లోనూ త్యాగం చేయరు. సమస్య అంతా బ్రతికినన్నీ రోజులు ఆరోగ్యంగా వుండాలనుకునే వాళ్లతోనే! వీళ్ళు ఆరోగ్యానికి సంబంధించి ప్రతి విషయంలోనూ జాగ్రత్తలు తీసుకుంటారు. మధుమేహం రక్తపోటు, విషయంలో ఆహారపు జాగ్రత్తలు తీసుకుంటారు, వ్యాయామం (నడక వగైరా) విషయంలో శ్రద్దగా వుంటారు. కనీసం సంవత్సరానికొక మారు, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకుంటారు. ఆసుపత్రి బారిన పడినప్పుడు, వ్యయప్రయాసలు తట్టుకునే క్రమంలో ‘మెడికల్ ఇన్సూరెన్సు’ చేయించుకుంటున్నారు. ప్రభుత్వ పక్షాన కూడా ఇటువంటి సదుపాయాలు అందుబాటులో వున్నాయి. అవకాశాలు వున్నా నిర్లక్ష్య ధోరణిలో, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకొని వారు కొందరైతే, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా, వయసును బట్టి, శరీర పరిస్థితిని బట్టి కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కొనక తప్పడం లేదు.

అలా చాలామంది రెండు రకాల జబ్బులతో కలిసి జీవించవలసి వస్తున్నది. అంటే జీవితాంతం మందులు వాడవలసి వస్తున్నది. అంత మాత్రమే కాదు ఆ రెండు వ్యాధుల వల్ల సంక్రమించే ఇతర సమస్యలను కూడా ఎదుర్కొనక తప్పడం లేదు. ఆ వ్యాధులు ఏమిటంటే 1) మధుమేహ వ్యాధి 2) అధిక రక్తపోటు.

ఈ రెంటి వల్ల వచ్చే దుష్ప్రభావాలు (సైడ్ ఎఫెక్ట్స్) మనిషిని అతలాకుతలం చేస్తున్నాయి. అలా ఈ రెండు సమస్యలు చాలాకాలంగా నాతో కలిసి జీవిస్తున్నాయి. అంతేకాదు, నా జీవన శైలిని సవాలు చేస్తున్నాయి. ఎప్పుడో, ఇరవై ఏళ్ళ క్రితం డయాబెటిస్ నా జీవితంలో ప్రవేశించింది. దానికి ప్రముఖ వైద్యులు డా. చంద్ర శేఖర్ (ప్రస్తుత వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి, సూపరింటెండెంట్) నాకు వైద్యం ప్రారంభించారు. తర్వాత కంటి సమస్యలు ప్రారంభమయ్యాయి. వాటికి మిత్రులు డా. గిరిధర్ రెడ్డి (ప్రస్తుత వరంగల్ రీజినల్ కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్), డా. మల్లికా గోయల్ (అపోలో ఆసుపత్రి) నా కళ్ళని కాపాడుతూ వచ్చారు. డా. ప్రవీణ్ (హన్మకొండ) ఎడమకంటి శుక్లానికి శస్త్ర చికిత్స కూడా చేశారు. ఇది ఇలా ఉంటే పదిహేనేళ్ల క్రితం అనుకుంటాను, కుడిచేయి ఇబ్బంది పెట్టడం జరిగింది. భుజం కీలు నొప్పిపెట్టడం, చేయి పైకి ఎత్తలేకపోవడం వంటి సమస్యలు తలెత్తాయి. అప్పుడు కరీంనగర్ జిల్లా ప్రధాన ఆసుపత్రిలో సివిల్ సర్జన్ (డెంటల్) గా పని చేస్తున్నాను. ఆ ఆసుపత్రిలో ‘ఫిజియో థెరపీ’ విభాగం ఉండడం మూలాన, అక్కడ డా. స్వాతి నేతృత్వంలో ఫిజియో థెరపీ చికిత్స జరిగి కొద్దీ వారాల్లోనే కోలుకోవడం జరిగింది. అప్పటి వరకూ ఫిజియో థెరపీ ప్రభావం/విలువ తెలిసి రాలేదు. అప్పటి నుండీ ఈ చికిత్స మీద మంచి గురి ఏర్పడింది.

రచయిత మొదటి ఫిజియో థెరపిష్ట్ డా. స్వాతి (కరీంనగర్)

కాలం దాని పద్ధతి ప్రకారం నడిచిపోతూనే వుంది. మేమిద్దరం పదవీ విరమణ చెయ్యడం, 2022లో సికింద్రాబాద్ రావడం (పూర్తిగా షిఫ్టింగ్ కాదు) జరిగిపోయాయి. అమ్మాయి హైదరాబాద్‌కు బదిలీ కావడం, మనవడు చిన్నవాడు కావడం వంటి అంశాలు, మేము సికింద్రాబాద్‌లో ఉండడానికి ప్రధాన కారణాలు. ఈలోగా అంటే గత ఆరు నెలలుగా, నేను వున్నానంటూ మళ్ళీ కుడి భుజం నొప్పి మొదలయింది. చేతి కదలికలతో మార్పు వచ్చింది. రోజు రోజుకు సమస్య దాని తడాఖా చూపించడం మొదలు పెట్టింది. డయాబెటాలజిస్ట్‌కు చెబితే చిన్న వ్యాయామం చెప్పారు. కానీ దాని వల్ల పూర్తి ఫలితం రాబట్టలేకపోయాను. ఇక తప్పని పరిస్థితిలో ఫిజియో థెరఫిస్ట్ వేట మొదలు పెట్టింది అమ్మాయి. అది కూడా మా నివాస స్థలానికి దగ్గరగా వుండాలని, అంత మాత్రమే కాకుండా ఇంటికి వచ్చి చికిత్స చేసే అనుకూలత గురించి వెదికి ఫలితం సాధించింది అమ్మాయి.

డా. నేహా ప్రసన్న (ఫిజియో థెరఫిస్ట్)

మళ్ళీ ఫిజియో థెరపీ చికిత్స ప్రారంభం అయింది. మంచి ఫిజియో వైద్యురాలి పరిచయం జరిగింది. చికిత్స సంతృప్తికరంగానే సాగుతున్నది.

క్లినిక్ లో డా. నేహా ప్రసన్న

నేను బాధపడకూడదు, నా వాళ్ళను ఇబ్బంది పెట్టకూడదన్నది నా సిద్ధాంతం. నాకు సాధ్యమైనంత వరకూ నా సిద్ధాంతానికి కట్టుబడి వుండడానికే ప్రయత్నం చేస్తున్నాను. ఇది నా చేతిలో వున్నంత వరకూ నేను చేయగలను, కుటుంబ సభ్యులకు సహకరించగలను, తర్వాతిది దైవ నిర్ణయమే అనుకోవాలి.

రచయితకు చికిత్స చేస్తున్న డా. నేహా ప్రసన్న

మానవ శరీరం ఒక క్లిష్టతరమైన యంత్రం లాంటిది. యంత్రం పనికాలం పెరిగేకొద్దీ దాని భాగాలు అరిగిపోయి, పనిచేయడానికి మొరాయించినట్టే మన శరీర భాగాల పరిస్థితి కూడా అంతే! అప్రమత్తంగా ఉంటే కొంత ఎక్కువకాలం పనిచేస్తాయి శరీర భాగాలు. లేకుంటే అప్రమత్తం చేయకుండనే, శరీర భాగాలు పూర్తిగా పనిచేయడం మానేస్తాయి. అందుచేత ఫిజియో థెరపీని నమ్ముకుంటే, నిస్సందేహంగా మన జీవితకాలం పెరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే, ఫిజియో థెరపీ వల్ల అన్ని అనారోగ్య సమస్యలకూ పరిష్కారం దొరుకుతుందని చెప్పడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు గానీ, కొన్నింటికి మాత్రం ఫిజియోథెరపీ తప్పనిసరి. ఇంతకూ నా కొత్త ఫిజియో థెరపీ వైద్యురాలు పేరు చెప్పలేదు కదూ.. ఆ అమ్మాయి పేరు డా. నేహా ప్రసన్న. మంచి సౌమ్యురాలు, మంచి అనుభవం సంపాదించిన నిపుణురాలు. అందువల్ల ఆమె చికిత్స మీద నాకు మంచి నమ్మకం వుంది. వృద్ధాప్యంలో ఇలాంటి సమస్యలు తప్పవేమో! సమస్యలు లేనివాళ్లు నిజంగా అదృష్టవంతులే మరి! అందుకే కదా మరి ‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అన్నారు!!

(మళ్ళీ కలుద్దాం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here